Sunday, 5 July 2009

అష్టనాయికలు -పాఠికలు

పొద్దు గడి కోసం అష్టనాయికల కోసం జాలం లో వెతుకుతుంటే ఈ అపురూపమైన సమాచారం దొరికింది. అష్టనాయికలపై దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన కవిత్వం, అలాగే అష్ట పాఠికలు గురించి కూడా తెలిసింది. అష్టపాఠికలు గురించిన సమాచారం SCIt లో 1995 లో ఇచ్చారు. వెదకకుండానే బంగారు తీగ తగిలింది. అవి మీతో పంచుకోవడానికి ఇక్కడ ఇస్తున్నాను. SCIt గురించి మరిన్ని వివరాలు ఎవరైనా చెప్తారా??



అష్ట నాయికలు :


ఇరులలో తారక లివియంచు, తానేనా
కురులలో మల్లియ విరులు తురుము!
అసలే కెందమ్ము లీ అడుగు లనుచు, ఎంతో
పొందుగ లత్తుక పూయు తానే!
అదియేదో అంటే నీ అధరాన నని, తన
మెత్తని పెదవుల నొత్తి తుడుచు!
చూచుచు, మరి మరి చూచి మెచ్చుచు, మక
రికల చెక్కిళ్ళ చిత్రించు తానే!
ఎంత పున్నెమ్ము చేసినానే, మగండు
ఒక్క క్రీగంటి చూపులో, ఒక్క లేత
నగవులో, నా మనస్సు నెరిగి గ్రహించి,
తీర్చునే యంచు మురియు `స్వాధీన పతిక '
------------------



విభుని దోతేర పంపిన ప్రియ దూతిక
లెంతకు తిరిగి రారేమో కాని-
ఘనుల సద్గోష్ఠిలో మునిగి యున్నాడని
వెరతురేమో స్వామి దరియుటకును;
నిప్పుల వర్షమై నిలువెల్ల దహియించు
నిలబడనీదు వెన్నెలల వాన;
అయ్యయో మదన దేవా! మ్రొక్కు దాన, నా
పైననా ననతూపు పదను బాకు?
అతనుదవు, నీవు పోగల వటకు, - వారి
ఉల్లమున జేరి నా మాట నూదగలవు;
చనుము - నా ప్రాణముల నిల్పు మని నెలాంత
తల్లడిలు విరహోత్కంఠిత వలవంత?
---------------




పవళింపు గదిలోన, పగడంపు కోళ్ళ చ
ప్పరపు మంచము పైన పాంపు పైన
వలిపంపు జిలుగు దుప్పటి వేసి, కస్తూరి
జువ్వాది కలిపిన గంధ సార,
మగరు వత్తులు, మేలి అత్తరుల్, పచ్చక
ప్పురపు వీడియము పళ్ళెరమున నిడి
ద్వారాన తోరణాల్ కూరిచి, ముంగిట
వన్నెవన్నెల రంగవల్లులుంచి
తానమాడి, పుప్పొళ్ళ నెమ్మేన నలది
నెరుల సిగ నల్లి, నుదుట చెందిరపు బొట్టు,
కనుల కాటుక, అలతి నగవులు మెరయ
విభుని కొరకు వాసక సజ్జ వేచి యుండు
-------------




ఈ తీవ యోవరియే గదా తాముర
మ్మన్న యేకాంత గృహమ్ము! తాము
మెత్తురనే గదా, మెలత, ఈ కయిసేత!
ఈ నిరీక్ష్ణము లింకెంత శేపె?
కడచెనే రేయి సగ; మ్మైన శ్రీ వారి
అడుగుల సడియును పడదు చెవుల-
మరిమరి పొగడకే మాయల మారిని,
విసిగిన ప్రాణాలు వేపి తినకె!
పదవె, అడుసాయె నేల నా బాష్పవారి
ననుచు నెవ్వగ మెయినగ లన్ని ఊడ్చు;
"అసలు దోషము నాదే" నటంచు ఏడ్చు;
విరహమున వేగిపోయిన విప్రలబ్ధ


-----------
"మన సార వలచి వచ్చిన వాడు,నీ రేడు
తొగరేని మించు సోయగము వాడు;
లాలించినాడు, తన్నేలు కొమ్మన్నాడు-
చప్పగా వాయైన విప్పవపుడు.
అవియేటి అలకలో! అ మూతి ముడుపులు
ఆ మొండిపట్టులు, ఆ బిగువులు!
ఇక నిప్పుడోయమ్మ! ఎన్ని నిట్టూర్పులు
అసురుస్సునంటలు, అలమటలును!
ఓసి, ఇవియేటి చేతలే బైసి మాలి!
ఏరు విన్నను నవ్వగలారు లె" మ్మ
టంచు చెలి పల్క, తెలివొంది అలవి కాని
వెతల పాలౌచు కలహాంతరిత తపించు
--------------



విన్నవే యిన్నాళ్ళు, కన్నులారగ చూసి
న్నను, నేడేంతో ఆనంద మాయె;
ఆ చందనాంకము లా తమ్ములపు ముద్ర
లే లేమవో చెప్పలేరు తామె;
వేయికి పైనాయె ప్రియురాండ్రు, రేయికో
మూడే ఝామములాయె - మోహ యాత్ర
నేదో ఈ దారి నూరేగు చుబుసుపోక
వేంచేసినార లీ వేగుబోక
వలదు విడియగ నిట మానవతులే గాని
వలపు బిచ్చ మాశించెడి వారులేరు;
పిలిచుచున్నవి వేరె కౌగిళులు, వెడలు
మనుచు తెగనాడు ఖండిత అయిన రాధ
--------



"అటు చూడ వీటి ముంగిటను మౌనమ్ముగా
తల వాలిచె మన మందార తరువు!
పురి విప్పదు మన పెంపుడు మయూరమ్ము ది
గులుచెంది దిక్కుదిక్కులకు చూచు!
సరెసారెకు మన శారిక పలవించు
కలువరపడి ఏదృ పలుకబోవు!-
ఏలాగు నీ మేఘవేళ ఒంటరి రేల
ప్రాణేశ్వరు ప్రవ్వసి బాసి" యనుచు
చల్లుకొను మేన గొజ్జంగి నీరు;
గుప్పుకొను కప్పురము తోడి పుప్పొడులను;
పొరలు సెజ్జ, లేచి మరల నొరుగు సుంత;
పొగులు ప్రోషిత భర్తృక మగని కొరకు
-------------------




నడి రేయి, చక్కని పున్నమి నాటి వెన్నెల
పాల వెన్నెల జడివాన లీల!
హృదయేశు డున్న ఆ పొదరింటి వర కొరుల్
పసిగట్టకుండ పోవలయు గాదె!
తెలికోక తెలి రైక, తెలిమేలి ముసుగులో
మెయి సోయగపు మిసమిసలు దాచి
కాలి యందెల కడియాల గాజుల మువల్
రవళింపకుండ చెరగున జొనిపి
మోముపై, కేలిపై గంద వొడి నలంది
పులుగు రవ్వంత గూట కదల బెదరుచు
ఆకుసడి కదరుచు, గాలి అడుగు లిడుచు,
వెడలె నభిసారికగ ప్రియు కడకు రాధ

-------------------------------------------------------------------------------------------



అష్టపాఠికలు:

నేడు వార, మాస పత్రికా పాఠకులలో మహిళలే అధిక సంఖ్యాకులు.

వీరిలో అష్ట విధములైన వారున్నారు.

1) కథనోత్కంఠిత

2) స్వాధీన పఠిత

3) రీడిత

4) చిత్ర లబ్ధ

5) అభిమానిక

6) పుస్తక సజ్జిక

7) నవలాంతరిత

8) పోషిత పత్రిక


విధముగా వీరిని వర్గీకరించనగును. వివరణము యీ క్రింద యొసంగ

బడినది.


చిన్న కథల యందు అత్యంత ఆసక్తి కలిగి, యెక్కడ అచ్చు అక్షరము కనిపించిననూ కథయేమోనను భ్రమతో చదువుటకు

వుపక్రమించు నామె కథనోత్కంఠిత.


స్వాధీన పఠిత నిర్ణీత వేళల యందు మాత్రమే పత్రికా పఠనము గావించును. తీరిక సమయములందు కాలహరణమునకు ఈమె చదువును.


మిక్కిలి పఠనాసక్తి గల స్త్రీ రీడిత (రీడింగ్, అను ఇంగ్లీషు పదము దీనికి మూల ధాతువు). కథ, నవల, కవిత, లేఖయని ప్రక్రియా భేదము లేక వాణిజ్య ప్రకటనలతో సహా యీమె చదువ గోరును. సులోచనములు వుండుట యీమెకు సంచార

గుణము.



చదువుట యందు యిసుమంతైనా శ్రధ్ధ చూపక కేవలము చిత్రములను మాత్రమే చూచెడి వనిత చిత్ర లబ్ధ. ముఖ చిత్రాలను చూసి యీమె పరవశించును.


అభిమాన రచయితల,లేదా రచయిత్రుల రచనలు మాత్రమే చదివెడి యామె అభిమానిక. మీ/మా పత్రికలకు లేఖలను, ఆయా పత్రికలలోని రచనలను పొగడుచు సంపాదకులను అభినందించుచు లేఖలు వ్రాయును.


పుస్తకములను, ముఖ్యంగా లావైన నవలలను, మందపాటి ప్రత్యేక సంచికలను తలగడగా అమర్చుకుని నిద్రించు పాఠకురాలు పుస్తక సజ్జిక. నిద్ర కోసము మాత్రమే ఈమె పుస్తకములు చదువును.



దారావాహిక నవల పూర్తియగు వరకు నిద్రాహారములను త్యజించు నామె నవలాంతరిత. ఈమెలో నిద్రలేమి, ఆకలి దప్పికలు లేకుండుట, సంచారీ భావములు. నవలలోని నాయికలో ఐక్యమై, కథానాయిక మనోభావములకు అనుగుణముగా ఈమె మనఃప్రవృత్తి వుండును. సీరియల్సుని కత్తిరించి, బైండు చేయించుటయందు ఈమె కాసక్తి మెండు.



వార, పక్ష, మాస పత్రికలకు చందాలు చెల్లించి, తాను చదవక, ఇరుగు పొరుగు వారికి అరువిచ్చునామె పోషిత పత్రిక. పత్రికల పంపిణీ ద్వారా పలుకుబడిని సంపాదించుట ఈమె ధ్యేయము.



Friday, 3 July 2009

నేటి మహిళ - 2

మొదటి భాగం చదివారుగా ...


1. ఈ రోజు ప్రేమ వ్యవహారాలలో హత్య, ఆత్మహత్య అనేవి పెరిగిపోతున్నాయి. దీని గురించి మీరేమనుకుంటారు? ప్రాణం కంటే ప్రేమ గొప్పదా?

అను : ఈ మధ్య పేపర్లో సమీర బేగం గురించి చదివి నేను చాలా బాధ పడ్డాను. ఈ హత్యలు, ఆత్మహత్యలు అసలు జరిగేది ఎందుకు? ప్రేమగురించా, లేదా పంతం వల్లా? ప్రేమ చాలా గొప్పది, అది యెప్పుడు మనం ప్రేమించిన వాళ్ళు సంతోషంగా వుండాలని కోరుతుంది. ఇలా హత్యలు, ఆత్మహత్యలు చేసుకుని అది ప్రేమ కోసం అంటే నేను నమ్మను.

సంజు : ముందుగా ప్రేమ, హత్య కలిసి ఉంటాయని చెప్పలేను. ఇక ప్రేమ వ్యవహారంలో ఆత్మహత్య నిస్సహాయ స్థితిలో, మానసికంగా బలహీనులైనప్పుడు తీసుకునే నిర్ణయం. కాని ఏ సంఘటన ఐనా ప్రాణాలు తీసుకునేవరకు దారితీయవు. ప్రేమ కోసం ప్రాణాలు వదులుకోవడం అంటే అది పిచ్చితనమే అవుతుంది. ప్రతీ సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. అందులో కొన్ని మనకు నచ్చకపోవచ్చు. కాని ఆత్మహత్య అనేది ఎప్పటికీ సమస్యకు పరిష్కారం కాదు.




2. ఒక బస్ స్టాప్ దగ్గర కొందరు అబ్బాయిలు అక్కడున్న అమ్మాయిలు, ఆడవాళ్లను రోజూ వేదిస్తున్నారు. అలాంటి సంఘటన గురించి మీకు తెలిస్తే మీరిచ్చే సలహా ఏంటి? అమ్మాయిలు దీనిని ఎలా ఎదుర్కోవాలంటారు? పోలీసుల సహయం తీసుకోవాలా? దానివల్ల ఉపయోగం ఉంటుందా?

అను : ఏదో కామెంట్ చేస్తూ, పాటలు పాడుతూ ఉంటే చూసీ చూడకుండా వదిలేయడం ఉత్తమం. నాకు ఇలాంటి అనుభవం ఎదురైంది. ఇంజనీరింగులో ఉన్నప్పుడు ఒకబ్బాయి రోజూ నన్ను ఫాలో చేసేవాడు. నేను పట్టించుకోలేదు. ఒకరోజు వాడు నా చున్నీ పట్టుకుని లాగాడు. ఎక్కడినుండి ధైర్యం వచ్చిందో తెలీదు కాని నా డ్రాఫ్టర్ పెట్టి తరిమి కొట్టాను. చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కూడా నా వెనకే అతన్ని తరిమారు. డ్రాఫ్టర్ విరిగిపోయింది. కాని భయం వేసి 4-5 రోజులు మా నాన్నను వెంటబెట్టుకుని కాలేజీకి వెళ్లాను. కాని ఆ తర్వాత ఆ అబ్బాయి కనపడలేదు. నా దృష్టిలో ఆడపిల్లలందరూ సెల్ఫ్ డిసిప్లిన్ నేర్చుకోవాలి. ఎవరైనా ఫిజికల్ గా టీజ్ చేస్తే బుద్ధి చెప్పాలి. అది ఆగకుంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. వాళ్లు తగిన చర్యలు తీసుకుంటారు...

సంజు : ఒకవేళ అది హటాత్తుగా జరిగిన సంఘటన ఐతే పరిస్థితులను బట్టి ప్రవర్తించాలి. ఒకవేళ ఆ అమ్మాయి ఒంటరిగా ఉండి, సమయానికి ఎటువంటి సహాయం దొరికే అవకాశం లేనప్పుడు సాధ్యమైనంతవరకు మౌనంగా, ప్రశాంతంగా ఉండాలి. ఆ అబ్బాయిలను పట్టించుకోకుండా అక్కడినుండి వెళ్లిపోవాలి. ఇది ప్రతీరోజు జరిగే సంఘటన ఐతే తప్పకుండా పోలీసులకు కంప్లెయింట్ చేయాలి. ఇప్పుడు ఈవ్ టీజింగ్ విషయంలో పోలీసులు, అధికారులు చాలా కఠినంగా ఉన్నారు.




3. మీ పిల్లలను ఎలా పెంచాలనుకుంటున్నారు?వాళ్లకి నేర్పాల్సిన ముఖ్యమైన విషయాలేంటి?

అను : జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది.. సంతోషంగా ఉండగలగడం. సంటొషం అన్నది ఎక్కడో బయటినుండి రాదు. అది మనలోనే ఉందని నేను నమ్ముతాను. కనుక మనం ఎలా ఉన్నా సంతోషంగా, సంతృప్తిగా ఉండాలని మా పిల్లలకు నేర్పడానికి ప్రయత్నిస్తున్నాను. పిల్లలు బాధ్యతగల ,నిజాయితీగల మంచి పౌరులుగా అవ్వాలన్నది నా కోరిక. వాళ్లు యోగ్యులై, పదిమంది వాళ్లని చూసి ముచ్చట పడేలా ఉండాలి. వాళ్లు సమాజానికి, దేశానికి ఏమైనా చేస్తే నేను, మా ఆయన కూడా చాలా గర్వపడతాము.

సంజు : నేనైతే పిల్లలకు ఎప్పుడు కూడా స్వతంత్రంగా ఆలోచించడం, జీవించడం నేర్పిస్తాను. వాళ్లు ఎప్పుడు కూడా ఎవరి మీదా ఆధారపడకూడదు. వాళ్లు తమలోని శక్తి సామర్ధ్యాలను గుర్తించి వాటికనుగుణంగా పనిచేస్తూ ఎప్పుడు కూడా ముందుకెళ్లాలి. అలాగే తమను, ఇతరులను అందరని ఒకేవిధంగా గౌరవించాలి. మానవత్వంతో మెలగాలి.





4. పిల్లలపై తల్లితండ్రులు ఎంతవరకు కంట్రోల్ ఉంచాలి? వాళ్లు ఏం చేస్తున్నారు. ఏం చదువుతున్నారు అని గమనిస్తూ ఉండాలా?లేదా అమెరికాలో లాగా పదిహేను నిండగానే they are grown up అని వదిలేయాలా?

అను : శరీరాన్ని కంట్రోల్ చేయగలమేమొ కానీ మనసుని యెలా కంట్రోల్ చేస్తాము? నియంత్రించటము కన్నా నేర్పించటము మిన్న కదా. మంచీ-చెడూ వాళ్ళకివాళ్ళే తెలుసుకునేలా పెంచితే మనమున్నా లేకపొయినా పిల్లలూ ఒకేలా వుంటారు. ఇరవైనాలుగుగంటలు వాళ్ళతో వుండాలంటే కుదరదు కదా. నాకు మా అమ్మా-నాన్నల పద్ధతి బాగా నచ్చింది. మా చిన్నప్పుడు వాళ్ళు మేమే సర్వం అన్నట్టు వుండేవారు. కాని ఇన్జినీరింగ్ అయి పొయాక రాత్రికి రత్రే వాళ్ళు ఫ్రెండ్స్ గా మారిపొయారు - ముఖ్యంగా నా పెళ్ళి కుదిరాక. నా జీవితంలో ప్రతి క్షణంలో నాకు ఎలాటి అంద అవసరమైందో అది వాళ్లు అందించారు. అదే నా అభిప్రాయం కూడా. పిల్లలకి అవసరం వున్నంత వరకు మనం గమనించాలి. వాళ్ళు మనలని వదిలేసే దాకా, రెక్కలొచ్చి యెగిరేదాక, మనం చూస్కుంటూనే వుండాలి. వాళ్ళు స్త్రిక్ట్ అనుకున్నా సరే - పెద్దయ్యాక అర్ధం చేసుకుంటారు.

సంజు : పిల్లలకు కనీసం 18 ఏళ్లు వచ్చేవరకు మన తోడు అవసరం. మనం ఎవ్వరిని కంట్రోల్ చేయలేము. ఈ రోజుల్లో మూడేళ్ల పిల్లలు కూడా ఒక్కోసారి మన మాట వినరు. వాళ్లని సరైన దారిలొ మళ్లించాలి. సహాయం చేయాలి. అలాగే ఏ విషయం చెప్పినా కూడా అది వాళ్ల మనసులో హత్తుకునేట్టు ఉండాలి. తండ్రి సిగరెత్ తాగుతూ పిల్లలను పొగ తాగడం మంచిది కాదు. ఆరోగ్యానికి చేటు అని చెప్పడం ఎంతవరకు సమంజసం. కాని కొన్ని సమయాలలో మనం కాస్త కఠినంగా ఉండక తప్పదు.

జ్యోతి : అను . నువ్వుచెప్పింది నిజం. పిల్లలతో ఎప్పుడూ ఒక మంచి ఫ్రెండ్ లా ఉండాలి. ముఖ్యంగా స్కూలు దాటాక వారికి మంచి స్నేహితులు చాలా అవసరం. అది తల్లితంద్రులలో ఎవరో ఒకరు ఐతే మరీ మంచిది. వాళ్లకు తెలీని, తెలిసిన విషయాలు ఇంట్లో కూడా చర్చగలిగే చనువు మనం ఇవ్వాలి. అప్పుడే వాళ్లు చెడు స్నేహాలు పడకుండా ఉంటారు. పెద్దలమని వాళ్లని అధికారంతో దూరం పెట్టి నియంత్రించకుండా మంచి ఫ్రెండ్ లా ఉంటే వాళ్లు కూడా సంతోషిస్తారు. స్నేహితులు, చదువు. సినిమాలు, ప్రేమ కూడా చర్చగలిగే స్వాతంత్ర్యం మన దగ్గర ఉండాలి. ముఖ్యంగా తల్లి ఈ విషయంలో చొరవ తీసుకోవాలి.




5. సాధారణంగా ఏ సమస్య వచ్చినా , శారీరకంగా మగవాళ్లకంటే ఆడవాళ్లు బలహీనులు ఐనా మానసికంగా ఎంతో ధైర్యవంతులు అంటాను. ఒక్కోసారి వాళ్లే ఈ సమస్యను ఎంతో నేర్పుగా పరిష్కరించగలరు. మీరేమంటారు?

అను : శారీరిక బలం కన్నా మనోబలం ఆడవారికి యెక్కువ. నేను ఒప్పుకుంటాను. కాని సమస్యలు పరిష్కరించేటప్పుడు మగవాళ్ళు గొప్పా, ఆడవాళ్ళు గొప్పా - అంటే నేను చెప్పలేను. ఇద్దరూ సమస్యని వేరు వేరు దృష్టికోణాలలో ఆలోచిస్తారు కనుక యే సమస్య వచ్చినా ఇద్దరు కలిసి పరిష్కరించుకుంటే బెస్ట్.నలుగురి సలహా తీసుకుని మనకి యేది ఉత్తమము అనిపిస్తే అది చేయాలి. ఇందాకటి ఈవ్-టేసింగ్ ప్రశ్నలో - మనొబలం మాత్రమే వుంటే సరిపోదు, కదా?

సంజు : మీ మాటతో నేను పూర్తిగా ఒప్పుకోను. ఎక్కువమంది ఆడవాల్లే మగవాళ్లకంటే మానసికంగా బలవంతులు. కాని అందరూ అలా ఉండరు. ప్రతి వ్యక్త్ని బట్టి ఈ విషయాన్ని నిర్ధారించగలం.

జ్యోతి : సంజు..నేను చెప్పింది అదే. ఎప్పుడు స్త్రీ గొప్పదే అనలేదు. కొన్ని సందర్భాల్లొ ఎంత విషమ పరిస్థితి ఐనా కూడా తన చేతిలోకి తీసుకుని చక్కదిద్దుతుంది. నేను ఇలాటి వారిని కొందరిని చూసాను కూడా . :)





6. మీరు ఉద్యోగం లో ఎదుర్కొనే సమస్యలు, పోటీ ఎలా ఉంటాయి. ఈవ్ టీజింగ్ లేదా హరాస్మెంట్ అనేది చాలా మంది ఉద్యోగినులు ఎదుర్కునే సమస్య కదా. అది ఎలా పరిష్కరించగలం?

అను : పెద్ద మల్టీ నేషనల్ కంపనీస్ లో ఇప్పుడు చాలా అవేర్నెస్ ఉంది. ఈవ్ టేజింగ్, హరాస్మెంట్, ఇలాన్టివి చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. కాని ఈ ప్రొబ్లెం చాలా చోట్లు ఇంకా ఉంది. దీన్ని గురించి మహిళలు కంప్లైన్ చెయటానికి భయపడతారు, లేదా సిగ్గు పడతారు. ఇంట్లొ వాళ్ళు కూడ ఉద్యోగం మానిపించేస్తారే తప్ప వేరే యే చర్య తీసుకొవడానికి ఒప్పుకోరు. ఇది సామజిక సమస్య, ప్రపంచంలో అన్నిదేశాల్లోను ఉంది. ఇది చాలా దురదృష్టకరం. ఈ సమస్య దూరమవ్వాలంటే మహిళలు కూడ ఉద్యోగం చెయ్యాలి - ఉన్నత స్థాయిలు చేరుకోవాలి. ఈ రోజు 20-30 శాతం ఉద్యొగులు ఆడవారు. దీనితో మగ వాళ్ళ డామినషన్ ఎక్కువ ఉంది. 50 షాతం మహిళలు ఉంటే ఈ డామినషన్ తగ్గవచ్చు. ఇంట్లో వాళ్ళు సహకరిస్తే ఇది చాలా సులభంగా జరుగుతుంది - ఎంతో మంది ఆడవాళ్లు చాలా ప్రతిభ ఉన్నవారు. ఈ సమస్య తీరటానికి ఇంక కొంత కాలం పడుతుంది.

సంజు : లేదండి.. పెద్ద పెద్ద ఐటి కంపెనీలలొ ఇలాంటి వేదింపులు ఉండవు. అందరు కూడా ఉన్నత విద్యావంటులు కావడం వల్లనో, ఇలాంటి ప్రవర్తన హేయమైనది, కంపీనీలలో అంగీకరించనిది అనే స్పృహ ఉండడం వల్ల అనుకుంటా. కాని అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. నేరాన్ని పూర్తిగా రూపుమాపలేము కదా. మిగతా చోట్ల కంటె ఐటి కంపెనీలలో వేదింపులు తక్కువ,నియంత్రణ ఎక్కువగా ,కఠినంగా ఉంది అంటాను. కాని బయటకెళితే పరిస్థితి తారుమారు కావొచ్చు. ఇదే వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించే అవకాశం ఉంది.ప్రభుత్వం, పోలీసులు, ప్రజలు ఇలాంటి నేరాలు, వేదింపులను ఖండించాలి. శిక్షించాలి. స్కూల్లు, కాలేజీలలో అధ్యాపకులు, ఇంట్ళో తల్లితండ్రులు భావి తరాన్ని సరియైన రీతిలో తీర్చి దిద్దాలి. ప్రతి తల్లితంద్రి తమ కూతుళ్లను ఇలాంటి సంఘటనలు ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలు మెల్లిగా అర్ధం చేయించాలి. అలాగే మగపిల్లలకు కూడా. అనుకోని సంఘటన ఎదురైతే ఎలా రియాక్త్ అవ్వాలి అనేది వాళ్లకు నేర్పడం ముఖ్యం. నేనైతే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లేటప్పుడు నా బ్యాగును గట్టిగా పట్టుకుంటాను. పరధ్యానంగా ఉండకుండా చుట్టు జాగ్రత్తగా గమనిస్తూ వెళతాను.



7. ఉద్యోగంలో చాలా వత్తిడులు ఉంటాయి. ఆడవారని ఎవరూ వదిలేయరు కదా. ఉన్నతమైన , బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్నప్పుడు తప్పవు కదా.. ఆఫీసులో ఎక్కువ సేపు ఉండాల్సి వస్తుంది. అలాంటప్పుడు మీ కుటుంబ సభ్యులు,ముఖ్యంగా మీ భర్త ప్రతిస్పందన ఎలా ఉంటుంది. ఆపీసు, ఇల్లు సమర్ధంగా ఎలా మేనేజ్ చేస్తారు?

అను : మా ఇంట్లో మా అత్తగారు సి.ఈ.ఒ. పని వాళ్ళని, ఇంటిని, అంతా ఆవిడే చూసుకుంటారు. నాకు భర్త దగ్గర మోరల్ సపోర్ట్ దొరుకుతుంది, కానినిజమైన సపోర్ట్ అంతా మా అత్తగారు అందిస్తారు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నాకు ఉద్యోగం మానేయాలనిపించింది. కాని ఆవిడ "నేను ఉన్నాను కదా, నాకు ఓపిక ఉన్నపుడు నువ్వు ఉద్యోగం చేయి " అన్నారు. మా అమ్మ నాన్నా కూడ ఉద్యోగం చేయటానికి ప్రొత్సహించారు. కావాలంటే మీ దగ్గరలో ఇల్లు తీసుకుని ఉంటాము, నీకు ఏ కష్టం ఉండదు అని ధైర్యం చెప్పారు. పిల్లల విషయంలో మా ఆయన చాలా బాధ్యత వహిస్తారు. వాళ్ళకి హొంవర్క్ హెల్ప్ ఆయినే చేస్తారు. ఈ సహకారం లేకపొతే మనకు కెరీర్ మీద ఫొకస్ ఉండదు. ఇంత వున్నా ఏరోజుకారోజు సర్దుకుపోవడం అన్నది చేసుకుంటునే ఉండాలి.

సంజు : ఆడవాళ్లైనా, మగవాళ్లైనా తమ పనిని ఒక నిర్దిష్తమైన ప్రణాలిక ప్రకారం చేసుకుంటే ఏ గొడవా ఉండదు. నేను దాదాపు 15 ఏళ్లుగా పని చేస్తున్నాను అందుకే ఇది తప్పకుండా సాధ్యమవుతుంది అని చెప్పగలను. కాని దానికోసం కొన్ని విషయాలలో మనం జాగ్రత్త వహించాలి. మన సమయం, శక్తి , మన అవసరాలు (కుటుంబం, పిల్లలు వగైరా) ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మన ఉద్యోగ బాధ్యతలు నియంత్రించుకోవాలి. ఉద్యోగానికి ఎంతవరకు మనం న్యాయం చేయగలమో అంతవరకే చేయాలి. కెరీర్ కోసం కుటుంబాన్ని , వ్యక్తిగత జీవితాన్ని ఎట్టి పరిస్థితిళొనూ కోల్పోకూడదు. ప్రతి వ్యక్తి ఈ విషయంలో చాలా జాగ్రత్త పడాలి. ఇల్లు, పిల్లలు నా మొదటి బాధ్యత. వాటికి తగినంత సమయం కేటాయించడం నా ధర్మం. అదృష్టవశాత్తు మావారు పిల్లల విషయంలో ఎంతో సహాయపడతారు. వాళ్లను స్కూలుకు తీసికెళ్లడం, చదివించడం, ఆటపాటలు.. అత్తగారు వాళ్లు కూడా ఎంతో ప్రోత్సాహమిస్తారు. నేను ఇంటికొచ్చేవరకు పిల్లలను చూసుకుంటారు. కుటుంబానికి సంబంధిచిన ప్రతి కార్యంలో నేను తప్పనిసరిగా పాల్గొంటాను. ఒక్కొసారి ఆఫీసులో లేట్ ఐనా కూడా (ఎన్నో సార్లు జరిగింది) , అత్తగారు, మావారు ఈ విషయంలో ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. వీలైనంతవరకు నా పని వేళలు నియంత్రించుకుంటాను. తొందరగా ఆఫీసుకు వెళ్లి, తొందరగా ఇల్లు చేరడం. నేటి సాంకేటిక పరిజ్ఞానం వల్ల ఇంటినుండే నా ఆఫీస్ పని పూర్తి చేసుకుంటాను. తప్పనిసరి ఐతేనే ఆఫీసులొ ఆలస్యం అవుతుంది. లేదా ప్రయాణాలు ఉంటాయి. మనం ఏ పనైనా ఒక ప్రణాలిక ప్రకారం నిర్వహిస్తే తప్పక విజయం సాదించగలం. దీనివల్ల స్త్రెస్ అనేది ఉండదు.




8. ఆడది చిన్నప్పుడు తండ్రిపై, పెల్లయ్యాక భర్త, ముసలితనంలో కొదుకుపై ఆధారపడాలి అంటారు పెద్దలు. అలా ఎప్పటికీ ఆధారపడే ఉండాలా. వేరే దారి లేదా??

అను : ఈ విషయంలొ నాకు చాలా బలమైన అభిప్రాయం వుంది. డిపెండ్ అవ్వటం అంటే పారసైట్ లాగ వుండడము కాదు. ఇమోషనల్ సపోర్ట్ మనకి ఎప్పుడు అవసరమే. నా జీవితంలో మా నాన్నగారు, మా ఆయిన, మా అబ్బాయి - ముగ్గురూ చాలా ముఖయమైనవారు. అలాగే మా అమ్మా, చెల్లెలు, అత్తగారు, మా అమ్మాయి వీళ్ళందరి వల్లా నాకు చాలా సపొర్ట్ వుంది. కాని అలాగని అన్ని వాళ్ళపై వదిలేసి నేను మీ మీద ఆధారపడి ఉన్నాను మీరే చూసుకోడి అంటే భావ్యం కాదు.

సంజు : మనమందరం సంఘజీవులం. జీవితంలో ఎప్పుడొ అప్పుడు ఎవరిమీదొ ఆధారపడి ఉంటాము. అలాగే ప్రతి మహిళ స్వతంత్రంగా ఉండాలి. తన జీవితాన్ని సంపూర్ణంగా జీవిస్తూ, ఎవరి మీదా ఆధారపడకుండా ఉండాలి. భవిష్యత్తులో ఒకరిమీద ఆధారపడే పరిస్థితి రాకుండా ముందే జాగ్రత్త పడాలి. ఉద్యోగం చేసినా, చేయకున్నా ప్రతి మహిళ ఆర్ధిక స్వాతంత్ర్యం కలిగి ఉండాలి. అది తనే ఏర్పాటు చేసుకోవాలి.

జ్యోతి : అవును ప్రతి మనిషి ప్రేమ,ఆప్యాయతలకోసం తన వారిమీద ఆధారప్డి ఉంటాడు. నేను చెప్పేది కూడా అదే. ప్రతి మహిళ ఆర్ధిక స్వాతంత్ర్యం, ఆత్మ విశ్వాసం కలిగి ఉండాలి. ఎప్పుడుకూడా తన అవసరాలకు భర్త, పిల్లల మీద ఆధారపడకూడదు అని.




9. ఓకోసారి ఈ రాయకీయ నాయకులను చూస్తే నాకు అనిపిస్తుంది ...ఆదవాల్లకు, యువతకు రాజ్యాధికారం ఇస్తె నిజంగా మన రాష్త్రాన్ని బాగు చెయొచ్చా. ఈ చొర్రుప్తిఒన్ ఆపెయొచ్చా అని . మీరేమంటారు..

అను : ఏ రంగంలోనైనా భిన్నత్వం ఉండాలి. అంటే ఆడవారు, మగవారు, పెద్దవారు, యువకులు.. ఇలా ఎవరి దృష్టికోణంలో, అనుభవాన్ని బట్టి వాళ్లు ఆలొచిస్తారు. కనుక సొసైటీలో అన్ని గణాలకి అనుకూలమైన సర్వతోముఖ రాజ్యాంగాన్ని స్థాపించవచ్చు. ఇక అవినీతి అన్నది వ్యక్తి యొక్క దురాశకి సంబంధించింది కనుక దానిని పూర్తిగా నిర్మూలించలేము. పోలియో ద్రాప్స్ లాగా చిన్నప్పుడె ప్రతీ వ్యక్తికి దురాశకి కూడా వ్యాక్సిన్ చేయగలిగితే ఎంత బాగుండునో కదా? :). అవినీతిని విమర్శిస్తూనే మనం దానిని ఆసరాగా తీసుకుంటాము కదా. డ్రైవింగ్ లైసెన్స్ కోసం లైన్లో నిలబడకుండా పని జరుగుతుందని, ట్రాఫిక్ లైట్ దగ్గర చలాన్ కట్టకుండా ఉండొచ్చని, బంగారం కొట్టులో రసీదు తీసుకోకుంటే కొంచం ధర తగ్గుతుందని ఎక్కడికక్కడ మనమే అవినీతిని పెంచుతున్నాము. అలాంటి మనం వెరే వాళ్ల అవినీతిని విమర్శించే హక్కు ఉందంటారా? ఈ అవినీతి తగ్గాలంటే లంచాలు ఇచ్చేవాల్లు, తీసుకునేవాల్లు ఇద్దరినీ శిక్షించాలి. చాలా కఠినమైన చట్టాలు ఉండాలి. అవి అమలు పరచాలి.

సంజు : అవినీతిని నిర్మూలించడంలో ప్రభుత్వం చాలా కఠినంగా ఉండాలి. సమస్య ఆడవాళ్లు మగవారికంటే సమర్ధంగా పనిచేయగలరని కాదు, మహిళలు సరియైన విధంగా గుర్తింపబడటంలేడు. ఎక్కువమంది మహిళలు ప్రభుత్వంలో చేరితే మంచి నిర్ణయాలు, మార్పులు తీసుకురాగలరు. ఆడవారు, యువత మాత్రమే అవినీతిని ఎదుర్కోగలరని కాదు. ప్రతి రాజకీయనాయకుడు నిజాయితీగా దేశానికి సేవ చెయాలి అని అనుకోవాలి.



10. జీవితంలో ఎప్పుడైనా (1)ఉద్యోగం లేదా (2) సంసారం ఈ రెండిటిలో ఏదో ఒకటి మాత్రమే ఉండాలి అని అంటే మీరు ఏది ఎంచుకుంటారు?

అను : ప్రస్తుతం రెండూ వున్నయి కనుక నేను చెప్పలేను :) ఇంత వరకు రెండూ మానేజ్ చేసాను; యెందుకంటే నాకు రెండూ చాలా ముఖ్యము. ఒక్కొక్క సారి కెరీర్ మీద యెక్కువ ఫోకస్ చేస్తే, ఒక్కొక్క సారి కుటుంబం మీద యెక్కువ ఫోకస్ చేసాను. మా ఆయినకు వేరే ఊరిలో ఉద్యొగమొచ్చినప్పుడు ఉద్యొగము, ఊరు రెండూ మారాను. అలాగే కెరీర్ కోసం రాత్రి పగలూ కష్ట పడ్డ రోజులున్నాయి. నేను ఒక ప్రోజెక్ట్ చేసేటప్పుడు 6 నెలలు రోజుకి 15-16 గంటలు పని చేసాను. మేము అమెరికా నుంచి ఇండియా తిరిగి వచ్చినప్పుడు పిల్లలు అడ్జస్ట్ అయ్యేదాక నాలుగు నెలలు ఉద్యోగం మానేసి ఇంట్లో ఉన్నాను. ఇలాంటి సంఘటనలు అందరి లైఫ్ లోను ఉంటాయి - నేనే చేసానని అనను. మీ ప్రశ్న చాల ఆసక్తివంతంగా వుంది. రెండిటిలో ఒకటే సాధ్యమైతే యేది యెంచుకుంటాను? ఎప్పుడైన కుటుంబంలో యెవరికైనా నా అవసరముండి, దానికి నా ఉద్యోగమే అడ్డయితే ఉద్యొగం వదిలేస్తాను కాని, కుటుంబాన్ని యెందుకు వదులుకుంటాను? రాజి పడాల్సి వస్తే నేను నిస్సంశయంగా సంసారాన్ని యెంచుకుంటాను. కొన్ని అవసరాలు ఆడవారు మాత్రమే తీర్చగలరు. నా కుటుంబంలో యెవరికైన నా అవసరం వుంటే నా బాధ్యత నేనూ తప్పకుండ నిర్వహించాలనుకుంటాను.

సంజు : జ్యోతిగారు.. ఈ మాట నేనొప్పుకోను. ఐతే ఇది లేకుంటే అది అని. ఎలాంటి విషమ పరిస్థితి వచ్చినా ఎన్నొ ఆప్షన్స్ ఉంటాయి. అలాగే ఆడవాళ్లు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్లు దేవతలు,అద్భుత శక్తులు ఉన్నవారు కారు. పిల్లలు చిన్నగా ఉన్నపుడు ఉద్యోగం కంటే కుటుంబం, పిల్లల మీద ఎక్కువ సమయం కేటాయించాలి. ఆ తర్వాత కెరీర్ మీద శ్రద్ధ పెట్టాలి. ఏప్పుడు ఎక్కడ మన అవసరం ఎక్కువుంటుందో అక్కడ మనం మన సమయాన్ని కేటాయించాలి. కొందరు మహిళలు కెరీర్, కుటుంబం రెండింటింతిని ఒకే విధంగా, విజయవంతంగా నిర్వహించగలిగారు అంటే మంచిదే. ఇవాళే నా కొలీగ్ ఇచ్చిన ఈ కొటేషన్ ఈ సందిగ్ధాన్ని తొలగిస్తుందేమో.. When we are motivated by goals that have deep meaning, by dreams that need completion, by pure emotion that needs expressing, then we truly live life.” - Greg Anderson కష్టపదాలనే కోరిక, ఆతంవిశ్వాసం ఉంటే కుటుంబం, కెరీర్, రెండింతిని సమర్ధంగా నిర్వహించడం కష్టమేమీ కాదు ఏ మహిళకైనా..




11. ఇక చివరిగా .. ఉద్యోగినులు, గృహిణులు.. ఇంట్లో ఉండే గృహిణులకు మీలాగా ఎక్కువ టెన్షన్, స్ట్రెస్, పని ఉండదు అనుకుంటారా? ప్రతి ఉద్యోగినికి ఆర్ధిక స్వాతంత్ర్యం ఉంటుండా? ఉద్యోగం చేయని గృహిణికి కూడా ఆర్ధిక స్వాతంత్ర్యం ఉందా?

అను : దూరపు కొండలు నునుపు అని పెద్దలననే అన్నారు :) ఎవరికి వాళ్ళు వేరేవారు బాగున్నరేమో అనుకుంటాము కాని దేని చాలెంజ్ దానికుంటుంది. ఒక ఆసక్తికరమైన విషయం యేమిటంటే ఈ టెన్షన్లు, స్ట్రెస్లు వచ్చేవి పని చేస్తున్నామా లేదా అన్నదానిమీద ఆధార పడిలేవు. మన పరిస్థితుల మీద ఆధారపడి వుంటాయి. భార్యా-భర్తలు ఇద్దరూ పని చేస్తున్నా కుటుంబం ఆర్ధిక ఇబ్బందులలో వుంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వుండదు కదా? ఇంటిలో వాళ్ళందిరితొ గొడవలు పెట్టేసుకుంటే పని చేస్తున్నా లేక పొయినా ఇంట్లో స్ట్రెస్ అంతే వుంటుంది కదా.

సంజు : గృహిణి అనేది 24 గంటల ఉద్యోగం. ఎందుకంటె మీరు చేసే ప్రతి పని కుటుంబంపై ప్రభావం చూపుతుంది. ఇద్దరి పని తీరు, నైపుణ్యం, వేరైనా ఒత్తిడి మాత్రం ఒకటే..


నా మాట :

ఆడది ఆకాశంలో సగం అంటారు . కాని ఆకాశం దాటి రోదసిలోకి కూడా వెళ్ళింది. పూర్వకాలంలో స్త్రీ అంటే ఇంటిపట్టున ఉంది భర్తా, పిల్లలు , అత్తగారు, అందరినీ చూసుకుంటూ ఉండాలి. ఇంటి బాధ్యతలు మగవారే చూసుకుంటారు. ఆడదానికి చాకలిపద్దు రాసేంత చదువు వస్తే చాలు అనేవారు. కాని నేడు కాలం మారింది.మనుష్యులు మారుతున్నారు. ఆడవాళ్ళను కూడా చదువుకోమని ప్రోత్సహిస్తూ, ఎన్నో బాధ్యతాయుతమైన పదవులు కూడా నిర్వహించేలా చేస్తున్నారు. చాల మంది ఆడవాళ్ళు పెళ్ళయ్యాక కూడా చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నారు. ప్రతి భర్తా తన విజయం వెనకాల భార్య ఉంది అంటాడో లేదో కాని, ప్రతి భార్య విజయం వెనక ఆమె భర్త, కుటుంబం యొక్క సంపూర్ణ సహకారం ఉంటుంది. పెద్ద చదువులు లేకున్నా దాదాపు చాలా మంది మహిళలు ఇంటిపట్టున ఉంది కూడా ఏదో ఒక వృత్తి,వ్యాపారం చేస్తున్నారు. సంసారనిర్వహణలో తమవంతు కృషి చేస్తున్నారు. ఇక ఇల్లు దాటి ఉద్యోగం కోసం వెళ్ళే మహిళలు నిత్యజీవితంలో ఎదుర్కునే సమస్యలు, వాటిని పరిష్కరించుకునే విధానాలు తెలుసుకుందామని నాకుతెలిసిన ఉద్యోగినులను ఈ చర్చకు ఆహ్వానించాను. దాదాపు చాలా విషయాలు వారితో చర్చించగాలిగాను అనుకుంటున్నాను ..

అనుపమ., సంజు .. ధన్యవాదాలు..

Wednesday, 1 July 2009

నేటి మహిళ - 1

కొద్ది నెలల క్రింద మొదలు పెట్టిన చర్చ కార్యక్రమం మళ్ళీ మీ ముందుకు. ఈసారి ఇద్దరు ఉద్యోగినులను ఆహ్వానించడం జరిగింది. ప్రతి ఉద్యోగిని ఎదుర్కునే అంశాలు, సమస్యలు, వాటిని ఎదుర్కునే విధానం. ఇవన్నీ చర్చించడం జరిగింది.. ఈసారి అతిథులు అనుపమ, సంజు.. ఇద్దరూ హైదరాబాదులో మల్టినేషనల్ కంపెనీలలో బాధ్యతాయుతమైన పదవిలో పనిచేస్తున్నారు. ఈ చర్చ కోసం తమ విలువైన సమయాన్ని కేటాయించినందుకు వారిద్దరికీ కృతఙ్ఞతలు .. ఇక మొదలెడదామా??



1. హాయ్ అనుపమ, సంజు?? ఈ చర్చకు అంగీకరించినందుకు ధన్యవాదాలు. ముందుగా మీ పరిచయం చేసుకుంటారా??

అను : నమస్తే జ్యొతిగారు.. ఒక వర్కింగ్ వుమన్ గా మమ్మల్ని ఈ చర్చకు ఆహ్వానించినందుకు థాంక్స్. నేను హైదరాబాదులో ఒక మల్టినేషనల్ కంపెనీలో పని చేస్తున్నాను. ఇద్దరు పిల్లలు. భర్త, అత్తమామల ప్రోత్సాహం, ప్రేమతో ఆనందంగా ఉన్నాను.

సంజు : నమస్తే జ్యొతిగారు. మీకు కూడా థాంక్స్. నేను కూడా హైదరాబాదులొనే ఉంటాను. ఇద్దరు పిల్లలు. ఒక మల్టినేషనల్ కంపెనీలో పని చేస్తున్నాను. ఇద్దరు పిల్లలు. ఉద్యోగం నాకు ఎంతో ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది.




2. మీ జీవితంలో తల్లితండ్రులు, తోబుట్టువుల పాత్ర ఎంత ఉంటుంది. అంటే మీరు చిన్నగా ఉన్నపుడు, యుక్త వయస్సులో ఉన్నపుడు, పెళ్ళయ్యాక, పిల్లలు కలిగాక, మీరు ముసలివారు అయ్యాక.

అను: నా జీవితంలో మా అమ్మ నాన్న చాల ముఖ్యమైన వాళ్ళు. వారే లేక పోతే నేనూ లేను కదా. నాకు ఒక చెల్లెలు ఉంది, అన్న, తమ్ములు లేరు. కష్టము వచ్చినా సుఖము వచ్చినా తనతో చెప్పుకోవడం అలవాటు.మాది చాలా close ఫ్యామిలి. టీనేజిలో, జెనరేషన్ గాప్ వచ్చేస్తుంది అమ్మ, నాన్నకి; పిల్లలకి; చాలా మనస్పర్ధలు వస్తాయి. నేను కూడా అమ్మ, నాన్నతో చాలా దెబ్బలాడేదాన్ని. కాని వాళ్ళు చాలా ఓర్పుగా ఉండే వారు. ఈ రోజు నేను ఈ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాను అంటే అది వాళ్ల వల్లనే. పెళ్ళి అయ్యాక మా అమ్మ-నాన్న తల్లితండ్రుల కన్నా ఫ్రెండ్స్ లాగ యెక్కువ ఉంటున్నారు. ఇక పిల్లలు జీవితాన్నే మర్చేస్తారు. నేను పిల్లలు పుట్టే దాక యేదో ఊహలోకంలో ఉండేదాన్ని, వాళ్లతో భూమి మీదకి దిగి వచ్చాను :) నాకు ఇద్దరు పిల్లలు. వాళ్ళు పుట్టాక మొదటి సారి అర్ధం అయింది – మా అమ్మ నాన్న మమ్మల్ని ఎంతా బాగా పెంచారో అని.. పిల్లలు పుట్టిన కొత్తలో మేము అమెరికాలో ఉన్నాము.. అమ్మ నాన్న చాలా సార్లు వచ్చి మాతో 6 నెలలు ఉండి హెల్ప్ చేసారు. మా అత్త గారు, మామ గారు కూడ ఈ విషయంలో చాలా బాగా సపోర్ట్ చేసారు.మా అత్తగారు నన్ను చాలా ప్రొత్సహిస్తారు. మా మావగారు కూడ ఒక ఫ్రెండ్ లాగా సరదా గా ఉంటారు.మీరు అమ్మ నాన్న గురించి అడిగినా నేను అత్త-మావల గురించి యెందుకు చెప్పానంటే, నా దృష్టిలో వాళ్ళు వేరు-వేరు కాదు. చిన్నప్పుడు అమ్మ నాన్నతో ఉన్నాను, ఇప్పుడు అత్త మావలే అమ్మ నాన్నలై నాతో ఉన్నారు. మా అమ్మ నాన్న వేరే ఊరిలో ఉండడంతో వాళ్ళని యెక్కువ కలవలేక పొయినా, రోజూ ఫొన్ చేస్తాను, మనసులో వున్నవి షేర్ చేసుకుంటాను. సో వీళ్లందరూ ఎప్పుడూ నాతో ఉండాల్సిందే..


సంజు : అమ్మా, నాన్న, తమ్ముడు.. ఈ ముగ్గురు నాకు దిక్సూచిలాంటివారు అని భావిస్తాను. నా జీవిత ప్రారంభం , ఎదుగుదల పుట్టింటినుండే మొదలైంది. నాన్నగారి వల్లే నేను ఇంజనీరింగ్ చేసాను. అమ్మా నాకు మంచి స్నేహితురాలు. ఇక జీవితంలో, ఉద్యోగంలో నాకు మంచి మార్గదర్శి నా తమ్ముడు. నాకు ఫైన్ ఆర్ట్స్ కాని ఆర్కిటెక్చర్ కాని చేయాలని ఉండేది. మా నాన్నగారేమో ఇంజనీరింగ్ చేయమని... అసలు ఎంసెట్ కౌన్సెలింగ్ రోజు నేను అంతర్ రాష్ట్రీయ బాస్కెట్ బాల్ ఆడతాను అని పట్టు పట్టితే, మా నాన్నగారు కౌన్సెలింగ్ అటెండ్ అయితే ఫ్లైట్లో మాచ్ ఆడటానికి బరోడా పంపిస్తా అన్నారు. మా తాతగారు కూడా నాతో కౌన్సెలింగ్ కి వచ్చారు. తాతగారు ఎంసెట్ కౌన్సెలింగ్ కి రావటము ఎంసెట్ చరిత్రలో నాకు ఒక్కదానికేనేమో.. :) అప్పుడు ఇంజనీరింగ్ చదవడం ఒత్తిడి అనుకున్నా ఇపుడు ఈ వృత్తిలో చాలా సంతోషంగా ఉన్నాను. మనం తీసుకునే కొన్ని కీలకమైన నిర్ణయాలతో మన జీవన విధానమే మారిపోతుంది. నిజం చెప్పాలంటే మన దేశంలో పిల్లలకి కెరీర్ కౌన్సెలింగ్ వాళ్ల తల్లితండ్రులదే బాధ్యత అవుతుంది.ఎందుకంటే మన విద్యావ్యవస్థ లో కెరీర్ కౌన్సెలింగ్ చేసే సదుపాయం లేదు. అదీ కాక ఇంటర్ చదివే పిల్లలలో కొందరు మాత్రమే బాధ్యతగా అన్ని విషయాలు తమంతట తామే తెలుసుకుని అనుభవజ్ఞులై ఉంటారు. కాని చాలా మంది పిల్లలు ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉంటారు. చదువు, కెరీర్ గురించి సమగ్రమైన అవగాహన వచ్చేసరికి చాలా సమయం వృధా అవుతుంది. ఈ చదువుల పరుగుపందెంలో అందరూ ముందుండాలని వేగంగా కదలక తప్పదు. వారికి సరైన మార్గనిర్దేష్యం చేయాల్సినవారు తల్లితండ్రులే. మామూలుగా అందరూ ఎంచుకునే విభాగాలు కాకుండా పిల్లల శక్తి ఎంతవరకు ఉంది. ఏయే కోర్సులకు ఎటువంటి ఉద్యోగావకాశం ఉంది , ఆ కోర్సుల భవిష్యత్తు ఎలా ఉంటుంది తదితర వివరాలు సేకరించి పిల్లలకు అర్ధం చేయించాలి. . ఇది ఇంటర్ చదువుకునేటపుడు కాకుండా అంతకు ముందే చేసి పిల్లలకు ఇష్టమైన, మంచి కోర్స్ వైపు కృషి చేసి విజయం సాధించే అవకాశాలు మెరుగుపరచడానికి వీలుంటుంది.




3. అల్లారుముద్దుగా పెరిగిన ఆడపిల్ల పెళ్ళయ్యాక పుట్టింటికి ఒక అతిథిలా ఉంటుందా?? .ఆమెకు చిన్నప్పుడు ఉన్న చనువు, అధికారం చివరి వరకు ఉంటాయా?? అన్నలు, తమ్ముళ్ళ పెళ్ళిళ్ళు అయ్యాక కూడా ?? ఆడపిల్ల పుట్టింట అతిథి, అత్తింట మహారాణి అంటారు .. మీరేమంటారు??


అను :నాకు అన్న తమ్ముళ్ళు లేరు. కనుక నేను పుట్టింటిలో ఇప్పటికి మహారాణి నే :)

సంజు : జీవన ప్రయాణంలో మనం వివిధ పాత్రలు పోషించాల్సి వస్తుంది. కూతురు, చెల్లెలు, భార్య, కోడలు, అమ్మ, అత్తగారు ..ఇలా.. ఈ జీవన పరిణామాలలో తల్లితండ్రులు, తోడబుట్టినవారితో అనుబంధం మారదు (ఒకవేళ ఏవైనా మనస్పర్ధలు ఉంటే తప్ప). వ్యక్తీకరణ మాత్రమే మారుతుంది. పిల్లలకు ఇటువంటి ఆంక్షలు ఉండవు.కాని పెద్దయ్యే కొద్దీ వ్యక్తీకరణ అవసరం ఉండదు. కాని నా అభిప్రాయం ప్రకారం అమ్మాయి పుట్టింట ఎప్పటికీ ప్రత్యేక గుర్తింపు, తనను మహరాణిలా చూడాలనే కోరిక ఉండకూడదు.



4. మీ కెరీర్ నే ఎలా నిర్ణయించుకున్నారు ?? మీ తల్లితండ్రులు, స్నేహితులు, ఎవరైనా మీకు చెప్పారా. మీరే మీ ఇష్ట ప్రకారం చదువుకుని సెటిల్ అయ్యారా??

అను : స్నేహితుల ప్రభావం. కొంత మంది ఫ్రెండ్స్ రామయ్య గారి కోచింగ్ కి వెళ్ళారు, నేను వాళ్ళతోనే చేరాలి అనుకున్నాను. మా నాన్న వెంటనే వెళ్ళి ఆయినతో మాట్లాడారు. మా అమ్మ నాన్న చాలా ఎంకరేజ్ చేసారు. ఎంసెట్ తయారీ అప్పుడు ఖర్చు గురించి పట్టించుకోకుండా నాకు బెస్ట్ కాలేజి, బెస్ట్ కోచింగ్ అన్ని అందించారు. మాతో సమానంగ మా అమ్మ నాన్న కూడ నాలుగింటి కి లేచి మేము చదువుకుంటుంటె మాతో కూర్చుని మా డౌట్స్ క్లియర్ చేసేవారు. మా అమ్మ జడలు దగ్గిర నుంచి వేసి మాకు కంప్లీట్ ఫొకస్ చదువు మీదే ఉండేలా చూసుకుంది. కోచింగ్ లో చాలా హోంవర్క్ ఇచ్చేవారు - మేము చేసుకుంటుంటే అన్నం ముద్దలు నోటిలొ పెట్టింది మా అమ్మ. రోజు కోచింగ్ కి తీసుకుని వెళ్ళి, మళ్ళి ఇంటికి తీసుకుని వచ్చి, కాలేజి లొ పిక్-అప్ చేసి, డ్రాప్ చేసి, ఏ పుస్తకం కావాలంటే ఆ పుస్తకం కొన్నారు నాన్న. రోజూ రాత్రి అంతా నాకు ఫిజిక్స్ చెప్పే వారు. అడ్మిషన్ వచ్చాక కూడ రెగ్యులర్ గా మాతో కాలేజి సంగతులు అడిగేవారు. వాళ్ళ రుణం తీర్చుకోలేను. నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడ మా నాన్న జీతం దాచుకోమని, నాకు పాకెట్ మని ఇచ్చేవారు. నేను అమెరికాకి పై చదువులకు వెళ్ళాలి అనుకున్నప్పుడు మళ్లీ చాలా ఎంకరేజ్ చేసారు. నాతో పాటు బ్యాంకుల చుట్టు, ఎంబస్సీ చుట్టు తిరిగేరు. ఈ విషయంలో మా ఆయిన, మా ఆడపడుచు కూడా చాలా సహాయం చేసారు.

సంజు : నా కెరీర్ కి సంబంధించి నా తమ్ముడే నాకు మర్గదర్శి. నాకంటే చిన్నవాడైనా కెరీర్ విషయంలో వాడి మాటలు ఎపుడూ విశ్వసించేదాన్ని. పాటించేదాన్ని కూడా. నేను సివిల్ ఇంజనీరింగ్ చేసి మాస్టర్స్ లో స్త్రక్చరల్ ఇంజనీరింగ్ చేసాను. కాని ఉద్యోగాల వేటలో అంటే 1995 లో సివిల్ విభాగంలో చాలా తక్కువ ఉద్యోగాలు ఉండేవి. నా థీసిస్ కోసం కంప్యూటర్ ప్రాజెక్ట్ చేసాను కాబట్టి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లో మంచి ఉద్యోగం వచ్చింది. అప్పుడు యు.ఎస్ లో సాఫ్ట్ వేర్ జాబ్స్ మంచి బూమ్‌లో ఉన్నాయి కాబట్టి ఎన్నో అవకాశాలు వచ్చాయి. నేను అప్పుడు తీసుకున్న నిర్ణయం మంచిదే అనుకుంటాను.



5. మీకు ఇష్టపడిన ఉద్యోగం మీకు లభించిందా? లేదా లభించిన ఉద్యోగాన్ని మీరు ఇష్టపడుతున్నారా?

అను : నేను కాలేజిలో సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నాను. నాకు ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అంటే చాలా ఇష్టం. అందులోనే కెరీర్ డెవలప్ చేసుకోవాలనుకున్నాను. M.S. లో ఒక జర్నల్ పేపర్ కూడా పబ్లిష్ చేసాను. కాని అప్పట్లో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్ కి ఎక్కువ ఉద్యోగాలు లేవు. అందుకనే సాఫ్ట్ వేర్ సైడ్ వచ్చాను. But I am happy.

సంజు : మొదటి మూడు నాలుగేళ్లు నాకు దొరికిన ఉద్యోగాలు చేసాను. నా అదృష్టం కొద్ది అవన్నీ మంచి కంపెనీలలో దొరికాయి. తర్వాత ఉద్యోగం విషయంలో కాస్త జాగ్రత్త వహించాను. ఆ కంపెనీ గురించి, అందులో నేను పనిచేసే టీమ్ గురించి అన్ని వివరాలు తెలుసుకునేదాన్ని. ఈ రోజు నా కంపెనీలో నేను పోషించాల్సిన పాత్ర చాలా ముఖ్యమైనదిగా, బాధ్యతాయుతమైనదిగా ఉండాలి . అందుకే ఈ విషయాలన్నీ కూలంకషంగా తెలుసుకుని చేరాను. అలాగే ఆ కంపెనీ పేరు ప్రతిష్టలు కూడా చాలా ముఖ్యమైనవి.




6. ప్రతి అమ్మాయికి చదువు, కెరీర్ అనేది ఉండాలా? అది అవసరమున్నా లేకున్నా. బాగా చదువుకుని ఏం చేయాలి అని ఒక ధనవంతుల అమ్మాయి అనుకోవచ్చుగా??

అను : అమ్మాయిలు ఉద్యోగం చేయాలా, వద్దా అన్నది కుటుంబ నిర్ణయం. ఇంట్లో వృద్ధులైన అత్తామామలు, చిన్నపిల్లలు ఉన్నపుడు అవసరం లేదనుకుంటే అమ్మాయి ఇంట్లో ఉంటే అందులో తప్పేమీ లేదు అన్నది నా అభిప్రాయం. కాని ఆ నిర్ణయం బలవంతంగా కాకుందా స్వతంత్రంగా తీసుకోవాలి. ఏ కారణం లేకుండా ఇంట్లో ఉండమనడం భావ్యం కాదు. ఇప్పుడు అమ్మాయిలైనా, అబ్బాయిలైనా చదువు చలా ముఖ్యం. దేశాభివృద్ధికి చదువు చాలా అవసరం. చదువుకున్న తల్లితండ్రుల పిల్ల కూడా బాగా ఉంటారు. మంచి నాగరికులు అవుతారన్నది నా అభిప్రాయం.

సంజు: అవును ప్రతి అమ్మాయికి చదువు, ఉద్యోగం రెండూ ఉండాలి. ప్రతి ఒక్కరు స్వతంత్రులై ఉండాలి. నేను ఎన్నో సంఘటనలు చూసాను ఒక స్త్రీ చదువు, ఉద్యోగం, సంపాదన లేకుండా తనను, తన పిల్లలను పోషించుకోలేని నిస్సహాయ స్థితిలో ఉందో. ఈ పరిస్థితి ఒక్కోసారి ధనికులైన మహిళలకు కూడా ఎదురవుతుంది. ప్రతి మనిషి ఎవ్వరి మీదా ఆధారపడకుండా కనీసం తనను తాను పోషించుకోగలగాలి. డబ్బులకోసమనే కాదు ఆత్మస్థైర్యం, మనోనిబ్బరం కోసం ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. అలా ఇష్టమైన పని ఎప్పుడూ మనశ్శాంతిని , సంతృప్తిని ఇస్తుంది.




7. మీరు మీ భాగస్వామి ఎలా ఉండాలని కోరుకున్నారు. అలాటి భాగస్వామిని ఎన్నుకున్నారా? అది అందరికి సాధ్యమా??


అను : నేను మా వారిని చాలా చిన్నప్పుడు కలుసుకున్నాను - ఆయన నా భాగస్వామి నే కాదు నా బెస్ట్ ఫ్రెండ్ కూడ. నేను ఎప్పుడు నా భర్త ఇలా ఉండాలి, అలా ఉండాలి అనుకోలేదు - ఆయినే నా భర్త అవ్వాలి అని అనుకున్నాను. అంతే.. నాకు తెలుసు నేను చాల అదృష్టవంతురాలినని. కాని చాల తక్కువ మంది కి ఇది సాధ్యము.

సంజు : "నా భాగస్వామిని యెంచుకున్నప్పుడు నేను అతనితొ సంతొషంగా ఉంటాను అనిపించింది. నాకు జాతకము, డబ్బూ ఇవన్నిటికన్నా మా ఆయినతో నా జీవితం బాగుండాలని ఆలొచించాను.మా విషయం పక్కన పెడితే ప్రతి ఆడపిల్ల అర్ధం చేసుకోవాల్సిన విషయం ఒకటి వుంది. సంతొషానికి ఒక ఇన్స్టంట్ రెడి మిక్స్ లాంటిది యేమి వుండదు. దానికి భార్యా -భర్తలు ఇద్దరూ కృషి చేయాలి. కనుక ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉండడము చాలా అవసరము."




8. ప్రేమ వివాహామా?.. పెద్దలు కుదిర్చిన వివాహామా? ఈ రెండింటిలో ఏది మంచిదంటారు? పూర్వకాలంలో ఐతే ఉమ్మడికుటుంబాలు, కలిసి ఉండేవాళ్ళు కాబట్టి ఈ గొడవ ఉండేది కాదు. మరి ఇపుడు?? ఈ రెండింటిలో ఏది విజయవంతమవుతుంది అంటారు?

అను : Marraiges are made in heaven మన Destiny పట్టి ఉంటుంది. నేను ప్రేమ వివాహాలు విఫలం అవ్వడము చూసాను, పెద్దలు నిశ్చయించిన పెళ్ళిళ్ళు విజయవంతం అవ్వడము చూసాను. ఫెళ్ళి విషయంలో రాజీ పడకూడదు. ఓక సారి పెళ్ళి చేసుకున్నాక అది విజయవంతం అవ్వటానికి భార్యాభర్తలు ఇద్దరూ శాయశక్తులా ప్రయత్నం చేయాలి. అప్పటికి అది విఫలమయితే అది యెవ్వరి తప్పు కాదు – some marraiges dont work - దాని వల్ల ఆడపిల్లల మీద మీద స్టిగ్మ ఉండ కూడదు. అలాగే అమ్మ నాన్న చేసారు కనుక ఇది విఫలమయింది అని అనుకోకూడదు. వివాహము యెలా జరిగినా కలిసి ఉంటే కలదు సుఖం అన్నది నేను నమ్ముతాను. కుటుంబం కలిసి ఉంటే అందరికి కొండంత బలం ఉంటుంది. ఉమ్మడి కుటుంబం అయినా కాక పొయినా అందరూ దగ్గరగా కలిసి ఆత్మీయతతో ఉండాలి.

అంజు : నాది ప్రేమ వివాహం. చాలా చిన్న వయసులో పెళ్లి జరిగింది. ప్రేమ వివాహమా, పెద్దలు కుదిర్చిన వివాహమా అన్నది బాగా ఆలొచించి తీసుకోవాల్సిన నిర్ణయం. ఆడపిల్లలకు చిన్న వయసులో పెళ్లి చేయకూడదు. ఆ వయసులో వారికి తమ స్వంత ఇస్థాయిష్టాలు, జీవితపు విలువలు అంతగా ఆవగాహన ఉండదు. బుద్ధిగా చదువుకుంటూ అమ్మ చాటు బిడ్డలా ఉంటారు. తమంటట తాము ధైర్యంగా ఎట్టి పరిస్తిథినైనా ఎదుర్కునేలా ఎదగనివ్వాలి. చదువు, ఉద్యోగం చేస్తూ ఆటుపోట్లు ఎదుర్కునేలా చేయాలి. దానికి ఒక వయసు అని నిర్ధారించలేము. ఏ పెళ్లిలో ఐనా ప్రేమ, గౌరవం, ఆత్మీయత అనేది ముఖ్యం ..



9. హాయిగా , ఏ చీకు చింతా లేకుండా పెరిగిన అమ్మాయికి పెళ్లి కాగానే పెద్దరికం వచ్చేస్తుంది. అలాగే బాధ్యత కూడా. అమ్మాయి అత్తారింట వాళ్ళు చెప్పినట్టు చేయాలా. తన కిష్టమున్నట్టు చేయాలంటారా? ఒక్కోసారి వ్యక్తిత్వాన్ని చంపుకోవాల్సివస్తుంది కూడా.. బాగా చదువుకున్న అమ్మాయిని మాకు ఉద్యోగం చేయాల్సిన ఖర్మ లేదు, ఇంట్లోనే ఉండు..డబ్బులకేం కొదవ లేదు అని అంటే ఆ అమ్మాయి ఏం చేయాలి??

అను : ఇది చాలా కష్టమైన ప్రశ్న. పరిస్థితిని బట్టి, మనుషులను బట్టి సమాధానము మారుతుంది. ఇక సా సంగతి వస్తే పట్టుదల యెక్కువ. నేను కోరుకున్నది సాధించడానికి విశ్వప్రయత్నం చేస్తాను. ఎవరైన అర్ధం చేసుకోక పొతే కన్విన్స్ చేయటానికి ట్రై చేస్తాను. ఎక్కువగా నా మనసుకి నచ్చినట్లే వుంటాను.ఏ కుటుంబంలోనైనాచిన్న, చిన్న గొడవలు తప్పవు. మనం ముఖ్యమైనది అనుకున్న విషయాలలో ఒకొక్క సారి ఒక నిర్ణయాన్ని తీసుకొవాల్సి వస్తుంది. కాని వ్యక్తిత్వాన్ని ఎప్పుడు చంపుకోకూడదు. దాని వల్ల షొర్ట్ టర్మ్ లొ వివాదం కాకుండా అపాగలమేమో కాని ఎప్పుడో అప్పుడు frustration, depression వచ్చేస్తుంది. ఏదైన మనం పట్టుదలగా ఉంటే ఇంట్లో వాళ్ళు కూడ ఇవాళ కాకపోతే రేపు అర్ధం చేసుకుంటారు. అలా అర్ధం చేసుకొకపొతే చాల పెద్ద సమస్య ఉన్నట్టు - దాన్ని మనమే పరిష్కరించుకోవాలి. ఉద్యోగం చేసే మహిళలు ఖర్మం చాలకకో, డబ్బులకోసమో చేయనవసరం లేదు. వాళ్ళ self-esteem కోసం పని చేయవచ్చు. ఉద్యోగం కేవలం డబ్బు సంపాదించడానిదే కాదు. సొసైటిలో ఒక స్థానం, హోదా సంపాదించుకొవడానికి.
చివరిగా నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే, ఉద్యోగం చేస్తున్నామా, ఇంట్లో ఉన్నామా అన్నది ముఖ్యం కాదు - మన జీవితానికి ఒక అర్ధం, గమ్యం ఉన్నాయా లేవా అన్నది ఎక్కువ ప్రధానము.


సంజు : మీరు చెప్పినవి వివాదాస్పదమైనవి. ఒకవేళ అమ్మాయి తను చేసే పనుల (చదువు, ఉద్యోగం, వ్యాపారం) మీద ఒక నిర్దిష్టమైన అభిప్రాయం కలిగి, వాటిని వదిలే ప్రసక్తి లేనప్పుడు ఈ విషయాలను ఆమె, ఆమె తల్లితండ్రులు అత్తగారివైపు వాళ్లతో పెళ్లికి ముందే మాట్లాడాలి. అలాంటప్పుడు పెళ్లి తర్వాత గొడవలు వచ్చే అవకాశాలు తక్కువ. ఇలా చేయకపోవడం వల్లే చాలా వివాహాలలో సమస్యలు వస్తున్నాయి. మన భారత దేశంలో కుటుంబానికి ముందుగా ప్రాధాన్యం ఇవ్వబడుంతుంది. ప్రతి కుటుంబానికి ప్రత్యేకమైన విలువలు, నియమాలు ఉంటాయి. ఆ కుటుంబంలో సభ్యులుగా వెళ్లడానికి అంగీకరించినప్పుడు వాటిని గౌరవించాలి. అలాగే ప్రతి వ్యక్తి స్వతంత్రులుగా ఉండాలి అలాగే కుటుంబంలో ఇతర సభ్యులకు ఇబ్బంది కలిగించకూడదు. ప్రతి ఆడపిల్ల తను అత్తగారింట్లో వారు చెప్పినట్టు విన్నందువల్ల కాని, వాళ్లు చెప్పినట్టు వస్త్రధారణ చేసినందువల్ల కాని బాధింపబడ్డట్టు ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఎదుటివారివైపు నుండి కూడా ఆలోచించాలి. ప్రతి అనుబంధంలో ఇచ్చుకోవడం , పుచ్చుకోవడం అప్పుడప్పుడు సర్దుకుపోవడం మామూలే. ఇవే ఆ అనుబంధాన్ని కలకాలం నిలిపి ఉంచుతాయి. ఈ విషయాన్ని ప్రతి ఆడపిల్లకు నేర్పాలి.

రెండో భాగం ఎల్లుండి.. వేచి ఉండండి..

Thursday, 25 June 2009

చదువు (కొందామా) కుందామా?

జూన్ వచ్చేసింది. స్కూళ్ళు తెరిచేశారు. ఐతే ఎంటంట.. ప్రతి ఏడాది జరిగేదేగా.

ఈసారి ఒక వింత చెప్తాను. తల్లితండ్రులు ఈ ఫీజులు భరించలేము, మేము చదువు కొనలేము అని ఆగ్రహావేశాలు వెలిబుచ్చుతున్నారు. ప్రైవేట్, కార్పోరేట్ స్కూళ్ళలో ఫీజులు విపరీతంగా పెంచేశారు. ఫీజు కాక సదుపాయాలు అని అదనపు వడ్డింపులు.. రెట్టింపు కాదు మూడింతలు నాలుగింతల ఫీజు పెంచేశారు. ఈ ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం దయ తలిచి ఒక కమిటీ వేసింది. ఈ బాధిత తల్లితండ్రులు ఆ కమిటీ ముందు భోరు మన్నారు. ఆగ్రహించారు. .. విద్యాశాఖను జాడించి ఉతికేసారు. అధికారులు ఎం చెప్తారు. సైలెంట్..

ఇక ఈ పెద్ద స్కూళ్ళ ఫీజుల ధరవరలు ఎలా ఉన్నాయంటే.. ఎల్.కే.జి కి దాదాపు 85 వేలు , పుస్తకాలకే 11 వేలు, ఇక డ్రస్సులు, , బూట్లు కూడా స్కూల్లోనే కొనాలి. స్కూలు వారిచే సదుపాయాలు అంటే.. అన్ని క్లాసుల్లో ఏ.సి , మినరల్ వాటర్, బస్సు కూడా ఏ.సి. కంప్యూటర్లు. ఇలా ఎన్నో ఎన్నెన్నో. మరి వాటికి డబ్బులు మనమే కట్టాలిగా. దినదినం ధరలు పెరుగుతున్నాయి. ఫీజులు పెంచకుంటే స్కూలు వాళ్లు బ్రతికేది ఎలా.

దీనికి కారణం ఎవరు?? అన్ని వేలు, లక్షలు కట్టి చదివిస్తే కాని చదువు రాదా? వాళ్ళు చెప్పేది ప్రత్యేకమైన చదువా?? సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు వచ్చే జీతల ధీమాతో తల్లితండ్రులే ఈ స్కూళ్ళను పెంచి పోషిస్తున్నారు. డబ్బుంది కదా అని తమ పిల్లలకు చిన్నప్పటినుండే హైటెక్ సదుపాయాలు ఇవాలనుకున్నారు. ఒక కే.జి పిల్లాడికి ఏడాదికి తక్కువలో లక్ష కట్టాల్సిందే. నేలజీతాలే లక్షల్లో ఉంటే ఈ ఫీజులో లెక్కా? పైగా తల్లితండ్రులు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. పిల్లలను చూసుకోవడానికి, చదివించడానికి వారికి తీరిక లేదు. సో .. డబ్బులు కట్టి ఆ భాద్యతలు స్కూలు వారిపై వేసేస్తున్నారు. ఇపుడు ఆర్ధిక మాంద్యం వల్ల అందరికి డబ్బులకు కటకటగా ఉంది. ఇంతకూ ముందు లెక్కలోకి రాని స్కూలు ఫీజులు ఇపుడు భారమైనాయి. సంపాదనకు అలవాటు పది చదువును ఒక వ్యాపారం లా మార్చిన యాజమాన్యం వారు ఫీజులు పెంచుతున్నారు. వారికి కావలసింది డబ్బు., లాభాలు. ఎవరెలా పొతే వారికేంటి.. ఇంతకు ముందు కూడా ఇంగ్లీషు మీడియం, కాన్వెంట్ స్కూళ్ళు ఉన్నాయి. కాని చదువు కూడా హైటెక్ కావాల్సి వచ్చింది. అందుకే ఈ హైటెక్, కార్పోరేట్ స్కూలు వెలిసాయి. మూడు ఫీజులు, ఆరు డొనేషన్లు లా దినదినాభివృద్ధి చెందాయి. ఇపుడు వాటిని భరించలేకపోతున్నారా ?? దీనికి కారణం తల్లితండ్రులు. వాళ్లు మారాలి ముందు. ప్రతి సంవత్సరం ఫీజులు పెంచుతుంటే ఊరుకున్నారు. ఇపుడు ఊరుకోక తప్పదు. లేదా దానికి పరిష్కారం వెతకాలి. అసలు ఐదో తరగతి నుండే ఐ.ఐ.టి కోచింగా ??? పొద్దున్న ఆరుగంటలకు వెళితే ఇంటికొచ్చేసరికి రాత్రి ఎనిమిది. వాళ్ళను దింపడానికి తల్లితండ్రులు కూడా కష్టపడుతున్నారు. అసలు తల్లితండ్రులనే పరిక్షలు రాయమంటే సరిపోతుంది. ఈ తల్లితండ్రికైనా తమ పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. దానికి ఆ పిల్లల బాల్యాన్ని బలి పెడుతున్నారు. కాలేజి పిల్లల బ్రతుకు కూడా అలాగే ఉంది. రెండు మూడు కాలేజీలే తప్ప మిగతావి పనికిరాకుండా పోయాయి. వాళ్ళేమో బాగా చదివే పిల్లల మీద ఎక్కువ శ్రద్ద తీసుకుని ర్యాంకులోచ్చాయోచ్ అని డప్పు కొట్టుకుంటున్నారు. దానితో వల్ల వ్యాపారం ఇంకా అభివృద్ది చెందుతుంది. ఇలా చెప్పుకుంటూ పొతే ప్రతి చోటా వ్యాపారమే.. దీనికి అంతం లేదా..

ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి విజయాలు ఎందుకుండవు. అసలు అవి అసలు కళ్ళకు కూడా కనపడవెందుకు. అక్కడ చదివించే పుస్తకాలు సిలబస్ వేరేనా.. కాదె.. కార్పోరేట్ స్కూళ్ళలో పెట్టె ఫీజుల్లో సగం పెట్టి మంచి అధ్యాపకులను పెట్టి తమ పిల్లలను అక్కడ చదివించలేరా. ఆ చదువుకు ప్రభుత్వ గుర్తింపు ఉండదా.. పదో క్లాసు పరీక్ష రాయనివ్వరా .. అదేం లేదే.. పెద్ద చదువులు చదివి , ఉద్యోగాలు లేనివారెందరో ఉన్నారు. ప్రభుత్వం తో మాట్లాడి తల్లితండ్రులే ఈ విషయంలో ముందడుగు వేయాలి. తమకు కానీ ఖర్చు లేదంటే ప్రభుత్వం ఎందుకు నో అంటుంది.

ఇది చాలా చీప్ గా ఉందా.. ఐతే మీ ఇష్టం. మా బాబుకు ఇరవై ఏళ్ళ క్రింద ఒక పెద్ద స్కూలులో (పేరు గొప్ప ఊరు దిబ్బ అని తర్వాత తెలిసింది) ఎల్.కేజీ కోసం యాభై వేలు అడిగారు. ఒక స్కూలులో నలభై వేలు.. నేనివ్వను అని మామూలు స్కూలులో డొనేషన్ లేకుండా చేర్పించాను. ఇచ్చేవాడుంటేనే కదా తీసుకునేవాడికి ఆశ పెరిగేది.. ఆ తర్వాత మనను దోచుకునేది.. :)

Tuesday, 23 June 2009

హ్యాపీ బర్త్ డే విహారి.....



సరదా టపాలతో సిధ్ద,బుధ్దలతో బ్లాగ్లోకంలో నవ్వులు వెదజల్లిన విహారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాగే నవ్వుతూ, నవ్విస్తూ,సంతోషంగా ఉండాలని మనసారా దీవిస్తు... అక్క...
విహారి... మీ పెద్దపండు, చిన్నపండు ఎలా ఉన్నారేంటి. చాలా రోజులైంది టపాయించడంలేదు..

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008