Saturday, November 2, 2013

"చీర" సొగసు చూడ తరమా??పండగ సీజన్.. కొత్త బట్టలు.. ఇక ఆడవాళ్లు అంటే కొత్త చీరలు. అదేంటోగాని ఈ ఆడాళ్లకు ఎన్ని చీరలున్నా మళ్లీ ఇంకోటి కొనాలనిపిస్తుంది. పండగలకు, పబ్బాలకు మాత్రమే కాదు ఉత్తుత్తిగా కూడా చీరలు కొనేస్తుంటారు. మగవాళ్లకు లేని ఛాయిస్ లేడీస్ కు ఉంది.. కాదనగలరా?? పెద్ద పండగలకు ఒకరకం చీరలు, చిన్న పండగలకు మరో రకం. బర్త్ డేలకు వేరే, బారసాలకు వేరే, ఇంట్లో ఐతే వేరే, హోటల్ లో ఐతే వేరే, చుట్టాలింట్లో ఐతే ఒకరకం. ఫ్రెండ్స్ ఇంట్లో ఐతే ఒక రకం. మామూలుగా మధ్యతరగతి వాళ్లింటికి వెళ్తే ఒక రకం, హై క్లాస్ వాళ్లింటికి వెళ్తే వేరే రకం.. ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకం, మార్కెట్టుకు, సూపర్ మార్కెట్టుకు వెళ్లినప్పుడు మరో రకం..... ఏ అవసరం లేకున్నా చీరలు కొనాల్సిందే.. షాపుల్లో కొనేదే కాక, ఇంటికి వచ్చి ఇన్‌స్టాల్మెంట్ లో అమ్మే చీరలు వేరే.. వయసు ప్రకారం కొనే చీరలు కూడా వేర్వేరుగా ఉంటాయండోయ్..ఇలా ఇన్ని సందర్భాలకుగాను కొనే చీరలు నచ్చడం అంత వీజీ కాదు. చీర డిజైన్ నచ్చితే రంగు నచ్చదు లేదా అంచు కుదరలేదనిపిస్తుంది. అన్నీ కుదిరితే బట్ట అంత నాణ్యంగా అనిపించదు. అది కూడా కుదిరితే ధర దగ్గర బేరం కుదరదు. ఇలా అన్నీ పర్ఫెక్టుగా కుదిరితేగాని ఒక చీర ఎంపిక పూర్తికాదు మరి. మగాళ్లకు ఈ విషయం అర్ధం కాదు. వాళ్లకు సొంతంగా వెతికే ఓపిక ఉండదు. వెతుక్కుంటున్న భార్య వెంట ఉండడానికి అస్సలు ఓపిక ఉండదు. అందుకే ఆడాళ్ల షాపింగుల మీద జోకులేస్తారు, కార్టూన్లేస్తారు. ఏమంటారు??? సరేగాని ఈ చీరల సోది ఎందుకని అనుకుంటున్నారు కదా.. ఎక్కడ చూసినా కళకళలాడిపోతుంటేనూ... లేడీస్ అందరూ చీర షాపింగ్ అని తెగ బిజీగా తిరిగేస్తుంటేూ...... అసలే అందమైన అమ్మాయి. మరింత అందమైన చీర కట్టుకుని హిమాలయ శిఖరాలవలె ఉన్నతంగా అలా నడిచివస్తుంటే, మలయమారుతంలా ఆమె కొంగు అలా అలా కదలాడుతుంటే గుండె ఝల్లుమనదా మనసున్న మారాజుకి.. ఇక ఆ సొగసు చూడ ఎవరికైనా తరమా?
 
చీర భారతీయ సంప్రదాయ వస్త్రాలంకరణ. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎంతో గౌరవింపబడి, ప్రశంసించబడుతుంది. చీర కట్టిన ఇంతి ఒకచోట గౌరవంగా నమస్కరించాలనిపిస్తే మరొకచోట మరింత అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ చీర స్త్రీని పూర్తిగా కప్పేసినా ఆమె అందాన్ని కనిపించీ, కనిపించక దాస్తూ,  చూపిస్తుంది. అందుకే ఇది పాతకాలపు ముసలమ్మ కట్టే ఆరు గజాల చీర మాత్రమే  కాదు చాలా "sexy outfit అని కూడా పేరుపొందింది. కాదంటారా? చీరలంటే ఆడవాళ్లకు ఉన్న మోజు అంతా ఇంతా కాదు. వేర్వేరు సంధర్భాలకొఱకు తీరైన చీరలు కొనడం అంటే మహా ఇష్టం వాళ్లకు. ఎన్ని మాడర్న్ డ్రెస్సులు వచ్చినా ఈ చీరకు సాటి రావుగా.. రోజంతా జీన్సులు, పంజాబీ డ్రెస్సులు వేసుకున్నా పండగలు, పెళ్ళిళ్లు, శుభకార్యాలలో అమ్మాయిలు కూడ సంప్రదాయకంగా చీరలోనే ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే నాడైనా, నేడైనా "చీర" సొగసు చూడ తరమా?

ఇదే చీర అనే టాపిక్ మీద మాలిక పత్రిక ఒక వినూత్నమైన ప్రయోగం తలపెట్టింది. (ఇలాంటి ప్రయోగం ఇది రెండోసారి. మొదటిది కవిత్వంలో ఏకాంతం). కాని ఈసారి  ఈ ప్రయోగం పద్యాలతో.. చీర మీద మీకు నచ్చినట్టుగా పద్యాలు రాయమని అడుగగా  టేకుమళ్ల వెంకట్, జె.కె.మోహనరావు, అనిల్ మాడుగుల, రవి Env, ఆచార్య ఫణీంద్రగార్లను అడగగా వారు వెంటనే స్పందించి ఎన్నో విభిన్నమైన అంశాలతో చీరను ముడివేసి పద్యాలు రాసి ఇచ్చారు. సరే పద్యాలు వచ్చేసాయి. తర్వాత సంగతేంటి? ఈ పద్యాలను విశ్లేషించమని ప్రముఖ రచయిత, కార్టూనిస్ట్  బ్నిం గారిని కోరగా వాయెస్ అన్నారు. తన వంతు పద్యాలు కూడా రాసారు. చిత్రకారులు ఉదయ్ కుమార్‌గారు ఈ టాపిక్ కి తగ్గట్టుగా మరింత అందమైన చిత్రం ఇవ్వగా. పందిళ్ల  శేఖర్‌బాబుగారు పద్యాలను రాగయుక్తంగా స్వరపరిచారు.

మరి ఇన్ని విశేషాలతో తయారైన ఈ పద్యనీరాజనాన్ని చదవాలంటే  రేపటివరకు ఆగాల్సిందే .. మరో విషయం. ఈ పద్యాలను విశ్లేషిస్తుండగా మరో అద్భుతమైన ఆలోచనకు రూపకల్పన చేయడం జరిగింది. దాని గురించి బ్నిం గారే చెప్తారు.. 

http://magazine.maalika.org


3 వ్యాఖ్యలు:

bhuvanachandra

CHAALAA BAAGUNDI....నిజంగా ......భువనచంద్ర

bhuvanachandra

చాలా బాగుంది జ్యోతి గారూ

Unknown

చాలా బాగుంది
‘very good website’
ayurbless team
visit my ayurveda free treatment website: http://ayurbless.blogspot.in

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008