Wednesday, January 16, 2008

మా ఇంట సంక్రాంతి సంబరాలు...

వరూధినిగారు పల్లెటూరి సంక్రాంతి అనుభవాలు చెప్పారు. నాకు పల్లెటూరి అనుభవం లేదు కాని పట్నం కబుర్లు చెప్తాను. నా చిన్నప్పుడూ సంక్రాంతి పండగంతా నాదే. మామూలుగా ఇంటి పని చేయని నేను సంక్రాంతి నెలరోజులు మాత్రం ముగ్గులు పెట్టేదాన్ని, పెళ్ళయ్యేవరకు కూడా. పండుగ నెలరోజుల ముందునుండే రకరకాల ముగ్గులు కలెక్ట్ చేయడం, ప్రాక్టీస్ చేయడం, స్నేహితుల వద్ద కూడా నేర్చుకోవడం ఇలా సరదాగా గడిచేది. రోజూ ఎనిమిదివరకు లేవని నేను ఆ నెలరోజులు చలి ఉన్నా కూడా ఐదింటికే లేచి, శుభ్రం చేసిన వాకిలిలో రోజుకొక ముగ్గు వేయడమంటే భలే సరదాగా ఉండేది. చీకటిగా ఉన్నా భయమేసేది కాదు ఆ రోజుల్లో. అప్పుడప్పుడూ నేను ప్యాంటు షర్టు వేసుకుని ముగ్గు వేస్తుంటే అందరు వింతగా చూసేవారు. ముఖ్యంగా పాలకోసం వెళ్ళే మగవారు. ఆడవాళ్ళు మాత్రం అటుగా వెళ్తూ ఆగి ముగ్గులోని చుక్కలు , డిజైను చూసి వెళ్ళేవారు. పైగా ఇరుగు పొరుగు ఆడవాళ్ళు కూడా పోటీలు పడి ముగ్గులు వేసేవారు. ఏడింటికి ముగ్గు పూర్తి చేసి అప్పుడూ వేరేవాళ్ళు ఏ ముగ్గు వేసారా అని చూసుకోవడం. మా ఇంటి పై బాల్కనీ నుండి ఎదురింటి వాకిలిలోని ముగ్గును చూసి నేర్చుకోవడం. స్నానాలు, టిఫిన్లు అయ్యాక అమ్మ చేసిన పిండి వంటలు తీసుకుని తమ్ముళ్ళతో కలిసి డాబాపై పతంగులు ఎగరేయడం.ఇవి నా పనులు పండుగ రోజు. ఆ రోజుల్లో పతంగులు చాలా హుషారుగా ఎగరేసేవారు. ఆకాశం నిండా రంగు రంగు పతంగులు, అరుపులు , పిల్లలందరు డాబాలపైనే ఆ రోజంతా. ఇంకా పతంగులకు రక రకాల తోకలు కత్తిరించి పెట్టడం. కనుమ రోజు నేను మా తమ్ముళ్ళుకలిసి మిగిలిన పతంగులు , దారం ఎందుకు మళ్ళీ ఏడాదిదాకా దాచిపెట్టడం అని అన్నీ ఎగరేసి దారం తెంపేయడం. ట్రేసింగ్ పేపర్‍తో లాంతరు తయారు చేసి అందులో చిన్ని క్యాండిల్ పెట్టి కనుమ రోజు రాత్రి మిగిలిన వాటిలో పెద్ద పతంగు తీసి దానిని కొద్ది దూరం ఎగరేసి ఈ లాంతరులో కొవ్వొత్తి వెలిగించి దారానికి కట్టి దాన్ని కూడా ఎగరేసి అది ఆకాశంలో పైకి వెళ్ళాక దారం తెంపేసేవాళ్ళం. అది కంటికి కనిపించే వరకు చూసికాని క్రిందకు దిగేవాళ్ళము కాదు. ఆ రోజుల్లో సరదాలే వేరు.

ఇప్పుడూ మా ఇంటిలోని సంక్రాంతి విశేషాలు చూద్దామా!


ముందులా ప్రతీ రోజు రకరకాల ముగ్గులేయకున్నా పండుగ మూడు రోజులు మాత్రం మా వాకిలి నిండిపోవాల్సిందే.


గొబ్బెమ్మలు, నవధాన్యాలు, రేగుపళ్ళు,జీడిగింజలు,చెరకు,సెనగ,క్యారట్ ముక్కలతో ముగ్గు ఎంత అందంగ ఉంది కదా..


ఇంటి వాకిలి ముందు గొబ్బెమ్మల మధ్య పాలు పొంగించడం మా కుటుంబ ఆచారం. ఆ పాలు పొంగిపోయే దిక్కును బట్టి ఈ సంవత్సరమంతా ఎలా గడుస్తుందో అని లెక్కలేస్తారు పెద్దలు. గత సంవత్సరం, ఈ సంవత్సరం మా పాలు ఈశాన్యం దిక్కుగా పొంగిపోయాయి. మంచిదే..


పాలు పొంగించడం అయ్యాక పూజ చేసుకుని, పిండివంటలు చేసాను. స్వీట్లు ఒక రోజు ముందే చేసినా, హాట్లు మాత్రం ఇవాళే.. సంక్రాంతికి తప్పనిసరిగా చేసే నువ్వుల లడ్డులు, అరిసెలు, మరమరాల ఉండలు. నేను చేసే నువ్వుల లడ్డులు తినాలంటే మాత్రం దంతాలు చాలా గట్టిగా ఉండాల్సిందే. అంత తేలిగ్గ విరగవు. అది ఎవరిమీదైనా విసిరికొడితే దెబ్బ తగలడం ఖాయం. మరి నువ్వుల లడ్డులు అంటే అంత గట్టిగా ఉండాలి . అప్పుడే అవి పర్‍ఫెక్ట్ అన్నమాట. మొత్తం కొరికి తింటే మజా ఉండడు. చిట్టెలుకలాగా కొంచెం కొంచెం కొరికి తినాలన్నమాట.


హాట్ల విషయానికొస్తే పప్పు చెక్కలు, కారప్పూస, మరమరాలతో మిక్చర్.


మధ్య మధ్యలో మావారికి పిల్లలకు గారెలు , సాంబార్


చివరిగా మీకు, పండగ స్పెషల్స్ తిని భుక్తాయాసం రాకుండా రమణీయప్రియదూతిక ఇచ్చే కప్పురవిడెం లాంటిది కాకపోయినా , మస్త్ - జబర్‍దస్త్ హైదరాబాదీ స్పెషల్ "కలకత్తా రామ్‍ప్యారీ పాన్".

ఇంకా ఆయాసంగా ఉంటే " హాజ్‍మోలా జిందాబాద్"

పండుగలకు ఇలాటి స్పెషల్స్ చేసుకోవడం గొప్పేమీ కాదు. నేను ఇక్కడ ఎక్కువ పీకిందేమీ లేదు. కాని షడ్రుచులు బ్లాగు రాసే నాకు నిజంగా అన్ని వంటలు చేయడం వచ్చా , లేక ఊరికే పుస్తకాలనుండి చూసి రాస్తున్నానా అని చాలా మంది అనుమానం. అందుకే ఇలా ఫోటోలు తీసి పెట్టాను సరదాకి..

పైన పెట్టిన పోటోలలోని ముగ్గులు, పిండివంటలు అన్నీ నేను చేసినవే, కొన్నవి కావు( ఫోటోలో వాటి అవతారం చూస్తే తెలీటంలా) మావారు ఇందులో చిటికెనవేలి గోరు కూడ పెట్టలేదు. నిజ్జంగా నిజం. కాదంటే వై. ఎస్.ఆర్ తెలంగాణా ఇచ్చినంత ఒట్టు..

13 వ్యాఖ్యలు:

బ్లాగాగ్ని

ముగ్గు భలే అందంగా వుందండీ, జ్యోతిగారూ.

వర్మ

జ్యోతి గారు మీ సంక్రాంతి పిండివంటలు మీ బ్లాగునుండే ఆస్వాదించాం . మీ ఊరు వచ్చినప్పుడు తప్పక మీ పిండి వంటలు అన్నీ రుచిచూపించండి.

- వర్మ.

teresa

మీ ముగ్గులో అలంకరణ చాలా బాగుంది. ఈ రోజుల్లో హైదరబాద్ సిటీలో సంక్రాంతి పండగ ఇంత బాగా జరుపుకుంటున్నారంటే ఆనందంగా ఉంది!

Anonymous

'ఈ బ్లాగులో ఉన్న రచనలన్నీ నా సొంతమన్న భ్రమలో ఉండకండి.'--ముందు ఈ వాక్యం మార్చండి. గీరగా అనిపిస్తున్నది.
పతంగులు..పతంగులు అని పదిసార్లు వాడారు. ఏం. గాలిపటం అనొచ్చుకదా.

జ్యోతి

anonymousగారు,

నాకు అంతకంటే గీరగా ఉంది. కాని నాకు జరిగిన అనుభవం బట్టి అలా రాయాల్సి వచ్చింది. ఆ చురక అంటాల్సిన వాళ్ళకు అంటుతుందిలెండి..
ఇక హైదరాబాదులో పుట్టిపెరిగిన దాన్ని కాబట్టి పతంగులు అనడం అలవాటు.

Anonymous

ఆ ముగ్గులు..ఎన్ని రోజులైందో అంత perfect geometry చూసి.

సరే , ఇక వంటకాలు, ఎవరి స్పెషల్స్ వారివి!

చాలా పెద్ద సందేహం! సాంబారుకి, పప్పుచారుకి తేడా ఏమిటి?

పతంగులు కాని, గాలిపటాలు కాని సంక్రాంతప్పుడు ఎగురవెయ్యటం, తెలుగు వారి సంస్కృతేనా?

S

@anonymous garu:
హైదరాబాదు ప్రాంతం లో పతంగులు అన్నది చాలా సహజమైన ప్రయోగం. అందులో abnormality ఏమీ లేదు. ఇక్కడి భాష లో అది భాగం.

జ్యోతి

సాంబారులో ప్రత్యేకంగా చేసిన సాంబారు పొడి వేస్తాము. పప్పుచారులో అలా వేయము.అంతే తేడా కాని రుచి లో చాలా తేడా ఉంటుంది. తెలగువారనేకాదు భారతదేశంలోని చాలా ప్రదేశాలో గాలిపటాలు ఎగరేస్తారు ఈ పండక్కి.

Rajendra Devarapalli

ఈ ముగ్గులూ,ఆ గొబ్బెమ్మలూ,ఆ పిండి వంటలూ,మొత్తంగా
పండగ వాతావరణం మనం దేన్ని మిస్సతున్నామో ఇంకొన్నాళ్ళలో పూర్తిగా మనం మర్చిపోబోతున్నామో అని తలుచుకుంటే ఏదో గా ఉంది.కానీ కొన్ని సార్లు ముఖ్యంగా బ్లాగుల్లో మన వారు చూపెడుతున్న ఉత్సాహం చూస్తుంటే నిరాశ కు చోటు లేదనిపిస్తోంది. అలాగే అసలు సిసలు తెలుగువారి పండగలు, అట్ల తద్దె, ఉగాది, సంక్రాంతి, ఇలాంటివి ఇంకా కాలం నిలుస్తాయనే నమ్మకంకలుగుతుంది. అభినందనలు జ్యోతి గారు.

సిరిసిరిమువ్వ

ముగ్గు అలంకరణ బాగుంది. హైదరాబాదులో మీకు ఆవుపేడ కూడా దొరుకుతుందా?

Anonymous

@netizen
సాంబార్ అంటే కూరగాయముక్కలు ఉడికించి, ఉడికించినపప్పు, చింతపండురసం కలిపి,
దానికి పసుపుకొమ్ములు,మెంతులు,జిలకర,దనియాలు,బియ్యం,ఎండుమిర్చి,పప్పు,మిరియాలు,ఇంగువ,కరివేపాకు, మెదలైనవాటిని పొడిగా కొట్టి, చిన్న ఉల్లి పాయలతో తాలింపు వేసి చిక్క గా తయారు చేస్తారు.
కొన్ని ప్రాంతాలలో కూర విడిగా చేసుకోరు ,వంకాయ సాంబారు, బీన్స్ సాంబారు, ముల్లంగి సాంబారు, ఇలా అన్ని రకాల కూరగాయలనీ సాంబారుగా చేసుకుని అదే కూరగా వాడతారు.

Anonymous

@జ్యోతి: సరే! మరి రసానికి, చారుకి తేడా ఏమిటి?
@anonymous: కృతజ్ఞతలు!

narayana

ఈ ఏడాదీ............

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008