Tuesday, March 8, 2011

మరుజన్మంటూ ఉంటే

మరుజన్మంటూ ఉంటే...

స్త్రీ అంటే ప్రకృతి, రంగులు, సౌందర్యం, అందం మాత్రమే కాదు స్త్రీ అంటే బాధ్యత, కష్టం, దుఖం, సహనం, ఓర్పు, క్షమాగుణం కూడా.. సృష్టిరచనలో, నిర్వహణలో స్త్రీ, పురుషుడు.... ఇద్దరి బాధ్యత సరిసమానంగా ఉంటుంది. వీరిలో ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు. కాని తరతరాలుగా పితృస్వామ్య సమాజమే కొనసాగుతుంది. స్త్రీ ఎంత విద్యావంతురాలైనా, ధైర్యవంతురాలైనా ఆమెని ఎప్పటికప్పుడు అణగదొక్కాలనే చూస్తారు. తమని దాటిపోతే తమని లెక్కచెయదేమో అనే అహంభావం మగవాడికి, మొగుడికి ఉంటుంది. అందుకే మగవాళ్లకంటే ఆడవారు ఎప్పుడూ తక్కువ స్థాయిలోనే ఉండాలి , తాము చెప్పినట్టు వినాలి , చెప్పింది నోరు మూసుకుని పాటించాలి అని సమాజమే నిర్ణయించేసింది. వాస్తవానికి స్త్రీ ఎన్నటికి అబల కాదు. ఆమెలో కూడా అనంతమైన శక్తి ఉంది. దాన్ని గుర్తించి వెలికితీయాలి. అది అంత కష్టమేమి కాదు. ఈరోజు ఎందరో మహిళలు ఉన్నతపదవులు అలంకరించడంలోను , వివిధ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడంలో వారికి స్ఫూర్తి, ప్రోత్సాహం ఎవరిస్తున్నారు? అని ఆలోచిస్తే ముందుగా ఆమెను ప్రోత్సహించి ముందుకు నడిపించేది భర్త, స్నేహితులు.. దానికి తోడుగా ఆమెలోని సంకల్పం, ఆత్మస్థైర్యం తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈనాడు మహిళలు రాణించని రంగం ఏదైనా ఉందా?. ఉద్యమాలైనా, రాజకీయాలైనా, పరిపాలనా బాధ్యతలైనా, అద్యాపక వృత్తి ఐనా, డాక్టరైనా, గాయని ఐనా, పోలీసైనా, మిలటరీ ఐనా సరే తాను కూడా చేయగలను అని ముందుకొస్తుంది మహిళ. ఉద్యోగాలు చేయకున్నా ఎందరో మహిళలు ఇంటినుండే తమకు తెలిసిన స్వయం ఉపాధి పధకాలు ప్రారంభిస్తున్నారు. మేమున్నది వంట చేయడానికి, ఇల్లు సర్దుకోవడానికి మాత్రమే కాదు అంటూ కుటుంబ నిర్వహణలో భర్తకు చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా వేర్వేరు దేశాలలో, వేర్వేరు వృత్తులలో ఉన్న తెలుగు మహిళాబ్లాగర్లను “మరుజన్మంటూ ఉంటే మీరేం కోరుకుంటారు” అని అడిగితే ఇలా చెప్పారు.
ఇంకో జన్మ అంటూ వుంటే, ఎంపిక చేసుకునే అవకాశం కూడా మన చేతుల్లోనే వుంటే నేను మళ్ళీ మానవి గానే పుడతాను. అయితే అది కేవలం స్త్రీ జన్మ గొప్పదనో, స్త్రీ కి మాత్రమే విలువ వుందనో కాదు. ఇవాల్టి సమాజం లో స్త్రీలకు బాధలు, కష్టాలు , ఇబ్బందులు ఇంకేవో వున్నాయని ఇంకో జన్మ లో మగవాడిగా పుట్టడం , పుట్టాలనుకోవడం సమస్యకి పరిష్కారం కాదు. అలాంటి అసమానతలు వున్న సమాజం పోవాలి. స్త్రీ పురుషులిద్దరూ స్వేచ్ఛగా,సమానంగా,సంతోషంగా బతకగలిగే సమాజం రావాలి. అలాంటి సమాజం లో కేవలం ఏదో ఒక జెండర్ కి మాత్రమే స్వేచ్ఛ పరిమితం కాకుండా మానవ జాతిమొత్తం ఎలాంటి బానిస సంకెళ్లు లేకుండా బతకగలగాలి. అలాంటి సమాజం లో మళ్ళీ మానవి గా పుట్టాలని ఉంది.
కల్పనా రెంటాల
ఆడజన్మంటే...
తేనెలోని తీయదనం..పూలలోని సౌకుమార్యం
తొలివెలుగులోని వెచ్చదనం..పిల్లగాలి చల్లదనం
తొలకరిలోని గిలిగింత..పౌర్ణమినాటి పులకరింత
కోయిలకూతలోని పలకరింత..అమ్మదనంలోని కమ్మదనం..
ఇవన్నీ, ఇలాంటివన్నీ, ఇలాంటివింకెన్నో కలిసి నిండురూపమిచ్చేదే ఆడజన్మంటే...
అంతేకాదు...పరిస్థితులు వికటిస్తే..
గులాబీ పక్కనున్న ముల్లులాగా
అల్లరి చేసే అబ్బాయిల పాలిట పీడకల
యాసిడ్ పోసే దుండగుల పాలిట కాళిక
కిరోసిన్ పోసే కృతఘ్నుల పాలిట భద్రకాళి
ఆడవారికి గౌరవమివ్వని మగవారిపాలిట మహంకాళి
అదీ ఆడజన్మంటే..
అన్ని గొప్ప విశేషాలున్నాయి కనుకనే నాకు ఆడజన్మంటే ఇష్టం. అందుకే మరుజన్మంటూ వుంటే నేను ఆడజన్మనే కోరుకుంటాను..
శ్రీలలిత..నాకు మళ్ళీ మళ్ళీ ఆడ పిల్ల లాగా పుట్టడమే ఇష్టం .. ప్రస్తుతం మా వారు వంట, పిల్లల చదువులు అవీ యేవీ పెద్దగా పట్టించుకోరు.. ఒకసారి విసుగొచ్చి వచ్చే జన్మలో మగవాడిగా పుట్టి అన్ని పనులూ నా భార్యతో చేయించుకోవాలని ఉందని చెప్పాను..నా కంటే ఒక పది సంవత్సరాలు చిన్న అయిన జంటలని చూస్తే 50-50 గా పంచుకుంటున్నారు అన్ని పనులని.. ఇంకొన్నేళ్ళు పోతే తిరగేసి మగవాళ్ళే అన్ని పనులు చేస్తారట. అంటే నేను మళ్ళీ పుట్టే సమయానికల్లా పరిస్థితి మారుతుందిట...ఇలా చెప్పి మా వారు నేను మగవాడిగా పుట్టాలనే కోరికని ఎగిరి గంతేసి మరీ ఆనందించారు..అంత గొప్ప అవకాశాన్ని ఎలా ఇస్తానండీ ఆయనకీ....అందుకే మరుజన్మలో మళ్ళీ అమ్మాయిగా పుట్టేసి పనులన్నీ మా ఆయనతో చేయించి.. కాలు మీద కాలేసుకుని సిగరెట్టు అంటించుకుని..టీవీ లో మా మంచి సినిమాలు చూస్తూ ప్రపంచంలో యేం జరుగుతున్నా ఏమీ పట్టనట్టు నా లోకంలో నేనుండి జీవితం ధన్యం చేసుకుందామని ఇలా ఆడపిల్లగా పుట్టడానికి డిసైడ్ అయిపోయా మరి!
పైది సరదాకి చెప్పినదైనా నిజంగా అన్ని బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూ 'ఆడదె ఆధారం' అనుకోడానికి అవకాశమిచ్చిన ఆడపిల్లగానే మళ్ళీ మళ్ళీ పుట్టలని కోరుకుంటా.
ఎన్నెల
హక్కులు అనేవి ఒకళ్లు ఇచ్చేవి కావు...మనకి మనమై సంపాయించుకోవాల్సినవి. ఎవరో ఏదో అంటారని, ప్రపంచానికి భయపడి, కట్లుబాట్లకి లొంగి ఉంటూ ఇంకొకరి అధికారాన్ని ఒప్పుకునేటంతవరకూ స్త్రీలు ఎంత ఆర్థిక స్వాతంత్ర్యం సాధించినా కూడా విముక్తి లేదు. అయితే తెగింపు, ధైర్యం అనేవి ఆర్థిక స్వాతంత్ర్యంతోనే వస్తాయి. మనకి ఎవరూ ప్రోత్సాహం ఇవ్వక్కర్లేదు.. ఈ ప్రపచంలో నేనూ మనిషినే అని గుర్తిస్తే చాలు. మనకి మనమే ప్రోత్సాహం ఇచ్చుకోవాలి. ఇతరులని బాధపెట్టనంతవరకూ ఎవ్వరేమనుకున్నా i don't care అని అనుకోవాలి. సమాజానికి వెరుస్తున్నంతవరకు స్త్రీలకి విముక్తి లేదు. ఐనా కూడా నేను మళ్ళీ జన్మంటూ ఉంటే ఆడపిల్లగానే పుడతాను. ఆడ జన్మ అమోఘమైనది, మగ జన్మకు ఏమాత్రమూ తక్కువగాదు అని నిరూపించడానికైనా మళ్ళీ అమ్మాయిగానే పుడతాను. అలా పుట్టడంలో ఏ తప్పు లేదూ...మగవారితో సమానంగా బతకగలము అని నిరూపించడానికైనా స్త్రీగా పుట్టాలనుకుంటున్నాను. నేను స్త్రీగా పుట్టి నా ధైర్యంతో పది మంది స్త్రీలకి ధైర్యం కలిగించడానికైనా స్త్రీగానే పుట్టాలనుకుంటున్నాను. ఎన్ని జన్మలైనా ఆడపిల్లగానే పుట్టాలి...సమానత్వాన్ని సాధించేవరకూ ఆడపిల్లగానే పుట్టాలనుకుంటున్నాను.
సౌమ్య ఆలమూరు...
ఎంత అబివృధ్ధి చెందినా మన సమాజంలోనూ, చుట్టూ మనుషుల్లోనూ మార్పు అనేది కొరవడుతోంది. చిన్నతనంలో ఇంట్లోని మగపిల్లలతో పోటీపడలేని నిస్సహాయత, యుక్తవయసులో పోకిరీ అల్లర్లు-వేధింపులూ, ఉద్యోగినిగా మారాకా ఆఫీసుల్లోనూ అభద్రత, కష్టపడుతున్నాఇంట్లో లభించని ప్రోత్సాహం, ఎంత పెద్ద ఉద్యోగం చేసినా తప్పని అత్తింటి పోరు, పెళ్ళి జరగకపోతే ఒకరకం విమర్శలు, పెళ్ళయి పిల్లలు కలగకపోయినా స్త్రీపైనే అభియోగాలు. ఇలా చెప్పుకుపోతే ఎన్నో. మనచుట్టు ఈ ఇబ్బందులన్నీ పడుతున్న స్త్రీలు 60% దాకా ఉంటారు. నేనూ స్త్రీ నే కాబట్టి స్త్రీలంటే గౌరవం, ఈ జన్మ పట్ల ప్రేమ ఉన్నాయి. కానీ మరు జన్మ అనే ప్రశ్న, ఆ ఛాయిస్ నాకు వస్తే మాత్రం సమాజంలో మార్పు రానంత వరకూ నేను మళ్ళీ అమ్మాయిగా పుట్టడానికి వెనకాడతాను. ఎందుకంటే ఈ జన్మలో నన్ను ఆదరించి ప్రేమించిన ఇదే తల్లిదండ్రులకు పుట్టకపోవచ్చు..
-తృష్ణ
"మరు జన్మంటూ వుంటే ముమ్మాటికి మళ్ళి అమ్మాయిగానే పుట్టించు తల్లీ. అనే కోరుకుంటాను. అమ్మాయితోనే అందం, ఆనందమూనూ,అందులోనూ అచ్చం పదహారణాల తెలుగమ్మాయిగానే,తేనెలూరే తెలుగు భాషలోని మధురిమను ఆస్వాదిస్తూ, అమ్మగా అమ్మదనాన్ని పొందుతూ, ఆప్యాయతతో ఆదరంగా ప్రతి శిశువుని పెంచకలిగితే అంతకంటె ఇంక ఏమి కావాలి? చదువు, సంస్కారం, మంచితనానికి ప్రధమ గురువు తల్లి.తల్లిని మించిన గురువు, హితుడు, దైవం, పరమాత్మ , ఎవరున్నారు? చెప్పండి. ఇవి అన్ని రంగరించి పెంచకలిగేది అమ్మాయే, ఆ అమ్మ. అలా పెరిగిన సమాజంలో కట్నాలు, వేధింపులు, సమస్యలు వుండనే వుండవుగా, ఒకవేళ వున్న ఇప్పటి జన్మలో ని అనుభవాలతో తేలికగా అధిగమించ వచ్చనే అనుకుంటున్నాను. అ! ఒక్కటి ప్రతి అమ్మాయి ఆర్ధికంగా ఎవరిమీద ఆధారపడకుండా తన కాళ్లమీద తాను నిలబడకలిగేలా చేయమని మాత్రం మనసా వాచా ఆ భగవంతుని కోరుకుంటున్నాను."
భమిడిపాటి సూర్యలక్ష్మి
నేను ఎన్ని జన్మలెత్తినా స్త్రీగానే పుట్టడానికి ఇష్టపడతాను. ఎన్ని సమస్యలేదురయినా ఎదుర్కోగల ఆత్మవిశ్వాసం నాకుంది. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుందని నేను నమ్ముతాను. నేను మనిషిని నమ్ముతాను. ఆడపిల్లల్ని అగ్గిబరాటాల్లగా పెంచి చూడండి. నింగి నేలతో పాటు అడవిని జయించుకొస్తారు. నువ్వు అబలవి, ఏడవడమే నీ పని, ఎవడో కౌన్ కిస్కా గాడు మొగుడుగా వస్తాడు వాడిని అల్లుకోవడమే నీ పని అని మనం నూరిపోస్తుంటే వాళ్ళు ఎప్పటికీ సమస్యల్లోనే నలుగుతుంటారు. సమస్య ఆడవాళ్ళుగా పుట్టడంలో లేదు వాళ్ళని ఆడవాళ్ళుగా తయారుచేయడంలో ఉంది. నాకు స్త్రీగా బతకడమే ఇష్టం ఎప్పటికీ. అడవిలో మానులంటే నాకు మహా ప్రేమ. మహా మానుగా పుట్టడం నాకు ఇంకా ఇష్టం.
సత్యవతి కొండవీటి...
"నిజమే! ఒక్క మనదేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అధికశాతం.. ఆర్ధికంగా, సామాజికంగా వెనుక బడిన వారిలో ఆడవారిమీద పెత్తనం చేసే వాళ్ళు, అణగ దొక్కాలనే వాళ్ళు, ఇప్పటికీ ఎక్కువే. మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి కుటుంబాలలో అంత లేకపోయినా.. ఎప్పుడో ఒకప్పుడు ఆ వివక్షత అనుభవించామనే చెప్పచ్చు.. అదీ ఇరవయ్యో శతాబ్దం మధ్యలో, స్త్రీ విద్యాభివృద్ధికి సంధి యుగం అని చెప్పదగిన కాలంలో. నేనే డిగ్రీలో చేరడానికి మూడు రోజులు సత్యాగ్రహం చెయ్యవలసి వచ్చింది. ఆ తరువాత, ఎప్పుడు చదువు ఆపి పెళ్లి చేస్తారో అని బితుకు బితుకు మంటూ గడప వలసి రావడం నిజమే. చదువు మీద దృష్టి నిలపడానికి ఎంతో శ్రమ పడడం నిజమే. అదే అన్నయ్యలకి ఆ సమస్యే లేదు. ఏది కావాలంటే అది ఎక్కడైనా చదవచ్చు. చదువు కోసం చేసిన పోరాటానికి లభించిన బిరుదు.. "జగ మొండి." నేను అనుకున్నది సాధించడానికి ఇరవయ్యేళ్ళు పట్టింది.. అదీ వివాహమయ్యాక.. అర్ధం చేసుకున్న భాగస్వామి లభించడం వల్ల. ఇంత వివక్షత ఎదుర్కొన్నా కూడా మరుజన్మలో స్త్రీగానే జన్మించాలనుకుంటాను.. ఎందుకంటే.. ఏదైనా సాధించగల పట్టుదల, మానసిక స్థైర్యం స్త్రీకే ఉంటుంది. ముఖ్యంగా మాతృత్వం.. మరీ మరీ అనుభవించాలనే మధురమైన భావన.. తనివి తీరనిది కదా!"

మంథా భానుమతి...

5 వ్యాఖ్యలు:

murali kirishna

జ్యోతీ గారు మీ రచన బాగుంది..భగవంతుడు మహిళలకు మాత్రమే సొంతం చేసాడు అన్ని రకాల పాత్రలను పోషించే అవకాశం..అముకోండి మా వందనాలు..

Mantha Bhanumathi

జ్యోతిగారు,
చాలా బాగున్నాయి అందరి ఆలోచనలు, అభిప్రాయాలు.
మహిళా దినోత్సవ సందర్భంగా బ్లాగ్ మిత్రులందరికి శుభాకాంక్షలు.
మంథా భానుమతి.

జయ

జ్యోతి గారు మీకు నా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

విరిబోణి

Jyothi gaaru,
Meeku Mahila Dinostvasa Subha kankshalu :)

murali kirishna

జ్యోతీ గారు మీరు నా బ్లాగ్ దర్శించినందుకు ధన్యవాదాలు..అయినా మీ కామెంట్ తేనేలొలుకు తెలుగులో పెడితే ఇంకా సంతో్షించేవాడిని అండి

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008