Tuesday, May 14, 2013

గృహిణి ప్రతిభ ఎందులో తక్కువ???

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలైనా కూడా మగవాళ్లు పనికెళ్తే మహిళలు కుటుంబ నిర్వహణ మొత్తం తీసుకునేవారు. ఇలా ఒక సంసారం సమతుల్యంతో చిన్న చిన్న ఒడిదుడుకులతో గడిచిపోయేది. కాని ఈనాడు కుటుంబం చిన్నదైనా, ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయినా పెరుగుతున్న ధరలు, ఖర్చులతో ఇధ్దరూ పని చేయక తప్పడం లేదు. ఈనాడు భార్యా, భర్తా ఇద్దరూ ఉద్యోగాలో, వ్యాపారమో చేయకుంటే ఇల్లు గడవడం. పిల్లల చదువులు , ఇంటికి కావలసిన సౌకర్యాల అమర్చుకోవడం అసాధ్యం కాకున్నా చాలా కష్టం.    కొందరు ఆడవాళ్లు  ఉన్నతవిద్య లేకున్నా,  ఉద్యోగం చేయలేకున్నా, తమ చేతనైన వృత్తులు, ప్రవృత్తులతో ఇంటినుండే పని చేస్తూ ఎంతో కొంత సంపాదిస్తున్నారు లేదా ఉన్నదాంట్లో గుట్టుగా సంసారం నడిపిస్తున్నారు.  ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉండే మహిళలకు ఎక్కువ విలువ లేదంటూ  ప్రముఖ రచయిత చేతన్ భగత్ ఒక సంచలన ప్రకటన చేసారు చేతన్ భగత్ అంటారు.. మా అమ్మ నలభై ఏళ్లు పని చేసింది. నా భార్య ఒక అంతర్జాతీయబాంకులో చాలా పెద్ద హోదాలో ఉంది. తను నా కోసం పుల్కాలు చేయదు. ఆ  పనిని డబ్బులిచ్చి బయటవాళ్లతో   ఔట్ సోర్సింగ్ చేయిస్తాం. ఐనా నాకు అదేమంత ముఖ్యమైన విషయం కాదు. కాని నా భార్య తన జీవితాన్ని వంటింట్లో గడిపితేనే నాకు నచ్చదు. ఒక స్త్రీ  కెరీర్ ఉమన్ ఐతే తన భర్తతో  తమ ఇద్దరి కెరీర్ గురించి, ఉద్యోగ, వ్యాపార సంబంధిత   విషయాలగురించి చర్చించగలదు. ఒక మామూలు గృహిణికంటే ఎక్కువ సమర్ధతతో కంపెనీలలో సమస్యలగురించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోగలదు. ఆపీసుల్లోని రాజకీయాలను అర్ధం చేసుకుని అవసరమైనప్పుడు సరైన సలహా ఇవ్వగలదు. ఆర్ధికంగా కూడా ఖర్చులు, రాబడి, సేవింగ్స్ వగైరా విషయాలలో సరైన నిర్ణయం తీసుకుని అన్ని సౌకర్యాలతో ఉన్న ఇల్లు, ఇన్సెస్ట్ మెంట్స్,  సెలవుల సద్వినియోగం.  విహారయాత్రలు వగైరా స్వంతంగా నిర్వహించగలిగే  సామర్ధ్యం కలిగి ఉంటుంది. అలాగే  ఇంట్లో ఉండే ఆడవాళ్లలా కాకుంఢా ఉద్యోగం , వ్యాపారం మొదలైనవి చేసే మహిళ ప్రపంచానికి ఎక్కువగా చూస్తుంది. తన కుటుంబానికి  ఉపయోగపడే మరింత విజ్ఞానాన్ని, సమాచారాన్ని తీసుకురాగలదు. పనిచేసే మహిళల  పిల్లలు కూడా ఎంతో అభివృద్ధి చెందుతారు. అమ్మ పెంపకంలో గారాబంగా పెరిగిన పిల్లలకంటే ఎన్నో విషయాలలో స్వతంత్రులై ఉంటారు. ఉద్యోగాలు చేసే మహిళలు తమ ఉద్యోగాలు, వృత్తులలో విజయవంతంగా ముందుకెళుతూ ఉంటారు. ప్రతీ విషయంలో మగాడి  మీద ఆధారపడనందుకు సంతృప్తిగా ఉంటారు. దీనివలన భార్యాభర్తలలో సామరస్యం ఉంటుంది. ఇలా విజయవంతంగా అన్ని రంగాలలో  మహిళలు మన దేశాన్ని అభివృద్ధి పధంలోకి తీసుకెళ్తున్నారు. దీనివలన మనకు వేడివేడి పుల్కాలు దొరక్కపోవచ్చు. అంతే..

ఈ విషయంలో చేతన్ భగత్ ఇంట్లో ఉండే గృహిణులను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు.. ఒక కుటుంబం యొక్క సమర్ధవంతమైన నిర్వహణ  భార్యాభర్తలిద్దరూ సంపాదించడమే కాదు.  పిల్లలను , తమ తిండిని కూడా పట్టించుకోకుండా సంపాదనే ముఖ్యమనుకునే స్ధాయికి దిగిపోయామా?  ఈరోజుల్లో ఇద్దరూ సంపాదిస్తే కాని ఇల్లు గడవదు. పిల్లలకు మంచి చదువులు, సొంత ఇల్లు, కారు, అధునాతన వస్తువులు, వగైరా వీలు కాదు. నిజమే. స్త్రీలకు కుటుంబ నిర్వహణకోసమే కాక ఆర్ధిక స్వావలంబన ఉండడం మంచిదే.  కాని సంపాదన లేని గృహిణులను పుల్కాలు మాత్రమే చేయగలిగేవారిగా అభివర్ణించడం ఎంతవరకు సమంజసం??

దాదాపు ప్రతీ ఉమ్మడి కుటుంబంలో తల్లిదండ్రులు, చదువుకునే తమ్ముళ్లు, పెళ్లిళ్లు చేయాల్సిన చెల్లెల్లు, పిల్లలు ఉంటారు. వారిని చూసుకోవడానికి మగవాడికి తన భార్య సహకారం ఎంతైనా అవసరముంటుంది. ఒకవేళ పిల్లలు మాత్రమే ఉన్నా వాళ్లకు ఒక వయసు వరకు తల్లి అండదండలు, ఆలంబన  ఉండాలి.. పెళ్లయ్యాక  భార్య పని చేయాలా వద్దా అనేది వారిద్దరూ చర్చించుకుని నిర్ణయించుకునే విషయం. బయటకెళ్లి పనిచేసి సంపాదించకుండా ఇంటి పనులు, బాధ్యతలకే ప్రాధాన్యం ఇచ్చే మహిళలకు ఎటువంటి విలువ లేదని చేతన్ భగత్ స్పష్టంగా చెప్తున్నారు.  వాళ్లు పుల్కాలు మాత్రమే చేయగలరని అతని ప్రగాఢ విశ్వాసం. ఎవరు ఎంత కష్టపడ్డా, సంపాదించినా,  కడుపునిండా తినడానికి, కుటుంబ సభ్యులు, పిల్లలు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలనే కదా. మరి ఇల్లాలును పుల్కాలు చేసే  మనిషిగా మాత్రమే గుర్తించడం భావ్యమా??

ఉద్యోగం చేయకుండా ఇంటిపట్టున ఉండే ఇల్లాళ్లకు కూడా ఎన్నో బాధ్యతలు,సమస్యలు ఉంటాయి..  ఇంట్లో ఎటువంటి సమస్యలు లేకుండా  తన భార్య ఇంట్లో అన్నీ సమర్ధవంతంగా చూసుకుంటేనే పురుషుడు తన ఉధ్యోగ, వ్యాపార బాధ్యతలను విజయవంతంగా నిర్వహించగలుగుతాడు. ఇంట్లో ఎటువంటి గొడవలు లేకుండా ఉంటేనే, మగవాడు పొద్దంతా కష్టపడ్డా ఇంటికి రాగానే కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపగలుగుతాడు.  ఒక వ్యాపారంలో, పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఉండే ఒడిదుడుకులు కుటుంబ నిర్వహణలో కూడా ఉంటాయి. ఉద్యోగం నచ్చకుంటే అది వదిలేసి వేరే ఉద్యోగం చూసుకోవచ్చు కాని కుటుంబం అలా కాదు. ఆ సమస్యను సామరస్యంగా పరిష్కరించాల్సిందే. అది ఒక తెలివైన ఇల్లాల్లి వల్లే సాధ్యమవుతుంది. నేటి ఇల్లాలు రుచిగా వంట చేయడం, ఇంటిని నీట్ గా ఉంచడం, పిల్లలను చదివించడం మాత్రమే కాదు వాళ్లను ఒక సంపూర్ణ వ్యక్తిత్వం కలిగిన  మంచి పౌరులుగా తయారుచేస్తుంది. బయటకెళ్లి ఉద్యోగం చేయకున్నా భర్తకు, ఇంటికి సంబంధించిన ఎటువంటి పనులైనా , చిన్న చిన్న సమస్యలైనా తనే చూసుకుంటుంది. అతనికి భారాన్ని తగ్గించాలని చూస్తుంది. పిల్లలకు చదివించిన అన్ని విషయాలు, వాళ్లు నేర్చుకోవాలనుకునే ఆటలు, కోర్సులకు తానే వెంట ఉండి తీసుకెళ్తుంది. బిల్లులు కట్టడం. బాంకు పనులు, ఆరోగ్య సమస్యలు మొదలైనవెన్నో ఉంటాయి. పిల్లలకు కావలసినవి అమర్చి వాళ్ల ప్రవర్తన, స్నేహితులు , ఆటపాటలు అన్నీ పర్యవేక్షించడం వల్ల వాళ్లు చెడు దారి పట్టి తమ జీవితాలను  పాడు చేసుకోకుంఢా ఉంటారు. పిల్లలను కని వాళ్లకు అవసరమైనవన్నీ డబ్బులతో కొనివ్వడమే తల్లిదండ్రుల ప్రేమ, కర్తవ్యం కాదు. దానికోసమే ఇద్దరూ పనిచేయాల్సిన అవసరం అస్సలు లేదు. అలా సంపాదన, కెరీర్ మాత్రమే ముఖ్యమనుకునేవాళ్లు , కుటుంబానికి అంత ప్రాముఖ్యం ఇవ్వనివాళ్లు తమను కన్నవారిని చూసే సమయం, తీరిక లేక వాళ్లను వృద్ధాశ్రమంలో, తాము కన్నవారిని కూడా ఆయాలకు అప్పగిస్తారు.

ఇంట్లో ఉండే గృహిణికి  ప్రపంచంతో ఎక్కువ పరిచయం లేకపోవడంతో ఆమెకుండేది మిడిమిడి జ్ఞానమే అనుకుంటే పొరపాటు. ఉన్నత విద్య లేని మహిళలు ఆధునిక, సాంకేతిక ఉపకరణాలను ఉపయోగించి అన్నీ కాకున్నా చాలా విషయాలు తెలుసుకుంటున్నారు. ఇంటినుండే చిన్న చిన్న వ్యాపారాలు మొదలెడుతున్నారు. కుటుంబ నిర్వహణలో, భర్తకు తోడుగా ఎంతో కొంత సంపాదిస్తున్నారు.  దీనికి వాళ్లు తమ కుటుంబాన్ని, పిల్లలను, వారి బాగోగులను పణంగా పెట్టడానికి ఇష్టపడడం లేదు. అంతే కాదు. పెళ్లి తర్వాత  పిల్లలను, అత్తామామలను చూసుకోవడానికి తమ ఉద్యోగాలను కూడా వదిలేసి గృహిణిలుగా మారిన మహిళలు ఎంతోమంది ఉన్నారు.  ఉద్యోగాలు చేసే  మహిళలకు  నిర్ణీత సమయంలో చేయాల్సిన టార్గెట్ ఒకటే ఉంటుంది. ఆపీసు పనివేళల ప్రకారం దానిని పూర్తి చేయాల్సి ఉంటుంది. కాని గృహిణి/housewife/ home maker నిత్యం పూర్తి చేయాల్సిన టార్గెట్లు ఎన్నో ఉంటాయి. లేకుంటే కొత్త పని వెతుక్కుని మరీ చేస్తుంది. అలాగే కుటుంబాన్ని, తమ ఉద్యోగాలను కూడా సమర్ధవంతంగా నిర్వహిస్తున్న మహిళలు నేడు కోకొల్లలుగా ఉన్నారు. ఒకదాని కోసం ఇంకొకటి ఎన్నటికీ త్యాగం చేయలేరు, చేయాలనే ఆలోచన కూడా రానివ్వరు అంతే కాని ప్రేమతో చేయాల్సిన పనులను కూడా ఔట్ సోర్సింగ్ చేద్దామనే ఆలోచన కుటుంబాన్ని ప్రేమించే ఏ  మహిళా ఒప్పుకోదు. ఇంటిపనులను ఆఖరుకు తినే తింఢిని కూడా డబ్బులిచ్చి బయటవాళ్లతో చేయించుకునే స్తోమత, ఆలోచన అందరికీ ఉండదు.  ఆచరణ యోగ్యం కాదు కూడా. ఐనా ఎంత సంపాదించినా ఈ జానెడు పొట్ట నింఫడానికే కదా.. మగవాడికి తన కుటుంబం, తన ఉద్యోగం రెండూ కూడా ఎంతో ముఖ్యమైనవి.  కాని భార్య తన కుటుంబ బాద్యతలను నెత్తినేసుకుని సగం బరువును తగ్గిస్తుంది. అతను తన కింద పనిచేసేవారిని అధికారంతో  కంట్రోల్ చేయగలడు. భయంతో పని చేయించగలడు. కాని భార్య పరిస్ధితి అలా కాదు. కుటుంబ సభ్యులు, పిల్లలను భయంతో, అధికారంతోకాకుండా ప్రేమతో, గౌరవంతో నెరవేర్చాలి. సమస్యలను తీవ్రం కాకుండా, భర్తకు అదనపు సమస్య కాకుండా చూసుకుంటుది. ఇలా ఉద్యోగాలు, వ్యాపారాలు చేయని మహిళలు చేసే పనికి వెల, విలువ కట్టడం అసాధ్యం. అసలు ఇల్లాలుకు ఆమె చేసే పనులకు ఎంత ఇవ్వాలి అని లెక్కలేస్తే ఎన్ని లక్షలు, కోట్లు అవుతాయో మరి. ఆవి చెల్లించడం సాధ్యమా??  మరి చేతన్ గారు తనకు మాత్రమే లాభం కలిగించి బోలెడు సంపాదించే భార్య మాత్రమే ముఖ్యమంటున్నారు.


9 వ్యాఖ్యలు:

Zilebi

అబ్బా,

ఈ 'ఆండాళ్ళ' ని పొగిడినా కష్టమే ! తెగిడినా కష్టమే !!

పుల్కాలు చేస్తూ ఇంట్లో ఉంటా రంటే తప్పు ! లిజ్జత్ పప్పడాలు చేసి డబ్బులు సంపాదిస్తారంటే నూ తప్పే !!

ఇంతకీ భగత్ అనబడే మానవుడు ఎవరండీ ? సదుద్యోగం ఏమన్నా ఉందా ?

జిలేబి

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी

జ్యోతి గారు,
కొన్ని పుస్తకాలు వ్రాయగానే గొప్పోడిననుకునే ఆ మూర్ఖుని మాట అట్లా ఉంచండి. నూటికి తొంభైమంది ఆడవాళ్ళ భావాలూ ఇవే. తొంభైమంది లో ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళూ ఉన్నారు, ఇంటి బాధ్యత చూసుకునే వాళ్ళూ ఉన్నారు, చదువుకునే ఆడపిల్లలూ ఉన్నారు.
ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ప్రోత్సహిస్తూ వచ్చిన అనేక రచనలు ఎంత గా రెచ్చగొట్టేలా మాట్లాడాయంటే ఈనాటికీ ఉద్యోగం చేయడంలేదు అని (ఇంటి బాధ్యతలు ఎంత సక్రమంగా నిర్వహిస్తున్నా కూడా) ఎంతో కుంచించుకుపోతూ చెప్తారు. బలాదూర్ గా తిరిగే కొందరు అబ్బాయిలకు లేని కాంప్లెక్స్ కూడా వీళ్ళకు ఉంటుంది.

anrd

జ్యోతిగారు మీరు వ్రాసిన టపా బాగుంది.

జ్యోతి

లక్ష్మిగారు మీరు చెప్పింది నిజమేనండి. మీరేం చేస్తున్నారంటే.. ఆ ఏవుంది Housewife .. మాదేమన్నా ఉద్యోగమా సద్యోగమా అంటారు.తాము చేసే పని మీద గౌరవం, గుర్తింపు లేకుంటే ఎలా??

శ్రీలలిత

నేను బయటకి ఎక్కడికీ ఉద్యోగం చెయ్యడానికి వెళ్ళను. కాని ఎవరైనా ఏం చేస్తున్నారని అడిగితే మటుకు "24 hours job చేస్తున్నాను. నేను చేసే job కి సెలవులు, retirement లాంటివి ఉండవు" అని చెపుతుంటాను. వాళ్ళకి అర్ధం కాదు.. పాపం...

Hima

If his mom still alive, she would really be ashamed of him, for saying she worked 40 years to make a anti feminist.

Hima

If his mom still alive, she would really be ashamed of him, for saying she worked 40 years to make a anti feminist.

జీడిపప్పు

Nice post Jyothi garu. A 'Housewife job' require more skill, planning and patience than a 'job'!

సూర్య

చేతన్ భగత్ సంగతి కాసేపు పక్కన పెడదాం. బాలీవుడ్ సినిమాల్లోంచి కొన్ని సీన్స్ తీసి అటూ ఇటూ అమర్చితే ఒక చేతన్ నవల అవుతుందని మా మిత్రులు అంటుంటారు. అతని స్పీచ్ లో మిగతా భాగాలు కాసేపు పక్క్న పెడదాం. ఆడవారికి బయట ప్రపంచం గురించి కొంత అవగాహన ఉండాలి. ఆ అవగాహన ఇంటికి దూరంగా ఉండి చదువుకున్న అమ్మాయిలకి, కొన్నాల్లైనా ఉద్యోగం చేసిన అమ్మాయిలకి ఎక్కువగా ఉండొచ్చు. అమ్మానాన్నల చాటున పెరిగి, పెళ్ళై వంటింటికే అతుక్కుపోయిన ఆడవారికి మాత్రం అతని మాటలు వర్తిస్తాయి. అలాంటివారు ఒక్కోసారి తమ కుటుంబం లోని చిన్న సమస్యలు కూడా పరిష్కరించుకోలేకపోతారు. అందుచేత ఆడవారు కొన్నాల్లైన ఉద్యోగం చేసినా, లేదా ఏదైనా ప్రవృత్తి తో కాస్త ధనార్జన చేసినా మంచిది. అది వారి అవగాహన పెరగడానికే ఉపయోగపడుతుంది

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008