Wednesday 25 February 2009

ఫూల్ తుమ్హే బేజా హై ఖత్ మే



ప్రేమ కి సరియైన అర్ధం చెప్పగలరా.. ప్రేమలొ పడ్డవారి అవస్థలు ఎన్నో ఎన్నెన్నో.. ఇప్పుడంటే సెల్ ఫోన్లు, ఇ మెయిల్స్ ఉన్నాయి. కాని సుమారు నలభై ఏళ్ల క్రిందటి సంగతి చూస్తే.. ప్రేమికులకు ఉన్న ఒకే దారి ఉత్తరాలు. ఊహలన్నీ ఊసులుగా అందమైన అక్షరాలుగా మార్చి ఉత్తరాలు రాసుకునేవారు. అవి అవతలి వ్యక్తి భావాలను స్పష్టంగా వ్యక్తపరిచేవి. ఫోన్ ముచ్చట్లు పదే పదే వినలేరు కదా. కాని ఉత్తరాలు ఎన్ని సార్లైనా చదువుకోవచ్చు. ప్రేయసీ ప్రియులు ఏ దూరాన ఉన్నా ఈ ఉత్తరాలలోని మాటలు వారిని మరింత దగ్గర చేసేవనడంలో అతిశయోక్తి లేదు. ఆ ప్రేమలేఖలను ఏళ్ల తరబడి దాచుకున్న వైనాలు ఉన్నాయి. మనవళ్లు , మనవరాళ్లు పుట్టాక కూడా పెళ్లికాకముందు, పెళ్లైన కొత్తలో రాసుకున్న ఉత్తరాలు అప్పుడప్పుడు తీసి చదువుకుని మురిసిపోయేవారు ఎంత అదృష్టవంతులో కదా. అలాంటి ఓ అందమైన ప్రేమలేఖ ప్రహసనం 1968 లో విడుదలైన హిందీ చిత్రం "సరస్వతీ చంద్ర" లో నాయిక తన ప్రియుడికి (కాబోయే శ్రీవారికి) రాసిన ఉత్తరంలో ఫూలు కూడా పంపిస్తుంది. అదెందుకో చూద్దామా...


ఫూల్ తుమ్హే బేజా హై ఖత్ మే
ఫూల్ నహి మేరా దిల్ హై
ప్రియతమ్ మేరే ముజ్‌కో లిక్నా
క్యా యేహ్ తుమ్హారే కాబిల్ హై


లేఖతో పాటు పువ్వు పంపించాను.. అది పుష్పం కాదు నా హృదయం సుమా. అది నీకు సరియైనదా కాదా జవాబు ఇవ్వు ప్రియతమా అని అడుగుతుంది నాయిక. ఎంత అందమైన ఆలోచన కదా. అక్షరాలతో పాటు పూవులను పంపి అది అతడికి తగినదో కాదో అని సందేహపడుతుంది..


ప్యార్ చుపా హై ఖత్ మే ఇత్నా
జిత్నె సాగర్ మే మోతీ
చూమ్‌హి లేతా హాత్ తుమ్హార
పాస్ జో తుమ్ మేరి హోతీ


లేఖలో ఎంతో ప్రేమ దాగి ఉంది. అది సముద్రంలోని ముత్యాలంత. ఒకవేళ నువ్వు నా చెంతనుంటే నీ చేతులను ముద్దాడేవాన్ని అని జవాబిచ్చాడు నాయకుడు. ఉత్తరంలోని ప్రేమ సముద్రంలోని ముత్యాలలాగా వెలకట్టలేనిది, అనంతమైనది అని అతడు అంటున్నాడు.


నీంద్ తో తుమ్హే ఆతీ హోగీ
క్యా దేఖా తుమ్ నే సప్నా
ఆంఖ్ ఖులీ తో తన్‌హాయీ తీ
సప్నా హో న సకా అప్నా

నీకు నిద్ర వస్తుందేమో కదా (తనకు రావట్లేదని అర్ధమా) కలలో ఏం చూసావ్ అని అడుగగా... మెలకువ రాగానే ఒంటరితనం చుట్టుముట్టింది. కల నా స్వంతం కాలేదు . అని ప్రియుడు వాపోతున్నాడు.


తన్‌హాయీ హం దూర్ కరేంగే
లే ఆవో తుమ్ షహ్‌నాయీ
ప్రీత్ బడాకర్ భూల్ న జానా
ప్రీత్ తుమ్‌హీనే సిఖ్‌లాయీ


నీ ఒంటరితనాన్ని నేను దూరం చేస్తాను . కాని తొందరగా మా ఇంటికి మేళతాళాలతో(పెళ్లిబాజాలతో వచ్చేయమని.. ఎంత ఆత్రుతో అమ్మాయికి) వచ్చేయ్ మరి అని సిగ్గుతో ఆహ్వానిస్తుంది ఇంతి. నాకు ప్రేమను పంచి మర్చిపోవుగా.. ప్రేమించడం అంటే ఏంటో నువ్వే కదా నాకు నేర్పింది ప్రియా అని బదులిస్తాడు అబ్బాయి.


ఖత్ సే జీ భర్‌తా హి నహీ,,
అబ్ నైన్ మిలేతో చైన్ మిలే
చాంద్ హమారే అంగనా ఉత్‌రే
కోయి తో ఐసి రైన్ మిలే


అదేంటో కాని ఉత్తరాలతో సంతృప్తిగా లేదు. ఇక మనం ముఖాముఖీ కలుసుకుని కళ్లతో ఊసులాడుకోవాలి అని ప్రియుడంటే ఎంతో ఆనందపడిపోయిన ప్రియురాలు మా ఇంటి ఆవరణలో దిగివచ్చే చంద్రునిలా నన్ను వచ్చి కలుస్తావా అని అంటుంది.



మిల్నా హో తో కైసే మిలే హం
మిల్నే కి సూరత్ లిఖ్ దో
నైన్ బిచాకే బైటే హై హం
కబ్ ఆవోగే ఖత్ లిఖ్ దో


అవును మరి మనం కలవాలంటే ఎలా కలిసేది? (అమ్మాయి కలవడానికి ఒప్పుకుందిగా ) ఎలా కలవాలో కూడా నువ్వే ఉత్తరం రాయి అని ఆమెనే అడుగుతున్నాడు. ( విషయంలో అమ్మాయికే ఎక్కువ ధైర్యం, ఉపాయాలు తెలుసనా.) నిజంగా వస్తారా. నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎప్పుడొచ్చేదీ ఉత్తరం రాయి సుమా అని ఆత్రుత పడిపోతుంది అమ్మాయి.


1968 లో విడుదలైన ఈ చిత్రం "సరస్వతీ చంద్ర" లోని ఈ పాట ఎంత అందంగా ఉందో కదా. అలాగే ఈ పాటలో అభినయించిన నూతన్, మనీష్ లు కూడా చాలా అమాయకంగా, అందంగా ఉన్నారు. పాట సాహిత్యంతో పాటు సంగీతం కూడా చాలా శ్రావ్యంగా ఉంటుంది. కల్యాంజీ, ఆనంద్‌జీ అందించిన మధురమైన సంగీతంలో లతా మంగేష్కర్, ముకేష్ పాడిన ఈ పాట ఎప్పటికీ నిత్యనూతనంగానే ఉంటుంది. నటీనటులు, సంగీతం, సాహిత్యం, గాయనీగాయకులు ... వేటికవే ప్రత్యేకమైనవి. అందమైన రంగు రంగుల పుష్పాలన్నీ కలిపి ఒక గుత్తిగా మరిచిపోలేని అనుభూతినిస్తుంది ఈ పాట.

3 వ్యాఖ్యలు:

Unknown

ఇంత మంచి పాట గుర్తు తెచ్చినందుకు నెనర్లు !
నా చెవుల్లో లతా గాత్రం మోగుతూనే ఉంది. ఈ పాట download చేసి వినాల్సిందే ! :)

అనిర్విన్

సరస్వతీ చంద్ర" లోని ఈ పాట ఎంత అందంగా ఉందో కదా.

పాట అందంగా ఉండడమేవిటండీ!!

పరిమళం

జ్యోతి గారూ !నాకు హిందీ రాదు కానీ మీరు రాసిన విధానంలో భావుకత్వం అద్భుతంగా ఉందండీ .

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008