Thursday 31 March 2011

మేధావితనం గొప్పదా? అమాయకత్వమా? - కంప్యూటర్ ఎరా ఏప్రిల్ 2011 సంపాదకీయం

ఈ ప్రపంచాన్ని, ఈ మనుషులని ఎలా అర్థం చేసుకోవాలీ..ఎవర్ని కదిపినా ఇదే ప్రశ్నతో భృకుటి ముడుచుకుని సుదీర్ఘంగా శూన్యంలోకి చూస్తుంటారు. ఎన్నో పార్శ్యాలతో ఏ కోణాన్నీ చేధించి లోతులు గ్రహించలేనంత క్లిష్టంగా ఉన్నప్పుడు ప్రపంచంలో దేన్నని అర్థం చేసుకోగలం? ఎవర్నని అంచనా వేయగలం? ప్రశాంతంగా ఉన్న మనస్సుకి ఏదో చంచలమైన ఆలోచనని జతచేసి.. ఆ ఆలోచన స్థిమితపడితేనే మనసు విశ్రాంతి చెందేలా ప్రతీ క్షణం మనకి మనం చిక్కుముడులు పేనుకుంటుంటే.. ఏ ముడినని విప్పుకోగలం.. ఏ సత్యం తలకెక్కుతుంది? చిన్న వయస్సులో ఏ సంతోషమైనా, ఏ విచారమైనా క్షణికమాత్రమే. ఏదీ లోతుగా వెళ్లే శక్తి ఉండదప్పుడు! ఎటొచ్చీ సమస్యల్లా వయస్సు పెరిగేకొద్దీనే! చిన్నదైనా, పెద్దదైనా ప్రతీ సంఘటనా వదిలించుకోలేనంత ఆలోచనని అతికించేస్తుంది. ఆ సంఘటనా, మనుషులూ, సమాజం, స్వభావాలతో మొదలుపెట్టిన ఆలోచన ఎక్కడెక్కడో తచ్చాడి దేనికీ సరైన సమాధానం దొరక్క ఓ అసంతృప్తిగా ముద్రించుకుపోతుంది మనోఃఫలకాల్లో ఏ మూలనో! ఎదుటి మనిషిని అంచనా వేయగలగడం..



వేయగలిగామనుకోవడం మనం జీవితపు అనుభవాల నుండి సాధించామనుకునే అతి గొప్ప విద్య! అంతటి గొప్ప మర్మం అర్థమైపోయిందనీ, క్షణాల్లో మనుషుల్ని తెరిచిన పుస్తకాల్లా చదివేయాలని ఉపక్రమించేవారు సైతం ఏ పుటలోనో భృకుటి ముడి వేస్తుంటారు. మనుషుల్నీ, మనస్థత్వాలనూ, సమాజాన్నీ, సంఘటనల ఆద్యంతాలను తడిమి చూడాలనుకోవడం పులిబోనులో తలదూర్చడం లాంటిదే. అవేమీ అంతుపట్టవు.. అంతుపట్టించుకునే ప్రయత్నంలో మనల్ని మనం కోల్పోతుంటాం. జీవితాన్ని చాలా సరళంగా జీవించొచ్చు. ఈ క్షణాన్ని ఆస్వాదిస్తూ..! ఈ క్షణం మనతో గడిపిన మనిషికి.. ప్రేమని పంచుతూ!! కానీ మనం క్షణాన్నీ విశ్లేషిస్తాం, ఓ పక్క మాట్లాడుతూనే మనిషినీ అంతర్లీనంగా విశ్లేషిస్తుంటాం. ఇంకా ప్రేమలూ, ఆప్యాయతలూ పంచుకునేటంత ఖాళీ ఆ క్షణం మనసులో మిగిలుంటే కదా! ఏ క్షణం మనలో తర్కం.. విశ్లేషణ మాయమవుతుందో ఆ క్షణం ఆనందానికి ద్వారాలు తెరుచుకుంటాయి. ఇది ముమ్మాటికీ సత్యం. ఎంతటి ఆనందమైనా దాని పుట్టుపూర్వోత్తరాలను విశ్లేషించి.. తీరిగ్గా తర్వాత అనుభవిద్దామంటే చివరకు మిగిలేది పలుచబడిపోయిన ఓ జ్ఞాపకమే. ప్రశాంతమైన, ఆనందకరమైన జీవితానికి ఒకటే చిన్న సూత్రం.. బుర్రబద్ధలు కొట్టుకుని మేధావిగా బ్రతకడం కన్నా.. ఏమీ తెలియని అమాయకత్వంతో నిశ్చింతగా జీవితాన్ని నెట్టుకురావచ్చు. మన మేధస్సు తప్పనిసరైనప్పుడు ఉపయోగపడాలే గానీ చీటికీ మాటికీ మన ఆనందాలకూ, అనుభూతులకూ అడ్డుపడేదిగా ఉండకూడదు. ఈ క్షణాన్ని ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించి అనుభవించడం మానేసి.. అసలెందుకు, ఎలా ఈ క్షణం ఉద్భవించిందోకనిబెట్టడానికి పూనుకుంటున్నామంటే మనల్ని మనం ఎక్కడో సరిచేసుకోవలసిన ఆవశ్యకత ఉంది. అసలు ఒకటే మాట.. మనం ఏమీ తెలియని చిన్న పిల్లల్లా ఎందుకు ఉండకూడదు? విచ్చే గులాబీనీ నవ్వుతో పలకరిస్తూ.. శత్రువు మనసునీ మన అమాయకపు చిరునవ్వుతో గెలుస్తూ.. మొహంలో ప్రతిఫలించే నిర్మలత్వంతో అందరి హృదయాల్లో మరపురాని వ్యక్తిగా మిగిలిపోయే విద్య తెలియని మేధస్సు, మనస్థత్వ శాస్త్రం ఏమి సాధించడానికి?



మీ నల్లమోతు శ్రీధర్

7 వ్యాఖ్యలు:

Anonymous

శ్రీధర్ గారు సంపాదకీయం ఎప్పటిలానే చాలా బావుంది .
ఈ క్షణం వాస్తవం. వాస్తవంలో జీవించడం అనేది చాలా అభ్యాసం చేసి నేర్చుకోవాల్సింది . కానీ ఒక్కసారి అది వంటబట్టిందా ...... ఈ బ్రతుకు లో ప్రతీ క్షణం మనదే

గిరీష్

చాలా బాగా వ్రాశారు. ఎంతో అనుభవం ఉంటే గాని ఇలాంటివి రాయలేం. కాని మానవునికి ఇది సరిపోదు. మనిషి ఆశా జీవి అవడం వళ్ళ, అతను కుదురుగా ఏమి అలోచించకుండ ఉండలేడు. తగ్గించడం మాత్రమే చెయ్యగలం. అది కూడ ఎంతో కష్టపడితే గాని.. భృకుటి అన్న పదానికి అర్ధం తెలుపగలరు.

Unknown

లలిత గారు.. థాంక్యూ అండీ. మీరన్నది చాలా నిజం. "ఈ క్షణం"లో జీవించడం తెలిస్తే జీవితం చాలా సరళంగా ఉంటుంది. మీ స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలు.

sobha

ఇంత అందంగా రాసిన ( వ్రాసిన) మీ మాటలకు చాలా ఆనందపడుతూ ఈ క్షణాన్ని ఆస్వాదిస్తున్నా మనస్పూర్తిగా!

కథాసాగర్

మారుతున్న పరిస్థితులు, కాలానుగుణంగా వస్తున్నమార్పులు మనషుల మనస్తత్వాలలో కూడా మార్పులను తీసుకుని వస్తున్నాయండి..

వీటికి తోడు మనుషులు కూడా ఈ మార్పులకు అలవాటు పడిపోతున్నారు...

Unknown

@ గిరీష్ గారు.. అవునండీ.. ఆశకు, ఆలోచనలకూ ఒక హద్దు ఉంటుంది.. అవి మన మనస్సుని కబళించకముందే వాటిని అదుపులో పెట్టాలి. "భృకుటి" అంటే కనుబొమలకు మధ్య సుదీర్ఘంగా ఆలోచించేటప్పుడు మడతపడే భాగం.

@ శోభ గారు... ధన్యవాదాలండీ :) హాపీగా ఆస్వాదించండి.

@ కథాసాగర్ గారు.. మీర్ననది నిజమే.. కానీ మనిషికి ఎప్పుడూ ఓ ఛాయిస్ ఉంటుంది.. తన జీవితంలో దేన్ని ఎంతవరకూ తీసుకోవాలి అన్న దాని విషయమై! అంత ఛాయిస్ ఉండీ చేజేతులా కాంప్లికేట్ చేసుకుంటూ ఉంటాం లైఫ్ ని! ఏం చేద్దాం. ధన్యవాదాలు సర్.

Ennela

haahahahaa...amaayakatvame baagundi..visleshana inkaa baagundi

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008