నాకేంటి చిక్కేంటి అనుకుంటున్నారా? నిజమండి. మరీ అంత పెద్ద చిక్కా? టపాయించేటంత పెద్ద చిక్కా అంటారా? అవునండి. కాస్త సాయం చేద్దురూ! ఎంతో ప్రయత్నించినా ఈ సమస్య పరిష్కారం కావట్లేదు. కొంత కాలంగా నన్ను తెగ తిప్పలు పెట్టేస్తుంది. ఇంతకీ ఆ చిక్కేంటి అంటే ...
ఆగండాగండి.. రింగులు తిప్పుకుంటూ వెనక్కి వెళ్ళిపోకండి. ఇక్కడే ఉండండి. చెప్తున్నాగా...
చిన్నప్పటినుండి అమ్మ చేస్తుండగా చూసి నేర్చుకున్న వంట నాకు ఇప్పుడు పెద్ద తంటా అయ్యింది. నేను వంట నేర్చుకుంది ఏ సైటులోనో, బ్లాగులోనో కాదు. ఏ స్కూలుకు వెళ్ళలేదు, కొలత ప్రకారం ఏయే దినుసు ఎలా వేయాలో ఎవరూ చెప్పలేదు. కూరగాయలు కోసినా, ఉప్పూ కారాలు (అమ్మో! కారంలో మాత్రం చెంచా వేస్తాను. దాంట్లో చేతులు ఎలా పెడతాను ) , మసాలాలు వేసినా అన్ని చేత్తోనే. దానికి లెక్కా కొలతా లేదు. కంటిముందు కూరను చూసి దాని ప్రకారం అంచనాలు వేసుకుంటూ ఒక్కోటి అలా వేసుకుంటూ పోవడం. ఒకసారి పాడైతే తర్వాతి సారి జాగ్రత్తగా ఉండడం. అపుడు కుదిరితే, అందరూ నోరు మూసుకుని తింటే (బావుంటే నోరు మూసుకునే తింటారు. కొంచం తేడాగా ఉంటేనే కదా అరిచేది) ఓహో మన కొలతలు కరెక్టుగా ఉన్నాయి. అని ఆ కొలతలపై ఫిక్స్ అయిపోవడం. ఇలా నా వంటల ప్రహాసం జరుగుతూ వచ్చింది. హిట్లూ ఫట్లు ఎలాగూ ఉంటాయనుకోండి. సరే ఆంతా బానే ఉంది. మరి ఇప్పుడేంటి చిక్కు అని అడగబోతున్నారా.. వస్తున్నా..
ఇంట్లో అంటే అలా గడిచిపోయింది.. పోతుంది కూడా. ఇపుడు బ్లాగులో, సైటులో , పత్రికలలో , టీవీ షూటింగుల కోసం వంటలు రాసేటపుడు చెప్పేటప్పుడు ఆయా వంటకం కొలత పక్కాగా ఇవ్వాలి. లేకుంటే గొడవలైపోతాయి. వంట బాగా వచ్చినవాళ్లైతే పర్లేదు అడ్జస్ట్ చేసుకుంటారు. నెట్ ఓపన్ చేసి వంటకం ముందు పెట్టుకుని వంట చేసేవాళ్ళు సరిగ్గా అదే కొలతల ప్రకారం చేస్తారు కదా. అది సరిగ్గా కుదిరితే వాళ్ళ గొప్ప. లేకుంటే నన్నే కదా తిట్టుకునేది. హమ్మయ్యా! మరి ఇపుడు అసలు సమస్య దరిదాపుల్లోకి వచ్చాము. నేను చేత్తో అలా ఆలవోకగా (సినిమా వీరోయిన్లా కాదులెండి) వేసే ఉప్పు కారాలు, మసాలాల గురించి కరెక్ట్ బరువు కొలతలు ఎలా ఇచ్చేది. ఓహో ఆ కూర చేసేటప్పుడు నా చేతి వేళ్ళ మధ్య ఉన్న ఉప్పు బరువు ఇంత ఉంటుంది. నేను వేసిన బెల్లం బరువు ఇంత ఉండి ఉండవచ్చు. ( ఎపుడూ నెలకోసారి సరుకులు తెచ్చుకుంటాం. అవసరమైనపుడు అలా తీసి వేసుకుంటాము కదా. ప్రతీ దాని బరువు ఎవరు చూడొచ్చారు. మరీ చోద్యం కాకపోతే ) ఇలా గాల్లో లెక్కలు వేస్తూ రాసుకుంటాను.
లేదా వంట చేసేటప్పుడే కొలత ప్రకారం చేస్తే పోలా ! అంటారా? అలా ఐతే గంటలో అయ్యే వంట నాలుగు గంటలు పడుతుంది. అలా కాదుగాని. ఏదైనా సులువైన ఉపాయం చెప్పండి. కిచన్ వేయింగ్ మెషీన్ కొనమని మాత్రం చెప్పొద్దూ. ఈ చెంచాల గోలేంటో, ఈ గ్రాముల గోలేంటో? మా కాలంలో ఈ లెక్కలు తెలీవమ్మా!!
ఇపుడు నానేటి సేసేది??