Monday 19 September 2016

ఏ లడ్డూ కావాలి బాబూ..? ఈనాడు



ఒక్కోసారి అతిథులు వచ్చినప్పుడు పెడదామంటే ఇంట్లో ఏమీ ఉండవు. లేదూ మనకే ఉన్నట్టుండి ఏదైనా తీపి తినాలనిపిస్తుంటుంది. అలాంటప్పుడు చాలా తేలిగ్గా అప్పటికప్పుడు చేసుకోగలిగే రుచికరమైన లడ్డూలు మీకోసం...


రోజ్‌ కొబ్బరి లడ్డూ
కావలసినవి
ఎండుకొబ్బరిపొడి: 2 కప్పులు, కండెన్స్‌డ్‌మిల్క్‌: అరకప్పు, రోజ్‌సిరప్‌: టీస్పూను, యాలకులపొడి: అరటీస్పూను, నెయ్యి: 3 టీస్పూన్లు
తయారుచేసే విధానం
* పాన్‌లో నెయ్యి వేసి వేడిగా అయ్యాక కొబ్బరిపొడి, కండెన్స్‌డ్‌మిల్క్‌, రోజ్‌ సిరప్‌, యాలకులపొడి వేసి కలుపుతూ చిన్న మంటమీద ఉడికించాలి. మిశ్రమం మొత్తం ఉడికి ముద్దగా అయ్యాక దించి చల్లారనివ్వాలి.
* మిశ్రమం గోరువెచ్చగా ఉండగానే చిన్న చిన్న లడ్డూల్లా చేసుకుని కొబ్బరిపొడిలో దొర్లించి ఆరనివ్వాలి. పూర్తిగా చల్లారాక ఫ్రిజ్‌లో పెడితే త్వరగా గట్టిపడతాయి. లేదా గాలికి పూర్తిగా ఆరాక డబ్బాలో పెట్టి నిల్వ చేయాలి.


ఓట్స్‌ డ్రైఫ్రూట్‌ లడ్డూ
కావలసినవి
ఓట్స్‌: కప్పు, జీడిపప్పు, బాదం, పిస్తా: పావుకప్పు చొప్పున, వాల్‌నట్స్‌: 5, ఎండు అంజీరాలు: 8, ఖర్జూరం: 12, నువ్వులు: 2 టేబుల్‌స్పూన్లు, అవిసెగింజలు: 2 టేబుల్‌స్పూన్లు, యాలకులపొడి: అరటీస్పూను, బెల్లంతురుము: రుచికి సరిపడా, నెయ్యి: తగినంత
తయారుచేసే విధానం
* ఎండుఅంజీరాలు, ఖర్జూరాలు ముక్కలుగా చేయాలి. ఓట్స్‌ రెండు నిమిషాలు వేయించాలి. అవిసెగింజలు, నువ్వులు, జీడిపప్పు, బాదం, పిస్తా, వాల్‌నట్స్‌ అన్నీ విడివిడిగా ఓ నిమిషం వేయించాలి. మిక్సీలో అన్నీ విడివిడిగా పొడి చేసి తీయాలి. బెల్లంతురుము కూడా పొడి చేసి అన్నీ కలిపి పాన్‌లో వేసి మూడు నాలుగు నిమిషాలు సిమ్‌లో వేయించాలి. యాలకులపొడి కలిపి దించి ఆరాక నెయ్యి అద్దుతూ లడ్డూలు చుట్టాలి.


బిస్కెట్లతో...
కావలసినవి
మ్యారీ బిస్కెట్లు: 10, బెల్లం తురుము: ముప్పావు కప్పు, యాలకులపొడి: టీస్పూను, నెయ్యి: 3 టీస్పూన్లు
తయారుచేసే విధానం
* మ్యారీ బిస్కెట్లను మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. అలాగే బెల్లం కూడా పొడి చేసుకోవాలి.
* ఓ గిన్నెలో బిస్కెట్ల పొడి, బెల్లం పొడి, యాలకులపొడి, కరిగించిన నెయ్యి వేసి కలిపి కావాల్సిన సైజులో ఉండల్లా చుట్టుకోవాలి. నెయ్యి ఇష్టం లేకపోతే ఒట్టి బెల్లం తురుముతో కూడా లడ్డూలు చేయవచ్చు.


పాప్‌కార్న్‌తో...
కావలసినవి
మొక్కజొన్న గింజలు: కప్పు, బెల్లంతురుము: ముప్పావుకప్పు, యాలకులపొడి: టీస్పూను, నెయ్యి: 3 టీస్పూన్లు
తయారుచేసే విధానం
* మందపాటి గిన్నె లేదా కుక్కర్‌ గిన్నె వేడిచేసి అందులో కాస్త నూనె వేసి మొక్కజొన్న గింజలు వేసి మూతపెట్టి పాప్‌కార్న్‌ చేసుకోవాలి. లేదంటే విడిగా ఉప్పు వేయని పాప్‌కార్న్‌ తెచ్చుకుని కూడా చేసుకోవచ్చు.
* ఇప్పుడు పాప్‌కార్న్‌ను మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా రవ్వలా చేయాలి.
* బాణలిలో బెల్లంతురుము, పావు కప్పు నీళ్లు పోసి మరిగించి ముదురుపాకం రాగానే నెయ్యి, యాలకులపొడి, పాప్‌కార్న్‌ రవ్వ వేసి బాగా కలియతిప్పి దించాలి. ఇది వేడిగా ఉండగానే ఉండలు చుట్టాలి. చల్లారాక డబ్బాలో పెడితే వారం రోజులవరకూ నిల్వ ఉంటాయి.


పల్లీ ఖర్జూరం లడ్డూ
కావలసినవి
ఖర్జూరం: కప్పు, పల్లీలు: కప్పు, యాలకులపొడి: అరటీస్పూను, నెయ్యి: 3 టీస్పూన్లు
తయారుచేసే విధానం
* పల్లీలను దోరగా వేయించాలి. చల్లారిన తరవాత పొట్టు తీసి బరకగా పొడి చేసుకోవాలి.
* ఖర్జూరాల్ని చిన్న ముక్కలుగా చేసి గ్రైండర్లో వేసి సన్నగా పొడి చేయాలి. పల్లీల పొడిలో ఈ ఖర్జూరం పొడి, యాలకులపొడి, నెయ్యి వేసి బాగా కలిపి కావాల్సిన సైజులో ఉండలు చేసుకోవాలి. ఇందులో పల్లీలకు బదులు జీడిపప్పు, బాదం, పిస్తా, అక్రోటు, కిస్‌మిస్‌... వంటి నట్స్‌ను కూడా చిన్నముక్కలుగా చేసి వేసుకోవచ్చు.


పుట్నాలపప్పుతో...
కావలసినవి
పుట్నాలపప్పు: కప్పు, పంచదార: కప్పు, యాలకులపొడి: అరటీస్పూను, నెయ్యి: ముప్పావుకప్పు, జీడిపప్పు: అరకప్పు
తయారుచేసే విధానం
* పుట్నాలపప్పుని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. పంచదార కూడా మెత్తగా పొడి చేయాలి. జీడిపప్పును చిన్న పలుకులుగా చేసి నేతిలో వేయించాలి. పుట్నాలపొడిలో పంచదార పొడి, యాలకులపొడి, జీడిపప్పు పలుకులు వేసి బాగా కలపాలి. ఇప్పుడు కరిగించిన నెయ్యి పోస్తూ ఉండలు చేసుకోవాలి.


- జ్యోతి వలబోజు ...
హైదరాబాద్‌
 18-9-2016

1 వ్యాఖ్యలు:

Zilebi


యేలడ్డూ కావాలోయ్ ?
బేలా! వినుమా జిలేబి భేషగు రీతిన్
యేలాటి పప్పు లైనా
మేలౌ లడ్డు, వలబోజు మేలుగ తెలిపెన్ :)



జిలేబి

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008