Thursday, September 10, 2009

ష'డ్రుచో'పేతమైన సాహితీ విందు...

రెండేళ్లక్రింద నేను , కొత్తపాళీగారు కలిసి పొద్దుకోసం రాసిన షడ్రుచుల సాహిత్యానికి మరికొన్ని పద్యాలు జోడించి పత్రికలకు పంపగా ఆంధ్రప్రభలో మృగశిర కార్తె రోజు సాహిత్య విభాగంలో ప్రచురించబడింది. ఈ వ్యాసాన్ని కష్టపడి, ఇష్టపడి కొత్తపాళీగారి సహకారంతో రాసాను. ఈ వ్యాసం మూలంగానే నాలో సాహిత్యాభిలాష మొదలైంది.. ఈ వ్యాసం రాయడానికి ప్రోత్సహించిన త్రివిక్రమ్ కి ధన్యవాదాలు. ఈ వ్యాసానికి సంబంధించి అన్ని హక్కులు కొత్తపాళీగారు నాకు అప్పుడే ఇచ్చేసారు కాబట్టి పత్రికలో నాపేరుతో పంపించాను.. ఈ వ్యాసం కోసం నవ్వుటద్దాలు, ఆముక్తమాల్యద, శ్రీనాధుని చాటువులు మొదలగు పుస్తకాలనుండి పద్యాలు సేకరించబడ్డాయి..


"ఆకలి రుచెరుగదు” అని సామెత చెప్పిన మన పూర్వులే “పుర్రెకో బుద్ధీ జిహ్వకో రుచీ” అని కూడా శలవిచ్చారు. కోటి విద్యలూ కూటికోసమే అయినా రుచి లేని కూడు ఎవరికి మాత్రం ఇష్టం చెప్పండి? మామూలు మానవమాత్రుల సంగతే ఇలాగుంటే నిజంగానే మరి కోటి విద్యలు నేర్చిన మహా విద్వాంసులు, స్తుతమతులైన ఆంధ్ర కవులు , మన తెలుగు కవిధూర్జటుల సంగతి వేరే చెప్పాలా?

అప్పడుపు కూడు భుజించుటకన్న సత్కవుల్ హాలికులైన నేమి?” అని తృణీకరించటం పోతనగారికి చెల్లింది గానీ .... హాలికులైనా, (శ్రీశ్రీ మాటల్లో) ఆల్కహాలికులైనా మన కవులు “భోజనం దేహి రాజేంద్ర, ఘృతసూప సమన్వితం” అంటూ తమ కవిత్వంలో భోజనానికి పెద్దపీటే వేశారు. అంతేనా! మనవాళ్ళు సుష్టుగా భోజనం చెయ్యడంతో తృప్తిపడి ఊరుకోలేదు. ఏ రుచి ఎలా వస్తుందీ అని వంట మీద కూడా తమ దృష్టిని నిలిపారు.


పదనుగ మంచి కూర నలపాకము జేసిననైన గాని నిం పొదవెడు నుప్పులేక రుచి బుట్టగ నేర్చునటయ్య భాస్కరా

అని భాస్కర శతకకారుడు ఉప్పుని ఆకాశానికెత్తితే, అన్నన్నా అంటూ కొరవి గోపరాజు గారు

గరిత లేని యిల్లు దొర లేని తగవును
చింత
పండు లేని వింత చవియు
చనువులేని
కొలువు శశిలేని రాత్రియు
ముక్కులేని
మొగము నొక్క రూపు

ఇలా చింతపండుని సింహాసన మెక్కించారు.

ఇక కవిసార్వభౌముడైన శ్రీనాథుడు వీటన్నటినీ వదిలి పెట్టి ఏకంగా నరమాంసం ఎలా వండాలో చెప్పాడు చక్కటి చంపకమాలలో తన హరవిలాసం కావ్యంలో భక్త శిరియాళుడి కథ చెబుతూ.

మిరియము నుల్లియున్ బసుపు మెంతియు నింగువ జీరకర్ర
ర్కరమును
చింతపండును గరాంబువు కమ్మని నేయి తైలమున్
పెరుగును
మేళవించి కడుపెక్కు విధంబుల పాక శుద్ధి వం
డిరి
శిరియాళునిం గటికి డెందమునం దరలాక్షులిద్దరున్ !!


అంటూ బ్రహ్మాండంగా వర్ణించేశాడు.


కొండవీటి సీమలో సకల వైభోగాలనుభవించిన శ్రీనాథుడు విధి వశాత్తూ దేశాటనం చెయ్యవలసి వచ్చి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆయన్ని అన్నిటికన్నా బాధించింది ఆయా సీమల వింత రుచులు, భోజనపు అలవాట్లు. ఆయన హాస్యమూ, అపహాస్యమూ, కోపమూ .. అన్నీ మంచి రసవంతమైన పద్యాలుగా జాలువారాయి - ఎంతైనా కవిసార్వభౌముడు కదా! పల్నాటి సీమని చూసి


రసికుడు పోవడు పల్నాడు” అని మొదలెట్టి, “కుసుమాస్త్రుండైన (మన్మథుడైనా) జొన్న కూడే కుడుచున్”అని నొసలు చిట్లించాడు. చల్లా యంబలినీ ఉడుకు బచ్చలి శాకాన్నీ తట్టుకోలేక పూతన చన్నుల విషాన్ని పీల్చేసిన బాలకృష్ణుణ్ణే సవాలు చేశాడు, దమ్ముంటే ఇది తినమని. ఒకసారి ఖర్మకాలి ఎవరో అరవాయన ఈయన్ని భోజనానికి పిలిచాడు. దానికిదీ పర్యవసానం!

తొలుతనే వడ్డింత్రు దొడ్డ మిరియపు చారు
చెవులలో
పొగవెళ్ళి చిమ్మిరేగ
పలు
తెరంగులతోడ పచ్చళ్లు చవిగొన్న
బ్రహ్మరంధ్రము
దాక పారునావ
యవిసాకు
వేచిన నార్నెల్లు పసిలేదు
పరిమళమెంచిన
పండ్లు సొగచు
వేపాకు
నెండించి వేసిన పొళ్ళను
కంచాన
గాంచిన కక్కు వచ్చు
అరవ
వారింట విందెల్ల నాగడంబు
చెప్పవత్తురు
తమ తీరు సిగ్గులేక
చూడవలసెను
ద్రావిళ్ళ కీడు మేళ్ళు !!


అంటూ అసలే భోజన ప్రియుడైన శ్రీనాధుడు అలవాటు లేని తమిళుల భోజనంపై అనాసక్తతను తెలియచేశాడు.

ఇక చివరికి గౌడ డిండిమ భట్టుని జయించటానికి కర్ణాటక రాజ్యానికి వెళ్ళినప్పుడు వడ్డించిన నువ్వులపొడి ఘాటు భరించలేక చేతులెత్తేసి

వెల్లుల్లిన్ తిలపిష్టమున్ మెసవితిన్ విశ్వస్థ వడ్డింపగా ..
చల్లా
యంబలి ద్రావితిన్ ..
తల్లీ
కన్నడ రాజ్యలక్ష్మీ! దయ లేదా! నేను శ్రీనాథుడన్ !”


అని మొరబెట్టుకున్నాడు, పాపం. ఆ మొరలో కూడా ఎంత గీర!!


పల్నాటి సీమలో పర్యటించేటప్పుడు శ్రీనాధుడు అక్కడి ప్రజల ఆహారపుటలవాట్ల గురించి వివరించాడీ చాటువులో. సర్వం జొన్నమయం పల్నాటిసీమలో.


బానెడు జొన్న వంటకము,పంటెడు బాలును, మేటి చారు, యెం
తేనియు
బుల్లగూర,కడు దేరిన మజ్జిగ పెద్ద చెంబెడున్
బూనిచి
కమ్మ చౌదరులు బొఱ్ఱలు పెంచుక కొండవీటిలొ
గానరు
కుంభకర్ణ,గజకర్ణ,హిడింబ, బకాసురాదులన్!!


జొన్నకలి, జొన్నయంబలి
జొన్నన్నము, జొన్నపిసరు, జొన్నలె తప్పన్
సన్నన్నము
సున్న సుమీ పన్నుగ పల్నాటిసీమ ప్రజలందఱకున్పల్నాటి సీమలో నీటివనరులు తక్కువగా ఉన్నాయి. అందుకే వర్షాధార పంట అయిన జొన్నలే పల్నాటి ప్రజలకు ముఖ్య ఆహారము అని శ్రీనాధుడు ఈ పద్యంలో వివరించాడు. జొన్నకలి, జొన్నయంబలి , జొన్నన్నము, జొన్నపిసరు, జొన్నలే తప్ప సన్న బియ్యమన్నం పల్నాడు ప్రజలకు తెలీదు అని శ్రీనాధుడు చెప్పాడు.


పల్నాటిసీమలోని జొన్నన్నములో ఏదో విశేషముందేమో అందుకే శ్రీనాధుడు ఆ గరళకంఠుడికి ఇలా “ హరా! గరళము మ్రింగినానని గర్వించకు. ఒక్కసారి పల్నాడుకు వెళ్లి ఆ జొన్న మెతుకులు తిని చూడు , నీ బిరుదు వదులుకుంటావేమో! “అని సవాలు చేసాడంట.


గరళము మ్రింగితి ననుచున్
బురహర
! గర్వింపబోకు, పో పో పో, నీ
బిరుదింక
గానవచ్చెడి
మెఱసెడి
రేనాటి జొన్న మెతుకులు దినుమీ!


ధూర్జటి మహాకవి శ్రీకాళహస్తీశ్వర శతకంలో తిన్నడి ఎంగిలి మాంసము తిన్న శివుణ్ని ఇలా ప్రశ్నిస్తాడు. ఆ చమత్కారం తిలకించండి.


నీకున్ మాంసము వాంఛయేని కఱవా ! నీ చేత లేడుండగా
జోకైనట్టి
కుఠారముండ ననల జ్యోతుండ నీరుండగా
పాకం
బొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపకా బోయ చే
చే
కొంటెంగిలి మాంసమిట్లు దగునా ? శ్రీకాళహస్తీశ్వరా!!


లేడి, దాన్ని చంపడానికి గొడ్డలి, ఆ మాంసం ఉంచటానికి గిన్నెలాంటి పుర్రె , ఉడికించటానికి నీరు,నిప్పు - అన్నీ నీ దగ్గరే వున్నాయి కదా ఆ బోయవాడి ఎంగిలి మాంసమెందుకు తిన్నావని ధూర్జటి ప్రశ్న . ఇలా వెక్కిరిస్తున్నట్టు చేసే పొగడ్తని నిందాస్తుతి అంటారుట.


ప్రబంధకవులిలా రెచ్చిపోతుంటే పదకవులా ఊరుకునేది ?


తెవులు బడిన వాడు తినబోయి మధురము
చవిగాక
పులుసులు చవిగోరినట్లు” –

అని
ఉపమించాడు పదకవితా పితామహుడు. జ్వరమొచ్చిన వాడికి తియ్యటి పాయసం ఎలా సహిస్తుంది - వాడి నోటి చేదుకి వాడు పులుసుల్నే కోరుకుంటాడు. అట్లాగే తియ్యటి నీ నామాన్ని మరచి మేము ఈ సంసార లంపటాన్ని కోరుకుంటున్నాము ప్రభో అని తాళ్ళపాక అన్నమయ్య రోగనిర్ధారణ చేశాడు.ఇదే ధోరణిలో భద్రాచల రామదాసు “శ్రీరామ నీనామ మేమిరుచిరా” అని పాడాడు. అంతే కాదు, “పాలు మీగడలకన్నా, పంచదార చిలకల కన్నా” అని కొసరు వేశాడు. త్యాగరాజ స్వామి ఇంకో మెట్టు పైకెక్కి “స్వరరాగలయ సుధారసమందు వరరామ నామమనే ఖండ శర్కర మిశ్రము చేసి భుజియిం“చమన్నారు.ఆగండాగండి, వడ్డించాల్సిందింకా చాలా ఉంది, అప్పుడే స్వీట్లలోకి రావట్లేదు. “ఆహార వ్యవహారాల్లో” అంటాం కదా .. అక్కడ కూడా ఆహారందే అగ్రతాంబూలం. అసలు విషయమేవిటంటే వంట, భోజనం మన సంస్కృతి సాంప్రదాయాల్లో అంతర్గత భాగాలు. మన ప్రాంతం, కుటుంబ ఆచారాలు, మన స్థితిగతులు - ఇవన్నీ మన ఆహారపు అలవాట్లని ప్రభావితం చేస్తాయి. ఆముక్తమాల్యదలో గోదాదేవి తండ్రియైన విష్ణుచిత్తుడు అనుదినం వైష్ణవులకు భోజనాలు పెడుతూ వారి సేవచేస్తుంటాడు. ఆ భోజన వైభవం వర్ణించటానికి రాయలవారికి ఒక పద్యం చాలక ఏకంగా నాలుగు పద్యాల్లో వర్ణించాడు. వానాకాలంలో కట్టెలు మండవనీ, పొగరాకుండా వంట చేసేందుకు స్త్రీలు ఎండు కొబ్బరిడెక్కల్ని ఉపయోగిస్తారనీ రాయలవారికెలా తెలిసిందో! ఇంతకీ ఏమి వడ్డించారయ్యా అంటే“…….. ……. ……. కలమాన్నము , నొల్చిన ప్రప్పు , నాలుగే న్బొగిపిన కూరలున్ , వడియముల్, వరుగుల్, పెరుగున్, ఘృతప్లుతిన్.”


వరి అన్నం , పొట్టుతీసి వొండిన పప్పు, నాలుగైదు పోపు వేసిన కూరలు .. ఇలా .. పెరుగుని కూడా నేతిలో ముంచారా ఏవిటని సందేహం వెలిబుచ్చితే,”ఆ మాత్రం ఇంగితం ఉండక్కర్లేదూ! పెరుక్కి ముందు వాటికి మాత్రం ఆ చివరి ఘృతాన్ని అన్వయించుకోవా”లని శలవిచ్చారు మా ఆచార్యులవారు. సరే కానివ్వండి. పోపంటే గుర్తొచ్చిందండీ .. ఇటీవలి కవి మన కరుణశ్రీ గారు అన్నారు –“అమ్మ నీచేతి తాలింపు కమ్మదనము - భరతదేశాన ఘుమఘుమా పరిమళించెపోపు లేనిదేమి వంటండీ ? ఆఖరికి చారు పెట్టుకున్నా అందులో పోపు వేసుకోవాలి కదా. అందుకే కాబోలు ఎవరో అన్నారు - పోపు పెడితే పొలిమేర దాకా ఘాటు రావాలి అని. ఎట్లాగూ ఈ కాలపు కవులని కూడా తల్చుకున్నాం కదా, కాసేపు అవధానాల్లోకి తొంగి చూద్దాం . ఈ అవధానపు పృఛ్ఛకులుంటారే .. వాళ్ళకి నిజంగానే “కాదేదీ కవితకనర్హం” అనిపిస్తుంది కాబోలు. తిరుపతి వెంకట కవులంతటి వాళ్ళని పట్టుకుని చిలకమర్తి వారు పకోడీ మీద పద్యం చెప్పమన్నార్ట - వీళ్ళేనా తక్కువ తినేది?


శనగపిండి ఉల్లిపాయ చిన్ని మిర్పకాయలన్
జునిపి
అందు అల్లమంత దొనిపి ముద్దచేసినన్
అనల
తప్తమైన నేతియందు వైచి వేచినన్
జను
పకోడి అనెడు పేర చక్కనైన ఖాద్యమౌ !!


దోరగా వేగిన చిట్టిపకోడీ లాంటి పద్యం మనముందుంచారు .


ఒక గడుగ్గాయి పృఛ్ఛకుడెవరో దత్తపది అనే అంశంలో “అంబలి, చింతకాయ , కూరగాయ, పాల నేతి ” ఈ నాలుగు తెలుగు మాటల్ని ఉపయోగించి సంస్కృత శ్లోకంలో శ్రీకృష్ణుణ్ణి స్తుతించమంటే అవధానిగారి సమాధానమిది.అంబలి ద్వేషిణం వందే (అం + బలి = బలిని అణచినట్టి)
చింతకాయ
శుభప్రదం (నిను చింతించువారికి శుభాలనిచ్చేటి)
కూరగాయ
కృతత్రాసం ( కు+ఉరగాయ = చెడ్డపాముని, కాళీయుణ్ణి మర్దించిన)
పాలనేతి
గవాం ప్రియం !! ( అవుల్ని కాయటం ఇష్టమైన శ్రీకృష్ణునికి వందనం!!)అని చెప్పి ఊరుకున్నారు. తుమ్మల సీతారామమూర్తి కవిగారి 'సంక్రమణ లక్ష్మీ' విందు భోజనపు పిలుపు చూద్దామా. నోరూరించే ఈ సీస పద్యం తిలకించండి.


సీ. లేగటిపాలలోః గ్రాగి మాగిన తీయ
తీయ
కప్పురభోగి పాయసంబు
చవులూరు
కరివేప చివురాకుతో గమ
గమలాడు
పైరవంకాయ కూర
తరుణకుస్తుంబరీ
దళమైత్రిమై నాల్క
త్రుప్పుడుల్చెడు
నక్కదోసబజ్జీ
క్రొత్త
బెల్లపుః దోడి కోడలై మరిగిన
మదురు
గుమ్మడి పండు ముదురు పులుసుతే
.గీ. జిడ్డు దేఱిన వెన్నెల గడ్డ పెరుగు
గరగరిక
జాటు ముంగాఱు జెఱకురసము
సంతరించితి
విందుభోజనము సేయ
రండు
రండని పిలిచె సంక్రమణలక్ష్మి.అంటూ సంక్రాంతి రోజుల్లో దొరికే పదార్ధాలతో విందుభోజనం చేసేందుకు సంక్రాంతిలక్ష్మి పిలుస్తున్నదని రాశారు.

ఇక మన సినీకవులు కూడా పాటలను ఘుమఘుమలాడించారు. అందులో మరిచిపోలేనిది
"వివాహ బోజనంభు , వింతైన వంటకంబు." ఆ పాట వింటుంటే నోరూరని తెలుగువాడు ఉన్నాడంటే అతిశయోక్తి అనుకోవచ్చు.తృప్తిగా వడ్డించినట్టే లేదు, ఇంకా రుచి చూడవలసినవి చాలా ఉన్నాయి , మీరేమో అప్పుడే భుక్తాయాసం అంటూ చెయ్యి కడుక్కోవడానికి లేస్తున్నారు. సరే కానివ్వండి . ప్రస్తుతానికి “రమణీప్రియ దూతిక యిచ్చే కప్పురపు విడెం” ఉంటే గాని పద్యం పలకదన్న పెద్దన గార్ని తల్చుకుని శలవు పుచ్చుకుంటాం.జ్యోతి వలబోజు

17 వ్యాఖ్యలు:

psm.lakshmi

అయ్యబాబోయ్, ఎన్ని పద్యాలు సేకరించారండీ, కొన్నయితే ఇప్పుడే చదివాను. బాగుంది.
psmlakshmi

నేస్తం

జ్యోతిగారు ఇలాంటివి చదవడమంటే నాకు చాలా ఇష్టం ..వేవేల ధేంక్సులు :)

భావన

వావ్ వావ్ జ్యోతి గారు... చప్పట్లోయ్ చప్పట్లు.... అయ్ బాబోయ్ ఎన్ని పద్యాలు తిండి మీద! మన అందరం ఇపుడు ఐతే శ్రీనాధుడి భాష లో అనాగరికం గా సన్న బియ్యం మానేసి జొన్న రొట్టెలలోకి వెళుతున్నామన్నమాట. ఇన్ని మంచి పద్యాలతో కూడిన మన గత భోజన చరిత్ర ను అందించిన మీకు, సహకరించిన కొత్త పాళి గారికి ధన్య వాదాలు.

కంది శంకరయ్య

cAlA bAgunnAyi. dhanyavAdAlu.

తృష్ణ

its really super....your telugu poem collections are amazing..!!

తారక

bramhandam

వేమన

చాలా బావున్నాయండీ పద్యాలు.
ధన్యవాదాలు.

డా.ఆచార్య ఫణీంద్ర

మంచి ప్రయత్నం ...

శ్రీలలిత

పాతబియ్యం ఆరోగ్యానికి మంచివన్నట్లు, ఆపాత మధురమైన ఆ పాతపద్యాలని చక్కగా యేరి, బాగా వండించి, అందులోకి ధూర్జటి, శ్రీనాధులవంటి మేటి కవులను (కూరలను) చిత్రంగా మేళవించి, మధ్య మధ్యలో నల్చుకుందుకు చాటువులని జొనిపి, కప్పురపు విడెముతో సహా ''షడ్రుచో'' పేతమైన సాహితీవిందు ను మనసారా ఆరగించమని మా ముందుంచిన జ్యోతిగారికి "జయహో".

జ్యోతిగారూ, మిమ్మల్ని మనసారా అభినందిస్తున్నాను. మీరు వ్రాసిన ప్రతి వాక్యం లోనూ దాని వెనకాల మీరు పడిన శ్రమ స్పష్టంగా కనిపిస్తోంది. .శ్రీలలిత....

Bhardwaj Velamakanni

Nice one! Very detailed!

సుభద్ర

షడ్యోపేతసాహిత్య వి౦దే పెట్టారు..అన్నధాత సుఖిభవ.
ఇ౦కా ము౦దు ము౦దు మీరు వ౦డివార్చే వి౦దుకోస౦ ఎదురుచుస్తూ ఉ౦టాను.
చాలా చాలా మ౦చి ఐడీయ!మీ సినియర్టి,మీ ప్రత్యకత చుపి౦చారు.
హ్యట్స్ ఆప్ ..........జ్యోతిగారు.

మరువం ఉష

జ్యోతి, ముందుగా మీ ఇద్దరికీ అభినందనలు. "కష్టపడి, ఇష్టపడి కొత్తపాళీగారి సహకారంతో" వ్రాసిన ఈ ప్రయత్నం నాకు చాలా నచ్చింది. ఇటువంటి వాటిని అమితంగా ఇష్టపడే మా నాన్నగారికి కూడా పంపుతున్నాను. Like nEstam, నాకు తారసపడిన ఈ తరహావి చదవటం అలవాటే కానీ వెదికి చదవటం అంటే అదో నిరాసక్తత. కానీ మీ రచన చానాళ్ళకి సరద సరదాగా చదివించింది. శ్రీనాథ వారి అక్కసు బావుంది. నిజానికి ఈ కవులంతా మునుపు విని, చదివించినవారే, ప్రత్యేకించి ఈ అంశం క్రొత్త. నిజమే, ఇంకా వడ్డించవచ్చు. కానీ భావన అన్నట్లు జొన్న కూటికే తిరిగి మళ్ళుతున్నవారం, ఇన్ని రుచులున్నా అందుకోలేని రోగులం/రాక్షసులం! ;) it's worth my time.

డా.ఆచార్య ఫణీంద్ర

జ్యోతి గారు !
టైటిల్ ... ’ షడ్ర్రుచ్యుపేత సాహితీ సంభోజనం ’ అని ఉండాలి.
ఇన్ని రోజులుగా చెప్పాలా, వద్దా ... అని సంశయిస్తున్నాను. ఆత్మీయులే ... ఏమి అనుకోరులే ... అని ఇప్పుడు ధైర్యం చేసాను.

జ్యోతి

అందరికి ధన్యవాదాలు...

ఫణీంద్రగారు,
ఎందుకండి సంకోచం. తప్పు చూపితేనే కదా నాకు తెలిసేది. నేను షడ్రుచుల సాహిత్యం, సాహిత్యంలోషడ్రుచులు అని ఇచ్చాను. కాని ఈ టైటిల్ పత్రికలవాళ్లు పెట్టుకున్నారు. నేనేమి చేసేది???

డా.ఆచార్య ఫణీంద్ర

జ్యోతి గారు !
మీ ’ షడ్రుచుల సాహిత్యం ’ అన్న మకుటం క్లుప్తంగా, మధురంగా, దోష రహితంగా ఉంది.
రస + ఉపేతం = రసోపేతం ... గుణ సంధి
రుచి + ఉపేతం = రుచ్యుపేతం ... యణాదేశ సంధి ( అతి + ఉత్సాహం = అత్యుత్సాహం .. లాగా.)
అలాగే ...
’ సాహితీ ’ ... సంస్కృత శబ్దం
’ విందు ’ ... తెలుగు పదం
’ సాహితీ విందు ’ ... దుష్ట సమాసం !
పత్రికలలో సాహిత్య శీర్షికలను నిర్వహించే ఉద్యోగుల స్థాయి ఇలా ఉందంటే ... బాధగా ఉంది.
’ ఆంధ్ర ప్రభ ’ లో ఇలాగ ... అంటే మరీ బాధగా ఉంది.
మీ వ్యాసం బాగుంది. మీరు దానికి ’ షడ్రుచుల సాహిత్యం ’ అన్న శీర్షికనే ఉంచుకొమ్మని నా సూచన !

ఊకదంపుడు

బ్లాగ్లోకంలో రాకేశుడు రాసిన మిడతంభొట్ల గణేశు భోజనప్రియత్వం ఇక్కడ

http://andam.blogspot.com/2009/03/blog-post_23.html

Karanam Kalyan Krishna Kumar

బ్రేవ్ మనిపించారు.. వాతాపి జీర్ణం కూడా కావాలేమో.. అంతటి పద్య పద పల్లవుల తో మీరు వండి వడ్డించిన విస్తరి సంపూర్ణం గా ఖాళీ చేసి లేచేందుకు భుక్తాయాసం గా వున్నది.. అద్భుతం అనడం కన్నా అత్యద్బుతమే సరైన పదం అక్షరాన్నదాత సుఖీభవ సుఖీభవ అనాలె. .. చిన్నవాణ్ణేమో.. నమోనమ:

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008