Saturday 25 October 2008

హలో! బకరా అవుతారా?




హలో!!

హలో! ఎవరూ? ఎవరు కావాలి?

నమస్కారం. పద్మగారా? మేము తుస్ ఫుస్ మ్యూజిక్ కంపెనీ నుండి మాట్లాడుతున్నాము. మీరు బాగా పాడతారని తెలిసింది. మేము కొత్త గాయకులతో ఒక ప్రయోగం చేయాలనుకుంటున్నాము మీరు ఒక్కసారి మీ పాట వినిపించగలరా? మాకు నచ్చితే మీతో ఒక పాటల సిడి విడుదల చేస్తాము. తర్వాత సినిమా మ్యూజిక్ డైరెక్టర్లకు కూడా పరిచయం చేస్తాము.

అమ్మా! మ్యూజిక్ కంపెనీ నుండి కాల్ వచ్చింది. నా పాటలతో సిడి చేస్తారంట.

తొందరగా పాడండి మరి.

"మరుగేలరా ! రాఘవా! మరుగేలరా! రాఘవా!

చాలండి మీరు చాలా బాగా పాడుతున్నారు .సెలెక్ట్ చేసాము. మా ఆఫీసుకు వస్తె అగ్రిమెంట్ చేసుకుందాము.

సరేనండీ. ఎప్పుడు రమ్మంటారు?

హహహహా.. మేము ఫలానా FM చానెల్ నుండి మాట్లాడుతున్నాము. మిమ్మల్ని పొద్దున్నే బక్రా చేసాము . మిమ్మల్ని బక్రా చేయమని మీ స్నేహితులు మాకు చెప్పారు . ఉంటాము మరి. బై?
??????????????????





హలో!
హలో! ఎవరు కావాలి?

గుడ్ మార్నింగ్. మీ పేరు రమేష్ ..

అవునండి నేను రమేష్ నే. ఏంటి సంగతి.

నా పేరు రమ్య అండి. నాకు ఒక పర్సు దొరికింది.అందులో కార్డు చూసి మీకు కాల్ చేస్తున్నాను. మీదేనా?

కాదండి. నేను నా పర్సునెప్పుడూ పోగొట్టుకోలేదు.

ఇది మీదేనండి. మీ పేరు పులిపాటి రమేష్ కద. మీరు బ్యాంకులో పని చేస్తున్నారు. ఇది మీ నంబరే కదా.

అవునండి. ఇవన్నీ మీకెలా తెలుసు?

ఎలా తెలుసేంటి మీ పర్సులో డబ్బులు, కార్డులు, కొన్ని పేపర్స్ ఉన్నాయి.అవి చూసి మీకు అందచేద్దామని కాల్ చేసాను. చెప్పండి. ఎప్పుడొచ్చి తీసుకుంటారు.

నాది కాదంటుంటే తీసుకోమంటున్నారేంటి. అసలు మీరెవరు. నా నంబర్ మీకెలా తెలుసు.

నేను పంజగుట్ట దగ్గర ఉన్నాను. వచ్చి తీసుకోండి.

అసలు మీరెవరో చెప్పండి. అప్పుడు తీసుకుంటాను.

హహహహహ... నేను ఫలానా FN చానెల్ నుండి మాట్లాడుతున్నాము. ఇవాళ మిమ్మల్ని బక్రా చేయమని మీ కొలీగ్ మాకు SMS ఇచ్చారు. ఖంగారు పడ్డారా? ఉంటామండి. బై.



హలో! సరస్వతిగారు ఉన్నారా?

హలో! నేనే సరస్వతిని . ఎవరు మాట్లాడేది?

నమస్కారం. మీరు సరస్వతినే కదా.

ఔను. నేనే సరస్వతిని. ఏం గావాలె.

నా పేరు సుజాత అండి. నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చెసాను. మీరు కోపం తెచ్చుకోవద్దు. అలా అని మాటిస్తే చెప్తాను మరి.

ఎందా విషయం. చెప్పకుండా కోపం తెచ్చుకోవద్దంటవేంది? చెప్పు ముందు.

అలా కోపం తెచ్చుకోవద్దు మరి.

సర్లేవమ్మ. చెప్పు ముందు.నాకు వంట పని ఉంది.

మరి. నేను మీ అబ్బాయి కిరణ్ ప్రేమించుకుంటున్నాము. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము. కిరణ్ ఏమో నన్ను మీతో మాట్లాడమన్నాడు.

ఏంది. మల్ల చెప్పు.

కిరణ్, నేను రెండేళ్ల నుండి కలిసి తిరుగుతున్నాము. నేను సినిమా స్టారులా కాకున్నా అందంగానే ఉంటాను. ఉద్యోగం చేస్తున్నాను. మంచి అమ్మాయిని. కిరణ్ అంటే నాకు చాలా ఇష్టం. మీరు కాదనకండి ప్లీజ్.

అసలు నువ్వెవరు. ఇదంతా ఏంది. అసలు నంబర్ ఎలా తెలిసింది. సరిగ్గా చెప్పు. నాకేమి సమజ్ ఐతలేదు.

మాది మధ్యతరగతి కుటుంబం అండి. కట్నం ఇచ్చుకోలేము. కాని పెళ్లయ్యాక నా జీతం మొత్తం మీకే ఇస్తాను. ఒప్పుకోండి. మా ప్రేమను గుర్తించండి.

అసలు ఎవరు నీవు. ఏంగావాలే. మావాడు ఎలా తెలుసు. అది చెప్పు ముందు. కట్నం , పెళ్లి సంగతి తర్వాత? పొద్దున్నే దిమాగ్ ఖరాబ్ చేస్తున్నవ్ ..

హహహహహా. నేను ఫలానా FM చానెల్ నుండి ఫోన్ చేస్తున్నామండి. మిమ్మల్ని బక్రా చేసాము. అసలు మీ కిరణెవరో నాకు తెలీదండి. ఉంటామరి. బై.



హలో!

హలో! ఎవరు?

నమస్తే అండి స్వాతి ఉందా.

పడుకుంది. ఎవరు మాట్లాడేది.

నేను స్వాతి కాలేజ్ నుండి కాల్ చేస్తున్నాను. ప్రిన్సిపాల్ గారు ఒక ముఖ్యమైన విషయం చెప్పమన్నారు. కాస్త స్వాతిని నిద్ర లేపుతారా? తనకు చెప్పాలి.

సరే ..ఆగండి.. స్వాతి నీకు కాలేజ్ నుండీ ఫోన్..వచ్చి మాట్లాడు.


హలో! ఎవరు?

నేను మీ కాలేజ్ ఆఫీసునుండి ఫోన్ చేస్తున్నాను. ఇవాళ మీకు కాలేజ్ ఉంది అని చెప్పడానికి.

అదేంటి! ఇవాళ మాకు హాలిడే కదా.

అవును కాని. గంట క్రితమే మేడం విషయం డిసైడ్ చెసారు. అందరికి చెప్పమన్నారు. కాలేజ్ ఉంది. అలాగే సాయంత్రం టెస్ట్ కూడా ఉంది తప్పకుండా రావాలి అని చెపప్మన్నారు. మరి గంటలో నువ్వు కాలేజికి వచ్చేయాలి.

సరే వస్తాను. నిజంగా కాలేజ్ ఉందా. మీరు కాలేజ్ నుండే కాల్ చేస్తున్నారా?

హాహహహ.. మేము ఫలానా FM చానెల్ నుండి కాల్ చేస్తున్నాము . మిమ్మల్ని బక్రా చేయమని మీ తమ్ముడు మాకు కాల్ చేసి చెప్పాడు. పొద్దున్నే మిమ్మల్ని బక్రా చేసాము. ఇక వెళ్లి పడుకోండి. బై..



హలో!

హలో! . ఎవరు మీరు?

నమస్కారమండి. నా పేరు షర్మిల. నేను అమెరికాలో ఉంటాను. రెండు రోజుల క్రింద హైదరాబాదు వచ్చాను. ప్రవీణ్ తో మాట్లాడాలి. ఉన్నారా?

లేరు. ఆఫీసుకు వెళ్లారు. ఆయనతో ఏం పని? ఆయన మీకెలా తెలుసు?

మరే. నేను ప్రవీణ్ నెట్ ఫ్రెండ్స్ మి. చాలా క్లోజ్ . రోజూ చాట్ చేస్తుంటాము. హీ ఈజ్ లవ్లీ పర్సన్.నాకు అతను బాగా నచ్చాడు. ఇప్పుడు అతనిని పర్సనల్గా కలవాలని అనుకుంటున్నాను. నాంపల్లి బస్స్తాండ్ దగ్గర ఉన్నాను. అతనికి కాల్ చేస్తే నన్ను పికప్ చేసుకుంటాడని చేసాను. ఇండియాలో ఉన్న నెలరోజుల్లో అతనితో ఇంకా క్లోజ్ అయ్యి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇప్పుడెలాగ. ఆయన ఆఫీసు నంబరు లేదా సెల్ నంబరు ఇస్తారా ప్లీజ్.

ఏంటి . ఇదంతా నిజమేనా. మీరిద్దరు అంత క్లోజా..రోజూ మాట్లాడుకుంటారా?

అవునండి. ఇంతకీ మీరెవరు?

నేను ఆయన భార్యను. మాకు ఇద్దరు పిల్లలు కూడా.


హహహహ్. పూర్ణిమగారు .. భయపడ్డారా? మేము ఫలానా FM చానెల్ నుండి కాల్ చేస్తున్నాము. మిమ్మల్ని బక్రా చేయమని మీ తమ్ముడు మాకు చెప్పాడు. ఉంటాము మరి.ఎంజాయ్ యువర్ డే. బై..

>>>>>>


ఫలానా FM స్తేషన్..

సార్! బక్రా ప్రోగ్రాం ని అభినందించడానికి పదిమంది వచ్చారు. టీమ్ ని పిలవమంటున్నారు.
సరే . లోపలికి పిలువు వాళ్లని.
"ఏరా తలకుమాసిన వెదవల్లారా? మీకు పనీపాట లేదురా? అన్నీ పిచ్చి పిచ్చి ప్రోగ్రాములు చేస్తున్నారు. బక్రా ప్రోగ్రామ్ ఏంటి. అసలు ఐడియా ఇచ్చింది ఎవరు. ఇష్టమొచ్చినట్టు జనాలను వెదవలను చేసి నవ్వుకుంటార్రా దొంగసచ్చినోళ్లారా? ఎవడో చెప్పాడని మాకు కాల్ చేసి ఎదవ వాగుడు. అనవసరంగా అందరిని తెన్షన్లో పెడతారు. ఒకోసారి కాపురాలు కూల్చెసే మాటలు. అసలు మీరేమనుకుంటున్నారు. మీ చానెల్ నడవడానికి ఇంతకంటే మంచి ఐడియాలు దొరకట్లేదా. తిన్నదరగడంలేదా. రేపటినుండి ప్రోగ్రామ్ మళ్లీ వినిపించిందో, మళ్లీ ఎవరికైనా ఇలా కాల్ చేసి సతాయించారో. మీ స్టూడియో మొత్తం ద్వంసం చేస్తాం బిడ్డా. ఏమనుకుంటున్నారో. బుద్ధిగా పాటలేసుకుని బ్రతుకు. కాని ఇలాంటి చెత్త ఐడియాలతో జనాలని సతాయించాలని చూసారో బాగుండదు మరి. ఖబడ్దార్.

7 వ్యాఖ్యలు:

Ramani Rao

హ హ హ FM లేమి కర్మ ఈ భాగోతం టి వి ఛానెల్స్ లో కూడా ఉందిగా. కాకపోతే ఇక్కడ కాస్త తిరగా రాసుకోవాలి, ఏదో నంబర్ చెప్తారు, SMS పంపమంటారు. కూటి కోసం కోటి విద్యలన్నట్లు, డబ్బుకోసం కోటి ఛానేల్స్, కోటి FM ప్రోగ్రాంస్. అందుకే అసలు మరీ తెలియని నంబర్ వస్తే నేను నా సెల్ ఫోన్ లిఫ్ట్ చేయను.

shaneer babu

జ్యోతి గారూ..మీ టపా చాలా ఫన్నీగా వుంది. ఈ టపా ఇన్స్పిరేషన్ తో త్వరలో నాబ్లాగ్ లో నవ్వకుండా వుండగలరా? అనే శీర్షికతో కార్టూన్లు ఉంటాయి చూడండే(...

Kottapali

good one.

krishna rao jallipalli

ఆ చానెల్ పేరు వీలు అయితే ఫోన్ నెంబర్ ఇవ్వండి. కాసేపు ఆడుకొంటాను.

సుజాత వేల్పూరి

FM వినాలంటే భయం కలింగించేట్టు తయారవుతున్నాయి కొన్ని కార్యక్రమాలు. "మీరెప్పుడైనా ఎవరికన్నా చెవిలో పువ్వెట్టారా" అనే కార్యక్రమం కూడా ఉందంటే నమ్ముతారా! "అవునండీ నేను మా ఆయనకు చాలా సార్లు పువ్వెట్టాను" అని చెప్పే నారీమణుల గురించి ఆ ప్రోగ్రాం లోనే విన్నాను. మతి పోయింది.

netizen నెటిజన్

@సుజాత: నిజమా?!

జ్యోతి

పైన నేను చెప్పిన సంఘటనలు కల్పితం కాదు. నేను తరచుగా ఆ చానెల్ లో విన్నది. అలా ఫోన్ చేసి విసిగించింది కాకుండా రేడియోలో కూడా వినిపిస్తారు. అది మరీ దారుణం కదా.

కృష్ణారావుగారు,
మీకు ఆ చానెల్ నంబరు పంపిస్తాను. కాని వాళ్ళు మీమాటలు వింటారా అని?

భగవాన్‍గారు
మీ కార్టూన్ల కోసం ఎదురుచూస్తు ఉంటాము.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008