Saturday, November 27, 2010

ప్రలోభాల్ని అధిగమిద్దాం.. డిసెంబర్ 2010 కంప్యూటర్ ఎరా ఎడిటోరియల్

‘ఈ అభిమానాలూ, ఈ ద్వేషాలు క్షణికమాత్రాలు’ అన్పిస్తుంది మనుషుల ప్రవర్తనాసరళిని నిర్లిప్తంగా గమనిస్తున్నప్పుడు ! ఒకరు పొగుడుతుంటారు..మరొకరు తిడుతుంటారు.. ఇంకొకరు జన్మజన్మల శత్రుత్వమేదో మిగిలి ఉన్నట్లు అకారణంగా ద్వేషిస్తుంటారు. ప్రతీ స్పందననీ మనసుకి తీసుకుంటే తుఫానులో చిక్కుకున్న సంద్రంలా ఊగిసలాడడం తప్ప ప్రశాంతత ఎక్కడుంటుంది? మనమెవరికో ఏ కోణంలోనో నచ్చుతాం. అలాగే ఎవరికో ఎందుకో అస్సలు నచ్చము. ఈ రెండు తూకాలనూ సమానంగా భరించాల్సింది పోయి మరోవైపు మనమేమో అందరికీ నచ్చేలా ఉండాలని విశ్వప్రయత్నం చేయడం మొదలుపెడతాం. క్షణకాలంలో ఒక మనిషి మనల్ని అభిమానిస్తున్నారూ, ద్వేషిస్తున్నారూ అంటే ఆ క్షణం వారున్న పరిస్థితులు, ఆ క్షణపు వారి మానసిక స్థితి, మన ప్రవర్తనలో వ్యక్తమయ్యే లక్షణాలూ.. ఇలా ఎన్నో అంశాల ఆధారంగా ఓ అభిప్రాయం నిర్మితమవుతుంది. ఇలా ఎన్నో అంశాలతో కూడిన ఇంత క్లిష్టమైన ప్రక్రియను మనకు అనుకూలంగా మరల్చుకోవాలని తాపత్రయపడుతున్నామూ అంటే మనలోనే పెద్ద లోపం ఉన్నట్లు ! మనదైన శైలిలో మనం బ్రతకడం తప్ప ఈ ప్రపంచంలో ఎవరినో సంతృప్తి పరుద్దామని, అందరి అభిమానాన్ని పొందుదామని ప్రయాసపడితే అది వ్యర్ధప్రయత్నమే అవుతుంది. క్షణంక్రితం వరకూ అభిమానిస్తున్న ఆత్మీయులు సైతం మరుక్షణంలో ఎడమొహమై పోతారు. కారణం చిన్నదే.. వాళ్లు మనల్ని ఫలానా విధంగా ఉండాలని కోరుకుంటున్నారు. మనమేమో ఏదో సందర్భంలో మరోలా ప్రవర్తిస్తాం. చిన్న మానసిక సర్దుబాటు సరిపోతుంది...ఏకమవ్వడానికి !


ఈ చిత్తపు చిత్రాలు చూస్తుంటే అనిపిస్తుంటుంది. ఈ ప్రపంచంలో మనం ఏ మానసిక ఆలంబనకూ బందీ అవకుండా మిగిలిపోవడానికి మించిన సుఖం లేదు. అభిమానమైనా, ద్వేషమైనా, మరేదైనా నిర్లిప్తంగా సాగిపోనివ్వడమే. మన మనఃసాక్షి చాలు మనల్ని సరిచెయ్యడానికి ! ఒక మనిషిని ఆమూలాగ్రం అభిమానించిన వ్యక్తి ఆ మనిషిలో చిన్న మార్పుని జీర్ణించుకోలేక దూరమవుతున్నారంటే.. ప్చ్... ఎంత బలంగా ఉన్నాయో కదా మన అభిమానాలు! వీటికోసమా మనం పరితపించవలసింది? వీటి వలలో కూరుకుపోయి ఎన్నాళ్లని చిక్కుముళ్లని విడదీసుకుంటూ, భావోద్వేగాల్లో బందీలుగా మిగిలిపోవడం? పోతే పోనిద్దాం.. ఎవరెలా ముద్రలు గుద్దితే మనకేమి.. మన గమ్యాన్ని, లక్ష్యాన్ని మరిచి మనుషుల చిత్రమైన చిత్తాలను ఎంత కాలమని సంతృప్తి పరచగలం? అభిమానం మొదట్లో ఉత్సాహపరుస్తుంది. అదే అభిమానం మనం దానికి దాసోహమైతే తనకోసం వెంపర్లాడేలా చేస్తుంది. ఆ దుస్థితిని దూరంగా ఆగిపోవలసిన విజ్ఞత మనదే. అన్నింటికన్నా ముఖ్యంగా గమనించవలసింది అభిమానమైనా, ద్వేషమైనా మనల్ని మనంకాకుండా భ్రమింపజేసే ప్రలోభాలన్నది !!... ఈ ఒక్క విషయం అర్ధమైన రోజు సమాజంలో మనుషుల చుట్టూ మనం పెనవేసుకున్న బంధాల్లో స్పష్టత వస్తుంది. ఎన్నో గందరగోళాలు దూదిపింజల్లా తేలిపోతాయి. బుర్రలో పేరుకుపోయిన వ్యర్ధం తొలగిపోతే ఇక మిగిలేది వజ్రం కాక మరేముంటుంది.? దాన్ని మరింత పరిపక్వతతో సానబెట్టుకుంటే చాలు. జీవితం ధన్యమే!!మీ నల్లమోతు శ్రీధర్..

3 వ్యాఖ్యలు:

సి.ఉమాదేవి

వ్యక్తిత్వవికాసంకాక వ్యక్తిగత వికాసం లక్ష్యంగా జీవించడం నేటి జీవనవిధానమవుతోంది.
అదే బ్రతకనేర్చినకళగా గుర్తింపు పొందుతోంది.దైవసమానులనదగ్గవారు కాక మామూలు మనిషి మానసికదౌర్బల్యుడే.లోపాలు,
బలహీనతలు లేని మనుషులుండరు.ఇతరులు ఆశించినట్లు మన ప్రవర్తనను చీటికిమాటికి రివైండ్,ప్లే చేసుకోవడం వాంఛనీయం కాదుకాని అభివృద్ధి దిశగా
మన ప్రవర్తనాశైలిని సవరించుకోవాల్సి వచ్చినపుడు మన అభిమానం దురభిమానం కాకూడదు.విశ్లేషణాత్మకమైన మీ సంపాదకీయం నెలకొక్కసారి పాఠకుల మనసులకు లభించే చక్కటి అక్షర టానిక్.

జ్యోతి

ధాంక్స్ శ్రీధర్.. కొద్దికాలంగా నాలో ఉన్న సంఘర్షణకు సమాధానం దొరికింది..

lalithag

"అన్నింటికన్నా ముఖ్యంగా గమనించవలసింది అభిమానమైనా, ద్వేషమైనా మనల్ని మనంకాకుండా భ్రమింపజేసే ప్రలోభాలన్నది !!... " ఈ వ్యక్తీకరణ చాలా బావుంది. అభిమానం గురించి అలా ఆలోచించడం కష్టం, నిజమైనా. ద్వేషం అలా అనుకుంటే ఎంత తేలికైపోతోందో మనసు.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008