Monday 10 August 2009

బ్లా.భా. సం . బ్లాగ్భాదిత సంఘం

బ్లా.బా.సం...

ఇదేంటా అని ఆశ్చర్యపోతున్నారా??? ఈ మధ్య తెలుగులో బ్లాగుతున్న వారి సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతుంది. ఊరికే కంప్యూటర్ ముందు కూర్చుని సమయం వృధా చేస్తున్నారని అనేట్టు లేదు . ఆటలు, చాటింగు, చెత్త వాగుడు గట్రా లేవు. . ఎంచక్కా తెలుగులో రాసుకుంటూ. చదువుకుంటూ ఉన్నారు. మంచిదే.. ఒకసారి మొదలెడితే అది వ్యాపకం బదులు వ్యసనం అయిపోతుంది. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి నేర్చుకోవడం, జాలంలో వెతకడం. ఇదేపని.. పక్కన ఉన్నవారు ఏమైనా వాళ్లకు పట్టదు. ఎదోలోకంలో మునిగిపోతున్నారు. ఎలా చచ్చేది ఈ బ్లాగర్లతో ..


ఇవీ నేను తెలుసుకున్న కొందరు బ్లాగర్ల కుటుంబ సభ్యుల మనోభావాలు. ముఖ్యంగా మహిళా బ్లాగర్ల మీద ఈ ఆరోపణలు ఎక్కువగా ఉంటున్నాయని తెలిసొచ్చింది. నాకు తెలీక అడుగుతాను. మగవాళ్ళు ఎంత సేపైనా భార్యాపిల్లలు అని పట్టించుకోకుండా ఎంత రాత్రి వరకైనా,ఎన్ని గంటలయినా పని చేస్తారు. అదేమని అడగొద్దు. ఎపుడు ఎం చేసేది,ఎక్కడున్నదీ చెప్పరూ. కాని భార్య ఇంటి పనులు పూర్తి చేసుకుని బ్లాగింగు,అంతర్జాల విహారం చేసి మంచి విషయాలు అదీ మాతృభాషలో చేస్తుంటే కంప్లెయింట్లు. తన తీరిక సమయంలో తనకిష్టమైన పని చేసుకుంటుంది లే అని వదిలేయచ్చుగా. ఉహూ.. వాళ్ళు ఇంట్లో ఉంటే ఎదురుగా తిరుగుతూ ఉండాలి. ఇది చాలా దారుణమని నేను నొక్కి వక్కానిస్తున్నాను . ఏదో ఇలా అన్నా బయట తిరుగుళ్ళు, సినిమాలు , షాపింగ్ అని సతాయించడం లేదు అని సర్డుకుపోవచ్చుగా. ఉహూ..


ఈ పరిణామ క్రమంలో గతంలో నేను పొద్దు కోసం రాసిన వ్యాసం గుర్తొచ్చింది.
బ్లాగ్బాధితుల సంఘం.... ఎవరైనా మొదలెడుతున్నారా మరి..


*నియమావళి…. ఇందులో బ్లాగులవలన బాధపడ్డవాళ్ళందరూ చేరవచ్చు . ప్రవేశం ఉచితం బ్లాగులలాగే. ఆడామగా బేధంలేదు. కాని ఇందులో సభ్యుల భార్యలు లేదా భర్తలు విధిగా బ్లాగరులై ఉండాలి .


ఈ సంఘం మొదలెట్టడానికి గల పరిస్థితుల గురించి వివరిస్తాను. నేను ప్రెసిడెంటుని కదా !.


మా వారు ఇప్పుడు ప్రముఖ బ్లాగరు. ఈ సమస్యలు మాకు ( అంటే నాలాంటి మరికొందరు భార్యలు అన్నమాట) గత ఆరునెలల నుండి మొదలయ్యాయి. ముందు నా సంగతి చెప్తున్నాను. మావారికి తెలుగు అంటే ఇష్టం ..సరే ..బానే ఉంది. ఆరునెలల క్రింద వరకు మా వారు ఆఫీసు నుండి రాగానే హాయిగా కబుర్లు చెబుతూ నేను చేసిన పకోడీలు తింటూ టీ త్రాగి పేపర్ ఓసారి తిరగేసి ..వంట చేస్తున్న నాతో కబుర్లాడుతూనే పిల్లల హోంవర్క్ చేయించేవారు. రాత్రి భోజనం అయ్యాక కాసేపు టీవీ చూసి లేదా అలా వాకింగుకి వెళ్ళి వచ్చేవాళ్ళం . అప్పుడప్పుడు సెకండ్ షోకి కూడా వెళ్ళేవాళ్ళం. కాని ఇప్పుడు???.



అసలు ఎవడు చూపించాడో కాని ఈ తెలుగు రాయడం . బ్లాగు రాయడం. ముందు నెట్ సెంటర్ కెళ్ళి రెండు మూడు గంటలు కూర్చునేవారు. తరువాత వాయిదా పద్ధతిలో కంప్యూటర్ కొన్నారు. రాగానే బట్టలు మార్చుకుని మొహం కడిగి ఏమోయ్ టీ అంటూ ఆర్డరేసి దాని ముందు సెటిల్ అయ్యేవారు. కొత్తలో అది ఎలా వాడాలో నేర్చుకుని మెల్లగా తెలుగు టైపింగ్ ఎలా చేయాలో తెలుసుకుని బ్లాగులు చదవడం మొదలెట్టారు. ఒక మంచిరోజు చూసి బ్లాగు మొదలెట్టి రాయడం మొదలెట్టారు. నేను వంటతో సతమతమవుతూ పిల్లల హోంవర్క్ చేయించేదాని. పోనీలే మన మాతృభాష కదా మంచిదే అని…టిఫిన్ లేకుండానే టీ ఇచ్చినా అలాగే కూర్చునేవారు. చూద్దాం అడుగుతారో లేదో అని నేను ఎన్ని రోజులు చూసా! ఊహూ…సర్లే నాకే పని తప్పింది అని ఊరకున్నా.



ఆఫీసులో అన్ని బ్లాక్ చేసి ఉంటాయంట. అందుకే ఇంటికి రాగానే ముందుగా కంప్యూటర్ స్విచ్చి ఆన్ చేస్తూ చెప్పులు విప్పుతారు. ముందుగా తను రాసిన టపాకు వచ్చిన కామెంట్స్ చదవడం , తర్వాత కూడలి, తేనేగూడు ఇలా అన్ని మెయిల్స్ చూసేసరికి రెండుగంటలు. అయన వెనకాల ఇంట్లో ఏం జరుగుతుందో , ఎవరెలా ఉన్నారో ఎమీ పట్టదు. ప్చ్ ….ఇవన్నీ నాకెలా తెలుసనుకుంటున్నారా? ఆడవాళ్ళం ఒకసారి ఒకే పని చేయం కదండీ. నా పని చేస్తూనే ఆయన మీద ఓ కన్నేసి చూస్తుంటా. ఎవరైనా ఆడాళ్లతో చాటింగ్ గట్రా చేస్తున్నారేమో అంత ధీర్ఘంగా కూర్చుంటే అని సందేహం కూడా కలిగింది. పోనీలే పోనీలే అని ఊరుకుంటే ఈ బ్లాగ్పిచ్చి పెరుగుతూనే ఉంది. పైగా ఇంటికొచ్చిన ప్రతి వారితో బ్లాగులగురించి ముచ్చట్లు. మా తమ్ముడికి కూడా చెప్పబోతుంటే వాడిని పంపేసా వెళ్ళరా మీ ఆవిడ ఎదురుచూస్తుందని. నా కష్టాలు తెలిసి తెలిసి వేరొకరిని పడనిస్తానా.



ఇవన్నీ చేసి నా వ్రేళ్ళు లాగుతున్నాయి కాస్త జండూబామ్ రాయవే అంటారు రాత్రి ..తిక్క రేగి నేను పెట్టను అని పడుకుంటా .మీరే చెప్పండీ. ఇదేమన్నా బావుందా. ఆ కంప్యూటర్ నాకు సవతి అయినట్టుంది . ఎప్పుడో దాని కనెక్షన్లన్నీ పీకి పడేస్తాను. కాని అన్నేసి వేలు పోసి కొన్నది కదా మనసు రాదు. రాసుకోండి, చదువుకోండి నేనొద్దనను. మరీ అలా నన్ను పిల్లలను గాలికొదిలేసి అందులోనే మునిగిపొమ్మన్నారా? ఇలాగే మా కాలనీలో నాలాంటి బాధితులు ఓ పదిమంది దొరికారు. సరే ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలంటే మేమందరం ఏకమై ఆలోచించాలి. అని సంఘం పెట్టుకున్నాము.



ఓ రోజు ఒకతను వచ్చి “నేను కూడా బ్లాగ్బాధితుడినే . నన్ను చేర్చుకోండి మీ సంఘంలో” అన్నారు . ఆశ్చర్యపోయాము. ఆడాళ్ళవల్ల కూడా బాధింపబడే మొగుళ్ళూన్నారా అని. అతను చెప్పింది విని వెంటనే చేర్చుకున్నాం ..ఇంతకీ ఏమన్నాడో తెలుసా?? “నేను ఆఫీసుకెళ్ళాక బోరు కొడుతుందంటే నా కంప్యూటర్ నేర్పించా … మెల్లిగా బ్లాగు రాయడం నేర్చుకుంది. ప్రొద్దున లేచి మొహం కడుక్కుని టీ తాగుతూ కూడలి చూస్తుంది. అప్పటికింకా ఎవరూ లేవరు . తర్వాత వంట పనీ అదీ త్వరగా పూర్తి చేసి నేను ఆఫీసుకెల్లేది ఆలస్యం మళ్ళీ ఆన్ చేసి అన్నీ చదువుతూ కూర్చుంటుంది. ఇల్లు సర్దేది లేదు . దుమ్ము దులిపేది లేదు. మద్యాహ్నం కాస్త పడుకుంటుందేమో. తన బ్లాగులో కొత్త కొత్త విషయాలు రాయడానికి పుస్తకాలు కొనిమ్మని నాతో పోరు .నేను తెచ్చినవి నచ్చలేదంటే తననే తీసికెళ్ళి దుకాణంలో వదిలేసి చూసుకో నేను బిల్లు కడతా అని పేపర్ చదువుతూ కూర్చున్నా. పోనీలే మాతృభాషాభిమానం కదా అని . ఇప్పుడు పలు రకాల టిఫిన్లు చేయదు. ఎక్కడికన్నా వెళదామంటే మీరెళ్ళండి నేను రాసుకోవాలి . అంటుంది. ఒక్కడిని పార్కుకో సినిమాకో వెళ్ళనా. ఏం చేయాలో తోచటం లేదు . కాస్త మీరన్నా ఉపాయాలు చెప్పండి. మా సంసారాన్ని నిలబెట్టండి.” అంటు వాపోయాడు .



ఇది చదివే వాళ్ళంతా మా సంఘం గురించి మీ భార్యలకు కాని, భర్తలకుకాని చెప్పరని తెలుసు. కాని వారి వద్దకు ఎలా చేరాలో మాకు తెలుసు కాని మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. మేము దీని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాము . బ్లాగులు రాసుకోండి ఎవరూ వద్దనరూ. అందులోను మన తేనెకన్నా తీయనైన మాతృభాష. కాని కాస్త మీ భార్యలు , భర్తలు, పిల్లల గురించి పట్టించుకోండి. ఇలాగే ఉన్నారనుకోండి . పరిణామాలు తీవ్రంగా ఉండొచ్చు.



పద్మజ
ప్రెసిడెంట్…

13 వ్యాఖ్యలు:

జీడిపప్పు

:lol:
బాగుంది. కొందరేమో బ్లాగింగు వల్ల తమ కుటుంబాలు సంతోషంగా ఉన్నాయంటున్నారు. sulekha blogs లొ వచ్చిన
BLOGGING WIVES MAKE HAPPY FAMILIES పోస్టు చూడండి.

తమిళన్

అతి సర్వత్ర వర్జయేత్

వీరుభొట్ల వెంకట గణేష్

పైన కామెంట్ పెట్టినట్టు, అతి మంచిది కాదు. నా వరకు బ్లాగ్లోకం లోకి వచ్చాక తెలియని విషయాలు చాలా తెలుసుకున్నా. కాక పొతే మీ టపా వలన అలెర్ట్ అయ్యాను. దీన్ని వ్యసనంగా మారకుండా జాగ్రత్త పడాలి. కాకపొతే నాకు ఇంకా పెళ్లి కాలేదు :)

సుభద్ర

మా ఆయనకి మెహామాట౦ ఎక్కువ?
నన్ను తప్ప ఎవరిని సతాయి౦చరు.
మా ఆయనని మీ స౦ఘ౦లో జాయిన్ చెసుకొ౦డీ ప్లిజ్

శరత్ కాలమ్

నాకు ఇంట్లో కంటే ఆఫీసులోనే తీరిక ఎక్కువ. ఇంట్లో వుండి పెద్దగా బ్లాగింగ్ చేయను కాబట్టి దానివల్ల ఇంట్లో ఇబ్బంది లేదు. సాధారణంగా చేయడానికి ఏ పనీ లేనప్పుడే బ్లాగింగ్ చేయాలనుకుంటాను.

Rani

ee baadhithula sangham lo kutumbasabhyulanu maatrame cherchukuntaara leka office lo managers ni, team leads ni kooda cherchukune veelunda. endukante nenu blogs chadivede office hours lo, appudappudu pani pakkana petti maree.. :P

శ్రీ

బాగా బ్లాగారు

Bhardwaj Velamakanni

LOL

Malakpet Rowdy

లాభం లేడు .. "బ్లాగు బాధింపుడు సంఘం" ఒకటి మొదలుపెట్టాల్సిందే. అన్నట్టు ఎవరో శ్రీకాకుళం అడవుల్లో "మలక్ బాధితుల సంఘం" అని మొదలుపెట్టారని భోగట్టా!

Hima bindu

ఇది నిజమే :) వ్యసనం అవ్వడం కూడా నిజమే ...చాల బాగా రాసారు.

శ్రీలలిత

కంప్యూటర్ , ఇంటర్నెట్ కొత్తగా వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం తమ గుప్పిట్లో వున్నట్లే భావించారు చాలామంది. ఈగ్లోబల్ విలేజ్ వచ్చాక స్వంత మనుషుల మధ్యకూడా సంబంధ బాంధవ్యాలు తగ్గిపోయాయని అనుకున్నారు. దాని గురించి ఎవరో వ్యంగ్యంగా రాసిన చిన్న మాట.



టెక్నాలజీ పెరిగినకొద్దీ మనుషుల మధ్య దూరం తరిగిపోయిందంటే -చిత్రమే కదా మరి..



ఇరాన్ ఇరాక్ యుధ్ధం నుండి--అమెరికా అధ్యక్షుడి ఎన్నిక వరకూ

టి వీ ముందు కూర్చుని ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాము

కాని పక్కింట్లో దొంగలు పడి మొత్తం వూడ్చుకెళ్ళినా

మర్నాడు పేపరు చూసేవరకూ తెలియనే లేదంటే----చిత్రమే కదా మరి...



ఇంటర్నెట్ లోకి దూసుకెళ్ళి --

అభిప్రాయాలు అభిరుచులు కలిసాయని

విద్యా, ఉద్యోగం కలిసొచ్చాయనీ

పిల్లని చూసుకుని పెళ్ళికి సిధ్ధపడితే

తీరా చూసేసరికి ఆమె మావకూతురై కూర్చుంటే---చిత్రమే కదా మరి.



పండగ పిండి వంటలకొసం -వంటల వెబ్ సైట్ కి వెళ్ళి

అపురూపంగా తయారుచేద్దామని

దాల్ మిక్సెడ్ హోల్ గ్రైన్ మసాలా ఫటాఫట్

ఫటాఫట్ న చెసేస్తే

ఆకారం తేలేసరికి అది మా అమ్మమ్మ చేసె ఉప్పుపిండై కుర్చుంటే ---చిత్రమే కదా మరి.

డా.ఆచార్య ఫణీంద్ర

భలే వ్రాసారండి !
మీ టపా చదువుతూ నాలో నేను నవ్వుకొంటుంటే, మా ఆవిడ " ఈయనకు పిచ్చి ముదిరింది " అనుకొంటుంది.

మాలా కుమార్

ఏమిటీ ,ప్రెసిడెంట్ సెక్రట్రీలను మార్చేసారా ? హమ్మయ్య !

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008