Monday, December 3, 2007

యద్భావం తద్భవతి !!!!

ప్రపంచంలో జరిగే అన్యాయాలన్నింటిపై దృష్టి సారిస్తున్నావంటే ఖచ్చితంగా నువ్వు
అసంతృప్తివాదిగానే మిగిలిపోతావు. ఇది అక్షరసత్యం! మనసు నిండా ప్రశాంతత
ఉంటే ఎంత బాగుంటుందో ఊహించుకోండి. కానీ మనస్సు నిశ్చలంగా ఉన్నా ఏ
మూల నుండో భయం దోబూచులాడుతూనే ఉంటుంది. నడిరోడ్డులో జంట హత్య,
ప్రియురాలిని నరికి చంపిన మరో మనోహర్ అంటూ ప్రాసలు కట్టి మరీ పత్రికలూ,
మనసు పొరల్లో బలంగా ముద్రించుకుపోయేలా క్లోజప్‍లో రక్తపు ప్రవాహాన్ని
చిత్రీకరించే టెలివిజన్ చానెళ్ళు ఉన్నంతవరకూ మన మస్తిష్కాలు ప్రశాంతంగా
ఉండలేవు. హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, కుంభకోణాలు, రాజకీయాలు,
కుటుంబ తగాదాలు, అభిప్రాయబేధాలు…. ఇవేగా నేటి ప్రసార మాధ్యమాలకు
ముడి సరుకు! ఇలా పత్రికలు, టెలివిజన్ చానెళ్ళు తమ పేజీలను నింఫుకోవడానికి,
టైమ్ స్లాట్లని ఎలాగోలా నెట్టుకురావడానికి ఎక్కడ లేని చెత్తనంతా మన బుర్రల్లో
నింఫుతుంటే.. ప్రతీ దానికీ అదేదో మన సమస్యగా ఆవేశం తెచ్చుకునే వాళ్ళమే
మనమంతా ! తెల్లగా ప్రకాశించే మనసు పొరలపై ఎరుపు, నలుపు రంగులను
ఒలికిపోసి ప్రశాంతతను చిన్నాభిన్నం చేసుకోవడం మన స్వయంకృతం కాదా? ఈ
రోజు ఎవరిని కదిలించినా .. "చూడండి సార్! వాడికి సిగ్గు ఉందా, ఆ పని
చేశాడు, ఏమ్ రాజకీయాలండి పనికిమాలిన రాజకీయాలు, మా ప్రక్కింటి వాడు
ఉన్నాడు చూశారూ … వాడు ప్రపంచంలో పెద్ద వేస్ట్" అంటూ నిరంతర అసంతృప్తి
మొహాల్లో దోబూచులాడుతూనే ఉంటుంది. మనకు ఎక్కడా, ఎవరితోనూ సఖ్యత
ఉండదు. ఎందుకంటే మనం ప్రతీ దాన్ని అసంతృప్తి నుండి చూస్తున్నాం. మన
మనసుల్లో నెగెటివ్ భావాలు బలీయంగా స్థిరనివాసం ఏర్పరుచుకున్నాయి.
’తాను’ సరిచేయడానికి వీలుపడని సమస్యల్లో మనం తలదూర్చినప్పుడు మనస్సు
చంచలమౌతుంది. కారణం, సమస్యని పరిష్కరించాలని మనసు ఆరాటపడుతుంది.
కానీ సమస్య మాత్రం తన ఆధీనంలొ ఉండదు, దానితో ఏమీ పాలుపోక అస్థిమితంగా,
అసంతృప్తితో మనసు ఊగిసలాట సాగిస్తుంది. మన పరిధిలో లేని, మనవి కాని,
మనం స్వయంగా పరిష్కరించలేని అనేక సమస్యలనిమనసుల్లో మోస్తున్నాం. సమస్య
పరిష్కరించబడితేనే మనస్సు ఊరత చెందుతుంది. కానీ మనం నెత్తికెత్తుకునే ఏ
సమస్యా మనది కాదే… మన ఒక్కరితోనే పరిష్కారం లభించదే! మరి మనస్సు
ఎప్పటికి ఊరట చెందాలి. మనమెప్పుడు ప్రశాంతంగా ఉండాలి? నీ పనేదో నువ్వు
ఆనందంగా చేసుకుపోతూ ప్రక్క దిక్కులకు చూడకుండా మనసుకు కళ్ళెం వేయగలిగితేనే
ఎలాంటి తలనొప్పులు మనసులో పేరుకుపోవు. మనసు ఎల్లప్పుడూ నిశ్చలంగా ఉంటుంది.

మీ నల్లమోతు శ్రీధర్

1 వ్యాఖ్యలు:

vijju

మీరు చెప్పేది అక్షరాల నిజమండి... అసలు వాళ్ళె సమాజం బ్రష్టు పట్టింది అని అంటునె... ఆ బ్రష్టుకి ఇంక కొచెం Add చెస్తున్నరు.... ఆ నేరాలు ఘొరాలు... వుడల మర్రి.... లాంటి కార్యక్రమాలతొ

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008