Sunday 19 July 2015

బంధాలు - అనుబంధాలు ( నవతెలంగాణ )



బంధాలు.. అనుబంధాలు
Wed 15 Jul 02:56:51.551319 2015
భార్య .. భర్త
తల్లిదండ్రులు.. పిల్లలు
కొడుకులు... కోడళ్ళు
కూతుళ్ళు... అల్లుళ్లూ
అత్తలు.. మామలు
పిన్ని... బాబారు
ఇలా... భారతీయ కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది. ఎన్నో బంధాలు అనుబంధాలు... అందరి మధ్య రక్త సంబంధంతో కూడిన ప్రేమ, అనురాగం, గౌరవం, మమకారం కనిపిస్తుంది. నీది నాది అని కాకుండా మనది అనే అందమైన ఆప్యాయతతో కూడిన భావన అందరికీ ఉంది. నమ్మశక్యం కావట్లేదు కదా... చదువుతుంటే, వింటే చాలా బావుందనిపిస్తుంది. కాని ఇది ఒకప్పటి మాట అని అందరూ ఒప్పుకునే చేదు నిజం . ఈ రోజు ఈ అనుబంధాలన్నింటిలో ఎన్నో పరిమితులు, వలయాలు, పొరలు, ఆత్మవంచనలు, స్వార్థాలు, మోసాలు చోటు చేసుకున్నాయి.
నిజజీవితంలో మనుషుల మధ్య దూరం పెరిగిపోతుందన్న మాట మాత్రం వాస్తవమే. ఒకరి మాట ఒకరికి నచ్చదు. వారి ఉనికిని కూడా సహించరు. ఇంట్లో ఎదురుగా కనబడే పెద్దలను లెక్క చేయని యువత ఆమెరికా ఫ్రెండుతో రోజూ గంటల తరబడి ముచ్చట్లేస్తుంటారు. కొత్తవారితో స్నేహం పెంచుకోవడానికి చూపే ఆసక్తి, ఉత్సాహం, ఇంట్లో వున్న వారితో సంబంధ బాంధవ్యాలు మెరుగు పరుచుకోవడంలో మాత్రం చూపడం లేదు.
ఒకప్పుడు భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఒకరికోసం ఒకరు అన్నట్టుగా కుటుంబ శ్రేయస్సు కోసమే కలిసి కష్టపడేవారు. ఎంత పెద్ద ఉమ్మడి కుటుంబమైనా అందరినీ ప్రేమగా చూసుకుంటూ బాధ్యతలను సమంగా పంచుకుని అందరినీ ఒక్కతాటిపై నడిపించేవారు. కాని నీటి ఆధునిక యుగంలో ఈ బంధాలు అనుబంధాలకు గల అర్థాలు మారిపోతున్నాయి. బిజీ లైఫ్‌ మనిషి జీవితంలో అనూహ్యమైన మార్పులను తెస్తుంది. భార్యాభర్తలు, అన్నదమ్ములు, పిల్లలు అందరూ 'ఎవరికి వారే యమునా తీరే' అన్నట్టుగా జీవిస్తున్నారు.
డబ్బు సంపాదనపైనే అందరి దృష్టి. మానవ సంబంధాలను అంతగా పట్టించుకోవడం లేదు. ఎవరికి వారు తమకంటూ విడిగా బ్యాంక్‌ అకౌంట్లు, ఇళ్ళు, వాహనాలు, వస్తువులు కొనుక్కుంటున్నారు. ఒక్క ఇంట్లో ఉండేవారే తల్లైనా, తండ్రైనా, పిల్లలైనా నీది నాది అని మాట్లాడుకుంటున్నారు.. ఇలాంటి బిజీలైఫ్‌లో పూర్తిగా మునిగిపోయిన తల్లిదండ్రులు తాము కన్న పిల్లలను తమ తల్లిదండ్రులకో, అత్తామామలకో, పనిమనుషులకో, క్రెష్‌లకో అప్పగిస్తున్నారు. పెద్దవాళ్లైన తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపేస్తున్నారు. దీంతో తల్లితండ్రులకు పిల్లలకు మధ్య సహజంగా ఉండాల్సిన అనుబంధం, ఆప్యాయతలు కొరవడుతున్నాయి.
మనం చెప్పుకోవలసిన మరో ముఖ్యమైన విషయం ఉంది. సమాచార, సాంకేతిక విప్లవం ఈ విశాల ప్రపంచాన్ని చిన్న గ్రామంలా మార్చేసింది. దేశవిదేశాల మధ్య సరిహద్దులను చెరిపేసి వేల మైళ్ల దూరాన ఉన్నవారిని కూడా నిమిషాల్లో కలిపేస్తుంది. సాంకేతిక పరిజ్ఞానం వల్ల మానవ సంబంధాలు మెరుగైనట్లు కనిపించినా కుటుంబ సంబంధాలు మాత్రం దెబ్బ తింటున్నాయని కొందరంటున్నారు.
కాని నిజజీవితంలో మనుషుల మధ్య దూరం పెరిగిపోతుందన్న మాట మాత్రం వాస్తవమే. ఒకరి మాట ఒకరికి నచ్చదు. వారి ఉనికిని కూడా సహించరు. ఇంట్లో ఎదురుగా కనబడే పెద్దలను లెక్క చేయని యువత ఆమెరికా ఫ్రెండుతో రోజూ గంటల తరబడి ముచ్చట్లేస్తుంటారు. కొత్తవారితో స్నేహం పెంచుకోవడానికి చూపే ఆసక్తి, ఉత్సాహం, ఇంట్లో వున్న వారితో సంబంధ బాంధవ్యాలు మెరుగు పరుచుకోవడంలో మాత్రం చూపడం లేదు.నిత్యం కలుసుకునే వ్యక్తులు, స్నేహితులు, రక్తసంబంధీకుల మధ్య ఉండే కమ్యూనికేషన్‌ గ్యాప్‌ ఇంటర్‌నెట్‌లో కలిసిన వ్యక్తుల మధ్య ఉండడం లేదు. ఆ వ్యక్తులు కేవలం మాటలు, రాతల ద్వారానే పరిచయం. వాళ్లు ప్రత్యక్షంగా కూడా కలిసి వుండరు. అయినా వారి మధ్య ఎంతో నమ్మకం, ఆత్మీయత. ప్రతీ బంధం ఇలాగే వుండాలని లేదు. ప్రేమ, నమ్మకం, ద్వేషం, మోసం అనేవి వాస్తవ ప్రపంచం, మిధ్యా ప్రపంచం రెండింటిలో సమానంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఇంటర్నెట్‌ ద్వారా ముచ్చటించుకుంటున్నారు. ఆహ్వానాలు పంపిస్తున్నారు. ఫొటోలు పంపించుకుంటున్నారు. ఇక్కడ ఒకే ఊర్లో ఉన్నవారికి తెలియని విషయాలు ఫేస్బుక్‌ ద్వారా బంధువులకు తెలిసిపోతున్నాయి. ఇది మంచికో, చెడుకో గాని దాచాలనుకున్నవి బయటపడిపోతున్నాయి. దూరంగా ఉన్నవారి మధ్య కూడా బంధం తెగకుండా ఉంటోంది.
అందరి ఆలోచనలు, అభిప్రాయాలు ఒకేలా ఉండవు. నిజజీవితంలో ఈ పరస్పర విభేదాలతోనే అపార్థాలు, అనుమానాలతో గొడవలు మొదలవుతాయి. కాని నెట్‌ ద్వారా పరిచయమైన వ్యక్తులలో ఒకే విధమైన అభిప్రాయాలు, ఆలోచనలు ఉన్నవారు దగ్గరవుతారు. అందుకే వారి మధ్య ఎటువంటి భేదాభిప్రాయం, గొడవలు ఉండవేమో. మానవ జీవితాలు ఆనందంగా సుఖమయంగా ఉండడానికే ఎన్నో అనుబంధాలు ఏర్పడతాయి. ఈ సమాజంలో మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి అవసరం ఎప్పుడో ఒకప్పుడు మనకు కలుగుతుంది. అందుకే సమాజంలో అందరినీ కలుపుకుని ఎటువంటి భేషజాలు, స్వార్థం, మోసాలు, ద్వేషాలు లేకుండా ఉండాలి.
భిన్నమైన వైరుధ్యాలు, దృక్పథాలు గల మనుషుల మధ్య కలిసి బతకడానికి స్నేహంగా ఉంటూ అందరినీ గౌరవించడం అలవర్చుకోవాలి. ఈ మానవ సంబంధాలు మెరుగు పరుచుకోవడానికి ముందు కుటుంబం నుండే ప్రయత్నాలు మొదలుపెట్టాలి. కుటుంబంలో సఖ్యతకు ముందుగా ఇంటి ఇల్లాలే ముందడుగు వేయాలి. అత్తలో తల్లిని, కోడలిలో కూతురుని, ఆడపడుచు, తోటి కోడలిలో సోదరిని చూడగలిగితే అందరూ సంతోషంగా ఉంటారు. అవసరమైన వేళ అందుబాటులో ఉండి తోడుగా ఉంటారు. తాత్కాలిక భోగాలైన ఆధిపత్యం, అధికారం, డబ్బు, హోదా, పలుకుబడి మొదలైన వాటిని గుర్తించి వాటిని పక్కనపెట్టి బంధుత్వాలు, బాంధవ్యాలు గుర్తించాలి. అప్పుడే అందరూ సంతోషంగా ఉండగలుగుతారు. ఇలాంటి మాటలు చెప్తే అందరూ నవ్వుతారు సోది అని... కాని ఆచరణలో తీసుకువస్తే మాత్రం అందరికీ ఉపయోగకరమే.
- జ్యోతి వలబోజు

0 వ్యాఖ్యలు:

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008