Saturday, 31 January 2009

ఆడాళ్ళూ మీకు జోహార్లు



నా స్నేహితుడు ఈ మధ్య పరిశోధన చేసి పి.హెచ్.డి. తీసుకున్నాడని తెలిసి అతనిని కలిసా. అతను అ.భా.భా.బా. సంఘం సెక్రటరీ అంట, మన విహారి లాగా. అతను తీసుకున్న విషయం ఏంటంటే “భార్యామణులతో బాధలు”. అతని ప్రొఫెసర్ కూడా బాధితుడే కాబట్టి రెండు నెలల్లో డాక్టరేట్ పుచ్చుకున్నాడు. అతని పరిశోధనలో రాసిన కొన్ని విషయాలు నిజమే అనిపించింది. అవి ఇక్కడ ఇస్తున్నాను. ఈ ప్రశ్నలకు వాళ్ళు ఎవో సమాధానాలతో తమను తాము సర్దిచెప్పుకున్నారు. నేను మన పాఠకులు ఏమంటారో అని ప్రశ్నలుగానే ఇచ్చా. మగాళ్ళందరూ ఇలాంటి పరిశోధనలు జరుగుతున్నందుకు ఇది చదివి గంతులెయ్యండి. పండగ చేసుకోండి.


*. ఆడవాళ్ళు కొంటె పని చేస్తే సరదాగా చేసారంటారు. అదే మగవారు చేస్తే ఏదో ఉందనే అంటారు . ఈ భేదం ఎందుకు?


*. జుట్టును కొత్త స్టయిల్‍లో వేసుకున్నారు. సరే. ఇంకా అద్దంలో అటూ ఇటూ చూడటమెందుకు?


*. పెళ్ళిలో ఒకసారి వేసుకున్న డ్రెస్ ఇంకొకళ్ళ పెళ్ళిలో ఎందుకు వేసుకోరు?


*. బీరువానిండా బట్టలున్నాయి. అయినా ఏదీ కట్టుకోవడానికి మనసొప్పదు. ఎందుచేత?


*. శాస్త్రీయ సంగీతం, మోడర్న్ ఆర్ట్స్ గురించి తెలియనప్పటికీ ‘వాహ్వా, వాహ్వా’ అనడం ఎందుకు?


*. ఇంట్లో ఎన్నో బకెట్లున్నా, ఫ్రీగా దొరికే బకెట్ లేదన్న బాధ ఎందుకు?


*. పర్సులో పెట్టుకోవడానికి ఏమీ లేకపోయినా భుజానికి తగిలించుకుని వెళ్ళడం ఎందుకు?


*. చక్కగా తయారై ఇంటి నుంచి బయటికి వెళ్ళేముందు అత్తతో ” అత్తయ్యా ! మా అమ్మదగ్గరికి వెళ్ళి రానా?” అని కోడలు ఎందుకు అడుగుతుంది?


*. “ఏవండి! నేను చాలా రోజులుగా పుట్టింటికి వెళ్ళడం లేదని అందరూ అడుగుతున్నారు. నేనేం చెయ్యను?” అని భార్య ఎందుకు అడుగుతుంది?


*. పాలగిన్నెలో పాలు తీసి మిగిలిన మీగడను కూడా ఎందుకు తీస్తుంది?


*. రోడ్డుపై నడిచేటప్పుడు భర్త చేయి ఎందుకు పట్టుకుంటుంది? చేయి పట్టుకుని కూడా అడుగులో అడుగేస్తూ ఎందుకు నడుస్తుంది?


*. ఆడవాళ్ళ అలవాట్లు గురించి అడిగినప్పుడు కానీ, ‘ఆంటీ ‘ అని పిలిచినప్పుడు కానీ ఎందుకు కోప్పడుతుంది?


*. వేడి వేడి టీ తీసుకుని, చల్లారాక తాగుతుంది. ఇలా ఎందుకు చేస్తుంది?


*. తాను అందంగా ఉన్నానన్న విషయం రోజూ వినాలని ఎందుకనుకుంటుంది?


*. వంట చేసిన ప్రతిసారీ ‘ఎలా ఉంది?’ అని ఎందుకు అడుగుతుంది?


*. నాలుగు నెలలపాటు కప్‍బోర్డును సామాన్లతో నింపుతుంది. ఆ తరువాత అవన్నీ పాత సామాన్లవాడికి వచ్చిన ధరకు అమ్మేస్తుంది. ఇలా ఎందుకు చేస్తుంది?


*. దీపావళి వస్తుందనగానే ఇంటిలోని ప్రతిమూల, గోడలు, బూజులు అన్నీ శుభ్రం చేస్తుంది. ప్రతీ రోజూ శుభ్రం చేయవద్దని ఎవరైనా చెప్పారా?


*. ఇంట్లో పిల్లలని ఎత్తుకుంటుంది. మార్కెట్‍కుగానీ, రోడ్డుపైకి వెళ్ళినప్పుడుగానీ భర్త చేతికి పిల్లలను ఎందుకు ఇస్తుంది?


*. పాలను మరిగించడానికి పొయ్యి మీద గిన్నెను పెట్టి అక్కడే నిలబడి, తీరా పాలు మరుగుతున్నప్పుడు వేరే పని ఎందుకు చేస్తుంది?


*. మాటి మాటికి అద్దంలో మొహం చూసుకోవడమెందుకు? మొహం మారిపోయిందనా ?


*. పుట్టింటివాళ్ళు రాగానే కూరలు ఎందుకు బాగా రుచిగా వండుతారు? అన్నం ఎందుకు మాడిపోదు ?


*. మాట్లాడకుండా కూర్చుంటే మాట్లాడమని అంటుంది. మాట్లాడుతుంటే నోరు మూసుకోమంటుంది . ఎక్కువగా కోప్పడితే కోపం తెచ్చుకుంటుంది. ఎక్కువగా ప్రేమిస్తే అనుమానిస్తుంది . ఎందుకు?


*. పొరుగింటివాడిని గర్ల్ ఫ్రెండ్ తో తిరుగుతుండగా చూసి, భర్తపై ఓ కన్నేసి ఉంచడంలోని అర్ధం ఏమిటి?


*. తన భర్త పేరు చెప్పి బయట అందరిని భయపెడుతూ ఆ భర్తనే ఇంట్లో భయపెట్టడం ఎందుకు?


*. భర్త జీతం మాత్రం మొత్తం కావాలి. పనిని మాత్రం కుటుంబంలో అందరూ పంచుకోవాలి . ఎందుకు?


గతంలో పొద్దులో ప్రచురింపబడింది.. మళ్ళీ మీకోసం..

Friday, 30 January 2009

అదేంటోగాని....




అదేంటో గాని తెలుగు సినిమాలలో దర్శకుని పేరు ఆఖరున వేస్తారు.

అదేంటో గాని తెలుగు సినిమాలలో హీరో సర్వసాధరణంగా విలన్ కూతుర్నే ప్రేమిస్తాడు.

అదేంటో గాని తెలుగు సినిమాలలో హీరోయిన్ ప్రమాదంలో ఉండగా ఎక్కడినుంచి
ఊడిపడతాడో తెలీదు కాని హీరో వచ్చేస్తాడు, ఫైట్స్ చేసేస్తాడు.

అదేంటో గాని తెలుగు సినిమాలలో హీరో చెల్లెలే రేప్ కు గురవుతుంది.

అదేంటో గాని తెలుగు సినిమాలలో హీరో మారు వేషం వేస్తే మనకందరికి
తెలుస్తుంది కాని సిన్మాలో విలన్ గ్యాంగు వాళ్ళకు అస్సలు తెలీదు.

అదేంటో గాని తెలుగు సినిమాలలో బాల నటులు అన్నీ ముదురు మాటలే మాట్లాడతారు.

అదేంటో గాని తెలుగు సినిమాలలో లెక్చరర్లు, ప్రిన్సిపాల్, పంతుళ్ళు మరీ జోకర్లలాగా
ప్రవర్తిస్తుంటారు. పిల్లలకు భయపడుతుంటారు.

అదేంటో గాని తెలుగు సినిమాలలో హీరో రిక్షావాడైనా రీబోక్ షూస్ మాత్రమే వేసుకుంటాడు.

అదేంటో గాని తెలుగు సినిమాలలో హీరో హీరోయిన్లు ఎంత పేదవారైనా టక్కున
అమెరికా, ఆస్టేలియా వెళ్ళి పాటలు పాడేసుకుంటారు.

అదేంటో గాని తెలుగు సినిమాలలో హీరో కాని హీరోయిన్ తల్లి ఇంట్లో మందులకు
కూడా డబ్బులుండవు కాని రెండువేలకు తక్కువ కాని జరీ చీర మాత్రమే కట్టుకుంటారు.

అదేంటోగాని హీరో ఎంత ఫైటింగ్ చేసినా షర్టు కాలర్ కూడా నలగదు.

అదేంటొగాని టీవీ సీరియల్లో ఆడాళ్లు ఎప్పుడూ ఎంబ్రాయడరీ చీరలే కట్టుకుంటారు.

అదేంటోగాని అత్త మీద చాడీలు చెప్పే కోడలు, తను అత్త అయ్యాక అన్నీ మర్చిపోతుంది.

అదేంటోగాని నాయకులు రొజూ మడత నలగని బట్టలేసుకుని బీదవాళ్ల కష్టాలు చూసి బాధపడతారు.

అదేంటోగాని అసెంబ్లీలో బండబూతులు తిట్టుకుంటారు . బయట పార్టీలలో మాత్రం నవ్వుకుంటూ చేతులు కలుపుకుంటారు.

అదేంటోగాని ఎంత హోటల్ ఓనర్ ఐనా, ఇంటికెళ్లి పప్పన్నమే తింటాడు.

అదేంటోగాని ఆడాళ్లు మొగుడికంటే పనిమనిషికి ఎక్కువ మస్కా కొడతారు.

అదేంటోగాని చాలా మంది అందంగా ఉంటారు , కాని వాళ్ల ఆలోచనలు చండాలంగా ఉంటాయి.

Thursday, 29 January 2009

పి.ఎస్.ఎం.లక్ష్మికి పుట్టినరోజు శుభాకాంక్షలు

అంతరంగ తరంగాలలో ఆలోచనలు , యాత్రలో తన యాత్రానుభవాలు పంచుకునే లక్ష్మిగారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.. మేము తలపండినవారము కాము, తలపడేవారం అని మాకు సవాలు విసిరే లక్ష్మిగారు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని...




నా తరఫున మీకు చిన్న కానుక..

Get this widget | Track details | eSnips Social DNA

Tuesday, 27 January 2009

నటనం ఆడెనే....

ముందుగా కొత్తపాళీగారికి ధన్యవాదాలు. వారి మీసం కథతొ నా చిన్నప్పటి నాటకాలు, ప్రోగ్రాములు, మేకప్పులు గుర్తొచ్చాయి..

మొదటినుండి నేను ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు. స్కూలు, ఇల్లు, చదువు అంతే నాకు తెలిసింది. నా మానాన నేను బుద్ధిగా చదువుకుంటుంటే , నా ఎత్తు నన్ను చిక్కుల్లో పడేసేది. క్లాసులో, లైన్లో వెనకాల ఉన్నా. ఏవైనా ప్రోగ్రాములు , డ్యాన్సులు గట్రా ఉంటే మాత్రం ముందు కనిపించేదాన్ని. అలాంటి సంధర్భాల్లో బెంచిలో ఎంత నక్కి కూర్చున్నా సరే తప్పించుకునే వీల్లేకుండా అయ్యేది. హాయిగా నీడపట్టున క్లాసులో ఉందామనుకుంటే ప్రాక్టీస్ అని లాక్కుపోయేవారు.


ఎనిమిదవ తరగతిలో ఒకసారి క్రిస్ట్ మస్ సందర్భంగా ప్రోగ్రాములు పెట్టారు. మాది కాన్వెంట్ కదా. సిస్టర్స్ ఉండేవాళ్లు. అందులో మా ప్రిన్సిపల్ ఒక చండశాసనురాలు. పోలీస్ ఆఫిసర్‌నైనా అందరిముందు దులిపేసేది. మాకైతే ఆమె ముందు కెళ్లాలంటేనే కాళ్లు వణికేవి. ఇక పెద్ద క్లాసులలోకొచ్చి పిల్లలను అలా ఏరుకుని తీసికెళ్లేవారు ఆ ప్రోగ్రామ్ ..ఈ ప్రోగ్రామ్ అని. ఇలాంటివి వస్తే కాస్త చదువుకు ఆటవిడుపుగానే ఉంటుంది కాని నాకే కాస్త చిరాకు. మేరీ మాగ్దలీన్ అనే వైశ్య కథను నృత్య నాటికగా వేసారు. నన్ను కూడా సెలెక్ట్ చేసారు. నాకేమో నాటకాలు రావు. ఏదో ఆటలు అంటే ఆడతాను కాని. మాట్లాడేది ఏమీ ఉండదు అని నన్ను ఒప్పించారు మా టీచర్. సరే కదా అని ప్రాక్టీసుకు వెళ్లేదాన్ని. నేను ఏసు ప్రక్కనే కూర్చోవాలి. ఒక్కో సీను రెండు మూడు సార్లు చేస్తుంటే చిరాకేసి , హే తొందరగా చెప్పు అని అరిచా.. అందరూ నవ్వారు. అసలు రోజు వచ్చింది. ఇంటినుండి చారలు కాని, గళ్లు కాని ఉన్న చీర తెచ్చుకోమన్నారు . పిసినారోళ్లు. డ్రెస్సులు ఇస్తే ఏం పోయేది అని తిట్టుకున్నాం.. అదేమో ఏసు క్రీస్తు సమయం నాటి వేషధారణ. సరే అని అమ్మ చీర, ఐ్‌బ్రో పెన్సిల్, పౌడర్, కాటుక దువ్వెన గట్రా తీసికెళ్లాను. ఇంట్లోవాళ్లను సాయంత్రం స్కూలుకు వచ్చేయమని నేను పొద్దున్నే వెళ్లిపోయా.. కడుపులో ఒకటే గుడుగుడు .. భయంతో, టెన్షన్ తో.. ముందేమో డైలాగులు లేవన్నారు కాని. నృత్యనాటిక కాబట్టి వెనకాల చెప్పే ఒకే డైలాగుకు కాస్త పెదవులు కదిపితే చాలు అన్నారు. అదో టెన్షన్. వానపడితే బాగుండు అనుకున్నా. డిసెంబర్‌లో పడవనే ఆలోచన కూడా రాలేదు.


ఇక మొహాలు కడుక్కుని తయారవుతుంటే మేకప్పు చేస్తారని తెలిసింది. వింత వింతగా ఉండింది. మొదటిసారి మొహానికి క్రీములు ఏవేవో పూస్తుంటే చల్లగా, చక్కిలిగిలిగా అనిపించింది. అందరం నవ్వాపుకోలేకపోయాం. మాదంతా అమ్మాయిల స్కూలు. ఇక నవ్వులకేం కొదవ. మేకప్పు ఐపోయింది. మీసాలు పెడతామన్నారు. కాటుకతో మేమే పెట్టుకోవచ్చు అని కొత్త డబ్బా తెచ్చుకున్నా. అది తుడుచుకోవడానికి ఒక గుడ్డ కూడ తెచ్చుకున్నా.. కాని మేకప్పు వాళ్లే ఏదో రంగు పూసారు లైట్ గా మీసాలు దిద్దారు. మాకైతే సత్యనారాయనవ్రతం రోజు పీటకు అలంకరించినట్టు అనిపించింది. తప్పదు కదా. అమ్మావాళ్లు, తమ్ముళ్లు వచ్చి నవ్వేసి వెళ్లిపోయారు. చీకటిపడ్డాక ప్రోగ్రాంస్ మొదలయ్యాయి. ఆ నాటిక పూర్తయ్యేవరకు నాకు ఒకటే భయం. అతి కష్టం మీద నా డైలాగ్ పూర్తి చేసా.(అదే ఊరికే పెదవులు కదిపా) మొహంలో కాస్త ఎక్స ప్రెషన్ ఇచ్చానో లేదో గుర్తులేదు. ఐనా ఆ చీకట్లో ఎవరు చూడొచ్చారులే అంత సూక్ష్మంగా అన్న చిన్న ధైర్యం కూడ ఉండింది. ఈ నాటిక ఐపోయి స్టేజీ దిగగానే ముందు చేసిన పని మొహం కడుక్కోవడం. ఏదొ మొహానికి అంటుకున్నట్టుగా ఉండింది.



ఇదే నాటిక మరోసారి, ఒక అబ్బాయిల స్కూలులో వేయాల్సి వచ్చింది. ఒకసారి చేసిన అనుభవం కదా. కాస్త ధైర్యం కలిగింది. ఇక అబ్బాయిలు అంటే .. సాయంత్రం ప్రోగ్రామ్స్ ఐతే మద్యాహ్నం వరకు అక్కడికి చేరుకున్నాం మా గ్యాంగ్ అంతా. మాకు నాలుగైదు క్లాసు రూములు ఇచ్చారు. ఇక అబ్బాయిలు ఎప్పుడూ ఆ చుట్టుపక్కలే తిరిగేవాళ్లు .. అప్పుడప్పుడు వచ్చి ఏమైనా కావాలా అంటూ .. మేము ఊరుకుంటామా. ఆకలేస్తుంది. తినడానికి కావాలి, టీలు కావాలి అని తెగ తిప్పించాం. ఎలాగోలా ఆ ప్రోగ్రాం అయ్యిందనిపించి ఇంటికి చేరేసరికి 7 అయ్యింది. ఇప్పట్లా అప్పుడు భయం లేకుండింది. ఆటోలు లేవు. బస్సులు రూట్ తెలీదు. రిక్షా మాట్లాడుకుని నేనే భయపడుతూ వచ్చా కాని మా అమ్మా హాయిగా వంట చేసుకుంటూ ఉంది.. ఫోన్లు కూడా లేని రోజులు.. నేను ఇప్పటికీ అడుగుతుంటాను. నువ్వేంటి అంత రాత్రైనా భయపడలేదు అని. అప్పట్లో అలా ఉంది మరి అంటుంది అమ్మ. కాని కొన్ని అనుభవాలు జీవితాంతం మరిచిపోలేము..

Monday, 26 January 2009

దోసేలమ్మ దోసెలు ....

నిన్నటి ఆంధ్రజ్యోతి నవ్య విభాగంలోనే వచ్చిన వ్యాసం. ఇది చూసి మగమహారాజులు నన్ను తిట్టుకోకూడదు. ఇలా వెరయిటీలు చూపించి చంపేస్తున్నారు అని. మీకు ఓపికుంటే చేసుకోండి హాయిగా. లేదా మీ ఆవిడను కాస్త మస్కా కొట్టి చేయించుకోండి. కాని మీరు సాయం చేయాలిసిందే తనకు. ఇవన్ని మాకు దొరకవే అనుకోకుండా. మీ ఊర్లో ఉన్నా ఇండియన్ స్టోర్స్ లో ప్రయత్నించండి. ఇక అలాంటి దుకాణాలు లేవు అంటే తూర్పు లేదా పడమర ఎటైనా తిరిగి దండం పెట్టండి. వేరే దారి లేదు. :)



మన దేశంలో దోసెలను ఒకో ప్రాంతంలో ఒకోలా తయారుచేస్తారు. ఎలా తయారు చేసినా రుచి మాత్రం అమోఘం. అద్వితీయం. కాకా హోటళ్లనుంచి కార్పొరేట్ హోటళ్లదాకా తిరుగులేని వివిధ దోసెల తయారీ విధానాలు మీకోసం..

గోల్డెన్ దోసె
బియ్యం: నాలుగు కప్పులు,
మెంతులు: అర స్పూన్,
పెసర పప్పు: అర కప్పు,
మినపప్పు: కప్పు,
శనగపప్పు: అర కప్పు. పప్పులు, బియ్యం కలిపి కడిగి మెంతులు వేసి కనీసం నాలుగు గంటలు నానబెట్టాలి.
తరువాత మెత్తగా రుబ్బి ఎనిమిది గంటలన్నా అలా ఉంచాలి. తగినంత ఉప్పు వేసి కలిపి పలుచగా దోసెలు వేయాలి. కరకరలాడే దోసెలు రెడీ...


రాగి దోసె

రాగి పిండి: అర కేజీ,
ఉల్లిపాయలు: రెండు,
పచ్చి మిరపకాయలు: మూడు,
పుల్లపెరుగు: పావుకేజీ,
మినపప్పు: 100గ్రా,
ఉప్పు: తగినంత,
నూనె: అర కప్పు
రాగిపిండి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిరపకాయ ముక్కలు, మినపప్పు, ఉప్పు పుల్లపెరుగు కలిపి దాదదాపు నాలుగైదు గంటలు నాన నివ్వాలి. గరిట జారుగా కలుపుకోవాలి. వేడి పెనంపై దోసెలు వేసుకుని పైన వెన్న, చిన్న బెల్లం ముక్క పెట్టి సర్వ్ చేస్తే బాగుంటుంది. చట్నీ సాంబారుతో తీసుకోవచ్చు.


తీపి దోసె

గోదుమ పిండి: నాలుగు కప్పులు, బియ్యపు పిండి: కప్పు, బెల్లం: రెండు కప్పులు, తాజా కొబ్బరి తురుము: అర కప్పు, యాలకుల పొడి: స్పూన్, నెయ్యి: అర కప్పు. బియ్యం పిండి గోధుమ పిండిని బాగా కలిపి ఉంచుకోవాలి, బెల్లాన్ని నాలుగు కప్పుల నీటిలో వేసి వేడి చేయాలి.కాస్త చల్లారాక అందులో పిండి మిశ్రమాన్ని వేసి ఉండలు లేకుండా కలపాలి. ఇందులో తురిమిన కొబ్బరి, యాలకుల పొడి వేసి బాగా కలియబెట్టాలి. పెనంపై నెయ్యి వేసి దోసెలు వేసుకుని వేడివేడిగా తినాలి. పిల్లలకు ఈ దోసెలతో జాం కలిపి ఇస్తే ఇష్టంగా తింటారు.






గోధుమ రవ్వ- మైదా దోసె
గోధుమ రవ్వ: రెండు కప్పులు, మైదా: రెండు కప్పులు, బియ్యపు పిండి: అరకప్పు, ఉల్లిపాయ: ఒకటి, పచ్చి మిర్చి: మూడు, పుల్లటి పెరుగు: ఒక కప్పు, ఉప్పు: తగినంత, కొత్తిమిర: రెండు స్పూన్లు. గోధుమ రవ్వ, మైదాలను నాలుగు కప్పుల నీటిలో కలిపి రెండు గంటలపాటు నాన బెట్టాలి.తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, కొత్తిమిర పచ్చి మిర్చి పెరుగు, ఉప్పు వేసి బాగా కలియ బెట్టాలి. పెనంపై దోసెలు పోసుకుని టమాటో సాస్‌తో వడ్డిస్తే చాలా బాగుంటుంది.


పేపర్ దోసె
మినపప్పు: అర కప్పు, బియ్యం: నాలుగు కప్పులు, ఉప్పు: తగినంత, జీలకర్ర: స్పూన్, నూనె: అర కప్పు. మినపప్పు, బియ్యాన్ని విడివిడిగా ఆరుగంటల పాటు నానబెట్టాలి. తరువాత విడిగానే మెత్తగా రుబ్బుకుని మరీ పలుచగా కాకుండా చేసుకుని రెండు మిశ్రమాలను బాగా కలిపి తగినంత ఉప్పు వేసి రాత్రంతా వుంచాలి. జీలకర్రను ముద్దగా చేసి రాత్రంతా నానిన మిశ్రమానికి కలిపి వేడి పెనంపై పేపర్‌లా పలుచగా దోసెలను వేసుకుని సన్నని సెగపై బంగారు రంగు వచ్చే వరకు కాల్చి చట్నీ, సాంబార్‌తో వడ్డిస్తే రుచిగా ఉంటుంది.


ఎగ్ దోసె

మినపప్పు: కప్పు,
బియ్యం: మూడు కప్పులు,
మెంతులు: టీస్పూన్,
మిరయాల పొడి: మూడు స్పూన్‌లు.
గ్రుడ్లు: మూడు, నూనె:
అర కప్పు. బియ్యం,
పప్పు, మెంతులు కలిపి ఆరుగంటలపాటు నాన బెట్టి మెత్తగా రుబ్బి ఉప్పు కలిపి రాత్రంతా ఉంచాలి.గ్రుడ్లు ఉప్పు కలిపి బాగా గిలక్కొట్టి ఉంచుకోవాలి. లేదా అలానే కొట్టి వేసుకోవచ్చు. వేడి పెనంపై దోసెవేసుకుని దానిపై గుడ్డు కొట్టి లేదా గిలక్కొట్టిన మిశ్రమం వేసి నిదానంగా కాలనివ్వాలి. పైన చిటికెడు మిరియాల పొడి చల్లి రెండో వైపు కూడా ఎర్రగా కాల్చి తినాలి.


సెట్ దోసె
మినపప్పు: ఒక కప్పు,
బియ్యం: మూడున్నర కప్పులు,
అటుకులు: అర కప్పు,
ఉప్పు: తగినంత,
కరివేపాకు: రెండు రెబ్బలు,
నూనె: అర కప్పు
మినపప్పు బియ్యం అటుకులు కలిపి ఆరుగంటలు నాన బెట్టాలి. తరువాత మెత్తగా రుబ్బి తగినంత ఉప్పు కలిపి చిన్న పరిమాణంలో కాస్త మందంగా దోసెలు చేసుకుని పైన తరిగిన కరివేపాకు వేసి కొబ్బరి చట్నీ, ఖుర్మాతో వడ్డించాలి. ఈ దోసెలకు కాస్త నూనె ఎక్కువగా ఉంటేనే బావుంటుంది.


మైసూర్ మసాలా దోసె

మినపప్పు: రెండు కప్పులు,
శనగ పప్పు: రెండు కప్పులు,
బియ్యం: పావు కప్పు,
ఉప్పు: తగినంత,
ఎండు మిర్చి: తగినన్ని,
పసుపు: పావు స్పూను,
ఉడికించిన బఠాణీలు: అర కప్పు,
పచ్చి మిర్చి: మూడు,
అల్లం: చిన్న ముక్క,
ఆవాలు: పావు స్పూన్,
మినపప్పు: టీస్పూన్,
శనగపప్పు: స్పూన్,
కరివేపాకు: రెబ్బ,
నూనె: రెండు స్పూన్‌లు

బియ్యం, పప్పులు విడివిడిగా కనీసం ఆరుగంటలు నాన బెట్టి తరువాత మెత్తగా రుబ్బి తగినంత ఉప్పు ఎండు మిరపకాయలు కలిపి మళ్లీ రుబ్బుకోవాలి. పిండిని బాగా కలియ బెట్టి గరిటజారుగా చేసుకుని వేడి పెనంపై కొంచెం నూనె వేసి దోసెలు చేసుకుని చేసిన కూరతోకలిపి వడ్డించాలి. కూర తయారి: బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసి కొద్దిగా వేపి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు తరిగిన పచ్చి మిరపకాయ, అల్లం ముక్కలు కరివేపాకు వేసి కొద్దిగా వేపి బఠాణీలు, తగినంత ఉప్పు వేసి బాగా కలియ బెట్టి దోసెలతో కలిపి తినాలి.






కీర దోసకాయ దోసె

మినపప్పు: గ్లాసు,
బియ్యం: మూడు గ్లాసులు,
మెంతులు: అర స్పూన్,
దోసకాయ గుజ్జు: ఒక కప్పు,
ఉప్పు: తగినంత,
చట్నీ పొడి: రెండు స్పూన్‌లు,
కొత్తిమిర: రెండు స్పూన్‌లు,
పచ్చి మిరపకాయలు: రెండు,
నూనె: సరిపడ మినపప్పు,
బియ్యం, మెంతులు కలిపి కనీసం ఆరుగంటలు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో కీర దోసకాయ గుజ్జుని కలిపి నాలుగు గంటలు పులియనివ్వాలి. తరువాత తగినంత ఉప్పు వేసి గరిట జారుగా కలుపుకుని వేడి పెనంపై పలుచగా దోసెలు పోసుకుని చట్నీ పొడి, కొత్తిమిర, సన్నగా తరిగిన పచ్చి మిరపకాయ ముక్కలు వేసి రెండవ వైపు కాల్చకుండా మడిచి తినేయడమే.

రవ్వదోసె
బొంబాయి రవ్వ: పావుకేజి,
శనగ పిండి: పావుకేజి,
బియ్యం పిండి: పావుకేజి,
మజ్జిగ: అర కప్పు,
పచ్చిమిరపకాయలు: మూడు,
జీలకర్ర: స్పూన్,
కొత్తిమిర: స్పూన్,
ఉప్పు: తగినంత రవ్వ,
శనగ పిండి, బియ్యంపిండి మజ్జిగలో వేసి ఉండలు కట్టకుండా బాగా కలిపి అందులో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర కొత్తిమిర కలిపి కనీసం అరగంట నానపెట్టి గరిటజారుగా కలుపుకుని పలుచగా దోసెలాగా పోసుకుని ఎర్రగా కాల్చి చట్నీతో తీసుకుంటే రుచిగా ఉంటాయి.





మసాలా దోసె

మినపప్పు: గ్లాసు, బియ్యం: మూడు గ్లాసులు, మెంతులు: టీస్పూన్, ఉప్పు: తగినంత, నూనె: అర కప్పు,
మసాలా కూర తయారీకి
బంగాళాదుంపలు: పావుకేజీ,
పచ్చి మిరపకాయలు: రెండు,
కరివేపాకు: ఒక రెబ్బ,
కొత్తి మిర: రెండు స్పూన్‌లు,
ఆవాలు: పావు స్పూన్,
జీలకర్ర: పావు స్పూన్,
మినపప్పు: అర స్పూన్,
శనగ పప్పు: టీస్పూన్,
పసుపు: చిటికెడు,
ఉల్లిపాయ: ఒకటి,
నూనె: మూడు స్పూన్‌లు

పప్పు, బియ్యం మెంతులు కలిపి కనీసం నాలుగు గంటలు నాన బెట్టి మెత్తగా రుబ్బి ఆరుగంటలపాటు పులియ నివ్వాలి. తరువాత తగినంత ఉప్పు వేసి కలిపి ఉంచుకోవాలి. బంగాళాదుంపలు ఉడకపెట్టి పైచర్మం తీసి కావల్సిన సైజులో ముక్కలుగా చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. బణాలీలో నూనె వేడి చేసి పోపు సామానులు వేసి చిటపటలాడాక కరివేపాకు,

తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మరిపకాయలు వేసి అవి మెత్తబడే వరకు వేయించి చిదిమి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు, పసుపు, వేసి బాగా కలియ బెట్టి అవసరమైతే కొద్దిగా నీరు- చల్లి ఐదు నిమిషాల పాటు వేయించాలి. దించే ముందు కొత్తిమిర చల్లి తీసి పక్కన పెట్టుకోవాలి. రుబ్బి పెట్టుకున్న పిండితో దోసె వేసి ఎర్రగా కాల్చి తిరగేయకుండా పైభాగాన గరిటెడు మసాలాకూర వేసి మధ్యకి మడిచి కిందికి దింపేయాలి.


కొన్ని చిట్కాలు..


-దోసెల పిండిని కలియ బెట్టే సమయంలో రెండు చిటికెల పంచదార వేసి కలిపితే అందంగా, కరకరలాడుతూ ఉంటాయి.
-దోసె రుచిగా ఉండాలంటే బియ్యం, పప్పుల పిండితో పాటు ఒక చిన్న చెంచాడు మెంతిపొడి కలపాలి. లేదా బియ్యంలోనే చెంచాడు మెంతులు కలిపి నానబెట్టాలి.. -దోసెలు పెనానికి అతుక్కోకుండా వుండాలంటే ఒక దోసె వేసి తీసిన ప్రతి సారీ సగం కోసిన ఉల్లిపాయతో లేదా చెక్కు తీయని పెద్ద అరటికాయ ముక్కతో పెనాన్ని రుద్దాలి.

-దోసె, ఉతప్పం మందంగా తయారవ్వాలంటే బియ్యంతోపాటు అరకప్పు అటుకులు కూడా కలపాలి.
-ఒక చెంచాడు తినేసోడాను పిండిలో కలిపి దోసె వేస్తే కరకరలాడుతూ రుచిగా ఉంటుంది.
-చలికాలంలో దోసెపిండిలో ఒక చిన్న చెంచాడు ఈనోసాల్ట్ కలిపితే త్వరగా పులిసి దోసె కొంచెం పుల్లగా కూడా ఉంటుంది.
-ఒక పెద్ద వంకాయను సగానికి కోసి నూనెలో ముంచి దానితో వేడి పెనాన్ని రుద్ది దోసె వేస్తే దోసె పెనానికి అతుక్కోకుండా నీట్‌గా వచ్చి దోసె కరకరలాడుతూ ఉంటుంది.

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008