Wednesday, July 1, 2009

నేటి మహిళ - 1

కొద్ది నెలల క్రింద మొదలు పెట్టిన చర్చ కార్యక్రమం మళ్ళీ మీ ముందుకు. ఈసారి ఇద్దరు ఉద్యోగినులను ఆహ్వానించడం జరిగింది. ప్రతి ఉద్యోగిని ఎదుర్కునే అంశాలు, సమస్యలు, వాటిని ఎదుర్కునే విధానం. ఇవన్నీ చర్చించడం జరిగింది.. ఈసారి అతిథులు అనుపమ, సంజు.. ఇద్దరూ హైదరాబాదులో మల్టినేషనల్ కంపెనీలలో బాధ్యతాయుతమైన పదవిలో పనిచేస్తున్నారు. ఈ చర్చ కోసం తమ విలువైన సమయాన్ని కేటాయించినందుకు వారిద్దరికీ కృతఙ్ఞతలు .. ఇక మొదలెడదామా??1. హాయ్ అనుపమ, సంజు?? ఈ చర్చకు అంగీకరించినందుకు ధన్యవాదాలు. ముందుగా మీ పరిచయం చేసుకుంటారా??

అను : నమస్తే జ్యొతిగారు.. ఒక వర్కింగ్ వుమన్ గా మమ్మల్ని ఈ చర్చకు ఆహ్వానించినందుకు థాంక్స్. నేను హైదరాబాదులో ఒక మల్టినేషనల్ కంపెనీలో పని చేస్తున్నాను. ఇద్దరు పిల్లలు. భర్త, అత్తమామల ప్రోత్సాహం, ప్రేమతో ఆనందంగా ఉన్నాను.

సంజు : నమస్తే జ్యొతిగారు. మీకు కూడా థాంక్స్. నేను కూడా హైదరాబాదులొనే ఉంటాను. ఇద్దరు పిల్లలు. ఒక మల్టినేషనల్ కంపెనీలో పని చేస్తున్నాను. ఇద్దరు పిల్లలు. ఉద్యోగం నాకు ఎంతో ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది.
2. మీ జీవితంలో తల్లితండ్రులు, తోబుట్టువుల పాత్ర ఎంత ఉంటుంది. అంటే మీరు చిన్నగా ఉన్నపుడు, యుక్త వయస్సులో ఉన్నపుడు, పెళ్ళయ్యాక, పిల్లలు కలిగాక, మీరు ముసలివారు అయ్యాక.

అను: నా జీవితంలో మా అమ్మ నాన్న చాల ముఖ్యమైన వాళ్ళు. వారే లేక పోతే నేనూ లేను కదా. నాకు ఒక చెల్లెలు ఉంది, అన్న, తమ్ములు లేరు. కష్టము వచ్చినా సుఖము వచ్చినా తనతో చెప్పుకోవడం అలవాటు.మాది చాలా close ఫ్యామిలి. టీనేజిలో, జెనరేషన్ గాప్ వచ్చేస్తుంది అమ్మ, నాన్నకి; పిల్లలకి; చాలా మనస్పర్ధలు వస్తాయి. నేను కూడా అమ్మ, నాన్నతో చాలా దెబ్బలాడేదాన్ని. కాని వాళ్ళు చాలా ఓర్పుగా ఉండే వారు. ఈ రోజు నేను ఈ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాను అంటే అది వాళ్ల వల్లనే. పెళ్ళి అయ్యాక మా అమ్మ-నాన్న తల్లితండ్రుల కన్నా ఫ్రెండ్స్ లాగ యెక్కువ ఉంటున్నారు. ఇక పిల్లలు జీవితాన్నే మర్చేస్తారు. నేను పిల్లలు పుట్టే దాక యేదో ఊహలోకంలో ఉండేదాన్ని, వాళ్లతో భూమి మీదకి దిగి వచ్చాను :) నాకు ఇద్దరు పిల్లలు. వాళ్ళు పుట్టాక మొదటి సారి అర్ధం అయింది – మా అమ్మ నాన్న మమ్మల్ని ఎంతా బాగా పెంచారో అని.. పిల్లలు పుట్టిన కొత్తలో మేము అమెరికాలో ఉన్నాము.. అమ్మ నాన్న చాలా సార్లు వచ్చి మాతో 6 నెలలు ఉండి హెల్ప్ చేసారు. మా అత్త గారు, మామ గారు కూడ ఈ విషయంలో చాలా బాగా సపోర్ట్ చేసారు.మా అత్తగారు నన్ను చాలా ప్రొత్సహిస్తారు. మా మావగారు కూడ ఒక ఫ్రెండ్ లాగా సరదా గా ఉంటారు.మీరు అమ్మ నాన్న గురించి అడిగినా నేను అత్త-మావల గురించి యెందుకు చెప్పానంటే, నా దృష్టిలో వాళ్ళు వేరు-వేరు కాదు. చిన్నప్పుడు అమ్మ నాన్నతో ఉన్నాను, ఇప్పుడు అత్త మావలే అమ్మ నాన్నలై నాతో ఉన్నారు. మా అమ్మ నాన్న వేరే ఊరిలో ఉండడంతో వాళ్ళని యెక్కువ కలవలేక పొయినా, రోజూ ఫొన్ చేస్తాను, మనసులో వున్నవి షేర్ చేసుకుంటాను. సో వీళ్లందరూ ఎప్పుడూ నాతో ఉండాల్సిందే..


సంజు : అమ్మా, నాన్న, తమ్ముడు.. ఈ ముగ్గురు నాకు దిక్సూచిలాంటివారు అని భావిస్తాను. నా జీవిత ప్రారంభం , ఎదుగుదల పుట్టింటినుండే మొదలైంది. నాన్నగారి వల్లే నేను ఇంజనీరింగ్ చేసాను. అమ్మా నాకు మంచి స్నేహితురాలు. ఇక జీవితంలో, ఉద్యోగంలో నాకు మంచి మార్గదర్శి నా తమ్ముడు. నాకు ఫైన్ ఆర్ట్స్ కాని ఆర్కిటెక్చర్ కాని చేయాలని ఉండేది. మా నాన్నగారేమో ఇంజనీరింగ్ చేయమని... అసలు ఎంసెట్ కౌన్సెలింగ్ రోజు నేను అంతర్ రాష్ట్రీయ బాస్కెట్ బాల్ ఆడతాను అని పట్టు పట్టితే, మా నాన్నగారు కౌన్సెలింగ్ అటెండ్ అయితే ఫ్లైట్లో మాచ్ ఆడటానికి బరోడా పంపిస్తా అన్నారు. మా తాతగారు కూడా నాతో కౌన్సెలింగ్ కి వచ్చారు. తాతగారు ఎంసెట్ కౌన్సెలింగ్ కి రావటము ఎంసెట్ చరిత్రలో నాకు ఒక్కదానికేనేమో.. :) అప్పుడు ఇంజనీరింగ్ చదవడం ఒత్తిడి అనుకున్నా ఇపుడు ఈ వృత్తిలో చాలా సంతోషంగా ఉన్నాను. మనం తీసుకునే కొన్ని కీలకమైన నిర్ణయాలతో మన జీవన విధానమే మారిపోతుంది. నిజం చెప్పాలంటే మన దేశంలో పిల్లలకి కెరీర్ కౌన్సెలింగ్ వాళ్ల తల్లితండ్రులదే బాధ్యత అవుతుంది.ఎందుకంటే మన విద్యావ్యవస్థ లో కెరీర్ కౌన్సెలింగ్ చేసే సదుపాయం లేదు. అదీ కాక ఇంటర్ చదివే పిల్లలలో కొందరు మాత్రమే బాధ్యతగా అన్ని విషయాలు తమంతట తామే తెలుసుకుని అనుభవజ్ఞులై ఉంటారు. కాని చాలా మంది పిల్లలు ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉంటారు. చదువు, కెరీర్ గురించి సమగ్రమైన అవగాహన వచ్చేసరికి చాలా సమయం వృధా అవుతుంది. ఈ చదువుల పరుగుపందెంలో అందరూ ముందుండాలని వేగంగా కదలక తప్పదు. వారికి సరైన మార్గనిర్దేష్యం చేయాల్సినవారు తల్లితండ్రులే. మామూలుగా అందరూ ఎంచుకునే విభాగాలు కాకుండా పిల్లల శక్తి ఎంతవరకు ఉంది. ఏయే కోర్సులకు ఎటువంటి ఉద్యోగావకాశం ఉంది , ఆ కోర్సుల భవిష్యత్తు ఎలా ఉంటుంది తదితర వివరాలు సేకరించి పిల్లలకు అర్ధం చేయించాలి. . ఇది ఇంటర్ చదువుకునేటపుడు కాకుండా అంతకు ముందే చేసి పిల్లలకు ఇష్టమైన, మంచి కోర్స్ వైపు కృషి చేసి విజయం సాధించే అవకాశాలు మెరుగుపరచడానికి వీలుంటుంది.
3. అల్లారుముద్దుగా పెరిగిన ఆడపిల్ల పెళ్ళయ్యాక పుట్టింటికి ఒక అతిథిలా ఉంటుందా?? .ఆమెకు చిన్నప్పుడు ఉన్న చనువు, అధికారం చివరి వరకు ఉంటాయా?? అన్నలు, తమ్ముళ్ళ పెళ్ళిళ్ళు అయ్యాక కూడా ?? ఆడపిల్ల పుట్టింట అతిథి, అత్తింట మహారాణి అంటారు .. మీరేమంటారు??


అను :నాకు అన్న తమ్ముళ్ళు లేరు. కనుక నేను పుట్టింటిలో ఇప్పటికి మహారాణి నే :)

సంజు : జీవన ప్రయాణంలో మనం వివిధ పాత్రలు పోషించాల్సి వస్తుంది. కూతురు, చెల్లెలు, భార్య, కోడలు, అమ్మ, అత్తగారు ..ఇలా.. ఈ జీవన పరిణామాలలో తల్లితండ్రులు, తోడబుట్టినవారితో అనుబంధం మారదు (ఒకవేళ ఏవైనా మనస్పర్ధలు ఉంటే తప్ప). వ్యక్తీకరణ మాత్రమే మారుతుంది. పిల్లలకు ఇటువంటి ఆంక్షలు ఉండవు.కాని పెద్దయ్యే కొద్దీ వ్యక్తీకరణ అవసరం ఉండదు. కాని నా అభిప్రాయం ప్రకారం అమ్మాయి పుట్టింట ఎప్పటికీ ప్రత్యేక గుర్తింపు, తనను మహరాణిలా చూడాలనే కోరిక ఉండకూడదు.4. మీ కెరీర్ నే ఎలా నిర్ణయించుకున్నారు ?? మీ తల్లితండ్రులు, స్నేహితులు, ఎవరైనా మీకు చెప్పారా. మీరే మీ ఇష్ట ప్రకారం చదువుకుని సెటిల్ అయ్యారా??

అను : స్నేహితుల ప్రభావం. కొంత మంది ఫ్రెండ్స్ రామయ్య గారి కోచింగ్ కి వెళ్ళారు, నేను వాళ్ళతోనే చేరాలి అనుకున్నాను. మా నాన్న వెంటనే వెళ్ళి ఆయినతో మాట్లాడారు. మా అమ్మ నాన్న చాలా ఎంకరేజ్ చేసారు. ఎంసెట్ తయారీ అప్పుడు ఖర్చు గురించి పట్టించుకోకుండా నాకు బెస్ట్ కాలేజి, బెస్ట్ కోచింగ్ అన్ని అందించారు. మాతో సమానంగ మా అమ్మ నాన్న కూడ నాలుగింటి కి లేచి మేము చదువుకుంటుంటె మాతో కూర్చుని మా డౌట్స్ క్లియర్ చేసేవారు. మా అమ్మ జడలు దగ్గిర నుంచి వేసి మాకు కంప్లీట్ ఫొకస్ చదువు మీదే ఉండేలా చూసుకుంది. కోచింగ్ లో చాలా హోంవర్క్ ఇచ్చేవారు - మేము చేసుకుంటుంటే అన్నం ముద్దలు నోటిలొ పెట్టింది మా అమ్మ. రోజు కోచింగ్ కి తీసుకుని వెళ్ళి, మళ్ళి ఇంటికి తీసుకుని వచ్చి, కాలేజి లొ పిక్-అప్ చేసి, డ్రాప్ చేసి, ఏ పుస్తకం కావాలంటే ఆ పుస్తకం కొన్నారు నాన్న. రోజూ రాత్రి అంతా నాకు ఫిజిక్స్ చెప్పే వారు. అడ్మిషన్ వచ్చాక కూడ రెగ్యులర్ గా మాతో కాలేజి సంగతులు అడిగేవారు. వాళ్ళ రుణం తీర్చుకోలేను. నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడ మా నాన్న జీతం దాచుకోమని, నాకు పాకెట్ మని ఇచ్చేవారు. నేను అమెరికాకి పై చదువులకు వెళ్ళాలి అనుకున్నప్పుడు మళ్లీ చాలా ఎంకరేజ్ చేసారు. నాతో పాటు బ్యాంకుల చుట్టు, ఎంబస్సీ చుట్టు తిరిగేరు. ఈ విషయంలో మా ఆయిన, మా ఆడపడుచు కూడా చాలా సహాయం చేసారు.

సంజు : నా కెరీర్ కి సంబంధించి నా తమ్ముడే నాకు మర్గదర్శి. నాకంటే చిన్నవాడైనా కెరీర్ విషయంలో వాడి మాటలు ఎపుడూ విశ్వసించేదాన్ని. పాటించేదాన్ని కూడా. నేను సివిల్ ఇంజనీరింగ్ చేసి మాస్టర్స్ లో స్త్రక్చరల్ ఇంజనీరింగ్ చేసాను. కాని ఉద్యోగాల వేటలో అంటే 1995 లో సివిల్ విభాగంలో చాలా తక్కువ ఉద్యోగాలు ఉండేవి. నా థీసిస్ కోసం కంప్యూటర్ ప్రాజెక్ట్ చేసాను కాబట్టి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లో మంచి ఉద్యోగం వచ్చింది. అప్పుడు యు.ఎస్ లో సాఫ్ట్ వేర్ జాబ్స్ మంచి బూమ్‌లో ఉన్నాయి కాబట్టి ఎన్నో అవకాశాలు వచ్చాయి. నేను అప్పుడు తీసుకున్న నిర్ణయం మంచిదే అనుకుంటాను.5. మీకు ఇష్టపడిన ఉద్యోగం మీకు లభించిందా? లేదా లభించిన ఉద్యోగాన్ని మీరు ఇష్టపడుతున్నారా?

అను : నేను కాలేజిలో సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నాను. నాకు ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అంటే చాలా ఇష్టం. అందులోనే కెరీర్ డెవలప్ చేసుకోవాలనుకున్నాను. M.S. లో ఒక జర్నల్ పేపర్ కూడా పబ్లిష్ చేసాను. కాని అప్పట్లో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్ కి ఎక్కువ ఉద్యోగాలు లేవు. అందుకనే సాఫ్ట్ వేర్ సైడ్ వచ్చాను. But I am happy.

సంజు : మొదటి మూడు నాలుగేళ్లు నాకు దొరికిన ఉద్యోగాలు చేసాను. నా అదృష్టం కొద్ది అవన్నీ మంచి కంపెనీలలో దొరికాయి. తర్వాత ఉద్యోగం విషయంలో కాస్త జాగ్రత్త వహించాను. ఆ కంపెనీ గురించి, అందులో నేను పనిచేసే టీమ్ గురించి అన్ని వివరాలు తెలుసుకునేదాన్ని. ఈ రోజు నా కంపెనీలో నేను పోషించాల్సిన పాత్ర చాలా ముఖ్యమైనదిగా, బాధ్యతాయుతమైనదిగా ఉండాలి . అందుకే ఈ విషయాలన్నీ కూలంకషంగా తెలుసుకుని చేరాను. అలాగే ఆ కంపెనీ పేరు ప్రతిష్టలు కూడా చాలా ముఖ్యమైనవి.
6. ప్రతి అమ్మాయికి చదువు, కెరీర్ అనేది ఉండాలా? అది అవసరమున్నా లేకున్నా. బాగా చదువుకుని ఏం చేయాలి అని ఒక ధనవంతుల అమ్మాయి అనుకోవచ్చుగా??

అను : అమ్మాయిలు ఉద్యోగం చేయాలా, వద్దా అన్నది కుటుంబ నిర్ణయం. ఇంట్లో వృద్ధులైన అత్తామామలు, చిన్నపిల్లలు ఉన్నపుడు అవసరం లేదనుకుంటే అమ్మాయి ఇంట్లో ఉంటే అందులో తప్పేమీ లేదు అన్నది నా అభిప్రాయం. కాని ఆ నిర్ణయం బలవంతంగా కాకుందా స్వతంత్రంగా తీసుకోవాలి. ఏ కారణం లేకుండా ఇంట్లో ఉండమనడం భావ్యం కాదు. ఇప్పుడు అమ్మాయిలైనా, అబ్బాయిలైనా చదువు చలా ముఖ్యం. దేశాభివృద్ధికి చదువు చాలా అవసరం. చదువుకున్న తల్లితండ్రుల పిల్ల కూడా బాగా ఉంటారు. మంచి నాగరికులు అవుతారన్నది నా అభిప్రాయం.

సంజు: అవును ప్రతి అమ్మాయికి చదువు, ఉద్యోగం రెండూ ఉండాలి. ప్రతి ఒక్కరు స్వతంత్రులై ఉండాలి. నేను ఎన్నో సంఘటనలు చూసాను ఒక స్త్రీ చదువు, ఉద్యోగం, సంపాదన లేకుండా తనను, తన పిల్లలను పోషించుకోలేని నిస్సహాయ స్థితిలో ఉందో. ఈ పరిస్థితి ఒక్కోసారి ధనికులైన మహిళలకు కూడా ఎదురవుతుంది. ప్రతి మనిషి ఎవ్వరి మీదా ఆధారపడకుండా కనీసం తనను తాను పోషించుకోగలగాలి. డబ్బులకోసమనే కాదు ఆత్మస్థైర్యం, మనోనిబ్బరం కోసం ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. అలా ఇష్టమైన పని ఎప్పుడూ మనశ్శాంతిని , సంతృప్తిని ఇస్తుంది.
7. మీరు మీ భాగస్వామి ఎలా ఉండాలని కోరుకున్నారు. అలాటి భాగస్వామిని ఎన్నుకున్నారా? అది అందరికి సాధ్యమా??


అను : నేను మా వారిని చాలా చిన్నప్పుడు కలుసుకున్నాను - ఆయన నా భాగస్వామి నే కాదు నా బెస్ట్ ఫ్రెండ్ కూడ. నేను ఎప్పుడు నా భర్త ఇలా ఉండాలి, అలా ఉండాలి అనుకోలేదు - ఆయినే నా భర్త అవ్వాలి అని అనుకున్నాను. అంతే.. నాకు తెలుసు నేను చాల అదృష్టవంతురాలినని. కాని చాల తక్కువ మంది కి ఇది సాధ్యము.

సంజు : "నా భాగస్వామిని యెంచుకున్నప్పుడు నేను అతనితొ సంతొషంగా ఉంటాను అనిపించింది. నాకు జాతకము, డబ్బూ ఇవన్నిటికన్నా మా ఆయినతో నా జీవితం బాగుండాలని ఆలొచించాను.మా విషయం పక్కన పెడితే ప్రతి ఆడపిల్ల అర్ధం చేసుకోవాల్సిన విషయం ఒకటి వుంది. సంతొషానికి ఒక ఇన్స్టంట్ రెడి మిక్స్ లాంటిది యేమి వుండదు. దానికి భార్యా -భర్తలు ఇద్దరూ కృషి చేయాలి. కనుక ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉండడము చాలా అవసరము."
8. ప్రేమ వివాహామా?.. పెద్దలు కుదిర్చిన వివాహామా? ఈ రెండింటిలో ఏది మంచిదంటారు? పూర్వకాలంలో ఐతే ఉమ్మడికుటుంబాలు, కలిసి ఉండేవాళ్ళు కాబట్టి ఈ గొడవ ఉండేది కాదు. మరి ఇపుడు?? ఈ రెండింటిలో ఏది విజయవంతమవుతుంది అంటారు?

అను : Marraiges are made in heaven మన Destiny పట్టి ఉంటుంది. నేను ప్రేమ వివాహాలు విఫలం అవ్వడము చూసాను, పెద్దలు నిశ్చయించిన పెళ్ళిళ్ళు విజయవంతం అవ్వడము చూసాను. ఫెళ్ళి విషయంలో రాజీ పడకూడదు. ఓక సారి పెళ్ళి చేసుకున్నాక అది విజయవంతం అవ్వటానికి భార్యాభర్తలు ఇద్దరూ శాయశక్తులా ప్రయత్నం చేయాలి. అప్పటికి అది విఫలమయితే అది యెవ్వరి తప్పు కాదు – some marraiges dont work - దాని వల్ల ఆడపిల్లల మీద మీద స్టిగ్మ ఉండ కూడదు. అలాగే అమ్మ నాన్న చేసారు కనుక ఇది విఫలమయింది అని అనుకోకూడదు. వివాహము యెలా జరిగినా కలిసి ఉంటే కలదు సుఖం అన్నది నేను నమ్ముతాను. కుటుంబం కలిసి ఉంటే అందరికి కొండంత బలం ఉంటుంది. ఉమ్మడి కుటుంబం అయినా కాక పొయినా అందరూ దగ్గరగా కలిసి ఆత్మీయతతో ఉండాలి.

అంజు : నాది ప్రేమ వివాహం. చాలా చిన్న వయసులో పెళ్లి జరిగింది. ప్రేమ వివాహమా, పెద్దలు కుదిర్చిన వివాహమా అన్నది బాగా ఆలొచించి తీసుకోవాల్సిన నిర్ణయం. ఆడపిల్లలకు చిన్న వయసులో పెళ్లి చేయకూడదు. ఆ వయసులో వారికి తమ స్వంత ఇస్థాయిష్టాలు, జీవితపు విలువలు అంతగా ఆవగాహన ఉండదు. బుద్ధిగా చదువుకుంటూ అమ్మ చాటు బిడ్డలా ఉంటారు. తమంటట తాము ధైర్యంగా ఎట్టి పరిస్తిథినైనా ఎదుర్కునేలా ఎదగనివ్వాలి. చదువు, ఉద్యోగం చేస్తూ ఆటుపోట్లు ఎదుర్కునేలా చేయాలి. దానికి ఒక వయసు అని నిర్ధారించలేము. ఏ పెళ్లిలో ఐనా ప్రేమ, గౌరవం, ఆత్మీయత అనేది ముఖ్యం ..9. హాయిగా , ఏ చీకు చింతా లేకుండా పెరిగిన అమ్మాయికి పెళ్లి కాగానే పెద్దరికం వచ్చేస్తుంది. అలాగే బాధ్యత కూడా. అమ్మాయి అత్తారింట వాళ్ళు చెప్పినట్టు చేయాలా. తన కిష్టమున్నట్టు చేయాలంటారా? ఒక్కోసారి వ్యక్తిత్వాన్ని చంపుకోవాల్సివస్తుంది కూడా.. బాగా చదువుకున్న అమ్మాయిని మాకు ఉద్యోగం చేయాల్సిన ఖర్మ లేదు, ఇంట్లోనే ఉండు..డబ్బులకేం కొదవ లేదు అని అంటే ఆ అమ్మాయి ఏం చేయాలి??

అను : ఇది చాలా కష్టమైన ప్రశ్న. పరిస్థితిని బట్టి, మనుషులను బట్టి సమాధానము మారుతుంది. ఇక సా సంగతి వస్తే పట్టుదల యెక్కువ. నేను కోరుకున్నది సాధించడానికి విశ్వప్రయత్నం చేస్తాను. ఎవరైన అర్ధం చేసుకోక పొతే కన్విన్స్ చేయటానికి ట్రై చేస్తాను. ఎక్కువగా నా మనసుకి నచ్చినట్లే వుంటాను.ఏ కుటుంబంలోనైనాచిన్న, చిన్న గొడవలు తప్పవు. మనం ముఖ్యమైనది అనుకున్న విషయాలలో ఒకొక్క సారి ఒక నిర్ణయాన్ని తీసుకొవాల్సి వస్తుంది. కాని వ్యక్తిత్వాన్ని ఎప్పుడు చంపుకోకూడదు. దాని వల్ల షొర్ట్ టర్మ్ లొ వివాదం కాకుండా అపాగలమేమో కాని ఎప్పుడో అప్పుడు frustration, depression వచ్చేస్తుంది. ఏదైన మనం పట్టుదలగా ఉంటే ఇంట్లో వాళ్ళు కూడ ఇవాళ కాకపోతే రేపు అర్ధం చేసుకుంటారు. అలా అర్ధం చేసుకొకపొతే చాల పెద్ద సమస్య ఉన్నట్టు - దాన్ని మనమే పరిష్కరించుకోవాలి. ఉద్యోగం చేసే మహిళలు ఖర్మం చాలకకో, డబ్బులకోసమో చేయనవసరం లేదు. వాళ్ళ self-esteem కోసం పని చేయవచ్చు. ఉద్యోగం కేవలం డబ్బు సంపాదించడానిదే కాదు. సొసైటిలో ఒక స్థానం, హోదా సంపాదించుకొవడానికి.
చివరిగా నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే, ఉద్యోగం చేస్తున్నామా, ఇంట్లో ఉన్నామా అన్నది ముఖ్యం కాదు - మన జీవితానికి ఒక అర్ధం, గమ్యం ఉన్నాయా లేవా అన్నది ఎక్కువ ప్రధానము.


సంజు : మీరు చెప్పినవి వివాదాస్పదమైనవి. ఒకవేళ అమ్మాయి తను చేసే పనుల (చదువు, ఉద్యోగం, వ్యాపారం) మీద ఒక నిర్దిష్టమైన అభిప్రాయం కలిగి, వాటిని వదిలే ప్రసక్తి లేనప్పుడు ఈ విషయాలను ఆమె, ఆమె తల్లితండ్రులు అత్తగారివైపు వాళ్లతో పెళ్లికి ముందే మాట్లాడాలి. అలాంటప్పుడు పెళ్లి తర్వాత గొడవలు వచ్చే అవకాశాలు తక్కువ. ఇలా చేయకపోవడం వల్లే చాలా వివాహాలలో సమస్యలు వస్తున్నాయి. మన భారత దేశంలో కుటుంబానికి ముందుగా ప్రాధాన్యం ఇవ్వబడుంతుంది. ప్రతి కుటుంబానికి ప్రత్యేకమైన విలువలు, నియమాలు ఉంటాయి. ఆ కుటుంబంలో సభ్యులుగా వెళ్లడానికి అంగీకరించినప్పుడు వాటిని గౌరవించాలి. అలాగే ప్రతి వ్యక్తి స్వతంత్రులుగా ఉండాలి అలాగే కుటుంబంలో ఇతర సభ్యులకు ఇబ్బంది కలిగించకూడదు. ప్రతి ఆడపిల్ల తను అత్తగారింట్లో వారు చెప్పినట్టు విన్నందువల్ల కాని, వాళ్లు చెప్పినట్టు వస్త్రధారణ చేసినందువల్ల కాని బాధింపబడ్డట్టు ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఎదుటివారివైపు నుండి కూడా ఆలోచించాలి. ప్రతి అనుబంధంలో ఇచ్చుకోవడం , పుచ్చుకోవడం అప్పుడప్పుడు సర్దుకుపోవడం మామూలే. ఇవే ఆ అనుబంధాన్ని కలకాలం నిలిపి ఉంచుతాయి. ఈ విషయాన్ని ప్రతి ఆడపిల్లకు నేర్పాలి.

రెండో భాగం ఎల్లుండి.. వేచి ఉండండి..

6 వ్యాఖ్యలు:

Unknown

బాగుందండి.తరువాయి భాగం కోసం ఎదురు చూస్తుంటాము.

కొత్త పాళీ

good show

నీహారిక

మీరు గమనించారో లేదో ఈ మహిళల వెనుక ఉన్నది,వెన్నంటి ప్రోత్సహించేదీ పురుషులే.

కొత్త పాళీ

One way of posing the last question is ..
ఆనంద్ సినిమాలో రాహుల్ - రూప పెళ్ళి సందర్భంలో రూప స్థానంలో మీరేం చేస్తారు?
@ నీహారిక .. ఐతే ఏంటంట?

జ్యోతి

కొత్తపాళీగారు ఆనంద్ సినిమా చూడలేదండి.:)

నీహారిక.. నిజమే. చాలామంది మగవాళ్లు సపోర్ట్ చేస్తారు. చాలామంది చేయరు. అలాగే చాలామంది ఆడవాళ్లే పనిచేసే ఆడవాళ్లను అర్ధం చేసుకోరు.ప్చ్..

పరిమళం

జ్యోతి గారూ ! బావుందండీ మీ ఇంటర్వ్యూ .....ఇద్దరు ఉద్యోగినుల మనస్తత్వాన్ని ....జీవితం పట్ల వారి వ్యక్తిగత అభిప్రాయాలనూ చక్కగా మాముందుకు తెచ్చారు మీకూ, అను గారికీ , సంజు గారికీ అభినందనలు .

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008