Thursday, January 19, 2012

అల్లసాని వారి అద్భుత వృత్తమాలిక


శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాధీశుడు. ఈయన పాలనలో రాజ్యం సుభిక్షంగా ఉండడమే కాక సాహిత్యానికి కూడా పెద్ద పీట వేయబడింది.ఈయన ఆంధ్రభోజుని గా మరియు కన్నడరాజ్య రమారమణగా కీర్తించబడ్డాడు. రాయలు స్వయంగా కవి, పండితుడు కూడా. అతను స్వయంగా సంస్కృతంలో జాంబవతీ కళ్యాణము, తెలుగులో ఆముక్తమాల్యద లేక గోదాదేవి కథ అనే గ్రంథాన్ని రచించాడు. రాయలుకు సాహితీ సమరాంగన సార్వభౌముడు అనే బిరుదు కలిగినవాడు కూడా. రాయల ఆస్థానానికి భువన విజయం అనే పేరుంది. ఈ భువనవిజయంలో అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, మాదయ్యగారి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజభూషణుడు (భట్టుమూర్తి), తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిది కవులు ఉన్నారు. వారు అష్టదిగ్గజాలుగా ప్రసిద్ధి పొందారు. వీరందరిలో రాయలు ఆస్థానకవి, ఆంతరంగికుడుగా మసలిన అల్లసాని పెద్దన ఆంధ్రకవితా పితామహునిగా పేరు పొందాడు. భువన విజయంలో ఇతనికి జరిగినన్ని మర్యాదలు, సత్కారాలు మరే కవికి దక్కలేదన్నది సత్యం.

ఒకనాడు రాయలు భువనవిజయంలో బంగారు పళ్లెంలో పెట్టిన గండపెండేరాన్ని తెప్పించి సంస్కృతాంధ్రాలలో సమానంగా కవిత్వం చెప్పగలిగే వారు ఉంటే వచ్చి అందుకోమని చెప్పాడు. సభలో కవులందరూ మౌనంగా ఉన్నారు. అప్పుడు రాయలు ఆశ్చర్యంగా

ఉ. ముద్దుగ గండపెండెరమున్ గొనుడంచు బహూకరింపగ
నొద్దిక "నాకొసంగు"మని యొక్కరుఁ గోరగలేరు లేరొకో?"

నేను సంతోషంగా ఈ గండపెండేరాన్ని బహుమతిగా ఇస్తాను అంటే ఒక్కరు కూడా నాకివ్వమని అని కోరడం లేదు ఎందుకో?

అప్పుడు పెద్దన లేచి

పెద్దన బోలు పండితులు పృధ్విని లేరని నెవెఱుంగవే?
పెద్దన కీదలంచినను బేరిమి నాకిడు కృష్ణరాణ్ణృపా!

రాజా! ఈ భూమండలంలో ఈ పెద్దన కంటే గొప్ప పండితుడు లేరని నీకు తెలీదా? నాకు ఇవ్వదలచిన వెంటనే ఇవ్వు అని అన్నాడు పెద్దన. తన పాండిత్యం మీద ఆయనకంత నమ్మకం మరి..

వెంటనే తన పాండిత్యాన్ని నిరూపించుకోవడానికి సంస్కృత, ఆంధ్రములో ఆశువుగా పెద్దన యీ ఉత్పలమాలిక చెప్పాడు. ఇది మామూలుగా నాలుగు పాదాలతో ఉండే వృత్తం కాదు. వృత్త మాలిక. అంటే అదే వృత్తం ప్రాసని భావాన్ని విడకుండా నిరాఘాటంగా అది వృత్తమాలిక అనబడుతుంది. కవికి భావావేశంలో అతడు చెప్పే వృత్తం ఆగకుండా నిరర్గళంగా సాగిపోతుందన్నమాట. అసలు, కవిత్వమంటే ఎలా ఉండాలో కవితాత్మకంగా శబ్దార్థాల మేలికలయికతో యిందులో చెప్పబడింది. ఈ పద్యానికి అర్థం చెప్పుకోవాలంటే కొంత శ్రమపడాలి. దీనికి వేల్చేరు నారాయణరావుగారు చేసిన ఆంగ్ల అనువాదం ఇక్కడ చూడవచ్చు: ఈ అద్భుత పద్యం యొక్క శ్రవ్యకాన్ని ఇక్కడ వినొచ్చు.. ఒళ్ళు గగుర్పొడించే ఈ వృత్తమాలిక వినగానే శ్రీకృష్ణదేవరాయలు లేచి వచ్చి స్వయంగా తానే పెద్దన కాలికి గండపెండేరం తొడిగాడు.

పూఁత మెఱుంగులుం బసరుపూఁప బెడంగులుఁ జూపునట్టివా


కైతలు? జగ్గు నిగ్గు నెనగావలెఁ గమ్మనఁ గమ్మనన్వలెన్


రాతిరియున్ బవల్ మఱపురాని హొయల్ చెలి యారజంపు ని


ద్దా తరితీపులో యనఁగఁ దారసిలన్వలె లోఁ దలంచినన్


బాఁతిగఁ బై కొనన్ వలెను బైదలి కుత్తుకలోని పల్లటీ


కూఁతలనన్వలెన్ సొగసుకోర్కులు రావలె నాలకించినన్


జేతికొలందిఁ గౌగిటను జేర్చిన కన్నియ చిన్ని పొన్ని మే


ల్మూఁతల చన్నుదోయివలె ముచ్చటగావలెఁ బట్టిచూచినన్


డాతొడనున్న మిన్నులమిటారపు ముద్దులగుమ్మ కమ్మనౌ


వాతెఱదొండపండువలె వాచవిగావలెఁ బంటనూదినన్


గాతలఁ దమ్మిచూలిదొర కైవసపుం జవరాలి సిబ్బెపు


న్మేతెలి యబ్బురంపు జిగి నిబ్బర పుబ్బగు గబ్బిగుబ్బపొం


బూఁతల నున్న కాయ సరిపోఁడిమి కిన్నెర మెట్లబంతి సం


గాతపు సన్నతంతి బయకారపుఁ గన్నడ గౌళపంతుకా


సాతత తానతానలపసన్ దివుటాడెడు గోటమీటు బల్


మ్రోతలునుంబలెన్ హరువు మొల్లముగావలె నచ్చతెన్గు లీ


రీతిగ సంస్కృతంబు పచరించెడు పట్టున భారతీవధూ


టీ తపనీయగర్భనికటీ భవ దాననపర్వసాహితీ


భౌతిక నాటకప్రకర భారత భారత సమ్మతప్రభా


శీతనగాత్మజా గిరిశశేఖర శీత మయూఖరేఖికా


పాతసుధాప్రపూర్ణ బహుభంగఘుమంఘుమఘుంఘుమార్భటీ


జాతక తాళయుగ్మ లయసంగతి చుంచు విపంచికా మృదం


గాతత తేహితత్తహిత హాధితధంధణుధాణుధింధిమి


వ్రాతనయానుకూల పదవారకుహూద్వహ హారికింకిణీ


నూతనఘల్ఘలా చరణనూపుర ఝూళఝుళీ మరందసం


ఘాతవియద్ధునీ చకచక ద్వికచోత్పలసారసంగ్రహా


యాత కుమారగంధవహహారి సుగంధ విలాసయుక్తమై


చేతము చల్లఁజేయవలె జిల్లన జల్లవలెన్ మనోహర


ద్యోతకగోస్తనీఫలమధుద్రవ గోఘృతపాయసప్రసా


రాతిరసప్రసారరుచిరప్రసరంబుగ సారె సారెకున్।ఈ వృత్త మాలిక అర్ధం ఆంగ్లంలో..

Is poetry a surface sheen,
the green delusion of unfolded buds?
It must be real inside
and out, exploding fragrance,
an aching touch your body can't forget
by day or night, like of your woman,
whenever you think about it.
It should come over you, it should murmur
deep in the throat, as your lover in her dove-like moaning,
and as you listen, yearning comes in all its beauty.
If you take hold of it, your fingers tingle
as if you were tracing the still-hidden breasts
of a young girl, wholly embraced.
If you sink your teeth into it, it should be succulent
as the full lips of a ripe woman from another world,
sitting on your knees. It should ring
as when godly Sound strokes with her fingernails
the strings of her veeNa, with its golden bulbs resting
on her proud, white, pointed breasts,
so that the rAga-notes resound.
That is the pure Telugu mode.


If you use Sanskrit, then a rushing, gushing
overflow of moonlight waves, luminous and cool,
from Siva's crest, the mountain-born goddess beside him,
enveloping actors and their works, the dramas
spoken by Speech herself in the presence of the golden seed,
pounding out the powerful rhythms, the beat
of being, through drums and strings
and chiming bells and thousands of ringing anklets
dancing, drawing out the words, the fragrant and subtle
winds wafting essence of unfolding lotus
from the Ganges steaming in the sky should
comfort your mind. You should shiver
in pleasure again and again, each time
you hear it, as rivulets of honeyed juices and butter
and sweet milk flow together
and mix their goodness more and more
and more.


ఈ టపా విషయంలో సందేహాలు తీర్చిన చింతా రామక్రిష్ణగారికి, భైరవభట్ల కామేశ్వరరావుగారికి ధన్యవాదాలు.10 వ్యాఖ్యలు:

D. Subrahmanyam

చక్కటి వ్యాఖ్యానంతో మంచి ఆర్టికల్ వ్రాసారు జ్యోతిగారు. అభినందనలు.

Sunita.R

chaalaa baagumdi...

ప్రియ

చాలా బాగుంది

రాజేశ్వరి నేదునూరి

అల్లసాని వారి అల్లికని అందంగా చూపించారు జ్యోతి గారూ ! చాలా బాగుంది.

Unknown

చాలా బాగుందండి. మీకు నా ధన్యవాదాలు. ఓ చిన్న సహాయం కావాలండి. నేను నా బ్లాగులో పుట్టపర్తివారి శివతాండవాన్ని వ్రాస్తున్నాను. దానిని నా స్వంత గొంతుతో గానం చేసి బ్లాగులో ఎటాచ్మెంట్ గా అందించాలని కోరికగా ఉంది. సెల్ఫోనులో రికార్డుచేసి ఉంచాను. కాని దానిని బ్లాగులో ఎలా ఎటాచ్ చేయాలో తెలియటం లేదు. దానికి ఏమైనా సాఫ్ట్వేర్ కావాలా? అది ఎలా చేయాలో దయతో తెలియజేయగలరు.

హనుమంత రావు

అల్లసాని వారి అల్లిక జిగిబిగి... అర్థం కాకపోయినా ఆనందాన్నిచ్చే వృత్తమాలిక ... దాని ఆంగ్లానువాదం చాలా బాగుంది.... చక్కటి సంకలనం...
శ్రీ కృష్ణ దేవరాయలు స్వయంగా పెద్దన్నగారి కాలికి గండపెండేరము తొడిగాడంటే... చెప్పడానికేముంది.. పెద్దన్నకన్న ముందు రాయలవారు స్వర్గస్తులైనప్పుడు పెద్దన్నగారు వ్రాసిన ఓ పద్యంలో..."ఎదురైనచో తన మద కరీంద్రము డిగ్గి.....".. రాయలకు తనకూ ఉన్న అనుబంధాన్ని తలచుకుని ఆయనతో పాటు దివికేగలేక జీవచ్ఛవాన్నై ఉన్నానని బాధపడ్తారు. అది రాజుకి, కవికి గల సాహిత్య బంధం... బాగా వ్రాసారు జ్యోతిగారు.

Anonymous

ఆంగ్లంలోకి తార్జుమ భలే చేశారు,ఆంగ్ల పదాల ఎంపిక చాలా బాగుంది .....

RAVICHANDRA

జ్యోతిగారు!నాదగ్గర నందితిమ్మనగారి 20 పాదాల ఉత్పలమాలిక ఉంది.గండపపెండేర భహుకరణ సమయంలో పెద్దనగారి మాలికకన్నా ముందుచెప్పింది.

జ్యోతి

రవిచంద్రగారు నాకు మెయిల్ చేయగలరా?? పెద్దనగారు చెప్పింది కాక ఇంకో ఉత్పలమాలిక ఉందని తెలుసు. కాని వెతకలేదు..

Unknown

అయ్యా రవిచంద్ర గారు, నంది తిమ్మన గారి 20 పాదాల ఉత్పల మాలిక, దయచేసి పంపితే మముబోంట్ల సాహితీ ప్రియులం ధన్యులమౌటాము. నా ఈమయిల్ : ramana_84@yahoo.com.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008