Friday, February 22, 2008

గుంటూరు శేషేంద్రశర్మ - సాహిత్య విశ్లేషణ


ఒక అందమైన పోయెం అంటే
దానికి ఒక గుండె ఉండాలి
అది కన్నీళ్ళు కార్చాలి
క్రోధాగ్నులు పుక్కిలించాలి…

ఆధునిక తెలుగు సాహిత్యంలో నూతన ఒరవడిని సృష్టించిన కవి గుంటూరు శేషేంద్ర శర్మ. ఆధునిక కవిత్వానికి ఒక గొప్ప సౌందర్యాత్మకత్వాన్ని కల్పించి,అటు సంప్రదాయాన్ని, ఇటు ప్రగతి శీలతనీ, అటు ప్రాచీన భారతీయ అలంకార శాస్త్రాన్నీ, ఇటు ఆధునిక కాలంలోని మార్క్సిజాన్ని కలగలిపి ఒక నూతన అపురూప సాహిత్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి ఒక మహత్ప్రయత్నాన్ని చేసిన కవి శేషేంద్రశర్మ. యాభైకి పైగా కవితలు పండించి రాసులుగా పోసినా ఆయనకు తీరని దాహమే. షోడశి వాల్మీకి రామయణంలోని సుందర కాండకు వినూత్న తాంత్రిక భాష్యం కూర్చారు. హర్షుని నైషధీయ చరితకు తాంత్రిక వ్యాఖ్యానం రాసారు. ఆయన జర్మనీ ఇండోలాజికల్ రిసెర్చ్ యూనివర్సిటీ ఆహ్వానం మీద వెళ్ళి "కాళిదాసు మేఘదూతానికి, వాల్మీకి రామాయణానికి ఉన్న సంబంధం" అనే సిద్ధాంత వ్యాసం సమర్పించారు. కాళిదాసు అకాడమీ వారి ఆహ్వానం పై "ఇద్దరు ఋషులు - ఒక కవి" అనే శీర్షికతో వాల్మీకి, వ్యాస, కాళిదాసుల కవిత్వానుబంధాల మీద పరిశోధన వ్యాసం సమర్పించారు. నాదేశం - నా ప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, ఆధునిక మహాభారతం, సముద్రం నా పేరు, శేష జ్యోత్స్న, ఋతుఘోష, కాలరేఖ, కామోత్సవ్, ప్రేమలేఖలు, నా రాష్ట్రం- ఇవి ఆయన రచనలు కొన్నిమాత్రమే..


శేషేంద్ర పుట్టింది నాగరాజుపాడులో. పెరిగిన ఊరు తోటపల్లి,గూడూరు. తండ్రి గుంటూరు సుబ్రహ్మణ్యశాస్త్రిగారు, తల్లి అమ్మాయమ్మ. ఇద్దరూ చదువుకున్నవారే. ఎమ్.బి.బి.యెస్ చదవాలనుకుని బి.ఎ. చేసి లా చదువుతుండగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చి మునిసిపల్ కమీషనర్‍గా పని చేసాడు. జర్నలిజం మీద ఉన్న మక్కువతో లా చదువుతుండగానే తాపి ధర్మారావుగారి వద్ద కూడా పని చేసాడు. తొలిసారిగా అచ్చయిన రచన ఒక పాట విశాలాంధ్రలో ముద్రించబడింది.

"ఈ ప్రపంచం ఎక్కడున్నా సరే!
ధ్రువములకు మధ్య వలె దూరమైనా సరే!
మన బాధలూ ఒక్కటే,
ఎప్పుడూ మన గాధలూ ఒక్కటే…"

శేషేంద్రశర్మలో ఉన్న ఒక మంచి లక్షణం వినమ్రత. చిన్నవాళ్లైనా, పెద్దవాళ్ళైనా ఎంతో మర్యాదగా, హుందాగా మాట్లాడి, వారిని ప్రోత్సహించి, అభినందించేవాడు. తనకంటే ముందున్న కవులను, తనకంటే జ్ఞాన సంపన్నులను గౌరవిస్తాడు ఆయన. వాళ్లు ఏ మార్గానికి చెందినవారైనా సరే. ఆయన ప్రాచ్యసాహిత్యాన్ని బాగా మధించినవాడు. భారతీయ అలంకారశాస్త్రానికున్న పరిమితులన్నీ క్షుణ్ణంగా అధ్యయనం చేసిన పండిత లక్షణం శేషేంద్రలో ఉంది. సంస్కృత భాషా, సాహిత్య పరిజ్ఞానం తో బాటు పాశ్చాత్య సాహిత్యాన్ని, ఫ్రెంచి కవిత్వం మొదలు రకరకాల దేశ దేశాల కవిత్వాన్ని ఆయన లోతుల్లోకి వెళ్ళి పరిశీలించాడు. అనేక భాషల్లొ మాట్లాడగలిగిన ప్రజ్ఞావిశేషం కూడా ఆయనకుంది. పాశ్చాత్య అలంకార లేదా విమర్శ గ్రంధాలకు సంబంధించి గ్రీకు విషాదాంత నాటకాలు దగ్గరనుండి రష్యన్ మార్క్సిస్టు భావజాలంతో నిండిన చాలా పుస్తకాలు చదివి అపారమైన జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. వాల్మీకిని, ఉపనిషత్తుల్ని, కాళిదాసుని, గ్రీకు నాటకాల్ని, అరవిందుడిని క్షుణ్ణంగా పరిశీలించిన "కాలరేఖ" వ్యాసాలు అందుకు సాక్ష్యం. అలాగే కవిసేన మేనిఫెస్టోలో ఇచ్చిన ఉదాహరణలు అలవోకగా ఇచ్చాడో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

ఇక కవిత్వంలో అందమైన ఆదర్శాలు..

ఏమని రాశేవు
నిన్ను గురించి ఓ శేషన్
నీకు నిద్ర అంటే
రాత్రి శయ్యలో చేసే సాహస యాత్ర
నీకు కవిత అంటే
క్రూరజీవన రాస్తాల్లో ప్రవేశించే పాత్ర
నీ రాత్రులు
అక్షరాల్లో పోసే ఘోష
ప్రజానీకాల అభివ్యక్తి హీనభాష
ఈ దేశపు మృత్తికలో చల్లావు నీ హృదయాల్ని
నీ రక్తనాళాలు తడుపుతున్నాయి కాగితాల తీరాల్ని
ఈ దేశం నీకిచ్చిన గాయం
నీకు మాత్రం తృణప్రాయం (ఆధునిక మహాభారతము)

ఆయన కవిత్వంలో ఏ చిత్రం(image) తీసుకున్నాఆశ్చర్యం కలిగిస్తుంది. "మహానగర కళేబరం బలుస్తోంది. మానవ పదార్థం మేశి" అంటాడు. పలకా పుస్తకాలు మోస్తున్న బలలు శిలువలు మోస్తున్న బాలక్రీస్తుల్లా కనిపిస్తారు ఆయనకు. ఒక ఆధ్యాత్మికమైన చిత్రాన్ని (spiritual image) తీసుకువచ్చి మామూలు వాస్తవిక జీవితంలోని విషయానికి అన్వయించి దాని ద్వారా గొప్ప భావాన్ని వ్యక్తీకరిస్తారు. ఒక రూపకం తీసుకొని దానిలోని మామూలు భావాన్ని తొలగించి, ప్రత్యేక భావనను దానిలో ప్రవేశ పెడతాడు శేషేంద్ర. ఉదా."సూర్యుడు సముద్రాల మీద వంగి నీళ్ళు తాగే గుర్రం" అనడంలో ఆయన ఊహాశక్తిని గమనించవచ్చు.

అంతేగాక శేషేంద్ర కవిత్వంలో ప్రజాస్వామిక భావజాలాన్ని చూడవచ్చు.సాయుధ పోరాటాన్ని సమర్ధించిన భావాలు కూడా ’ఆధునిక మహాభారతం’లో కనబడతాయి.

"అడవిలో నాకోసం మరణించిన
ఆ వీరుడికి
ఎవడు కట్టగలడు ఎత్తయిన సమాధి
నా గుండె వాడి మీద వేసిన గోపురం
నా అశ్రువులే వాడిమీద రాలుతున్న పూలు."

ఇలా ప్రాణత్యాగం చేస్తున్న వీరుల గురించి గానం చేసాడు.ఆయన రచనలలో "మాట చేసే మాయాజాలం" కొత్తగా కవిత్వం రాసేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మొట్టమొదటిసారి తెలుగు కవిత్వాన్ని చదవడం మొదలుపెట్టినవాడు ఈయన కవిత్వాన్ని చదివినట్లయితే మోహపరవశుడౌతాడు, ఉద్వేగపరవశుడౌతాడు, ఆవేశభరితుడౌతాడు.ఆయనే అన్నట్టు అక్కడ ’కవిత్వం ఒక మెస్మరిజం’. శేషేంద్ర ఎన్నెన్నో కొత్త కొత్త మాటలు (రస్తా,గొరిల్లా, మజాక్ లాంటి మాటలు) సంస్కృత పదాలు, దేశదేశాల భాషల్లోని పదబంధాలను, శబ్ద భావ చిత్రాలను, తెలుగు కవిత్వంలోకి తెచ్చాడు. అయితే వస్తువు - రూపం విరుద్ధమైన విషయాలే ఐనా ఒకటి లేకుండా మరొకటి ఉండదనేది ప్రాధమిక సూత్రం. ఒకదాన్ని మరొకటి చక్కగా ధీటుగా పోషించినప్పుడే అది ఉత్తమ కవిత్వమౌతుంది. కవితా వస్తువు గొప్పదైనంత మాత్రాన ఉత్తమ కవిత అవడానికి వీలు లేదు. కవిత్వంలో ఒక అధ్బుతమైన భావన(expression) ఉండడం వేరు, ఆచరణలొ దాని పద్ధతి వేరు. కనుకనే శేషేంద్ర విప్లవ కవిత్వం చదివినపుడు ఊగిపోతాం. కాని ఆచరణలో సాగిపోలేం.

"నేను జేబుల్లో కోకిలల్ని వేసుకురాలేదు
పిడికిళ్ళలొ బాంబులు బిగించుకుని వచ్చాను" (గొరిల్లా)

తెలంగాణా సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడు నల్లగొండ కేంద్రంగా రాసిన పాట

"వరద వచ్చిందోయి వరద వచ్చింది !
గగన ఘంటాపదం కదలి వచ్చింది !
నిషధాచలం దాటి తుహినా చలం దాటి !
వసుధా తలం మీద బుసబుసలు విసురుతూ !
భంగ సంఘాలతో పాదమెట్టింది !
పాత కోటలు తాకి పగలగొట్టింది !
కొండ గోగుల కోన కుసుమించినా రీతి !
చిగురెండ వెల్లువలు చిందులాడిన రీతి !
నల్లగొండ మీద నాట్యమాడింది !
ఆంధ్రదేశాకాశమావరించింది !
వరద వచ్చిందోయి వరద వచ్చింది…"

కవిగా శేషేంద్ర ఎప్పుడూ పీడిత వర్గం వైపే నిలుచున్నాడు. ’ఋతుఘోష’ వంటి ప్రకృతి వర్ణన కవిత్వంలో కూడా

" చలిపులి వోలె దారుల
పచారులు చేయుచుండ
ఊరికావల పెనుమర్రి క్రింద
నెలవంకై దీపముగా పరున్న
పసిపాపలెవ్వరికి తప్పుదలంచిరి?
కాలమే హాలాహలమైపోయి ఆ
శిశువుల ఆకలితొ చలితొ నశింపగన్ !
ఎచట నుంటివి, నీవనలుంటివా
ప్రజా శాపములన్ భరించుటకు
సాధ్యముగాదని పాత పెత్తనంబు
ఈపై సాగబోదని ఎటేని పరారైనావా,
బాధలం బాపగలేవు నీవు శిలవా
కలవా సెలవీయుమో ప్రభూ ! : అంటూ సాగుతుంది.


ప్రాచీన కవిత్వానికి అలంకారికులు లేదా ఒకనాటి పండిత లేదా ఉన్నత వర్గాలకు చెందిన కవిత్వ పరిశీలకులు ఏ లక్ష్యమైతే నిర్దేశించారొ ఆ లక్ష్యం మనం శేషేంద్ర కవిత్వం చదివినప్పుడు నెరవేరుతుంది. అతని కవిత్వం చదివినా, వచనం చదివినా గొప్ప ఆహ్లాదం, ఆనందం కలుగుతుంది.తొలిదశలో ఆయన రాసిన పద్య కవిత చదివినట్లైతే ఆయనకున్న సంప్రదాయ విజ్ఞానం, భాషాపరిజ్ఞానం తేలిగ్గా తెలుసుకోవచ్చు. ఆ పద్యాల్లో కూడా ఆధునిక భావాలు చక్కగా చెప్పాడు. ప్రజాస్వామ్య సమాజానికి ఉపయోగపడే రకరకాల భావనలు చెప్పాడు.

"శ్రమియించే శతకోటి మానవుల కాశాజ్యోతి లేదా? విష
క్రిమి బాధామయ కాళరాత్రికి ఉషశ్రీరేఖ లేదా…"


ఆధునిక కవిత్వానికి ఒక గొప్ప సిద్ధాంతాన్ని తయారు చేయడానికి శేషేంద్ర రాసిన "కవిసేన మేనిఫెస్టో " ప్రయత్నించింది. అందులో భారతీయ కావ్య శాస్త్ర పరంపర, అదే కాలంలొ గ్రీకు, రోమన్ సాహిత్యంలో వున్న శాస్త్ర పద్ధతి, పశ్చిమ దేశాల నుంచి దిగుమతైన ఆధునిక సాహిత్య విమర్శ., మార్క్సిస్టు దృక్పధం - ఈ నాలుగింటి సమన్వయమే కవిసేన మేనిఫెస్టో. సమాజానికి ఏ రాజకీయ నాయకత్వమైతే చాలా ప్రధానమని మనం అనుకుంటున్నామో, ఏ ఆర్ధిక శక్తులు దానికి ఇరుసుగా పనిచేస్తాయని అనుకుంటున్నామో , ఆ ఆర్ధిక శక్తులను అంగీకరిస్తూ రాజకీయ భావజాలాన్ని మాత్రం శేషేంద్ర శర్మ తిరస్కరించాడు. ఆధునిక సమాజాన్ని రక్షించడానికి ఇప్పుడున్న రాజకీయ నాయకులు, రాజకీయ భావజాలం పనికిరాదని ఆయన తీర్మానించాడు. కవే దేశానికి అసలు నాయకుడు. కవిత్వమే కవి ఆయుధం. అతనికి వైజ్ఞానిక నాయకత్వం. ఇటువంటి నాయకత్వం కోసం దిక్కు దిక్కుల కవిసేనలు ఉదయించాలి. ఇవి శేషేంద్ర అభిప్రాయలు. ఇది ఒక ఊహాత్మక ప్రతిపాదన మాత్రమే . వాస్తవంలో కాదు. ఉద్యమాలకు దారితీసేవిగాని, విప్లవానికి దారితీసేవిగాని, మౌలికంగా కవుల యొక్క కవిత్వాలు కావు. కవిత్వానికి ఒక పరిమితి ఉంటుంది. కవులకు కూడా ఒక పరిమితి ఉంటుంది. "కవిసేన మేనిఫెస్టో"లో తన ప్రతిపాదనలకు బలంగా శేషేంద్ర ఈ దేశపు , ఇతర దేశాల సాహిత్య , సిద్ధాంతాలను నేపధ్యంలో ఉపయోగించుకున్నాడు. వాటిని ఆధునిక కవిత్వానికి అన్వయించడానికి ప్రయత్నం చేసాడు.

’కాలరేఖ" లో మంచి వ్యాసాలున్నాయి.ఆంధ్ర, సంస్కృత, ఉర్దూ, ఫ్రెంచి భాషల పాండిత్యం గల, ప్రాచ్య పాశ్చాత్య విమర్శ సిద్ధాంత అవగాహన గల శేషేంద్ర రచనల నుంచి ఈ తరం కవులు, విమర్శకులు నేర్చుకోవాల్సింది చాలా ఉంది.

ఆయన రాసిన నవల ’కామోత్సవ్’. శృంగార ప్రధానమైనది . సంపన్న వర్గాలకు చెందినవారు ఎంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తారొ తెలియజేయడానికే ఆయన ఆ నవల రాసాడు. వాళ్లకి దేశం మీద భక్తి ఉండదు. విశ్వాసం అసలే ఉండదు. అన్ని దేశాలు వారివే, ఏ దేశమైనా వారిదే, ఇక్కడి మనుష్యులతో సంబంధం లేనట్టే ప్రవర్తిస్తారు. ఇక్కడ ఇంతమంది తిండి లేకుండా ఉంటే వాళ్లకి పట్టదు. వారి సుఖాలు వారివే, కామాంధకారంలొ పడి కొట్టుమిట్టాడుతుంటారు. వీళ్ళు దేశానికి ప్రమాదకరం అని చెప్పడానికే ఆ నవల రాశానని ఆయనంటాడు. అందుకే అది చాలా గొడవలు సృష్టించింది.
సాహిత్యాన్ని భోగవస్తువుగా భావించే వెనకటి సంస్కృతిలోని సోకాల్డ్ ’రసికత్వమే’ శేషేంద్ర చేత ’కామోత్సవ్’ జరిపించింది. అది ఆధునిక ప్రజాస్వామిక(సాహిత్య) సంస్కృతికి విరుద్ధమైందని గొడవలు జరిగాయి.ఆయన "ముత్యాలముగ్గు" సినిమాలో గొప్ప పాట రాశారు. "నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది" కాని చిత్ర రంగంలోని కొందరు అసూయాపరుల కారణంగా ఆ దిశగా రాణించలేకపోయారు.

అయితే వైరుధ్యాలమయమే గుంటూరు శేషేంద్ర శర్మ సాహిత్యం. అటు సంప్రదాయం - ఇటు ఆధునికత, అటు పద్యం - ఇటు వచన కవిత, అటు శృంగారం - ఇటు అనురాగం, అటు రాజసం - ఇటు ప్రజాస్వభావం.ఇటువంటి వైరుధ్యల ఫలితంగానే సమాజంపై తనదైన ముద్ర వేసుకోలేకపోయినా, కవిత్వ ప్రేమికుల్ని, పోషకుల్ని ఆకర్షించగలిగారు. ఆయన తన 79 వ ఏట మే 30 రాత్రి హైద్రాబాదులో మరణించారు.

గత సంవత్సరం వివిధ పత్రికలలో వచ్చిన వ్యాసాల నుండి సేకరించినది. నా సొంతరచన అని భ్రమ పడకండి..

8 వ్యాఖ్యలు:

oremuna

ఎక్కడ చూసి టైపు చేసినారో చెప్పవచ్చు కదా!

జ్యోతి

సారీ. ఈ వ్యాసం రాసి చాలా నెలలయింది. గత సంవత్సరం కొన్ని పత్రికలలో వచ్చిన వివిధ వ్యాసముల నుండి కొన్ని భాగాలు ఇక్కడ రాసాను. ఐనా ఇది నా స్టైల్ కాదని అందరికి అర్ధమవుతుందిలే కిరణ్. చెప్పకపోవడం తప్పే.

మాలతి

వివిధపత్రికలలో వ్యాసాలు చదివి మీరు రాసిన వ్యాసం మీదేనండి. సర్వస్వామ్యసంకలితం. పెద్దపెద్దవారు ప్రచురించే సిద్ధాంతవ్యాసాలు కూడా ఇలాగే వుంటాయి. మీ పి.యస్. అనవసరం.
రాస్తూవుండండి. ఇలాటివ్యాసాలు చాలా వుపయోగకరం.

మెహెర్

మంచి సేకరణ.

Anonymous

"నిదురించే తోటలోకి, పాట ఒకటి వచ్చింది..కన్నుల్లో నీరు తుడిచి కమ్మని కల ఇచ్చింది.." విలక్షణమైన రీతిలో కవితలు వ్రాసిన శేషేంద్ర శర్మ గారి గురించి ఇంత శ్రమ పడి అందరికీ అందించి, నాది కాదనటం ఎందుకు? పత్రికలలో వచ్చేవి సేకరించటం చాలా మంచి అలవాటు. ఈ అలవాటు అందరికీ రాదు. కాబట్టి క్యారీఆన్ జ్యోతి గారు.

oremuna

I think I read this in AJ

జ్యోతి

kiran,
wat if u read in AJ. till now i didnt read a single issue of AJ. Do you want to see the papers from which i wrote this article. they are nearly ten pages. and to write abt a famous personality,most of the details would be same . so need not be compared i think.. just enjoy the content of the article, without bothering abt who wrote, wheere it is taken from. as i am not going to gain anything from this article. instead i wanted to share this important and valuable information with my friends.

Anonymous

"ఈ బ్లాగులో ఉన్న రచనలన్నీ నా సొంతమన్న భ్రమలో ఉండకండి. కొన్ని సేకరణలు ఉన్నాయి. చదవండి.. ఆనందించండి. ఇష్టం లేకపోతే ముందుకెళ్ళండి...జైహింద్.." అని నేను ముందే చెప్పాను కాబట్టి పట్టించుకోవద్దు అని మీరనవచ్చు.

ఇంత ఓపికగా సేకరించినప్పుడు, ఇంకొక్క వాక్యం మీకు ఎక్కువ అవ్వదు.

ఒక జాబిత, ఒక ఒక జీవిత సంగ్రహం, ఒక జీవిత కధ, వ్యాప్తిలో ఉన్న ఒక పద్యం, ఒక సామెత గురించి చెప్పక పోయిన ఫరవాలేదు. ఒక విశ్లేషణ అన్నప్పుడు అది ఒక వ్యక్తికి సంభందించినది, కాబట్టి, ఇది ఫలానా వారిది అని చెబితే బాగుంటుంది.

పైగా "ఈ వ్యాసం రాసి చాలా నెలలయింది." అని మీరే అన్నారు.

మీ గురించి (ఐనా ఇది నా స్టైల్ కాదని అందరికి అర్ధమవుతుందిలే కిరణ్.) తెలిసిన వారికి సరే- అది అందరు అర్ధం చేసుకోవాలి కదా!
ఒకసారి ఆలోచించండి!

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008