Monday, September 7, 2009

అలిగిన వేళనే చూడాలి...

అలక ఆడవారికి సొంతం , అందం కూడా. అలక అనేది అందరిమీద పనిచేయదు కదా. తనవాల్లపైనే ఎవరైనా అలిగేది. ఆ అలక ముద్దుగా అందంగా ఉంటేనే బాగుంటుంది. శృతి మించితే గొడవలైపోతాయి. చిన్నపిల్లల అలక అందరికీ ముద్దుగానే ఉంటుంది. అమ్మ కాదు అన్నా అలిగిన బాబును చూసి ఎవరైనా తీర్చడానికి ముందుకొస్తారు. కాస్త పెద్దయ్యాక పిల్లలు అవి కావాలి ఇవి కావాలి అని అలుగుతారు. తిండి మానేస్తారు. పెళ్ళయ్యాక అంటే... అలగడం ఆలి ధర్మం, హక్కు కూడా. అది భర్తా మీద ఐతే చెల్లుబాటవుతుంది. పెళ్ళయిన కొత్తలో అంటే అలిగిన భార్యను మురిపించి లాలించి అడిగినవి ఇస్తారు భర్త మహాశయులు. తర్వాత అస్సలు పట్టించుకోరనుకోండి. అది వేరే సంగతి.. ఇక అలిగిన ఇల్లాలు ఎం చేస్తుంది. ఒక్కసారి పాత సినిమాలలోని సత్యభామని గుర్తు తెచ్చుకోండి. మరీ అంత భారీ సీను ఉండదనుకోండి. అలక పానుపు , అలక మందిరాలు లేకున్నా కూడా అప్పుడప్పుడు ఈ అలకలు భలే ముద్దుగా ఉంటాయి. భార్య అలిగితే ఎం చేస్తుంది.. పుట్టింటికి వెళుతుంది. మరి భర్త అలిగితే.. బార్ కే వెళ్తాడా , స్నేహితుల ఇంటికి, లేదా క్లబ్బుకు వెళతాడా. ఎన్నిరోజులు, ఇంటికి రాక తప్పదుగా. అయినా ఆడవారి ఐ ఎస్ ఐ మార్కు అభిప్రాయం ఏంటంటే.. మగవాళ్ళకి అందంగా ,గోముగా అలగడం రాదు అని. ఐతే గీతే కోపం తెచ్చుకుని మాట్లాడ్డం మానేస్తారు. ఇంట్లో వాళ్ళ మీద (భార్య మీద ఎక్కువగా) అరుస్తారు.. అలకలో మెళకువలు ఆడవారికే సొంతం కదా.. ఇక్కడ ఒక్క మాట చెప్పకుండా ఉండలేను. గుండమ్మ కథలో అలిగిన ఎన్టివోడు భలే అందంగా ఉంటాడు కదా.. అందుకే సావిత్రమ్మ అంటుంది " అలిగిన వేళనే చూడాలి .. గోకుల కృష్ణుని అందాలు "

మీ వారు (ఆవిడ ) అలిగితే ఎం చేస్తారు? సరదాగా చెప్పుకోండి చూద్దాం..

ఈ విషయం మీద ప్రమదావనంలో తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. మీరేమంటారో చూద్దామని అడుగుతున్నాను..

4 వ్యాఖ్యలు:

Sujata M

మా వారు అలిగితే ఇయర్ ఫోన్స్ తగిలించుకుని పాటల ప్రపంచం లో మునిగిపోతారు. (అంటే మూతి బిగించుకుని మాటాడరన్నమాట) ఆ పాటల్లో పడి, అలిగిన విషయం మర్చిపోయి, ఏదయినా మంచి పాట వస్తే ఒక చెవి లోంచీ ఇయర్ ఫోన్ తీసి, నాకు ఆఫర్ చేసి వినమంటారు. నేనూ పాట వినేసి 'ఆహా !' 'ఓహో !' అనుకుంటూంటే, 'సారీ ! నేను మర్చిపోయాను ! ఈ సారి గొడవ పోస్టు పోను చేస్తున్నా !' అని ప్రకటిస్తారు. బేసికల్ గా మాకు పోట్లాడుకోవడానికి టైం ఉండదు. కానీ పోట్లాడుకున్నాకా, ఇద్దరం బోల్డంత సాధించేసేమని తృప్తి చెందుతాం.

పరిమళం

మా శ్రీవారు అలుగుతారేమో ...అన్న అనుమానం రాగానే నేనే ముందుగా అలిగేస్తా ! ఇక నన్ను బ్రతిమాలుకోవటమే సరిపోతుంది ఇక ఆయనకి అలకేం గుర్తొస్తుంది ?
ఇంకా ఘాట్టి ....కోపమొస్తే ఆర్ నారాయణ మూర్తి సీడీ పెట్టి సీరియస్ గా చూసేస్తారు ( చూపిస్తారు ) :) :)

నేస్తం

మా ఇద్దరికీ పంతం ఎక్కువే కాబట్టి ఒక్కోసారి అలిగితే వారం రోజులు మౌనవ్రతం చేసిన సంఘటనలు కుడా ఉన్నాయి..ముఖ్యం గా మా వారిని పొగుడుతూ ఒక పొస్ట్ వేయగానే ( ఉదాహరణకి నేనూ ప్రేమించాను..ఇంకా నా పెళ్ళిచూపులు పోస్ట్లు) ఆ మరుసటి రోజే పే..ద్ద గోడవ అయిఫోతుంది విచిత్రంగా ..అదేంటో మరి. కాని చివరాకరికి ఇద్దరం మాట్లాడుకోడానికి బోలెడు కారణాలు వెదికేసుకుంటాం ..ఏ వంకతో మాట్లాడాలా అని ..కానీ ఎక్కువగా , కోపం వస్తే మూతి బిగించి వ్రతానికి నాంది పలికేది నేనే .. తప్పు ఆయనదే కాబట్టి చివరాఖరికి బ్రతిమాలుకునేది ఆయనే :P

మాలా కుమార్

బుజ్జిగాడు మటుకు అలకలో మహా ముద్దొస్తున్నాడు సుమండీ !

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008