Tuesday 21 June 2011

మ్రోగింది వీణ .....

అసలు ఇప్పటి అమ్మాయిలకు మంచి అభిరుచి అనేది అస్సలు లేదు. చదువు, కంప్యూటర్లు, సినిమాలు, మొబైల్ లేదా ఐప్యాడ్ పెట్టుకుని పాటలు వినడం. మంచి వాయిద్యం నేర్చుకుందామని ఎంత మంది అనుకుంటున్నారు?. ఏమంటే మాకు టైం లేదు అంటారు. మా కాలంలో ఐతేనా??. .... అప్పట్లో స్కూల్లో, బాలభవన్ లో సంగీతం, వాయిద్యం నేర్చుకునే సదుపాయం ఉండేది. అసలైతే స్కూల్లో వారానికి ఒక రోజు సంగీతం క్లాసు కూడా ఉండేది. ఇంకా లైబ్రరీకి ఒక పీరియడ్ ఉండేది. మేము కూడా చదువుకుంటూనే ఆటలు, పోటీలు, సంగీతం, వక్తృత్వ పోటీలు అన్నీ పాల్గోనేవాళ్ళం. ఇంటికొచ్చి వేరే ఆటలు. ఏంటో ఈ నాటి పిల్లలు. చదువు తప్ప ఏది నేర్చుకుందామనే ఆసక్తి లేదు. అసలు సంగతి ఏంటి అంటే.. ముందుగా అందరికీ..

ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు..

ఈ సందర్భంగా ఒక మంచి మాట చెప్పుకుందాం. మాట్లాడుకుందాం. విందాం. చూద్దాం.. అర్ధం కాలేదా. చెప్తా వినండి. ఆ కాలంలో అంటే ఓ పాతిక సంవత్సరాల క్రింద దాదాపు ప్రతి సినిమాలో వీణ ,సితార్ పాటలు ఉండేవి గుర్తుందా. పెళ్లి చూపులు అనగానే వీణ పాట ఉండాల్సిందే. ఆ అమ్మాయి పాడుతూ వీణ వాయిస్తుంది. అంటే పెదాలు, చేతులు కదుపుతూ ఉంటుంది అన్నమాట. పెదాలైతే కలుస్తాయి కాని చేతుల నడక అస్సలు కలవాడు. పైనుండి కిందకు లాగడం తప్ప.. ఇది లాంగ్ షాట్ లో తెలీదులెండి.. కాని వాళ్ళ మొహాలు , హావభావాల సంగతి వదిలేస్తే కొన్ని మంచి పాటలు ఉన్నాయి. ముఖ్యంగా సుశీలమ్మ పాడినవి. ఈ అందమైన సాయంత్రం వాటిని ఓ సారి చూసేద్దామా.. అందమైన సాయంత్రం ఏంటి అంటారా? ఎండలు తగ్గి వాతావరణం చల్లబడి వానలు రావాలా వద్దా అని దోబూచులాడుతున్న వేళ అందమే కదా..

పాటలు వినేముందు ఒక మాట చెప్పనా.. డిగ్రీలో ఉండగానే నాకూ వీణ నేర్చుకోవాలనే కోరిక కలిగింది. సినిమాలు చూసి కాదులెండి. సరే నేను అడిగాక నాన్న కాదంటారా. తిరిగి తిరిగి ఏకాండి వీణ కొనిపించుకుని , ఒక టీచరమ్మ ని మాట్లాడుకుని నేర్చుకున్నాను. నా ఖర్మ కాలి ఆరు నెలలన్నా కాకముందే పెళ్లి కుదిరి ఆ వీణ అటకెక్కింది అనుకోండి. ఈ పెళ్లి చూపుల ప్రహసనంలో ఒకసారి ఏం జరిగిందంటే.. (నేస్తంలా సాగదీయను లెండి. క్లుప్తంగానే చెప్పేస్తాను) ఒక డాక్టరబ్బాయ్ తండ్రి వచ్చారు ఫలానావారి అమ్మాయి ఉందంటే అదీను పొడుగ్గా ఉందంట అని తెలిసి. ఆయన వచ్చినపుడు నా వీణ చూసారు. గుడ్ వీణ నేర్చుకుంటున్నావా? ఎంతవరకు వచ్చింది అని అడిగారు. చెప్పాను. సరే మళ్ళీ వస్తాం అబ్బాయిని తీసుకుని అని వెళ్ళిపోయారు. నాకు మండుకొచ్సింది. వీళ్ళు నన్ను సంతలో పశువులా చూడడానికి వస్తారా? పని పాటా లేదు. వచ్చి చూసి మెక్కి పోతారు అని తిట్టుకున్నా.. యిపుడు వీళ్ళు వస్తే నేను సినిమాల్లోలా టింగు టింగు మని వీణ వాయించాలా? చట్.. అస్సలు చేయను అని వాళ్ళు వస్తా అని చెప్పిన రోజే ఎవరూ చూడకుండా వీణ తీగలు తెంపేసా :). మళ్ళీ టీచరమ్మతో వేయించుకోవచ్చులే అని. లక్కీగా ఆ అబ్బాయి ఎవరినో ప్రేమించాడంట ... నేను రాను పో అన్నాడని ఎవరూ రాలేదనుకోండి. ..

ఇక పాటల సంగతి చూద్దామా... ఈ పాటలన్నీ నాకు చాలా ఇష్టమని అనుకోవద్దు. ఎదో వీణ పాటలు ఏమేమి ఉన్నాయని వెతికితే దొరికాయి. కొన్నిబావున్నాయి. కొన్ని ఒకే. కొన్ని ఊహూ..

సంఘం సినిమాలోని సుందరాంగ మరువగ లేనోయి




తెనాలి రామకృష్ణ లోని చందన చర్చిత




భూకైలాస్ లోని నా నోము ఫలించెనుగా




ఇద్దరు మిత్రులు లోని పాడవేల రాధికా




భార్యాభర్తలు లోని ఏమని పాడెదనో




నర్తనశాలలోని సఖియా వివరించవే




డాక్టర్ చక్రవర్తి లోని పాడమని నన్నడగవలెనా




మంచి కుటుంబంలోని మనసే అందాల బృందావనం




ఆత్మీయులు లోని మదిలో వీణలు మ్రోగే




అమాయకురాలులోని పాడెద నీనామమే




ప్రేమ్ నగర్ లోని ఎవరో రావాలి..




మీనా లోని శ్రీరామనామాలు



కొన్ని పాటల వీడియోలు దొరకలేదు.ఇలా వినేయండి పర్లేదు..

విచిత్ర దాంపత్యంలోని శ్రీ గౌరీ శ్రీ గౌరివే
జమిందారు గారి అమ్మాయిలోని మ్రోగింది వీణ
అభిమానవంతులు లోని వీణ పైన పలికిన
చక్రవాకం లోని వీణలోనా తీగలోనా
దేశోద్ధారకులు లోని వీణకు శ్రుతి లేదు
అభిమానవంతులు లోని వీణ పైన

23 వ్యాఖ్యలు:

తార

అదేదో శోభన్ బాబు సినిమాలో కుడా అదేదో పాట ఉండాలి, అది కింద ఇచ్చిన నాలుగు పాటల్లో ఒకటా..?
మిగతావాటి ఆడియో లింకులు కుడా ఇవ్వగలరా?

మీరు కొద్దిగా శ్రమ అనుకోకుండా, మీ పాత టపాల్లోని పాటలు, అన్నీ ఒక లిస్ట్‌లాగా ఇస్తే బాగుంటుంది

Naga Pochiraju

e veeNa palikEnu enni raagaalO, naa lOna medilEnu enni bhavaalO and nEne raadha nOyi gopaalaa(antaa mana mancikE movie)

వేణూశ్రీకాంత్

మంచి కంపైలేషన్ జ్యోతిగారు.. థ్యాంక్యూ..
(నేస్తంలా సాగదీయను లెండి. క్లుప్తంగానే చెప్పేస్తాను) హన్నా ఎంతమాటనేశారు.. అభిమానులూ ఎక్కడున్నారు.. వింటున్నారా :-))

మాలా కుమార్

వీణను బాగా వాయించారు :)
మీకు కూడా ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు .

tankman

"అసలు ఇప్పటి అమ్మాయిలకు మంచి అభిరుచి అస్సలు లేదు. చదువు, కంప్యూటర్లు, సినిమాలు, మొబైల్ లేదా ఐప్యాడ్ పెట్టుకుని పాటలు వినడం. మంచి వాయిద్యం నేర్చుకుందామని ఎంత మంది అనుకుంటున్నారు" ..... అస్సలు వొద్దు....అలా అనుకోవద్దు....మీరు ఏదో బాగా సంగీతం నేర్చుకున్న వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఆ మాట అని ఉంటారు...కాని చాలా మంది, వాళ్లకి సంగీతం బాగా వచ్చని feeling లో college functions లో, ఆఫీసు పార్టీ లలో అడ్డదిడ్డంగా ఒక పాత తెలుగు పాటో , అన్నమాచార్య కీర్తనో ఎత్తుకుని చంపేస్తారు...ఇలాంటి వాళ్ళంతా ipod లో పాటలు వినడమే మంచిది...మీరు వాళ్ళకి లేని పోనీ ideas ఇవ్వకండి మీకు పుణ్యముంటుంది...ఇలాంటి వాళ్ళని చూసే జంధ్యాల చాలా కామెడీ సున్నివేశాలు చిత్రీకరించారు :D

BTW పోస్ట్ బాగుంది :)

కొత్తావకాయ

టపా బాగుంది. మీక్కూడా శుభాకాంక్షలు. మిగిలిన వీణ పాటల సంగతికేం కానీ, నర్తనశాల లో "సఖియా వివరించవే" నా ప్రాణం. సావిత్రి వీణ మీటడం చూస్తే ఎంత సొగసుగా, సహజంగా ఉంటుందో. ఆమె నిజంగానే వైణికురాలేమో!ఆమెది నటన అని నేను అనలేను.
"నా హృదయంలో నిదురించే చెలి" పాటలో నాగేశ్వర్రావు గారు కూడా పియానో మీద నటించారట. ఆ చేతులు సాలురి రాజేశ్వర్రావు గారివని ఎక్కడో విన్నాను.

"ఏకాండి వీణ" అంటే ఏమిటండీ? బొబ్బిలి వీణ విన్నాను కానీ ఈ పదం నాకు కొత్త. ఏకం గా వీణ అనా లేక ఏక చెక్కతో చేసిన వీణ అనా?

Tejaswi

అద్భుతమైన వీణ పాటలను ఒకచోట చేర్చి అందించినందుకు ధన్యవాదాలు wonderful job. వీటిలో ఎక్కువశాతం నాకు కూడా ఫేవరెట్.

యమ్వీ అప్పారావు (సురేఖ)

ఇప్పుడు అన్నీ వాన పాటలైతే అప్పుడేమో అన్ని వీనుల విందుల వీణ పాటలు ! మంచి పాటలతొ కనులకు, వీనులకు విందు చేశారు.

నేస్తం

>>నేస్తంలా సాగదీయను లెండి. క్లుప్తంగానే చెప్పేస్తాను :))
చాలా మంచి పాటలు... నా ఫేవరెట్ సాంగ్స్ సఖియా వివరింపవే పాట.. చందన చర్చిత :)

జ్యోతి

తార
కింద ఇచ్చిన ఆడియో లింక్స్ లో శోభన్ బాబు పాట ఉంటుంది చూడండి. పేరు గుర్తులేదు. ఇక పాత పాటల లిస్ట్ అంటే ఇప్పట్లో కుదరదు. ఐనా నేను రాసినవి చాలా తక్కువ కదా..

లలిత నువ్వు చెప్పిన పాట ఆడియో లేదా వీడియో ఉంటే వెతికి పెడతాను. ధాంక్స్.

వేణు,,, :)))

మాలాకుమార్ గారు. ధాంక్స్ అండి..

జ్యోతి

సంజు
అందరమ్మాయిలు మీరు చెప్పినట్టుగా ఉండరేమో...

కొత్తావకాయ గారండి..
అదేంటో మీ పేరు చూడగానే కొత్త ఆవకాయ ఎర్రగా నోరూరిస్తూ ఉంటుంది. ఇదిగో ఇప్పుడే వేడన్నంలో ఆవకాయ వేసుకుని తిని వచ్చా కాబట్టి నో ప్రాబ్లమ్. కాస్త పిలవగలిగే పేరు పెట్టుకోకూడదు.. మాకు వీజీగా ఉంటుంది..

ఏకాండి వీణ అంటే మొత్తం ఒకే చెక్కతో చేసింది. అతుకులు లేకుండా. ఇవి దొరకడం కష్టమే.రికమండేషన్ తో రెండునెలలు దుకాణాల చుట్టూ తిరిగితే కాని దొరకలేదు అది. ఇరవై ఏళ్ల తర్వాత దాన్ని అమ్ముతాం అంటే దుకాణం వాడు పరిగెత్తుకు వచ్చి తీసికెళ్లాడు..:(

తేజస్వి, సురేఖ, నేస్తం... ధాంక్స్ మీకు వీణ పాటలు నచ్చినందుకు...

మురళి

అయ్యో వీణ అమ్మేశారా? నాకు తెలిసిన ఒక ముఖ్యమైన విషయం చెబుదాం అనుకున్నాను.. ఏమీ లేదండీ, తీగలు తెగిన వీణ ఇంట్లో ఉండకూడదు (ట) అందుకని వెంటనే "ఎవరో రావాలీ.." అని పాడి, వీణలు బాగు చేసే వాళ్ళని పిలిపించేయాలి.. పాటల జాబితాకి వస్తే, ఒకటి రెండు మినహా అన్నీ నాకు బాగా ఇష్టమైనవే.. మీ శైలికి భిన్నంగా ఈసారి కొంచం అచ్చుతప్పులు కనిపించాయి.. హడావిడిగా పోస్ట్ చేసినట్టు ఉన్నారు, ఓ సారి చూడండి..

కొత్తావకాయ

ఏంటో, "పండిత పుత్రః.." అన్నట్టు విజయనగరంలో పుట్టీ వీణ నేర్చుకోలేకపోయానే అనే బాధ అపశ్రుతిలా నా మనసులో "టింగ్" అంటూ ఉంటుంది ఎప్పుడూ! హ్మ్మ్.. మీరేమో వీణ ఉండీ అమ్మేసానంటున్నారు. హయ్యో..!

ఏకాండీ వీణ పేరు విని అదే అనుకున్నాను. థాంక్స్.

నా పేరా.. కొత్తావకాయ కి మించి చవులూరించేది ఇంకోటి ఉండదని ఆ పేరు పెట్టుకున్నా. మార్చేస్కోమంటే ఎలాగండీ! అయినా ఎంచక్కా తెలుగునాట కొలువై ఉన్నారు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆవకాయ ఉంటుందిగా! ఇంకేం బెంగ?

కొత్త పాళీ

క్యా బాత్ హై, జ్యోతీజీ.
శబాష్.
తెలుగు సినిమాల్లో వీణపాటల్ని గురించి చాలా సార్లు ఆలోచించాను గానీ అవసరమైన రీసెర్చి చెయ్యడానికి బద్ధకించి వాటిని గురించి రాసే ప్రయత్నం చెయ్యలేదు. మీరు మంచి పని చేశారు.
ఈ మధ్యకాలంలో వీణ అమ్మాయిల పేటెంటు అయింది గానీ వీణ చాలా "మగ" ఇంస్ట్రుమెంట్. రావణాసురుడు, దుర్యోధనుడు, శ్రీకృష్ణదేవరాయలు గొప్ప వైణికులు - కనీసం మన అన్నగారి సినిమాల్లో అలా చూపించారు :)
ఈ మధ్య కచేరీ వేదికలమీద వీణ ఎక్కువగా కనబడ్డం లేదు - చాలా విషాదకరమైన విషయం. ఇరవయ్యో శతాబ్దంలో సంగమేశ్వరశాస్త్రిగారు, ఈమని శంకరశాస్త్రిగారు, చిట్టిబాబుగారు మన సంగీతానుభవాన్ని సుసంపన్నం చేశారు.
మ్రో ఓ ఓ ఓ గింది వీ ఈ ఈ ణా ఆ .. పదె పదె హృదయాలలోనా ... భలే భలే.
Thank you.

జ్యోతి

మురళిగారు,, మీరు చెప్పింది నిజమే.తర్వాత బాగుచేయించానులెండి. ఇందులో ప్రేమ్ నగర్ పాట మాత్రం నాకు అస్సలు నచ్చలేదు.:))

కొత్తావకాయగారు. మీ పేరు విషయంలో మీరెలా అంటే అలాగే కానీయండి. వీణ నేర్చుకోలేదని దిగులెందుకు. దానికి వయసు పరిమితి లేదుకదా. సమయం చిక్కించుకుని మళ్లీ మొదలెట్టంఢి. నా వీణ అమ్మావాళ్లింట్లో ఉండింది. ఇల్లు మారేటప్పుడు వాళ్లే అమ్మేసారు . నాకు అప్పుడు తెలివిలేదు. పశ్చాత్తాప పడ్డాను. కాని మళ్లీ మొదలెట్టాలనే ఉంది.. చూడాలి..

జ్యోతి

కొత్తపాళీగారు, చాలా రోజులకు దర్శనమిచ్చారు. నమస్కారం.. పోనీలెండి ఈ వీణపాటలైనా మిమ్మల్ని లాక్కొచ్చాయి.. ధాంక్స్... :)) మీరు చెప్పింది నిజమే కాని ఇంతకుముందు దూరదర్శన్ లోకూడా తరచూ వీణ ప్రోగ్రాములు వచ్చేవి. ఇప్పుడదీ లేదు. అప్పుడప్పుడు వేంకటేశ్వర చానెల్ లో , దూరదర్శన్ లో వీణ ప్రోగ్రాములు వస్తుంటాయి. చాలా బాధగా ఉంటుంది. కొన్నిరోజులకు అసలు ఈ వీణలు అనేవి ఎలా ఉంటాయో అని అడుగుతారేమో..

రాజేష్ జి

$జ్యోతి గారు

బాగా రాశారు. మొన్న వనజ గారు చెప్పేవరకు ఇలా సంగీతానికీ ఓరోజుందని తెలీలేదు. మీరా సందర్భాన్ని పురస్కరించుకుని "మ్రోగింది వీణ.." అంటూ వీణ వాయించి మరీ చెప్పడం మరీ బావుంది.

అన్ని సంగీతవాద్యాలకన్నా వీణానాదం అంటేనే నాకు ఎక్కువ నచ్చుతుంది. ఆ మీటల్లో ఉన్న మార్దవం దానికి కారణం కావచ్చు :). శ్రీ త్యాగరాయ పంచకృతుల్ని తన వీణానాదం మాధుర్యం ఈ.గాయత్రి గారు మన జతులగతుల హృదయాన్ని ఎలా కట్టిపడేసారో ఇక్కడ వినవచ్చు. వీరు తెలుగువారు కావడం మన అదృష్టం. వీరు ఒక చక్కటి బ్లాగు కూడా నడుపుతున్నారు.


ఇక మీరు పెట్టిన పాటల్లో "మనసే అందాల బృందావనం.." కే నా ప్రధమతాంబూలం. ధన్యవాదాలు పంచుకున్నందుకు.

వనజగారు ఇంకా ఈ టపా చూసినట్లులేదే!!!

ఊకదంపుడు

వీణ నాది తీవ నీది - కనపడలేదండీ -
ఆ పాట లో వీణ కనబడదా? వినబడదా - రెండూనా...

జ్యోతి

వూకదంపుడుగారు,
ఈ పాటలో వీణ వాయించలేదుకదండి. అలా అంటే చాలా పాటలున్నాయి.
మ్రోగింది కళ్యాణవీణ
ఎవరో రావాలి ఈ వీణను సవరించాలి...
ఇలా మరికొన్ని పాటలు దొరుకుతాయి. కాని వీణ చేతిలో పట్టుకుని వాయించే పాటలుంటే చెప్పండి. టపాలో కలిపేద్దాం...

Devika Sai Ganesh Puranam

మీరు రాసిన పాటలన్ని దాదాపుగా దూరదర్శన్, హైదరాబాదు క్రితం నెల పసారం చేసిన "సిని 'మా' వీణ" కార్యక్రమం లొవి లాగా ఉన్నాయి. అవునా?

జ్యోతి

దేవికగారు,
నాకు తెలీదండి. నెల క్రింద అంటే అస్సలు చూడలేదు. ఇంట్లోనే బిజీ.. నేను ఎప్పటినుండో ఈ టపా రాయాలని గుర్తొచ్చిన్నప్పుడల్లా పాటలు రాసి పెట్టుకున్నాను. ఇక లేవు అనుకున్నాక, సంగీత దినోత్సవం కూడా ఉంది కదాని టపా కట్టాను..

Unknown

very nice Jyothigaru..

శ్రీనివాస రామకృష్ణ మంచికంటి

Madam గారు ,ప్రపంచ సంగీత దినోత్సవము రోజు(June 21st2011)miru raasina , మ్రోగింది వీణ పాటలు బాగున్నాయి....నేనూ..శ్రీ రామ నామాలు శతకోటి..ఎవరో రావాలి...మనసే అందాల బృందావనం...పాడమని నన్నడగవలెనా పరవశించి పాడానా..పాటలను విని చాలా ఆనందించాను,
ఈ విదముగా వీణ పాటలు వొకే చోట నిండుగా కనబడటము ఉల్లాసము కలిగించినది.
మీరు మీ వీణతో మీ అనుభూతిని పంచుకోవడం కుడా చాల బాగుంది.(వీణ ఇప్పుడు వున్నదా!,వాడుతున్నారా!)
మాకు చక్కని ఆనందాన్ని పాటలతో ఇచ్చినందుకు ధన్యవాదములు..

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008