Sunday, April 22, 2012

కలుసుకుందాం రండి....


ఎప్పుడు తిని తొంగుంటే ..... అన్నట్టు ఎప్పుడూ ఇల్లు, పిల్లలు, వంట అనుకోకుండా అప్పుడప్పుడు తమకంటూ ఒక సమయం పక్కకు తీసిపెట్టుకుని ఇష్టమైన పనులు చేయాలి అనుకున్న ప్రమదావనం సభ్యులు చాలా రోజులైంది మనం కలిసి ఓ సారి సమావేశం అవుదాం అని నిర్ణయించుకున్నారు. ఆదివారం ఐతే మంచిది అంటే అబ్బా ఆదివారమా?? ఆ రోజే ఎక్కువ పని ఉంటుంది కదా నాకు వీలు కాదు అని నేనంటే గయ్యిమన్నారు. మాకు మాత్రం పనుండదేంటి?? అదేం కుదరదు రావాల్సిందే అన్నారు. సరే కానివ్వండి అని ప్లానింగ్ మొదలెట్టాం. ఒక్కోరు ఒక్కో పని నెత్తినేసుకున్నారు. హైదారాబాదులో ఉన్న మహిళా బ్లాగర్లను, ప్లస్సర్లకు ఫోన్లు, మెయిల్స్ ద్వారా పిలుపులు వెళ్ళాయి. భోజనాల మెనూ డిసైడ్ అయింది. అందరు తమ ఇంట్లో నోటీస్ ఇచ్చేసారు ఆదివారం మాది . గెట్ టుగెదర్ ఉంది. లంచ్ పార్టీ. మీ సంగతి మీరు చూసుకోండి అని భర్త, పిల్లలకు చెప్పేసి పన్నెండుగంటల వరకు ఈరోజు మాలాకుమార్ గారి ఇంట్లో అందరు చేరుకున్నారు తమ వంతు వంటకంతో..

ఎంత మంది వచ్చారంటే మొత్తం పదమూడు మంది అయ్యారు. కొందరు వేరే ఊర్లో ఉంటున్నాం అన్నారు. ఊర్లో ఉన్నవారు వేరే పనుందన్నారు. ఇక వచ్చింది ఎవరెవరంటే సుజాత వాళ్ల అమ్మాయి సంకీర్తన , సి.ఉమాదేవి , జి.ఎస్.లక్ష్మి , స్వాతి చక్రవర్తి, అన్నపూర్ణ, సుజ్జి, వరూధిని, జ్ఞానప్రసూన, ఫై.ఎస్.ఎం.లక్ష్మి, మాలాకుమార్ (హోస్ట్), జ్యోతి, రమణి వాళ్ళ అమ్మాయి మౌనిక, ..చివరిలో కలసిన మంథా భానుమతి... సుజాత గారు వేరే పనుందని తొందరగా తినేసి వెళ్ళిపోయారు. అంతవరకూ మేము కోక్, చిప్స్, మంచింగులతో పరిచయాలు చేసుకున్నాం. ముందుగా జ్ఞానప్రసూనగారు అందమైన కవిత రాసుకొచ్చారు. అది   సురుచి బ్లాగులో చూడొచ్చు. చిట్టీలు వేసి మిస్ గెట్ టుగెదర్ గా వరూధినిగారిని ఎన్నుకున్నాం. జ్ఞానప్రసూనగారు వరూధినిగారికి చిన్నదే అయినా అందమైన గిఫ్ట్ ఇచ్చారు. అలా సమయం గడిచింది తెలియలేదు. అందరూ తెచ్చిన డబ్బాలు టేబిల్ మీద పెట్టుకుని ఒక్కోటి ఎవరెవరు తెచ్చారు అనుకుంటూ తీరిగ్గా భోజనాలు కానిచ్చాం. రోజూ ఇంట్లో వాళ్లకు అడిగి వడ్డించడం అలవాటైన మాకు ఇలా తీరిగ్గా కూర్చుని తినడం అరుదైన విషయమే మరి.. భోజనాలు అయ్యాక కొన్ని గేమ్స్ ఆడుకున్నాం. చివర్లో అంతాక్షరి కూడా. సాయంత్రం కావస్తుంటే టీ తాగేసి. ఫోటోలు దిగేసి, మాలగారి ఇంటి వెనకాల ఉన్న ఉసిరి చెట్టు దులిపి కొన్ని కాయలు తీసుకున్నాం. మిగిలిన వంటకాలను ఎవరికీ కావలసినవి వాళ్ళు పంచుకుని ఇంటి దారి పట్టాం.ఇది చదువుతుంటే చాలా సింపుల్ గా ఉంది కదా. కాని మేమంతా ఫుల్లుగా ఎంజాయ్ చేసాం. త్వరలో మళ్ళీ మరొకరి ఇంట్లో కలవబోతున్నాం.అవునూ ఇవాళ మా స్పెషల్స్ చెప్పలేదు కదూ..
పాలక్ పూరి,
వెజ్ బిర్యాని
క్యారట్ పెరుగు పచ్చడి
చోలే
ఆవడలు
పూర్ణాలు
పులిహోర్ విత్ బోల్డు జీడిపప్పులు
నాలుగు రకాల పచ్చళ్ళు ( రెండు కొత్తావకాయలు, దోసావకాయ, పుదీనా పచ్చడి)
సాంబార్
మజ్జిగపులుసు విత్ బజ్జీలు
కోక్ విత్ చిప్స్
మూడు రకాల స్వీట్లు (మైసూర్ పాక్, కాజాలు, మిల్క్ మైసూర్ పా )


ఏడాదిన్నర క్రితం జరిగిన మా సమావేశం వివరాలు మరోసారి చూస్తారా?

21 వ్యాఖ్యలు:

శశి కళ

అబ్బా నోరు ఊరుతుంది...విశేషాలు చూస్తుంటే ఆనందం వచ్చేస్తుంది....అబ్బా నేను కూడా హైదరా బాద్ లో ఉంటె బాగుండేది...జ్యోతి అక్క...

మాగంటి వంశీ మోహన్

పదకొండు మందికి ఆ చివర ఫోటోలో బల్ల మీద పెట్టినవేం సరిపోతై?.....చిటికెనవేలుకు రాసుకుని తిన్నారా? అంతమంది కలిసినప్పుడన్నా వివాహ భోజనంబులా పీఠాలేసుకోవద్దూ? ....హహహా...ఊరకే అన్నాలెండి....బాగుంది బాగుంది....

జ్యోతి

వంశీగారు. మాటలతోనే కడుపు సగం నిండిపోయాయి. ఈ మాత్రం వంటకాలలో సగం సగం మిగిలిపోతే పంచేసుకున్నాం కూడా..

కాయల నాగేంద్ర

మహిళా బ్లాగర్ల గెట్ టు గెదర్ విశేషాలు "కలిసుంటే కలదు సుఖం"అనిపించేలా ఉందండీ!

Ramani Rao

ఇక్కడ పులిహోర లేదేంటి చెప్మా??

"రమణిగరు వారి అమ్మాయి మౌనిక, సంకీర్తన....."

చిన్న సవరణ: మౌనిక మా అమ్మాయి, సంకీర్తన సుజాతగారి పాప.. ofcourse, అందరికీ తెలుసనుకొండి క్లారిటీ మిస్ అవకూడదని.. ;))

మరువం ఉష

సంతోషం. "కలుసుకున్నాం సుమండీ!" అనుండాలేమో శీర్షిక;) ఇదే మాదిరిగా కలుసుకున్నామని చదివిన మునుపటి టపాల్లో http://bhanuramarao.blogspot.com/2010/12/blog-post_28.html ప్రగతి రిజార్ట్స్ లోని ఆయుర్వేద వనం గూర్చి చదివి కాస్త కుళ్ళాను. అలాగే, ఈ పోస్ట్ లో "మాలగారి ఇంటి వెనకాల ఉన్న ఉసిరి చెట్టు దులిపి కొన్ని కాయలు" కాస్త ఊరించింది. ఇక్కడ తరుచుగా జరిగే పార్టీలు తినలేక పాట్లు కనుకా మీ వంటకాల్లో 'కొత్తావకాయ' కవ్వించింది, అంతే! ఇతరత్రా విషయాలకి అభినందనలు.

జ్యోతి

రమణిగారు సంకీర్తన అందరికి తెలిసిందే కదా అని చివర్లో పెట్టేసా ఇప్పుడు తీసికెళ్లి సుజాత పక్కన పెట్టేసాలెండి. భుక్తాయాసం, అలసటతో పులిహోర మరచిపోయినట్టున్నా. ఇప్పుడు చేర్చా చూడండి..

చక్రవర్తి

నాకు ఙ్ఞాన ప్రసూన గారి పూర్ణాలు భలే నచ్చాయి.. యమ్మీ.. వెరైటీగా ఎవ్వరు చేసారో గాని పునుగులు తీసుకెళ్ళి మజ్జిగలో ముంచారు. పెరుగు ఆవడ స్టైల్లో చేద్దాం అన ప్రయత్నం వికటించ లేదు కానీ బాగానే ఉంది. బిర్యానీకి తోడుగా ఉంటుందని చోళే సాయంత్రానికి కూడా బాగానే ఉంది. అలాంటిది వేడి వేడిగా తింటేనా!!! నా సావిరంగ.. జింగ్ చకనే..

టోటల్ గా చెప్పాలంటే, సమిష్టిగా చేసినది బాగాలేక పోయినా తృప్తిగా ఉంటుంది అనేది ఇలాంటి చర్యల వల్ల నిరూపితం అవుతుంది.

చక్రవర్తి

@ఉషగారు,

కొత్తావకాయ తెచ్చిందెవ్వరో జోతిగారు వ్రాయలేదు. ఈ విషయాన్ని నేను ఖండిస్తున్నాను.

ఇంతకీ చెప్పొచ్చిన విషయం ఏమిటంటే, అది నా భార్య తెచ్చింది అన్న విషయం నేను చెప్పకనే చెప్పానని మీరు అర్దం చేసుకోవాలన్నమాట

సుజాత వేల్పూరి

బ్లాగుల్లోం, ప్లస్లో సంకీర్తన నా కంటే బాగా అందరికీ తెలుసు కాబట్టి తన పేరు ఎవరి పక్కన ఉన్నా తన ఐడెంటిటీ తనదే

Ramani Rao

పులిహోర్ విత్ బోల్డు జీడిపప్పులు... hahaha thanks jyothigaaru..

@sujatagaru: అందరికీ తెలుసనుకొండి క్లారిటీ మిస్ అవకూడదని.. ;))

మరువం ఉష

చక్రవర్తి గారు, ఎంత మంచి భర్త అనుకున్నాను. :) 'సురుచి' బ్లాగులో అప్డేట్ చదివి బహుశా జ్యోతి చేసిందేమో అనుకున్నాను పచ్చళ్ళు. అసలీ వార్త చదవగానే నాన్న గారిని ముందుగా అడిగింది ఆవకాయ పురమాయించటం మాటే. :) మాకు పెద్ద రసాలు బాగా పీచు పట్టి ముదిరాక దింపించి చేస్తారు ఈ పచ్చళ్ళు. ఈలోగా అపుడపుడు జీడావకాయ పడతారు. ఇలా ప్రవాసం వచ్చాక అన్నీ దొరకవు అందుల్లో ఆవ వాసన తగ్గని ఆవకాయ మరీ అరుదు. (అమ్మాయిలూ/అమ్మలూ, మీరంతా స్వాహాలు, ఆరగింపులు కానిచ్చారుగా! ఒక్కరైనా ఒక ముక్క దాద్దారనుకున్నారాంట?)

జ్యోతి

ఉష .. నేను ఆవకాయ ఇప్పుడే పెట్టను. ఇంకా నెల పడుతుంది. అప్పటికి బాగా కండపట్టిన కాయలు దొరుకుతాయి. అలాగని అంతవరకు తినకుండా ఉంటామా.. ఒక కాయ ఐనా సరే ముక్కలు తరుక్కుని ఆవకాయ పెట్టేయడమే. నిన్న నేను తీసికెళ్లింది దోసావకాయ, పుదీనా పచ్చడి..సాంబార్, మజ్జిగ పులుసు మాత్రమే..
ఇక విశేషాలంటావా! వస్తున్నాయొస్తున్నాయి ఆగు.. అన్నీ ఒకేసారి అంటే ఎలాగమ్మాయ్!!!

జయ

మొత్తానికి చాలా సరదాగా గడిపారు. అన్నీ తినేసారుగా, కబుర్లు, ముచ్చట్లతో సహా. అభినందనలండి.

Unknown

I missed it

జ్యోతి

స్వాతిగారు మీరు వచ్చేసారా? నాకు తెలీదు లేకుంటే పిలిచేదాన్ని. మరో పదిరోజుల్లో మరో సమావేశం ఉంది. తప్పకుండా రావాలి. వివరాలు నేను తర్వాత చెప్తాను.

రసజ్ఞ

మంచి మంచి విశేషాలే కాక ఇలా నోరూరిస్తూ మమ్మల్ని ఉడికించటం భావ్యమా చెప్పండి???

మాలా కుమార్

ఫొటోలు చాలా బాగా వచ్చాయండి .

శ్రీలలిత

ఒక బ్లాగర్ తన బ్లాగ్ లో ఒక పోస్ట్ రాస్తూ, అటువంటి పొస్ట్ రాయడానికి అవకాశమిచ్చిన బ్లాగర్ ను అభినందించారు. అటువంటి అవకాశమిచ్చిన ఆ బ్లాగర్ ను నేనే. ఇదే ఆ పోస్ట్..
http://sumamala.blogspot.in/2012/04/blog-post_25.html
కాని అటువంటి అవకాశమిచ్చిన ఆ బ్లాగర్ కామెంట్ మాత్రం వారి పోస్ట్ లొ పబ్లిష్ చెయ్యలేదు.
ఏ విషయాన్నైనా ఇరువైపులవారి వాదనలను గ్రహించనిదే చదువరులు ఒక అభిప్రాయానికి రాలేరనే ఉద్దేశ్యంతో జ్యోతిగారి అనుమతి తీసుకుని నా కామెంట్ ను ఇక్కడ పెడుతున్నాను. థాంక్యూ జ్యోతీ.

మొత్తం ఒక్కచోటే HTML accept చెయ్యలేదు కనక తరవాతి కామెంట్ కూడా చదవండి..
రమణీ,
మీ అభినందనకు ధన్యవాదాలు.
విశ్లేషణకు అవకాశమిచ్చాను కదా అని, కేవలం అభిప్రాయం తెలిపేటంతవరకే ఈ పోస్ట్ అన్న మీరు విషయాన్ని పట్టుకుని ఇంత సాగదీయడం సబబు కాదేమో!
మీ పోస్ట్ చూడగానే నేను రాసిన అర్ధం వివరించి, మీరు మరోలా అర్ధం చేసుకుంటే మన్నించమని కూడా కోరాను. కాని నన్నుబయటపెట్టడం ఇష్టం లేదంటూ చెప్పి, మిగిలినవారి కామెంట్స్ పబ్లిష్ చేసేరు.
కాని మీరు నేను రాసిన వాక్యం కోట్ చెసినప్పుడే నన్ను బయట పెట్టేసారని మీకు తెలీలేదా?
మీ కన్న వయసులో పెద్దదాన్ని కనుక మీకన్న కొన్ని విషయాలు ఎక్కువ తెలిసే అవకాశముంది కనుక ఇక్కడకొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మా అమ్మాయికి చెప్పినట్టే చెపుతున్నాను.
ఒక పదానికి ఒక్క అర్ధమే కాదు, చాలా అర్ధాలుంటాయి. ఆ అర్ధాలు కూడా చెప్పే సందర్భాన్ని బట్టీ, చెప్పే వ్యక్తులను బట్టీ, ఆయా వ్యక్తుల మధ్యగల సంబంధ బాంధవ్యాలను బట్టీ మారుతూ వుంటాయి.

శ్రీలలిత

నేను ఒకరిని పొగిడి నన్ను కాని మరొకరిని కాని అఙ్ఞానులని చెయ్యడమన్నది కేవలం లిటరల్ మీనింగ్ లో కాదు.
ఒకరిని పొగిడి పబ్బం గడుపుకోవలసిన అవసరం కూడా నాకు లేదు.
2003 లోనే నావి రెండు కథలకు "కథాపీఠం" అవార్డ్స్ వచ్చాయి. అప్పటినుంచీ ఇప్పటివరకూ 40 కథలు పబ్లిష్ అయ్యాయి. 2008 లో ఆంధ్రభూమి వారపత్రికలో నేను రాసిన నవల సీరియల్ గా వచ్చింది. మొన్నీ మధ్యనే అంధ్రభూమి మంత్లీలో ఒక మినీ నవల వచ్చింది. ATA వారి పెట్టిన కథల పోటీలో నా కథకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది.
నావి 10 కథలు కన్నడభాష లోకి అనువదించబడి బహుమతులు గెలుచుకున్నాయి. 60 సంవత్సరాలనుండి వస్తున్న జాగృతి పత్రిక నేను రాసిన కథకు నన్ను సత్కరించింది.
మరో కథ ఆంగ్లభాషలోకి అనువదించబడి 60 సంవత్సరాలపైగా వస్తున్న త్రివేణీ పత్రికలో ప్రచురించబడింది.
ఇంకా రేడియోలో వచ్చిన ప్రసంగాలు, నాటికలు, కవితలు వుండనే వున్నాయి.
ఇంతేకాకుండా ఇంకా టీవీలో ఇన్ని ప్రయివేట్ ఛానల్స్ రాకముందే నేను టీవీ ప్రోగ్రాములు కూడా ఇచ్చాను.
ఇవన్నీ నేను గొప్ప చెప్పుకుందుకు చెప్పటం లేదు. జ్యోతిని పొగడడంలో నాకు స్వార్ధం లేదన్న విషయం స్పష్టం చెయ్యడానికే చెప్పాను.
మరింక జ్యోతిని పొగిడి నన్ను కానీ, మరొకరిని కానీ అఙ్ఞానులని రాయడంలో నా ఉద్దేశ్యం మరోసారి మీకు స్పష్టం చేస్తాను.
ఒక తల్లికైనా, తండ్రికైనా, గురువుకైనా వారి వారి పిల్లలు, శిష్యులు తమకన్న ప్రయోజకులయితే తాము అయినదానికన్న ఎక్కువ సంతోషిస్తారు. ఈ సంగతి మీకూ తెలిసే వుంటుంది. వారి ముందు తాము అఙ్ఞానులమన్న విషయాన్ని చెప్పుకోడానికి ఏమాత్రం సంకోచించరు. ఇంకా చెప్పాలంటే సంతోషిస్తారు కూడా.
నాకు నా పిల్లలతో ఇది అనుభవమే. ఒక్కొక్కసారి నేను ఎమోషనల్ అవుతూ వుంటాను. కాని వాళ్ళు మాత్రం ఎటువంటి పరిస్థితులైనా సరే బాలన్సెడ్ గా వుంటారు. వాళ్లని గమనించి నేను ఆ విషయంలో అఙ్ఞానురాలిననే అనుకుంటాను.
ఇక్కడా అదే జరిగింది. అన్ని పాటలు తెలిసిన జ్యోతి కన్న నేను ఎక్కువగా చెప్పినట్టు అనిపించి, అలా అన్నాను. మీరు అందరినీ అఙ్ఞానులని చెయ్యకండి అని చెప్పగానే, మీ ఫీలింగ్స్ హర్ట్ అయ్యాయనిపించి, వెంటనే అది తీసేసి నాకు నేనే అఙ్ఞానిగా చెప్పుకున్నాను. మీ ఫీలింగ్స్ ని హర్ట్ చేసినందుకు మిమ్మల్ని మన్నించమని కూడా అడిగాను.
మరొకరయితే దీనిని అక్కడితో ఆపేసి వుండేవారు. కాని మీరు దీనికి అభిప్రాయ సేకరణ అంటూ ఇదేదో అంతర్జాతీయ సమస్య అన్నంత విషయం చేసేరు.
ఇవన్నీ కాకుండా నాకు స్నేహం అంటే ప్రాణం. స్నేహితుల మధ్య అపార్ధాలకు తావుండదని అనుకునేదాన్ని. ఇన్నాళ్ళూ, ఇన్నేళ్ళూ అలాగే జరిగింది. ఎందుకీ మాట అంటున్నానంటే 1993 లో మేమొక మహిళామండలి పెట్టుకున్నాం.
నెలకొకసారి కలుస్తుంటాం. అప్పుడప్పుడు కలిసి విందులు చేసుకుంటుంటాం. ఇంకా అప్పుడప్పుడు కలిసి చుట్టుపక్కల ఊళ్ళు కూడా తిరిగొస్తుంటాం. అంతే కాకుండా అందరం కలిసి రేడియో ప్రోగ్రాములు కూడా ఇస్తుంటాం. ఇప్పటికీ మేము అలాగే నిజమైన స్నేహితుల్లాగ కలిసి వున్నాం.
అటువంటిదానిని ఒక స్నేహితురాలు నేను ఒక ఫ్లోలో జనాంతికంగా అన్న మాటని పట్టుకుని ఇటువంటి అభిప్రాయ సేకరణ చేస్తుందని తెలియడం ఇదే ప్రథమం.
మన రోజు బాగులేనప్పుడు "నారాయణా.." అన్నాకూడా ఎదుటివారికి తప్పు గానే అనిపిస్తుంది. ఇక్కడ నాకు జరిగింది అదే అనుకుంటున్నాను.
ఇది నాకు జీవితం నేర్పిన మరో పాఠంలా భావిస్తున్నాను.
మీకు నేను ఇచ్చిన వివరణ సరిపోకపోతే నాకు ఒక మెయిల్ చెయ్యొచ్చు కదా.. నేను మా అమ్మాయికి చెప్పినట్టే ఇంకా అర్ధమయ్యేటట్టు చెప్పేదానిని.
అందుకే మళ్ళీ చెపుతున్నాను. మీకు ఇంకా వివరణ కావాలంటె నాకు మెయిల్ చెయ్యండి. అంతేకాని ఇలా మనం పబ్లిక్ గా బ్లాగ్ లో అర్ధాలు చెప్పుకుంటుంటే చదివినవాళ్ళు విపరీతార్ధాలు తీసే అవకాశం వుందని మీకు అనిపించటం లేదూ!
ఇది మీరు పబ్లిష్ చేస్తారనే అనుకుంటున్నాను.

SHANKAR.S

:)

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008