Monday, March 10, 2008

ఎప్పుడూ తిట్టడమేనా, మనమేం చేస్తున్నామో తెలుసుకోమా ??

నిద్రలేచింది మొదలు బండబూతులు తిట్టుకునే రాజకీయ నాయకులను చూస్తూ, డబ్బు తప్ప ఇంకేమీ మానవతావిలువలు తెలియని బంధువులు, స్నేహితులను చూస్తూ, సమాజంలో మన కళ్లెదుట కన్పించే ప్రతీ వక్రమైన వ్యవస్థని, పరిస్థితిని చీదరించుకుంటూ కొంతమంది "ఇంకా ఈ సమాజం ఏమి బాగుపడుతుంది" అని తమ సామాజిక బాధ్యతని కూడా వదిలేసి తామూ తమ పనుల్లో, తమకు తెలియకుండానే తాము గుర్తించకుండానే తామూ పీకల్లోతు స్వార్థంలో కూరుకుపోతుంటారు. ఏదైనా అంశాన్ని విమర్శించడానికి పూనుకునేటప్పుడు ఆ అంశం నుండి విడిపోయి మనమేదో దేశోద్ధారకులమన్న భ్రమని కలిగించే మన మనసు.. విమర్శించడం పూర్తయిన తర్వాత మాత్రం తన సహజనైజంలో తానూ ఇంతకుముందు ఏ అంశాన్నయితే విమర్శించిందో దానిలో భాగమైపోతుంది. అంటే మనం ప్రతీదాన్నీ విమర్శిస్తూనే మనమూ ఆ విమర్శించబడిన అంశంలో భాగమై పయనం సాగిస్తున్నాం. అసలు మనమేమీ మన వంతు సహాయం సమాజానికి చేయకుండా సమాజాన్ని విమర్శించే హక్కు మనకు ఎక్కడ ఉంది? అంతెందుకు ఇదంతా రాస్తున్న నాతో సహా మనమందరం అవకాశం దొరికితే నీతులు చెప్పేవాళ్లమే, కానీ వాటిని ఎంతోకొంత ఆచరించినప్పుడే కదా మన మాటలకు విలువ ఉండేది. సమాజం అలా అయిపోతోంది, ఇలా అయిపోతోంది అయి నిరంతరం తిడుతున్నాం.. కానీ అసలు మనం సమాజానికి ఏం చేస్తున్నాం ఎప్పుడైనా ఆలోచించారా? చాలామందికి సామాజిక సేవ అంటే చాలా చులకనభావం ఉంది. పనీపాట లేని వాళ్లు మాత్రమే సామాజిక సేవ చేస్తారన్న దురభిప్రాయం ఉంది. అవును లక్షల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ లు పెంచుకోవడమే పెద్ద పని, గొప్ప జీవితం అనుకుంటే మానవత్వానికి మచ్చుతునకలుగా మదర్ థెరిసా, మహాత్మాగాంధీ వంటి వారు ఒక్కరూ మిగిలేవారు కాదు. లక్షలు లక్షలు కూడబెట్టి బ్యాంకుల్లో నిల్వ చేసుకుందాం.. అలా మనం మన స్వార్థాన్ని చూసుకుంటేనే.. "అసలు మానవ సంబంధాలు కరువైపోతున్నాయండీ, అన్నీ ఆర్థిక సంబంధాలే" అని లెక్చర్లిద్దాం, మాటలతో మంచితనం మూటకట్టుకుందాం. అంటే ఫోజులు కొట్టడానికీ, మాటలు చెప్పడానికీ మాత్రమే సామాజిక సేవ పనికొస్తుంది తప్ప అందులోకి దిగి మనమూ పాలుపంచుకోవాలంటే మాత్రం అదో పనికిమాలిన వాళ్లు చేసే పనే కదా మన దృష్టిలో! సమాజంలో ఎక్కడో దౌర్భాగ్యం లేదు.. మనం ఏ వ్యవస్థనైతే దుమ్మెత్తిపోస్తున్నామో ఆ వ్యవస్థలో కాదు లోపం ఉన్నది.. అక్షరాలా మనలోనే లోపం ఉంది. అసలు మనం కనీస సామాజిక బాధ్యత నెరవేర్చకపోతే.. అందరూ దూరంగా ఉండి తిట్టే మనలాంటి ఫోజుల రాయుళ్లే అయితే ఇంకా సమాజాన్ని బాగు చెయ్యడం ఎవరి తరం అవుతుంది? పుడతాం, యవ్వనాన్ని ఎంజాయ్ చేస్తాం, పెళ్లి చేసుకుంటాం, నాలుగు రాళ్లు సంపాదించుకుంటాం, పిల్లల్ని కంటాం, వృద్దాప్యంలో రోగాలతో పోరాడి వెళ్లిపోతాం. ఈ ప్రాసెస్ మొత్తంలో అంతా మన చుట్టూ మనమే గిరిగీసుకుని తిరుగుతున్నాం కానీ ఎప్పుడైనా బయట ప్రపంచం పట్ల మనం నెరవేర్చవలసిన బాధ్యతల పట్ల దృష్టి పెడుతున్నామా? ఇలా పుడుతూ, కంటూ, చస్తూ జీవితాన్ని లీడ్ చెయ్యడానికి మానవజన్మే ఎందుకు అన్నీ జంతువులూ అదే పనిచేస్తున్నాయి కదా! చాలామంది డబ్బుకు సమాజం విలువ ఇస్తుంది అనుకుంటారు. అందుకే విరగబడి డబ్బు సంపాదిస్తుంటారు. కానీ డబ్బు సంపాదించే వారికి దొరికేది పై పై గౌరవమే. డబ్బుతోపాటు శత్రువులూ, ద్వేషించేవారూ పెరుగుతారు. దీనికి కారణం డబ్బుతోపాటు మనలో చోటుచేసుకునే మానసిక వికారాలు కావచ్చు, ఇతరత్రా అంశాలు కావచ్చు. అదే మీరు పదిమందికి మీకు చేతనైన రీతిలో సహాయం చెయ్యండి, మీ ప్రేమని అభిమానాన్ని పంచండి.. అసలు దానికి మించిన సంతృప్తి ఎక్కడైనా లభిస్తుందేమో మీరే చూడండి. ఇది చదివిన అందరికీ ఓ మనవి, ఇది చదివి కొంతమందైనా సమాజాన్ని, వ్యవస్థని తిట్టడం మానేసి కనీసం కొద్దిగానైనా తమ సామాజిక బాధ్యతని నెరవేర్చడం అలవాటు చేసుకుంటే దీనిని రాయడం వెనుక నా ఉద్దేశం నెరవేరినట్లే. ఇలాంటివి చాలాచోట్ల చదివాం.. మేము మారము.. మేము ఇలాగే ఉంటాం అంటారా.. అలాగే ఉండండి ఫర్వాలేదు. ఏదోరోజు మీలో మార్పు వస్తుంది అని నాకు ఖచ్చితంగా తెలుసు.

- నల్లమోతు శ్రీధర్

0 వ్యాఖ్యలు:

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008