Wednesday 19 May 2010

జామాత దశమగ్రహ:

పెళ్లి ఇద్దరు వ్యక్తుల కలయిక కాదు. రెండు కుటుంబాలు, రెండు వంశాల శాశ్వత కలయిక. ఎక్కడో పుట్టి , ఎక్కడో పెరిగిన అమ్మాయి, అబ్బాయి పవిత్రమైన వివాహబంధంలో ఒక్కటవుతారు. అటువంటప్పుడు కోడలు, అల్లుడు గురించి ఎన్నో సర్దుబాట్లు, సమస్యలు. ఆరోపణలు తప్పవు కదా. కోడలంటే అత్తవారు చెప్పినట్టు చేయాలి కాబట్టి ఆరోపణలు ఉన్నా తక్కువే అని చెప్పవచ్చు. కాని అల్లుడు విషయంలో మాత్రం అలా కాదు. ఇప్పుడు అల్లుడు ఎందుకు గుర్తొచ్చాడు అనుకుంటున్నారా? అబ్బే!! నాకు అల్లుడు రావడానికి టైముంది కాని అప్పుడెప్పుడో అల్లుళ్లైనవాళ్లు, మొన్న మొన్న అల్లుళ్లైనవాళ్లు, ఇపుడు కాబోయే అల్లుళ్లు, కొన్నేళ్ల తర్వాత కాబోయే అల్లుళ్లు. అందరికీ ముందుగా అభినందనలు. ఇక అసలు విషయానికొద్దాం. కోడలు మా ఇంటి మహాలక్ష్మి, గృహలక్ష్మి అది ఇదీ అంటారు. కాని అల్లుడంటే అంత మంచి అభిప్రాయం లేదు చాలామందికి. ఎప్పుడూ కట్టుకున్న ఇల్లాలిని, అత్తవారిని పీక్కుతింటాడు అనుకుంటారు. ఇప్పుడే కాదు పురాణకాలం నుండి అల్లుడిని ఆడిపోసుకునేవాళ్లే... కవులైనా , సామన్యులైనా.. పాపం అల్లుడిని దశమగ్రహం అని కూడా అంటారు. మనకు ఉన్నవి నవగ్రహాలే. కాని ఈ అల్లుడు పదో గ్రహమెందుకయ్యాడు?

అల్లుణ్ని దశమ గ్రహమంటూ ఒక కవి ఇలా అన్నాడు.

సదా వక్రః సదా క్రూరః సదా పూజా మపేక్షతే
కన్యా రాశి స్థితో నిత్యం జామాతా దశమో గ్రహః 11

సూర్యుడు తప్ప మిగతా గ్రహాలన్నీ ఎప్పుడూ శుభమే కలుగచేస్తూ అప్పుడప్పుడు మాత్రమే వక్రిస్తాయి. కాని జామాత అంటే అల్లుడు మాత్రం ఎప్పుడూ వక్రంగానే ఉంటాడు. గ్రహాలన్నింటిలోకి శనిగ్రహమంటే చాలా మందికి భయం. ఎందుకంటే అతను ఒక్కోసారి క్రూరంగానూ, ఒక్కోసారి శుభకరంగానూ ఉంటాడు. ఈ అల్లుడున్నాడే ఎపుడూ క్రూరంగానే ఉంటాడు. అతనికి అత్తవారంటే అస్సలు మర్యాద, జాలి , దయ ఉండదు. అంతేనా!! నవగ్రహాలకి నిర్ణీతమైన సమయాల్లో పూజలు చేయాల్సి ఉంటే అల్లుడికి మాత్రం నిత్యమూ పూజ జరగాల్సిందే. మర్యాదలు చేయాల్సిందే అతడికి అల్లుడొచ్చినా సరే. గ్రహాలన్నీ తమ సంచారంలో రాశులు మారుతూ ఉంటాయి. కాని అల్లుడెప్పుడూ కన్యారాశి( కూతురు) లోనే ఉంటాడు. అత్తవారింటిలోని వారందరిని చులకన చేస్తుంటాడు. అందుకే అల్లుడు నవగ్రహాలకంటే భిన్నమైన దశమగ్రహం అయ్యాడన్నమాట. ఈ మాట అనేవారికి అల్లుడి మూలంగా ఎన్ని అవస్ధలు పడితే ఇంత మాట అంటారు.

అంతే కాదు అల్లుడు మరింత అభాసుపాలయ్యాడు. ఎంతవరకు అంటే పద్యకవి బ్రహ్మం తన సరస్వతీ శతకంలో అల్లుణ్ని నల్లి(మత్కుణం) అంటూ తన కసిని వెళ్లగక్కారు.

వరకట్నంబని మామ నెత్తురును ద్రావంగోరు పైశాచికో
దరు నల్లున్ దశమ గ్రహంబనుట సార్ధంబౌను, యోచించినన్
నరరూపాకృతి మత్కుణంబనుటయే న్యాయంబుగా దోచెడిన్
వరగల్ క్షేత్ర సరస్వతీ! భగవతీ! నాగేశ్వరీ! భారతీ!


వరకట్నము కోసం పిల్లనిచ్చిన మామను పీక్కుతిని, నెత్తురు త్రాగే పిశాచమువంటి అల్లుడు దశమగ్రహమనడం సమంజసమే. అసలైతే మనుష్యుల రక్తాన్ని పీల్చే నల్లి (మత్కుణము) మానవాకారంలో అల్లుడై మమ్మల్ని దోచుకుంటున్నాడు అని ఆ కవి తన ఆక్రోశాన్ని ఇలా వెళ్లగక్కాడు. ఇలా పెళ్లిలో ఇచ్చిన కట్నం సరిపోలేదని అది కావాలి ఇది కావాలి అని అస్తమానం అత్తమామలను సతాయించేవాళ్లు ఎందరో ఉన్నారు .. ఇలా అనడం సబబే మరి. ఐనా వాళ్లు మాత్రం ఏం చేస్తారు?? కూతురి కోసం భరించక తప్పదు.


కాళ్లకూరి నారాయణరావుగారి "వర విక్రయం"నాటకంలో అల్లుడు అనేవాడు ఎలాంటివాడో చెప్పారు. ఎలాగంటే...

అప్పొసంగిన వాడును, అల్లు, డద్దె
యింటి యజమానుడు, జీతమిచ్చువాడు
కుల వినోదియు, పన్నులు కూర్చువాడు
పుస్తె కట్టని మగలె పో పురుషులకు !!



మగవాళ్లకు మగవాళ్లు పుస్తెలు కట్టడమేంటి? విడ్డూరంగా ఉందే! మొగుళ్లంటే బాధలుపెట్టేవాడు, విసిగించేవాడు అన్నమాట. అప్పు ఇచ్చినవాడు, అల్లుడు, అద్దె యింటి ఓనరు, పన్నులేసేవాడు, కుల వినోది .. వీళ్లందరూ మగాళ్లకే తాళికట్టని మొగుళ్లు. అలా ఉంటాయి మరి వాళ్లు పెట్టే బాధలు. అనుభవించివాడికే తెలుస్తుంది.

అంతే కాదండోయ్.. నా కూతురిని పెళ్లి చేసుకోమని అడిగిన తండ్రికి ఆ అల్లుడి కోరికలు ఇలా ఉంటాయి. ఇవి పెళ్లితో ఆగవు. తర్వాత కూడా కొనసాగుతూనే ఉంటాయి. అల్లుడి కోరికలు తీర్చడమే అత్తవారి కర్తవ్యం , బాధ్యత అన్నట్టు.

నీటైన యింగ్లీషు మోటారు సైకిలు
కొనిపెట్ట వలెనను కూళయొకడు
రిస్టువాచియు, గోల్డు రింగును, బూట్సును
సూట్లు గావలెనను శుంఠయొకడు
బియ్యే బియెల్ వరకయ్యెడు ఖర్చు భరింప
వలెనను దరిద్రుడొకడు
భార్యతోడను చెన్న పట్టణంబున నుంచి
చదివించవలెనను చవటయొకడు
సీమ చదువులు చాల సింపులు నన్నట
కంపవలయు ననెడి యజ్ఞుడొకడు
ఇట్లు కొసరు క్రింద నిష్టార్ధముల్ వరుల్
దెలుపుచున్నవారు తెల్లముగను!!


ప్రస్తుతం పెళ్ళిళ్ల వ్యాపారంలో ఇవన్నీ తప్పనిసరి ఇవ్వవలసిందే. చదువును బట్టి ఒక్కో రేటు. లేటెస్టు మోటారు సైకిలు, రిస్టు వాచీ, బంగారు ఉంగరం, రెండువేలకు తగ్గని బూట్లు, పెళ్లి తర్వాత అతని చదువుకయ్యే ఖర్చు, లేదా విడేశాలకు భార్యతో పాటు వెళ్లడానికి కూడా మామ పెట్టాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. ఆడపిల్లను కని పెళ్లి చేయాలంటే ఈ ఖర్చు పెట్టడం అమ్మాయి తండ్రికి తప్పదు అని వారి భావన. వీళ్లను కూళ (క్రూరుడు), శుంఠ, దరిద్రుడు, చవట, అజ్ఞాని.. ఏ పేరు పెట్టి పిలవాలో అర్ధం కాదు.

అప్పిడినవాని నధికారి నతిశయించి
అల్లు రొందించు బాధల నెల్లగాంచి
అడలి నిజముగా హరిహరులంతవారు
కూతులం గంటయే మానుకొన్నవారు!!


అప్పిచ్చినవాడికంటే ఎక్కువగా వేధిస్తున్న అల్లుళ్లను చూసి భయపడి శివకేశవులే కూతుళ్లను కనడం మానుకున్నారంట. ఇక సామాన్యమానవుల బాధలు చెప్పతరమా? ఈ బాధలకేనేమో ఆడపిల్లలు వద్దు అని పురిట్లోనే మృత్యువు ఒడికి చేరుస్తున్నారు. పుట్టకముందే చంపేస్తున్నారు

ఇంకా ఈ అల్లుడి గురించి బద్దెన కవి సుమతీ శతకంలో ఏమన్నాడయ్యా అంటే..

అల్లుని మంచితనంబును
గొల్లని సాహిత్య విద్య కోమలి నిజమున్
పొల్లున దంచిన బియ్యము
తెల్లని కాకులును లేవు తెలియర సుమతీ!!


గొల్లవాడి పాండిత్య జ్ఞానము, ఆడదాని యందు నిజము, పొల్లులో దంచిన బియ్యము. తెల్లని కాకులు ఎలా ఉండవో అదే విధంగా అల్లునిలో మంచితనము కూడా ఉండదు అని నొక్కి వక్కాణించారు. నిజమేనంటారా? ఆ బాధ తెలిసినవాళ్లు ఔననే అంటారు. ఇంకేం చేస్తారు?

ఇక అత్తవారింట్లోనే తిష్ట వేసిన అల్లుడి పరిస్థితి ఎలా ఉంటుందయ్యా అంటే?

శ్వశుర గృహ నివాశః స్వర్గతుల్యో నరాణాం
యది భవతి వివేకః పంచభి షడ్ దినై ర్వా
దధి మధు ఘ్రుతలోపో మాసమేకం నరాణాం
తదుపరి దినమేకం పాదరక్ష ప్రయోగః !!



అల్లుడనే కాదు ఎవరింటికైనా వెళ్లి రోజుల తరబడి కదలకుండా అక్కడే ఉండి ఇంటివారిని ఇబ్బంది పెడితే వారు మాత్రం ఏం చేస్తారు. తన్ని తగలేయకముందే మనమే బయటపడాలి. ఇక అల్లుడి సంగతికొస్తే మామగారిల్లు స్వర్గం లాంటిదైనా సరే ఇంటికొచ్చిన అల్లుడు ఐదారు రోజులకంటే ఎక్కువ ఉంటే పరిస్థితులు , ఆదరణ , కుటుంబ సభ్యుల ప్రవర్తన మారుతూ ఉంటాయి. మొదట్లో పంచభక్ష్యాలతో భోజనం పెట్టినా క్రమేపీ తగ్గుతూ ఉంటుంది. పాలు, పెరుగు,నెయ్యి , స్వీట్లు..నెమ్మదిగా ఒక్కోటి మాయమవుతూ ఉంటాయి. అది తెలుసుకుని ఇంకా కదలకుంటే చెప్పుదెబ్బలు కూడా తప్పవంట. ఆ మామకు ముక్కు మీద కోపముంటే ఈ మర్యాద కూడా తప్పక జరుపుతాడు.


అల్లుడు బహుమానస్తుడు
అల్లునకొక పనియు చెప్పనైనం గానీ
చెల్లును మూడు పనులకై
ఇల్లలుకను, పేడచేయు, నెంగిళ్లెత్తన్!!


అత్తింట్లో తిష్ట వేసిన అల్లుడిని తమకనుకూలంగా కూడా ఉపయోగించుకోవచ్చంటాడు ఒక కవి. ఐనా ఎంత అల్లుడైతే మాత్రం ఎన్ని రోజులు కూర్చోబెట్టి మేపుతారు. అల్లుడికి అస్సలు పని చేప్పము కాని. మామకు ఎంత ఒళ్లు మండితే ఇంటల్లుడిని ఇల్లు అలకడానికి, పేడ చేసి, ఎంగిళ్లు ఎత్తడానికి.. ఇలా మూడు పనులకు వాడుకోవచ్చు అని చెప్తాడు. ఆ అల్లుడి స్వయంకృతాపరాధమే కదా.

ఒకసారి అవధానాల్లో కూడా ఈ అల్లుడి ప్రసక్తి వచ్చిందంట. మహావధానులు శ్రీ మిన్నికంటి గురునాధ్ శర్మగారు ఒక సభలో తన కిచ్చిన "అల్లుడయ్యెదన్ మగడనయ్యెద నే మనుమడనయ్యెదన్ " అనే సమస్యని అత్యంత మనోహరంగా పూరించారు. ఒకే వ్యక్తి అల్లుడు, మగడు , మనుమడు ఎలా అయ్యాడు అనుకుంటే...

ఎల్లసురల్ వినంగ హరి యిట్లనె - భూసుత సీతబొందితిన్
నీళ్లను మునిగినట్టి ధరణీ సతిఁ గౌగిట గ్రుచ్చి యెత్తితిన్
తల్లికి తల్లియౌ సతి నెదన్ ధరియించితిగాన భూమికిన్
అల్లుడనయ్యెదన్ మగడ నయ్యెద నే మనుమండ నయ్యెదన్ !!


రామావతారంలో విష్ణువు భూమిపుత్రిక సీతకు "భర్త " కాబట్టి భూమికి అల్లుడైనాడు. వరాహవతారంలో హిరణ్యాక్షుని చంపి సముద్రజలాలనుండి భూమిని తన కోరలతో పట్టి ఉద్ధరించాడు కాబట్టి ఆ భూమికి మగడు అయ్యాడు . ఆ విధంగా విష్ణువు పాదాల నుండి ఉద్భవించిన గంగ భూమికి కూడా కూతురయ్యింది. ఈ బంధం ఇంకా ఉంది... గంగ సముద్రునికి భార్య ఐనందున సముద్రుడి నుండి పుట్టిన లక్ష్మీదేవికి తల్లి కాబట్టి భూమికి మనవరాలు అయ్యింది కదా. మనవరాలి భర్త కాబట్టి విష్ణువు భూమికి మనవడు అయ్యాడు. తికమకగా ఉందా? అంటే శ్రీమహావిష్ణువు భూమికి --- భూమిని చేపట్టి మగడు, భూపుత్రికను పెళ్లాడి అల్లుడు, లక్ష్మిని మనువాడి మనవడు అయ్యాడు. భలే ఉంది కద. మరి అవధానమంటే ఇలాగే ఉంటుంది. అందునా అల్లుడు..

ఇదంతా చదువుతుంటే మగవాళ్లందరికీ కోపమొస్తుంది కదా.. ఆగండాగండి.. అందరు అల్లుళ్లు ఇలా ఉండరు. అత్తామామలను తమ తల్లితండ్రులుగా భావించి, గౌరవించేవాళ్లు ఉన్నారు. కాని చాలా మంది అల్లుడు అనగానే భార్యవైపు వారిని చులకన చేయడము, తమ కావలసిన వస్తువులను ఇవ్వడం అత్తామామల కర్తవ్యం అన్నట్టు ప్రవర్తిస్తారు. తాను చెప్పినట్టు భార్య, ఆమె పుట్టింటివారు వినాలి అంటారు. దానికి అతడి తల్లి తండ్రులు, తోడబుట్టినవారు కూడా ఆజ్యం పోస్తున్నారు. దీనివలన ఆ కుటుంబం అప్పులపాలైనా సరే అడిగినవి ఇవ్వాల్సి వస్తుంది. ఈ ధనదాహానికి ఎంతోమంది అమ్మాయిలు బలయ్యారు. అవుతున్నారు. ఈ వరకట్న సమస్య ఎంత దారుణంగా, నీచంగా మారిందంటే అగ్నిసాక్షిగా వివాహమాడిన భార్యను ఆ అగ్నికే ఆహుతి చేస్తున్నారు. భార్య తన అత్తామామలను తన తల్లితండ్రులుగా భావించి, సేవించాలని అనుకునే మగవాడు . తన అత్తామామలను కూడా తన తల్లితండ్రులలాగే భావించాలని అనుకోడు. నేటి యువత మాత్రం మెల్లిగా మారుతున్నారనుకోండి. అసలు ఇలా భార్యలను వేధించే కొడుకును అతని తల్లితండ్రులు కూడా కట్టడి చేసి అదుపులో పెట్టాలి. అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన కూతురిని ఒక ఇంటికి ఇల్లాలిగా పంపించి, అల్లుడి చేతిలో బాధలు పడే దురదృష్టవంతులైన తల్లితండ్రులెందరో ఈ రోజుల్లో?

అందుకే అల్లుళ్లూ కాస్త ఆలోచించండి.

ఈ టపా కోసం తన విద్యార్థులు మనోజ్ఞ, నవ్య లతో ఆడియో చేయించి ఇచ్చిన భారతి ప్రకాష్ గారికి , రాఘవ గారికి ధన్యవాదాలు..

16 వ్యాఖ్యలు:

మాలా కుమార్

అల్లుడి గురించి చాలానే రీసర్చ్ చేసినట్లున్నారే . దేని ప్రభావమబ్బా ఇది ?

గీతాచార్య

స్తాము స్తాము

గీతాచార్య

BTW gotta add some more. Will be back again

Anonymous

అల్లుళ్ళగురించి చాలా పరిశోధన చేసి వ్రాశారు బాగుంది. అలాగే కోడళ్ళ గురించి కూడా వ్రాయకూడదూ. ఏది ఏమైనా ఎవరో చెప్తేనో, ఎక్కడో వ్రాస్తేనో మనుష్యులు తమ తమ మైండ్ సెట్ లోంచి బయటపడలేరు. వారికి స్వతసిధ్ధంగా ఉండాలి సంస్కారం అనేది.

వేణూశ్రీకాంత్

యువత మెల్లగా మారుతుంది పెద్దలను కూడా మారుస్తుంది. మార్పు మరింత త్వరగా రావాలని కోరుకుందాం.

అన్నట్లు "మా వాళ్ళకేం తక్కువా ఎలాగొ తెచ్చిస్తార్లెండి మీకే అడగి రాబట్టుకోవడం చేతకాదు, ఒట్టి దద్దమ్మ" అనే కూతుళ్ళను కూడా నేను చూశాను.

భావన

బాగుంది జ్యోతి, బలే పద్యాలు గద్యాలు రెఫరెన్స్ ఇచ్చి మరీ రాసేవే.. హ హ హ బాగుంది. అన్ని పక్కల నుంచి అన్ని పక్కల వాళ్ళు వున్నారు కాని వేణూ శ్రీకాంత్ అన్నట్లు పర్లేదు మారుతున్నారు, అన్ని రకాల వాళ్ళు వున్నారు కాని ఇంకా చాలా మారాలి మంచి రిలేషన్ మొదలవ్వాలి అంటే అత్తమామ గార్లకు అల్లుడు/కోడలు కు మధ్య. మంచి పోస్ట్.

polimetla

చాలా బాగా వ్రాశారండీ
"కోడలు ఏకాదశ గ్రహం " అను కవిత చూడగలరు
http://polimetla.com/telugu-poetry/kodalu_ekadasa_graham/

Unknown

బాగుందండి.మంచి మంచి పద్యాలతో విన వేడుకగా. కాని పద్యాలు వినపడుతున్నట్లుగా లేదు?

జ్యోతి

మాలగారు, గీతాచార్య, ధన్యవాదాలు.
వేణు, ఉమ, నిజమే యువత మారుతున్నారు. అసలైతే తల్లితండ్రులే మారాలి.. వేణుగారు మహిళాబిల్లును అడ్డం పెట్టుకుని అత్తింటివారిని అష్టకష్టాలు పెట్టే ఆడవాళ్లు ఎంతోమంది ఉన్నారండి..

ఫణిబాబుగారు .. కోడలి మీద పద్యాలు ఎవరో రాసి ఉంటారులెండి. దొరికితే తప్పకుండా పెడతాను.

నరసింహగారు, ఇప్పుడే చెక్ చేసానండి. అన్ని పద్యాలు బానే వినిపిస్తున్నాయి..

భవానిగారు
బావుంది మీ కవిత .. మగవాళ్లే దుర్మార్గులు,ఆడవాళ్లు అమాయకులు అని నేననలేదే. మీరు నా టపాకు సమాధానమివ్వడానికి. ఇవన్నీ నేను మగవాళ్లని నిందిస్తూ నేను రాసినవి కూడా కావు. అత్తింటివాళ్లని ముప్పుతిప్పలు పెట్టి కాల్చుకుతినే ,మొగుడిని ఏడాదిలోనే వేరుకాపురం పెట్టించినవాళ్లు ఉన్నారు.

Durga

ప్రియమైన జ్యోతి,

మీ బ్లాగ్ చాలా బాగుంది. నేను పక్షపాతంతో మాట్లాడుతున్నానుకోకుండా నా అనుభవం చదవండి. నేను ఫ్రీలాన్సింగ్ కొత్తగా మొదలుపెట్టిన రోజులు. సెట్విన్ డైరెక్టరుతో మోటర్ సైకిల్ టాక్సీ డ్రైవర్స్ గురించి ఆర్టికల్ కోసం ఇంటర్వ్యూ చేసింతర్వాత థాంక్స్ చెప్పి వస్తుంటే నేను యే కాలేజ్ లో చదివానని అడిగారు. నేను కొంచం స్టైలుగా వనితా కాలేజ్ అని చెప్పానో లేదో వెంటనే, 'రియల్లి వనితా గర్ల్స్ ఆర్ వెరీ స్మార్ట్. డోంట్ యు థింక్ సో?' అన్నారు. నా సంగతేమో కాని మీ విషయంలో ఆ కామెంట్ చాలా కరెక్ట్ అనిపించింది మీ ఈ బ్లాగ్ చుసిన తరవాత. నిజ్జంగా చాలా బాగా మెంటైన్ చేస్తున్నారు. కంగ్రాచ్యులేషన్స్.

దుర్గ

జ్యోతి

దుర్గా అలాగంటారా?? వనితా జిందాబాద్. అప్పటి మా తెలుగు లెక్చరర్ వాసా ప్రభావతి గారి శిష్యరికం ప్రభావం అనుకుంటా..

Malakpet Rowdy

ఈ పోస్టు మాత్రం మా అత్తగారినీ, మావగారినీ చదవనివ్వకూడదు :))

ప్రణీత స్వాతి

అబ్బ..ఎంత బాగా అనలైజ్ చేశారండీ. చాలా బాగుంది.

Kalpana Rentala

జ్యోతి, చాలా బాగా రాశారు. ఈ మధ్య మీ వ్యాసాల్లో చాలా తేడా కనిపిస్తోంది. మీరు వాసా ప్రభావతీ గారి స్టూడెంటా? గుడ్. అల్లుడు రాబోతున్నాడని ముందే ఇది అలర్ట్ నోటీసా?

జ్యోతి

రౌడీగారు. మీరు టెన్షన్ పడకండి. మీ మావగారికి నేను పంపిస్తానుగా.. :)

కల్పన,
తేడా అంటే?? సరదా టపాలు రాయడంలేదనా? ఈ మధ్య అన్నీ సీరియస్ టపాలు సాహిత్యానికి సంబంధించిన టపాలు పెడుతున్నాను కదా. ఏం చేయమంటారు చెప్పండి??

డిగ్రీలో వాసా ప్రభావతిగారు మాకు తెలుగు చెప్పేవారు. అప్పుడు ముప్పైశాతం మాత్రమే తెలుగు తీసుకునేవారు. ఎక్కువ సంస్కృతం, ఫ్రెంచ్ ఈజీగా ఉంటుంది. ఎక్కువ మార్కులొస్తాయని వాళ్ల ఐడియా. నాకు ఇంకా గుర్తుంది. మొదటి రోజు క్లాసులో ఒక్కొక్కరిని ప్రభావతిగారు అడిగారు. మీరు తెలుగు ఎందుకు తీసుకున్నారు అని. నేను చెప్పా. నాకు తెలుగు అంటే ఇష్టం అని.
కల్పన... కూతురిని కన్నాక అల్లుడు, కొడుకును కన్నాక కోడలు రాక మానరు కదా?:)

THOTAKURI SRINIVAS

it is very good blog. you please go through my blog http://marichipoleninavalalu.blogspot.com

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008