Saturday, January 10, 2009

భక్తా !!! పాహిమాం... రక్షమాం.
అందరూ బావున్నారా? నేనా!! ఏం బాగులేండి. చూస్తూనే ఉన్నారుగా. కలి ప్రభావం తీవ్రతరమైనట్టనిపిస్తుంది. లేకుంటే నేను!!! మిమ్మల్నందరిని రక్షించే దేవుడిని .. మిమ్మల్నే శరణు వేడటానికి ఇలా వచ్చాను. రాక తప్పలేదు మరి. మీకు కష్టాలుంటే నా దగ్గరకొచ్చి మొరపెట్టుకుంటారు. ఇదేంటి రివర్స్‌గా నేనే అడుగుతున్నానుకుంటున్నారా? ఏం చేస్తాం బాబు.. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నట్టు మీ కష్టాలు మీవి. నా కష్టాలు నావి. నమ్మట్లేదా? ఐతే కాస్త ఆ టీవీ గట్రా కట్టేసి నా గోడు చెప్తా వినండి.

అలనాడు దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం దివిలోని దేవతలు భూమిపై అవతరించారు .. మీకు తెలుసుకదా. మాకు గుళ్లు, గోపురాలు కట్టి పూజలు చేస్తున్నారు. హ్యాపీస్. మరి ఇప్పుడేమైంది అంటారా? ఇప్పుడు కూడ చాలా గుళ్లూ గోపురాలు ఉన్నాయి. అసలు సంగతేంటంటే.. మమ్మల్నే అంటే దేవుళ్లనే ఒక వ్యాపార వస్తువులుగా చేసుకుంటున్నారు. మేమేమో గర్భగుడి దాటి మహిమలు చూపలేము, మాట్లాడలేము, శిక్షించలేము. మౌనంగా చూడక తప్పదు. మీరేమో భక్తితో ఎన్నో ప్రయాసలకోర్చి , బస్సులు, రైళ్లు, కార్లలో కిందా మీదా పడి మా దగ్గరకు వస్తారు. మీకు తోచినట్టుగా కానుకలు హుండీలో వేస్తారు. నన్ను చూసిన ఆనందం, తన్మయత్వంతో మిమ్మల్ని కాపాడుకోవడానికి నేనున్నానన్న ధైర్యంతో తిరిగి వెళతారు. రైట్. కాని ఇప్పుడు అన్ని .. దాదాపు అన్ని గుళ్లలో అన్యాయం జరుగుతుంది. అటు మీకు న్యాయం జరగదు, ఇటు నన్ను వాడుకుంటున్నారు. ఎలా అంటారా? ఇందులో ప్రముఖులు పూజారులు, అధికారులు. భక్తులు ఇచ్చే కానుకలు సగం నొక్కేసి సగం మాత్రమే లెక్కలు చూపిస్తున్నారు. ఆ నొక్కేసినవి పంచుకోవడం. జీతం కంటే గీతం ఎక్కువైతే ఎవడు మాత్రం నోరిప్పుతాడు. ఆఖరుకు హుండీ లెక్కలు చేసేటప్పుడు కూడా బంగారం వగైరా కొట్టేస్తున్నారు. మరి ఆ సిసి టీవీలెందుకో తగలెయ్యనా? నన్ను గర్భ గుడిలో బంధించేసి సామాన్య భక్తులను దూరంగా పెట్టి, అసమాన్య (డబ్బులు మంచినీళ్లలా ఖర్చు పెట్టే బడాబాబుల్) భక్తులను వెంట తోడ్కొని మరీ నాకు సేవలు చేయిస్తున్నారు. ఆ తిరుపతిలో ఐతే మరీ దారుణం. ప్రతీ దేవుడిని, దేవతను వ్యాపర వస్తువుగానే చూసి మోసం చేస్తున్నారు ఎందరో. నాకైతే ఏమీ పాలుపోవడం లేదు.

ఈ అవినీతిపరులకు దోచుకోవడానికి తెలియని విషయమే లేదేమో. టికెట్లు, పూజలు, సత్రాలు , ప్రసాదాలు ... ఇలా ఎన్నో ఎన్నెన్నో. దేవుడు అందరివాడు అనే నానుడి తప్పేమో. వీళ్లు దేవుడిని కాసులున్నవారికే చూపిస్తున్నారు. ప్రతి పండగ ఈ దోపిడీదారులకు కాసుల పంట. వినాయకచవితి వస్తే అదో ఆదాయం, బోనాల పండగ వచ్చినా, దసరా వచ్చినా , భక్తుల కంటే వీళ్లకే ఎక్కువ ఆనందం ఆదాయం. అమ్మవారి గుళ్లలో భక్తులిచ్చే చీరలు అధికారులు, పూజారుల ఇళ్లకు తరలి వెళుతున్నాయి. మరి కొందరు పుణ్యాత్ములు అదే గుడిలో గ్రహ శాంతి, జాతక్ దోశాలు అని దుకాణాలు పెట్టి భక్తులకు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారు. ఆడవాళ్లను కూడా మోసగించే పూజారులెందరో.. వాళ్లను ఎలా అపాలో అర్ధం కాదు. ఇదంతా చూస్తు నేను పెదవి విప్పలేకున్నాను. ఒకోసారి పారిపొదామనిపిస్తుంది. కాని ఎంతో భక్తితో వచ్చే మీకొసం ఇలా నిలబడి ఉన్నాను.

నాకు తోచిన చిన్న పరిష్కారం చెప్పనా. మీరు ప్రయాసపడి , ఇన్ని క్షేత్రాలకు రావల్సిన పనిలేదు. మీ ఇంటిలోనే, వీధిలోనే వెలసిన దేవుడిని గుర్తించండి. ఎక్కడైనా నేనే. మీ మొక్కులన్నీ అక్కడే తీర్చుకోండి.నాకు చేరతాయి. డబ్బులుంటే బీదవారికి, అన్నార్థులకు సహాయం చేయండి. నాకు నైవేద్యం పెట్టినట్టుగా సంతోషిస్తాను. ఇలాగైనా కొద్దిరోజులాగి నన్ను ఉపయోగించుకుంటున్న యాత్రా స్థలాలనుండి మాయమైపోతాను. నన్ను మీ మనసులోనే చూసుకోండి. ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. అనవసరంగా లంచగొండులను, దగాకోరులను పెంచకండి. మీ అమాయకత్వాన్ని ఉపయోగించుకుని నాతో, మీతో వ్యాపారం చేస్తున్నారు దరిద్రులు.

6 వ్యాఖ్యలు:

పరిమళం

జ్యోతి గారూ ! దేవుడు మాట్లాడితే ఇలాగే బాధ వెళ్ళగక్కుకుంటాడేమో."డబ్బులుంటే బీదవారికి, అన్నార్థులకు సహాయం చేయండి. నాకు నైవేద్యం పెట్టినట్టుగా సంతోషిస్తాను".నిజమే నండీ ...మానవ సేవే మాధవ సేవ కదండీ .

మధురవాణి

దేవుడా..
నీక్కూడా ఎన్ని కష్టాలు నాయనా :(

durgeswara

భగవంతుని పేరుతో దోపిడీ చేస్తున్నారన్నది నిజం.మరి అది తెలిసి మనం కనీసం ఏదైనా ప్రతిఘటన చూపామా? లెదే? ఎందుకని? అదే మనస్వంత విషయమైతే ఇలానే వదలెసి వెళ్ళి వస్తామా? రాము.ఎందుకని? అదే మన స్వంతవాళ్ల సొమ్మును ఎవరన్నా దోచుకుంటుంటే చూస్తూ వచ్చేస్తామా? లేదు. ఎందుకని? భగవంతుడు మనవాడు అన్న భావం మనకు లేదుకనుక.మనకు కోరికలు తీర్చాలంతవరకే అయన. మనకు ప్రేమకంటే వ్యాపార దృక్పథం మనసులో వున్నదేమో ఆలోచించండి.గొప్ప ఆపదలో వున్నప్పుడు ఆయన కోసం ప్రార్ధించిన మనం ఆస్తానాన్ని పవిత్రంగా వుంచటం కోసం ఏదన్నా ప్రయత్నము చేస్తామా?

అసలు దేవాలయాలంటే ఏమిటో తెలుసుకోండి ముందు. మన చుట్టూ గాలి వుంటుంది ,కానీ దానిని సైకిల్ ట్యూబ్ లోనికి ఎక్కించాలంటే ఎలాకుదురుతుంది. సైకిల్ పంపనే పరికరమ్ వుంటేనే అది సాధ్యమవుతుంది. విష్వవ్యాపితముగా అణువణువునా విరాజిల్లుతున్న పరమాత్మ శక్తిని మనలోకి ఆహ్వానించుకోవటానికి మహర్షులు సిద్దపరచిన పరికరమే ఆలయం. కొన్ని ప్రత్యేక కొలతలద్వారా ఆలయాన్ని నిర్మించి మంత్రజపముతో పరమాత్మ శక్తిని ఆహ్వానించి జడమైన పదార్ధాల[విగ్రహాలలోకి]ప్రసరింపజేసి చైతన్యవంతమ్ చేసి అక్కడనుండి భక్తులపైకి ఆశక్తి ప్రసరించేలా ప్రార్ధనా పూర్వకంగా సిద్దపరచబడిన శక్తి కేంద్రాలు ఆలయాలు. భక్తులు తమ నిరంతర ప్రార్ధనలద్వారా ఆశక్తిప్రసారాన్ని పెంచుకుంటూ పవిత్ర వాతావరణాన్ని కాపాడుకుంటూ రావలసిన మనస్వంత ఆస్తులివి. భగవంతునికి మనం పూజ చెసినా చేయకున్నా లోటేమీ లేదు.మనమ్ తలుపుతెరిచినప్పుడు వుండి,కాపాడుతూ తలుపులు వేసి గడియలు పెట్టినప్పుడు కూడా క్షమించి
మనకోసం ప్రేమతో ప్రసారమవుతున్న ఆపరమాత్మ అనుగ్రహ కేంద్రాలను కాపాడు కోవలసిన బాధ్యత ఎవరిది? కాపాడు కోకుంటే నష్టం ఎవరికి?మనకే.
అది గమనించండి.
కలి యుగాధినేతయిన కలి పురుషుని సంకల్పముతో అతని మాయజాలమ్ భక్తులను మభ్యపరచి భగవంతుని నుండి దూరము చేయటానికి తీవ్రప్రయత్నాలు చేస్తున్నాడు.అవే మీకు కనడుతున్న భౌతిక కారణాలు. ఏదోవిధముగా ఆలయాల పవిత్రతను దూరం చేసి తద్వారా భక్తులకు దైవంపై నమ్మకాన్ని తొలగించేప్రయత్నం ఇది.ఆలయాలను,దైవాన్ని ధర్మాన్ని నిందిస్తూ సాగుతున్న ప్రచారాలుఅన్నీ ఇందులో భాగమే. కనుక భక్తులైన వారు కూడా ఆ మాయకు లోబడి ఇలా ఆలయాలకు వెళ్లాల్సిన పనిలేదు,వాళ్లు ఇలా ,ఇక్కడ అలా అలా అని వూరికే ముచ్చట్లతో పొద్దుపుచ్చితే నష్టం ఎవరికి?

కనుక భగవంతుని పట్ల నిజమైన ప్రేమ వున్నట్లయితే దురాచరాలను ఖండించటం తో మీ బాధ్యతలను నిర్వర్తించండి.ఎప్పుడూ గుడికెళ్ళి స్వామీ నాకిది కావాలి?అదికావాలి అనే బెగ్గర్లలా కాకుండా బిడ్దలుగా మారి భగవంతుని పట్ల ధర్మం పట్ల ,బాధ్యతలను కూడా గుర్తు చేసుకోండి.మనయోగక్షేమాలు చూస్తున్న భగవంతుని పట్ల మన ప్రేమాభిమానాలు ఎలావున్నాయో ఆయనగమనించేలా పోరాడండి.

సుభద్ర

mundugaa davudi daggaraki vellaka tvaragaa darsanam avvadaaniki lanchalu ivvatam maanaali. nijame anni chotala devudu unnadi.
avasaram ayinavari sayam cheste devudiki chesinatte.bagundi meee post.

Aruna

@Durgeswara Garu
*Claps*
బాగా చెప్పారు.

@Jyothi garu

మీ బాధ సహేతుకం. కానీ భగవంతుని శక్తి(హేతువాదుల మాటల్లో చెప్పాలి అంటే పాజిటివ్ ఎనర్జీ) కొన్ని ప్రాంతాల్లో స్థిర పరచబడి వుంటుంది. అవే పుణ్య క్షేత్రాలు. అందుకే అక్కడ చేసిన పూజలకి, జపాలకి ఎక్కువ రెట్లు ఫలితం వుంటుంది అని చెప్తారు. కొన్ని ఆలయాలలో తపస్వులు, సాధువులు లోక కళ్యాణానికై తమ తపోశక్తి భద్రపరుస్తారు.

నేస్తం

బాగా చెప్పారు.:)

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008