టైటిల్ చూసి కంగారు పడుతున్నారా?? అదేం లేదండి. ఇవాల్టికి ఈ బ్లాగు "జ్యోతి" కి ఐదేళ్లు నిండాయన్నమాట. ఐదేళ్ల క్రింద సరదాగా మొదలెట్టిన నా బ్లాగు తడబడే అడుగులతో పయనిస్తూ ఇపుడు నిలదొక్కుకుని కాస్త నిలబడింది. ఈ పయనం అంత కష్టమైనదీ అనను, సులువైనదీ అనను. నిజ జీవితంలోలాగే ఇక్కడా ఎన్నో తప్పటడుగులు, ఆటుపోట్లు, మెచ్చుకోళ్లు, ఈర్ష్యలు... అన్నీ చూసాను. నా ఈ యాత్రలో నాతో కలిసి నన్ను ప్రోత్సహించి, ముందుకు నడిపించిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. ఎన్నో చెప్పాలని ఉంది ...
ముందుగా పాత వార్షికోత్సవాలు కూడా ఒకసారి తిరగేసి రండి..
ప్రధమ వార్షికోత్సవం ద్వితీయ వార్షికోత్సవంతృతీయ వార్షికోత్సవంచతుర్ధ వార్షికోత్సవం
కంప్యూటర్ అంటే ఒక డబ్బా టీవీ, టైప్ రైటర్ అని తప్ప వేరే తెలీని నాకు ఓపికగా ఎన్నో సాంకేతిక విషయాలను, ఎప్పటికప్పుడు, అడిగినప్పుడల్లా వివరంగా నేర్పించిన సాంకేతిక గురువు వీవెన్. నా పిచ్చి రాతలను రచనలుగా చేసుకోవడంలో ప్రోత్సహించి, తప్పులను ఎత్తి చూపి సరిదిద్దుకునేలా చేసిన సాహిత్య గురువు కొత్తపాళీగారు. ముందుగా వీరిద్దరికీ ఒక మంచి విద్యార్థినిగా నమస్సుమాంజలి.
తర్వాత చెప్పుకోవాల్సింది మా ప్రమదావనం స్నేహితురాళ్లను. మహిళా బ్లాగర్లతో ఒక గుంపు మొదలుపెట్టి అందరూ కలిసి మాట్లాడుకుని, సరదాగా గడపడానికి మొదలుపెట్టిన ప్రమదావనం సమాజ సేవలో కూడా పాలు పంచుకుంటుంది. వీరందరినీ ఒక చోట చేర్చాను, తెలియంది చెప్పాను తప్ప నేను ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. కాని వాళ్లంతా కలిసి నా ఇచ్చిన పుట్టినరోజు బహుమతి మాత్రం అద్భుతం, నిజంగా ఊహించలేనిది అని చెప్పవచ్చు. అసలు ఈ బ్లాగ్లోకంలో ఎవరికీ అలాంటి బహుమతి లభించి ఉండకపోవచ్చు. ఇన్ని రోజులకా ఈ విషయాన్ని చెప్పేది అంటే ఆ అభిమానపు జల్లులో తడిసి ముద్దైనాను. ఇంకా తేరుకోలేదు. తేరుకోలేను, మరచిపోలేను కూడా. అందరూ కలిసి గూడుఫుఠానీ చేసి నా కోసం ఎన్ని బహుమతులు ఇచ్చారో. వారి అభిమానం, ప్రేమనంతా అక్షరాలలో గుచ్చి ఒక మాలగా నాకు వేసారు. వారందరికీ మన: పూర్వక ధన్యవాదాలు. ఇంకా ఎన్నో చెప్పాలని ఉంది కాని మీ ప్రేమ ముందు అవన్నీ తక్కువే అనిపిస్తుంది.
అన్ని సమయాల్లో నా బ్లాగు ప్రయాణంలో తోడుండి ప్రోత్సహించిన మరి కొందరు మిత్రులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.
నాగరాజు పప్పు,
నల్లమోతు శ్రీధర్,
సత్యసాయిగారు,
చావా కిరణ్,
కల్పన రెంటాల,
అఫ్సర్ గారు,
తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యంగారు,
సుజాత,
కస్తూరి మురళీకృష్ణ ,,
వరూధిని,
ఉమ,
ఉష.. ఇంక బజ్జు మిత్రులకు కూడా బోల్డు థాంక్సులూ..
ఈ సంవత్సరం కొందరు ప్రముఖ వ్యక్తులతో పరిచయం కలిగి ఆత్మీయ స్నేహంగా మారింది. ఏన్నో ఏళ్లనుండి అభిమానించిన వ్యక్తులతో మాట్లాడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. వారిలో కార్టూనిస్ట్ జయదేవ్ గారు, ఇలియాస్ అహ్మద్ గారు, రచయిత మల్లాది గారు, ఆర్టిస్ట్ అక్బర్ , ఘంటసాల గారి అమ్మాయి శ్యామల ... వీరందరితో నన్ను నేను పరిచయం చేసుకుని మాట్లాడతానని కల్లో కూడా అనుకోలేదు. కాని అదంతా నిజమైంది..ఆంతా ఆ అమ్మ లీల.
అందరికంటే ఎక్కువగా నేను ధాంక్స్ చెప్పుకోవాల్సింది నా బ్లాగు “ జ్యోతి” కే. నన్ను నేను పరిశీలించుకుని, విమర్శించుకుని, విశ్లేషించుకునేలా చేసి ఆ భావాలను అక్షరాలలో నిక్షిప్తం చేసుకునేలా చేసింది. ఎన్నో అందమైన భావాలకు నిలయమైంది. వివిధ సందర్భాలలో నా సంఘర్షణ, నా స్పందన అన్నీ తనలో దాచుకుంది. అప్పుడప్పుడు నాలోని వేదనకు, ప్రశ్నలకు చర్చావేదికగా మారింది.. నాకు నచ్చిన పాటలతో సరాగాలాడింది. అందుకే నిరంతరం నన్ను నేను నా బ్లాగులో చూసుకుంటూ ఉంటాను....
ఇక్కడ మరో వ్యక్తి గురించి చెప్పాలి. కాస్త ప్రమాదకరమైన వ్యక్తే.. ఉండండి బయట అన్ని గడియలు వేసి వస్తాను..అతని గురించి ఎప్పుడూ చెప్పలేదు. కాని అతనితో చాలా గొడవలు కూడా జరిగాయి. అయినా అతనికి థాంక్స్ చెప్పకుండా ఉండలేను.. నాకు ప్రమాదమని తెలిసిన ఒక విషయం చెప్పాలి. అసలు మలక్ బ్లాగులోకంలోకి వచ్చింది నా మూలంగానే.. నన్ను కెలకడానికి వచ్చాడు అప్పుడెప్పుడో. తర్వాత పరిచయం కలిగి , స్నేహం పెరిగింది. కాని చివరికి నావల్లే కెలకబడ్డాడు పాపం.. అందుకే పెద్దలు చెప్పారు ... (... ఇది మీకు తెలుసు...)... అతని స్నేహం వల్ల నాకు కొన్ని రౌడీ వేషాలు అబ్బాయి లెండి. ముఖ్యంగా తప్పు చేయనప్పుడు బాధపడకూడదు, ఎవరికీ భయపడకూడదు, లెక్క చేయకూడదు అని.. పాపం పాపాయి మాత్రం ఇరుక్కుపోయాడు. ఎలా అంటారా?? వాళ్ళ అమ్మగారిని నాకు పరిచయం చేసాడు. ఇంకేముంది...ఇక్కడ ఏం గొడవ చేసినా న్యూస్ అక్కడికి వెళ్ళడానికి ఎంతో సమయం పట్టదన్నమాట..:)) ఆ సదవకాశం నేను ఇంకా వినియోగించుకోలేదు లెండి.........థాంక్స్ భరద్వాజ్..
మీ అభిమానం, ప్రేమ , ప్రోత్సాహం ఇలాగే ఉండాలని కోరుకుంటూ నా పయనాన్ని కొనసాగిస్తున్నాను.
నమస్తే........