Tuesday, 28 June 2011

కుశలమా???


కుశలమా???

మాట చెప్పలేని విషయాన్ని ఒక పదం చెప్తుంది. ఆ పదాలను కూర్చి రాసిన ఉత్తరం ఆ వ్యక్తి మనసులోని భావనను ఉన్నదున్నట్టుగా అవతలి వ్యక్తికి మోసుకెళ్తుంది. ఉత్తరాలు అనగానే ఒక కార్డు,కవరు,, ఎన్వలప్ మాత్రమే కాదు. అందులో ఎన్నో కబుర్లు, కథలు, ఊసులు, బిల్లులు,బకాయిలు కూడా. ఈ బిల్లులు, బకాయిలైతే అందరికీ ఉండేవే. ప్రతి నెల అవి రాక తప్పదు. వాటికి మనసుండదు. మాటలుండవు. ఉత్తరమంటే అవసరమైన విషయాన్ని మూడు ముక్కల్లో రాసి పడేయడమేనా.. చాలామందికి ఉత్తరాలు అవసరమైతే తప్ప రాసుకునేవి, వచ్చేవి కావు అనుకుంటారు. కాని కొందరికి ఉత్తరం అంటే ఒక భావతరంగం. మనసును విప్పి చెప్పుకునే సాన్నిహిత్యం. పలుకలేని ఊసులెన్నో పదాలుగా మార్చి పంచుకోవడం అనుకుంటారు ఎంతో మంది. అందులో నేనూ ఒకదాన్నే.

ప్రతీ విషయం ఎప్పటికప్పుడు మాట్లాడుకోలేము, ఆ మనిషి ఎదురైనప్పుడు గుర్తుండదు లేదా అన్నీ చెప్పలేము కూడా. కాని ఉత్తరం రాయడానికి కూర్చుంటెే మాత్రం ఆ భావప్రవాహం అలా సాగిపోతూనే ఉంటుంది. గొంతుదాటి రాలేని ఎన్నో మాటలు అక్షరాలుగా ఉత్తరంలో ఒదిగికూర్చుంటాయి. మన మనసులోని సందేశాన్ని ఉన్నదున్నట్టుగా అవతలి వ్యక్తికి అందజేస్తాయి. మొత్తం రాసాక చూసుకుంటే ఇదంతా మనమే రాసామా? అనుకుంటాం.. ఉత్తరాలు రాయడం, వచ్చిన వాటిని చదువుకుని మురిసిపోవడం. ఆ ఆలోచనల్లో మునిగిపోవడం చాలామందికి పరిపాటే. మన ఆలోచనలను అందరితో పంచుకోలేము. ఎందుకంటే వాటిని అందరూ ఒక్కలా అర్ధం చేసుకోలేకపోవచ్చు. కొందరికి అది సోదిలా ఉంటే మరి కొందరికి మనం చెప్పదల్చుకున్నది అర్ధం కాదు. కాని చాలా కొద్ది మంది మన శ్రేయోభిలాషులు మాత్రం ఆ ఉత్తరంలోని అంతరార్ధాన్ని పట్టుకుంటారు. మనం చెప్పలేకపోయిన విషయాన్ని కూడా అర్ధం చేసుకుంటారు. మన మనఃస్థితి ఆ పదాల్లో స్పష్టంగా కనిపిస్తుంది మరి. ఇంతకంటే వేరు మార్గం ఉందా మన సంతోషాన్ని, బాధను పంచుకోవడానికి.

ఉత్తరం అంటే కలం, కాగితం కాగితాలు. అసలు రాయడానికి కూర్చుంటే ఎన్ని కాగితాలైనా సరిపోవేమో. కాని అలా రాయగలగడం ఒక కళ. అది అందరికీ రాదు. కొందరి రాతలు, అందులోని మర్మం అర్ధం చేసుకున్నవారికి అవి శిలాక్షరాలై జీవితాంతం గుర్తుండిపోతాయి. అవి జీవిత పాఠాలే కావచ్చు, గుణపాటాలే కావొచ్చు. కాని ఈనాడు ఉత్తరాలు రాసే అవసరం అంతగా రావట్లేదు. సెల్ ఫోన్లు, ఈ మెయిల్ మొదలైనవి మనుష్యుల మధ్య దూరాన్ని తగ్గించాయి. ఏదైనా పని ఉంటే కాల్ చేస్తాం, మెయిల్ చేస్తాం కదా ఇంకా వేరే ఉత్తరాలు రాయడమా? అంటారు. కాని చదువు, ఉద్యోగానికి సంబంధించినవి మాత్రమే అవసరమైన విషయాలా?? అవి తప్ప మాట్లాడుకోవడానికి, మిత్రులతో పంచుకోవటానికి, చర్చించటానికి విషయలేమీ లేవా? (మనకంటే బ్లాగులున్నాయి అనుకోంఢి) ఒకరిపై ఒకరు అలిగినా, గిలి కజ్జాలు, అనుమానం, అపార్థాలు అయినా ఆ పరిస్థితిలో మాట్లాడడానికి మనస్కరించదు కాని అదే భావాలను ఉత్తరాల ద్వారా పంచుకుంటే ఆ కోపతాపాలు, అపార్థాలు తొలగిపోయే అవకాశం ఉంది.

చాలా రోజులకు వేడి కాఫీ తాగుతూ ఉదయించే సూర్యుడిని చూసారు. అప్పటి భావన, అనుభూతి ఒంటరిగా అనుభవించలేక ప్రియమైన నేస్తంతో పంచుకోవాలి అనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఉత్తరం రాసేయండి. ఆ భావావేశం తర్వాత జీవన రంధిలో పడ్డాక ఉండదు. వినడానికి బానే ఉంది. ఇప్పుడు ఉత్తరం రాసి పోస్ట్ చేసి దాని రిప్లై కోసం ఎదురు చూసే ఓపిక ఎవరికుంది అంటారా? ఎందుకు మన ఇంట్లోనుండే కూర్చున్నచోటినుండే ఉత్తరం రాసే వీలుంది. ఈ మెయిల్ ద్వారా కూడా చక్కని భాషతో, ప్రేమాభిమానాలతో ఎదుటిమనిషి మన ముందు కూర్చున్నట్టే, మాట్లాడుతున్నట్టే ఉత్తరం రాయొచ్చు. అది ఆ వ్యక్తికి చేరడానికి కొద్ది నిమిషాలకంటే ఎక్కువ సమయం పట్టదు. అర్ధం చేసుకునే మనసుంటే ఉత్తరాలలోని ప్రేమాభిమానాల జడివానలో తడిసి ముద్దై మురిసిపోతారు. కాదంటారా? కాగితం మీద రాసిన ఉత్తరాలు రాసినవి దాచుకోవచ్చు. అప్పుడప్పుడు తీసి చదువుకోవచ్చు అనుకుంటారు కాని కంప్యూటర్ పై రాసే ఇ-ఉత్తరాలు కూడా అప్పుడప్పుడు చదువుకుని ఆ పాత జ్ఞాపకాలను నెమరు వెసుకోవచ్చు. ఎన్నో తలపులు, ఊహలు, ఊసులు, అనుభూతులను, స్నేహమాధుర్యాన్ని పంచి మనసును తట్టేవి ఉత్తరాలు.

నాకైతే అస్సలు ఉత్తరాలు రాసే అలవాటు లేదు. ఎవరికని రాయను. నాకు రాసేవాళ్ళు లేరు. మంచి ఫ్రెండ్ ఉంటే ఎన్నో ఊసులు చెప్పుకోవచ్చు కదా అనుకునేదాన్ని. కాని నాకు నేను తప్ప ఎవరూ లేరు. పెళ్ళయ్యాక సంసార జంజాటం తప్పనిసరి. పిల్లలకు లీవ్ లెటర్ మాత్రం రాసే పని పాడేది అప్పుడప్పుడు. కాని అంతర్జాలానికి వచ్చిన తర్వాత నా ప్రయాణమంతా ఇ ఉత్తరాల ద్వారానే జరిగింది. నా ఉత్తరాలలో ఎన్నెన్ని ఆలోచనలో , భావనలో, బాధ, సంతోషాలో చెప్పలేను. ఎవరితో చెప్పుకోలేని, అడగలేని ఎన్నో మాటలు ఉత్తరాల ద్వారా చెప్పుకున్నాను . అలాగే వాటికి పరిష్కారం తెలుసుకుని నన్ను నేను సరిదిద్దుకున్నాను. చెప్పాలంటే నా అంతరంగాన్ని, సంఘర్షణను నా ఉత్తరాలలో దాచుకున్నానేమో. అందుకే ఎప్పుడైనా ఒంటరిగా , దిగులుగా ఉన్నప్పుడు పాత ఉత్తరాలను తీసి చదువుకుంటాను. నన్ను నేనే ఓదార్చుకుని ముందుకు సాగిపోతాను. ఎందుకంటే ఆ ఉత్తరాలలో ఎన్నో పాఠాలు ఉన్నాయి. అవి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం ద్వారా నా మార్గాన్ని సవ్యంగా మార్చుకోగలుగుతున్నాను.


మరి మీకు ఉత్తరాలు రాసే అలవాటు ఉందా?? నాకైతే ఉంది. మొదలుపెట్టానంటే నేను ఎంత పెద్ద ఉత్తరం రాస్తానో నా ప్రియ నేస్తాలకు తెలుసు.

Tuesday, 21 June 2011

మ్రోగింది వీణ .....

అసలు ఇప్పటి అమ్మాయిలకు మంచి అభిరుచి అనేది అస్సలు లేదు. చదువు, కంప్యూటర్లు, సినిమాలు, మొబైల్ లేదా ఐప్యాడ్ పెట్టుకుని పాటలు వినడం. మంచి వాయిద్యం నేర్చుకుందామని ఎంత మంది అనుకుంటున్నారు?. ఏమంటే మాకు టైం లేదు అంటారు. మా కాలంలో ఐతేనా??. .... అప్పట్లో స్కూల్లో, బాలభవన్ లో సంగీతం, వాయిద్యం నేర్చుకునే సదుపాయం ఉండేది. అసలైతే స్కూల్లో వారానికి ఒక రోజు సంగీతం క్లాసు కూడా ఉండేది. ఇంకా లైబ్రరీకి ఒక పీరియడ్ ఉండేది. మేము కూడా చదువుకుంటూనే ఆటలు, పోటీలు, సంగీతం, వక్తృత్వ పోటీలు అన్నీ పాల్గోనేవాళ్ళం. ఇంటికొచ్చి వేరే ఆటలు. ఏంటో ఈ నాటి పిల్లలు. చదువు తప్ప ఏది నేర్చుకుందామనే ఆసక్తి లేదు. అసలు సంగతి ఏంటి అంటే.. ముందుగా అందరికీ..

ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు..

ఈ సందర్భంగా ఒక మంచి మాట చెప్పుకుందాం. మాట్లాడుకుందాం. విందాం. చూద్దాం.. అర్ధం కాలేదా. చెప్తా వినండి. ఆ కాలంలో అంటే ఓ పాతిక సంవత్సరాల క్రింద దాదాపు ప్రతి సినిమాలో వీణ ,సితార్ పాటలు ఉండేవి గుర్తుందా. పెళ్లి చూపులు అనగానే వీణ పాట ఉండాల్సిందే. ఆ అమ్మాయి పాడుతూ వీణ వాయిస్తుంది. అంటే పెదాలు, చేతులు కదుపుతూ ఉంటుంది అన్నమాట. పెదాలైతే కలుస్తాయి కాని చేతుల నడక అస్సలు కలవాడు. పైనుండి కిందకు లాగడం తప్ప.. ఇది లాంగ్ షాట్ లో తెలీదులెండి.. కాని వాళ్ళ మొహాలు , హావభావాల సంగతి వదిలేస్తే కొన్ని మంచి పాటలు ఉన్నాయి. ముఖ్యంగా సుశీలమ్మ పాడినవి. ఈ అందమైన సాయంత్రం వాటిని ఓ సారి చూసేద్దామా.. అందమైన సాయంత్రం ఏంటి అంటారా? ఎండలు తగ్గి వాతావరణం చల్లబడి వానలు రావాలా వద్దా అని దోబూచులాడుతున్న వేళ అందమే కదా..

పాటలు వినేముందు ఒక మాట చెప్పనా.. డిగ్రీలో ఉండగానే నాకూ వీణ నేర్చుకోవాలనే కోరిక కలిగింది. సినిమాలు చూసి కాదులెండి. సరే నేను అడిగాక నాన్న కాదంటారా. తిరిగి తిరిగి ఏకాండి వీణ కొనిపించుకుని , ఒక టీచరమ్మ ని మాట్లాడుకుని నేర్చుకున్నాను. నా ఖర్మ కాలి ఆరు నెలలన్నా కాకముందే పెళ్లి కుదిరి ఆ వీణ అటకెక్కింది అనుకోండి. ఈ పెళ్లి చూపుల ప్రహసనంలో ఒకసారి ఏం జరిగిందంటే.. (నేస్తంలా సాగదీయను లెండి. క్లుప్తంగానే చెప్పేస్తాను) ఒక డాక్టరబ్బాయ్ తండ్రి వచ్చారు ఫలానావారి అమ్మాయి ఉందంటే అదీను పొడుగ్గా ఉందంట అని తెలిసి. ఆయన వచ్చినపుడు నా వీణ చూసారు. గుడ్ వీణ నేర్చుకుంటున్నావా? ఎంతవరకు వచ్చింది అని అడిగారు. చెప్పాను. సరే మళ్ళీ వస్తాం అబ్బాయిని తీసుకుని అని వెళ్ళిపోయారు. నాకు మండుకొచ్సింది. వీళ్ళు నన్ను సంతలో పశువులా చూడడానికి వస్తారా? పని పాటా లేదు. వచ్చి చూసి మెక్కి పోతారు అని తిట్టుకున్నా.. యిపుడు వీళ్ళు వస్తే నేను సినిమాల్లోలా టింగు టింగు మని వీణ వాయించాలా? చట్.. అస్సలు చేయను అని వాళ్ళు వస్తా అని చెప్పిన రోజే ఎవరూ చూడకుండా వీణ తీగలు తెంపేసా :). మళ్ళీ టీచరమ్మతో వేయించుకోవచ్చులే అని. లక్కీగా ఆ అబ్బాయి ఎవరినో ప్రేమించాడంట ... నేను రాను పో అన్నాడని ఎవరూ రాలేదనుకోండి. ..

ఇక పాటల సంగతి చూద్దామా... ఈ పాటలన్నీ నాకు చాలా ఇష్టమని అనుకోవద్దు. ఎదో వీణ పాటలు ఏమేమి ఉన్నాయని వెతికితే దొరికాయి. కొన్నిబావున్నాయి. కొన్ని ఒకే. కొన్ని ఊహూ..

సంఘం సినిమాలోని సుందరాంగ మరువగ లేనోయి




తెనాలి రామకృష్ణ లోని చందన చర్చిత




భూకైలాస్ లోని నా నోము ఫలించెనుగా




ఇద్దరు మిత్రులు లోని పాడవేల రాధికా




భార్యాభర్తలు లోని ఏమని పాడెదనో




నర్తనశాలలోని సఖియా వివరించవే




డాక్టర్ చక్రవర్తి లోని పాడమని నన్నడగవలెనా




మంచి కుటుంబంలోని మనసే అందాల బృందావనం




ఆత్మీయులు లోని మదిలో వీణలు మ్రోగే




అమాయకురాలులోని పాడెద నీనామమే




ప్రేమ్ నగర్ లోని ఎవరో రావాలి..




మీనా లోని శ్రీరామనామాలు



కొన్ని పాటల వీడియోలు దొరకలేదు.ఇలా వినేయండి పర్లేదు..

విచిత్ర దాంపత్యంలోని శ్రీ గౌరీ శ్రీ గౌరివే
జమిందారు గారి అమ్మాయిలోని మ్రోగింది వీణ
అభిమానవంతులు లోని ఈ వీణ పైన పలికిన
చక్రవాకం లోని వీణలోనా తీగలోనా
దేశోద్ధారకులు లోని ఈ వీణకు శ్రుతి లేదు
అభిమానవంతులు లోని ఈ వీణ పైన

Saturday, 18 June 2011

నేను తెలుసుకున్న శ్రీకృష్ణదేవరాయలు




"దేశభాషలందు తెలుగు లెస్స" ఈ మాట వినగానే ప్రతి తెలుగువాడి హృదయం ఉప్పొంగుతుంది. కాని ఈ మాట వినగానే మనకు గుర్తొచ్చేది విజయనగర సామ్రాజ్యాధీశుడు, సాహితీ సమరాంగన సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలు. తెలుగులో రచన చేయమని కన్నడ రాజుని ఆదేశించిన శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు పలికినట్టు నానుడి. కాని క్రీ.శ.1430 ప్రాంతం వాడైన వినుకొండ వల్లభరాయని 'క్రీడాభిరామం' నాటికే ఈ నానుడి బహుళ ప్రచారంలో ఉందని తెలియవస్తుంది. రాజ్యవిస్తరణలో భాగంగా దక్షిణదేశ దిగ్విజయ యాత్ర చేస్తూ శ్రీకాకులంలో విడిది చేసాడు. స్వప్నంలో సాక్షాత్కరించిన శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు స్వయంగా సంస్కృతకవియైన రాయలును అచ్చ తెలుగుభాషలో తన భక్తురాలి కథను దివ్యప్రబంధంగా రచించుమని ఆదేశించాడు. అదే ఆముక్తమాల్యద.. ఆ సమయంలో పలికిన పలుకులివి..

చరిత్రలో మనకు ఎందరో ప్రసిద్ధిచెందిన చక్రవర్తులు, సంస్థానాధీశులు, మహా వీరులు ఉన్నారు. అందరూ రాజ్యాభిలాష కలవారే. అయినా కొందరు మాత్రం ధర్మరక్షణ, కళారాధన, సాహితీసృష్టిపై విశేష కృషి చేసారు. ఇటువంటి వారిలో ప్రముఖంగా చెప్పుకోదగిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. విజయనగర సామ్రాజ్యాధినేతగా, మహావీరుడిగా ధర్మసంస్థాపన, ప్రజాసంక్షేమం కోసం పాటుపడిన మహామనిషిగా పేరుపొందాడు. శ్రీకృష్ణదేవరాయలు సాహితీ సమరాంగన సార్వభౌముడని, అనేక అద్భుత కట్టడాలను నిర్మిచాడన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ అంశాలతో పాటు అంతగా పరిచయం లేని శ్రీకృష్ణదేవరాయల ధర్మదీక్ష, ఆధ్యాత్మికత మొదలైన అంశాలను సవివరంగా అందించారు కస్తూరి మురళీకృష్ణ తన శ్రీకృష్ణదేవరాయలు నవలలో . ఇందులో రాయల వ్యక్తిత్వాన్ని, కార్యదీక్షను, కళారాధనను నూతన కోణంలో ఆవిష్కరించిన రచన ఇది.

కృష్ణదేవరాయల చరిత్రా?? ఇది స్కూలు పిల్లలకైతే పాఠ్యాంశంగా పనికొస్తుంది .మనకెందుకులే అనుకుంటే పొరపాటే. ఒక మహారాజు అనగానే వంశపారంపర్యంగా వచ్చిన అధికారం, హోదా కాదు. రాచరికం అంటేనే కుట్రలు, కుతంత్రాలమయమైన ముళ్ళ కిరీటం. కృష్ణదేవుడు తన పుత్రుని రాజ్యాభిషేకానికి అడ్డుగ ఉన్నాడనే భయంతో అతని కళ్లు పెరికించమని తిమ్మరుసుకు ఆదేశిస్తాడు అతని అన్న వీరనరసింహుడు. తిమ్మరుసు అతనిని యుక్తిగా రక్షిస్తాడు. ఒకవైపు తురుష్కుల దాడి, మరోవైపు సామంతుల ధిక్కారస్వరంతో అల్లకల్లోలంగా ఉన్న సమయంలో రాజ్యాధికారం చేపట్టిన రాయలు సైనికులను మాతృభూమి రక్షణకు ఉత్తేజపరిచి ప్రతీ చోటా విజయం సాధించాదు. అలాగే సాహిత్యం, లలితకళలు, ధర్మసంరక్షణ విషయాలలో కూడా అమితమైన శ్రద్ధ కనబరచి ఎన్నో దేవాలయాలను అభివృద్ధి చేశాడు. స్వయంగా కవిపండితుడు కావడం వలన మదాలస ప్రబంధం, జ్ఞానచితామణి, రసమంజరి, ఆముక్తమాల్యద వంటి అద్భుతమైన రచనలెన్నో చేశాడు. చరిత్ర గురించిన రచనలు చేయడం అంత సులువు కాదు. ఊహాజనితమైన రాతలు కాక వాస్తవికమైన వివరాలు,విశేషాలను చాలా జాగ్రత్తగా అధ్యయనం చేసి పాఠకులకు అందివ్వాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో రచయిత సఫలురైనారని చెప్పవచ్చు.

సామాన్యుల శవాల గుట్టలపైనుండి నడుస్తూ వారి బలిదానాల ఫలితాలను రాజులు అనుభవిస్తారు. కాని మన ధర్మాన్ని నాశనం చేసి, మనల్ని అంతం చేయడానికి చుట్టుముట్టిన తురుష్కుల్ని తరిమి కొట్టండి. నాకోసం కాదు,, మీకోసం, మీ కుటుంబం కోసం పోరాడండి. అని నీరసించిన తన సైనికులను ఉత్తేజపరచి విజయలక్ష్మిని వరించాడు. అంతే కాదు మన ప్రజలకు కలలు కనడం నేర్పించాలి. రకరకాల భయాలతో, బాధలతో వారు తమ బ్రతుకుల్లోని ఆనందాన్ని మరచిపోయారు. సాహిత్యం, సంగీతం, గానం, నృత్యం వంటి లలితకళల ద్వారా జీవితంలోని ఆనందాలను వీరికి పరిచయం చేయాలి. అద్భుతమైన శిల్పాలతో సృష్టికి అందాలు అద్దాలి అని అనడమే కాడు అక్షరాలా ఆచరణలో పెట్టి ప్రజలలో ఉత్తమ భావాలు ఉన్నత ఆలోచనలు పెంపొందేలా చేశాడు రాయలు.

ఒక వ్యక్తి జీవిత విశేషాలనే కాదు ఆతని వ్యక్తిత్వంలోని ప్రత్యేక కోణాన్ని, ఆతని పరిపాలనా సామర్ధ్యాన్ని సరళమైన పదవిన్యాసంతో అందించారు రచయిత ఈ నవలలో. ఒక నాయకుడిగా తన అనుచరులను ఏ విధంగా ఉత్తేజపరుస్తాడు, పురాతన ఆలయాలను పునరుద్ధరింపజేసి వాటి నిర్వహణకోసం ఎటువంటి లోటు జరగకుండా ఏర్పాట్లు చేసి, ఎంతో నైపుణ్యంతో యుద్ధరచన చేసి శతృవులను యుక్తిగా మట్టుపెట్టి మహావీరుడిగా మన్ననలందిన రాయలు గురించి తెలుసుకోవలసిన సమాచారం ఎంతో ఉంది. ఇందులో రాయలు పలికిన మాటలు చదువుతుంటే జీవితంలో ఆటుపోట్లను ఎదుర్కునేటప్పుడు సార్వభౌముడైనా , సామాన్యుడైనా ఒకటే కదా అనిపిస్తుంది.

నాకు కృష్ణదేవరాయలు స్కూలులోనే పరిచయం. అప్పుడప్పుడు కొన్ని సినిమాలలో కనిపించేవాడు రాయలు. కాని ఆముక్తమాల్యద ద్వారా మరింత దగ్గరయ్యాడు . అందుకేనేమో అతని గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనే ఉత్సుకత కలిగింది. కస్తూరి మురళీకృష్ణగారి శ్రీకృష్ణదేవరాయలు నవల నాకు తెలియని ఎన్నో విషయాలను తెలిపింది. మామూలుగా చిన్నప్పటినుండి నాకు చరిత్ర అంటేనే అంతగా ఆసక్తి లేదు. కాని ఈ నవలను మాత్రం కదలకుండా, వదలకుండా రెండు గంటల్లో పూర్తి చేసా.. అంత సరళమైన , ఆసక్తికరమైన రచన ఇది. ఈ నవల పాఠ్యాంశంగా ఉండాలని ఎందరో పాఠకులు భావించారు. అది అక్షరాలా నిజం అని నేను నమ్ముతున్నాను.

ఈమధ్యే విజాగ్‌లో జరిగిన పుస్తకావిష్కరణ సభలో ద్వానాశాస్త్రిగారు అన్నారంట. రాయలవారికి ఇద్దరే భార్యలు తిరుమలదేవి, చిన్నాదేవి. మూడో భార్య కూడా ఉంది అని చెప్పడం తప్పు కదా అని. రాయలు యవ్వనంలో ఉండగా చిన్నాదేవి అనే వేశ్యను వలచాడు. ఆమె రాచకన్య కాదు కాబట్టి తిమ్మరుసు సాళువ నరసింహుని పుత్రిక తిరుమలాదేవితో వివాహం జరిపించి పిమ్మట చిన్నాదేవిని కూడా చేపట్టమన్నాడు. చాలా కాలానికి గజపతి శతృత్వాన్ని బంధుత్వంగా మార్చుకోవడానికి తన కూతురు అన్నపూర్ణా దేవిని రాయలుకు ఇచ్చి వివాహము చేశాడని. మహామంత్రి తిమ్మరుసు సినిమాలో కూడా ఇలాగే చూపించారు. మరి ఇది ఎంతవరకు నిజమో విజ్ఞులే తెలపాలి.
ఇది సమీక్షా? ఇంత పెద్దగా ఉంటుందా? అంటారా?? అసలు చెప్పాలంటే మొత్తం పుస్తకమే ఇక్కడ రాసి పెట్టాలనుంది.కాని పుస్తకం కొని చదివితేనే అందం.చందం.. ఆనందమూనూ..

పుస్తకం వివరాలు :
శ్రీకృష్ణదేవరాయలు
రచయిత : కస్తూరి మురళీకృష్ణ
ప్రచురణ : కస్తూరి ప్రచురణలు
ధర : Rs. 60
పంపిణీదారులు : Navodaya Book House
Opp. Arya Samaj Mandir
Kachiguda ‘X’ Roads,
Hyderabad – 27
Ph. 040 – 24652387

ఆన్లైన్ లో కొనుక్కోవాలన్నా, అద్దెకు తీసుకోవాలన్నా : Kinige

Thursday, 2 June 2011

మాలిక పత్రిక తరపునుండి రచయితలకు ఆహ్వానం





ఆత్మీయ పాఠకులకు నమస్సుమాంజలి. ఇప్పటికి రెండు సంచికల వయసుకల మాలిక పత్రిక ఆగస్టు నెలలో విడుదలయ్యే మూడోసంచికకు ముస్తాబవుతోంది. గత రెండు సంచికలను, వాటిపై వచ్చిన సలహాలు సూచనలను దృష్టిలో పెట్టుకుని శ్రావణ పౌర్ణమి సంచికను ఇంకా మెరుగుపరిచే ప్రయత్నంలో ప్రస్తుతం మాలిక బృందం నిమగ్నమై ఉంది. ఇంతవరకు మాలిక పత్రికలొ జనరంజకమైన వ్యాసాలు ప్రచురించాము.. ప్రియ పాఠకుల విమర్శలు, సూచనలతో మా లోపాలను సరిదిద్దుకోవడానికి శాయశక్తుల ప్రయత్నం చేసాము. ఇంతకు ముందు చెప్పినట్టుగానే, మాలిక పత్రిక ముఖ్య ఆశయం ప్రతిభ ఉండీ, అవకాశాలు అంతగా లేని రచయితలను వెలుగులోకి తీసుకురావటం. అలాగే ఇప్పటికే పేరు పొందిన రచయితల రచనల ద్వారా కొత్తవారికి స్పూర్తినిస్తూ, పాఠకులకు కనువిందు చెయ్యటం. అన్నట్టు మా పత్రికకు ఇజాలేమీ లేదు. ఏ దృష్టికోణం ఉన్నవారయినా మాలిక పత్రికకు రచనలను పంపించవచ్చు.


ఇది న్యూస్ ప్రింట్, కాగితపు ఖర్చులవంటి ఇబ్బందులు లేని పత్రిక కాబట్టి సాధ్యమైనన్ని ఎక్కువ రచనలు ప్రచురించటానికే ప్రయత్నిస్తున్నాం. అయితే సాహిత్య సాంఘిక విషయాల మేళవింపు ఈ పత్రిక ముఖ్య లక్షణం కాబట్టి అక్కడడక్కడ కొన్ని మార్పులూ చేర్పులు ఉండవచ్చు. ఈ విషయంలో మేము రచయితల సహకారాన్ని కోరుతున్నాం. ఒక విషయాన్ని రచయితకు సాధ్యమైనంతలో ఎంత లోతుగా విశ్లేషిస్తే, పాఠకులనుండి అంత స్పందన ఉంటుంది. ఆ విశ్లేషణ రచయిత మినహా వేరేవరూ అదే దృష్టితో చెయ్యలేరు. కనుక తమ రచనలను తమకు సాధ్యమైనంతలో పాఠకులను మెప్పించేలా రచయితలు సృష్టిస్తారని ఆశిస్తూ, అలా సృష్టించే బాధ్యతను రచయితలకే వదిలి పెడుతున్నాం. ఒకవేళ మా సహాయం ఏమన్నా కావాల్సి వస్తే దాన్ని అందించటానికి మేమెప్పుడూ సిధ్ధమే.


ఇకపోతే మాలిక పత్రికకు రచనలను ఎవరికి, ఎలా పంపాలి అని చాలామంది అడుగుతున్నారు. మీరు మీ రచనలను editor@maalika.org కి ఈమెయిల్ ద్వారా పంపవచ్చు. రచనలు విధిగా తెలుగులోనే ఉండాలి, మీకిష్టమైన విషయంపై మీ రచన ఉండచ్చు. అయితే అసభ్యకరమైన, అభ్యంతరకరమైన రచనలు ఆమోదింపబడవు. ప్రచురణ విషయంలో తుది నిర్ణయం సంపాదకులదే.



పైన ఇచ్చిన ఈ మెయిల్ చిరునామాకి ఒక జాబు వ్రాయండి చాలు - మేము చెయ్యగలిగినది మేము తప్పకుండా చేస్తాం.

ఆగస్టు సంచికలో కొంతమంది ప్రఖ్యాత రచయితల రచనలు కూడా ఉండబోతున్నాయి. వివరాలు త్వరలో.

Tuesday, 31 May 2011

మరో షడ్రుచుల సాహిత్యం - రుచుల్ రుచుల్ గా

అంతర్జాలానికి వచ్చిన కొత్తలో పొద్దు పత్రిక కోసం చేసిన మొదటి ప్రయోగం షడ్రుచుల సాహిత్యం. కొత్తపాళి గారి సహకారంతో ఈ ప్రయోగం విజయవంతమైంది. దాన్ని కొంచం మెరుగులు దిద్ది మరి కొన్ని పద్యాలు చేర్చి రాసిందే షడ్రుచోపేతమైన సాహితీ విందు. అలా మొదలైంది నా సాహితీ ప్రస్థానం.. భోజనం మరియు పద్యాలు ఎందుకో నన్ను వెంటనే ఆకర్షిస్తాయి. అందుకే ఈ రెండింటిని కలిపి రాసిందే మరో షడ్రుచుల సాహిత్యం.. ఈ రుచుల్ రుచుల్ గా .. జూన్ నెల చిత్ర మాసపత్రికలో ప్రచురించబడింది.





అన్నదాతా సుఖీభవః..

కడుపునిండుగా , రుచికరమైన భోజనం తిన్నతర్వాత ప్రతీ ఒక్కరు అనుకునే మాట ఇది. ఈ భోజనం షడ్రుచోపేతమైనదే కానక్కరలేదు. అందుకేనెమో భోజనం దేహి రాజేంద్ర ! ఘృత సూప సమన్వితమ్ ( ఓ రాజా! నెయ్యి,పప్పుతో కూడిన భోజనం ఇవ్వు ) అన్న కవి మాటకు మహాకవి కాళిదాసు మాహిషంచ శరచ్చంద్ర చంద్రికా ధవళం ధధి: ( పండువెన్నెల వంటి తెల్లని పెరుగుతో అన్నం పెట్టవయ్యా) అని పూరించాడు.



మనుష్యులందరికీ కూడు, గూడు, బట్ట తప్పకుండా కావలసినవి. అందులో తిండి చాలా ముఖ్యం. కోటి విద్యలు కూటికొఱకే అని ఊరకే అనలేదు. ఆకలిగొన్నవాడికి భైరవి రాగం కంటే , రవివర్మ చిత్రం కంటే పప్పన్నమే మేలు. కన్నులనిండు కంటే కడుపు నిండే ఘనమని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పండితులు ఒప్పుకోవలసిందే.



వృత్తులన్నింటిలోనూ వంట వృత్తి మొదటిది అని మహాకవి గంగాదాసు గారి సూత్రము. ఈ పాక కళకి ఆరు రసములు (షడ్రుచులు) ఉండగా కవితకు తొమ్మిదిరసాలు (నవరసాలు) ఉన్నాయి. షడ్రుచులు వంటకు తప్పనిసరిగా అవసరమైనవి. కాని నవరసాలలో అన్నీ ప్రాణమని చెప్పలేము. ఏది ఉంచినా,తీసివేసైనా జరిగే నష్టమేమి లేదు. కాని షడ్రుచులలో ఏ ఒక్కటి తగ్గినా,తీసివేసినా వండినదంతా పెంటలో పడేయక తప్పదు అని సాక్షిలో కామకవిగారు వాపోయారు.



భోజనం అనగానే ముందుగా గుర్తొచ్చేది అమ్మ చేతి వంటె. ప్రతీ అమ్మ అన్నపూర్ణే కదా. భర్త కోసం ఇష్టమైన వంటకాలు చేసిపెట్టు అతనికి ప్రేమతో వడ్డిస్తుంది ఇల్లాలు. అతను ప్రీతికరంగా తింటే తాను తృప్తి పడుతుంది ఆ ఇంతి. దానికి ఆ శ్రీనివాసుడు కూడా అతీతుడు కాడు అని అన్నమయ్య స్తుతిస్తున్నాడు.


ఇందిర వడ్డించ నింపుగను


చిందక యిట్లే భుజించవో స్వామి


అక్కాళపాశాలు అప్పాలు వడలు


పెక్కైన సయిదంపు పేణులును



సక్కెరరాసులు సద్యోఘృతములు


కిక్కిరియ నారగించవో స్వామి


మీరిన కెళంగు మిరియపు దాళింపు


గూరలు కమ్మనికూరలును


సారంపుబచ్చళ్ళు చవులుగ నిట్టే


కూరిమితో జేకొనవో స్వామీ


పిండివంటలును పెరుగులు

మెండైన పాశాలు మెచ్చి మెచ్చి


కొండలపొడవు కోరి దివ్యాన్నాలు


వెండియు మెచ్చవే వేంకటస్వామీ



ఇందిరాదేవి ప్రేమగా ఆ స్వామికి వడ్డించిన వంటకాలు ఏంటయ్యా అంటే నేతి పాయసాలు, అప్పాలు, వడలు, చక్కెర రాసులు, మిరియపు తాళింపు పెట్టిన కమ్మని కూరలు, పచ్చళ్లు, పిండివంటలు, పాలు , పెరుగు మొదలైనవి. అంటే ఆ కాలంలో స్వామివారికి ఈ వంటకాలు నిత్యం నివేదించేవారేమో. శ్రీవారి సేవల ఇలా ఉంటే కృష్ణాతీరంలోని అప్పన్న వాళ్లావిడకు చుట్టాలొచ్చారని ఎక్కువ హైరానాపడకు అంటూ ఇదిగో ఇలా కానిచ్చేయమన్నాడంట.



"పెందలాడే కాస్త పప్పూ అన్నం బెడుదూ. చుట్టాలొచ్చారని, నవకాయ పిండివంటలు జేసేవ్. వంకాయ నాలుగు పచ్చళ్లు చేసి పోపులో వేసి, ఆనపకాయ మీద యింత నువ్వుపప్పు చల్లి, అరటిదూట మొఖాన యింత ఆవెట్టి, తోటకూర కాడల్లో యింత పిండిబెల్లం పారేయ్. కొబ్బరీ, మామిడీ, అల్లం యీ పచ్చళ్లు చాల్లే...పెరుగులో తిరగమోతపెట్టి దాన్లో పది గారె ముక్కలు పడేయ్. రవంత శెనగపిండి కలిపి మిరపకాయలు ముంచి చమురులో వెయ్. సరే క్షీరాన్నమంటావా?అదో వంటా? ములక్కాయలు మరి కాసిని వేసి పులుసో పొయ్యి మీద పడేయ్. యీపూటకు యిల్లా లఘువుగా పోనీయ్. ఇదిగో నేను స్నానం చేసి వస్తున్నాగాని,ఈలోగా, ఓ అరతవ్వేడు గోధుంపిండి తడిప్పెట్టూ, రత్తమ్మొస్తే నాలుగు వత్తి అలా పడేస్తుంది. మధ్యాహ్నం పంటికిందకు వుంటాయ్.."



మరి ఆవిడ అలాగే చేసిపెట్టిందో, అట్లకాడ తిరగేసిందో మల్లాది రామకృష్ణశాస్త్రిగారే చెప్పాలి.



సాహిత్యంలో కూడా కవులు పండితులు భోజనానికి పెద్ద పీటే వేశారు.అందుకే బమ్మెరపోతన “ అప్పడుపుకూడు భుజించుటకంటే సత్కవులు హాలీకులైననేమి?” అని కవితాకన్యకను విక్రయించగా వచ్చే సొమ్మును నిరసిస్తే , శ్రీ శ్రీ “సత్కవుల్ హాలీకులైననేమి? ఆల్కహాలీకులైననేమి?” అని తనకోసం, తనలాంటి వారికోసం మార్పు చేసుకున్నారు.



శ్రీనాధుడు తన 'సిరియాళ చరిత్ర" లో..బ్రహ్మణుడైనా..బహుశా పెద కోమటి వేమా రెడ్డి గారింట్లో చూసాడో ఇంకెక్కడ చూసాడో మరి.. మాంసాహారాన్ని ఎలా వర్ణించాడో చూడండి. వినే వారికి నోరు వూరడం తధ్యం.



మిరియము నుల్లియున్ బసుపు మెంతియు నింగువ జీరకంబు శ
ర్కరయును జింతపండును గరాంబువు గమ్మని నేయి తైలమున్
బెరుగును మేళవించి కడు పెక్కు విధంబుల బాక శుద్ధి వం
డిరి శిరియాలునిం గటికి డెందమునం దరళాక్షు లిద్దరున్.



మరికొన్ని రుచులను కూడా అందించాడు శ్రీనాధుడు..



కమ్మగాగాచిన కట్టు నంజుళ్ళను నీరు వెళ్ళగ నొత్తి నేత వేచి
చక్కగా దరిగిన నన్న మాంసంబులు పరిపాటిమైజుర్రుబదనువండి
మూల్గు టెంకులతోద ముదక గాకుండగ జాదు చేసిన నల్ల చారు గాచి
వలయు సంబరాలు వడియాలు బలియించి దళమైన క్రొవ్వు తో దాలబోసి



షడ్రసోపేతములు గాక జతుర భంగి
నమృత పాకంబులుగ జేసి రాక్షణంబ
సెట్టి శిరియాలు వంశాబ్ధి శీతకరుని
సతులు తిరువెంగనాచియు జందకనియు.



అంతేనా! కొందరు భక్తవరేణ్యులకు ఆ పరమాత్మ నామమే ఎంతోరుచిగా ఉండేదంట..



ఓ రామ నీనామ ఏమి రుచిరా .. శ్రీరామ నీనామ ఎంత రుచిరా


మధరసములకంటే దధిఘృతములకంటే...అతిరసమగు నామమేమి రుచిరా


నవరస పరమాన్న నవనీతములకంటే... నధికమౌనినామ మేమి రుచిరా


ద్రాక్షఫలముకన్న ఇక్షురసముకన్న....పక్షివాహన నామమేమి రుచిరా..



అని రాందాసు పాడగా, త్యాగరాజ స్వామి ఇంకో మెట్టు పైకెక్కి "స్వరరాగలయ సుధారసమందు వరరామ నామమనే ఖండ శర్కర మిశ్రము చేసి భుజియిం"చమన్నారు. భక్తాగ్రేసరులకు ఆ దేవదేవుని నామమే అత్యంత రుచికరంగా ఉంటుందంట. అందుకేనేమో



ఉ. చిక్కని పాలఁపై మిసిమి చెందిన మీగడ పంచదారతో


మెక్కిన భంగి నీ విమల మేచక రూప సుధారసంబు నా


మక్కువ పళ్ళెరంబున సమాహిత దాస్యమనేటి దోయిటన్


దక్కెనటంచు జుర్రెదను, దాశరధి కరుణా పయోనిధి..



చిక్కని పాలమీద కట్టిన మీగడలో పంచదార కలుపుకుని తింటే ఎంత రుచిగా ఉంటుంది. ఈ మాట వింటుంటేనే నోరూరుతుంది మరి ఆ రుచి,తియ్యదనం భద్రాచల రామదాసుకు శ్రీరాముడి నిర్మలమైన, నీలమేఘ రూపం అనే అమృతాన్ని జుర్రుకున్నట్టుగా ఉంటుందంట. పైగా ఆ మధురర్సాన్ని తన భక్తి అనే పళ్లెంలో సేవావృత్తి అనే దోసిటిలో పోసుకుని జుర్రుకుంటాడంట. అటువంటివాడికి ఏ పరమాన్నము, పాయసము రుచిగా ఉంటుంది.



స్వామిభక్తి, ప్రభుభక్తి గురించి మాట్లాడుతుంటే ఓ మహాకవి మాటలు గుర్తొచ్చాయి.



సీ. అధిపాన్న రాయలే ఆస్థాన పండితుల్


ఘనుడగు పెద్దన్న కందిపప్పు


అష్టదిగ్గజములే అష్టావకాయలు


ఆ రామలింగంబు చారు పులుసు


అప్పడాలు వడియాలు ఆ చోపుదారులు


రమ్య పచ్చళ్లు పారా జవాన్లు


పరమాన్న పాత్రంబు భట్టు మూరితి కవి


ఆతిమ్మకవిరాజు నేతిదొన్నె.



గీ. పప్పుకూరలు సంగీత పాటగాళ్లు


మెంతిపెరుగులు భోగము మేళములును


ఊరుబిందులు చిల్లర వారలెల్ల


మేలు అప్పాజి ఊరిన మిరపకాయ.




అంటూ రాయలవారి ఆస్థానాన్ని షడ్రుచోపేతంగా చేసారు. అష్టదిగ్గజాలు ఎనిమిద రకాల ఆవకాయలు కాగా, అల్లసాని పెద్దన్న కందిపప్పు, రామలింగడు చారు, భట్టుమూర్తి పరమాన్న పాత్ర, తిమ్మరాజు నేతిగిన్నె, పారాజవాన్లు రమ్యమైన పచ్చళ్లు, చోపుదారులేమో అప్పడాలు, వడియాలు అయ్యారు. ఇక సంగీత పాటగాళ్ల సంగతి వస్తే వాళ్లేమో పప్పుకూరలు, భోగం మేళగాళ్లు మెంతిపెరుగులు, చిల్లర వాళ్లు ఊరుబిందెలవలె నుండగా అప్పాజీ ఐతే ఊరిన మిరపకాయ అని పోల్చారు. ఆహా ఏమి ఘుమఘుమలో కదా. ఇది వింటేనే నోరూరిపోతుంది. కాదంటారా? రాయలవారి సంగతి తర్వాత ముందు ఈ పదార్థాలన్నీ ఎవరైన వడ్డిస్తే బావుండు అని అనిపించక మానదు.



రాయలవారి మాట వచ్చినందుకు ఆయన రచించిన ఆముక్తమాల్యదలో విష్ణుచిత్తుని ఆతిధ్యం ఎలా మరువగలం? ఆయా కాలాలకు అనుగుణంగా ఆహారాన్ని తయారుచేసి వడ్డించేవాడు ఆ మహాత్ముడు.



చ. గగనము నీరుబుగ్గ కెనగా జడివట్టిననాళ్లు భార్య కన్
బొగ సొరకుండ నారికెడంపుంబొఱియ ల్దవిలించి వండ న
య్యగపల ముంచిపెట్టుఁ గలమాన్నము నొల్చినప్రప్పు నాలు గే
న్పొగపినకూరలున్ వడియముల్ వరుగుల్ పెరుగున్ ఘృతప్లుతిన్




వానాకాలంలో నీరు తీసేసి ఎండబెట్టిన కొబ్బరికాయల టెంకలతో పొయ్యి వెలిగించగా అతని భార్య వివిధ రకములైన శాకములు తయారు చేస్తుంది. ఆ టెంకాయ చిప్పలనే గరిటలుగా వరి అన్నము, పొట్టు తీసిన పప్పు బద్దలతో వండిన పప్పు, నాలుగైదు తాళింపుకూరలు, వడియాలు, వరుగులు, పెరుగు, నెయ్యితో కలిపి అతిథులకు వడ్డించేవాడు విష్ణుచిత్తుడు.



చ . తెలినులివెచ్చ యోగిరముఁ దియ్యని చారులుఁ దిమ్మనంబులున్
బలుచనియంబళు ల్చెఱకుపా లెడనీళ్లు రసావళు ల్ఫలం
బులును సుగంధిశీతజలము ల్వడపిందెలు నీరుఁజల్లయు
న్వెలయఁగఁ బెట్టు భోజనము వేసవిఁ జందనచర్చ మున్నుగన్



ఎండాకాలంలో ఐతే అతిథులకు ముందుగా చల్లబడడానికి చందనం ఇచ్చి,తర్వాత తెల్లని, గోరువెచ్చగా ఉన్న అన్నము, తియ్యని చారులు, మజ్జిగపులుసులు, పలుచని అంబలి, చెఱకు పాలు, లేత కొబ్బరికాయ నీళ్ళు, భక్ష్యములు, వివిధ రకములైన ఫలాలు, వట్టివేళ్ళు మొదలైనవాటితో చల్లబరిచి, సుగంధభరితం చేసిన మంచి నీరు, శరీరానికి వేడి చేయకుండా ఉండడానికి






ఊరవేసిన మామిడిపిందెలు, మజ్జిగ మొదలగు పదార్థములతో సుష్టుగా భోజనము పెట్టేవాడు.


మ.పునుఁగుం దావి నవౌదనంబు మిరియంపుం బొళ్లతోఁ జట్టి చు
య్యను నా దాఱని కూరగుంపు, ముకుమం దై యేర్చునావం జిగు
ర్కొనువచ్చళ్లును, బాయస్నానములు, నూరుంగాయలున్, జేసుఱు
క్కను నేయుం, జిఱుపాలు వెల్లువగ నాహారం బిడున్ శీతునన్.



ఇక గజగజ వణికించే చలికాలంలోకూడా ఎటువంటి లోటు చేయకుండా కమ్మని రాజనాల బియ్యంతో వండిన వేడి వేడి అన్నము, మిరియాల పొడితో తిరగమోత పెట్టగా చుయ్యిమనుచు ఘుమ ఘుమలాడే కూరలు, ముక్కులోని జలుబును కూడా తక్షణమే వదలగొట్టగల ఆవపిండి వేసి గుచ్చెత్తిన ఊరగాయలు, చేతి మీద పడగానే చుర్రుమనే వేడి నెయ్యి, గోరువెచ్చని పాలతో సుష్టిగా భోజనం పెట్టేవాడు.



ఇలా తన సౌలభ్యం గురించి ఆలోచించకుండా ఆతిధుల సౌఖ్యము, ఆరోగ్యము కూడా దృష్టిలో పెట్టుకుని పలురకములైన వంటకాలను వినయవిధేయతలతో వడ్డించి వారిని సంతృప్తి పరచేవాడు విష్ణుచిత్తుడు.

భోజనం సంగతి సరే మరి చల్లని సాయంకాలవేళ అందరికి గుర్తొచ్చేది, నోరూరించేది, అందరికి తెలిసినదే పకోడీలు. మరి పకోడీలు అనగానే అశువుగా పద్యాలల్లేసారు చిలకమర్తివారు.. అంత గొప్ప రుచి కదా..


వనితల పలుకుల యందున
ననిమిషలోకమున నున్నదమృతమటంచున్
జనులనుటెగాని లేదట
కనుగొన నీయందమృతము గలదు పకోడీ!



ఓ పకోడీ! స్త్రీల మాటల్లోనే అమృతం ఉందని ఈ లోకంలోని జనులంటారేగాని తెలుసుకుంటే నీలోనే అమృతం వుంది.



ఆకమ్మదనము నారుచి
యాకరకర యాఘుమఘుమ మాపొంకములా
రాకలు పోకలు వడుపులు
నీకేదగు నెందులేవు నిజము పకోడీ!



ఓ పకోడీ! ఆ కమ్మదనము, ఆ రుచి, ఆ కరకర ధ్వనులు, ఆ ఘుమఘుమలు, ఆ చక్కదనము, వడుపు, నీకే తగును గానీ మరెందులోనూ లేవు ఇది నిజము.



నీకరకర నాదముబు
మాకర్ణామృతము నీదు మహితాకృతియే
మాకనుల చందమామగ
నేకొనియాడెదను సుమ్ము నిన్ను పకోడీ!



నీ కరకర శబ్దాలే మా వీనులకు విందులు. నె సుందరమైన రూపమే మా కనులకు చందమామ. నిన్ను గురించి నేను గొప్పగా చెపుతుంటాను పకోడీ.


ఎందుకు పరమాన్నంబులు
ఎందుకు పలుపిండివంటలెల్లను హా! నీ
ముందర దిగదుడుపునకవి
యందును సందియము కలుగదరయ పకోడీ!



పరమాన్నము, రకరకాల పిండివంటలు ఎందుకు? నీ ముందు అవన్నీ నిస్సందేహంగా దిగదుడుపే. వాటికన్నా నీవే గొప్ప పకోడీ.


ఆరామానుజు డాగతి
పోరునమూర్చిల్ల దెచ్చె మును సంజీవిన్
మారుతి ఎరుగడుగాక య
య్యారే నిను గొనిన బ్రతుకడటనె పకోడీ!



లక్ష్మణుడు మూర్చపోయినపుడు హనుమంతుడు సంజీవి పర్వతాన్ని తెచ్చాడు గానీ నిన్ను తీసుకపోయి వుంటే బ్రతుకడంటావా పకోడీ!




పురహరుడు నిన్ను దినునెడ
కరుగదె యొక నన్నెనలుపు గళమున మరిచం
దురుడున్ దినిన కళంకము
గరుగక యిన్నాళ్లు యుండగలదె పకోడీ!



పరమేశ్వరుడు నిన్ను తినివుంటే ఆయన కంఠంలోని నలుపు పోయేది కదా! అలాగె చందురుడు నిన్ను తిని వుంటే ఆయనపై వున్న మచ్చలు ఇన్నాళ్లు వుండేవా పకోడీ!


కోడిని దినుటకు సెలవున్
వేడిరుమును బ్రాహ్మణులును వేధ నతండున్
కోడివల దాబదులు గప
కోడిందిను మనుచు జెప్పెకూర్మి పకోడీ!!



పూర్వము బ్రాహ్మణులు కోడిని తినేటందుకు అనుమతించమని బ్రహ్మను వేడుకోగా మీకు కోడి వద్దుగాని దాని బదులు పకోడీ తినమని చెప్పాడట. ఆ విధంగా వచ్చిందే " పకోడీ" మనకు అంటున్నారు చిలకమర్తివారు హాస్యానికి..


పకోడీలకు జతగా మిరపకాయ బజ్జీలు మరచిపోతే ఎలా??



"ఐదు గంటల వేళ ఆదారి వ్రెక్కగా చుయ్యుమనును, గూబ గుయ్యుమనును
పచ్చి మిరప కాయ, కచ్చి రేపెడియట్లు గుచ్చి చూచుచునుండు గుండెవైపు
శనగ కవచనూనె సలసలా వేగుచో, కడుపులో రసనాడి కదలసాగు
ముక్కకొరికినంత ముల్లోకములయాత్ర చేతకాసులు లేక చేయగలడు
ధనము వెచ్చించి కన్నీళ్ళు కొనగజేయు మిరప బజ్జీల రుచిని నే మరువలేను
ఒక్కటో, రెండు మంచిది, ఎక్కువైనా సచినుటెండూల్కరుడు మాకు సాటిరాడు"



చల్లనివేళ వేడి వేడి పకోడీలు, మిరపకాయ బజ్జీలు తింటే చాలా బావుంటుంది కాని వీటికోసం తప్పకుండా అవసరమైనది ఉల్లిపాయ.



" ఓ ఉల్లిపాయా! నమో యుల్లిపాయా! నినుం బూజగావింతు నీ వాసనల్లేక నే కూరయుం గూడ నేదో మరో మట్తి దిన్నట్టుగా దోచు ... మా కాంక్షలందీరచవే, పూర్వకాలంబులో రీతిగా కూరలన్నింటికిన్ కొత్త టేస్టుల్ ప్రసాదించు మా జిహ్వకుం దృప్తి చేయంగదమ్మా! నమస్తే నమస్తే నమస్తే నమః "



ఇప్పటికే భుక్తాయాసమైనట్టుంది.



పూగీ ఫలసమాయుక్తం


నాగవల్లీ దళైరుత్యమ్


కర్పూరచూర్ణ సంయుక్తం


తాంబూలమ్ ప్రతి గృహత్యామ్..



అంటూ చివరిగా తాంబూలం అందుకోండి...

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008