Wednesday, January 2, 2013

‘పుట్టింటి జోక్యం’ శ్రుతిమించితే అనర్థాలే!


  • -జ్యోతి వలబోజు
  • 02/01/2013

ఆలుమగల అనురాగానికి గుర్తుగా నవమాసాలు మోసి బిడ్డను కంటుంది స్ర్తి. పిల్లలు తను చెప్పినట్టుగా ఉండాలని అనుకుంటుంది ఆ తల్లి. ఆ మమకారం, ప్రేమ, స్వార్థం- పిల్లలు పెరిగి పెళ్ళిళ్ళు అయ్యాక కూడా తగ్గకుండా అలాగే ఉంటుంది ఆమెలో. కొడుకు పెళ్లయ్యాక తనను మరచిపోతాడేమో, పట్టించుకోడేమో అని కోడలిని అనుమానిస్తుంది, సాధిస్తుంది ఆ తల్లి. అలాగే, కూతురికి పెళ్లి అయ్యాక- తన బిడ్డను అత్తవారింట ఎలా చూసుకుంటున్నారో? అనే బెంగ, అనుమానం తల్లిని పీడిస్తాయ. పరాయ ఇల్లు కాబట్టి తన కూతురిని సరిగ్గా చూసుకోరు.. గౌరవించరు, ఇంటిపనంతా చేయిస్తారు. ఆస్తిపాస్తులు సమానంగా ఇవ్వరు అంటూ ఎన్నో ఆలోచనలు. కుమార్తె ఉంటున్న అత్తవారింట- అందరూ చాలా తెలివైనవారు, తన కూతురు మాత్రం చాలా అమాయకురాలు అని భావిస్తుంది. కూతురిని అనుక్షణం గమనిస్తూ, హెచ్చరిస్తూ ఉంటుంది. తల్లి ప్రేమలో మునిగిపోయిన అమ్మాయి కొత్త ఇంట్లో ఇమిడపోలేక పోతుంది. తల్లి చెప్పిందే సరైనదని, అత్తగారింట్లో ఎవరు ఏం చెప్పినా, చేసినా తప్పుగానే భావిస్తుంది. అత్తారింట్లో జరిగే అన్ని సంఘటనల్ని ఎప్పటికప్పుడు తల్లికి చేరవేస్తుంది. తన కూతురి తప్పు ఉందోలేదో తెలుసుకోకుండా ఆ తల్లి ఇంకా రెచ్చగొడుతుంది. ఈ గొడవలు ముదిరి ఆ కుటుంబంలో అల్లకల్లోలం సృష్టిస్తాయి. ఇలాంటి చిన్న చిన్న మనస్పర్థల వల్ల కోర్టు కేసులు తప్పడం లేదు.
అత్తవారింట తనకు మనశ్శాంతి లేదని, కట్నం కోసం సతాయిస్తున్నారని కొందరు కోడళ్లు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయ. కుటుంబం అన్నప్పుడు చిన్న చిన్న గొడవలు, మనస్పర్థలు ఎక్కడైనా ఉంటాయి. వాటిని గడప దాటకుండా పరిష్కరించుకోవడం ఇల్లాలి ధర్మం. అత్తవారింట వేధింపులు ఉన్నప్పుడు పుట్టింటివారినుంచి సహాయం తీసుకోవడం తప్పేమీ కాదు. ఐపిసి సెక్షన్ 498ఎ కింద నమోదవుతున్న కేసులలో ఎక్కువశాతం అ మ్మాయి పుట్టింటివారి జోక్యం వల్లనే అన్న వాదనలు లేకపోలేదు. కుమార్తె పెళ్లయ్యాక పుటింటివారి జోక్యం ఎంతవరకు ఉండాలి? అసలు ఉండాలా? వద్దా? అనే విషయమై కొంతమంది అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.
భరద్వాజ్ వెలకన్ని,
సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్, అమెరికా
ప్రస్తుత తరం అటు పురాతనమూ ఇటు ఆధునికమూ కాని భావజాలంతో కొట్టుమిట్టాడుతోంది. ఈ సందిగ్ధత కొత్తగా పెళ్ళయిన జంటలలో ఎక్కువగా కనిపిస్తోంది. నూతన దంపతులకు పెద్దవారి మార్గదర్శనం చాలావరకూ అవసరమే. సంసారిక జీవనంలో ఇతరుల మతిమీరిన జోక్యంవల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువగా కలుగుతోంది. పుట్టింటిని వదిలి వేరే అలవాట్లు, జీవన విధానం ఎదురయ్యే అత్తవారింట అడుగుపెట్టే కూతురికి సరైన శిక్షణ ఇవ్వటం తల్లి బాధ్యతే. ఒకవేళ కూతురు దుర్భరమైన స్థితిలో ఉంటే ఆమెకి అండగా నిలబడటం ఆ తల్లి కర్తవ్యం. ఇంతవరకూ అయితే కూతుళ్ళ సంసారాలలో తల్లుల జోక్యం ఫరవాలేదు.
దాంపత్యంలో ఎదురయ్యే సమస్యల కారణంగా కొంతమంది ఆడపిల్లలు తమ తల్లులపై ఎక్కువగానే ఆధారపడుతున్నారు. దీనిని సాకుగా తీసుకుని ఆ తల్లులు తమ కూతుళ్ళ సంసారాలమీద పెత్తనం చెయ్యటానికి ప్రయత్నిస్తున్నారు. తమ కూతుళ్ళకి, వియ్యాలవారికి మధ్య విభేదాలు సృష్టించి తద్వారా తమ ఆధిపత్యం చాటుకోవాలనుకునే తల్లులు కూడా కోకొల్లలు. సజావుగా సాగాల్సిన సంసారాలకి అతిపెద్ద ఆటంకాలు వీరే. టూకీగా చెప్పాలంటే కూతురికి సరైన మార్గనిర్దేశం చేసే తల్లుల జోక్యం కొంతవరకూ అవసరమైనా ఎక్కువగా జోక్యం చేసుకోవటం భావ్యం కాదు.నీలిమ,
గృహిణి, బెంగళూరు
అమ్మాయికి పెళ్లయ్యాక తల్లిజోక్యం ఉండటంలో తప్పేమీ లేదు. కొన్ని సందర్భాలలో అది అవసరం కూడా. మితిమీరిన చొరవ ఎప్పుడూ ప్రమాదమే. ఒక్కోసారి పెద్దల కారణంగా కాపురంలో గొడవలు పెరిగే అవకాశం ఉంటుంది. కూతురి తప్పు ఉంటే సరిదిద్దాలి. అలా కాకుండా- నీకేం తక్కువ? ఎందుకు మాటలు పడతావ్? నువ్వే అంత చాకిరీ ఎందుకు చేయాలి- అని అహం నూరిపోసి ఆడపిల్లల మనసును విషపూరితం చేసే వారూ ఉన్నారు. ఆవేశం క్షణికమే, కానీ భర్త తోడు జీవితాంతం ఉండేది. ఒకరు చెప్పినట్టు వినడం కంటే తన జీవితం గురించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి. క్షణికమైన ఆవేశంలో భార్యాభర్తలు దూరమైతే నష్టపోయేది వాళ్ళ పిల్లలే. వారు కూడా ఎంతో మానసిక హింస అనుభవిస్తారు.
కూతురి పెళ్లయ్యాక కూడా తన మాటేవినాలి, అత్తవారింట తన కూతురి మాటే నెగ్గాలి. పెత్తనం చెలాయించాలి-అని తల్లి కోరుకోవడం చాలా దారుణం. అమ్మాయి కూడా తల్లిని ఎక్కువగా జోక్యం చేసుకోనివ్వకూడదు.


రామకృష్ణ పుక్కళ్ల
కార్టూనిస్ట్, వైజాగ్
పుట్టింటి సంప్రదాయాల్ని జీర్ణించుకుని గారాబంగా పెరిగిన అమ్మాయిలు, పెళ్లయ్యాక మెట్టినింటి సంప్రదాయాలతో సర్దుకుపోగలరో లేదో అనే ఆందోళన తల్లిదండ్రులలో కలగడం సహజం. కుమార్తెపై కొందరు తల్లులు అనవసరంగా ఆందోళన చెందడానికి అనేక కారణాలు ఉన్నాయ. పెళ్ళయ్యాక కూతురుని చూడకుండా ఉండలేమన్న మితిమీరిన మమకారం ఒకటైతే, మంచి ఉద్యోగంలో స్థిరపడి సంపాదించే కూతురి ఐదంకెల జీతం మరొకటిగా చెప్పవచ్చు.
మెట్టినింటిలో అడుగుపెట్టిన కొత్త పెళ్లికూతురుకి ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు తప్పనిసరవుతాయి. అత్త మనసుని, ఆ కుటుంబ సభ్యుల వ్యవహార శెలి, వారి అలవాట్లు అర్థం చేసుకుని తదనుగుణంగా నడుచుకోక తప్పదు. కూతురు అత్తారింటికి వెళ్లిపోయాక, ఆమె కాపురం ఎలా సాగుతున్నదో అన్న ఆతృతతో పదే పదే ఫోన్లు చేసి పలుకరించనిదే తల్లి మనసు కుదుటపడదు. కూతురి విషయంలో ఉన్నదానికీ లేనిదానికీ ఆందోళన పడకూడదు. పరోక్షంగా కూతురిలో- మెట్టినిల్లంటే ఏవగింపు కలిగించిన వారవుతాము.
తల్లి చేసే అతి గారాబం వలన కూతురి వైవాహిక జీవితం విడాకులు వరకూ దారిసిన సంఘటనలు కూడా ఉన్నాయి. భర్త ఉద్యోగ నిమిత్తమై విదేశాలకు వెళ్లినపుడు తనను బయటకు వెళ్లి చదవనీయలేదనే కోపంతో పుట్టింటికి వెళ్లిపోయింది ఓ అమ్మాయి. ఆమె తల్లి కూడా కూతురు అత్తారింట్లో చాలా కష్టాలు పడుతుందని నమ్మి కూతురినే సమర్థించింది, తనతోనే ఉంచుకుంది. తర్వాత ఆ కూతురు చదువుకుని మంచి జీతంతో ఉద్యోగం సంపాదించుకుని తల్లికి సహాయంగా ఉంది. ఆమె అల్లుడు వచ్చి తన భార్యను తీసికెళతానన్నా కూతురి జీతం మీద ఆశతో పంపకుండా అల్లుడినే ఇల్లరికం ఉండమని చెప్పింది. ఈ గొడవ పెద్దదై విడాకులకు దారి తీసింది. అబ్బాయి ఏడాదిలోపే మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. విడాకులు తీసుకుని ఆరేళ్లయినా ఆ అమ్మాయి ఒంటరిగానే ఉంది.
కూతురి కాపురంలో తల్లుల జోక్యం చేసుకుంటే అపుడపుడు అవి బెడిసికొట్టి అనర్థాలకు దారితీయవచ్చు. కూతురు ఓ ఇంటి ఇల్లాలిగా వెళ్లాక అక్కడ ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను తల్లిదండ్రులు భూతద్దంలో చూడకుండా, ఆడపిల్లలకు సర్దిచెప్పి సామరస్య వాతావరణం నెలకొల్పే ప్రయత్నాలు చేయాలి. కూతురు కాపురంలో విపత్కర పరిస్థితులు, జటిలమైన సమస్యలు, అనూహ్యమైన సంఘటనలు తలెత్తితే తప్ప, మామూలు సంఘటనలు జఠిగినప్పుడు తల్లిదండ్రులు అస్సలు తలదూర్చకూడదు.


సుమన్ సయానీ,
సైకాలజిస్ట్, గ్లోబల్ హాస్పిటల్స్, హైదరాబాద్
ఆడపిల్లలు పెళ్లయ్యాక తల్లిదండ్రుల నీడలో భద్రంగా ఉన్నట్టు భావించరాదు. పెళ్లి ఒక కొత్త బాధ్యతను మోసుకొస్తుంది. పెళ్లితో జీవితాంతం కలిసి ఉండే బంధాలు కూడా మొదలవుతాయి. ఇవన్నీ తను స్వంతంగా చేసుకోవాలి తప్ప కడదాగా అమ్మా నాన్నా అని అనకూడదు. చిన్న చిన్న విషయాలను తల్లిదండ్రులదగ్గరకు తీసుకువెళ్ళడం మంచిది కాదు. వీలైనంతవరకూ తన విచక్షణ, తెలివితేటలతో పరిష్కరించుకోవాలి. చాలా తీవ్రమైన సమస్యలను, తప్పనిసరి అనుకున్నప్పుడు మాత్రమే పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలి. తల్లిదండ్రులు కూడా ప్రతీ విషయంలో జోక్యం కలుగజేసుకుని అనవసరంగా కూతురి కాపురంలో సమస్యలు సృష్టించడం శ్రేయస్కరం కాదు. ఒక్కోసారి తమ ఇంటి సమస్యలను కన్నవాళ్ళతో చెప్పుకుని బాధపడడం కూడా మంచిది కాదేమో. అవి మరింత తీవ్రమై జటిలంగా మారే ప్రమాదం ఉంది. తల్లి అనవసర జోక్యం కారణంగా కూతురి కాపురంలో చాలా తీవ్రమైన సమస్యలు ఉత్పన్నమైన సంఘటనలెన్నో ఉన్నాయి. ముఖ్యంగా తల్లి తన కూతురికి చిన్నపాటి కష్టమొచ్చినా తీవ్రంగా స్పందిస్తుంది. ఎటువంటి సమస్యలైనా మనం పరిష్కరించుకోలేమనిపించినప్పుడు పుట్టింటివాళ్ళకు, బంధువులకు చెప్పే బదులు ముఖ్యమైన స్నేహితులతో పంచుకోవడం చాలా మంచిది. బంధువులు అనవసరంగా ఉద్రేకపడి సరైన సమాధానం ఇవ్వలేకపోవచ్చు. కానీ స్నేహితులు సమస్యను అన్ని కోణాలనుండి పరిశీలించి, విశే్లషించి సరైన పరిష్కారం చూపిస్తారు.

2 వ్యాఖ్యలు:

Unknown

పేరుః స్వర భేతాళ,
స్థలంః విక్రమార్కుని భుజంపై ఏదో ఒక శ్మశానంలో....

పుట్టింటి జోక్యం శృతి మించడానికి కారణం మొబైళ్ళు, ఈ-మెయిళ్ళు, చాటింగులే... :-)పెళ్ళైన కొత్తలో ప్రతీ చిన్నవిషయానికీ ప్రతీరోజూ ఇంటికి ఫోన్ చేయడం లేదా ఇంటినుంచి ఫోన్ రావడమే ఇలా మితిమీరిన జోక్యానికి కారణమౌతోంది. అందుకే పెళ్ళైన కొన్నాళ్ళ వరకు లేదా ఇలా మితిమీరిన జోక్యం వల్ల విడాకుల దాకా వెళ్ళిన కేసులకు "పుట్టినింటికి ఒక సంవత్సరం పాటు ఫోన్ సౌకర్యం బంద్" చేయాలని రూల్ పెడితే ఇంత సమస్య ఉండదేమో... పుట్టింటి జోక్యం ఉండదుకాబట్టి కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ఏదోక పరిష్కారమార్గం ఆలోచించుకుంటూ ఆలూమగలూ వాళ్ళే సర్దుకుపోతూ ఏదోకచోట పడుంటారు. :-))

Unknown

మొన్నామధ్య పల్లెటూళ్ళో ఒక కేస్ అబ్సర్వ్ చేశాను. పెళ్ళైన తర్వాత కూతురూ,అల్లుడూ తన ఇంట్లోనే ఉన్నప్పటికీ ఆ అమ్మాయి తల్లిగారు సొంత ఇల్లుకాదని కూతుర్నీ, అల్లుణ్ణి ఆమెకు దూరంగా అద్దె ఇంట్లో ఉండమని కోరింది. ఎందుకు ఇలా చేశారని అడిగితే కూతురూ, అల్లుడు ఎదురెదురుగా ఉంటే వాళ్ళు కొట్లాడుకున్నప్పుడు ప్రతీ చిన్న విషయానికి నేను జోక్యం చేసుకోవాలి, అది అమ్మాయి కాపురానికి అంత మంచిది కాదు. అదే దూరంగా ఉంటే వాళ్ళే సర్దుకుపోతారు అని చెప్పింది. ఏమీ చదువుకోకపోయినా పల్లెటూళ్ళో వాళ్ళకు సమాజం నేర్పిన మంచి విద్య అది. చదువుకున్నవాళ్ళేమో ఇలా...హుమ్మ్.. :-))

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008