Friday, December 19, 2008

ఆడబిడ్డ.. ఎప్పటికీ ఆడ.. బిడ్డేనా???

పుట్టగానే అమ్మో ఆడపిల్లా అంటారు
అది ఆ పసిపాప తెలిసి చేసిన నేరమా
పేగు తెంచుకుని నేలపై పడినప్పుడు
ఆ ఆడపిల్ల అమృత కలశంగా కాలేదు
అగ్నికుంపటి కాలేదు.గోరుముద్దలు తినిపించి కంటికి రెప్పలా కాచుకున్న అమ్మ
తన చిన్నారి అత్తారింటికి వేళ్లే వేళ భోరున ఏడవదా?
ఈడొచ్చిందని , ఒక తోడును , సరియైన జోడును వెతికిన నాన్న
కళ్లలో పెట్టుకునే వరుడి చేతిలో పెట్టి కంట తడి ఆపుకోగలడాపరాయిదైనా కూడా బిడ్డ కోసం
కడదాకా ఆరాటపడే అమ్మ ఆరాటం
తపన మాటల్లో వర్ణించగలనా
అమ్మా నేను నీలా కాగలనా??ఎందుకమ్మా ఆడపిల్లను పరాయిదాన్ని చేస్తారు
పెళ్లికాగానే పుట్టింటికి అతిథిగా మారాలా
పాతికేళ్ల అనుబంధం మర్చిపోవాలా
అత్తిళ్లే తప్ప పుట్టింటితో నాకు సంబంధం లేదా.అడకగముందే నాకు ఏమి కావాలో తెలుసుకున్నావు
శ్రమ అనుకోకుండా ఇష్టమైనవి చేసి పెట్టావు
తీరైన బట్టలు కుట్టి నాకు తొడిగించి మురిసిపోయావు
అందంగా అలంకరించి బంగారు బొమ్మ అని దిష్టి తీసేవు.హాయిగా నీ కనుసన్నల్లో ఉన్న నేను
పెళ్లి కాగానే పెద్దదాన్నైపోయానా
ఎవరికిష్టమైనవి వారికి చేయాలి , చేస్తున్నాను కూడా
మరి నాకు ఇష్టమైనవి ఎవరికి తెలుసు. నీకు తప్ప.తువ్వాయిలా తుళ్లుతూ, నవ్వుతూ ఉన్న నన్ను
బాధ్యతల పంజరంలో పడేసారు
ఈ ఇంటి కట్టుబాట్లలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాను
బలవంతంగా పెద్దరికం తెచ్చుకున్నాను.నా కన్న బిడ్డలకు ఎన్ని చేస్తున్నా
అనుక్షణం నువ్వే గుర్తొస్తావ్..
మళ్లీ నాకు నీ చిట్టితల్లిలా
మారాలనుందమ్మా..అత్తారింట్లో ఏ బాధలు లేవు
కాని అలసిన మనసు,
నీ తోడు కావాలంటుంది
కాలం వెనక్కి తిరిగితే బాగుండు అనిపిస్తుందిఅమ్మా! నాకొద్దీ పెద్దరికం, బాధ్యత
నీ దగ్గరకొచ్చి అలా మౌనంగా ఉండాలనిపిస్తుంది
నీ ఒడిలో తల పెట్టుకుని మనసారా ఏడవాలనుంది
ఆడబిడ్డగా కాక నీ బిడ్డగా ఉండనిస్తావా??అత్తింటికెళ్ళినా, పుట్టింటిపై మమకారం
వదలలేని ఆ ఆడపిల్ల అనుబంధానికి
అనురాగానికి అర్ధం చెప్పగలమా?
ఆడపిల్లకి పెళ్ళయ్యాక కూడా
పుట్టిల్లు, మెట్టిల్లు రెండూ కావాలి, అందరిని
ప్రేమగా చూసుకునేది ఆడపిల్లే కదా?

25 వ్యాఖ్యలు:

లక్ష్మి

:( గుండెలోతుల్లో ఎక్కడో ముల్లులా గుచ్చుకున్న భావన

Kathi Mahesh Kumar

ఈ కవితలో నాకు అనుభూతికన్నా,self pity ఎక్కువగా కనిపిస్తోంది. వ్యక్తిత్వంకన్నా, బేలతనం యొక్క celebration అతిగా అనిపిస్తోంది.
ఇప్పుడు పుట్టినింటికీ మెట్టినింటికీ సమానదూరం పాటిస్తూ, ‘సొంతిల్లు’ ఏర్పరుచుకుంటున్నారు.అప్పుడు ఈ వైరుధ్యాలు నశిస్తాయేమో!ప్రేమల్లోని భావావేషాల్ని హక్కుగా అనుభవించే సమయం వస్తుందేమో!!

Kathi Mahesh Kumar

అది "భావావేశాలు" అని గుర్తించగలరు..అచ్చుతప్పు....

జ్యోతి

మహేశ్,

ఈ బేలతనం, బాధ నీకు అర్దం కాదులే. గారాబంగా పెరిగి,చిన్నతనంలో పెళ్లి, బాధ్యతలు ఇవన్నీ మోసి అలసిన ఇల్లాలి వాస్తవ ఆలోచనలు. కుటుంబ బాధ్యతల మధ్య అప్పుడప్పుడి అలసిన మనసు అమ్మనే గుర్తు చేసుకుంటుంది. మగవాళ్లకి ఇది అర్దం కాదు..

రవి

చాలా ఆర్ద్రంగా ఉంది.

"ఆడపిల్లకి పెళ్ళయ్యాక కూడా
పుట్టిల్లు, మెట్టిల్లు రెండూ కావాలి, అందరిని
ప్రేమగా చూసుకునేది ఆడపిల్లే కదా?"

one could only feel it. but can not understand it. because it's a futile excercise.

జ్యోతి గారు, అన్నట్టు మా ఇంట్లోనూ ఓ 3 న్నర నెలల బంగారు తల్లి ఉంది!

పరిమళం

జ్యోతి గారు!అమ్మ ప్రేమలోని తీయదనం జ్ఞప్తికి తెచ్చారు "అమ్మా! నాకొద్దీ పెద్దరికం",చాలా బావుందండీ.

నేస్తం

chaala bagundi andi

Unknown

namaste, see this link and hear 'amma dongaaa'
http://surasa.net/music/lalita-gitalu/#vedavati
regards

asha

నా పెళ్ళైన తరువాత మా అత్తగారింటికి
వెళ్ళేటప్పుడు అందరూ ఏడవటం మొదలుపెట్టారు.
నేను వాళ్ళని వదిలేసుకుంటున్నట్లు అనుకోలేదు.
కానీ, వాళ్ళలా అనుకున్నారు. ఎందుకో తెలీదు.
నాకు కొత్త ప్రదేశానికి వెళుతున్నాననే
భయం ఉంది. అంతే.
మెట్టినింట్లో ఉండకపోవటం వల్లో, నా జీవితంలో
పదిహేను సంవత్సరాలు హాస్టల్లో గడపటం
వల్లో నాకెప్పుడూ ఇలా అనిపించలేదు.
లేకపోతే నాకు డిటాచ్మెంట్ ఎక్కువేమో తెలీదు.

http://www.everythingisprecious.com

Unknown

అమ్మ వొడిలో వున్న విలువ మల్లి కేది జాబిల్లి కేది అని,ఢిల్లీ కి రాజైన తల్లి వొడి లో బిడ్డే అని,మీ కవిత రూపం లో మరొక్క సారి చెప్పారు. అందు లో బేల తనం ఏమి వుందో మహేష్ గారికే తెలియాలి.కొన్ని అనుభూతులకి వయసు పదవి తో సంభంధం లేదు.అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ అని అప్పట్లో దూరదర్శన్ లో పాట వచ్చేది.కొంగట్టుకు తిరు గుతూ ఏవో ప్రశ్నలడుగుతూ ,అంటు ఒక తల్లి పడే ఆవేదన , దానికిపొడిగింపు గా కూతురు తల్లి కోసం పడే ఆవేదనే మీ కవిత, కానీ తల్లి ప్రేమని కూడా మైమరపించే భర్త అత్తా మామలు దొరికినా కూడా ప్రతి ఆడపిల్ల అమ్మని తలచుకుంటునే వుంటుందేమో.

Chandra A

నెను కత్తి మహేశ్ గారితో ఏకీభవిస్తున్నాను. అమ్మని తిడుతున్నట్లుంది. సినిమా కష్టాల్లా వున్నయ్ పాపం. అబ్బాయిలకు కూడా హాయిగా జాబ్ మానేసి పెద్దరికాన్ని తొందరగా తెచ్చుకోవద్దనే వుంటుంది. కానీ కుదురుతుందా? హాయిగా టీవి సీరియల్స్ చూడాలనే వుంటుంది. అమ్మ వొడిలో తల పెట్టుకుని కబుర్లు చెప్పాలని వుంటుంది. అలా చేస్తే ఈ జ్యోతి గారే ఒక టపా రాసేస్తారు. "న వుద్యోగం న పురుషహ" అని. ఈ సెల్ఫ్ పిటీ మానేసి ఆడోళ్లు వాటిని ఎలా ఎదుర్కోవాలో రాస్తే మంచింది. సాక్షిలో రామ్ గాడిలాగా గుడ్డిగా రాయటం మంచిది కాదు.

Chandra A

మగవాళ్లకి ఈ బాధ అర్ధమ్ కాదన్న మీ మాటల్లోనే మీ కశ్ఠాలన్ని అందరి ఆడవాళ్ల కష్టాలనుకునే అమాయకత్వం, మగవాళ్లందరు ఒకటే అనుకునే అనుభవ రాహిత్యం కనిపిస్తున్నాయ్. మీకు "ఆడాల్లంతా ఇంతే" అని ఆడోళ్ళ మీద కుళ్ళు జోకులేసుకునే మగవాళ్లకు ఏమిటి తేడా? చెప్పండి? జెనరలైజేషన్ అనే సాధారణంగా ఒక తొందరపాటు. మీరు లేటరల్ గా ఆలోచించటానికి ప్రయత్నించటం లేదనుకుంటా. అది మీ ఇంట్లో కాకుండా సమాజంలో వెతకాలి.

జ్యోతి

కృష్ణారావుగారు,
థాంక్స్ అండి. మా అమ్మాయి పెళ్లి అయ్యి వెళ్లాక నేను అలాగే అనుకుంటానేమో..

రవిగారు,
నిజమేనండి. తల్లిలా చూసే భర్త ఉన్నా కూడా అమ్మ గుర్తుకు రాని కూతురు ఉంటుందా. ఇది తల్లీకూతుళ్ల మధ్య ఉన్న చాలా సున్నితమైన అనుబంధం.

చంద్రగారు, నేను రాసింది నా ఆలోచనలు, అనుభూతులు. ఇందులో మీకు , మహేష్ కి కనిపించిన సెల్ఫ్ పిటీ ఏంటో అర్ధం కాదు. అందుకే నేను అన్నది ఈ భావన మగవాళ్లకు అర్ధం కాదు అని. అలా అని నేను అందరు మగవాళ్లు అనలేదు. తల్లిని మరపించే భర్తలు ఉన్నారు. అలా అని తల్లిని మర్చిపోదు ఏ కూతురు కూడా.

గీతాచార్య

జ్యోతి గారు,

తెలుగు బ్లాగర్లకి పెద్ద దిక్కైన (నచ్చక పోతే ఉపసహ్మరించుకుంటాను బేషరతుగా) మీరు ఇలా బేలతనాన్ని పంచితే ఎలా? (ఇక్కడా సారీ. మీ నుంచీ ఎంతో పవర్ఫుల్ టపా ఆశించాను. హెడ్డింగ్ చూసి).

ఇక టపా గురించి.

"పుట్టగానే అమ్మో ఆడపిల్లా అంటారు," ఎందుకు? ఎవరైతే ఏమైంది?

ఈ ప్రశ్ననే మా ఒక అక్కయ్యకి ఆడపిల్ల పుట్టినప్పుడు గట్టిగా అడిగితే నాకు వచ్చిన బహుమానం 'వీడికి ఒగారేక్కువ' అనే కామెంట్. చాలా కాలం నుంచీ అదే నాకున్న పెద్ద డౌట్.

ఆఖరికి స్త్రీలు కూడా(ఆడ వాళ్ళని దూరం పెట్టటం (ఆడ) నాకు సూట్ అవని విషయం) అలాగే అనుకుంటే ఇక ఎవరు పోరాడగలరు? అయినా ఇది పోరాడి సాధించుకునేతందుకు ఏదో రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాదు. దాన్ని కొందరు కలసి అక్కడో ముక్కా ఇక్కడో ముక్కా ఎత్తుకొచ్చి చేసిన కలగూరగంప. ప్రకృతి సిద్ధంగా అందరూ ఒకటే. ఇదెందుకు గ్రహించరు? ఈ తేడాలన్నీ మనుషులు సృష్టించుకున్నవే కదా.

అడగాల్సిన అవసరం లేదు. కడగాల్సిన అవసరం అంతకన్నా అసలు లేదు. Just be rational. Be it male or female. గట్టిగా చెపితే 'male', 'female' లో మూడింట రెండొంతులే. (అమ్మ నుంచీ వచ్చేవారేగా అందరూ).

ఇప్పుడు ప్రకృతి వైద్యం, ప్రకృతి ఆహారం (మాట సరిగా తెలీదు. అర్ధం అవుతుందనే ధైర్యంతో వ్రాశాను) fashion కదా! మరి అదే ప్రకృతి తనలో అందరూ సమానమే అని చెప్పలేదా? everybody has equal opportunity in the world. The world is open to everyone. ఇక ఎక్కువ తక్కువల సంగతెందుకు?

ఇంతకుముందు ఏమైందో అనవసరం. ఇక ముందు జరగాల్సింది చూడాలి. "సమాజం అలా ఉండలేదు కదా!" అంటారా? సమాజమెప్పుడూ అలా ఉండదు. మనమే మల్చుకోవాలి. ప్రకృతినే మలచుకున్న మానవునికి సమాజమొక లెక్కా?

Give me liberty or let me die.

గీతాచార్య.


P.S.: The pic is excellent. Shall you permit you to download? I'll wait for the pic.


If I hurt you with my words, A BIG SORRY.

గీతాచార్య

@ కత్తి మహేష్ కుమార్ గారు,

ఏమి చెప్పారండీ. అనను. I wish your wish will come true one day.

"ఇప్పుడు పుట్టినింటికీ మెట్టినింటికీ సమానదూరం పాటిస్తూ, ‘సొంతిల్లు’ ఏర్పరుచుకుంటున్నారు.అప్పుడు ఈ వైరుధ్యాలు నశిస్తాయేమో!"

ఏమి చెప్పారండీ. అనను. I wish your wish will come true one day.

గీతాచార్య

అది "shall you permit me to....." instead of what was printed.

జ్యోతి

గీతాచార్యగారు,

మీరు చెప్పింది నిజమే. ఇప్పుడు ఆడ,మగా అన్న తేడా లేదు. కాని ఈ టపా ఎందుకు రాసానో మీకు అర్ధం కావాలంటే నేను నిజం చెప్పక తప్పదు. నాకు కవితలు రాయడం మాట అటుంచి, చదివినా అర్ధం కావు. కథలు రాయడం రాదు. కాని వారం క్రింద ఎందుకో నాలో కలిగిన భావాలకు ఇలా అక్షర రూపం ఇచ్చాను. ఆ క్షణంలో బేలగానే ఉన్నాను. అలా అని నా ఆలొచనలు ఎప్పుడు అలాగే ఉంటాయా? పెళ్లై పాతికేళ్లు దాటాక నేను మా అమ్మ గురించి అలా ఆలోచించకూడదా. అందరిని ఇలా ఉండమన్నానా? పెళ్లి కాగానే నిజంగా ఆడపిల్లను పరాయిదాన్ని చేస్తారు. ఆడపిల్ల ఎప్పటికి పుట్టింటిని నా ఇల్లు అని చెప్పుకోలేదు. చెప్పనివ్వరు. తను ఉండే ఇల్లు, లేదా అత్తారింటినే నా ఇల్లు అని చెప్పుకోగలదు. పెళ్లి అయ్యాక పుట్టింటి సంగతి నీకెందుకు, మీ తమ్ముళ్లు, అన్నలు చూసుకుంటారు, అత్తిళ్లే నీది, ఇక్కడే నీ జీవితం అని కట్టిపడేస్తారు. అలా పాతికేళ్లు అమ్మా, నాన్నతో పెంచుకున్న అనురాగం, పుట్టింటి మమకారం దాచుకోక తప్పదు. మర్చిపోవడం అసంభవం. తన సంసారపు బాధ్యతలతో అమ్మ దగ్గరకు వెళ్లడానికి కుదరక, వేరే ఊర్లో కాని, వేరే దేశంలో కాని ఉంటే అమ్మ గుర్తుకురాదా. దానికి వయసు పరిమితి ఉందా?
మహేశ్ చెప్పినట్టు నేను అత్తింట్లో లేను, పుట్టింట్లో లేను, నా సొంటింట్లో ఉంటున్నాను. అలా అని అమ్మను ఇలా గుర్తు చేసుకోవడంలో తప్పేంటి. దీనివల్ల నేను బలహీనపడిపోయాననుకుంటే ఎలా? నేను రాసింది నా సొంత ఆలోచనలే అని చెప్పాను కాని అందరి ఆడవాళ్లది అన్నానా? ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే ఉద్దేశ్యం కనపడిందా? నా బాధ్యతలతో నేను అలసిపోకూడదా? అమ్మను గుర్తుచేసుకోకూడదా? ఆలొచించండి..

గీతాచార్య

I agree with most of the things you said.

మీరు నన్ను కుంచిం అపార్ధం చేసుకున్నారు.

అమ్మని గుర్తుచేసుకోకూడదని ఎవరన్నారు? చక్కగా గుర్తు చేసుకోవచ్చు. ఎవరన్నా కూడదంటే అంతకన్నా ఫూలిష్నెస్స్ ఉండదు.

నేనన్నది ఒక జనరల్ తింగ్. మా నాన్నగారిని బ్లాగ్ వ్రాయమంటే 'పెద్దవాడిని నాకు బ్లాగింగు ఎందుకు?" అన్నారు. ఆయనని ఒప్పించేసరికి నా తల ప్రాణం అరికాల్లోకి వచ్చింది. (తోక అంటే మళ్ళీ ఏమన్నా కొప్పడుతారేమో అని. నేను రియాలిటీని మాట్లాడుతున్నాను.)

నేను ప్రశ్నించింది (అసలు ప్రశ్నించి ఉంటే) ఈ భావజాలాన్నే. ఏం 'మా ఆడవాళ్ళం మాత్రం...', పెద్దవాళ్ళం ఇలాగా....', ఎందుకలా తేడాలు. ఎవరికి నచ్చిన పనిని చేయటం లో తేడాలు ఎందుకు? Things are to be done as 'whether you wish or not', 'whether you can or not', whether you like or not', or 'whether it is rational or not...'. అంతే.

అంతే కానీ నేను పెద్దవాడిని కనుక కొన్ని పనులు చేయకూడదు, మేము ఆడవాళ్ళం కనుకా ... etc etc భావజాలమే నాకు అర్ధం కానిది. 'ఆడవాళ్ళు (నా మాట స్త్రీలే) పుట్టింటిని మర్చిపోవాలి' లాంటి మాటలు నేనూ చాలా విన్నాను. దొరికినంతలో వాయించాను (ప్చ్. అందరూ వినలేదు. అయినా ఆగలేనుగా).

'మా నాన్నగారితో ఒకటే కన్నాను. "నాన్నా! నీకు చేయాలనిపించి రాయాలంటే ఓపిక లేకుంటే తప్ప ఆగకు. వయసుని మాత్రం నాకు కారణం గా చూపకు' అని. అదే నా లాస్ట్ వర్డ్ టు కన్విన్స్.

ఎనీ వే మీకవిత/ ఆవేదన నన్ను ఎంతో ఆలోచింప చేసింది. అందుకూ నెనెర్లు.


మహేష్ గారితో అన్నది 'ఆ స్వేచ్ఛాయుత సమయం లో వారికి నచ్చినట్టు ఉంటారనే' ఉద్దేశ్యమే కానీ ఏదో నా సొంతిల్లు అనే భావన ఎంతమాత్రం కాదు. చక్కగా అమ్మని ఎప్పుడూ గుర్తు... ఆయ్! తప్పంటున్నాను. అమ్మని గుర్తు చేసుకోతమేమిటి? అసలు మర్చిపోతేనేగా. :-)


http://thinkquisistor.blogspot.com/2008/10/blog-post.html

ఇప్పటికీ మీరు అన్న విషయాలు నేను మా ఇళ్ళలోనూ వింటూనే ఉన్నాను. దౌర్భాగ్యం ఏమిటంటే "పెళ్లి అయ్యాక పుట్టింటి సంగతి నీకెందుకు, మీ తమ్ముళ్లు, అన్నలు చూసుకుంటారు, అత్తిళ్లే నీది, ఇక్కడే నీ జీవితం" ఈ మాటలని ఎక్కువగా మా అమ్మమ్మ నోట్లో విన్నా. ఎక్కువ స్త్రీలే ఇలా అనటం విన్నా. ఏమిటో ఈ ఆలోచనలు:-(

Sorry for the disturbance.

inthakee photo gurinchi cheppaneledu.

జ్యోతి

గీతాచార్యగారు,

ఏ ఫోటో??
పైన ఉన్నది గూగులమ్మ ఇచ్చింది..

రాధిక

చాలా బావుందండీ.

తెలుగుకళ

నేను స్త్రీ వాదిని కానే కాదు.
మానవతా వాదిని.
అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి నా అనుభవాన్ని బట్టి స్పందిస్తాను.
ఆడపిల్లకి పుట్టిల్లు ఒక నందనవనం.అందులో హాయిగా విహారించటమే కానీ జవాబుదారీతనం, బాధ్యతల వంటి అవసరాలుండవు. ఏమి ఉన్నా లేకున్నా తల్లిదండ్రుల ప్రేమ ఆమె అడుగులకి మడుగులొత్తుతుంది.
అమ్మాయి దిగులుగా ఉంటే ఇల్లంతా మూగబోతుంది.
కానీ అత్తిల్లు ఒక రణ రంగం. ప్రతి క్షణం అందరినీ మెప్పించాలి. తనకు నచ్చినట్టు ఉండటం కాదు. ఇంటిల్లిపాదికీ నచ్చినట్టు ఉండాలి. అందరి మనసులూ గెలుచుకోవడానికి ఎప్పుడూ అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉండాలి.పైగా ఇక్కడ అలసిపోయినా ఎవరూ పట్టించుకోరు.పైగా అన్నీ అమర్చలేదే అని దబాయిస్తారు.
నిజంగా చెప్పాలంటే స్త్రీనుండి కావలసిన వన్నీ పురుషులు హక్కుగా పొందుతారు. ఆమె మాత్రం తనకి కావాల్సినవి గారాబం చేసో, బ్రతిమాలుకొనో , ఎదుటివారి మనసులు గెలుచుకొనో ,కన్నీటితోనో పొందుతుంది.
విచారకరమైన విషయం ఏమిటంటే అందరి కన్నీటికీ అడ్డుపడే ఆమె కన్నీటిని తుడవడానికి ముందుకు వచ్చేది చాలా తక్కువమంది కావటం.

నిజానికి ఇద్దరు అబ్బాయిలున్న నేను రెండవ అబ్బాయి పుట్టినపుడు అనాథనైనట్టు భావించాను. నా తల్లిదండ్రులున్నంతవరకు నేను అనాథని కాకపోవచ్చు. కానీ తర్వాత వీళ్ళిద్దరూ మమ్మల్ని వంతులేసుకుని పోట్లాడుకుంటారేమో అని నా భయం. నేనెక్కడున్నా నా తల్లిదండ్రులని గురించి ఆలోచిస్తూనే ఉంటాను. అమ్మకు నాన్నకు మధ్య వారధిలాగా వారి చిన్న చిన్న తగువులు తీరుస్తాను. ఒక్కోసారి అమ్మని ఒక్కోసారి నాన్నగారిని హెచ్చరిస్తాను నా మాట వినకపోతే నేను మీదగ్గరికి రాను అంటూ. కానీ నాలాగా అమ్మ నాన్నల గురించి ఆలోచించే కూతురినివ్వకపోవటం నా దురదృష్టం. భూమిపై మనలని అర్థం చేసుకునే మనుషుల్లో అమ్మ మొదటిది.అందుకే ప్రపంచంతో విసిగిపోయినా, మనసు బరువెక్కినా అమ్మ ఒడి గుర్తుకొస్తుంది అది ఆడైనా మగైనా ఎవరికైనా.. కాకపోతే అమ్మ ఒడి చేరడానికి అబ్బాయికి ఎవరి అనుమతీ అక్కరలేదు. కానీ అందరు ఆడవాళ్ళకీ ఆ వరం ఉండకపోవచ్చు. కారణం భర్తే కానక్కరలేదు.ఏదైనా కావచ్చు.భర్త మనసు గెలుచుకొన్నా అన్ని సందర్భాలలోనూ ఆమె మనసును అతను అర్థం చేసుకోడు.
కానీ అమ్మ అలా కాదు. పుట్టకముందునుంచి ఉన్నంత కాలం మన బాధ తెలిస్తే , కన్నీరు చూస్తే విలవిలలాడిపోతుంది.
నా మాటలను నావిగా చూడకుండా వాళ్ళ ఇళ్ళలో అమ్మల్ని గుర్తుచేసుకుని ఆలోచిస్తే అమ్మ కోసం అమ్మాయి పడే ఆవేదన తెలుస్తుంది.
ఒక భర్తగా చూసిన వారికి ఈ భావాలు అనుభవాల లోతు తెలియకపోవచ్చు. అది వారి తప్పుకాదు. వారి దృక్పథంలో ఉన్న చిన్న తేడా.అప్పుడప్పుడూ అమ్మ ఒడికోసం కన్నీరు పెట్టటం వల్ల నాకు ఆ ప్రవాహపులోతు తెలుసు.
ఎక్కువ మాట్లాడినా తప్పుగా మాట్లాడినా మన్నించగలరు.పురుషులందు పుణ్యపురుషులు తప్పక ఉంటారు.వారి ప్రేమతో అమ్మ ఒడిని మరపించే ప్రయత్నం చేసి ఉండవచ్చు.అలాంటి వారికి నాజోహార్లు.
మరొక్క సారి చెబుతున్నాను. నేను స్త్రీవాదిని కానేకాను.
తెలుగుకళ - పద్మకళ.

తెలుగుకళ

జ్యోతి గారూ !
మీ ప్రతి మాటా అమ్మ ఓదార్పుకోసం అమ్మాయిపడే వేదనని ప్రతిబింబిస్తుంది.
బేలతనం దిగులు అనేవి ప్రతి మనిషికీ ఏదో ఒక సమయంలో తప్పదు.
భావావేశాలకి దేవుళ్ళే అతీతులు కాలేకపోగా మానవమాత్రులం మనమేపాటి?
ఎక్కడో విన్నాను ’అమ్మ ప్రేమ ఉంటే అన్నీ ఉన్నట్టే.అది లేకపోతే ఏమీ లేనట్టే.’

కొత్త పాళీ

ఇది కవిత అనుకుందామంటే అవసరానికి మించి పొడుగ్గానూ, వొదులు వొదులుగానూ ఉంది. అండుకని కవిత్లా కనిపించే మీ భావవ్యక్తీకరణ అనుకుని చదివేసుకున్నాను.
కొన్ని కొన్ని వరుసలు చాలా బాగా వచ్చాయి.
పేగు తెంచుకుని నేలపై పడినప్పుడు
ఆ ఆడపిల్ల అమృత కలశంగా కాలేదు
అగ్నికుంపటి కాలేదు.
ీ రచనకి ప్రాణం ఈ లైన్లు అని నాకనిపిస్తోంది. నిజానికి ఏ మనిషికైనా ఇది వర్తిస్తుంది. కానీ, స్త్రీకి పెళ్ళి అనేది ఒక వైతరణి లాంటీ అనుభవం అవుతున్నదనేది కాదనలేని నిజం.

మహేషు, గీతాచార్య, చంద్ర తప్పుగా అర్ధం చేసుకునారనడంలో ఏ సందేహం లేదు.
తెలుగు కళ పద్మకళగారూ, మీరు స్త్రీవాది ఎందుకు కాదు? కాకపోవడం నాకు నిరాశ కలిగిస్తోంది. స్త్రీవాది అంటే మీ దృష్టిలో ఎవరో, మీరెందుకు స్త్రీవాదిని కానంటున్నారో అర్జంటుగా మీరో టపా రాయాలి!

priya

jyothi garu,
kavitha chalabavundiamdi. ammani chusi 2 years
ayindi nenu. nenu telugu blog chudatum mede frist . me kavitha complete ga chadive sariki
na kamtininda neru. maku chala thanx. priya.

Praveen Mandangi

స్త్రీవాదులమని చెప్పుకునే వాళ్ళందరూ స్త్రీవాదులు కారు. నేను (మార్తాండ) ఒక బ్లాగ్ లో ఇలా వ్రాసాను "కొంత మంది భర్త చనిపోయిన స్త్రీని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంటారు లేదా విడాకులు తీసుకున్న స్త్రీని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంటారు కానీ రేప్ కి గురైన స్త్రీనో, పెళ్ళికి ముందు మోసపోయి బిడ్డని కన్న స్త్రీనో పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకోరు. వాళ్ళు కొంత వరకు ప్రగతివాదాన్ని అంగీకరిస్తారు కానీ సంకుచిత భావాల్ని పూర్తిగా వదులుకోరు"

"మనిషి మానసికంగా వికాసం చెందాలంటే అన్ని రకాల సంకుచిత అభిప్రాయాల్ని వదులుకోవాలి. స్త్రీలపై ఉన్న సంకుచిత అభిప్రాయాల్ని కూడా వదులుకోవాలి." అని కూడా వ్రాసాను. ఆడ వాళ్ళకి బస్ కండక్టర్ ఉద్యోగాలు ఇస్తున్నారు కానీ డ్రైవర్ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదు అని అడిగే వాళ్ళు తక్కువగా ఉన్నారు.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008