Sunday 20 January 2008

ఆహా (ర) పద్యాలు....

కాదేదీ కవితకనర్హం అన్నట్టు మన కవులు కూరగాయలు, వంటకాలమీద కూడా అవలీలగా పద్యాలల్లేసారు. కొన్ని తమాషా పాటలు, పద్యాలు చూద్దాం....



"వెల్లుల్లి బెట్టి పొగిచిన

పుల్లని గోంగూర రుచిని పొగడగ వశమా?


మొల్లముగ నూనె వేసుకు

కొల్లగ గువ్వలచెన్నా !!"




తానేమీ తక్కువ అంటూ సుబ్బారావు కవిగారు ఉల్లిపాయ దండకమే రాశారు.



"ఓ యుల్లిపాయా! నమో యుల్లిపాయా!


నినుం బూజగావింతు నీ వాసనల్లేక


నే కూరయుం గూడ నేదో మరో మట్టి


దిన్నట్టుగా దోచు.. మా కాంక్షలందీర్చవే


పూర్వకాలంబులో రీతిగా కూరలన్నింటికిన్


కొత్త టేస్టుల్ ప్రసాదించి మా జిహ్వకుం దృప్తి చేయంగదమ్మా!


నమస్తే నమస్తే నమస్తే నమః"



ఓ కొంటె కవి



"కాచీ కాచీ ములక్కాయా, కాయనే పొట్టి కాకరీ


కాయనాం, వంగపింజనాం కూరానాం గుజ్జు పచ్చడి !!"


అంటు దొరికిన కూరగాయల్ని పచ్చడి చేసేశాడు.



ఇక తిరుపతి కవులు మాత్రం తక్కువ తిన్నారా


పచ్చిమిరపకాయ మీదా పద్యం రాసి దణ్ణం పెట్టేసారు.



"ఎద్దాని సంబంధ మెలిమి గల్గిన మాత్ర


కూరలెల్లను మంచి గుణము గనునా


కొత్తిమిరిని నూరుకొని తిన్న నెయ్యది


కంచె డన్నము తినగలగ జేయు


ఎద్దాని శిశుజాల మెరుగక చేబట్టి


కనులు నల్పిగ మంట గలుగ జేయు


ఎద్ది తా క్రమముగా నెదిగి పంపిన మీద


జోటి కెమ్మోవితో సాటి యగునా


నూరి దేనిని పుల్లనై మీరు మెంతి


పెరుగుతో గూర్ప స్వర్గము నెరుగజేయు


నరులకెల్లను నా పచ్చి మిరపకాయ


మహిత భక్తిను నేను నమస్కరింతు !!"

2 వ్యాఖ్యలు:

Anonymous

కవులంతా శాకాహారుల్లా వున్నారు! చికెన్ కర్రీ, మటన్ ఫ్రై ల మీద కవితలల్ల లేదు!

జాన్‌హైడ్ కనుమూరి

బాగుంది మీ అభిరుచి శోదన

అభినందనలు

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008