Thursday 14 August 2008

రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి... మనకి ఎంత దేశభక్తి..

మరో ఆగస్ట్ 15 వచ్చింది.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినరోజేమో తెలియదు కానీ పని నుండి మరో సెలవు రోజు జమైనందుకు ఊపిరి పీల్చుకుంటున్నాం. మనలోనూ చాలా దేశభక్తి ఉంది, కానీ ఏం చేస్తాం పొట్టకూటి కోసం పడే తిప్పల్లో ఎక్కడో అడుగుకి చేరుకుపోయింది. ప్రతీ ఏటా ఈ పండుగ వస్తూనే ఉంది.. టెలివిజన్ సెట్లలో, రేడియోల్లో ఉద్వేగభరితమైన సంగీతాన్నీ, జాతీయ గీతాలను ఆస్వాదిస్తూ మన రోమాలు నిక్కబొడుచుకుంటూనే ఉంటున్నాయి. వందేమాతరం అంటూ రెహ్మాన్ గీతంలో ఆసేతు హిమాచలాన్ని వీక్షిస్తూ ఎంత గొప్పదేశమో అని పులకించిపోతున్నాం. కాలం ఆగదు కదా.. కాలెండర్ లో తేదీ మారింది. తేదీతో పాటు ఉత్సాహమూ చప్పబడిపోయింది. మళ్లీ రొటీన్ లైఫ్ మొదలైంది.
రొటీన్ లైఫ్ లీడ్ చేస్తున్నా మనలో చేవ తగ్గలేదు, ఇప్పటికీ దేశం పేరెత్తితే ఉప్పొంగిపోతున్నాం.. ఒలింపిక్స్ లో భారత్ స్వర్ణం గెలిస్తే పట్టలేని ఆనందం. భారతజట్టు క్రికెట్ లో దారుణంగా ఓడిపోతే శాపనార్థాలు. రాజకీయల నాయకుల్ని చూసి అసహ్యించుకుంటున్నాం, సోమరిపోతు అధికారుల్నితిట్టుకుంటున్నాం.. పేపర్ బాయ్ నుండి టీవీ సీరియల్ లో క్యారెక్టర్ వరకూ ఎవరినీ వదలకుండా వారు వారు పోషిస్తున్న పాత్రలు, ఉద్యోగ ధర్మాన్నిచీల్చి చెండాడుతున్నాం. ప్రపంచంలో మనంత గొప్ప విమర్శకులు ఉండరు. వ్యవస్థ పాడైపోయినందుకు గంటల తరబడి విశ్లేషణలు చేసి కొండని తవ్వి ఎలుకను పట్టినట్లు "ఈ దేశాన్ని మనం బాగుచెయ్యలేమండీ" అని పెదవి విరిచి పడకేస్తాం.

దేశమంటే, సమాజమంటే అదో బ్రహ్మపదార్థం.. మన చేతిలో ఏదీ ఉండదు అన్నంత నిర్లిప్తత. "నీకు చేతనైంది ఏదైనా ఒక్క మంచి పని చెయ్యరా బాబూ" అంటే.. "మనమొక్కళ్లం మంచిగా ఉంటే అంతా బాగవుతుందా" అన్న బోడి లాజిక్ లు. ఏం ఎందుకు బాగు కాదు? అసలు చేతనైనంత, మనకు వీలుపడినంత సమాజానికో, దేశానికో, పక్కవాడికో మంచి చెయ్యడానికి అంత బద్ధకం ఎందుకు? "ఈ దేశం ఎప్పుడు బాగుపడాలండీ" అంటూ వ్యంగ్యాలు సంధించే బదులు కనీసం దేశాన్ని బాగు చెయ్యకపోయారు మనల్ని మనమైనా బాగుచేసుకోలేమా? ఆఫీస్ కి వెళతాం, "పనిపూర్తయిందా", "ఈ జాబ్ లో ఉంటే వచ్చే ఏడాదికి ఎంత పే వస్తుంది, మరో జాబ్ మారితే బాగుంటుందేమో? వద్దులే అక్కడ వర్క్ ఎక్కువుంటుందేమో".. ఇవే పనికిమాలిన పని తప్పించుకునే ఆలోచనలు. జపాన్ చాలా గొప్పదేశమండీ, చైనా ఎంత డెవలప్ అయ్యిందో చూశారా.. టీవీలో స్టాటిస్టిక్స్ చూసి తామేదే రీసెర్చ్ చేసి కనిపెట్టినట్లు ఊకదంపుడు ఉపన్యాసాలు. అవి డెవలప్ అయ్యాయి అంటే అక్కడి పౌరులు తమ పని తాము శ్రద్ధగా చేసుకుపోతున్నారు. వారేమీ ఓవర్ టైమ్ చెయ్యడం లేదు. తమకు వచ్చే జీతానికి సరిపడా తాము కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ప్రొడక్టివిటీ వల్ల ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది అని, తాము కష్టపడితే దేశానికి సముద్రంలో నీటి బొట్టంత అయినా లాభం చేకూరుతుందన్న కనీస స్పృహ వారికుంది. ప్చ్.. మనం మాత్రం ఎప్పుడు సెలవు వస్తుందా అని చకోర పక్షుల్లా ఎదురుచూస్తుంటాం. స్వంత పనే, కూడు పెడుతున్న పనే శ్రద్ధగా చేయనంత బద్ధకస్తులమైతే మనం దేశం గురించి బాధ్యత ఎక్కడ ఫీల్ కాగలం?

"దేశాన్ని ఉద్దరించాలంటే ఏం చేయాలండీ" అంటూ ప్రశ్నిస్తారు కొంతమంది? ఎంత కన్ ఫ్యూజన్ లో ఇరుక్కున్నాం. చేయాలన్న తపన ఉండాలే కానీ మనం చేసే ప్రతీ పనీ చిత్తశుద్ధితో చేస్తే అది దేశానికి సేవ చేసినట్లు కాదా? ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవడం దగ్గర్నుండి అనాధలకు సేవ చెయ్యడం వరకూ ఎన్ని రకాల సేవలు ఉన్నాయి. అవన్నీ మనమెక్కడ చేస్తాం అంటూ భేషజం అడ్డు వస్తుంది. ఇంకేం దేశాన్ని, నాయకుల్ని, పక్కింటి వాడిని సణుక్కుంటూ దుప్పటి ముసుగేద్దాం. మనకు చేతనైంది అదే కదా! ఒక్క మంచి పనిని చెయ్యకపోగా మంచి పనులకు మాటలతోనైనా మోరల్ సపోర్ట్ ఇచ్చే ఓపెన్ మైండ్ ఉండదే.. ఇంకా సమాజాన్ని విమర్శించే హక్కు మనకెక్కడిది? ఎవరైనా మంచి పని చేస్తే కాళ్లు పట్టి మరీ వెనక్కి లాగి శాడిజం ప్రదర్శించుకుంటాం. నిర్లక్ష్యంగానే పెరిగాం, నిర్లక్ష్యంగానే జీవితం సాగిద్దాం.. ఎవరెట్లా పోతే మనకెందుకు! ఇలాంటి పండుగలొచ్చినప్పుడు నాలుగు స్వీట్లు తిని, Orkutలోనో, మెయిల్ లోనో ఆవేశపూరితమైన కొటేషన్లని, వాల్ పేపర్లని పంపించుకుని అలా చేయడం వల్ల మనకేదో దేశభక్తి వంటబట్టినట్లు భ్రమపడుతూ, టైమ్ ఉంటే బ్లాక్ లో టిక్కెట్ కొని సినిమాకెళ్లి, రాత్రికి వీలైతే గ్లాసులు గల్లుమనిపించి తొంగుందాం...

మేరా భారత్ మహాన్! స్వాతంత్ర్యభారతం వర్థిల్లాలి...!!

ఇలాంటి మొక్కుబడి దేశభక్తిని చూసి విసిగిపోయి..

- నల్లమోతు శ్రీధర్

19 వ్యాఖ్యలు:

Puvvaladoruvu

బాబోయ్! మనం ఇంత దారుణంగా ఉన్నామన్నమాట. నిజమే మనం కబుర్లు చెప్పుకుంటా కాలం గడుపుతున్నాం. వాళ్ళేమో నిశ్శబ్ధంగా వాళ్ళపని వాళ్ళు చేసుకుపో్తున్నారు. మీ వ్యాసం చదివితే నిజంగానే
రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి..

Unknown

బాగా చెప్పారు శ్రీధర్. అందరం ఎంతో కొంత చేయగలుగుతాము మన దేశం కోసం.

దేశం భ్రష్టు పట్టి పోతుందో, ఇది బాలేదు అది బాలేదు అని అన్నిటినీ తెగ కుళ్ళబొడిచి బ్లాగుల్లో రాసుకుని ఆనందిస్తాం తప్ప దానిని సరి చెయ్యడానికి తగిన ఉపాయాలను మాత్రం ఎక్కువగా ఆలోచించం.

మనం చేసే చిన్న చిన్న పనుల ద్వారా సమాజాన్ని బాగుపరచవచ్చు. రూల్సు పక్కవారి కోసం కానీ నాకోసం కాదు అనే మెంటాలిటీ నుంచి బయటపడాలి. మనం చేసే ప్రబోధనలు మనతోనే మొదలవాలి అనే సంగతి గ్రహించాలి.

కొత్త పాళీ

చాలా బాగా చెప్పారు.
నేడే స్వాతంత్ర్య దినం .. వీరుల త్యాగ ఫలం

teresa

awakening!

Unknown

గుజరాత్ పోస్టల్ ట్రెక్కర్స్ గారు, ప్రవీణ్ గారు, కొత్తపాళీ గారు, థెరెస్సా గారు మీ అమూల్యమైన స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలు.

krishna rao jallipalli

చాలా బాగా చెప్పారు. AUG 15 నాడు కానివ్వండి.. ఇంకో నాడు కానివ్వండి... ఈ ROUTINE సమావేశాలు, ఉపన్యాసాలు.. అంతా సోది సొల్లు మాత్రమె. PITY ఏమిటంటే.. ఈ జాడ్యం కొంతమంది మేధావి తెలుగు BLOGGERS కూడా పట్టుకొంది.. వీరు కూడా సుత్తి టపాలు... ఇలా చెయ్యాలి.. అలా చెయ్యాలి.. ఇది బాగా లేదు.. ఇది బాగా లేదు. PRACTICAL వీరు చేసిన మంచి పనులు, సహాయం ఏమిటో చెప్పరు (అసలు చెస్తేకదా). వారు రాసే టపాలను విభేదిస్తే, విమర్శిస్తే.. అంతే సంగతులు .. ఆ టపాలు ప్రచురించరు. ఎందుకంటీ.. విమర్శలను ఎదుర్కునే ధైర్యం, దమ్ము, మగతనం ఉండి ఏడిస్తే కదా. కొజ్జ మొహాలు.. ఇటువంటి వెధవన్నర వెధవ BLOGGERS కి పొగడ్తలు మాత్రమె కావాలి.. వారి భావాలను విబెదిస్తే.. వారి ముండ మొహం అహం దెబ్బతింటుంది. వారు చేపీదే వేదం, వారు చేపీదే CORRECT అని మనం అందరూ ఒప్పుకోవాలి. లేకపోతె.. మన COMMENTS ని ప్రచురించరు... వెన్నుముక లేని వేదవన్నర వెదవలు... వారి బతుకూ ఒక బాతుకీనా..

Unknown

కృష్ణారావు గారు నేను ఈ పోస్ట్ రాసిన ఉద్దేశం "దేశభక్తి అనేది కేవలం తూతూ మంత్రపు వ్యవహారంగా మారిపోతోంది, దేశ పౌరులుగా మన బాధ్యతల్ని విస్మరించి ఇలా ఎని ఆడంబరంగా వేడుకలు జరుపుకున్నా దేశానికి ఏమాత్రం మేలు చెయ్యలేం! మనవంతు మనం బాధ్యతని నెరవేర్చే స్పృహ అందరికీ ఉండాలి అన్న కోణంలో". బ్లాగుల్లో చోటుచేసుకునే సంఘటనలు, అనుభవాలు ఇక్కడ వ్యక్తపరచడం సరైనది కాదేమో! దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. ఎంతో వేదనతో కేవలం దేశభక్తి గురించి రాసిన ఈ పోస్ట్ ఇలా ఇతర అంశాలపై చర్చకు దారితీయడం నాకు మనసొప్పడం లేదు. దయచేసి సహృదయంతో అర్థం చేసుకోగలరు.

Anonymous

నా అభిమాన రచయిత అయిన మీ రు వ్రాసిన ఈ వ్యాసం నన్ను నిరాశకు, దిగ్భ్రమకు లోను చేసింది.

మీ వ్యాస సారాంశం అర్ధం కాలేదు! దేశభక్తి (టైటిల్ ) కి, వ్యాసం లో మీరు ఉదహరించిన వాటికి సంబంధం ఏమిటో తెలియటం లేదు. ఈ జాబ్ లో ఉంటే వచ్చే ఏడాదికి ఎంత పే వస్తుంది అనే పనికిమాలిన ఆలోచనలు (మీ అభిప్రాయం), నాకు తెలిసినంత వరకు భారతీయుల కంటే విదేశీయులకే ఎక్కువగా ఉంటాయి. అయినా , వ్యక్తిగతమయిన ఆలోచనలకు దేశాభివృద్దికి సంబంధం ఏమిటీ? ఎవరో కొంత మంది ఆలోచనా విధానాన్ని మొత్తం సమాజానికి, దేశానికి అంటగట్టడం అనేది - విజ్ఞులైన మీకు తగునా? సమాజం , దేశం గురించి మీ విజన్ Narrow గా ఉందనిపించింది మీ వ్యాసం చదువుతుంటుంటే! ఉత్తమ రచయిత అయిన మీరు "బోడి" లాంటి పదాలు వాడటం దురదృష్టకరం.

Unknown

బాబు గారు మీ అభిప్రాయానికి ధన్యవాదాలు. ఏ ఒక్కరి జీవనశైలిని కించపరచడం నా ఉద్దేశం కాదు. అందరం దేశం బాగుపడాలనుకుంటాం.. దేశం ఎలా బాగుపడుతుంది? వ్యక్తుల సమూహంలో, వారి ప్రాధమిక ఆలోచనా విధానంలో బాధ్యత చోటుచేసుకోని వరకూ వ్యవస్థలో మార్పు సాధ్యమా అన్నది నేను చెప్పదలుచుకున్నది.

"వ్యక్తిగతమయిన ఆలోచనలకు దేశాభివృద్దికి సంబంధం ఏమిటీ? ఎవరో కొంత మంది ఆలోచనా విధానాన్ని మొత్తం సమాజానికి, దేశానికి అంటగట్టడం అనేది - విజ్ఞులైన మీకు తగునా?" - దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనషులోయ్ అన్నాడు గురజాడ. వ్యక్తుల స్థాయిలో ఉండే సూక్ష్మమైన బాధ్యతారాహిత్యాలే వ్యవస్థని బ్రష్టుపట్టించగలవు కదా! దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది..? ఎవరి ధర్మం వారు చక్కగా నిర్వర్తిస్తేనే కదా! ఒక చిన్న ఉదా. చెబుతాను, అయితే ఈ ఒక్క ఉదా.నే ఆధారంగా తీసుకుని మీ వాదనకు ఇది సరితూగదు అని తేల్చేయకండి దయచేసి! ఇది చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. రిలయెన్స్ నెట్ కనెక్షన్ మొన్న వారంరోజుల పాటు రాకపోవడంతో రోజుకి 15కి పైగా కస్టమర్ కేర్ కి ఫోన్లు చేస్తూ వాళ్లు ఎప్పటికప్పుడు హిస్టరీ మొత్తం తాజాగా వింటూ ఒక గంటలో మీకు మా టెక్నికల్ డిపార్ట్ మెంట్ నుండి ఫోన్ వస్తుంది అని చెబుతూ అలా వారం రోజులు గడిచిపోయాయి. దీనివల్ల గంటల తరబడి టైమ్, ఫోన్ బిల్లు, కంప్యూటర్ ఎరా ఫోరం, ఛాట్, మేగజైన్ వర్క్ కి చాలా ఇబ్బంది ఏర్పడింది. అక్కడ పనిచేసే ఉద్యోగులకు 80కి పైగా కంప్లైంట్ లకు ఒక్క దానికైనా కాల్ బ్యాక్ చేసే తీరిక లేనంత గొప్పగా సర్వీస్ ఇస్తున్నప్పుడు.. పరోక్షంగా ఎవరు నష్టపోతున్నారు? దాని ప్రభావం మేగజైన్ మీద, ఫోరం మీద పడింది. ఆ 80 ఫోన్ కాల్స్ లో ఒక్క కాల్ నైనా ఒక్క వ్యక్తి నిర్లక్ష్యంగా వదిలేయకుండా సకాలంలో హ్యాండిల్ చేస్తే పరోక్షంగా ఇతరులకు నేను అందిస్తున్న సర్వీస్ నిరంతరాయంగా జరిగి ఉండేది కదా! "బాధ్యత అనేది ఎంతో కొంత మంది ఫీల్ కావలసింది కాదు.. అందరూ ఫీల్ కావలసింది.. అలా అందరూ ఫీల్ అయితేనే స్వాతంత్ర్యాన్ని సగర్వంగా సెలబ్రేట్ చేసుకునే అర్హత ఉన్నట్లు!
వ్యక్తుల స్థాయి ఉత్పాదకతని బట్టే వ్యవస్థ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది, ఆ వ్యవస్థే దేశానికి వెన్నెముక.
"మనమొక్కళ్లం మంచిగా ఉంటే అంతా బాగవుతుందా" అన్న బోడి లాజిక్ లు.ఇక్కడ బోడి ఎంత ఆవేదనతో ఉంటే నా మనసు ఒప్పుకోకున్నా అంత వ్యంగ్యమైన భాష వాడానో అర్థం చేసుకోండి. ఆ ఒక్క లాజిక్ ని విన్పించి ఎంతమంది అవలీలగా తమ సామాజిక బాధ్యతల నుండి తప్పించుకుంటున్నారో తలుచుకుంటే చాలా చాలా బాధేసింది. అందుకే ఆ ఆవేశంలో పదాల ప్రయోగంలో దిగజారి మరీ కావాలనే ఆ పదాన్ని వాడాను. నేను కోరుకునేది తాము నిర్వర్తించవలసిన బాధ్యతల పట్ల అలా పలాయనవాద లాజిక్ లు విన్పించి ఎస్కేప్ అయ్యేవారికి సూటిగా పంచ్ ఇవ్వాలనే!

వ్యక్తుల ప్రవర్తనకు దేశానికి మధ్య సంబంధం గురించి విశ్లేషించాలంటే వివిధ దశల్లో ఎన్నో సామాజికాంశాలు స్పృశించాలి. సమాజం గురించి నా ఆలోచనా విధానం broadగా ఉన్నా, narrowగా ఉన్నా నా వరకూ, నేను సమాజానికి చెయ్యదలుచుకున్న పనుల వరకూ నాలో స్పష్టత ఉంది కాబట్టి నా narrow విజన్ వాటికి అడ్డంకి కాబోదనుకుంటున్నాను. మీతో ఇలా మనసువిప్పి అభిప్రాయాలు పంచుకోవడం ఆనందంగా ఉంది. ధన్యవాదాలు.

Satya

Sridhar,

You are a good blogger.
But I don't completely agree with you. It seems you are blaming the people working for a company. There may not be enough people at work to serve you. Its the responsibility of the management and planning team to have right people. Mainly it depends on the company's culture of working.
Also, in every country there are lazy people along with the hard working people.

When it comes to development of a country,
individuals helping orphans, donating money are NOT the symbols of development.

The important job of people is making the government do its duty right. Primary education, health care, welfare, and infrastructure development are its jobs. Our duty is getting the government do its duty.
Information act is one weapon we have.

Also, our country is not comparable with any other. No one has these many languages, cultures and complexities. I strongly believe we came across a lot of distance and have more to do. if we are able to get our political future into the hands of the people who are well educated, our progress will be much faster.

Sridhar, I appreciate your blog. I want to see you writing with more broad thoughts.

Thanks

Unknown

సత్య గారు ధన్యవాదాలు. నా మనసులోని భావాన్ని అక్షరాల్లో వ్యక్తపరచడంలో విఫలమయ్యానని మీ అందరి కామెంట్లు చదువుతుంటే అర్థమవుతోంది. ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసేటట్లు నా పోస్ట్ ఉంటే క్షమించండి.ఈ పోస్ట్ లో రాసేటప్పుడు అందరూ కేవలం అంతర్లీనంగా నేను చెప్పదలుకున్న భావాన్ని మాత్రమే స్వీకరిస్తారనుకున్నా కానీ అందులో ఏ కొద్ది మంది వర్కింగ్ నేచర్ నో ప్రస్తావిస్తూ తద్వారా జరిగే నష్టం గురించి కొన్ని లైన్లలో రాసిన వాక్యాలు చర్చనీయాంశం అవుతాయి అనుకోలేదు. ప్రధానంగా ఇక్కడ నేను ప్రస్తావించిన ప్రతీ లైన్ గురించి విపులంగా చర్చించదలుకుంటే ఎన్ని పేజీలు రాసినా సరిపోదు. ఒక పోస్ట్ లో వేర్వేరు అంశాలను స్పృశించడం వల్ల వేటినీ వివరంగా రాయడానికి వీలుపడలేదు. కానీ నా భావం మాత్రం ఇప్పటికీ నా మనసులో అంతే పదిలంగా ఉంది. దాన్ని మీకు సరైన విధంగా అర్థమయ్యేలా వ్యక్తపరచలేకపోయినందుకు మన్నించండి.

Anil Dasari

శ్రీధర్,

మీరు మరీ అన్యాయంగా మాట్లాడుతున్నారు. మన దేశం మరీ అంత ఘోరంగా ఏమీ లేదు. 'వాళ్లలా చేస్తారు, వీళ్లిలా చేస్తారు' అంటూ భారతీయుల్లో మీరు ఏవగించుకుంటున్న స్వభావాన్నే మీరూ ప్రదర్శించటం వింతే! చూడాలనుకుంటే, గత అరవయ్యేళ్లలో జరిగిన అభివృద్ధీ కనిపిస్తుంది. సమస్యలనేవి అన్ని దేశాల్లోనూ ఉండేవే. అలాగే మన సమస్యలు మనవి. మెల్లిగా అవి పోతాయి, కొత్తవి పుట్టుకొస్తాయి.

Unknown

నేను ఏ భావంతో అయితే ఈ పోస్ట్ రాశానో దాన్ని నేను సరిగా వ్యక్తపరచలేకోయాను అన్నది కొందరి కామెంట్లని బట్టి అర్థమవుతోంది.. ఒక్కటి మాత్రం ష్యూర్ మనషుల్ని ఏ విధంగానూ ద్వేషించడం నచ్చని నైజం నాది. ఈ పోస్ట్ ద్వారా ఎవరైనా నొచ్చుకుంటే, లేదా ఎవరికైనా ఈ పోస్ట్ వెనుక నా భావం అంతుపట్టకపోతే సింపుల్ గా ignore చెయ్యంఢి. ఈ పోస్ట్ విషయమై వచ్చే కామెంట్లను నేను ఇకపై పట్టించుకోదలుచుకోలేదు. ఒక దశలో పోస్ట్ ని ఉపసంహరించుకుందామా అన్న ఆలోచన వచ్చింది.. కానీ నా భావంలో ఔన్నత్యం టాపిక్ ఇందరికి ఇన్ని రకాలుగా అర్థమైన తర్వాత కూడా నా మనసులో అంతే స్పష్టంగా ఉండి, అందులో ఎంతో స్వచ్ఛత ఉన్నప్పుడు ఈ పోస్ట్ ని డిలీట్ చెయ్యడం సమంజసం అన్పించలేదు. అందుకే ఇకపై కామెంట్లకి ప్రతిస్పందించకూడదు అని నిర్ణయించుకున్నాను. దయచేసి నేను ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నానో అన్నది అర్థం చేసుకుని ఇక ఈ టాపిక్ పై కామెంట్లకు రిప్లైలు ఆశించకండి. ధన్యవాదాలు.

Vamsi Krishna

Sridhar,
good post. In fact a very good post but somehow seems like you failed miserably in putting across the point. Partially credit goes to human nature. People go defensive when they were offended rather than introspecting. No wonder it happened here also.. So next time make sure you convey the point and at the same time let the readers take it in good spirit.


ఇక దేశం గురుంచి దేశ భక్తి గురుంచి మాట్లాడాలి అంటే aug 14thన advanced independence dayతో start అయ్యి aug15th happy independece day చెప్పుకుంటూ aug 16thna "we are independent" అనుకుని జన్ 26th వరకు మల్లీ దేశం కాని దేశ భక్తిని కాని తలుచుకోకపోవడమే.. కాని అంత కంటే ఎక్కువ కూడా expect చెయ్యడం మూర్కత్వమే అవుతుందేమో.... just ఒక్క సారి ఆలోచించండి... నేను ఈ దేశంలో పుట్టాను కబట్టి ఈ దేశాన్ని ప్రేమించాలి అంత కంటే మించి వేరే reason కనపడనంత స్తితి మనది. (I mean, we are incredibly blind not that there are no reasons.) seems like its a condition to 'love your country "unconditionally"'.. అటువంటి పరిస్తితిలో దేశం - దేశ భక్తి అన్న పదాలు aug15th మాటల నుంచి day-to-day lifeలొ చేతలకి వెల్లకపొవడంలో అశ్యర్యం లేదు.. దేశం - దేశ భక్థి అన్న పదాలను వదిలేసి ఇంకేదైనా కొత్త పెర్లు పెట్టి new brandతొ marketing చేస్తె ఏమైనా లాభం వుంటుందేమో....

There is no point in celebrating independence day just to remind us that "we are Indians and proud to be Indian" once/twice in a year.

-- Vamsi

Vamsi Krishna

Sridhar,

BTW I hope my previous comment regarding your writing is not offensive. It was not at all my intended to be offensive. Supposed to be a suggestion. If its offensive I am really sorry.

--Vamsi

Budugu

శ్రీధర్ గారు, మీరు చెప్పాలనుకున్నది సరిగా చెప్పలేకపోయారు అనుకుంటా. దేశ భక్తి, దేశ సేవ గురించి చెప్పడానికి 'గత ఏడాది కాలంలో దేశం కోసం నేను చేసిన పది మంచి పనులు ' అని 1), 2) 3)..10) అంటూ మీరు చేసినవి వివరిస్తే అందరికీ అర్థమవుతుంది దేశ సేవ చేయడం ఎంత సులభమో.

తద్వారా అవి అందరికీ ఆదర్శప్రాయమవుతాయి, కనీసం కొందరన్నా అందులో కొన్ని అయినా చేస్తారు.

నేనుసైతం

శ్రీధర్ గారు బాగా చెప్పారు. మీరు చెప్పింది అక్షరాల నిజం. చాలా మంది (ఎక్కువశాతం) అలానే ఉన్నారేమో అని నా అభిప్రాయం. ఇక కృష్ణారావు గారు వ్యక్తపరిచిన భావాలు నన్ను దిగ్భ్రమ లోకి దీంచాయి. ఆయన ఎప్పుడు సూటిగా , చక్కగా వక్తపరచడమే నాకు తెలుసు. అయితే ఈ పోస్ట్ లో ఆయనను అంతగా బాధపెట్టిన విషయం ఏమిటో నాకు అర్ధం కాలేదు. మనసు ఎంతగానో రగిలితేనే అలాంటి మాటలు వస్తాయి. ఈ వాక్యం చూడండి "PRACTICAL వీరు చేసిన మంచి పనులు, సహాయం ఏమిటో చెప్పరు (అసలు చెస్తేకదా)". so ఎవ్వరూ చెయ్యరు అని ఆయనే డిసైడ్ చేసారు. నాకు చెప్పాలని లేదు కాని ఆయన అన్న మాటలకు చెపుతున్నా వినండి. నేను ప్రతి ఏటా ఒక పేద విద్యార్ది చదువుకు అవసరమయ్యే ఆర్ధిక సహాయం చేస్తాను, ట్రాఫిక్ రూల్స్ తప్పని సరిగా పాటిస్తా, ఇప్పటి వరకు ఒక్క సారి కూడా జరిమానా పడలేదు, అన్ని టాక్స్ లు క్రమం తప్పకుండా చెల్లిస్తాను, భావి తరాలకు ఇబ్బంది అవుతుందని , పొల్యూషన్ కంట్రోల్ కి రావటం లేదని నా కార్ అమ్మేశా అతి తక్కువ ధర కి. నాకు తెలిసినవి అందరికీ చెపుతుంటా ,తప్పని సరిగా వోటు హక్కు ను వినియోగించుకుంటా, ఇప్పుడు నేను వుంటున్న ఊరిలో నాకు పేరు నమోదు లేనప్పుడు నా స్వగ్రామానికి వెళ్ళేవాడిని కేవలం ఓటు వేయడానికి తెలియని విషయాలు నాకు తెలియవు అని చెప్పి ఎంత చిన్న వారి దగ్గర నుంచైనా తెలుసుకోడానికి ఇష్టపడతాను ఇవన్ని చాలా చాలా చిన్న విషయాలు కాని చాలా మంది పాటించరు. సో అందరు చెయ్యరని అనడం సబబు కాదేమో కృష్నారావు గారు? జనం జనం కలిస్తేనే కదా దేశం. దేశం లో ఎక్కువమంది పాటించని విషయాలు శ్రీధర్ గారు చెప్పారు. అంతేకాని మిమ్మల్ని కాని ఏమీ అనలేదు.

దేశమంటే ఫిజికల్ గా మేప్ లో మాత్రం కనిపిస్తుంది. దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులో అన్నారు మహాకవి గురుజాడ.మనం దేశభక్తి గురించి ఆగస్ట్ 15 రోజు తప్పించి అంతకన్నా ఎక్కువ ఆలోచించడం అనవసరం అన్నారు వంశీకృష్ణగారు. మన దేశసంస్కృతి గురించి ,మక్కా మసీదు లో పేలుళ్ళు జరిగిన రోజు అక్కడ అన్ని మతాల వారు సహాయక చర్యల్లో పాల్గొన్నారు, అదే అమెరికా లో సెప్టెంబర్ 11 దాడులు జరిగినపుడు నేను అక్కడ ప్రత్యక్షంగా వున్నా,వారు భారతీయులను ఎంత దూషించారంటే మాటల్లో చెప్పలేను. అమెరికాలో ఎంతో డిసిప్లైన్ పాటించే ఇండియన్స్ కొంత మంది, ఇండియా కి రాగానే విమానాశ్రయం లోనే రూల్స్ అతిక్రమించడం చూసాను. ఇలాంటి వారిని చూశాను, రూల్స్ తప్పని సరిగా పాటించే NRI's ని కూడా చూసాను. పగవాడికి కూడా ఆపదలో సహాయపడటం లాంటివి మన భారతీయ రక్తం లోనే వుంది. అంత గొప్ప సంస్కృతి గురించి రోజూ తలచుకున్నా తప్పు లేదని నా అభిప్రాయం. ఇంకా సత్య గారు చెప్పినట్లు కేవలం డొనేషన్స్ ఇచ్చినంత మాత్రాన భారతదేశం అభివృద్ధి చెందదు అన్నారు. నిజమే చాలా కరక్ట్ గా చెప్పారు,నేను పూర్తిగా ఏకీభవిస్తాను ఈ విషయం లో .

శ్రీధర్ గారి మనోభావం మనం అందరం మంచి క్రమశిక్షణ పాటిస్తే తప్పకుండా మన వ్యక్తిగత జీవితాలు అభివృద్ధి చెందుతాయి తద్వారా భారతదేశం అభివృద్ధి లోకి వస్తుంది అని ఆయన అభిప్రాయం అనుకుంటా. మన కెరీర్ అభివృద్ధి చెందితేనే మన కుంటుంబం అభివృద్ధి
చెందుతుంది, దానితో పాటే సమాజం, రాష్ట్రం,దేశం అన్నీను. మన కెరీర్ గురించి మనం ఎంత కష్ట పడుతున్నామో దానిలో కొంచెం తక్కు వ కష్టం తోం మన సామాజిక జీవితం లో కొంచెం క్రమశిక్షణ పాటిస్తే మన దేశం అభివృద్ధి చెందుతుందని ఈ వ్యాసకర్త అభిప్రాయం అని నాకు అనిపిస్తోంది.

దయచేసి ఈ దేశభక్తి వ్యాసాన్ని "వ్యక్తిగత బ్లాగర్ల మీద గురి పెట్టడం" భావ్యం కాదేమో అని అనిపించింది.

భారతదేశం లో క్రమశిక్షణ పాటించే వారిలో చాలా మంది వున్నారు కాని ఆ "చాలా మంది" శాతం కనీసం 90% వుంటే , ఈ అవినీతి రాజకీయాలు వుండవేమో?? ఏదైమైనా శ్రీధర్ గారి చెప్పిందాంట్లో అసలు విషయం పక్కకు జరిగి మిగిలిన విషయాలు చర్చించడం సబబు కాదేమో..ఇలాంటి విషయాలు స్పృశించడం ఎలా అయినా కత్తి మీద సాము లాంటిదే బ్లాగర్లందరికీ ... అని నాకు అనిపిస్తుంది.

Kathi Mahesh Kumar

వ్యాసకర్త ఆవేదనని అర్థం చేసుకోకుండా కేవలం వారి "నిజాన్ని" బయటపెట్టిన విధానంమీద అక్కసు వెళ్ళగక్కినట్లు కొన్ని వ్యాఖ్యలు అనిపించాయి. మనం జీవించే బిజీలో ప్రేమలూ,సంబంధాలూ లాంటి వాటికి ఈ కాలంలో ప్రాముఖ్యత తగ్గినట్లే "దేశభక్తి"కి కూడా "డిమాండ్" తగ్గింది. అదొక రిచ్యువల్ గా చేస్తున్నామేగానీ నిజంగా అనుభవించలేకపోతున్నామని చెప్పడం నిజంగా అంత పెద్ద తప్పుగా నాకైతే అనిపించలేదు.

శ్రీధర్ గారూ, మా నిజాన్ని మాకు పరిచయం చేసినందుకు నా అభినందనలు.

krishna rao jallipalli

శ్రీధర్ గారు.. నా comment కొంచం పక్క దారి పట్టిన మాట వాస్తవం. క్షమాపణలు.
నేను సైతం గారికి.. ఇదే నేను కోరుకునేది.. ఎవరు చేసిన మంచి పనులు తపాల ద్వారా చెప్తే.. అది చదివిన కొంత మందికి ఆయినా స్ఫూర్తి కలుగుతుంది కదా. మరి ఎవరూ ఆ పని చేయడం లేదు. నా విమర్శ అందరి bloggers మీద కాదు.. కొంత మంది మీద మాత్రమె. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.
శ్రీధర్ గారు.. అందుకే ఇకపై కామెంట్లకి ప్రతిస్పందించకూడదు అని నిర్ణయించుకున్నాను. దయచేసి నేను ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నానో అన్నది అర్థం చేసుకుని ఇక ఈ టాపిక్ పై కామెంట్లకు రిప్లైలు ఆశించకండి. ధన్యవాదాలు' మంచి decision కాదు. అర్థం చేసుకోలేక పోతున్నాను.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008