Friday 1 October 2010

సంతృప్తిగా 10వ సంవత్సరంలోకి..

ICWAI చదివి.. సినిమా జర్నలిస్ట్ గా దాదాపు పెద్ద నటీనటులందరితోనూ పనిచేసి.. 1996లో మొట్టమొదటిసారిగా కంప్యూటర్ సాహిత్యానికి శ్రీకారం చుట్టే అదృష్టం లభించీ.. ఎన్నో మలుపులతో సాగిన నా ప్రస్థానం 2001 అక్టోబర్ నుండి "కంప్యూటర్ ఎరా" తెలుగు మాసపత్రిక ద్వారా తెలుగు ప్రజలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే క్రమంలో కొనసాగుతూ వచ్చింది. ఈ అక్టోబర్ 2010తో "కంప్యూటర్ ఎరా" తెలుగు మాసపత్రిక 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగిడబోతోంది. ఈ తొమ్మిదేళ్ల ప్రయాణంలో నిఖార్సయిన నాలెడ్జ్ ని అందించడానికి, పాఠకులకు వీలైనంత సమాచారం ఇవ్వడానికి అహోరాత్రాలు ఎంత శ్రమించానో నా ఒక్కడికే తెలుసు! కారణం "కంప్యూటర్ ఎరా"ని 9 సంవత్సరాల పాటు మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకూ ప్రతీ లైనూ ఒక్కడినే రాస్తూ, టైప్ చేస్తూ, పేజ్ మేకప్ చేస్తూ నిర్వహిస్తూ వస్తున్నాను కాబట్టి.. ఇంత బాధ్యతని నిర్వర్తించడం వెనుక ఎంత చిత్తశుద్ధితో పనిచేసి ఉంటానో నాకు తప్ప మరొకరికి తెలిసే అవకాశం లేదు. ఇది అతిశయోక్తిగా చెప్పడం లేదు. సగర్వంగా చెప్పుకుంటున్నాను.

1996లో తెలుగులో టెక్నికల్ లిటరేచర్ ని మొదటిసారిగా మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటివరకూ ఎంతోమంది నా మిత్రులు, ఆత్మీయులు, పాఠకులు నా గైడెన్స్ లో అనేక సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉన్నతస్థానంలో స్థిరపడుతూ వచ్చినా ఇప్పటికీ సాధారణ ఎడిటర్ గా పనిచేస్తూ పాఠకులకు మంచి నాలెడ్జ్ ని అందించాలన్న తపనని ఇంకా కాపాడుకుంటూ రాగలుగుతున్నానంటే ఖచ్చితంగా అది నా స్థిరనిశ్చయాన్ని ప్రతిఫలిస్తుంది.

ప్రమాదంలో రెండు కాళ్లూ పోగొట్టుకుని కంప్యూటర్ ఎరా ద్వారా నేను రాసే ఎడిటోరియల్స్ స్ఫూర్తితో, మేగజైన్ లో రాసే టెక్నికల్ కంటెంట్ తో నాలెడ్జ్ ని పెంచుకుని ఇంటర్నెట్ సెంటర్ నడుపుతూ ఆశావాదంతో జీవితం సాగిస్తున్న ఓ పాఠకుడూ, 65 ఏళ్ల వయస్సులోనూ వేరే ఊరి నుండి నన్ను ఎలాగైనా కలుసుకోవాలని వచ్చి నేను అందుబాటులో లేకపోతే నడివేసవిలో పగలంతా బయటతిరిగి సాయంత్రం వరకూ నా కోసం వెయిట్ చేసిన నాగార్జునసాగర్ కి చెందిన ఓ పెద్దాయనా, అస్థవ్యస్థమైన జీవనశైలి నుండి ఎలాగైనా జీవితంలో పైకెదగాలని పట్టుదలతో ఏకలవ్యశిష్యునిలా నన్నూ, కంప్యూటర్ ఎరానీ ఆసరాగా చేసుకుని ఈరోజు అద్భుతమైన ప్రతిభతో NTV వంటి ఛానెల్ లో వీడియో ఎడిటర్ గా పనిచేస్తున్న మరో ఆత్మీయుడూ.. ఇలా ఎందరో ప్రత్యక్ష్యంగానూ, పరోక్షంగానూ తమ ఆశీర్వచనాలను అందిస్తూ నాకు మనోస్థైర్యాన్ని అందిస్తున్నారు.

వీళ్లందరినీ కాదనుకుని నేను ఇప్పటికన్నా గొప్పగా జీవించగలను.. కానీ ఎందరికో జీవితంలో స్థిరపడడానికి కావలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించగలిగే గురుతర బాధ్యత ముందు నా ఒక్కడి స్వార్థం సరైనదని అనుకోను. అందుకే ఇప్పటికీ తొమ్మిదేళ్లు గడిచినా "కంప్యూటర్ ఎరా"లో నాదైన పర్సనల్ టచ్ ఉంటూనే ఉంటుంది. మార్కెట్లో ఎన్నో కంప్యూటర్ పత్రికలు ఉండొచ్చు.. ఏరోజూ "కంప్యూటర్ ఎరా"ని ఇతర పత్రికలతో పోల్చుకోలేదు.. ఇంకా చెప్పాలంటే ఇంగ్లీషువి గానీ, తెలుగువి కానీ ఇతర కంప్యూటర్ పత్రికలు నేను తిరగేసి చూసింది చివరిగా 2005లో.. అదీ ఓ బుక్ స్టాల్ మిత్రుడి కోరిన మీదట. మొదటి నుండి "కంప్యూటర్ ఎరా"ని ఓ సాధారణ పత్రికగా కాకుండా పదిమందికీ నాలెడ్జ్ ని పంచిపెట్టే ఓ చక్కని అవకాశంగా భావిస్తూ వచ్చాను. అందుకే వీలైనంత వరకూ పాఠకులకు అందుబాటులో ఉంటూ వచ్చాను. 2001 నుండి 2005 వరకూ రోజుకి 60-65 మందికి ఫోన్ ద్వారా డౌట్లు క్లారిఫై చేస్తూ వచ్చాను.. తర్వాతి కాలంలో సమయాభావం వల్ల పాఠకులు ఒకరికొకరు హెల్ప్ చేసుకునేలా 13,000 మందితో 2007 నుండి 2009 జూలై వరకూ "కంప్యూటర్ ఎరా" ఫోరమ్ ని నిర్వహించడం జరిగింది. పలు టెక్నికల్, సంస్థాపరమైన, ఇతర కారణాల వల్ల ఫోరమ్ ని నిలిపివేయవలసి వచ్చింది.

రోజు మొత్తంలో 60-65 ఫోన్ కాల్స్ కి డౌట్లు చెప్పేటప్పుడూ, ఫోరమ్, ఛాట్ సర్వీసులను నిర్వహించి రెండేళ్లకు పైగా ఆరోగ్యం అశ్రద్ధ చేస్తూ వేకువజాము 2-3 వరకూ సమయాన్ని దాని నిర్వహణపై వెచ్చించినప్పుడూ గుర్తుకురాని నేను.. ఎప్పుడైతే పరిస్థితులు అనుకూలించక ఆ సర్వీసులను నిలిపివేయడం జరిగిందో అప్పుడు నిష్టూరమాడడానికి కొంతమంది పాఠకులకు టార్గెట్ గా నిలిచాను. అయినా రకరకాల మనుషుల మనస్థత్వం మొదటినుండీ అలవాటైనదే కావడం వల్ల సైలెంట్ గా నా పని నేను చేసుకుంటూ పోతున్నాను. నిజంగా నాకు ఇంతటి గొప్ప బాధ్యతని అప్పజెప్పినందుకు భగవంతునికి ఎల్లవేళలా కృతజ్ఞుడనై ఉంటున్నాను. సమాజం పట్ల నా బాధ్యతని తీర్చుకునే అవకాశం నాకు కలిగింది. అందుకే నన్ను ఎంతోమంది అర్థం చేసుకున్నా, కొందరికి నేను సరిగ్గా అర్థం కాకున్నా నాకెవరూ శత్రువులు లేరు.. అందరూ నాకు శ్రేయోభిలాషులే.. అందరి శ్రేయస్సునూ అభిలషించే వాడినే! మొదటి నుండి ఎలాంటి పబ్లిసిటీ హంగామా లేకపోయినా "కంప్యూటర్ ఎరా" తెలుగు పత్రికని ఆదరించి, తమకు తెలిసిన పదిమందికీ పరిచయం చేస్తూ మా కష్టం మరెంతో మందికి నాలెడ్జ్ అందించేలా సహకరిస్తున్న పాఠకులకు వందనాలు.

తొమ్మిదేళ్ల పాటు ప్రతీ నెలా 1వ తేదీకల్లా పత్రికను మార్కెట్లోకి తీసుకురావడానికి ఒంటిచేత్తో మేగజైన్ రాస్తూ ఎన్ని ముఖ్యమైన శుభకార్యాలు, సంఘటనల్ని మిస్ చేసుకున్నానో, అనారోగ్య కారణాల వల్ల అతి కొద్ది సందర్భాల్లో మేగజైన్ మార్కెట్లో విడుదల అవనప్పుడు ఫోన్ల ద్వారా ఆరా తీసే రీడర్స్ కి నా వ్యక్తిగతమైన ఇబ్బందులను వివరించలేక ఎన్ని తంటాలు పడ్డానో అవన్నీ ఇంత సుదీర్ఘమైన మైలురాళ్ల ముందు దిగదుడుపుగానే భావిస్తున్నాను. ఒక్కటి మాత్రం నిజం "కంప్యూటర్ ఎరా" లాంటి చిత్తశుద్ధి, పర్సనల్ టచ్ తో కూడిన ఏ పత్రికనూ పాఠకులు ఎప్పటికీ చూడలేరు. ఇది అతిశయోక్తిగా భావిస్తే ఓసారి 2001 నుండి 2010 వరకూ విడుదలైన అన్ని సంచికలూ కనీసం పేజీలైనా తిరగేసి చూడండి.. ఎందుకింత థీమాగా మాట్లాడుతున్నానో!

చివరిగా ఇంతకాలం స్వంత వ్యక్తిగా ఆదరించిన పాఠకులకు హృదయపూర్వక ధన్యవాదాలతో..

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మాసపత్రిక
http://computerera.co.in

17 వ్యాఖ్యలు:

చిలమకూరు విజయమోహన్

అందరి శ్రేయస్సునూ అభిలషించే మీకు ఎల్లప్పుడూ మంచి జరగాలని,ఎన్నో విజయాలు స్వంతం కావాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను.

భాస్కర రామిరెడ్డి

శ్రీధర్ గారూ, మీ పట్టుదలను చూసి అబ్బురపడుతున్నాను. పదేళ్ళ గా పత్రికను నడుపుతూ నాలుగేళ్ళ పాటు రోజూ 60-65 మందితో మాట్లాడుతూ పత్రికను నడిపారంటే నిజంగా అద్భుతం. మీ పత్రిక పదికాలాలపాటు పాఠకులకు విజ్ఞాన భాండాగారంగా నిలువాలని కోరుకుంటున్నాను.

M.Srinivas Gupta

అభినందనలు.
"కంప్యూటర్ ఏరా" మీ అద్వర్యంలో ఇంకా వంద వసంతాలు పూర్తి చేసుకోవాలని మనసారా ఆశిస్తూ. మీ పురోగమనాన్ని ప్రింటింగ్, టి.వీ రంగాలకే కాకుండా ఇంకా ఎన్నో సెక్టార్లకు విస్తరింపజేయాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి

మాలా కుమార్

అభినందనలు .

Unknown

@ విజయమోహన్ గారు, ఏదైనా మంచి పని అన్పిస్తే ప్రోత్సహించడంలో ముందుండే మీలాంటి ఆత్మీయుల ఆశీర్వచనాలు నాకు ఎంతో నైతిక బలాన్ని అందిస్తాయి. ధన్యవాదాలండీ.

@ భాస్కర రామిరెడ్డి గారు.. నా సంతోషాన్ని మీలాంటి మిత్రులతో పంచుకుందామనే ఈ పోస్ట్ ని రాయడం జరిగింది. నేను చేసే పనిని నా బాధ్యతగా, సొసైటీకి ఏదైనా చేయడానికి ఓ చక్కని అవకాశంగా భావించాను, మీలాంటి మిత్రుల ఆశీర్వాదాలతో తప్పకుండా మున్ముందు మరింత మెరుగైన సమాచారం పత్రికలో ఇస్తాను. ధన్యవాదాలండీ.

@ శ్రీనివాస్ గుప్త గారు, "కంప్యూటర్ ఎరా" పత్రిక పాఠకునిగా మొదలై నాతో అటాచ్ మెంట్ క్రియేట్ అయిన వ్యక్తిలో మీరొకరు. మీలాంటి వారెందరినో నాకు మన పత్రిక అండగా అందించింది. స్వచ్ఛమైన మనసుతో మీరు అందించే ఆశీస్సులు తప్పకుండా నాకు బలాన్నిస్తాయి.

@ మాలాకుమార్ గారు, ధన్యవాదాలండీ.

సత్యసాయి కొవ్వలి Satyasai

అభినందనలు శ్రీధర్

సి.ఉమాదేవి

సాధారణంగా ఏ పత్రికనైనా చదివినపుడు సాహిత్యవిలువలు,పాఠకుల ఆదరణ బేరీజువేసుకుని పత్రిక స్థాయిని అంచనావేసుకుంటాం.కొన్ని పత్రికలలో దైవం,కొన్నిటిలో విజ్ఞానం,మరికొన్నిటిలో జీవితం కనబడుతుంది.అత్యంత విలువైన కంప్యూటర్ టెక్నాలజీని పరిచయం చేసే కంప్యూటర్ ఎరాలో మనసు కనబడుతుంది.కారణం విషయసూచికకు ముందే మానవీయ కో్ణాన్ని స్పృశించే మీ సంపాదకీయం.మీ పాఠక సంపద మరింత పెరగాలని ఆశిస్తున్నాను.కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు...విజయోస్తు!

రుక్మిణిదేవి

శ్రీధర్ గారు, ఈtv2.లో మీ ప్రోగ్రాం చూసాను. really i appreciate u.manam edainaa okapani చేస్తే, దాని valla మనకు లభించే trupti ముందు vimarsalu,alasata బలాదూర్ అండి.. కీప్ ఇట్ అప్..మీ దగర hardwork వుంది. క్లారిటీ వుంది.. ఇంకా ముందుకు వెళ్లగల జ్ఞానం వుంది.. మీరు చేస్తున్న సహాయం ఏదో ఒక రూపంలో మీకు మేలు చేస్తుంది..గో ఆహేఅద్. మా అందరి ఆశిస్సులు మీలాంటి కష్టజీవుల వెంట..

పరిమళం

శ్రీధర్ గారూ ! అభినందలండీ .....మరింత అభివృద్ధితో సిల్వర్ జూబ్లీ జరుపుకోవాలని నా ఆకాంక్ష! కృషితో నాస్తి దుర్భిక్షం !
ఈరోజు సఖిలో మీ ప్రోగ్రాం చూశాను e షాపింగ్ గురించి చాలా వివరంగా చెప్పారు ధన్యవాదాలు.

కొత్త పాళీ

సంతోషం శ్రీధర్! మరెన్నో గొప్ప విజయాల్ని సొంతచేసుకోవాలనీ, ఎన్నో శిఖరాలు అధిరోహించాలనీ కోరుకుంటూ ..

Unknown

@ సత్యసాయి కొవ్వలి గారు.. బాగున్నారా.. ధన్యవాదాలండీ.

@ ఉమాదేవి గారు, నిజంగా నా అంతరంగాన్ని పట్టేశారు. కంప్యూటర్ మేగజైన్ లో మిగతా పేజీలన్నీ క్లిష్టమైన సాంకేతికాంశాలే రాయాలి.. కనీసం ఎడిటోరియల్ పేజీ అయినా నా మనసులోని ఫీలింగ్స్ ని వ్తక్తపరిచేందుకు అనువుగా 2001 నుండీ ఇదే పంధాని కొనసాగిస్తూ వస్తున్నాను. మీ ఆశీర్వచనాలకు ధన్యవాదాలు.

@ రుక్మిణీదేవి గారు.. చాలా బాగా చెప్పారు. పని నుండి తృప్తిని పొందడం బదులు ఆ పని ఇచ్చే ఫలితాల మీదనే ధ్యాస ఉండడం వల్ల ఎందరో అశాంతిగా ఉంటున్నారు. మీ ఆశీర్వచనాలు అందజేసినందుకు ధన్యవాదాలండీ.

@ పరిమళం గారు.. బాగున్నారా.. ధన్యవాదాలండీ. ఈనెల 15, 29 తేదీల్లో (శుక్రవారాలు) 2.10 - 2.15 మధ్య సఖిలో మరికొన్ని అంశాల గురించి ప్రోగ్రాములు ఉంటాయి. వీలుని బట్టి చూడగలరు. సిల్వర్ జూబ్లీనా.. హహహ :) థాంక్యూ అండీ.

@ కొత్తపాళీ గారు, మీ నుండి ఆశీస్సులు పొందడం ఎంతో సంతోషంగా ఉంది. ఎంతదూరంలో ఉన్నా, అందుబాటులో లేకపోయినా ఎల్లప్పుడూ మనస్ఫూర్తిగా నైతిక స్థైర్యాన్ని ఇచ్చే ఆత్మీయులు మీరు. ధన్యవాదాలండీ.

శ్రీలలిత

మీ పట్టుదలకు, కృషికి ఎంత అభినందించినా తక్కువే. ఆ భగవంతుడు మీకు మరింత శక్తి నివ్వాలని కోరుకుంటూ...
శ్రీలలిత..

నేస్తం

అప్పుడెప్పుడో టి.వి లో ఏదో ఇంటెర్వ్యూలో చూసాను మిమ్మల్ని..ఈ రోజే మీ గురించి చాలా విషయాలు తెలిసాయి..మీరు మరిన్ని విజయాలు సాధించాలి అని ఆశిస్తున్నాను..అభినందనలు

Unknown

@ శ్రీలలిత గారు నమస్కారం, మీలాంటి ఆత్మీయుల బ్లెస్సింగ్స్ లభించడమే ఆ భగవంతుడు పరోక్షంగా నాకు అందిస్తున్న శక్తి.

@ నేస్తం గారు.. ధన్యవాదాలండీ. తప్పకుండా మీరు ఇచ్చిన పాజిటివ్ ఎనర్జీ నాకు మరింత సపోర్ట్ నిస్తుంది.

teresa

God bless you!

జ్యోతి

ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ప్రతినెల పత్రికను మరింత సమర్ధవంతంగా తీర్చిదిద్దాలనే పట్టుదల నాకుతెలుసు శ్రీధర్. నీ ప్రయాణం ఇంకా విజయవంతంగా నడవాలని మనసారా కోరుకుంటున్నాను.

jaggampeta

mee pattudala maalanti vareeki yentho adarsam.meeru marinthe unnthe stanamlo undalani korukuntoo congratulations.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008