Tuesday, January 27, 2009

నటనం ఆడెనే....

ముందుగా కొత్తపాళీగారికి ధన్యవాదాలు. వారి మీసం కథతొ నా చిన్నప్పటి నాటకాలు, ప్రోగ్రాములు, మేకప్పులు గుర్తొచ్చాయి..

మొదటినుండి నేను ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు. స్కూలు, ఇల్లు, చదువు అంతే నాకు తెలిసింది. నా మానాన నేను బుద్ధిగా చదువుకుంటుంటే , నా ఎత్తు నన్ను చిక్కుల్లో పడేసేది. క్లాసులో, లైన్లో వెనకాల ఉన్నా. ఏవైనా ప్రోగ్రాములు , డ్యాన్సులు గట్రా ఉంటే మాత్రం ముందు కనిపించేదాన్ని. అలాంటి సంధర్భాల్లో బెంచిలో ఎంత నక్కి కూర్చున్నా సరే తప్పించుకునే వీల్లేకుండా అయ్యేది. హాయిగా నీడపట్టున క్లాసులో ఉందామనుకుంటే ప్రాక్టీస్ అని లాక్కుపోయేవారు.


ఎనిమిదవ తరగతిలో ఒకసారి క్రిస్ట్ మస్ సందర్భంగా ప్రోగ్రాములు పెట్టారు. మాది కాన్వెంట్ కదా. సిస్టర్స్ ఉండేవాళ్లు. అందులో మా ప్రిన్సిపల్ ఒక చండశాసనురాలు. పోలీస్ ఆఫిసర్‌నైనా అందరిముందు దులిపేసేది. మాకైతే ఆమె ముందు కెళ్లాలంటేనే కాళ్లు వణికేవి. ఇక పెద్ద క్లాసులలోకొచ్చి పిల్లలను అలా ఏరుకుని తీసికెళ్లేవారు ప్రోగ్రామ్ ..ఈ ప్రోగ్రామ్ అని. ఇలాంటివి వస్తే కాస్త చదువుకు ఆటవిడుపుగానే ఉంటుంది కాని నాకే కాస్త చిరాకు. మేరీ మాగ్దలీన్ అనే వైశ్య కథను నృత్య నాటికగా వేసారు. నన్ను కూడా సెలెక్ట్ చేసారు. నాకేమో నాటకాలు రావు. ఏదో ఆటలు అంటే ఆడతాను కాని. మాట్లాడేది ఏమీ ఉండదు అని నన్ను ఒప్పించారు మా టీచర్. సరే కదా అని ప్రాక్టీసుకు వెళ్లేదాన్ని. నేను ఏసు ప్రక్కనే కూర్చోవాలి. ఒక్కో సీను రెండు మూడు సార్లు చేస్తుంటే చిరాకేసి , హే తొందరగా చెప్పు అని అరిచా.. అందరూ నవ్వారు. అసలు రోజు వచ్చింది. ఇంటినుండి చారలు కాని, గళ్లు కాని ఉన్న చీర తెచ్చుకోమన్నారు . పిసినారోళ్లు. డ్రెస్సులు ఇస్తే ఏం పోయేది అని తిట్టుకున్నాం.. అదేమో ఏసు క్రీస్తు సమయం నాటి వేషధారణ. సరే అని అమ్మ చీర, ఐ్‌బ్రో పెన్సిల్, పౌడర్, కాటుక దువ్వెన గట్రా తీసికెళ్లాను. ఇంట్లోవాళ్లను సాయంత్రం స్కూలుకు వచ్చేయమని నేను పొద్దున్నే వెళ్లిపోయా.. కడుపులో ఒకటే గుడుగుడు .. భయంతో, టెన్షన్ తో.. ముందేమో డైలాగులు లేవన్నారు కాని. నృత్యనాటిక కాబట్టి వెనకాల చెప్పే ఒకే డైలాగుకు కాస్త పెదవులు కదిపితే చాలు అన్నారు. అదో టెన్షన్. వానపడితే బాగుండు అనుకున్నా. డిసెంబర్‌లో పడవనే ఆలోచన కూడా రాలేదు.


ఇక మొహాలు కడుక్కుని తయారవుతుంటే మేకప్పు చేస్తారని తెలిసింది. వింత వింతగా ఉండింది. మొదటిసారి మొహానికి క్రీములు ఏవేవో పూస్తుంటే చల్లగా, చక్కిలిగిలిగా అనిపించింది. అందరం నవ్వాపుకోలేకపోయాం. మాదంతా అమ్మాయిల స్కూలు. ఇక నవ్వులకేం కొదవ. మేకప్పు ఐపోయింది. మీసాలు పెడతామన్నారు. కాటుకతో మేమే పెట్టుకోవచ్చు అని కొత్త డబ్బా తెచ్చుకున్నా. అది తుడుచుకోవడానికి ఒక గుడ్డ కూడ తెచ్చుకున్నా.. కాని మేకప్పు వాళ్లే ఏదో రంగు పూసారు లైట్ గా మీసాలు దిద్దారు. మాకైతే సత్యనారాయనవ్రతం రోజు పీటకు అలంకరించినట్టు అనిపించింది. తప్పదు కదా. అమ్మావాళ్లు, తమ్ముళ్లు వచ్చి నవ్వేసి వెళ్లిపోయారు. చీకటిపడ్డాక ప్రోగ్రాంస్ మొదలయ్యాయి. నాటిక పూర్తయ్యేవరకు నాకు ఒకటే భయం. అతి కష్టం మీద నా డైలాగ్ పూర్తి చేసా.(అదే ఊరికే పెదవులు కదిపా) మొహంలో కాస్త ఎక్స ప్రెషన్ ఇచ్చానో లేదో గుర్తులేదు. ఐనా చీకట్లో ఎవరు చూడొచ్చారులే అంత సూక్ష్మంగా అన్న చిన్న ధైర్యం కూడ ఉండింది. నాటిక ఐపోయి స్టేజీ దిగగానే ముందు చేసిన పని మొహం కడుక్కోవడం. ఏదొ మొహానికి అంటుకున్నట్టుగా ఉండింది.ఇదే నాటిక మరోసారి, ఒక అబ్బాయిల స్కూలులో వేయాల్సి వచ్చింది. ఒకసారి చేసిన అనుభవం కదా. కాస్త ధైర్యం కలిగింది. ఇక అబ్బాయిలు అంటే .. సాయంత్రం ప్రోగ్రామ్స్ ఐతే మద్యాహ్నం వరకు అక్కడికి చేరుకున్నాం మా గ్యాంగ్ అంతా. మాకు నాలుగైదు క్లాసు రూములు ఇచ్చారు. ఇక అబ్బాయిలు ఎప్పుడూ చుట్టుపక్కలే తిరిగేవాళ్లు .. అప్పుడప్పుడు వచ్చి ఏమైనా కావాలా అంటూ .. మేము ఊరుకుంటామా. ఆకలేస్తుంది. తినడానికి కావాలి, టీలు కావాలి అని తెగ తిప్పించాం. ఎలాగోలా ప్రోగ్రాం అయ్యిందనిపించి ఇంటికి చేరేసరికి 7 అయ్యింది. ఇప్పట్లా అప్పుడు భయం లేకుండింది. ఆటోలు లేవు. బస్సులు రూట్ తెలీదు. రిక్షా మాట్లాడుకుని నేనే భయపడుతూ వచ్చా కాని మా అమ్మా హాయిగా వంట చేసుకుంటూ ఉంది.. ఫోన్లు కూడా లేని రోజులు.. నేను ఇప్పటికీ అడుగుతుంటాను. నువ్వేంటి అంత రాత్రైనా భయపడలేదు అని. అప్పట్లో అలా ఉంది మరి అంటుంది అమ్మ. కాని కొన్ని అనుభవాలు జీవితాంతం మరిచిపోలేము..

1 వ్యాఖ్యలు:

మధురవాణి

జ్యోతి గారూ..
స్కూల్లో చిన్నప్పటి నాటకాల గొడవే భలేగా ఉండేది.
అవన్నీ గుర్తుకు తెచ్చింది మీ పోస్ట్ :)

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008