Monday 31 March 2008

గోవిందా గోవిందా ....


సత్యసాయిగారు , వాళ్ళమ్మాయి శ్రావ్య రాసిన టపాలు చదివి నా తిరుపతి ప్రయాణ విశేషాలు రాయకుండా ఉండలేకపోతున్నాను. మాకు పాతికేళ్ళ నుండి ప్రతి సంవత్సరం తిరుపతి కి వెళ్ళే అలవాటు ఉంది. అలా అయినా కాస్త విహార యాత్ర లాగా ఉండేది. తిరుపతి నుండి మరి కొన్ని ప్రదేశాలు కూడా వెళ్ళే వాళ్ళం.

అప్పట్లో తిరుపతి ప్రయాణం అంటే ఒక గొప్ప అనుభూతి ఉండేది. దాని కోసం ఎన్నో రోజుల నుండి ప్రయాణ సన్నాహాలు, టికెట్లు బుకింగ్ , తిను బండారాలు చేసుకోవడం. కాని మేము ప్రతీ సారి దాదాపు పది రోజుల పైనే ప్రయాణం పెట్టుకునేవాళ్ళం అదీ చిన్నపిల్లలతో. హోటల్ తిండి తింటూ అన్ని రోజులు ప్రయాణం సాధ్యమా. కాని మేము మాత్రం స్వయం పాకమే. వంట చేసుకుంటూ అన్ని ప్రదేశాలు తిరిగేవాళ్ళం. రెండు బ్యాగులు ఎక్కువ అయ్యేవి. కాని మంచి భోజనం లేకుంటే ఇంకేం తిరుగుతాం. ఎప్పుడు కూడా మాతో పాటు ఇంకో కుటుంబాన్ని తీసికెళ్ళేవాళ్ళం ఇక ఫుల్ ఎంజాయ్. దాదాపు పదేళ్ళ క్రింద తిరుమలలో దర్శనం చాలా బాగా జరిగేది. మేము ఎక్కువగా డిసెంబరు నెలలో వెళ్ళేవాళ్ళం. చలికాలం కదా జనాలుటక్కువగా ఉంటారు , దర్శనం ఈజీగా చేసుకోవచ్చని. రాత్రి భోజనం చేసి క్యూ కాంప్లెక్స్ లో కెళ్ళి లోపలికి ఒకటే పరుగులు .లైన్లో నిలబడే ప్రసక్తే లేదు. అంత చలిలో ఎక్కువమంది ఉండేవారు కాదు హాయిగా అరగంటలో తీరిగ్గా స్వామి దర్శనం చేసుకుని బయటపడేవాళ్ళం. సుప్రభాత సేవ ఐతే లోపల ఎక్కువ సేపు స్వామిని చూడవచ్చు అని ఆ టికెట్ తీసుకునేవాళ్ళం ఎక్కువగా. ఒకసారి అర్చన కోసం కూర్చుంటే రెండు గంటలు పైగా జరిగింది. పిల్లలైతే పడుకున్నారు. నేను కొద్ది సేపు కూర్చోవడం , కొద్ది సేపు నిలబడి స్వామిని చూడడం. అంత తీరిగ్గా స్వామిని చూసే అదృష్టం ఉండేది అప్పట్లో. ఇక కల్యాణం చేయిస్తే చెప్పొద్దూ కాని చాలా విసుగోచ్చేది. అంత సేపు జరిగేది.తర్వాత ఇచ్చే ప్రసాదాలు ఇక చెప్పనక్కరలేదు. ఇరవై పెద్ద లడ్డూలు, ఇరవై గారెలు, ఇరవై వడలు, అన్న ప్రసాదాలు ( పులిహోర, చక్రపొంగలి, దధ్యోజనం, పొంగలి) ఇలా ఇచ్చేవారు. ఆ సువాసనలు ఇప్పుడేవి...అలా నింపాదిగా స్వామిని చూసే అదృష్టం కోసం ఎన్ని కష్టాలైనా పడొచ్చు అనిపించేది. ఎన్.టి.ఆర్ కాలంలో ఐతే అక్కడ చాలా స్ట్రిక్ట్ గా ఉండేది. ముఖ్యంగా అప్పటి E.O ఫై.వి.ఆర్. కే ప్రసాద్ గారు తిరుమలలో అవినీతి అనేది మచ్చుకైనా కనపడకుండా ప్రయత్నించారు. మహానుభావుడు.

మరి ఇప్పుడు తిరుమల అంటే అవినీతి సామ్రాజ్యం ఐపొయింది. అక్కడికి వెళ్ళాలంటే భక్తి కంటే నోట్ల కట్టలు, సిఫారసులు కావాలి. సరే అలా ఖర్చు పెట్టి వెళ్ళినా దేవుడిని కనీసం ఒక్క నిమిషం కూడా చూడనివ్వరు.మొదటి ద్వారం దగ్గరనుండే పదండి పదండి అంటూ తోసేయడమే. దేవుడి ముందున్న పంతులుకు యాభై నోటు వాసన చూపిస్తే ఒ రెండు నిమిషాలు నిలబడనిస్తాడు అదే భాగ్యం అనుకోవాలి. కలికాలం అంటే ఇదే మరి. దేవుడి పేరు చెప్పి దోచుకుంటున్నారు. బయటకోచ్చాక తీర్థం ఇచ్చే పంతులు ఒక చేత్తో శఠ గోపం పెడుతూ మరో చేయి చాచి ఉంచుతాడు. భక్తులు డబ్బులు వేయగానే రొంటిలో దోపుకోవడం. ఇదీ తంతు. కళ్యాణం ఐతే మరీ మొక్కుబడిగా చేస్తున్నారు. సంకల్ప చెప్పడానికి దంపతులు వెళ్లి రావడానికి అరగంట. అసలు కళ్యాణం జరిగేది అరగంట. ఆశీర్వాదం తీసుకోవడానికి మరో అరగంట. అంతే . అక్కడ పంతులుకు నోటు సమర్పిస్తే ఓ నిమిషం ఎక్కువ నిలబడోచ్చు. దిగిన తర్వాత టిటిడి లో పని చేసే జవానుకు మరో నోటు ఇస్తే కాసింత చందనం తెచ్చి ఇస్తాడు. ఇదీ తంతు. రెండు లడ్డులు, రెండు గారెలు ఉన్నా కవర్ మన మొహాన పడేసి , తాంబూలాలిచ్చేసాం ఇక తన్నుకు చావండి అన్నట్టు పూజారులు అన్ని సర్దుకుని వెళ్ళిపోతారు. ఇక భక్తులు అందరు దర్శనం కోసం పరుగులు. దర్శనం చేసుకుని బయటకొచ్చాక పంతుళ్ళు మన వెంట పడతారు ఆశీర్వాదం ఇవ్వడానికి స్వామి వారి కల్యాణం చేయించారు అంటూ. వాళ్ళను తప్పించుకుని రావడం ఒక పెద్ద పని. ఇపుడు తిరుమలలో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మొత్తం కమర్షియల్ . ఎవడు చూసిన భక్తులను దోచుకోవాలనుకునేవాడే. డబ్బున్నవాడిదేరాజ్యం. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇన్ని కష్టాలుపడి వేంకటేశ్వరుడిని చూడాలని వెళ్తే లాభమేంటి ? కళ్ళారా చూడనీకుండా తోసేయడం. మరి ఎందుకు వెళ్ళడం??

అందుకే నాకు తిరుపతి వెళ్ళాలి అంటేనే విరక్తి కలిగింది. మా ఇంటికి దగ్గరలో ఉన్న వేంకటేశ్వరుడిని మనస్పూర్తిగా , నిదానంగా , కళ్ళారా చూసుకోవచ్చు. అక్కడా ఇక్కడా ఉన్నది ఆ దేవ దేవుడే అని నిర్ణయించేసుకున్నా.. ఐదేళ్ళ వరకు తిరుమల దేవుడికి అభిషేకం చేయించే టికెట్లు లేవంట. కాని ఇచ్చేవాళ్ళకు అవి ఇస్తారులెండి అది వేరే సంగతీ. కాని ఇక్కడ ఒకరోజు ముందు తీసుకుంటే సరి. కళ్యాణము . అంతే.

ఇందు గలడందు లేడను సందేహము వలదు . చక్రి సర్వోపగతుండు. అని నా మనస్సుకు చెప్పెసుకున్నా. మావారికి కూడా చెప్పాను. నేను ఆ తిరుపతికి ఇప్పట్లో రాను అని. భగవంతుడా నిన్ను నువ్వే కాపాడుకోవాలి ఇక . అలాగె మీ ఆవిడని, అన్నగారిని కూడా. గుడిని గుళ్ళో దేవుడిని కూడా అమ్ముకునే మనుషులున్న కలికాలం ఇది.

6 వ్యాఖ్యలు:

దైవానిక

భలే కరెక్టుగా చెప్పారు. వడ్డి కాసుల వాడు కదండీ, కాస్త ధనమంటే మక్కువ ఎక్కువ శ్రీవారికి.

Rajendra Devarapalli

.............గారు తిరుమలలో అవినీతి అనేది మచ్చుకైనా కనపడకుండా ప్రయత్నించారు. మహానుభావుడు.పుణ్యక్షేత్రాలలో మీరు చెప్పిన అవినీతి విశ్వవిఖ్యాతం.ఒరిస్సాలోని పూరీ సంగతి దాదాపు ప్రతి ప్రపంచభాషలోనూ వెలువడ్డ రచనల్లో పేర్కొన్నారు.తిరుపతికి ముందు పూరీకి విదేశీయుల తాకిడి ఎక్కువ ఒకప్పుడు.ఇప్పుడు కూడా ఇవోగారు మంచాయనే మహానభావుడే కానీ పడనివ్వటం లేదు అని మీరు వింటారు కొన్నాళ్ళాగితే.మహానభావులు చేస్తే పదికాలాలు నిలుస్తాయి ప్రయత్నాలు.ఉద్యోగస్తులు చేస్తేనే వారు బదిలీ అవ్వగానే వ్యవహారాలు మళ్ళీ మొదలవుతాయి.తిరుపతిలో దేవుడిని మించిన ఇమేజి సంపాదించిన ఇవోలున్నారు గతంలో మీడియా పుణ్యమాని..

Sujata M

తిరుపతి వెళ్ళటానికి ఇప్పుడు అందరికీ ఉత్సాహం పోయింది. సరే. గత నెల లో అన్నవరం వెళ్ళాము. వ్రతం చేయించుకోవటానికి. అక్కడ చాలా బహిరంగంగా, చాలా చీప్ గా బ్రాహ్మణులు దక్షిణలు, దానాలూ అడుగుతున్నారు. వాటికి రేట్లు కూడా 500, 200, 300 రూపాయలంటూ నిర్ణయించేసారు. కల్యాణం టిక్కెట్ కూడా కంప్యూటర్ జెనెరేటెడ్ కాదు. హాల్లోకి వెళ్ళగానే ఆ టిక్కెట్ లను తీసేసుకున్నారు..(చింపలేదు). వాట్నే మళ్ళా అమ్మేస్తున్నరేమో. అక్కడ ఒక దేవస్థానం ఉందా అని అనుమానం వచ్చింది. హిందువులమై ఉండి, తిరుపతి, అన్నవరం, అని సెంటిమెంట్లు పెట్టుకుంటున్నందుకు మనకు ఈ అవినీతి శిఖామణులు బాగా బుద్ధి చెప్తున్నారు. ఈ పుణ్యం ఏదో రోడ్ మీద భిక్షగాళ్ళకు చలికాలం కంబళ్ళు పంచో, పిల్లలకు చదువు చెప్పో, ఎండల్లో చలివేంద్రం పెట్టో సంపాదించుకుందాం.

జ్యొతి గారు... చాలా మంచి విషయాన్ని చెప్పారు. ఆ వెంకన్నే స్వీయ రక్షణ చేసుకోవాలి.. లేకపోతే ఇంతే సంగతులు.

krishna rao jallipalli

నాకు కూడా మీలాగే తిరుపతి అంటే విరక్తి కలిగింది. 12 సంవత్సరాలు తరువాత మొన్న october లో వెళ్ళాము. అది పిల్లల గోల బరించ లేక. అన్ని బందోబస్తులతో వెళ్ళాము కాబట్టి సరిపోయింది కాని... ఆ అవకాశం లేని వారి సంగతి. ఎంతో దూరం నుండి మనం భక్తో, భక్తో అని వెళ్ళే మనకు కలిగేది విరక్తి మాత్రమె. అక్కడకు వెళ్ళే వారికి భక్తీ కాని.. అక్కడ ఉండేవారికి భుక్తి. అక్కడి వారికి పాప భీతి లేదు. ఎంతకూ అయిన దిగాజారుతారు. నిజం.. pvrk prasad గారు గొప్ప E.O. ఇంకో విచిత్రం చెప్పమంటారా.. సుబ్బరామి రెడ్డి CHAIRMAN గా ఉన్నప్పుడు.. TELUGU DOORDARSHAN లో అయన వెంకటేశ్వర స్వామి గురించి చెప్పేది తక్కువ.. ఆయన స్వంత ప్రచారం ఎక్కువ... ఆ సోది వినలేక కనలేక... ఇంకా ఎక్కువ అయ్యింది విరక్తి.

బ్లాగాగ్ని

ఈ వరసలో చెప్పుకోదగ్గ మరో పుణ్యక్షేత్రం విజయవాడ కనకదుర్గ గుడి. ఏడెనిమిదేళ్ళ కిందట వెళ్ళినప్పుడక్కడి దోపిడీ చూసి కళ్ళు తిరిగాయంటే నమ్మండి. దీనితో పోలిస్తే మిగిలిన పుణ్యక్షేత్రాలు చాలా నయం అనుకున్నానప్పట్లో. కానీ రెండేళ్ళ క్రిందట వేరు వేరు సందర్భాల్లో అన్నవరం, తిరుపతి వెళ్ళినప్పుడు తెలుసుకున్నా ఇవి కూడా చాలా అభివృధ్ధి సాధించాయని.

మాలతి

జ్యోతిగారూ,
మీ సెల్లాయనమః, ఈగోవిందా..లో కూడా కొన్ని అక్షరాలు యాస్కీలా కనిపిస్తున్నాయి నాకు, ఎంచేతోమరి. సెల్లాయనమః ఆంద్రజ్యోతిసైటుకి వెళ్లి చూసుకున్నాను.
మొత్తంమీద చాలా బాగా రాసేరు సెల్లియో, సెల్లకో అందరూ ఈనాడు సెల్లుధరులే. సెల్లులేకున్న జనాభాలెక్కల్లోకి రారు.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008