Friday, 27 February 2009

ఏమి సేతురా ???




పొద్దున్నే వేడినీళ్లు కడుపులో పడనిదే
మన బండి ముందుకు కదలనంటుంది
పాలు కొందామంటే పాతికి రూపాయలు లీటరంట
పాలుపోక బండి మీద మూడురూపాయల టీకానిచ్చా..


ఏమి సేతురా


పేపర్ తీసి చదువుదామంటే
ఏటుచూసినా పనికిరాని కబుర్లే
వాడిని వీడు తిట్ట, వీడిని వాడు తిట్ట
మధ్యలో ఎక్కడో మంచి వార్తలు వెతుక్కున్నా...


ఏమి సేతురా


ఈనాడు చదువుదామంటే సాక్షిని తిట్టే
జ్యోతి చూద్దామంటే సాక్షిని తిట్టే
సాక్షిని చూద్దామంటే వీళ్లిద్దరిని తిట్టే
ఎవరిని తిట్టని పేపరేదైనా ఉందా...


ఏమి సేతురా


పోనీ వార్తలు చూద్దామంటే అదో అయోమయం గోల
నాయకులు తిట్టుకున్నా, కొట్టుకున్నా అన్ని చానెల్స్‌లో అదే లీల
ఎక్కడైనా సంచలనం జరిగితే పది చానెల్స్ తిప్పినా అదే హేల
ఏ గోలా లేక హాయిగా చూసే న్యూస్ చానెల్ ఉందా???



ఏమి సేతురా



టీవీ చూద్దామంటే బుర్ర వాచిపోయే సీరియళ్లు
సినిమా కెళదామంటే అయోమయం కథలు
గుడికైనా వెళదామంటే అక్కడా లంచాల బాగోతం
ఎక్కడ చూసినా డబ్బు, అధికారందే రాజ్యం.


ఏమి సేతురా

Wednesday, 25 February 2009

ఫూల్ తుమ్హే బేజా హై ఖత్ మే



ప్రేమ కి సరియైన అర్ధం చెప్పగలరా.. ప్రేమలొ పడ్డవారి అవస్థలు ఎన్నో ఎన్నెన్నో.. ఇప్పుడంటే సెల్ ఫోన్లు, ఇ మెయిల్స్ ఉన్నాయి. కాని సుమారు నలభై ఏళ్ల క్రిందటి సంగతి చూస్తే.. ప్రేమికులకు ఉన్న ఒకే దారి ఉత్తరాలు. ఊహలన్నీ ఊసులుగా అందమైన అక్షరాలుగా మార్చి ఉత్తరాలు రాసుకునేవారు. అవి అవతలి వ్యక్తి భావాలను స్పష్టంగా వ్యక్తపరిచేవి. ఫోన్ ముచ్చట్లు పదే పదే వినలేరు కదా. కాని ఉత్తరాలు ఎన్ని సార్లైనా చదువుకోవచ్చు. ప్రేయసీ ప్రియులు ఏ దూరాన ఉన్నా ఈ ఉత్తరాలలోని మాటలు వారిని మరింత దగ్గర చేసేవనడంలో అతిశయోక్తి లేదు. ఆ ప్రేమలేఖలను ఏళ్ల తరబడి దాచుకున్న వైనాలు ఉన్నాయి. మనవళ్లు , మనవరాళ్లు పుట్టాక కూడా పెళ్లికాకముందు, పెళ్లైన కొత్తలో రాసుకున్న ఉత్తరాలు అప్పుడప్పుడు తీసి చదువుకుని మురిసిపోయేవారు ఎంత అదృష్టవంతులో కదా. అలాంటి ఓ అందమైన ప్రేమలేఖ ప్రహసనం 1968 లో విడుదలైన హిందీ చిత్రం "సరస్వతీ చంద్ర" లో నాయిక తన ప్రియుడికి (కాబోయే శ్రీవారికి) రాసిన ఉత్తరంలో ఫూలు కూడా పంపిస్తుంది. అదెందుకో చూద్దామా...


ఫూల్ తుమ్హే బేజా హై ఖత్ మే
ఫూల్ నహి మేరా దిల్ హై
ప్రియతమ్ మేరే ముజ్‌కో లిక్నా
క్యా యేహ్ తుమ్హారే కాబిల్ హై


లేఖతో పాటు పువ్వు పంపించాను.. అది పుష్పం కాదు నా హృదయం సుమా. అది నీకు సరియైనదా కాదా జవాబు ఇవ్వు ప్రియతమా అని అడుగుతుంది నాయిక. ఎంత అందమైన ఆలోచన కదా. అక్షరాలతో పాటు పూవులను పంపి అది అతడికి తగినదో కాదో అని సందేహపడుతుంది..


ప్యార్ చుపా హై ఖత్ మే ఇత్నా
జిత్నె సాగర్ మే మోతీ
చూమ్‌హి లేతా హాత్ తుమ్హార
పాస్ జో తుమ్ మేరి హోతీ


లేఖలో ఎంతో ప్రేమ దాగి ఉంది. అది సముద్రంలోని ముత్యాలంత. ఒకవేళ నువ్వు నా చెంతనుంటే నీ చేతులను ముద్దాడేవాన్ని అని జవాబిచ్చాడు నాయకుడు. ఉత్తరంలోని ప్రేమ సముద్రంలోని ముత్యాలలాగా వెలకట్టలేనిది, అనంతమైనది అని అతడు అంటున్నాడు.


నీంద్ తో తుమ్హే ఆతీ హోగీ
క్యా దేఖా తుమ్ నే సప్నా
ఆంఖ్ ఖులీ తో తన్‌హాయీ తీ
సప్నా హో న సకా అప్నా

నీకు నిద్ర వస్తుందేమో కదా (తనకు రావట్లేదని అర్ధమా) కలలో ఏం చూసావ్ అని అడుగగా... మెలకువ రాగానే ఒంటరితనం చుట్టుముట్టింది. కల నా స్వంతం కాలేదు . అని ప్రియుడు వాపోతున్నాడు.


తన్‌హాయీ హం దూర్ కరేంగే
లే ఆవో తుమ్ షహ్‌నాయీ
ప్రీత్ బడాకర్ భూల్ న జానా
ప్రీత్ తుమ్‌హీనే సిఖ్‌లాయీ


నీ ఒంటరితనాన్ని నేను దూరం చేస్తాను . కాని తొందరగా మా ఇంటికి మేళతాళాలతో(పెళ్లిబాజాలతో వచ్చేయమని.. ఎంత ఆత్రుతో అమ్మాయికి) వచ్చేయ్ మరి అని సిగ్గుతో ఆహ్వానిస్తుంది ఇంతి. నాకు ప్రేమను పంచి మర్చిపోవుగా.. ప్రేమించడం అంటే ఏంటో నువ్వే కదా నాకు నేర్పింది ప్రియా అని బదులిస్తాడు అబ్బాయి.


ఖత్ సే జీ భర్‌తా హి నహీ,,
అబ్ నైన్ మిలేతో చైన్ మిలే
చాంద్ హమారే అంగనా ఉత్‌రే
కోయి తో ఐసి రైన్ మిలే


అదేంటో కాని ఉత్తరాలతో సంతృప్తిగా లేదు. ఇక మనం ముఖాముఖీ కలుసుకుని కళ్లతో ఊసులాడుకోవాలి అని ప్రియుడంటే ఎంతో ఆనందపడిపోయిన ప్రియురాలు మా ఇంటి ఆవరణలో దిగివచ్చే చంద్రునిలా నన్ను వచ్చి కలుస్తావా అని అంటుంది.



మిల్నా హో తో కైసే మిలే హం
మిల్నే కి సూరత్ లిఖ్ దో
నైన్ బిచాకే బైటే హై హం
కబ్ ఆవోగే ఖత్ లిఖ్ దో


అవును మరి మనం కలవాలంటే ఎలా కలిసేది? (అమ్మాయి కలవడానికి ఒప్పుకుందిగా ) ఎలా కలవాలో కూడా నువ్వే ఉత్తరం రాయి అని ఆమెనే అడుగుతున్నాడు. ( విషయంలో అమ్మాయికే ఎక్కువ ధైర్యం, ఉపాయాలు తెలుసనా.) నిజంగా వస్తారా. నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎప్పుడొచ్చేదీ ఉత్తరం రాయి సుమా అని ఆత్రుత పడిపోతుంది అమ్మాయి.


1968 లో విడుదలైన ఈ చిత్రం "సరస్వతీ చంద్ర" లోని ఈ పాట ఎంత అందంగా ఉందో కదా. అలాగే ఈ పాటలో అభినయించిన నూతన్, మనీష్ లు కూడా చాలా అమాయకంగా, అందంగా ఉన్నారు. పాట సాహిత్యంతో పాటు సంగీతం కూడా చాలా శ్రావ్యంగా ఉంటుంది. కల్యాంజీ, ఆనంద్‌జీ అందించిన మధురమైన సంగీతంలో లతా మంగేష్కర్, ముకేష్ పాడిన ఈ పాట ఎప్పటికీ నిత్యనూతనంగానే ఉంటుంది. నటీనటులు, సంగీతం, సాహిత్యం, గాయనీగాయకులు ... వేటికవే ప్రత్యేకమైనవి. అందమైన రంగు రంగుల పుష్పాలన్నీ కలిపి ఒక గుత్తిగా మరిచిపోలేని అనుభూతినిస్తుంది ఈ పాట.

Monday, 23 February 2009

వందే శివం శంకరం.




అందరికీ మహాశివరాత్రి శుబాకాంక్షలు.

Thursday, 19 February 2009

నిన్నోదల బొమ్మాలీ..

అన్నలకు , తమ్ముళ్లకు, అక్కలకు , చెల్లెల్లకు, అందరికీ నమస్తె చెప్తున్న. నేను గుర్తున్ననా. సరూపను. అప్పుడెప్పుడో బత్తీబంద్ అంటే మీతో కొన్ని ముచ్చట్లు చెప్పిన గదా. చాలా రోజులైంది మిమ్మల్నందరినీ కలిసి కదా. ఏం జేసేది. సంసారమన్నాక ఏదో ఒక పరేషానీ. మీకో సంగతి చెప్పనా. మా ఇంట్ల కూడ కంప్యూటర్, ఇంటర్నెట్ పెట్టించిన్రు. పిల్లలకు చాలా అవసరమంటే తప్పలేదు మరి. ఏం సదువులో ఏమో. సదువు సారెడు, బలపాలు దోసెడు అన్నట్టుంది . నేను కూడా కొంచం కొంచం నేర్చుకుంటున్న తెల్సా. బ్లాగులు కూడా సదువుతున్నా. నేను భీ ఒక బ్లాగు షురూ చేద్దమనుకుంట గాని, ఆ ఏం రాస్తంలే అని మళ్లీ ఊరుకుంటున్న. ఈ మధ్య ఇక్కడ కూడ లొల్లి ఐతుందని తెలుసు. అందరూ పరేషాన్ల ఉన్నరు. అందుకే మీకో మస్తు ముచ్చట చెప్దామని ఒచ్చిన.


మొన్నోసారి నేను, నా దోస్త్ రోషనారా కలిసి చార్మినార్ కాడ పని ఉండి పోయినం. చీరలు, గాజులు, ఇంక కొన్ని సామాన్లు కొనుక్కుని ఇంటికొచ్చి హమ్మయ్యా అని కూర్చున్నం. ముందు చాయ్ జేసుకుని తాగుతూ కొన్న సామాన్లు చూస్తుంటే పెద్ద నవ్వు వినిపించింది.


"హ .. హ.. హా"

"ఎవడ్రా అది ?"

"నేను పశుపతిని. గద్వాల నుండి వచ్చాను. నిన్ను వదలను."

"నువ్వు పశుపతివో , ఏట్లపతివో, ఎక్కడినుండొచ్చినవో మాకేం జేసేదుంది కాని. ఏం దమాక్ గిట్ల ఖరాబ్ ఐందా?

" హ..హ.. హా..నన్ను గుర్తుపట్టలేదా. నేను అఘోరీ బాబాను. అందరూ నేనంటే భయపడతారు. నేను చెప్పినట్టు వింటారు."

రోషనారా "నువ్వు ఆగు సరూప .. వీడి సంగతి నేను చూస్త. నువ్వైతే చాయ్ తాగు. "ఏం రా బద్మాష్.. నువ్వెవడైతే ఏంటి. నిన్ను గ్యాస్ నూనె పోసి కాల్చి, ఆ బూడిదకు ఘోరీ కడతా. చల్ నికల్"

"అర్రేయ్! అసలు నీ గురించి ఏమనుకుంటున్నవురా.. మంగలి షాపు ముందు సవరాలు అమ్ముకునే మొహం నువ్వు. నీకు భయపడాలా.. అసలు కథేంది చెప్పు."

" హ..హ..హా... నిన్ను వదల బొమ్మాలీ"

"బొమ్మాలీనా? ఓహో..రోషన్,, వీడు ఆ అరుంధతి సినిమానుండి వచ్చినట్టున్నాడు. వీడి సంగతి చూడాల్సిందే. (నువ్వు ఐపోయావురా ఇవాళ. నీ ఖర్మగాలి ఇక్కడికొచ్చినవ్ బిడ్డ)

"అబే సాలే .. నీ మొఖానికి అరుంధతి అంత సుందర్ లడ్కీ కావాల్సొచ్చిందిరా. నీ మొఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నవా?? తక్కెడ కింద చింతపండు పెట్టి దొంగ జోకుడు చేసి ఆ వచ్చిన పైసలతో గుడిలో అభిషేకం చేయించే పింజారీమొహం (సరూపా! ఇది రైటేనా?) నువ్వూ. నువ్వు మమ్మల్ని వదిలేంటిరా? అని రోషన్ రెచ్చిపోయింది. అది నాకంటే ఖతర్నాక్.


"ఏయ్! మీ అంతు చూస్తాను. జేజమ్మనే వదల్లేదు. మిమ్మల్ని కూడా వదలను. ఏంటి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు . అస్సలు భయం లేదా మీ ఆడోళ్లకు?"


"ఓరేయ్! ఏందిరా నీకు భయపడేది. మేము కూడా నీకంటె పెద్దగనే ఒర్లుతం తెలుసా. నోర్ముయ్.. ముయ్ అన్నా ముయ్.. ఎక్వ తక్వ నక్రాల్ చేసినవా.. నీకు పిల్లి బిరియాని పెడతా. ఎలుకల తందూరి చేసి పెడతా ఏమనుకున్నవో.. ఇంకా మాట్లాడితే ఈగలు, దోమలతో పకోడీలు ఏసి తినిపిస్తా..

"వామ్మో! మీరు ఏమంటున్నారు .. నాకు అర్ధం కావట్లేదు.. ఐనా నిన్నొదల బొమ్మాలీ?"


"చుప్.. మల్లీ బొమ్మలీ, అంటడు.. రోషన్ .. ఈడు ఇనేటట్లు లేదు. ఏం చేద్దమంటావ్?"


"సరూప. వీడిని కోసి బిరియాని చేద్దామా , కాళ్లతో పాయ, భేజా ఫ్రై, మిగతా సామాన్లు కలిపి శనగలు వేసి వండి జూలో పసువులకు దావత్ ఇద్దామా. వీడు పశుపతి అంటున్నడు కదా ?"


" అసలు నిన్ను ఆ జేజమ్మ అంత పెద్ద బంగళాలా పాతిపెట్టింది కాని, నిన్ను అసలు ఈ మూసీలో ముంచి పాతిపెట్టాలి. "


" అమ్మో ! నేను పోతాను. వదిలిపెట్టండి తల్లో?"

"ఆగు.. ఏంది పోయేది.. అసలు నువ్వేంటి, నీ అవతారమేంటి. ఎన్నేల్లైందిరా స్నానం చేసి. మా మూసి కూడా ఇంత కంపు కొట్టదు. నిన్ను లారీడు ఫినాయిల్ తో తానం జేయించినా నీ కంపు పోదు. చీ.. మల్లీ కనపడ్డవో.. ఇప్పుడు చెప్పినవన్నీ చేస్తా.. ఈ దండకం యాద్ పెట్టుకో అందాక తెలిసిందా.మళ్ళీ ఆడోళ్ళను సతాయించినవో??"


"నే పోతున్నా. ... పోయాను.."


"హ.. హ.. హా . భలే మజా వచ్చిందిలే రోషన్."


"ఔను సరూప. ఇగ నేను పోతున్న. రాత్రికి ఒంట జేయకు. మీ అన్న మటన్ బిరియాని చేయమన్నడు. బిరియాని, కుర్బానీ కా మీటా, మిర్చీ కా సాలన్ పంపిస్తా. ఒస్తా మరి."


"సరే.. ఖుదాహ్‌ఫీజ్"



ఇది ఎవరిని ఉద్దేశించి రాసింది కాదు. ఊరికే సరదాకి మాత్రమే చేసిన చిన్ని ప్రయోగం. ఎవరైనా నన్నే అన్నారు అని అనుకుంటే నేనేమీ చేయలేను. వారి ఖర్మ. గతంలో చేసిన కోతలరాణి లాంటిదే ఈ టపా. లైట్ తీసుకోండి.

Saturday, 14 February 2009

పారాహుషార్.... జాగ్రత్త పడండి .

గత కొద్ది రోజులుగా బ్లాగ్లోకంలో జరుగుతున్న సంఘటనలు మీకు తెలిసినవే. అనామక , అసభ్య దాడుల తర్వాత ఇప్పుడు సంతోషంగా స్నేహితుల్లాగా , కలిసి మెలిసి ఉంటున్న బ్లాగర్ల మధ్య అపోహలు సృష్టించడానికి కొత్త పద్దతి పాటిస్తున్నారు. మన ఐడి, బ్లాగు వివరాలతోనే చెత్త కామెంట్లు రాయడం. మన ఆలోచనలు, భావాలు, స్పందనలు పంచుకోవడానికి ఒక అందమైన గూడును ఏర్పరుచుకుని అందులో రాసుకుని మన మిత్రులు, శ్రేయోభిలాషులతో చర్చించుకుంటున్నాము. ఇది చూసి ఓర్వలేని ముష్కరులు ఇలా సాంకేతికంగా దాడి చేస్తున్నారు. అలాంటి వారిని ఎదుర్కోండి. జాగ్రత్త పడండి. మీ బ్లాగులోకి దొంగలు, ఊరకుక్కలు రాకుండా కాపాడుకోండి.

క్రింద బ్లాగులలో చెప్పిన జాగ్రత్తలు పాటించండి..

నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు

కొత్తపాళీ

చదువరి

ఇలాంటి వాటికి భయపడాల్సిన పనిలేదు. ఏ విదేశీ శక్తి లేదు, ఈ కుట్ర లేదు. ఓర్వలేని వారి పని. ఈ చిన్ని జాగ్రత్తలు పాటించి హాయిగా బ్లాగుతూ సాగిపొండి. ఎవరికో భయపడి బ్లాగు టపాలు, వ్యాఖ్యలు రాయడం మానుకోవద్దు.


నా బ్లాగు నా ఇష్టం, నేను ఎం రాస్తున్నానో నాకు తెలుసు, ఎవరికీ భయపడేది లేదు.. అని అందరూ అనుకోండి. అంతే. సింపుల్...

Friday, 13 February 2009

ఇరానీ చాయ్ - ఉస్మానియా బిస్కట్ హోజాయ్ !! ..


" ఆదాబ్. 1/2 చాయ్ అవుర్ ఉస్మానియా బిస్కూట్ లారే "

ఈ మాట హైదరాబాద్ పాతబస్తీలోని దాదాపు ప్రతీ కేఫ్ లోనూ వినపడుతుంది. ఇక్కడికొచ్చే వారు బిస్కట్లు తిని, టీ తాగడానికి మాత్రమే రారు. దానిని చుక్క చుక్కను ఆస్వాదిస్తూ, మధ్యలో గుండ్రటి ,మెత్తటి బిస్కట్లు లేదా చిట్టి చిట్టి సమోసాలు తింటూ, ప్రపంచం లోని ముఖ్య విషయాలన్నీ తీరిగ్గా మాట్లాడుకుంటారు. మిత్రులు కలిసి "హో జాయ్! ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కూట్ కే సాత్ " అని కేఫ్ లో సెటిల్ ఐపోతారు. ఇక వాళ్లకు లోకమే తెలియదు. ఎన్నో ముచ్చట్లు, కష్టాలు, చర్చలు... ఇలా ... ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కూట్ మజాయే వేరు. అది ఎంత ప్రయత్నించినా వేరే చోట దొరకదు. ఇంట్లో చేసుకోలేము. చిక్కటి చాయ్ చుక్క చుక్క చప్పరిస్తూ తాగుతూ, దాని రుచిని కూడా ఆస్వాదిస్తారు. అందుకే హైదరాబాదీ బిర్యాని తిన్నాక ఒక ఇరానీ చాయ్ పడనిదే తృప్తి ఉండదు అసలైన భోజనప్రియులకు. ఇక ఉస్మానియా బిస్కట్లు .. కాసేపు తీయగా, కాసేపు ఉప్పగా వెరసి గమ్మత్తుగా ఉంటుంది వీటి రుచి. కొంచం కొంచం కొరికి చప్పరిస్తూ, టీలో ముంచుకుని నోట్లో వేసుకుంటే అలా వెన్నలా కరిగిపోతుంది. అదో బ్రహ్మాండమైన రుచి. ఒకదానికొకటి జంటల ఉండాల్సిందే. పొద్దున్నే లేదా సాయంత్రం ఇరానీ చాయ్, నాలుగు ఉస్మానియా బిస్కట్లు లాగిస్తే ఎంతో శక్తి వచ్చినట్టు ఉంటుంది బద్ధకాన్ని వదిలిస్తుంది అని ఆ చాయ్ ప్రియుల నమ్మకం.

మీకు ఈ రుచి తెలుసా???

(నేనైతే ఈ ఉస్మానియా బిస్కట్లు కొనుక్కుని ఎవరికీ ఇవ్వకుండా దాచుకుని తింటాను :) . వీటి ముందు ఎంత పెద్ద బేకరీ నుండి తెచ్చిన బిస్కట్లు వేస్ట్ అని నా అభిప్రాయం..)

ఇంత అభిమానం పొందిన చాయ్ ధర ఐదు రూపాయలు . బిస్కట్లు మాత్రం రూపాయే.. వీటికి తోడూ మరొకటుంది. చిట్టి సమోసాలు. అది కూడా రూపాయే..

ఒకసారి ట్రై చేయండి మరి.. నా మాట ఒప్పుకుంటారు..

Wednesday, 11 February 2009

శ్రీవారి విచిత్ర అలవాట్లు


కొద్ది రోజుల క్రింద ఒక వ్యక్తి భార్యల మీద చేసిన రీసెర్చి గురించి చెప్పాను కదా. అలాగే భర్తల విచిత్ర అలవాట్ల గురించి కొందరి మహిళల ఇక్కట్లు ఇలా ఉన్నాయి. ఇది 20 నుండి 60 సంవత్సరాల శ్రీమతుల రిసెర్చ్ తర్వాత చేసిన కంప్లైంట్లు. ఇందులో ఎవరెవరి అలవాట్లు ఇలా ఉంటాయో నిజాయితీగా ఒప్పుకోండి. ఇది నేను బ్లాగ్లోకంలో కొచ్చిన కొత్తలో రాసిన టపా..

భార్యలలో కొందరు తమ భర్త విచిత్రమైన అలవాటును చూసి సందిగ్ధంలో పడుతూ ఉంటారు.ఒక్కోసారి భార్య అతని అలవాట్లకు ముగ్ధురాలు అయిపోతే ఒక్కోసారి తల గోడకేసి బాదుకుందామా అనిపిస్తుంది. కొందరు భర్తల కొన్ని విచిత్రమైన ఈ అలవాట్లు ఎలా ఉంటాయో చూద్దాం.


*


పెళ్ళి, పుట్టిన రోజు సంధర్భంగా విష్ చేయ్యడం మర్చిపోతారు.


*


తడి టవల్‌ని బెడ్‌పైనే వదిలేస్తారు అందులో వారికి తప్పేమి కనిపించదు.


*


ఇతరుల భార్యలలో అన్ని మంచి లక్షణాలే కనిపిస్తాయి. తన భార్య అంటే మాత్రం అలుసు.


*


భార్య ఇచ్చిన మంచి సలహా అందరి ముందు ఒప్పుకోవాలంటే వెనకముందు అవుతారు. కారణం అందరూ తనని ‘ భార్యాదాసుడు ‘అంటారేమో అని భయం.


*


పిల్లల్లో ఉన్న ప్రతి మంచికి తమను తాము పొగుడుకుంటారు. అదే చెడు అయితే అది భార్య నెత్తిన రుద్దుతారు.


*


భార్య పుట్టింటి వారు ఇంటికి వస్తే ‘ ఎన్ని రోజులు తిష్ట వేస్తారు ‘ అని అడుగుతారు.


*


భార్యతో ఎప్పుడైనా బజారుకు వెళితే తను భార్యకు ఎదో ఫేవర్ చేస్తునట్టు ముఖం పెడతారు లేదా శిక్ష అనుభవిస్తునట్టు ఫీలవుతారు.


*


60 ఏళ్ళ వయసులో కూడా ఇతరులు తమని ప్రేమించేలా మార్చుకోలేరు. పైగా భార్య మాత్రం ఎవరితో అయినా నవ్వుతూ మాట్లాడితే మాత్రం సహించలేరు.


*


తమ సరదాల కోసం వేల రూపాయలు ఖర్చు పెడతారు. కానీ భార్య బ్యూటీ పార్లర్ విషయం వస్తే మాత్రం డబ్బులు వృధా చెయ్యడం మంచిపని కాదు అని ఉపన్యాసాలు ఇస్తారు.


*


సాధారణంగా పురుషులు తమ స్వంత ఇంట్లోనే గెస్టుల్లా ఉంటారు. వాళ్ళకి ఎక్కడ ఏ వస్తువు,సామాను ఉందో తెలియదు. తమ నిత్యావసర వస్తువులైన షేవింగ్ మెటీరియల్, హండ్ కర్చీఫ్, సాక్సులు, పెన్ను, టై లాంటి వాటికి కూడా భార్యపై ఆధారపడతారు.


*


రాత్రి చంటిపిల్లాడు పక్క తడిపి ఏడుసుండడం తెలిసీ నాపీ మర్చడం తమ పని కాదనుకుంటారు. అలిసిపోయి నిద్రపోతున్న భార్యను లేపడం మాత్రం తమ కర్తవ్యం అనుకుంటారు.


*


పరాయి స్త్రీలు తమను పొగుడుతుంటే ఉబ్బి తబ్బిబ్బైపోతారు,అదే తమ భార్యలను ఎవరు పొగడొద్దు.


*


భార్యతో జుట్టుకు రంగు వేయించుకోవడం, తలకి నూనె రాయించుకోవడం, ఒంటికి మర్ధన చేయించుకోవడం తమ జన్మహక్కుగా భావిస్తారు. భార్యకు నిజంగా తలనొప్పి వస్తే తలకు బామ్ రాయడానికి మాత్రం వారి అహం అడ్డు వస్తుంది. పైగా టీ తాగు తగ్గిపోతుంది నాక్కూడా ఓ కప్పు ఇవ్వు అంటారు.


*


ఈ రోజు వంట చేసే మూడ్ లేదని భాయ అంటే భర్త వెంటనే ‘ మటాన్ పులావ్,టమాట పప్పు, నాలుకు చపాతీలు, గోంగూర పచ్చడి, కొంచెం సలాడ్ మాత్రం చేయి చాలు, ఈరోజు వీటితో సరిపెట్టుకుందాము. అంటాడు.


*


భార్య పుట్టింటి వాళ్ళు వస్తే మనసు విప్పి మాట్లాడరు. కాని భార్య మాత్రం అత్తింటి వాళ్ళు వచ్చినప్పుడు పువ్వులాగా వికసించిన ముఖంతో అతిథి సత్కారాలలో మునిగిపోవాలి అని ఆశిస్తారు.


*


దిగులుగా ఉన్న భర్త ముఖం చూసి భార్య ‘ ఆఫీస్‌లో ఎదైన టెన్షనా ‘ అని అడిగితే ‘ నీకు అర్ధం కాదులే ‘ అని అంటారు. ఇలా అన్నారు కదా అని ఇంకొకసారి అడగకుండా ఉంటే ‘నేనెందుకిలా ఉన్నాను అన్ని నీకు కొంచెం కూడా పట్టదు ‘ అని అంటారు.



ప్చ్ ...

Monday, 9 February 2009

తప్పా... ఒప్పా.... కాస్త చెప్పరూ???

నిన్న టీవీలో సద్గురు జగ్గీ వాసుదేవ్ ఒక కార్యక్రమంలో ఇలా చెప్పారు. Spiritual Process is not just going to temples .. i dont go to temples but i have intimate relationship with Shiva..

ఈ మాటలు విన్న నాలో మెదిలిన ఆలోచనా తరంగాలు...

దేవుడు అంటే ఏంటి? నేను భక్తురాలినా కాదా? నేను దేవుడిని నమ్ముతున్నానా లేదా. నేను ఒక తెలుగింటి గృహిణినా కాదా?... మనకంటే చాలా ఉన్నతుడు సర్వాంతర్యామి , అద్భుత శక్తి ఉంది. ఆ శక్తికి మనం ఇష్టమొచ్చిన పేర్లతో పిలుచుకోవచ్చు. కాని ఆ శక్తి ఉంది అని మనఃస్పూర్తిగా నమ్మాలి. అది ఏ రూపమైనా కావొచ్చు. ఇదీ నేను నమ్మేది. పండగలన్నీ సంప్రదాయబద్ధంగా చేస్తాను. కాని నోములు, వ్రతాలు మాత్రం చేయను. భర్త చల్లగా ఉండాలని మంగళగౌరీ వ్రతం చేయడం కంటే ఆ భర్తకు తోడూనీడగా , కుటుంబ అవసరాలలో చేయూతనిస్తూ గొడవలు పెంచకుండా ఉండడం మంచిది కదా. నాకు తెలిసిన ఒకావిడ భర్త, అత్తామామల మీద గృహ హింస క్రింద కేసు పెట్టి, భర్తను జైలుకు పంపించి ఇప్పుడు( కేసులన్నీ కొట్టేసారు లెండి) మంగళ గౌరీ వ్రతం చేస్తుంది. అది చూసి నాకు చిరాకేస్తుంది. ప్రతి సంవత్సరం మా చుట్టాల్లో చాలా మంది సంక్రాంతికి నోము, వినాయక చవితికి నోములు చేస్తుంటారు, ఆపసోపాలు పడి. ఎందుకు? అంటే భర్త పిల్లలు చల్లగా ఉండాలి అని. అంత భయంగా, బలవంతంగా చేయాలా?? ఆ వ్రతాలు చేయకుంటే నిజంగా కీడు జరుగుతుందా??

అందరికీ కష్టాలుంటాయి. లేకున్నా కూడా గుడికి వెళ్లి ప్రశాంతంగా కొద్ది సేపు కూర్చుని సేద తీరాలని అనుకుంటాము. ఆ దేవుడికి మన శక్తి కొలది పూజలు చేసి తరించాలని అనుకుంటాము. కాని ఇప్పుడు ఎక్కడ చూసినా దోపిడీ. భక్తులు, దేవుడు తప్ప అందరూ దోచుకునేవారే. స్వార్ధపరులే. ఎవరి ఎలా లూటీ చేద్దామా అని చూస్తుంటారు. ఇక అష్టకష్టాలు పడి ఆ దేవుడి దగ్గరకు వెళ్లినా లాభం ఉండదు. తనివితీరా ఆ దేవదేవుడిని చూసుకోవాలన్నా కుదరదు. అంతా మెకానికల్‌గా లైన్లో వెళ్లడం, అలా ఒకసారి చూసి రావడం. లంచాలు ఇస్తే మాత్రం ఎక్కువసేపు దేవుడిని చూడొచ్చు. ఇలాంటి వాటివల్ల ఏ పుణ్యక్షేత్రానికెళ్లాలన్నా చిరాకేస్తుంది. ఏం చేసేది??

ఇక జాతక దోషలు ఉంటే వాటి నివారణకు జాతి రత్నాలు, పూజలు చేయాలంటారు. కాని ఆ రత్నాలు కూడా చాలా ఖరీదు. పూజలు కూడా తక్కువేమి అడగరు. మరి ఇంట్లో గడవడానికే కష్టంగా ఉంటే ఆ రత్నాలు ఎలా కొనుక్కునేది? ఎలా ధరించేది. ఆ పూజలు చేయిద్దామంటే కూడా ఆ పూజారి అదో డ్యూటీలా చేసేసి దక్షిణ పుచ్చుకుంటాదు. next అంటూ. సరే .. రోజూ ఇంట్లో స్తోత్రాలు, మంత్రాలు, పద్ధతి ప్రకారం పూజ చేయాలంటే అందరు ఆడవాళ్లకు కుదరదు కదా ఈ బిజీ బిజీ లోకంలో. పిల్లలు, స్కూలు, భర్త ఆఫీసు, తన ఉద్యోగం. అలా చేయలేకపోతే ఆ దేవుడికి కోపమొస్తుందా?? పొద్దున్నే పూజరూమ్‌లో కూర్చుని ప్రశంతంగా ఆరాధించే సమయం లేదు. వాటికంటే ఇంటి విషయాలే ముఖ్యమనిపిస్తుంది. ఏం చేసేది??

గుడికి వెళ్లకున్నా , నేను మనఃస్పూర్తిగా దేవుడిని నమ్ముతాను. అతను నాకు ఎల్లప్పుడూ తోడుంటాడు. నాకు అవసరమైనప్పుడల్లా మానసికంగా ధైర్యమిస్తాడు అని నా గట్టి నమ్మకం.

నేను చేసేది తప్పా?? ఒప్పా??

Saturday, 7 February 2009

మాతృహృదయం

ఓ తల్లి బిడ్డల పట్ల చూపించే మమకారం చవిచూసినప్పుడు ఈ ప్రపంచంలో నిర్వచనాలకు దొరకని అత్యుత్తమమైన బంధం తల్లీబిడ్డలదేననిపిస్తుంది. బిడ్డలను లాలిస్తూ, చిన్న విషయాలకే కలతపడే పసి హృదయాలను ఊరడిస్తూ, కధలు చెబుతూ, వారి బుల్లి మనసులోకి తాదాత్మ్యం చెంది సర్వస్వం వారే తానై బ్రతికే మాతృమూర్తిని చూస్తే.. సృష్టిలోని కరుణంతా తల్లి మనసులో ఒలకబోశాడా భగవంతుడు అన్న మధురమైన భావన కలుగుతుంది. బిడ్డలను తన మీద తన కన్నా ఎక్కువ మక్కువతో అక్కున చేర్చుకుని సాకే తల్లి అనుక్షణం వారి బాగోగులకు పడే ఆరాటం అనిర్వచనీయమైన అనుభూతికి లోను చేస్తుంది. సందేహమే లేదు. సాధారణ మనుషుల్లో దైవత్వం అంటూ ఎక్కడైనా ప్రతిష్టించబడి ఉందీ అంటే అది మాతృహృదయన్లోనే ! సామాజికంగానూ , కుటుంబపరంగానూ ఎన్నో వత్తిడులను పంటి బిగువునా భరిస్తూ కూడా మాతృమూర్తులు బిడ్డను ఉన్నతంగా పెంచాలని పడే కష్టంలోనూ, పసిబిడ్డల బోసినవ్వుల్ని మనసారా ఆస్వాదిస్తూ తమ వ్యధల్ని మైమరిచే సందర్భాలనూ చూస్తే ఆ మాతృమూర్తుల ఔన్నత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.. కానీ తల్లుల ఆరాటం గమనించేటంత తీరుబడి మనకెక్కడ ఉంది? అందరూ బిడ్డలను కనట్లేదా?.. ఇందులో ప్రత్యేకత ఏముంది.. అనుకుంటూ తల్లీబిడ్డల అనుబంధాన్ని చాలా తేలికగా తీసుకోవడం పరిపాటైపోయింది. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. తన అనుకున్న బిడ్డ కోసం తల్లి మనసు పడే తపనని పరిశీలించి, దాన్ని మన మనసులోకి స్వీకరిస్తే ఇతర సామాజిక బంధాల్లో అదే స్థాయి మానవత్వం ఎంతో కొంత చూపించగల సున్నితత్వం, ఆత్మీయభావన మళ్లీ మనం పొందగలుగుతాము. మనిషిగా పుట్టిన తర్వాత ఆర్ధికంగా, సామాజికంగా ఎదగడమే ముఖ్యం కాదు. అన్నింటికన్నా... మనిషిగా మన వంతు ముద్రని నిలుపుకోవడం అత్యంత ప్రధానమైనది. ఇలాంటి అద్భుతమైన గుణాలు నేర్చుకోవడానికి మాతృహృదయాల్ని మించిన బంధం ఏదీ లేదు.. "బాబూ.. బాగున్నావా..." అంటూ ముసలవ్వ ఆర్తితో అడిగే ప్రశ్నలోనూ జీవితకాలంపాటు గుర్తుంచుకోదగ్గ ఆత్మీయత దాగి ఉంటుంది. 'ఇవన్నీ చిన్న చిన్న విషయాలు.. ఏమున్నాయి వీటి ప్రత్యేకతలు' అనుకుంటూ నిబ్బళంగా సాగిపోయామంటే మనలో స్పందించే హృదయం ముడుచుకుపోయినట్లే! మాతృమూర్తి గురించి పాటలు, కథలు, కవితలు చదివినప్పుడు మనసు పులకరించిపోతుంది. చివరకు అదే మాతృమూర్తి 'బువ్వ తిన్నావా బిడ్డా' అని మన క్షేమం కోరితే కసురుకుని 'నీకెందుకే' అని సాగిపోయేలా తయారైపోయాం. మనం ఎంత గాయపరిచినా 'పిచ్చి వెదవ... ఎలా బ్రతుకుతాడో; అని మనసులో దిగులు పెంచుకుని కుంగిపోయే పాటి విశాల హృదయం తల్లికే ఉంది. మన అమ్మ మాత్రమే కాదు. మహిళల్లో సహజసిద్ధంగా కన్పించే ఆ మమకారాన్ని చవి చూస్తే మహిళామణులకు చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. నా చిన్నతనంలో గతించిన జ్ఞాపకమైన నా తల్లిని తలుచుకుంటూ అనుక్షణం కన్పించే మాతృహృదయాల ఔన్నత్యాన్ని మనసులో నింపుకుని...

మీ
నల్లమోతు శ్రీధర్

Friday, 6 February 2009

నేనింతే ... మారనుగాక మారను....

ముందుగా అందరికీ నా క్షమాపణలు. అనాలోచితంగా నా బ్లాగులు మూసేసినందుకు. వారం రోజులుగా జరుగుతున్న హేయమైన దాడులతో చాల బాధగా ఉండింది. నా మీద కక్షతొ ఇంత నీచానికి దిగుతారని ఎప్పుడూ అనుకోలేదు. కాని అలాంటివాటిని పట్టించుకోవడం ఎందుకు అని అలా వదిలేసి నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. కాని అవి రోజు రోజుకు శృతి మించుతున్నాయి. నా బ్లాగులోని పోస్టులను తీసుకుని వాటిని అశ్లీలకరంగా రాస్తుంటే తట్టుకోలేకపోయాను. బాధతో నా బ్లాగులన్నీ మూసేసాను. కొందరు బ్లాగర్లు నాకు ధైర్యం చెప్తూనే ఉన్నారు. కాని నేను బ్లాగు మూసేసాను అని తెలిసిన ఇద్దరు ముగ్గురు బ్లాగర్లు నన్ను తిట్టారు.. వా... వా.. అవును ... కాని నాకు భలే ముచ్చటేసింది. నా మీద అంత చనువుతో చొరవ తీసుకుని నా గురించి నాకు తెలియచేసినందుకు. సో...

నా గురించి లక్షలమందికి తెలుసు. నా రాతలు వేలమంది చదువుతారు. వందలమంది నన్ను నా రచనలను మెచ్చుకుంటారు. ప్రోత్సహిస్తారు. అలాంటి నేను ఓ నలుగురైదుగురి చెత్త వాగుడుకు భయపడి బ్లాగులు మూసుకోవాలా? నన్ను అభిమానించే ఏంతో మంది నాకేమీ కారా? ఈ రాతల వల్ల నాకు ఏమైనా నష్టం జరిగిందా?? నా గౌరవం తగ్గిందా? లేదే? మరి ఎందుకు నేను వెనకడుగు వేయాలి?? నాకు ఇష్టమైన పనులు ఎందుకు మానుకోవాలి?? never పేరు చెప్పుకోలేని ధైర్యం కూడా లేని వాళ్ల గురించి నేనేందుకు కలతపడాలి? అందుకే నిన్న రాత్రి నా బ్లాగులన్నీ తెరిచాను. నన్ను మానసికంగా గాయపరచాలని చూసిన వారికి ఒక హెచ్చరిక.. నేను నా బ్లాగు రాయడం ఆపను. ఒకవేల ఆపేసినా, సరియైన కారణం, అద్భుత విజయంతో ఆపేస్తాను.

ఇక నేను బ్లాగుల టెంప్లేట్లు మార్చేపని.. అసలు ఎవరి బ్లాగు, మెయిల్ వారి చేతిలో ఉండగా , ఎప్పుడో ఇచ్చిన పాస్‌వర్డ్ లతో నేనేదో చేస్తాను అని పిచ్చి ఆలోచన చేస్తున్నవారిని చూస్తే నవ్వొస్తుంది. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఈ బ్లాగ్ లోకంలోకి ఎలా వచ్చారో, కంప్యూటర్ ఎలా వాడుతున్నారో అర్ధం కాదు. ముందు ఆ పాఠాలు నేర్చుకోండి. ఐనా ఈ పాస్‌వర్డ్‌లు ఏమైనా క్రెడిట్ కార్డులా, స్విస్ బ్యాంక్ ఖాతాలా. వాటితో నేను లూటి చేసినట్టు ఓ తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. మీ రాతల వల్ల మమ్మల్ని బాధపెట్టాము., గెలిచాము అనుకుంటున్నారేమో, కాని అది మిమ్మల్నే అధః పాతాళానికి తొక్కేస్తుంది అని తెలుసుకోండి. ఆ రాతలు చదివి అందరూ మిమ్మల్ని అసహ్యించుకుంటున్నారు. మీ రాతలు మీ సంస్కారాన్ని స్పష్టంగా తెలియచేస్తున్నాయి. అవి చదివిన వాళ్లు మీరు ఆడవాళ్లకు ఎంత మర్యాద ఇస్తారో వారిని సమర్ధించినవారికి ఇంకెంత అపురూపంగా చూసుకుంటారో కూడా తెలుస్తుంది. అందరూ మీలాంటి మహానుభావులు ఉండరు అని గుర్తు పెట్టుకోండి.

ఇక ప్రమదావనం లోని మెయిల్స్ విషయం... ఆడాళ్ల వ్యక్తిగత గుంపులోకి కొంగేసుకుని వచ్చి మా వ్యక్తిగత మెయిల్స్ చదివి అదేదో ఘనకార్యం చేసినట్టు చెప్పుకుంటున్న వాళ్లనేమనాలి.. అంత దొంగతనంగా రావడంలో ఉద్దేశ్యమేంటో? ఇదేనా మీ వ్యక్తిత్వం. మీరు మాకు పాఠాలు, నీతులు చెప్తున్నారా? సరే ప్రమదావనంలోకి రండి. నలుగు పెట్టుకుని, పసుపు రాసుకుని మాతో పాటు అప్పడాలు చేద్దురుగాని. ఇప్పటికైనా మర్యాదగా ఎవరి మెయిల్ దొంగిలించి మా మాటలు చూస్తున్నారో అది మానుకోండి. లేదా నేనే ఆ వ్యక్తి గురించి చెప్పాల్సి వస్తుంది. గుంపులో కాదు. బ్లాగులోనే.. అది మీకే నష్టం. ఒకవేళ ప్రమదావనం మెయిల్స్ బయటకు చేరవేస్తున్న మహిళ ఉంటే వెంటనే గుంపును వదిలిపోండి.

ఈ దాడి నన్ను కొద్ది సేపు బేలను చేసినా ,, నన్ను మానసికంగా మరింత ధృడంగా చేసింది. నేను మరింత కసిగా రాయాలని నిశ్చయించుకున్నాను.... నేను ఎప్పటిలాగే ఉంటాను. మారను గాక మారను. నేనింతే.... నన్ను ప్రోత్సహించి, ధైర్యపరచి, ముందుకే నడిచేలా చేస్తున్న బ్లాగర్లందరికీ శతకోటి ధన్యవాదాలు..

Tuesday, 3 February 2009

దేవా .. దయ చూపుము...




అందరికీ ఒక విజ్ఞప్తి.. నేను ఎప్పుడూ శుభాకాంక్షలే చెప్తుంటాను కదా. కాని ఈసారి ఒక వ్యక్తి ఆరోగ్యం బాగాలేనందున ప్రార్ధిస్తూ అతను తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను.

అతని పేరు ప్రసాద్. హైదరాబాదులోనే ఉంటాడు. మంచి ఉద్యోగం. బాగా రాస్తాడు. అంటే మంచి ఆలోచనలు, రచనలు. కాని కొన్ని రోజులుగా వింత వింతగా ప్రవర్తిస్తున్నాడని తెలిసింది. అతను నాకు ఏమీ కాడు, నేను అతనికి ఏమీ కాను. కాని అంత మంచి రచయిత, మంచి ఉద్యోగంలో ఉన్నవాడు ఇప్పుడు ఇలా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని తెలిసి ఈ అభ్యర్థన చేస్తున్నాను. ఎందుకో బాలకృష్ణ రోడ్ షో కి వెళ్లాడంట. ఆ గుంపులో క్రిందపడి తలకు చిన్న దెబ్బ తగిలింది అంతే అప్పటినుంది ఇలా ప్రవర్తిస్తున్నాడు. ఎప్పుడు చూసిన అందరి మీద కోపం, అక్కసు. ఏమేమో వాగుతుంటాడు. మందులు టైం కి వేసుకోడు. నేను బానే ఉన్నాడంటాడు. అతని ఆలోచనలు రోజురోజుకు కుళ్లిపోతున్నాయి. అది ఆతని శరీరంపై ప్రభావం చూపకుండా ఉండాలని నా కోరిక.

"భగవంతుడా.. నా తమ్ముడులాంటి ప్రసాదును తొందరగా బాగుచేయి స్వామి "

మీరు కూడా అతను తొందరగా కోలుకుని ఆరోగ్యవంతుడవ్వాలని ప్రార్ధించండి...ప్లీజ్...

Monday, 2 February 2009

రాజమకుటం ...



అర్ధం కాని పాటలు, మాటలు, అసలు కథ అంటూ కనపడని నేటి సినిమాలతో విసుగెత్తినవారికి అలనాటి రాజమకుటం మరపురానిది అని చెప్పవచ్చు. ముఖ్యంగా జానపద కథలు ఇష్టపడేవారికి ఇది తప్పక నచ్చుతుంది. ముఖ్యంగా సడిసేయకో గాలి అనగానే అందరికీ గుర్తొచ్చేది రాజమకుటం చిత్రం. అందాల నందమూరి తారకరామారావు, ముద్దుగుమ్మ రాజసులోచన ముఖ్య తారాగణంగా నిర్మించబడింది.

Get this widget | Track details | eSnips Social DNA



వాహినీ పతాకం మీద, తెలుగులో, తమిళంలో ఏకకాలంలో నిర్మించిన ఒకే సినిమా రాజమకుటం.. ఎప్పుడు కూడా కళకు ప్రాధాన్యమిచ్చే బి.ఎన్.రెడ్డి తీసిన మొదటి మరియు ఒకే ఒక జానపద చిత్రం ఇది. భావుకుడి నెత్తిన బలవంతంగా బాక్సాఫీస్ ఫార్ములా బరువు పెడితే అది ఎలా వికటిస్తుందో తెలియచెప్పిన దాదాపు యాభై ఏళ్ల క్రిందటి సినిమా రాజమకుటం అని చెప్పవచ్చు.

అనాదిగా బలవంతులు బలహీనులను చేసే దోపిడీ, ఆ పీడిత ప్రజానీకం చేసే తిరుగుబాటు ఈ చిత్రం యొక్క ప్రధానాంశం..

అనగనగా గాంధార రాజ్యం. ఒక సమయంలో ఆ రాజ్యం విజయోత్సవాలలో ఓలలాడుతూ ఉంటుంది. భార్యాసమేతంగా ఆ వేడుకలను తిలకిస్తున్న మహారాజుపై ఒక ముసుగు వ్యక్తి దాడి చేసి హత్య చేస్తాడు. ఈ సంగతి తెలిసి గురుకులంలో విద్య నభ్యసిస్తున్న యువరాజు ప్రతాప్ తిరిగి వస్తుండగా అతని మీద కూడా హత్యాప్రయత్నం జరుగుతుంది. అది తప్పించుకుని స్పృహతప్పిన ప్రతాప్‌ను ప్రమీల అనే యువతి కాపాడుతుంది. ప్రతాప్ తనను ఒక పరదేశిగా పరిచయం చేసుకుంటాడు. ఈ హత్యా యత్నాలన్నీ చేసింది గాంధారరాజ్య సేనాని ప్రచండుడు. అతను మహారాజుకు స్వయానా తమ్ముడు, ప్రతాప్‌కు చిన్నాన్న . రాజమకుటం కోసం బంధుత్వాన్ని కూడా లెక్కచేయక ప్రచండుడు సాగించిన నరమేధమే ఈ కథలోని ముఖ్య అంశం. తన కుమారుడు బజరంగుడిని మహారాజును చేయడానికి అన్నకొడుకు ప్రతాప్‌ను చంపడానికి కూడా వెనుకాడడు ప్రచండుడు. ఈ క్రమంలోనే మహామంత్రిని కూడా హత్య చేయిస్తాడు. ఇలా హత్యలకు కారణమడిగిన ప్రతాప్‌కు , దేశంలోని రాజభక్తులందరినీ దేశద్రోహులుగా, విప్లవకారులుగా చూపిస్తాడు ప్రచండుడు. ఆవేశంలో ఉన్న ప్రతాప్ రాజద్రోహులను విచారణ లేకుండా మరణశిక్ష విధించమంటాడు. ప్రచండుడు వాళ్లందరినీ చంపించి ప్రతాప్ ఆదేశానుసారం జరుగుతుంది అని ప్రకటిస్తాడు. ఈ క్రమంలో ప్రతాప్‌పై మరోసారి హత్యా యత్నం జరుగుతుంది. కాని దాడి చేసినవాడు పట్టుబడి ఈ దుశ్చర్యలన్నింటికీ ప్రచండుడే కారణమని చెప్పి కన్నుమూస్తాడు.

అది తెలుసుకున్న ప్రతాప్ ఆవేశంతో చిన్నాన్నను చంపడానికి వెళుతుంటే తల్లి అడ్డగించి ఆలొచనతో ముందడుగు వేయమంటుంది. ప్రచండుని నరమేధంలో తండ్రిని పోగొట్టుకున్న ప్రమీల, తండ్రిని పోగొట్టుకున్న శూరసేనుడు ,మరి కొందరు బాధితులు కలిసి ఒక విప్లవదళం తయారు చేస్తారు. పట్టాభిషేక మహోత్సవంలో ప్రతాప్‌కు విషమిచ్చి చంపడానికి ప్రయత్నిస్తాడు ప్రచండుడు కాని తెలివిగా తప్పించుకున్న ప్రతాప్ పిచ్చివాడిలా నటిస్తాడు. "నల్లత్రాచు" అనే ముసుగు వీరుడి రూపంలో ప్రచండుడి అక్రమాలను అడ్డుకుంటాడు ప్రతాప్. అలాగే ప్రమీలను కూడా కాపాడతాడు. తను మెచ్చిన ప్రమీల పరదేశిని వరించిందని తెలిసి శూరసేనుడు ఆగ్రహంతో ప్రచండునితో చేతులు కలిపి తాను తీసుకున్న గోతిలో తానే పడి చనిపోతాడు.ప్రచండుని అరాచకాలను , అక్రమాలను అడ్డుకుంటున్న నల్లత్రాచు ప్రతాపేనని అందరికి తెలుస్తుంది. అతడిని చంపి తన కుమారుడికి పట్టం కట్టాలని ప్రయత్నించిన ప్రచండుని హతమారుస్తాడు ప్రతాప్. ప్రతాప్ ప్రమీలల వివాహంతో కథ ముగుస్తుంది.


రాజమకుటం చిత్రానికి మాస్టర్ వేణు సంగీత దర్శకుడు. ఈ సినిమాకు దేవులపల్లితో పాటు కొసరాజు కూడా పాటలు రాసారు. అలాగే బాలాంత్రపు రజనీకాంతరావు నాగరాజు అనే మారుపేరుతో రాసారు . అది "ఊరేది.. పేరేది.. ఓ చందమామా", ఇక దేవులపల్లి రాసిన మధురమైన, మరపురాని పాటలు ... "సడిచేయబోకే..(ఎన్నేళ్లయినా ఆకట్టుకునే పాట.) ఏడనున్నాడో. ఎక్కడున్నాడో." అలాగే జిక్కి గారు పాడిన "ఠింగన ఠింగన ఢిల్లా.." పద్మనాభం, వంగర వెంకట సుబ్బయ్యలమీద చిత్రీకరించిన "రారండోయి.. ద్రోహుల్లారా రారండోయ్ ".. ఇప్పటి ప్రముఖ దర్శకుడు విశ్వనాధ్ ఈ సినిమాకు రికార్డింగ్ - రీరికార్డింగ్ ఇంజనీరుగా పనిచేసారు. నాయకునిగా నందమూరి , నాయికగా రాజసులోచన, ప్రచండుడిగా గుమ్మడి, రాజమాతగా కన్నాంబ,శూరసేనుడిగా రాజనాల,బజరంగునిగా పద్మనాభం మొదలైనవారు తారాగణం.. రచయిత డి.వి.నరసరాజు, సంగీత దర్శకుడు మాస్టర్ వేణు, గుమ్మడి, రాజనాల,.. వీరందరూ బి.ఎన్.రెడ్డితో మొదటిసారి పని చేసారు

అయిష్టంగా, అన్యమస్కంగానే బి.ఎన్.రెడ్డి ఈ సినిమా నిర్మించారు. కాని ఆర్ధికంగా అంతగా లాభించలేదు. ఆయన తీసిన ఏ సినిమా ఐనా కథాపరంగానూ, కళాత్మక విలువల పరంగానూ అత్యున్నతంగా ఉంటుంది. కాని యాక్షన్ సినిమాకు తగ్గట్టుగా నాటకీయత, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపించడంలో ఆయన విఫలమయ్యారు. దానితో సినిమా దెబ్బతింది.

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008