ఈ జీవితం ఎంతో చిత్రమైనది. ప్రతి ఒక్కరిది ఒక్కో మనస్తత్వం. వ్యక్తిత్వం. కాని విలువైన ఈ జీవితంలోని ప్రతి కోణాన్ని, ప్రతీ సంఘటనను గురించి తెలుసుకుని, స్పందించాలి. ఎపుడు కూడా మన ఆలోచనలు ఒకే విధంగా ఉండకూడదు.అది మనకే మంచిది కాదు. మన మనస్సుకు సంకెళ్ళు వేయకుండా, మనం చెప్పినట్టు మాత్రమే వినేలా నిర్దేశించకూడదు. దానికి స్వేఛ్చ నిచ్చి వదిలేయాలి. అప్పుడే మన మనస్సు, ఆలోచనలు ఆ సంఘటనకు తగ్గట్టుగా వివిధ రూపాలుగా స్పందిస్తాయి. Different thoughts at different situations మనం కోపం, బాధ, ఆనందం, అల్లరి, ఆలోచన, సంగీతం, సాహిత్యం... ఇలా అన్నింటినీ సమానంగా అనుభవించి ఎంజాయ్ చేయాలి. ఆ స్పందనను ఎన్నో రూపాలుగా ప్రతిబింబించవచ్చు. వచనం, కవిత్వం, పాట, పద్యం ... ఇలా అన్ని అనుభూతులను మనఃస్పూర్తిగా అనుభవించాలి. దాచుకోవాలి.
ఈ క్రమంలో ఒకరోజు వేసవి చివర్లో తొలకరికి ఎదురుచూపులు. కాని ఈ సారి వాన అలిగిందేమో. ఇంకా దోబూచులాడుతుంది. వేసవి ఉక్కపోతలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ కురిసిన తొలివాన నాలో కలిగించిన స్పందన మొదటిసారి కవితగా రూపుదిద్దుకుంది. చిరు చీకటి కమ్ముకుంటున్న సమయాన, పాట పాటలు వింటూ . చల్లని వాన చినుకుల్లోతడుస్తూ ... ఆ హాయే వేరులే.. ఇక చేతిలో వేడి వేడి టీ ఉంటే??
ప్రతి మనిషికి ఏదో ఒక అలవాటు ఉంటుంది. అది వారికి ఇష్టమైన అలవాటైనా, మరి కొందరు అది దురలవాటు, వ్యసనమూ అని ఆక్షేపిస్తారు. కాని అలవాటు పడిన వారు మాత్రం ఆ అలవాట్లను సమర్ధిస్తారు. దానికి వ్యతిరేకంగా ఎవరేమన్నా వినరు. ఏ అలవాటుకైనా బానిసగా మారితే అది వ్యసనంగా మారుతుంది. ఈ అలవాట్లకు కవులు కూడా వశులే. కొందరు సమర్ధించారు, కొందరు వ్యతిరేకించారు.
భుగభుగమని పొగలెగయగ నగణితముగ నాజ్యధార లాహుతి కాగా నిగమాది మంత్రయుతముగ పొగ త్రాగని వాడు దున్నపోతై పుట్టున్ !!
పొగ తాగితే అది భుగభుగమని గుప్పున ఎగిసిపడేలా ఉండాలి. వేదమంత్రాలతో యజ్ఞం చేస్తున్నంత దీక్షగా, పవిత్రంగా పొగ త్రాగనివాడు దున్నపోతై పుడతాడని ఆ కవి ఉవాచ. దీనికి మరో కవి తందానా అన్నాడు చూడండి.
ఖగపతి అమృతము తేగా భుగభుగమని చుక్కయొకటి భూమిని వ్రాలెన్ పొగ చెట్టయి జన్మించెను పొగ త్రాగని వాడు దున్నపోతై పుట్టున్ !!
ఈ పద్యం భారతంలోని సౌపర్ణోపాఖ్యానం కథలో చెప్పబడింది.) ఈ వింత చూసారా? అమృతం చుక్క భూమిపై పడి పొగ (పొగాకు) చెట్టై పుట్టిందంట) అంటే పొగ త్రాగేవారందరూ అమృతపానం చేస్తున్నట్టా?? హన్నా? పొగ త్రాగని వాడేమో దున్నపోతై పుడతాడంట. ఎంత బాగా తమని, తమ అలవాటును సమర్ధించుకుంటున్నారో?
అందరు కవులు ఇలా ఉండరు అని , పొగ త్రాగడం వల్ల కలిగే పదమూడు అనర్ధాలను కూడా మరో కవి ఏకరువు పెట్టాడు.
పైదానిలాగానే మరో ప్రముఖమైన అలవాటు కాఫీ తాగడం. మహాకవి శ్రీశ్రీగారు సుమతీ శతకంలోని "అప్పిచ్చువాడు వైద్యుడు" చందాన ఎప్పుడు పడితే అప్పుడు కప్పుడు కాఫీ నొసంగ గలిగిన సుజనుల్" అని కితాబిచ్చేసారు. నేను మాత్రం తక్కువ తిన్నానా అని ఓ కవి పొద్దున్నే ఓ అయ్యరు హోటళ్లో కూర్చుని
తరుణుల మోవి పానకము త్రాగక పోయిన నేమిగాక, యా సురపతి వీటియందు సుధ జుర్రక పోయన నేమిగాక, మా కరుణ గభస్తే బింబ ముదయాచల మొక్కక మున్నె వెచ్చనై గరగరలాడు కాఫి యొక్క కప్పిడిగోనని అయ్యరిచ్చినన్ !!..
తరుణీమణి అధరసుధామృతం, అమృతం కంటే వెచ్చని కాఫీ మేలు అంటున్నాడీ కాఫీ ప్రియుడు.
70 ఏళ్ల క్రితం గౌరవఝుల సోదరకవులు ఏకంగా కాఫీ పురాణమే రాసేసారు. అందులోని ఓ కాఫీ శ్లోకం..
త్రికాల మేక కాలం వా జపే ద్విచ్చాన్ సునిశ్చలః పీత్వా పీత్వా పునః పీత్వా స్వర్గలోక మవాఫ్నుయాత్ కాఫీ తీర్ధసమంతీర్థం ప్రసాద ముపమా సమం అయ్యర్ సదృశ్య దేవేశో నభూతో న భవిష్యతి!!
సంగతేంటంటే పొద్దున్నే అయ్యరిచ్చిన ఉప్మా (హతవిధీ.. ఇక్కడా, ఎక్కడ చూసినా ఉప్మానేనా) తిని, చిక్కటి కాఫీ మళ్లీ మళ్లీ తాగితే స్వర్గలొకప్రాప్తేనంట ఆ మహానుభావుడికి . బహుశా ఇంటికి దూరంగా ఉంటూ చదువులు, ఉద్యోగాలు చేసుకునే బ్రహ్మచారులందరూ ఇలాగే అనుకుంటారేమో. :)
కొందరు కాఫీని చుక్క చుక్క చప్పరిస్తూ, ఆనందిస్తుంటారు. మరి కొంత మందికి కాఫీ , టీలకంటె టిఫెన్ల మీద ఎక్కువ మక్కువగా ఉంటుంది. తినేసి బయటపడతారు. అది చూసి కాఫీకి బాధ కలిగి ఇలా వాపోయింది.. పాపం...
వడపై ఆవడపై పకోడి పయి హల్వా తుంటిపై బూంది యోం పొడిపై ఉప్పిడిపై ర విడ్డిలి పయి బోండా పయిం సేమియా సుడిపై పారు భగవత్కృపారసము నిచ్చోకొంత రానిమ్ము నే ఉడుకుం కాఫిని ఒక గుక్క గొనవే ఓ కుంభలంభోదరా!!
పాపం ఎంత బాధలో ఉందో ఈ కాఫీ. వడ, ఆవడ, పకోడి, హల్వా, బూందీ, ఉప్పిడి, ఇడ్లీ, బోండాం, సేమియా పై ఉన్న ప్రేమను కొంచం ఈ వేడి కాఫీ పై కూడా చూపమని దీనంగా వేడుకుంటుంది.. ఆ ప్రార్ధన ఫలించు గాక.
గత వారం రోజులుగా ఒక మిత్రునితో ఈ పొగ త్రాగడం, కాఫీ తాగడం మీద తీవ్రమైన చర్చ జరిగింది. ఎప్పుడో ఒకసారి అంటే ఓకే కాని ఆ అలవాటే వ్యసనంగా మారనిస్తే ఎలా. మంచిది కాదుగా. కాని అతను తన అలవాటును సమర్ధించుకుంటాడు. పట్టు వదలడే. ఈ క్రమంలోనే చాలా రోజుల క్రింద చదివిన ఆచార్య తిరుమలగారి నవ్వుటద్దాలు లోని ఈ పద్యాలు గుర్తొచ్చి టపాయించాను.
నాదో డౌటు.. సాధారణంగా పొగ త్రాగడం, మందు కొట్టడం అని వాడుతుంటారు. .. బీడీ, చుట్ట , సిగరెట్ పొగ పీలుస్తారు కాని తాగరు . మందు గ్లాసులలో పోసుకుని తాగుతారు. దానినెందుకు కొట్టడం. ఈ సంశయం ఎప్పటినుండో నాలో ఉంది. మావారిని ఎన్నోసార్లు అడిగా. ఆయనకు ఈ అలవాట్లు లేవు. నాకు తెలీదు. నువ్వే ట్రై చేసి నాకు చెప్పు అన్నారు. అలా ఉంది సంగతి. ఎవరైనా చెప్పగలరా ???
ఇపుడు వంటల వెబ్ సైట్ నిర్వహిస్తున్నానని, షడ్రుచులు బ్లాగు ద్వారా ఎన్నో వంటకాల గురించి అందరికీ ఉపయోగపడేలా చెప్తున్నానని నాకు మొదటినుండి వంటలు చాలా బాగా వచ్చు అనే భ్రమలో ఉండకండి . పెళ్లి జరిగినపుడు కప్పు టీ మాత్రమే సరిగ్గా చేయడం వచ్చు నాకు. హాస్చర్య పోతున్నారా??అదేనండిమరి .. పాపం మావారు కదా.ఎలా వేగుతూ వచ్చారో ఇన్నేళ్ళు ..
ఫ్లాష్ బాక్ లో కి వెళితే....
అమ్మా నాన్నకు ఒక్కదాన్నే గారాల కూతురిని. హాయిగా అమ్మ చేసి పెట్టింది తిని తయారై స్కూలుకు, కాలేజీకి వెళ్లి రావడం తప్ప వేరే లోకం తెలిదు. అవసరం కూడా పడలేదు మరి. చెప్పొద్దూ మా అమ్మే అన్నీ చేసుకునేది. ఒకటికి పదిసార్లు తిడితే ఏదో చిన్న చిన్న పనులు చేసి బయటపడేదాన్ని. కాస్త పెద్దయ్యాక అమ్మ తిట్టేది.. ఇలాగైతే ఎలాగే .. రేపు పెళ్ళి అత్తారింటికి వెళ్ళాక పని చేయకపోతే వాళ్లు నన్నే అంటారు. నేర్చుకో అనేది. హు.. పెళ్ళయ్యాక ఎలాగూ తప్పదు. నేను చెప్తాలే. అమ్మ చెప్పినా కూడా నేను నేర్చుకోలేదని అని నా పని చేసుకునేదాన్ని. నాకు మా నాన్న సపోర్ట్. పోనీలే అని. ఇక వంట ఎలా వస్తుంది. ఇంకా నయం .. పెళ్లి చూపుల్లో అమ్మాయికి వంట వార్పూ వచ్చా అని అడగలేదు ఎవరూ... బ్రతికిపోయా.. అత్తారింట్లో కూరగాయలు తరిగివ్వడం, బియ్యం కడగడం, టేబుల్ సర్దడం లాంటి నాజూకు పనులే చేసేదాన్ని.మిగతావి రావుగా. సరే రోజులు హాయిగా గడిచిపోతున్నాయి. ఒకరోజు నా నెత్తిన బండ పడింది. ఇద్దరు చుట్టాలొచ్చారు. మా తోటికోడలు ఉప్మా చేయి అంది. అంతే .. మొహం బ్లాంక్ అయ్యింది. ఉప్మా ఎలా ఉంటుందో తెలుసు, తినడం తెలుసు. ఎలా చేయాలో అస్సలు తెలీదే.. అదే చెప్పాను ఆవిడతో. ఒకటే నవ్వు. నవ్వితే ఉప్మా రెడీ కాదుగా. అపుడు వంటింట్లోకి తీసికెళ్ళి ఉప్మా రవ్వ ఎలా ఉంటుంది. దాన్ని ఎలా బాగు చేయాలి. వేయించాలి, ఉప్మాకి కావలసిన దినుసులు అన్నీ చూపిస్తూ ఉప్మా తయారు చేస్డింది.. ఓహో .. దీనికి ఇంత ప్రాసెస్ ఉంటుందా అనుకున్నా.. మరో ఘనకార్యం వినండి.. ఒకరోజు సాయంత్రం మా తోటికోడలు పిల్లలు వచ్చి ఏదైనా టిఫిన్ చేయమన్నారు. సరే కాస్త అనుభవం వచ్చింది కదా అని సెనగ పిండితో బజ్జీలు చేద్దామని డిసైడ్ అయ్యా. ఇదే ఎందుకంటే చాలా ఈజీ కాబట్టి (అమ్మ చేస్తుండగా చూసానుగా ) సరే అన్నే కలిపా,, బజ్జీలు బాగా పొంగాలని కాస్త వంట సోడా కూడా వేసాను. బజ్జీలు రెడీ అయ్యాయి. ప్లేట్లలో పెట్టి ఇచ్చాను. ఆహా అనుకుంటూ బజ్జీ తిందామని నోట్లో పెట్టుకున్నారు. ఏముంది.. బజ్జీ లోపల చూస్తె ఎర్రగా రక్తం లా ఉంది.ఇదేంటబ్బా ఇలా ఎలా ఐంది. కారం అంత ఎర్రగా ఉండదే. అమ్మ చేస్తే బానే వస్తుందిగా అని నా బుర్రలో ప్రశ్నలు. అందరూ నవ్వుతున్నారు. నేను నవ్వాలా, ఏడవాలా తెలీదు. ఎందుకంటే కన్ఫ్యూజన్లో ఉన్నా .. అప్పుడే వచ్చిన మా ఆడపడుచు అసలు రహస్యం చెప్పింది. ఏంటంటే.. పసుపు వేసినప్పుడు వంట సోడా వేయొద్దు అని.. అలా వేస్తె రెండుకలిసి ఎరుపు వస్తాయి అన్నమాట. పెళ్ళిళ్ళలో పారాణి అలాగే పసుపు , సున్నం కలిపి చేస్తారని కూడా చెప్పిందావిడ. ఆ సంగతి నాకు అంతవరకు తెలీదు నిజంగా. మరి కొత్త పెళ్లి కూతుర్లు అందరూ అమాయకులే.. నేస్తం చెప్పినట్టు... భర్తా, అత్తగారేమో ఉద్యోగానికి అన్నీ నేర్చుకుని వచ్చినట్టు , వాళ్ళు అడిగింది చేయాలంటారు. అర్ధం చేసుకోరూ... :(
తర్వాత వేరు కాపురం.. వంటింట్లోకి ఏయే మసాలాలు కావాలి.ఏయే పొడులు అవసరం అవుతాయి మనకు తెలిసి చస్తేగా. మన టాలెంట్ అమ్మకు తెలుసు. అందుకే వంటింట్లో సరుకులన్నీ , గరంమసాల, పొడులతో అన్నీ డబ్బాలలో నింపి వెళ్ళింది. (నేను నా కూతురుకు ఇలా చేస్తానా? ఏమో ?? ) .. గిన్నెలు, చెంచాలు, మసాలాలు, అన్నీ ఉన్నాయి. మరి వంట చేసేది ఎలా. మావారు పెళ్లి కాకముందు, అపుడెప్పుడో స్కూలులో ఉన్నపుడు రూంలో అద్దెకుంటూ వంట చేసేవాన్ని అని చెప్పారు. (ఇప్పటికీ చెప్తుంటారానుకోండి) నాకు వంట పాఠాలు చెప్పలేదు. ఉహూ అన్నారు. కావాలంటే పుస్తకాలు కొనిస్తా చూసి చేయి. బాగుంటే సరి . లేకుంటే మళ్ళీ చేయి అదే వస్తుంది అని ఓ ఉచిత సలహా పడేసారు. ఇలా లాభం లేదని.. మా అమ్మ దగ్గరకు వెళ్లి (అపుడు ఫోన్లు లేవు లెండి..లేకుంటే బిల్లు పేలిపోయేది ) రోజు తినే పప్పు, చారు, కూరా ఎలా చేయాలి, దానికి కావలసిన స్టాండర్డ్ దినుసులు, కొలతలు రాసుకుని వచ్చా. పప్పు, చింతపండు, పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, పసుపు .. ఇలా అన్నీ .. ఆ పుస్తకం ఈ మధ్యే దొరికింది. చదువుతుంటే భలే నవ్వొచ్చింది.. అలా రోజొక ప్రయోగం చేస్తూ మావారిని, మావగారిని బలి చేస్తూ వచ్చా. పాపం కొత్త పెళ్లి కూతురు కదా అని బాగా లేకున్నా మెల్లిగా చెప్పేవారు ..
ఇలాగే ఒకరోజు ఒక తమాషా జరిగింది. ఒకరోజు పొద్దున్నే వంట చేస్తుంటే మావారు టీ అడిగారు.సరే అని పప్పు పక్కనే స్టవ్ మీద టీ పెట్టాను.ఆఫీసు టైం అవుతుంది. గాభరా.. గందరగోళం.. ఏముంది.. టీలో వేయాల్సిన టీపొడి పక్కనే కుక్కర్లో ఉన్నా పప్పులో వేసా .. దోసకాయ పప్పు అనుకుంటా. ఇంకేముంది. వెంటనే పప్పు రంగు మారిపోయింది. తీసేయడానికి లేదు. మావారికి టీ ఇచ్చేసి ఎం చేయాలా అని కంగారు పడ్డాను. మళ్ళీ పప్పు చేసేంత టైం లేదు. పక్కనే ఉన్న అమ్మ దగ్గరకు వెళ్లి చిన్న గిన్నెడు పప్పు తెచ్చి మావారికి అన్నం పెట్టేసి ఆఫీసుకు పంపేసాక మళ్ళీ వంట చేశాను. కాని ఆ నల్లటి పప్పు పనిమనిషి కూడా తీసుకోదే . రంగు రుచి రెండూ మారాయి మరి. పారేయక తప్పలేదు. ఈ సంగతి మావారికి ఇంతవరకు తెలీదు. మీరు చెప్పకండే.. అసలు వంట అంటే చాలా ఇష్టమని కాదు. చేయక తప్పదు కదా అని ఒక్కోటి నేర్చుకోవడమే.. ఇప్పటికీ రోజొక రకంగా ఎవరైనా చేసి పెడితే తిందామని కోరిక. అది తీరదు గాని. వదిలేద్దాం..
ఈ మధ్యే మరో తమాషా జరిగింది. తలుచుకుంటే నా టాలెంట్ మీద నాకే గర్వం పెరిగిపోతుంది. అలా కూడా చేస్తానన్నమాట.. ఒకరోజు మావారికి టిఫిన్ గా పుల్కాలు చేస్తున్నా. అప్పుడే మా అబ్బాయి వచ్చి తినడానికి పెట్టు అన్నాడు. సరే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయనా అంటే సరే అని వాడు వెళ్లి టీవీ చూస్తూ కూర్చున్నాడు. మావారికి టిఫిన్ పెట్టి నాకు , మా అబ్బాయికి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. ఇద్దరం తిన్నాం. బాగుంది. ఐతే మరి ఇందులో వింతేంటి అంటారా?? అదే మరి.. ఎగ్ లేకుండా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసానన్నమాట. అది మా ఇద్దరికీ తినేటప్పుడు, తినడం ఐపోయాక కూడా తెలీలేదు. అలా తయారైంది జీవితం అనిపించింది. మరి ఎలా తెలిసింది అంటే. తిన్న తర్వాత ప్లేట్ తీసికెళ్ళి కిచెన్ లో సింక్ లో వేసి ,, మధ్యాహ్నం వంటకోసం కూరగాయలు చూస్తుంటే గ్యాస్ స్టవ్ ముందే గుడ్లు నన్ను చూస్తూ కనిపించాయి. హి.. హి ... హి.. అని. అంటే గుడ్లు తప్ప అన్ని వేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుని తిన్నాము తల్లి కొడుకులం అనుకుని వెళ్లి మావాడిని అడిగా ఏరా! నువ్వు తిన్నదేంటి అని. వాడు టీవీలో WWF చూస్తూ ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నాడు. అందులో ఎగ్ ఉందా అంటే ఏమో తెలీలేదు అంటాడు తెల్ల మొహమేసి. అంటే ఎగ్ లేకుండా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి అసలు అది లేదు అనేది కూడా తెలీలేదు అని అర్ధమైంది. ప్చ్..
ఎప్పుడూ ఇలా జరగదనుకోండి.. యాభై మందికి ఒక్కదాన్నే వంట చేయగలను అనే ధీమా ఉంది ఇపుడు. తాతలు సంపాదించిన ఆస్థి అనుభవించడం కాదు గొప్ప. సొంతంగా కష్టపడి సంపాదించు అన్న పెద్దల మాట చద్ది మూటగా భావించి కష్టపడి చెమటోడ్చి( హైటెక్ కిచెన్ అయినా, గ్యాస్ పొయ్యి మీద వంట అయినా చెమట పట్టదేంటి. ఇదేమన్నా టీవీ ప్రోగ్రామా .. అందంగా కనపట్టానికి ) నేర్చుకుని ఏదో ఏమీ రాని అంతదాన్ని ఇంతదాన్ని అయ్యాను. ( సంసారంలో పదనిసలు లాగా అప్పుడప్పుడు వంటింట్లో ఇలాంటి గందరగోళాలు ప్రతి ఒక్కరికి అనుభవమవుతాయి.. ఇలాంటి వంటింటి రిపేర్లు ప్రతి గృహిణి చేయడం పరిపాటే కదా.
మీకు ఇలాంటి అనుభవాలు ఉన్నాయా. మీకు కలిగిన లేదా చూసిన సరదా సంఘటనలు మీ బ్లాగులోనూ టపాయించండి మరి.. ఆలస్యమెందుకు ???
సంగీతం అంటే ఒక ధ్వని, నాదం మాత్రమేనా. ఒక పాట మన మనసు లోతులను కదిలించి స్పందించేలా చేస్తుంది అంటే దానికి కారణం ఆ పాట సంగీతం, అందులోని సాహిత్యం. గాయకుడి గానామృతం. మన సినిమా పాటలలో నాకు నచ్చినవి మనసుకు హత్తుకునే తక్కువే . ఎన్నో సార్లు ఆలోచించాను. నాకు ఈ కారణాల చేత ఇవి నన్ను ఇంతగా కదిలించాయి అని. ఖచ్చితంగా అది సంగీతం, ఆ పాటలోని పదాల అల్లిక, అలాగే గాయకుడి స్వర మాధుర్యం. ఈ క్రమంలో నటీనటులు గురించి ప్రస్తావన రాదు. నా విషయానికొస్తే పాటలు చూడడం కంటే వినడమే ఇష్టపడతాను. ఒక్కోసారి కొన్ని పాటలు మనలోని బాధను చల్లపరిచి ఆహ్లాదానిస్తాయి. ఆ పాటలలోని అందమైన పదాల అమరిక మనలో ఎన్నో ఆలోచనలు రేకెత్తిస్తుంది. ఎన్నో సందేహాలను పరిష్కరిస్తుంది. ఒక్కోసారి ఔరా అనిపిస్తుంది కూడా. అలాంటి ఒక పాట సిరివెన్నెల చిత్రంలోని విరించినై .. ఈ పాట ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది. అలా అని నేను సిరివెన్నెల గారి అభిమానిని అనలేను. ఆ పాట రాసింది, పాడింది ఎవరైనా సరే. ఎంతో కాలంగా ప్రయత్నించి ఇప్పటికి ఆ పాట అర్ధాన్ని తెలుసుకోగలిగాను.
ఆ విశేషాలు నా బ్లాగులో దాచుకుని , మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
విరించినై విరచించితిని ఈ గీతం
చిత్రం : సిరివెన్నెల
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం :
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం
ఓం!
ప్రాణ నాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవ నాదం
ఓం!
కనుల కొలనులో ప్రతిబిం బించిన విశ్వరూప విన్యాసం
ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం
సర సస్వర సుర ఝరీ గమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం ఈ గీతం
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం
జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం
అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా
సాగిన సృష్టి విలాసమునే
విరించినై
నా వుచ్చ్వాసం కవనం నా నిశ్వాసం గానం
సర సస్వర సుర ఝరీగమనమౌ
ప్రకృతి లో ఎన్నో రంగులు.. హంగులు.. దానిని ఆస్వాదించి , అనుభవించి, ఆనందిస్తాం మనం. కాని కొందరికి ఆ అవకాశం ఉండదు. అలాంటి వారు నిర్భాగ్యులు అవుతారా? లేదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. దానిని వెలికి తీయాలి. మన చుట్టూ ఎంతో మంది ఆదరణ లేక అవస్థలు పడుతుంటారు. అలాంటి వారికి సహాయం అందించి చేయూత నివ్వడం మానవ ధర్మం.
వికలాంగులు, విధివంచితులు అయిన వారికి ఆర్ధిక సహాయం, విద్య, మరియు కనీస అవసరాల కోసం సహాయఫౌండేషన్ పని చేస్తుంది. ఎయిడ్స్ బాధిత పిల్లలు, వృద్ధాశ్రమాలకు ఆర్ధిక సహాయం, మొదలైన కార్యక్రమాలు ఉత్సాహవంతులైన సభ్యులతో క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వస్తుంది. కొందరు అంధులు మరియు వికలాంగులైనవారి ఉన్న వివిధ రకాల కళల ను నైపుణ్యాలను అందరికి తెలియచేయాలనే ఉద్దేశం తో మరియు వారి ఉన్నత విద్య ఇతర అవసరాలకు సహకరించే ఉద్దేశం తో సహాయ ఫౌండేషన్ కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిన్స్తుంది. అందులో భాగంగా గత సంవత్సరం హృదయ స్పందన అనే సంగీత కార్యక్రమం విజయవంతంగా ఏర్పాటు చేయడమైనది. ఎవరన్నారు ఈ పిల్లలు విధి వంచితులు అసహాయులు అని. కాని దేవుడు చూపు తప్ప వారికి అన్నీ ఇచ్చాడనిపిస్తుంది ఆ కార్యక్రమానికి హాజరైనవారికి. దాని వివరాలు ఇక్కడ చూడవచ్చు.
అదే స్ఫూర్తితో వారిని ప్రోత్సహించడానికి, మరింత మందికి సహాయం చేయడానికి నిధులకోసం, రెండవ వార్షికోత్సవ సందర్భంగా మరో సంగీత కార్యక్రమం "రాగం"((A Cultural Program by Differently able People) ఏర్పాటు చేయబడింది.
వేదిక : హరిహర కళా భవన్,పాట్నీ సెంటర్, సికింద్రాబాద్. తేది : 08-08-2009. సమయం: 6.30 pm - 9.30 pm .
దయచేసి మీయొక్క సహాయ సహకారాలు వారికీ అందించి మరియు కార్యక్రమానికి హాజరై వారిని ఉత్సాహపరచండి.
రాలేని వారు కూడా టిక్కట్లు కొని వారికి సహాయ పడవచ్చు.
మీరు టిక్కట్లు కొనలేక పోవచ్చు , రాలేక పోవచ్చు కాని ఈ మెసేజ్ ని మరింతమందికి తెలియచేసి పరోక్ష సాయం చేయండి. ఒక సాయంత్రం ఆ పిల్లల కోసం కేటాయించండి. వారిని ఆదరించి, ఆదుకోండి... ఆత్మసంతృప్తి పొందండి.