Thursday, July 23, 2009

పొగ, కాఫీ పురాణం

ప్రతి మనిషికి ఏదో ఒక అలవాటు ఉంటుంది. అది వారికి ఇష్టమైన అలవాటైనా, మరి కొందరు అది దురలవాటు, వ్యసనమూ అని ఆక్షేపిస్తారు. కాని అలవాటు పడిన వారు మాత్రం ఆ అలవాట్లను సమర్ధిస్తారు. దానికి వ్యతిరేకంగా ఎవరేమన్నా వినరు. ఏ అలవాటుకైనా బానిసగా మారితే అది వ్యసనంగా మారుతుంది. ఈ అలవాట్లకు కవులు కూడా వశులే. కొందరు సమర్ధించారు, కొందరు వ్యతిరేకించారు.


భుగభుగమని పొగలెగయగ
నగణితముగ నాజ్యధార లాహుతి కాగా
నిగమాది మంత్రయుతముగ
పొగ త్రాగని వాడు దున్నపోతై పుట్టున్ !!


పొగ తాగితే అది భుగభుగమని గుప్పున ఎగిసిపడేలా ఉండాలి. వేదమంత్రాలతో యజ్ఞం చేస్తున్నంత దీక్షగా, పవిత్రంగా పొగ త్రాగనివాడు దున్నపోతై పుడతాడని ఆ కవి ఉవాచ. దీనికి మరో కవి తందానా అన్నాడు చూడండి.


ఖగపతి అమృతము తేగా
భుగభుగమని చుక్కయొకటి భూమిని వ్రాలెన్
పొగ చెట్టయి జన్మించెను
పొగ త్రాగని వాడు దున్నపోతై పుట్టున్ !!


ఈ పద్యం భారతంలోని సౌపర్ణోపాఖ్యానం కథలో చెప్పబడింది.) ఈ వింత చూసారా? అమృతం చుక్క భూమిపై పడి పొగ (పొగాకు) చెట్టై పుట్టిందంట) అంటే పొగ త్రాగేవారందరూ అమృతపానం చేస్తున్నట్టా?? హన్నా? పొగ త్రాగని వాడేమో దున్నపోతై పుడతాడంట. ఎంత బాగా తమని, తమ అలవాటును సమర్ధించుకుంటున్నారో?


అందరు కవులు ఇలా ఉండరు అని , పొగ త్రాగడం వల్ల కలిగే పదమూడు అనర్ధాలను కూడా మరో కవి ఏకరువు పెట్టాడు.


పదపడి ధూమపానమున ప్రాప్తము తా పదమూడు చేటులున్
మొదలు ధనంబువోవుట, నపుంసకుడౌట, విదాహమౌటయున్
వెదకుచు జాతి హీనులను వేడుట, తిక్కట చొక్కుటల్, రుచుల్
వదలుట, కంపు కొట్టుట, కళల్ తొలగించుట, రిమ్మ పట్టుటల్
పెదవులు నల్లనై చెడుట, పెద్దకు లొంగుట, బట్టకాలుటల్ !!


పైదానిలాగానే మరో ప్రముఖమైన అలవాటు కాఫీ తాగడం. మహాకవి శ్రీశ్రీగారు సుమతీ శతకంలోని "అప్పిచ్చువాడు వైద్యుడు" చందాన ఎప్పుడు పడితే అప్పుడు కప్పుడు కాఫీ నొసంగ గలిగిన సుజనుల్" అని కితాబిచ్చేసారు. నేను మాత్రం తక్కువ తిన్నానా అని ఓ కవి పొద్దున్నే ఓ అయ్యరు హోటళ్లో కూర్చుని


తరుణుల మోవి పానకము త్రాగక పోయిన నేమిగాక, యా
సురపతి వీటియందు సుధ జుర్రక పోయన నేమిగాక, మా
కరుణ గభస్తే బింబ ముదయాచల మొక్కక మున్నె వెచ్చనై
గరగరలాడు కాఫి యొక్క కప్పిడిగోనని అయ్యరిచ్చినన్ !!..

తరుణీమణి అధరసుధామృతం, అమృతం కంటే వెచ్చని కాఫీ మేలు అంటున్నాడీ కాఫీ ప్రియుడు.70 ఏళ్ల క్రితం గౌరవఝుల సోదరకవులు ఏకంగా కాఫీ పురాణమే రాసేసారు. అందులోని ఓ కాఫీ శ్లోకం..


త్రికాల మేక కాలం వా జపే ద్విచ్చాన్ సునిశ్చలః
పీత్వా పీత్వా పునః పీత్వా స్వర్గలోక మవాఫ్నుయాత్
కాఫీ తీర్ధసమంతీర్థం ప్రసాద ముపమా సమం
అయ్యర్ సదృశ్య దేవేశో నభూతో న భవిష్యతి!!


సంగతేంటంటే పొద్దున్నే అయ్యరిచ్చిన ఉప్మా (హతవిధీ.. ఇక్కడా, ఎక్కడ చూసినా ఉప్మానేనా) తిని, చిక్కటి కాఫీ మళ్లీ మళ్లీ తాగితే స్వర్గలొకప్రాప్తేనంట ఆ మహానుభావుడికి . బహుశా ఇంటికి దూరంగా ఉంటూ చదువులు, ఉద్యోగాలు చేసుకునే బ్రహ్మచారులందరూ ఇలాగే అనుకుంటారేమో. :)


కొందరు కాఫీని చుక్క చుక్క చప్పరిస్తూ, ఆనందిస్తుంటారు. మరి కొంత మందికి కాఫీ , టీలకంటె టిఫెన్ల మీద ఎక్కువ మక్కువగా ఉంటుంది. తినేసి బయటపడతారు. అది చూసి కాఫీకి బాధ కలిగి ఇలా వాపోయింది.. పాపం...


వడపై ఆవడపై పకోడి పయి హల్వా తుంటిపై బూంది యోం
పొడిపై ఉప్పిడిపై ర విడ్డిలి పయి బోండా పయిం సేమియా
సుడిపై పారు భగవత్కృపారసము నిచ్చోకొంత రానిమ్ము నే
ఉడుకుం కాఫిని ఒక గుక్క గొనవే ఓ కుంభలంభోదరా!!


పాపం ఎంత బాధలో ఉందో ఈ కాఫీ. వడ, ఆవడ, పకోడి, హల్వా, బూందీ, ఉప్పిడి, ఇడ్లీ, బోండాం, సేమియా పై ఉన్న ప్రేమను కొంచం ఈ వేడి కాఫీ పై కూడా చూపమని దీనంగా వేడుకుంటుంది.. ఆ ప్రార్ధన ఫలించు గాక.


గత వారం రోజులుగా ఒక మిత్రునితో ఈ పొగ త్రాగడం, కాఫీ తాగడం మీద తీవ్రమైన చర్చ జరిగింది. ఎప్పుడో ఒకసారి అంటే ఓకే కాని ఆ అలవాటే వ్యసనంగా మారనిస్తే ఎలా. మంచిది కాదుగా. కాని అతను తన అలవాటును సమర్ధించుకుంటాడు. పట్టు వదలడే. ఈ క్రమంలోనే చాలా రోజుల క్రింద చదివిన ఆచార్య తిరుమలగారి నవ్వుటద్దాలు లోని ఈ పద్యాలు గుర్తొచ్చి టపాయించాను.నాదో డౌటు.. సాధారణంగా పొగ త్రాగడం, మందు కొట్టడం అని వాడుతుంటారు. .. బీడీ, చుట్ట , సిగరెట్ పొగ పీలుస్తారు కాని తాగరు . మందు గ్లాసులలో పోసుకుని తాగుతారు. దానినెందుకు కొట్టడం. ఈ సంశయం ఎప్పటినుండో నాలో ఉంది. మావారిని ఎన్నోసార్లు అడిగా. ఆయనకు ఈ అలవాట్లు లేవు. నాకు తెలీదు. నువ్వే ట్రై చేసి నాకు చెప్పు అన్నారు. అలా ఉంది సంగతి. ఎవరైనా చెప్పగలరా ???

12 వ్యాఖ్యలు:

కొత్త పాళీ

పొగ త్రాగడం .. ha ha ha.
బెంగాలీ వాళ్ళకి తాగడానికీ తిండానికీ ఒకటే మాట .. ఖాబే .. దాంతో వాళ్ళు పొగని కూడా తింటారు! :)

రవి

నిన్ననే ధూమపానంపై ఒక వ్యాసం చదివాను. బౌద్ధ సాహిత్యంలో వినయ పిటకంలో శిరోభారం తగ్గటానికి ధూమపానం వాడమని సలహాయించారుట. అలాగే బాణభట్టు కాదంబరి కావ్యంలో ధూమ ప్రస్తావన ఉందట.

పద్యాలు ., శ్లోకాలు బావున్నాయ్.

తృష్ణ

భలే కోట్ చేసారు పద్యాలని.బాగుంది మి ప్రశ్న.నాది అదే ప్రశ్న..

duppalaravi

అదరగొట్టేశారు!!!

కామేశ్వరరావు

"ఈ పద్యం భారతంలోని సౌపర్ణోపాఖ్యానం కథలో చెప్పబడింది"

అదేంటి. ఇది బృహన్నరాదీయం నాలుగో ఆశ్వాసంలోది అని మా గిరీశంగారు చెప్పారే! :-)

"అంటే పొగ త్రాగేవారందరూ అమృతపానం చేస్తున్నట్టా??"

అంతే కదా మరి, అసలందుకే దాన్ని "త్రాగడం" అన్నారు :-)

"వడపై ఆవడపై పకోడి పయి హల్వా తుంటిపై..."

దీనికి స్ఫూర్తి "ఆదిన్ శ్రీసతి కొప్పు పై తనువు పై నంసోత్తరీయంబు పై" అన్న పద్యంలా ఉంది.

నవ్వుటద్దాల భలే మంచి పుస్తకం! దీన్ని ఓ మిత్రుడి దగ్గరనుంచి చదివి ఇస్తానని తీసుకొని నేను జాతీయం చేసేసాను :-)

జ్యోతి

కామేశ్వరరావుగారు, ఆచార్యగారు సౌపర్ణోపాఖ్యాణం ఆధారంగా అన్నారు మరి. ఇక వడపై.. ఆవడపై..."ఆరయన్ శంతను పుత్రుపై విదురుపై నక్రూరుపై" పద్యం వరుసలో రాయబడింది. చదివి ఇస్తానని జాతీయం చేసారా?? అన్యాయం కదా.. త్రాగడం.. భలే సమర్ధించుకుంటున్నారే.శ్రీమతితో అలవాటైనట్టుంది. :))

కామేశ్వరరావు

>>"ఆరయన్ శంతను పుత్రుపై విదురుపై.."
అవును, చటుక్కున ఆ పద్యం గుర్తుకువచ్చింది. ఇది ఇంకా దగ్గరగా ఉండే పద్యం.

>>"శ్రీమతితో అలవాటైనట్టుంది"
అబ్బే లేదండి! వచ్చే జన్మలో దున్నపోతై పుట్టేవాణ్ణి నేను :-)

పరిమళం

అయ్యయ్యో ...జ్యోతిగారూ ! కాఫీని , ధూమపానాన్ని ఒకే తాటికి కట్టేశారే :( :(

Unknown

ఏదేమైనా...నేను దున్నపోతు గా పుట్టడాని కే ఫ్రిఫర్ చేస్తాను.

Shashank

ఒకానొక కాలం లో ఈ రెండు లేనిదే ప్రొదున్నయేది కాదు నాకు. ఆ రోజుల్లో ఎవరైన ఎందుకు రా అంటే "నేను నిత్యాగ్నిహోత్రుడ్ని" అని చెప్పి సమర్థించుకునేవాడ్ని. ;-) ఇప్పుడు కాదనుకోండి. ఇప్పుడు కేవలం ప్రొదున్న చుక్క అదే ఓ బిందెడు కాపి పడకపోతే మాత్రం జీవితం ఎందుకు అసలు నేనెందుకు ప్రపంచం ఏమైపోతే నాకేంటి లాంటి ఆలోచనలు వస్తాయి.. దాని మీదే నేను అప్పట్లో ఓ టపా కూడా వ్రాసాను - http://aakasam.blogspot.com/2009/03/blog-post_3998.html

Suresh

"నమస్కారం జ్యోతక్కా,
వ్రాసారు మిరీ పోస్టు ఎంచెక్కా,
పెట్టరు వ్యాపారులకు చక్కనైన ఒక చిక్కు,
అంతటితో ఆగక తీసారు పొగరాయుల్ల తొక్క.
అంటాను నేను జ్యోతక్కకు సాటి జ్యోతక్కే.":)

Anonymous

బహుశా వర్ణించడానికి కొందరు కవులు వాడి వుంటారు కాబోలు. తను చేసే పని ని కొంత తమాషా కలిపి చెప్పడానికి అలా వాడి వుండొచ్చు.
పొగ త్రాగడాన్ని కొన్ని సార్లు కొంత మంది దమ్ము కొట్టడం అని కూడా అంటారు కదా. అలాగే
మందు కొట్టడాన్ని కూడా మందు తాగావా రా అని కూడా అంటారు కొందరు.
కాబట్టి సరదాగ వాడిన ఆ మాటలు అలా వాడుక లోకి వచ్చి వుండొచ్చు.
ఇది నా అభిప్రాయం ..
మీ అభిప్రాయం కూడా తెలియచేయవచ్చు.

కృతజ్ఞతలు,
సాయి సుధాకర్,
సాఫ్ట్వేర్ ఇంజనీర్.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008