Saturday, October 2, 2010

సమూహంలో మనం! అక్టోబర్ 2010 కంప్యూటర్ ఎరా ఎడిటోరియల్

మనసు దేన్నో అనుసరిస్తోంది.. చిత్తం ఏకాగ్రం అవడం మానేస్తోంది. జ్ఞానేంద్రియాల్ని బలవంతంగా వర్తమానంలో కుదేద్దామన్న ప్రయత్నమూ భరించలేని చిరాకుగా నుదుట చిట్లుతోంది. గమ్యమెరుగక సంచరించే మనసుకి గాలమేసి స్థిమితపడడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రతీ ఆలోచనలోనూ ఎన్నో సంక్లిష్టతలు. ఏదో చిక్కుముడి వద్ద ఒరుసుకుపోతూ నలిగిపోతుంటాం. అలల్లా కల్లోలపరుస్తూ.. వలల్లా పెనవేసుకుపోయే ఆలోచనలకు బంధనాలు వేయాలని పూనుకుంటాం. ఆలోచనల్ని బంధించాలన్న ఆలోచనే ఎన్నో జ్ఞాపకాలను తవ్వుకుంటూ మళ్లీ ఆ ఛట్రంలోనే మనల్ని బంధించేస్తుంది. ఒక ఆలోచనని జతగా చేసుకుని మనసు సంచరించే సరళిని విశ్లేషిస్తే ప్రతీ క్షణం, ప్రతీ సంఘటనా మనోఃఫలకంపై ఎలా ముద్రించుకుపోతోందో గమనింపుకు వస్తుంది. కొన్ని ఆలోచనల్లో భాగంగా జ్ఞప్తికి వచ్చే సందర్భాలను తరచిచూస్తే అసలు అవి మన ప్రమేయం లేకుండా జ్ఞాపకాల దొంతరల్లో ఎలా చేరిపోయాయో అంతేపట్టదు. మనసుకి ఆలోచనలే ఆహారం. ఏదో వలయంలో చిక్కుబడిపోయి ఆ చిక్కుముడులు విప్పుకునే ప్రయత్నమమే అది చేస్తుంటుంది. ఆ వలయం ధనార్జన, వస్తువ్యామోహం వంటి విషయకాంక్షల చుట్టూ పరిభ్రమించవచ్చు.. అనుబంధాలనే జీవితబంధాల చుట్టూ తిరుగాడవచ్చు..


కీర్తిప్రతిష్టల కోసం పాకులాడనూవచ్చు. మనం ఏ లక్ష్యం కోసమైతే పరితపించి జ్ఞానేంద్రియాలనూ, భౌతిక శక్తులను కేంద్రీకరిస్తున్నామో ఆ లక్ష్యం సాకారం అవదన్న సందేహం చుట్టుముట్టిన క్షణం మనసు గమనం అస్థిరమవుతుంది. కక్ష్య నుండి వేరుపడిన ఉపగ్రహంలా గమ్యమెరుగక కొట్టు మిట్టాడుతుంది. ఆ అసహనాన్ని భరించలేక మానసిక శక్తులను ప్రోదిచేసుకుని బలవంతంగా మళ్లీ ఏదో ఒక లక్ష్యం వైపు మళ్లించబడనిదే మనసుకు ఊరట లభించదు. అందుకే మనసుకి ఏ ఆలంబనా లభించనప్పుడు అంతర్ముఖులమై మనల్ని మనం తరచిచూసుకునే ధైర్యం చాలక లౌకిక ప్రపంచంలోని పరిసరాల తీరుతెన్నులు, మనుషుల ప్రవర్తనని బేరీజు వేయడానికి పూను కుంటాం. అంటే మన ఆలోచనల్ని సరిచేసుకునే ప్రయత్నం నుండి పారిపోయి ప్రపంచంలో కలిసిపోయి వేలెత్తిచూపడానికి ఉద్యుక్తులమవుతాం. ప్రతీ మనిషికీ ఒంటరిగా ఉండడం కన్నా సమూహంలో భాగంగా ఉండడమే ఎంత ఇష్టమో గమనిస్తే మనల్ని మనం ఎంత ఆస్వాదించు కుంటున్నామో, మన అస్థిత్వాన్ని మనమొక్కళ్లమే ఎంత కోరుకుంటున్నామో అర్థమవుతుంది. ఆలోచనల్ని మనవైపు తిప్పుకునే ధైర్యం లేనప్పుడు అవి జీవితాంతం లౌకిక ప్రపంచపు అడుగు జాడల్లోనే తచ్చాడుతూ ఉంటాయి. ఆ ప్రపంచపు వైకల్యాలన్నింటినీ చీదరించుకుంటూ భరిస్తూ మనమొక్కరమే వైకల్యం అంటనట్లు భ్రమిస్తూ సాగిపోతుంటాం. ఈ క్రమంలో లౌకిక ప్రపంచంలో మన ఉనికిని చాటుకునే కొన్ని తాత్కాలిక ప్రయత్నాలూ, వాటి ఫలితాలూ మనసుని క్షణకాలిక ఆనందంలో ముంచెత్తుతూ మరుక్షణమే నిరాశపరుస్తూ మనం ‘ఒంటరి’గా లేమన్న ధీమాని మిగుల్చుతుంటాయి. ‘ప్రపంచం మన వెంటే ఉందన్న భరోసా చాలు జీవితం గడిపేయడానికి.. మనకి మనం ఉన్నామన్న భరోసా లేకపోయినా!’కంప్యూటర్ ఎరా పాఠకులకు 10వ వార్షికోత్సవ శుభాకంక్షలు

మీ
నల్లమోతు శ్రీధర్

2 వ్యాఖ్యలు:

సి.ఉమాదేవి

'Man is a social animal' Aristotile చెప్పిన ఈ మాటలను వల్లెవేసుకుంటూ సమూహ జీవితానికి బాటలు వేసుకున్న మనం,మన మనసుచేసే ఇంద్రజాలంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం.మన మనసుపై మనకు నియంత్రణలేని ఆలోచనలకు మనం తలవంచి నడుస్తాం.కాని మనిషి మస్తిష్కంలో బీజం తొడిగిన ఆలోచనలు మనసులో మల్లెలై విరియాలి. మానవతా పరిమళాలు వెదజల్లాలి. నాకెవరున్నారు అని ప్రశ్నించు కోవడంకన్నా మీకు నేనున్నాను అనడం మానవతకు పరాకాష్ట!అప్పుడిక ప్రపంచమే మనవెంట నడుస్తుంది. మనసుకే అగ్రతాంబూలం ఒసగే మీ సంపాదకీయం వివరణాత్మకం, విశ్లేషణాత్మకం!

రుక్మిణిదేవి

మనసు...ఇదొక్కటి చాలండి, మనల్ని సప్త సముద్రాలు అయినా అవలీలగా దాటించుతుంది..దీన్ని ఒక కొతితో పోల్చారు హిమాలయ యోగులు..కానీ మనసు లేని మానవ మనుగడ లేదు కదా..అంతర్గతం గా వుంది,శరీరంతో అన్ని పనులు చేయించేస్తుంది.మనసు లేని రచయితని వూహించుకోండి.కాని, mana పనులకు అది అడ్డం కాకూడదు.. nemmadi నెమ్మది గా gaalam వేస్తూ, విజయం వైపుకి దూసుకు వెళ్ళిపోవడమే..మన పని మనం concentrativegaa చేసుకు వెళ్ళిపోవడమే..ఒక classroomlo అడుగుపెట్టేటప్పుడు మైండ్ అంతా ఎన్నో ఆలోచనలతో వుంటుంది..తిరిగి బయటకు వచ్చేటప్పుడు మన మొహంలోని చిరునవ్వు,ఆ వెలుగు మన తృప్తికి addham అవుతుంది..కదా.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008