Monday, November 26, 2007

బ్రేవ్

మంచిపొద్దుగల. అందరికీ నమస్తె చెప్తున్నా. నేనండి సరూప. చాలారోజులైంది మిమ్మల్ని పలకరించి.అందరూ బాగున్నరా? రొండు నెళ్ళనుంచి ఒకటే పండుగలు. అస్సలు తీర్తలేదు. ఏం చేయను? సరేగాని మీకొక మస్తు ముచ్చట చెప్పనీకి వచ్చిన. ఇది కార్తీక మాసం కదా. అందరూ వనభోజనాలు అని వెల్తారు కదా.అదేనండి చెట్లకిందికి పోతరు. మొన్న ఆదివారం మేము కూడా మా దగ్గరి చుట్టాలు, దోస్తులు, పిల్లలలందరిని తీసుకుని చెట్లకిందికి పోయినం.పోరలకు కూడా ఆర్నెల్ల పరీక్షలొస్తున్నాయి. ఇట్లనన్నా అందరు కలిసినట్టుంటదని అనుకుని అందరం కలిసి సోచాయించినం. నాలుగు రోజుల ముందునుండే తినే వస్తువులు చేసుకున్నమ్. మా ఆడబిడ్డ వడప్పలు, మురుకులు,పులిహోర చేసుకొస్త అంది. మా యారాలు తన కోడండ్లతో కలిసి సొజ్జపోలెలు,సన్నసేగు,రవ్వలడ్డు చేయిస్త అంది. మా మరదలు మసాలాపూరీలు,లడ్డులు చేస్తా అంది. ఇగ నేను ఆరోజు ఒంట సంగతి చూసుకుంట అన్నా. రెండు రోజులముందే అన్ని మసాలాలు, ఇస్తరాకులు,గ్లాసులు,నీళ్ళక్యానులు, గిన్నెలు,జంబుఖానాలు అన్ని తీసిపెట్టుకున్నా. ఆదివారం పొద్దుగల్ల ఏడింటివరకు అందరిని మా ఇంటికొచ్చేయమన్నాము. మొత్తం పిల్లజెల్లా అందరు కలిసి ముప్పై మందిమి ఐనం. నాలుగు కార్లు,ఒక వ్యాను మాట్లాడుకుని సామాన్లు అన్ని బండ్లల్ల ఎక్కించి ఎనిమిదికల్లా బయలుదేరినం. మా తమ్ముని దోస్తుది బగీచ ఉందంటే వెళ్ళాం చిల్కూర్ గుడికెల్లే దారిల. మధ్యలో చలేస్తుందంటే ఒక చాయ్ దుకాణంల అందరం చాయ్ తాగినం. ఇగ అన్ని బండ్లల్ల పిల్లలది ఒకటే లొల్లి, పాటలు, మాటలు. బగీచ రాగానె దిగి జల్ది జల్ది అన్ని సామాన్లు దించేసుకుని చెట్లకిందికి పోయి కూర్చున్నాం . ఆడాలందరు ఒక దిక్కు, మొగోల్లందరు ఒక దిక్కు, పిల్లలందరు ఒక దిక్కు జంబుఖానాలు పరుచుకుని కూర్చున్నరు.


ముందుగల్ల మొగోల్లకు, పోరలకు పూరీలు, ఆలుగడ్డ కూర ప్లేట్లల్ల పెట్టిచ్చి ,తెచ్చిన అప్పలు మురుకులు కూడా ఇచ్చి,నీళ్ళ క్యాను వాళ్ళముందు పెట్టేసాం. అందరం ఆడోళ్ళం కలిసి మద్యాన్నం ఒంట కోసం సామాన్లు తీసి పెట్టుకున్నం.రెండు గంటలలో మాట్లాడుకుంటూ ఒంట చేసేసినం.ఏం జేసినమో తెలుసా?? పాలకూరపప్పు,పచ్చిపులుసు,మసాలొంకాయ,బెండకాయ ఏపుడు,చింతకాయ తొక్కు,సల్లచారు బజ్జీలేసి,నిమ్మకాయ తొక్కైతే ఇంట్లకేలి తెచ్చినం, గారెలు,సాబుదాన పాయసం, పాపడాలు, ఒడియాలు . ఒంటిగంటకు అందరిని పిలిచి ఇస్తరాకులేసి అన్ని ఒడ్డించాము. అందరు నవ్వుకుంట,ముచ్చట్లాడుకుంట ఖుషీఖుషీగా తిన్నరు. వాళ్ళందరు తిన్నక మా ఆడవాళ్ళము కూర్చుని మెల్లిగా రెండుగంటలు తిన్నం మాట్లాడుకుంట. మొగోల్లేమో పత్తలాడుకుంట కూర్చున్నరు.పిల్లలేమో ఆటలాడుతూ బగీచ అంత తిరిగొచ్చిన్రు. ఇగ మెల్లిగా చీకటైతుంది. సలి మొదలైంది. ఇంటికి పోదామని అన్ని సదురుకుని నవ్వుకుంటా ఒచ్చేసినం. మల్ల ఒచ్చే ఏడాది ఇట్ల కలుస్తమేమో?

ఇది సదూతుంటే నోట్ల నీళ్ళొస్తున్నయిలే! ఇంటికెల్ళి ఒదినమ్మలకు చెప్పి చేయించుకోండి.ఇంకా లగ్గం కానివాళ్ళుంటే కొనుక్కొని తినేసి బ్రేవ్ అనండి.అంతే!!!!

11 వ్యాఖ్యలు:

క్రాంతి

మస్తుగ చెప్పినవ్ సరుప,కాని నడిమిట్ల ఆంద్రోల్ల బాషల చెప్తివి అగో పరేషాన్ చెస్తివి.ఇంటి పక్కపొంటి ఆంద్రోల్లెవరన్న ఉన్నరాఏంది?

జ్యోతి

ఏం జెయ్యాలే క్రాంతి, నువ్వు చెప్పింది నిజమే ఇటుపక్కన ఆంధ్రోల్లు, ఎదురుంగ తురకోల్లు,కిరస్తానోల్లు ఉన్నరు.వాళ్ళతో రోజు మాట్లాడి అలా ఒస్తయి.పరేషాన్ గాకు మల్ల. నీకోముచ్చట జెప్పనా! మా పక్కన బాపనోల్లు ఉన్నరు. కాని వాళ్ళు గుడ్లు తింటరు.ఏందంటే గుడ్లు నీసు కావంట..అందుకే గుడ్లు మస్తు పిరమైనయి.

Anonymous

ఇంతకీ ఆంధ్రోల్లెవరు?

ramya
This comment has been removed by the author.
ramya

మస్తు మంచిగున్నది

ramya

రాజమండ్రి ల గీదీన్ని గార్డెన్ పార్టి అంటరుమల్ల

బ్లాగాగ్ని

టపా బావుంది. మంచి ప్రయత్నం సరూప. కానీ తెలంగాణా మాండలికం విషయంలో ఇంకా మెరుగుపడాలి.

జ్యోతి

ఇది తెలంగాణా మాండలికంలో చేసిన ప్రయత్నం కాదు బ్లాగాగ్నిగారు. మేము ఇంట్లోకాని, చుట్టాలతో గాని రోజు మాట్లాడేదే. అందుకే హింది,ఆంధ్ర యాస కలుస్తాయి. హై లో ఉన్నాముగదా. ఐనా అచ్చమైన తెలంగాణ యాస ఎలా ఉంటుందో నాకు అస్సలు తెలీదు.

బ్లాగాగ్ని

జ్యోతిగారూ, ఐతే ఓకే(కొండవలస స్టయిల్లో) :-)

Anonymous

జ్యోతి,
బలే ముచ్చటగా ఉన్నాయి సరూప కబుర్లు. నోరూరిస్తూనే కడుపు నింపుతున్నాయి కూడా:-)
అంతే కాదు మంచి జ్ఞాపకాలు గుర్తు చేశాయి.
మా అమ్మమ్మ వద్ద కార్తీక మాసం లో వన భోజనాలు పెద్ద ఎత్తున జరిగేవి. వంటలు అక్కడే చేసే వారు కూడా.

అయితే హైదరాబాదుకి వచ్చాక రెండు సార్లు యూనివర్సిటీ గార్డెన్ లో ఇంకో తరహాలో చేసుకున్నాము. ఇంటి నుంచే వండి తెచ్చారు పెద్ద వాళ్ళు.

ఇక మొన్న మా వారితో మాట్లాడుతుంటే గుర్తుకు వచ్చినది, ఇది ఎలా మర్చిపోయాను అనిపించినదీ ఒక విషయం. అప్పుడు మా మా "dads" మాతో (పిల్లలతో) కలిసి "Help and chain", "Hide and Seek" ఆడారు. ఒక సారి గుర్తుకు వచ్చాక మళ్ళీ మళ్ళీ ఆ జ్ఞాపకం తట్టి పిలుస్తోంది. ఎంత చక్కగా మాతో చేరి పోయి చిన్న పిల్లల్లాగా ఆడారో అని. అప్పట్లో తల్లి దండ్రులు ఇంతలా పిల్లల ఆట పాటల్లో పాలు పంచుకునే వారు కాదు. మా వాళ్ళు కూడా రోజూ అలా ఆడే వారేమీ కాదు. ఆ రెండు సార్లూ మాత్రం ప్రత్యేకం, మేమప్పుడు ఊహించనిదీ కూడానూ. ఎంతో సంతోషించామని గుర్తు ఉంది. మమ్మల్ని చెట్లు ఎక్కడానికి ప్రోత్సహించారు. ఉయ్యాలలూగించారు. చాలా ఆనందంగా గడిచాయి ఆ సందర్భాలు.

రాధిక

రమ్య గారూ రాజమండ్రిలో కూడా వనభోజనాలనే అంటారు.కాలేజీల్లో,స్కూళ్ళల్లో మాత్రమే గార్డెన్ పార్టీలంటారు.
మా ఊరిలో ఈ వన భోజనాలు 3 రకాలుగా జరుగుతాయి.ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు వాళ్ల వాళ్ళ ఉసిరి చెట్టుకింద పూజలు చేసుకుని చుట్టుపక్కల వాళ్ళని,చుట్టాలని పిలుచుకునేలాంటివి ఒకరకం,చుట్టుపక్కల వాళ్లంతా కలిసి ఒక్కొక్కళ్ళు ఒక్కో వంటకాలు చేసి ఆ ఊరిలోనే ఏదో ఒక తోటలోకి వెళ్ళి రోజంతా కాలక్షేపం చెయ్యడం ఒకరకం, భోజనాలు బయట ఆర్డర్ ఇచ్చేసి దూరం గా వెళ్ళి ఎంజోయ్ చెయ్యడం ఇంకోరకం .పల్లెటూళ్ళలో వుండే ఆడవాళ్ల టేలెంటులు ఇలాంటి సమయాల్లోనే బయటపడతాయి.నోరెళ్ళబెట్టుకుని చూడడం మగవాళ్ళ వంతు అవుతుంది.పెద్దవాళ్ళు కూడా పిల్లయి ఆడుతూ వుంటే చూడటానికి రెండు కళ్ళూ సరిపోవు.పిల్లలం ఆటలు మానేసి పెద్దవాళ్ళనే చూస్తూ వుండిపోయేవాళ్లం.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008