Wednesday, May 26, 2010

నాన్నమ్మ చెప్పిన కథ...

వేసవి అనగానే గుర్తొచ్చేది అమ్మమ్మ, నాన్నమ్మ, కథలు, బోలెడు ఆటలు, నో చదువులు . మా చిన్నప్పుడు టీవీలు , కంప్యూటర్లు , వీడియో గేమ్స్ లేకున్నా వేసవి సెలవులను మాత్రం బాగా ఎంజాయ్ చేసేవాళ్లం. సెలవులు మొదలు కాగానే మా పెదనాన్నగారి దగ్గర ఉండే నాన్నమ్మ వచ్చేది. అమ్మమ్మ వచ్చి ఉండడం తక్కువ. కూతురింట్లో ఉండకూడదంట. నాన్నమ్మ వచ్చిందంటే పిల్లలకు పండగే. ఆమెకు సినిమాలంటే చాలా ఇష్టం. రోజూ చూడమన్నా చూసేది. ఒక్కడాన్ని పంపలేక నన్ను తోడుగా పంపేది అమ్మ. ఇంటికి దగ్గరే థియేటర్. అలా తనతో కలిసి ఎన్నో జానపద, భక్తి సినిమాలు చూసాను. టికెట్ ఎంతని యాభై పైసలే. పొద్దంతా మా ఆటలు, బొమ్మలపెళ్లిల్లు అయ్యాక రాత్రి నాన్నమ్మ వెంటపడేవాళ్లం కథ చెప్పమని. అడిగిన వెంటనే చెప్పేది కాదు. రాత్రికి తొందరగా తినేసాక చెప్తాను అనేది. కథ కోసం మేమూ తొందరగా తినేసి, నాన్నమ్మను కూడా తొందరగా తినమని సతాయించేవాళ్లం. ఇక పక్కలు పరుచుకుని అందులో కూర్చుని కథలు వినేవాళ్లం. నిజంగా అమ్మమ్మలు, నాన్నమ్మలు కథలు ఎంతా బాగా చెప్పేవారో? వాళ్లు చెప్తుంటే ఆసక్తిగా వినడమే తప్ప పిల్లలు మధ్యలో ఒక్క ప్రశ్న కూడా అడిగేవారు కాదు. అంతగా లీనమయ్యేవారు. అమాయకమైన, కల్మషం లేని బాల్యం. ఏది చెప్పినా నమ్మేస్తుంది కదా. పన్ను ఊడిపోయి నొప్పితో ఏడుస్తుంటే ఆ బాధ మరిపించడానికి మట్టిలో ఊడిపోయిన పన్ను పాతిపెడితే డబ్బులచెట్టు మొలుస్తుందని అమ్మ చెప్తే నిజమని నమ్మి ఏడుపు ఆపి ఆ పన్ను తీసికెళ్ళి మట్టిలొ పాతిపెట్టడం. చెట్టు మొలిచిందా లేదా అని రోజూ చూడడం... పదిరోజులు అలా చూసి మర్చిపోవడం. పుస్తకాలలో నెమలి ఈక పెడితే అది పిల్లలు పెడుతుంది. ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది , బోలెడు డబ్బులు ఇస్తుంది అంటే కష్టపడి. స్నేహితులకు లంచాలు ఇచ్చి నెమలిఈక సంపాదించి పుస్తకంలో పెట్టుకుని అదో అదృష్టరాయిలా అపూర్వంగా చూసుకోవడం. జానపద సినిమాలు చూసి, అమ్మమ్మ చెప్పిన కథల్లోని రాజకుమారులను తలుచుకుని టవల్ తీసుకుని భుజాల మీదుగా కట్టుక్కుని చీపురు పుల్లలతో కత్తి యుద్ధం చేయడం... ఎప్పటికీ మరచిపోలేని మధురమైన జ్ఞాపకాలు కదా.

ఈ సోదంతా ఎందుకు గుర్తొచ్చింది అంటే కల్పన అమ్మ చెప్పిన కథలు రాయండర్రా అంటే ఒక్కసారి బాల్యంలోకి వెళ్లిపోయా. ఎన్నో కథలు చెప్పించుకున్నాకాని ఒక్క కథ మాత్రం మొత్తం గుర్తుంది. నాన్నమ్మ లేనప్పుడు అమ్మని కథలు చెప్పమంటే ఇంటిపనికే తీరడంలేదు అని పుస్తకాలు కొనిచ్చేది. చదవమని ప్రోత్సహించేది. పుస్తకాలు అంటే అస్సలు వెనుకాడేది కాదు అమ్మ. నాన్నమ్మ చెప్పిన చిక్కుడు కథ గుర్తొస్తే నవ్వొస్తుంది. అప్పుడు ఏ కథ విన్నా, చదివినా, సినిమా చూసినా అన్నీ నిజంగానే జరిగాయి అని పూర్తిగా నమ్మేదాన్ని. అందరూ అంతేనేమో. ఈ కాలం పిల్లలే హైటెక్ ఐపోయారు. అంత సులువుగా ఏదీ నమ్మరు. నాన్నమ్మ చదువుకోలేదు. కాని ఆమె చెప్పిన కథ పాతికేళ్ల తర్వాత మా పిల్లలకు కథల పుస్తకాలు కొంటుంటే అదే కథను ఇంగ్లీషులో చూసాను.

అప్పటి కథలేమో కాని ఎలా చెప్పేవారంటే పిల్లలు అల్లరి చేసినా, అన్నం తినకున్నా, చెప్పింది వినకున్నా అన్నీ ఆ కథలో చేర్చేసి అలా చేస్తె ఇలా అవుతుంది అని నీతి చెప్పేవారు. భలే ఉంది కదా.. ఇక కథలోకి వస్తే... అనగనగా ఒక అల్లరి పిల్లవాడు. అమ్మ ఉంది కాని నాన్న లేడు. చదువుకోమంటే ఎప్పుడూ ఆడుతూ ఉండేవాడు. ఒకసారి స్కూలుకెళ్లకుండా గోళీలాడుతున్నాడని వాడిని తల్లి బాగా కొడుతుంది. అప్పుడు వాడు కోపంతో వాళ్లింట్లో ఉన్న చిక్కుడు తీగ ఎక్కి పైకి వెళ్లిపోయాడు. ఎంత పైకి పోయాడు అంటే పైన మరో లోకం దగ్గరకు. అక్కడ పెద్ద పెద్ద ఇల్లు, పూల తోటలు, చెట్లు, కొలనులు ఉన్నాయి. ఆ పిల్లాడి పేరేంటి? అంటే శంకర్ అనుకోండి. శంకర్ అలా పైకి వెళ్లి అటు ఇటూ తిరుగుతుండగా ఒక పెద్ద కోట కనిపిస్తుంది. అందులోనుండి ఎవరో ఏడుస్తున్నట్టు వినిపిస్తుంది. వాడు లోపలికి వెళ్లి చూస్తే ఒక అమ్మాయి చినిగిన బట్టలు వేసుకుని , బక్కచిక్కిపోయి (సరిగ్గా అన్నం తినకుంటే అలా అవుతారన్నమాట) పని చేస్తూ ఉంటుంది (చదువుకోకపోతే ఇలాగే వేరేవాళ్ల ఇంట్లో పని చేయాల్సి వస్తుంది).. శంకర్ ఆ అమ్మాయిని "ఎవరు నువ్వు? ఎందుకు నువ్వు పని చేస్తున్నావు? నీకు ఎవరూ లేరా? " అని అడుగుతాడు. ఒక రాక్షసుడు తనను ఎత్తుకొని వచ్చి ఇక్కడ బంధించాడు. మొత్తం పని చేయించుకుంటాడు అని చెప్తుంది. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు. రోజు శంకర్ మధ్యహ్నం సమయంలో పైకి వెళ్లి ఆ అమ్మాయితో ఆడుకుని ఆ అమ్మాయి రాక్షసుని గదినుండి తీసుకువచ్చి ఇచ్చిన పళ్లు, కొత్త బట్టలు తీసుకుని కిందకు వస్తాడు. తల్లి ఇవన్నీ ఎక్కడివి అని అడిగితే జరిగింది చెప్తాడు. ఇలా కొంత కాలం జరుగుతుంటుంది. ఆ అమ్మాయి కూడా సంతోషంగా ఉంటుంది. ఒకసారి ఆమెను కిందకు తీసుకు వచ్చి తల్లికి చూపిస్తాడు. ఆమె ప్రేమగా మాట్లాడి భోజనం పెడుతుంది. పైన రాక్షసుడి తిరిగి వచ్చి అమ్మాయి లేకపోవడం చూసి కోపంతో అరుస్తాడు. ఎక్కడికి పోయింది అని వెతుకుతూ చిక్కుడు తీగను చూస్తాడు. అతని అరుపులు కింద ఉన్నవాళ్లకు వినిపిస్తాయి. రాక్షసుడు గట్టిగా అరుస్తూ చిక్కుడు తీగను పట్టుకుని కిందకు దిగుతుంటాడు. అది చూసి భయపడుతున్న శంకర్ ని చూసి అతని తల్లి గొడ్డలి ఇచ్చి ఆ చిక్కుడు తీగను కొట్టేయమంటుంది. అతను అలాగే చేస్తాడు. ఆ రాక్షసుడు అంత పైనుండి పడి తల పగిలి చనిపోతాడు. అప్పుడు ఆ అమ్మాయిని వాళ్ల తల్లితండ్రుల దగ్గరకు చేరుస్తాడు శంకర్.. ఇది కథ.

ఈ కథ చెప్తుంటే నేను, మా తమ్ముళ్లు సీరియస్సుగా వినేవాళ్లం. అందులో ఒక్క సందేహం వచ్చేది కాదు. అసలు చిక్కుడు తీగ ఎలా ఉంటుందో తెలిస్తే కదా. దాన్ని పట్టుకుని ఎక్కవచ్చో లేదో తెలిసేది. ఒహో ఆ చెట్టు చాలా పెద్దగా ఉంటుందేమో అని అనుకునేవాళ్లం. మన ఇంట్లో కూడా అలా ఉంటే ఎంత బాగుంటుంది. హాయిగా పైకి వెళ్లేవాళ్లం. అని అనుకునేవాళ్లం. తర్వాతెప్పుడో అమ్మ ఇంట్లో చిక్కుడు పాదు వేసింది. దానికి పందిరి కూడా కట్టింది. చిక్కుడుకాయలు పెద్దగా బానే వచ్చేవి కాని మాకు ఒకటే సందేహం ఈ తీగ ఇంత సన్నగా ఉంది దాన్ని పట్టుకుని పైకి ఎలా వెళతారబ్బా? అని. పాతికేళ్ల తర్వాత అనుకుంటా మా పిల్లలకోసం ఒక పుస్తక ప్రదర్శనలో కథల పుస్తకాలు చూస్తుంటే ఇంగ్లీషులో ఇదే కథ కనిపించింది. ఆశ్చర్యమేసింది.. నేను చిన్నప్పుడు విన్న కథ కదా అని.

అదో అందమైన బాల్యం. తిరిగిరాదు. మరపురాదు..

ఎందుకో గూగులమ్మని ఈ కథ గురించి అడిగితే ఇది ఇచ్చింది.. మీరు ఓ లుక్కేయండి..

8 వ్యాఖ్యలు:

వేణూశ్రీకాంత్

బాగుంది :-)

రవి

ఓహ్. బ్రహ్మాండంగా ఉంది.

Kalpana Rentala

జ్యోతి, చిక్కుడు కథ బాగుంది. నేను ఇంగ్లీష్ లో వున్న చిక్కుడు తీగ కథ అనుకున్నాను మొదట.

శ్రీలలిత

కథ చాలా బాగుంది.

Hima

Hai Jyothi Garu,

Mee posts chala baguntayi. Thank you for such nice info that you are sharing.

One small request. I like your Shadruchulu a lot. When I trying the link here these days I am getting Bad request.

Thanks
Hima

జ్యోతి

Hima గారు,

షడ్రుచులు సైట్ మెయింటేనెన్స్ జరుగుతుంది. అందుకే రెండు మూడు రోజులు కాస్త ఇబ్బంది ఉంటుంది.

Unknown

chala bagundi...
ii katha nenu inthaku mundu vinaledu...
meeru naku oka katha chepparochh!!! :)

భావన

బాగుంది క జ్యోతి. నేను కూడా విన్నా ఈ కధ. తెగ హాశ్చర్య పోయే దానిని ఎలా నబ్బా అని. బాగుంది :-))

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008