Wednesday, July 6, 2011

మిగతా కథ వెండితెర మీద
థియేటర్లో మార్నింగ్ షో. ఇంకా బుకింగ్ మొదలుపెట్టలేదు.అందరూ లైన్లో నిలబడి ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. అందరిలో సినిమా చూడాలనే ఉత్సాహం. కధ ఎలా ఉంటుందో ?, పాటలెలా ఉన్నాయో?.. ఎప్పుడెప్పుడు లోపలికి వెళతామో అని ఒకటే ఆత్రుత. ఇంతలో ఒకబ్బాయి తన చేతిలో కొన్ని కాగితాల కట్టలు పట్టుకుని టికెట్ల కోసం లైన్లో నిలబడ్డవాళ్ల దగ్గరకు వచ్చాడు. అవి చూడడానికి మామూలు కాగితాలలాగే ఉన్నాయి. ఐనా కూడా చాలా మంది వాటిని కొనుక్కుంటున్నారు. ధర కూడా తక్కువే.. ఐదు పైసలు...సినిమా టికెట్టు అర్ధ రూపాయి. అదే రంగు రంగు కాగితాల పుస్తకాలు థియేటర్ క్యాంటీన్లో , కిళ్లీ కొట్లలో తోరణాల్లా వేలాడదీసి ఉన్నాయి. జనాలు వాటిని తీసుకుని లోపల ఏమున్నాయో చూసి కొంటున్నారు. ..ఇంతకీ ఏమిటా పుస్తకాలు?. ఎందుకా ఆత్రుత?... అవి తెలుగు సినిమా పాటల పుస్తకాలు. మరీ అంత తక్కువ ధరా? అంటే ఈ దృశ్యం ముప్పై, నలభై ఏళ్లక్రింది మాట. సినిమా తప్ప వేరే వినోద సాధనం లేని రోజులవి. అప్పట్లో ఒక సినిమా చూడాలంటే ఆషామాషీ కాదు. దానికి ముందు వెనకాలా చాలా కథ ఉండేది..

ఇక ఆ పుస్తకాల ప్రత్యేకత ఏంటి? చూడడానికి మామూలు కాగితంలా ఉన్నా అందులో ఆసక్తికరమైన విశేషాలు ఉండేవి. ముందుగా సినిమా కథ సంగ్రహంగా ఇచ్చేవారు కాని క్లైమాక్స్ మాత్రం అస్సలు చెప్పేవాళ్లు కారు. మిగిలిన కథ వెండితెర మీద చూడండి అని టక్కున ఆపేసేవారు. తర్వాత పాటలు. ముఖ్య నటీనటుల వివరాలు, సంగీత దర్శకుడు, నిర్మాత , సంగీత దర్శకుడు మొదలైన వివరాల తర్వాత పాటల సాహిత్యం ఇచ్చేవాళ్లు. ఒకవేళ యుగల గీతమైతే అతడు .... ఆమె... అని ఇచ్చేవారు. సినిమా చూసేవరకు ఈ పాటలు ఒకసారి తిరగేస్తారు. థియేటర్ లోపల ఐతే పాటలు వింటూ చదవడం కష్టమే. తర్వాత రేడియోలో వచ్చినప్పుడు మాత్రం ఆ పాటల పుస్తకం ముందు పెట్టుకుని అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూడడం ఎంతో సరదాగా ఉండేది. ఇక ఆ పాటలు నేర్చుకోవాలి అంటే మాత్రం ఈ పాటల పుస్తకాలు తప్పకుండా ఉండాల్సిందే.. ఫలానా పాట ఎవరు పాడారు?? ఎవరు రాసారు?? సంగీతం ఎవరు అనే సందేహాలను తీర్చే సరియైన సాధనం ఈ పాటల పుస్తకం. అసలు ధియేటర్లో సినిమాలో నటీనటులను చూడడం. పాటలు సంగీతంతో సహా వినడమే ఒక వింతగా ఉండేది ఆ కాలంలో. ఇక ఆ పాటల సాహిత్యం ప్రతీ పదంతో సహా చదువుతుంటే మాత్రం ఒక వింతను ఆవిష్కరించినట్టు ఉండేది. అబ్బో అనుకునేవాళ్లం. వెళ్లిన, అడిగిన ప్రతీ సినిమాకు ఈ పాటల పుస్తకాలు కొనిచ్చేది కాదు అమ్మ. అవి చదువుతూ క్లాసు పుస్తకాలు పట్టించుకోరని తన భయం. బతిమాలి , బామాలి అప్పుడోటి అప్పుడోటి కొనుకున్నేదాన్ని.

కాని రాను రాను వాటి ఊసే మరచిపోయి జీవన స్రవంతిలో కొట్టుకుపోయాను. తర్వాత ఎన్ని పాటల పుస్తకాలు కొన్నా కూడా ఆనాటి ఐదుపైసల కాగితపు పుస్తకాల భావన రాలేదు. మనం మరచిపోయాము అనుకుంటాము కాని మనసుపొరల్లో ఎక్కడో దాక్కుని ఉంటాయి ఎన్నో మధురస్మృతులు, జ్ఞాపకాలు. ఇలా అప్పుడప్పుడు మేమున్నామంటూ ఆ మనసు పొరల్లోనుండి తోసుకుని బయటకు వస్తాయి. ఇదేనేమో జీవితం...

8 వ్యాఖ్యలు:

రసజ్ఞ

చాలా బాగా రాసారండి. మీరు మీ చిన్నతనంలో అన్నారు కానీ నా పదవ తరగతి (2002 ) రోజులల్లో కూడా ఇవి ఉన్నాయి. నన్ను ఒకసారి అలా గతంలోకి తీసుకెళ్ళారనుకోండి.

గిరీష్

నేను వీటిని కొనే రోజుల్లో విలువ అర్ధ రూపాయి నుండి రూపాయి ఉండేదండి..మీరు చెప్పినవన్నీ చేశాను నేను..చాలా థ్యాంక్స్ నాకు అప్పటి రోజులను గుర్తుచేసినందుకు.. simply superb!

జ్యోతి

రసజ్ఞగారు ధాంక్స్ అండి. ఈ పుస్తకాలు ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి కాని అప్పట్లా ధియేటర్లలో అమ్మడం లేదు. బహుశా పల్లెటూర్లో అమ్ముతున్నారేమో.

గిరీష్ గారు.. ఇప్పుడు నేను కొన్నవి కొత్త సినిమాలు రెండు రూపాయిలు కాని హోల్ సేల్ షాపులో కొంటే రూపాయికే ఇచ్చారు.....నా దగ్గర కూడా ఎన్నో పాటల పుస్తకాలు చాలా ఉన్నాయి కాని ఈ పాటల పుస్తకాల జ్ఞాపకాలే వేరు..

మురళి

నేనేమో సుమన్ బాబు 'మమత' చూసి, ఇప్పటికి తేరుకుని టపా రాసి ఉంటారనుకుంటూ వచ్చాను.. ఈ పుస్తకాల గురించా? అన్నట్టు వీటితో నాకూ చాలా అనుబంధమే ఉందండీ.. ముఖ్యంగా హైస్కూల్ రోజుల్లో వారం వారం జరిగే సంతలో వీటిని అమ్మేవాళ్ళు.. భలే భలే సంగతులు గుర్తొస్తున్నాయి.. ఇక్కడ కాదు కానీ, వీలు చూసుకుని ఒక టపా రాసేస్తాను..

జ్యోతి

మురళిగారు,,

నేను చాలా ప్రయత్నించాను మమత చూద్దామని.కాని అనుకోకుండా సరిగ్గా అరగంట ముందు బయటకెల్తే రాత్రి తొమ్మిదింటికి ఇంటికొచ్చా.. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని ఆ దేవుడే నన్ను రక్షించాడేమో అనిపిస్తుంది..:))

Devika Sai Ganesh Puranam

మీ దగ్గర దేశొద్దరకులు పాటల పుస్కకం దొరుకుతుందా?

జ్యోతి

దేవికగారు,
పాత పాటలు పుస్తకాలు లేవండి. ఆర్టిస్ట్ వారిగా అంటే ఎన్.టి.ఆర్, ఏ.ఎన్. ఆర్, ఘంటసాల, సుశీల, జానకి అలా ఉన్నాయి. దేశోద్ధారకులు పాటలు ఇక్కడ వినొచ్చు..
http://www.chimatamusic.com/telugu_songs/oldmovplist.php?st=234

Tekumalla Venkatappaiah

Yah.. I still remember purchasing Cinema Songs books in the interval.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008