Monday, December 24, 2007

మోహం మటుమాయమైతేనే స్థితప్రజ్ఞత

జీవితంలో ఎన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించినా మన మూలాలు మాత్రం భూమ్మీదే ఉండాలి. సాధించే ప్రతీ విజయం అహాన్ని పెంచుతుంటే ఆ అహమే కొన్నాళ్ళకు మనల్ని కబళించివేస్తుంది. ప్రయత్నం మాత్రమేమనం చేయాలి... విజయమొచ్చినా, వైఫల్యమెదురైనా దాని తాలూకు ఆనవాళ్ళు మాత్రం మనల్ని కదిలించకూడదు. దీనినే స్థితప్రజ్ఞత అంటారని భగవద్గీత చదివే ప్రతీ ఒక్కరికి స్పురిస్తుంది. ఆ స్థితప్రజ్ఞత సాధించాలని అందరూ ఆశపడుతుంటారు. కానీ లాభమేముంది.. 'నేను అప్పుడలా చేశాను.. అదే పని నాకు ఇస్తేనా... నాకైతే అదేమీ ఇష్టముండదు ' అంటూ మనం మాట్లాడే ప్రతీ మాటలోనూ "నేను" అనే అహం తొణికిసలాడుతూ ఉంటే... సాధించిన చిన్న విజయాన్నయినా 'అది నేను సాధించాను తెలుసా' అన్నట్లు మనకు ఎదుటివారు ఎంతో గౌరవాన్ని ఇవ్వాలని ఆశించే విధంగా మన ప్రవర్తన ఉన్నంతకాలం స్థితప్రజ్ఞత ఎక్కడినుండి వస్తుంది? ప్రతీ ధర్మాన్నీ, ప్రతీ పనినీ మనం చేయాలి... కానీ ఆయా పనులు మనం చేయబట్టే సక్రమంగా పూర్తయ్యాయని,,ఇంకొకరైతే వైఫల్యం చెందేవారని స్వోత్కర్ష చేయడం మనం వ్యక్తిత్వం కోల్పోయేలా చేస్తుంది. మనం సాధించిన విజయాలు సమాజం గుర్తించాలన్న తాపత్రయంతో ఎంత గొంతెత్తుకుని చెప్పుకున్నా... మొహమాటానికి మాత్రమే సమాజం, మన గొప్పలను విన్నట్టు నటిస్తుందనీ తెలుసుకునేసరికి గొంతు మూగబోతుంది. అందుకే విజ్ఞత కలిగిన వారెప్పుడూ తమ గురించి తాము ఎక్కువగా మాట్లాడరు. మన గురించి మనం ఎంత ఎక్కువగా మాట్లాడతామో .. అంతగా మనపై మోహం, అహం పెరుగుతుంది. మన మాటలను ఎదుటివారు తప్పక వినాలి, తప్పక ఆమోదించాలి అన్నంత తారాస్థాయికి అది చేరుతుంది. మన మాటలను వినేవారు ఎవరూ లేకపోతే మనం బ్రతకలేమన్నంత అధోఃస్థితికి దిగజారడం జరుగుతుంది. అందుకే... మన ఆలోచనా విధానంలోనే మనం చేసే ప్రతీ పని, ఫలితం మనకు చెందినది కాదు అన్నట్లుగా మార్పిడి చేసుకుంటూ పోతే వాటి గురించి ఎవరికీ గోడు వెల్లబోసుకోవాలన్న ఆలోచన కలగదు. ఫలితపు భారం లేనప్పుడు స్థితప్రజ్ఞత దానికదే వస్తుంది.

నల్లమోతు శ్రీధర్

1 వ్యాఖ్యలు:

సత్యసాయి కొవ్వలి Satyasai

మోహం క్షయమవడమే మోక్షం.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008