Wednesday, September 30, 2009

ఏది మంచి ఏది చెడు..?

మనం కోరుకున్నవి సాకారమైతే మంచి జరిగిందని, కోరుకోనిదేదైనా తటస్థిస్తే చెడు జరిగిందని అపోహ పడుతుంటాం. ఈ ప్రపంచంలో ఏ సంఘటన జరిగినా అది మనల్ని ఒక్కరిని దృష్టిలో పెట్టుకుని జరగదు. అంతెందుకు మన జీవితాన్ని ప్రభావితం చేసేవిగా మనం భావించే పెళ్లి, పిల్లలు పుట్టడం, ఆత్మీయులకు దూరం కావలసి రావడం వంటివన్నీ మనకెంత ముఖ్యమైనవిగా తోస్తాయో 'నేను' అనే వలయాన్ని ఛేధించుకుని ఆవలి నుండి చూస్తే మనతోపాటే ఆయా సంఘ టనల వల్ల ప్రభావితం అయ్యే జీవితాలు ఎన్నో! పెళ్లనేది జరిగితే అది కేవలం ఇద్దరి వ్యక్తులకే పరిమితమైన సంఘటన కాదు. దాన్ని కేంద్రబిందువుగా చేసుకుని ఇరువర్గాల కుటుంబ సభ్యుల్లోనూ అంతర్లీనంగా కొద్ది సర్ధుబాట్లు చోటుచేసుకుంటాయి. ఆ కొత్త దంపతులు, ఆ కొత్త బంధాలు మరిన్ని అనూహ్యమైన సంఘటనలకు దారితీస్తాయి. ఈరోజు మనకు డబ్బు వచ్చిందంటే అది మరొకరి చేతుల నుండి పోబట్టే! ఈ క్షణం మనకు ఎదురైయ్యే ఆనందాలు, విషాదాలు అన్నింటికీ తీగలాగితే వెనుక మనకు తెలియని ఎన్నో అంశాలు చిక్కుముళ్లుగా ముడిపడి ఈ క్షణాన్ని మన కళ్లెదుట నిలుపుతాయి. గతం తాలూకు మేళవింపుగా, భవిష్యత్‌ తాలూకు నిర్ణయాత్మకశక్తిగా మాత్రమే 'ఈ క్షణం' నిర్మితమై ఉంటుంది. అందుకే ఈ క్షణం మనం అనుకున్నది జరిగినంత మాత్రాన సంతోషించడం, కష్టం కలిగితే కుంగిపోవడం అనాలోచితమైన వ్యక్తీకరణలు.జీవితం అంటేనే ఓ గొలుసుకట్టు అనుభవాల సమాహారం. ఈ క్షణం మనం ఆస్వాదించేదీ, కుంగదీసేదీ గతం తాలూకు చిహ్నం కావచ్చు, భవిష్యత్‌లో పూర్తి విభిన్నమైన అనుభవాన్ని మిగల్చడానికి ఆదిబిందువు కావచ్చు. అన్నింటికీ మించి ఇప్పుడు తటస్థించిన అనుభవం ఏదైనా కావచ్చు, అది మనకు మాత్రమే మంచి జరిగింది, మనకు మాత్రమే చెడు జరిగింది అని నిర్థారణకు రావడం హాస్యాస్పదమే. మన ప్రమేయం లేకుండా గడిచిపోయే జీవితంలో కేవలం మనం పాత్రధారులం మాత్రమే. మన పనిని చిత్తశుద్ధితో చేసుకుంటూ కర్మయోగిగా ముందుకు సాగాల్సిన వాళ్లమే తప్ప సంఘటనల వెనుక కార్యాకారణ సంబంధాలను అన్వేషించడానికి పూనుకుంటే ఏదో ఒక దశలో ఏ సంఘటన యొక్క ఆద్యంతమూ మనకు ఊహకు అందదు. అలా పూనుకోవడం వృధా ప్రయాసే అవుతుంది. సృష్టి లయబద్ధంగా ఎన్నో జీవితాల్ని ప్రభావితం చేస్తూ తన ధర్మం పాటిస్తూ ఉంటుంది. ఆ క్రమంలో కొన్ని క్షణాలు కొందరికి సంతోషదాయకమైనవి అయితే మరికొన్ని క్షణాలు మరికొందరికి నిరాశనే మిగుల్చుతాయి. ఈ క్షణం ఇలాగున్నంత మాత్రాన ప్రతీ క్షణమూ ఇలాగే ఉంటుందని నిర్థారణకు రావడం అపరిపక్వమైన ఆలోచనాసరళి! అలాగే ఏది ఎవరికి మంచో, ఎవరికి చెడో తెలుసుకోగలిగిన స్థూలదృష్టి మనకు లేనప్పుడు.. చిత్తశుద్ధిగా మనం చేసేదంతా మంచికే అనుకుని మౌనంగా పనిచేసుకువెళ్లడమే ఉత్తమం.

- మీ
నల్లమోతు శ్రీధర్
కంప్యూటర్ ఏరా అక్టోబర్ - 2009 మాసపత్రిక ఎడిటోరియల్

11 వ్యాఖ్యలు:

Surabhi

Nice post Sridhar Gaaru,
Back in my school days when I was leaving the school my teacher gave me a autograph with the below quotation, which I couldn't understand at that age but as days passed, I could really feel it when ever I achieved something. After reading your post that quotation came in to my mind.
" There are two tragedies in life, one is not to get your hearts desire fulfill and other is to get it".

Jyothy Gaaru,
I always read your posts too and like them very much but since I'am not expertisied in typing telugu, I usually don't comment.

Anonymous

Very good post !

1)బాద్యతను అధికారం అనుకొని కొందరు
2)బాద్యతలను బాదలు అనుకొని కొందరు అనుకుంటూ వుంటారు.

"బాద్యత" అనే వర్డ్ మీద కూడా టైమ్ వున్నప్పుడు మీరు వ్రాస్తే మీ అభిప్రాయాన్ని తెలుసుకొవాలని వుంది.

Unknown

సురభి గారు మీ స్పందనను తెలియజేసినందుకు ధన్యవాదాలండీ.

భావన

చప్పట్లోయ్ చప్పట్లు....చాలా బాగా చెప్పేరు శ్రీధర్ గారు . ఈ క్షణాన మనం చేసే పని ముందు క్షణానికి నిరణయాత్మక శక్తి అవుతుందని గుర్తు పెట్టుకుంటే మనం చేసే పనులలో సాత్వికత, ఈ గొలుసుకట్టు అనుభవాల సమాహారం లో మనమొక లింక్ మాత్రమే అని అర్ధం చేసుకుంటే ఈ ఆవేశ కావేశాలు తగ్గి సంయమనం అలవడతాయేమో, అంత తేలిక కాదు కాని ప్రయత్నిద్దాము... మనది కానిదేది మనకు రాదు మనదైనదేది మన నుంచి పోదు, మనశ్శాంతైనా, ఆవేదనైనా.. చాలా బాగా చెప్పేరు శ్రీధర్ గారు మరొక్క సారి చప్పట్లు...

Unknown

@ a2zdreams గారు మీ స్పందనను తెలియజేసినందుకు ధన్యవాదాలండీ. బాధ్యతని బరువుగా మోయడమా, అధికారంగా చెలాయించడమా, నిజంగా నిజమైన బాధ్యతగా నెరవేర్చడమా అన్న దాన్ని బట్టి వేర్వేరు రూపాలు కన్పిస్తుంటాయి. తప్పకుండా వీలైనప్పుడు నా అభిప్రాయాన్ని విశదంగా రాస్తాను.

@ భావన గారు, "ఈ గొలుసుకట్టు అనుభవాల సమాహారంలో మనమొక లింక్ మాత్రమే" అని చాలా బాగా ఎక్స్ ప్రెస్ చేశారు. అది ముమ్మాటికీ సత్యం. మీ వ్యాఖ్య పోస్ట్ కి మరింత క్లారిటీని తెచ్చింది. ధన్యవాదాలండీ.

M.Srinivas Gupta

"అనుకున్నది జరిగినంత మాత్రాన సంతొషించడం, కష్టం కలిగితె కుంగిపొవడం అనాలొచితమైన వ్యక్తీకరణలు" లైన్ బాగుంది.
చాల బాగ వ్రాశారు.

Unknown

శ్రీనివాస్ గుప్త గారు ధన్యవాదాలండీ.

జయ

'తలచినదే జరిగినదా దైవం ఎందులకు
జరిగినదే తలచితివా, శాంతి లేదు నీకు '
అన్న పాత పాటను గుర్తుకు తెచ్హారు. ఇవన్ని కోట్ల విలువ చేసే జీవిత సత్యాలు. మీ వివరణ చాలా బాగుంది.

మరువం ఉష

nice post Sreedhar and very good comment Bhavana!

sreenika

చిత్తశుద్ధిగా మనం చేసేదంతా మంచికే అనుకుని మౌనంగా పనిచేసుకువెళ్లడమే... ఇదొక్కటి చాలు. ప్రతి ఒక్కరూ ఇలానే అనుకుని ముందుకు సాగిన నాడు మనిషి ఖేదామోదాలను సమంగా స్వీకరిస్తాడు. ఏ ఉద్రేకాలకి లోను కాడు.కలిమిలేమిలలో సమ భావం కలుగుతుంది.
చాలా బాగా వ్రాసారు.

Unknown

జయగారు, ఉష గారు, శ్రీనిక గారు మీ స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలండీ.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008