Tuesday 7 July 2015

రేలపూలు - పుస్తక సమీక్ష



 తండావాసుల గుండెచెమ్మ
 Sun 28 Jun 00:56:03.96997 2015

         జీవితానుభవాలే సాహిత్యానికి పునాదివంటివి. నిత్యం మన చుట్టూ ఎన్నో కథలు తిరుగాడుతూ ఉంటాయి. వాటిని మనసుతో బంధించి అక్షరీకరించడం ద్వారా మరెంతోమందికి ఆ వాతావరణాన్ని, పరిస్థితుల్ని కళ్లకు కట్టినట్టు చూపించవచ్చు. ఎందుకంటే ఈ కథలు చదువుతుంటే ఆయా పాత్రలు, సంఘటనలు మనముందు కళ్లకు కట్టినట్టుగా ప్రత్యక్షమవుతాయి. అటువంటి ప్రతిభ గల రచయిత్రి శ్రీమతి సమ్మెట ఉమాదేవి గారి రెండవ పుస్తకం 'రేలపూలు'.

        ఉద్యోగినిగా తను పనిచేస్తున్న మారుమూల గ్రామంలో అరకొర సౌకర్యాల నడుమ, చాలీచాలని ఆదాయంతో తండావాసులు, వాళ్ల పిల్లలు పడుతున్న వెతలు రోజూ కళ్లారా చూస్తున్న రచయిత్రి వాటికి తన శైలిలో కథలుగా మలిచారు. తను ఎవరిగురించైతే కథలు రాస్తుందో వాళ్లు ఈ కథలను చదవలేకున్నా వారిగురించి సమాజంలోని మనం సాటిపౌరులుగా చదివి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నదంటున్నారు రచయిత్రి.

 ఆస్తిత్వం కథలో పేర్ల గురించి ప్రస్తావిస్తూ అక్కడ తండాలో పిల్లల పేర్లు అన్నీలాల్‌, పోలీ, అమ్రు, సాల్కి, సక్రూ, రాంనాయక్‌, హర్యాలాల్‌, బిక్కూలాల్‌ వంటి అమ్మా నాన్నలు పెట్టిన అందమైన పేర్లు పనికిరావని, బాలేవని బళ్ళో టీచర్లు మార్చేసి అనిల్‌ కుమార్‌, ప్రవల్లిక, అనూష, శైలజ, పవన్‌ కళ్యాణ్‌, రాంచరణ్‌, హరీష్‌, మహేష్‌ బాబు అని పిలుస్తున్నారు. కాని రేషన్‌ కార్డులో ఒక విధంగా, ఆధార్‌ కార్డులో ఒక విధంగా పేర్లు రాయడం వల్ల చాలా గందరగోళం ఏర్పడుతోంది. చదువు రాకపోవడం వల్ల ఇవి సరిచేసుకోలేక ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. పేరు మార్చుకోవడం కూడా పెద్ద తంటా కావడంతో వారికి రావలసిన సౌకర్యాలను వదులుకోవలసి వస్తోంది. అందుకే పేర్లను మార్చుకుని క్రమంగా తమ అస్తిత్వం కోల్పోయే దశకు చేరుకున్నారు.

        దివిలి కథలో అడవిలోని పువ్వుల్లో పువ్వుగా, చెట్టులో చెట్టుగా, పిట్టల్లో పిట్టగా ఆనందించే దివిలి, ఆమె అన్న రూప్లా. అతను చదువుకోవటానికి పట్నం వెళ్లినప్పుడు దివిలికి ప్రాణంలో ప్రాణమైన పువ్వులనే ఎరగా వేసి ఆమె మానాన్ని కబళిస్తాడు రాజు నాయక్‌. పెళ్లి కాకుండానే తల్లి అయిన చిన్నారి దివిలి తన పాపకు జన్మనిచ్చి కన్ను మూస్తుంది. ఆ పాప విరిని తన ప్రాణంగా చూసుకుంటూ, రూప్లా తన చెల్లెలు దివిలి సమాధి దగ్గర పూలు పెట్టి పాపను చూపిస్తాడు. అన్నంటే ఇలానే ఉండాలి అనిపించే 'రూప్లా' పాత్ర, తుమ్మెద వంటి రాజూనాయక్‌, పసిపాప వంటి దివిలి... మన మనసులో అలాగే నిలిచిపోతారు. ఈ కథ చదివిన తరువాత మన మనసును ఎవరో పట్టి నొక్కేసిన భావన కలగక మానదు. ఈ కథలో తండావాసుల ఆచార వ్యవహారాలను వివరంగా తెలిపారు రచయిత్రి.

        'జై జై జై గణేశా!' కథలో తండాల్లో ఇంటింటికీ తిరుగుతూ, అందరికీ మందులు ఇస్తూ, వారి ఆరోగ్య పరిరక్షణకై పాటుపడుతూ, అందరినీ పేరు పేరునా ఆప్యాయంగా పలకరించే రజని ఒక ప్రభుత్వోద్యోగి. తండావారంతా కలిసి వినాయకుడిని కొనడానికి జమచేసిన సొమ్మంతా రజనీ కోసం ఖర్చుపెడతారు. చదువుసంధ్యలు లేకున్నా సాటి మానవుడికి సాయం చేయడం దేవుడికి పూజచేయడం వంటిదని తమ మానవత్వాన్ని నిరూపిస్తారు అమాయకపు తండావాసులు.

 వారధి కథలో బయటి ప్రపంచానికి, అడవిలో దాగి ఉన్న ఆ తండాకి వారధి - ఊరికి కొత్తగా వేసిన బస్సు... ఆ బస్సు రావటం కోసం టీచర్లు తన్వీ, శాలిని ఎంతగా ప్రయత్నించి సాధించారో, చివరికి ఎంతగా విలపించారో తెలిపే హృద్యమైన కథ. ఇప్పటికి ఈ తండావాసులుండే ప్రాంతానికి బస్సు సౌకర్యం లేదంటే నమ్మరెవరూ. కాని ఇది నిజం.
 ఈ కథాసంకలనంలో కూర్చిన కథలన్నీ సహజత్వాన్ని నింపి అచ్చంగా తండాల్లో తెలుగు మాటలను పొందుపరిచారు. ఒక్కో కథ చదువుతుంటే తండాల్లోని వాస్తవ పరిస్థితులు, జీవన విధానం , నమ్మకాలు, అమ్మకాలు, నిర్లక్ష్యాలు, అసౌకర్యాలు ఎన్నో మన కళ్లముందు కదలాడతాయి. అంతేకాక గిరిజనులు జరుపుకునే పండుగలు, ఆచారవ్యవహారాలను, సమస్యలను సమగ్రంగా తన కథల్లో చర్చించారు రచయిత్రి సమ్మెట ఉమాదేవి.

 - జ్యోతి వలబోజు

0 వ్యాఖ్యలు:

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008