Friday, December 26, 2008

భలే మంచి రోజు...ముందుగా అందరూ నన్ను క్షమించాలి. ఏదో సరదాకి 25 నాడు మన స్టాల్ ని ఆక్రమించుకుందాం అన్నదానికి చదువరిగారు మహిళలే నిర్వహించండి అని వరమిచ్చారు . కాని తప్పని, క్లిష్టమైన పరిస్థితుల్లో నేనే ఆలస్యంగా రావల్సి వచ్చింది. ప్చ్. మంచి చాన్స్ పోయింది.

ఔరా! పది రోజుల్లో ఎంత మార్పు అనుకుంటూ నేను మా అమ్మాయి పుస్తక ప్రదర్శనకు వచ్చాము. సరిగ్గా పదిరోజులు అంటే 14 వ తేదీ బ్లాగర్ల సమావేశంలో అందరూ కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ గడిపాము . అనుకోకుండా ఆ రోజు జరిగిన చర్చలో ఈ పుస్తక ప్రదర్శనలో అంతర్జాలంలో తెలుగు వ్యాప్తి గురించి తెలియజెప్పాలి అని వేసిన విత్తనం , ఇప్పుడు ఒక స్టాలుగా మొలకెత్తి, ఎందరో తెలుగువారు, ప్రముఖులను ఈ దిశలో ప్రయాణింపజేసాము. ఎటువంటి ఖర్చు లేకుండా అంతర్జాలంలో తెలుగును చాలా సులువుగా రాయొచ్చు, చదవొచ్చు. ఒకమాటలో చెప్పాలంటే సాధారణంగా ఇంగ్లీషుకే వాడుతున్న కంప్యూటర్లకు తెలుగు నేర్పించడం ఇంత తేలికా అని తెలుసుకున్న వారు ఆశ్చర్యచకితులయ్యారు అనడంలో సందేహంలేదు.

దాదాపు అన్ని స్టాల్స్‌లో జనాలు నిండిపోయారు. లోపలికి దూరడానికి కూడా చోటు లేదు. అలా చూస్తూ వెళుతుంటే అనుపమ వాళ్ల స్టాల్ కనిపించింది. సరే వాడి సంగతి చూద్దాం అని వెళ్లాను. మా అమ్మాయి అంటూనే ఉంది. నీకు తెలుగు వచ్చు కదా మళ్లీ ఎందుకు వెళుతున్నావు అని. .. అనుపమ టైపింగ్ ట్యూటర్ అంటే మనకు ఇన్‌స్క్రిప్ట్ నేర్పే ట్యూటర్ అన్నమాట. ఏనిమేషన్లో. కాని దానికి మన కీబోర్డ్ పై తెలుగు అక్షరాల స్టిక్కర్లు అంటించుకోవాలి. మరి ఇంగ్లీషులో చేయాల్సిన పని ఉంటే ఎలా అంటే ఇంకో కీబోర్డ్ పెట్టుకోండి. ఎంత 150 లో వచ్చేస్తుంది కదా అన్నాడు ఆ అబ్బాయి. సరే అని తిరిగి వచ్చేస్తుంటే కొంటారా మేడం అన్నాడు. అప్పుడు వాడిమీద చిన్న బాంబ్ వేసి వచ్చా. నేను తెలుగు బ్లాగర్ ని , లేఖిని, బరహ వాడి, ఇప్పుడు అను వాడుతున్నా. ఎవరైనా అడిగితే చెప్తాలే అన్నా. కాని ఆ ట్యూటర్ చూస్తుంటే నాకు చిరాకేసింది. అంత నిదానమా.. నాకు పనికిరాదు.

అన్ని స్టాళ్ల ముంది జనాలు చాలా మంది ఉన్నా మన eతెలుగు స్టాల్ ఉన్న వరుసలో అన్నీ పత్రికల స్టాళ్లు . అవన్నీ ఖాళీగా వెలవెలబోతున్నాయి. TV9 స్టాల్ లో మాత్రం ఏదో ఆడిషన్స్ జరుగుతుంటే జనాలు గుమిగూడారు. ఆ వరుసలో మన స్టాల్‌లో మాత్రం సందడే సందడి. ముందుగా నేను తయారు చేసి తీసుకువచ్చిన చార్ట్ షీట్లు ఇచ్చాను. అంతకు ముందు శనివారం రోజు మన స్టాల్ కి వెళ్లినప్పుడు సగం గోడలు ఖాళీగా కనిపించాయి. ఉన్నవన్నీ eతెలుగు బ్యానర్లే. అందుకే బ్లాగుల పేర్లు రాసి తీసుకొచ్చాను. ఏవైనా మిగిలిపోతే రాసుకోమని కూడా చెప్పాను. అసలు ఆ చార్టులపై బ్లాగుల పేర్లు రాద్దామంటే ఎక్కువగా మహిళా బ్లాగులే గుర్తొస్తున్నాయి. అలా ఐతే గొడవలైపోతాయని కూడలిలో వెతికి అన్ని రాసాను. కాని రమణి గారి బ్లాగు పేరు అస్సలు గుర్తుకు రాలేదు. అదేంటో ఈ మనసు బ్లాగులు ఎక్కువై బుర్ర పాడైపోతుంది. ( ఏం మనసులో ఏమో) భార్గవ ఆ చార్టులు పెడుతూ ఈ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయని జనాలు అడిగితే ఏం చెప్పాలి అంటాడు. నేను అనుకున్నట్టే చదువరిగారు అడగనే అడిగారు. మా పేర్లు లేవా? అన్నీ మహిళా బ్లాగర్ల పేర్లు పెట్టుకున్నారా ఏంటి ? అని అడిగారు. కాదని చెప్పాను. ఇక నేను తెచ్చిన సున్నుండలు అందరికి ఇవ్వమని ఇచ్చి కాస్త బయటకొచ్చి స్టాలు ఫోటోలు తీస్తుంటే పక్కనుండి "నమస్కారం" అని వినవచ్చింది.


"నమస్కారమండి"
"ఒక్క నిమిషం"
"నమస్కారం జ్యోతిగారు"
"నమస్కారం. ఒక్కనిమిషం మాట్లాడతాను"
"నమస్కారం"
ఫోటోలు తీయడం పూర్తిచేసి పక్కకు చూసాను. నేను కస్తూరి మురళీకృష్ణను అని పరిచయం చేసుకున్నారు. ఆయన అంతకు ముందు అన్నదానికి నవ్వొచ్చింది. పక్కనే కొల్లూరి సోంఅషంకెర్ గారు, మహేష్ ఉన్నారు. నేను పిలవకుండానే మురళీకృష్ణగారు .. మీ ఇంటికి వచ్చేస్తాము , మహేష్, సోమశంకర్ కూడా వస్తారు అని పిలిచేసుకున్నారు. ..నవ్వేసి అందాక స్వీట్లు తినండి అని తెచ్చి ఇచ్చాను.

అక్కడున్న అరగంటలో గమనించింది ఏంటంటే... యువకులు కాకుండా మధ్యవయస్కులు ఉద్యోగస్తులు ఏంట్రా .. పుస్తకాల మధ్యలో కంప్యూటర్ ఎందుకుంది? ఏంటి ఈ కథా కమామీషు? అనుకుంటూ తొంగి చూసారు . స్వాతి, మహేష్, శ్రీనివాస్ గారు పాంప్లెట్లు ఇస్తున్నారు. తాడేపల్లిగారు, శ్రీధర్ ఎవరికి వీలైనప్పుడు వాళ్లు అంకోపరిలో లేఖిని గురించి చూపిస్తున్నారు. అందరూ ఒకే మాట అడుగుతున్నారు. ఇలా అంతర్జాలంలో తెలుగు రాయాలంటే ఏదైనా సాఫ్ట్‌వేర్ కొనాలా? అని.. అవసరం లేదు అంటే నమ్మలేకున్నారు. ఉచితంగా కూడా దొరుకుతాయా. అంత ఈజీగా తెలుగు రాయడం, చదవడం, అన్నీ చేయొచ్చా అని.

అక్కడున్న కొద్ది సేపట్లో నేను ఇద్దరు దంపతులను కలిసాను. ఆ పాంప్లెట్ చదువుతూ వారికి కలిగిన సందేహాలు అడిగారు.
"ఈ ఆర్గనైజేషన్ ఎక్కడుంది? ఆఫీసు ఎక్కడుంది?
"ఈ సంస్థ స్వచ్చందంగా పనిచేసుంది. ఆఫీసు అంటూ లేదు. ఆన్‌లైన్‌లో పని చేస్తుంది."
"ఈ పాంప్లెట్లో ఉన్నవన్నీ ఎక్కడ దొరుకుతాయి? ఎలా చదవొచ్చు?"
"ఇందులో చెప్పినవన్నీ నెట్‌లో ఉన్నాయి. ఉచితంగా చదవొచ్చు"
"మరి తెలుగులో ఎలా రాయాలి? ఏదైనా సాఫ్ట్‌వేర్ కొనాలా?"
"అక్కర్లేదండి! ఇక్కడ చెప్పిన్నట్టు లేఖినిలో రాసుకోవచ్చు. అది కాపీ పేస్ట్ చేసుకోవాలి. అదే బరహ ఐతే చిన్న సాఫ్ట్‌వేర్ . అది డౌన్‌లోడ్ చేసుకుంటే మీరు ఇంగ్లీషులాగే ఎక్కడైనా తెలుగులో రాసుకోవచ్చు. మెయిల్ కాని, వ్యాసాలు కాని ఏవైనా అన్నీ తెలుగులోనే రాయొచ్చు "
" మరి మాకు ఏదైనా సందేహాలు ఉంటే ఎవరు చెప్తారు?"
" ఇక్కడ చెప్పిన హెల్ప్ సెంటర్లో అడగొచ్చు, లేద ఈ గ్రూపులో చేరితే అక్కడ మేమందరమూ ఉంటాము , ఎవరైనా సహాయం చేస్తారు."
"ఈ సంస్థ ఎక్కడుంది. మళ్లీ కలవాలంటే?"
" ఈ సంస్త సభ్యులు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్నారు. మీకు ఈ గ్రూపులో ఎప్పుడైనా సహాయం చేయడానికి ఎవరో ఒకరు రెడీగా ఉంటారు"

వాళ్లు ఎంతో సంతోషంగా థాంక్స్ చెప్పి వెళ్లిపోయారు. ఇంకా కొద్ది సేపు ఉండాలనుకున్నాను కాని నాకు వేరే పని ఉండి వెళ్లవలసి వచ్చింది. అందరికి బై చెప్పి భారంగా వెళ్లిపోయాను. ఎలాగూ శ్రీధర్ బ్లాగులొ వివరాలు చదవొచ్చులే అనుకుని. కాని నాకు ఒకటే అనిపించింది. ఎవరెవరో , ఎక్కడివారో. అంతా బ్లాగానుబంధం. చాలా మంది మొదటిసారి కలుసుకుని ఏదో ప్రముఖులను కలుసుకున్నంత ఆనందపడిపోయారు. ఇంతవరకు బ్లాగులలో రచనలతో ఊహల్లో ఉన్న వ్యక్తులను కలుసుకోవడం, ఉన్న కాసేపైనా ఆప్యాయంగా , సరదాగా గడపడం అందరికీ ఒక తీపి జ్ఞాపకాన్ని మిగిల్చింది.. ఈ అవకాశం రాకుంటే మనం కలిసేవాళ్లమా.. ఈ కలయిక వ్యక్తుల మధ్య దూరాన్ని చాలా తగ్గించింది. రూపాలు కాదు మనసులు ముఖ్యం అనే అభిప్రాయం అందరికీ కలిగింది. ఒకటే ఆలోచనా దృక్పధం ఉన్న మనుషుల మధ్య ఒక మధురమైన అనుబంధం . అది మరపురానిది.. మరువలేనిది..

ఈ మహాయజ్ఞంలో వీరుల్లా కష్టపడుతున్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వీరందరిని సమన్వయపరచి, ఒక తాటిపై నడిపిస్తున్న పెద్దాయన కూడా ఓ వెయ్యి వీరతాళ్లు వేసేద్దామా?

మరో ముఖ్య విషయం.. ఈ క్రమంలో ఒక వ్యక్తిని కలిసిన బ్లాగర్లందరూ ఒకలాంటి వింత అనుభూతికి , ఆశ్చర్యానికి లోనయ్యారు. అంతవరకూ ఆ వ్యక్తి తన టపాలతో ఒక గంభీరమైన పెద్ద మనిషిగా అగుపించేవారు. అతని టపాలు, సమాధానాలు చదివిన వారందరికీ ఆ వ్యక్తి పట్ల ఒకలాంటి భయం ఉండేది. కాని ముఖాముఖీ కలుసుకున్న తరవాత అందరికీ ఆ భయం, జంకు తొలగిపోయాయి. అతను ఒక కదిలే విజ్ఞాన భాండాగారం. అతనితో మాట్లాడుతుంటే అలా మంత్రముగ్ధులై వింటూ ఉండిపోతున్నారు. సరదాగా, సూటిగా సుత్తి లేకుండా, అప్పుడప్పుడు వాతలు పెడుతూ ఎన్నో విషయాలు చెప్పే ఆ ప్రముఖ బ్లాగర్ మన తాడేపల్లి లలితా బాల సుబ్రహ్మణ్యం గారు. ఆయన ఇంత సరదాగా ఉంటారు అని ఎవ్వరూ ఊహించలేదు..

6 వ్యాఖ్యలు:

Purnima

నిజమే..this has been the most fulfilling experience of my entire blogging spree. అసలు మీరంతా ఇలా చకచకా ఎలా రాసేస్తున్నారో.. నేనేమో ఇంకా పడి మునకలేస్తున్న..ఎప్పటికి తేల్తానో! రాద్దామంటే ఏదీ.. ఎక్సైట్‍మెంటులో..నా వల్ల కావటం లేదు.

తాడేపల్లి గారి విషయంలో మీరన్నది నిజం. నాకాయనంటే చచ్చేంత భయం.. కానీ భలే సరదాగా ఉన్నారు. "మీరు సాప్ట్ వేర్ ఇంజనీరట కదా" నాతో అన్నది మాత్రం హైలైట్. ఎప్పుడో భార్గవ్‍తో టపా రాయిస్తా దాని మీద! ;-)

నిన్న అమ్మ వచ్చేసరికి మీరెళ్ళిపోయారు.. చూద్దాం మళ్ళీ ఎప్పటికి కుదిరేనో!

చాలా బాగుంది పోస్ట్!

cbrao

చాలా బాధగా ఉంది. మంచి సమయంలో మీ అందరివద్దా లేనందుకు.

Ramani Rao

బాగా రాసారు జ్యోతి గారు. నిజానికి నేను కాస్త ఆలస్యంగా వచ్చి మిమ్మల్ని మిస్ అయ్యాను. కాని మీ పోస్ట్ చదివి ఆ లోటుని కొంత పూడ్చేసుకొన్నాను.

Disp Name

Nizamga Ilaanti vishayalu chaduvutunte telugu blaagulu lokam inka samvridhi ga pempondaalani aaakankshistu.

zilebi.
http://www.varudhini.blogspot.com

psmlakshmi

we missed it.
psmlakshmi
psmlakshmi.blogspot.com

Anil Dasari

ఆ 'పాంప్లెట్' సాఫ్ట్‌కాపీ ఉంటే ఇక్కడ పెట్టొచ్చు కదా. మాబోటి రాలేని వాళ్లం అదేంటో చూస్తాం. ఇక్కడెప్పుడన్నా అలాంటి కార్యక్రమాలు పెడితే ఒక టెంప్లేట్‌లా ఉపయోగపడుతుంది కూడాను.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008