Tuesday 7 July 2015

అత్యాచారం - అమానుషం




భగవంతుడు తన సృష్టిలో ఆడా, మగా అని సమానంగా సృష్టించాడు. ఇద్దరూ అందమైనవాళ్లే, శక్తివంతులే. ఒకరినొకరు గౌరవించుకుంటూ సమాజాన్ని ముందుకు నడిపించేవాళ్లే.

కానీ ఈనాడు కాదు పురాణాలనుండి ఆడదాన్ని ఒక విలాసవస్తువుగా భావించారు. నచ్చిన స్త్రీని శాస్త్రయుక్తంగా కానీ, గాంధర్వరీతిని గానీ, రాక్షసరీతిని గానీ వివాహం చేసుకునేవారు రాజులు, మహారాజులు. కాలక్రమేనా స్త్రీ తనలోని ప్రతిభని గుర్తించి దైన్యాన్ని, నిస్సహాయతని వీడి ఒక శక్తిగా మారసాగింది. ఈనాడు ఎంత అభివృద్ధి చెందినా, స్త్రీ అంట్లు తోమడం, ఆవకాయ పెట్టడం నుండి అంతరిక్షంలోకి దూసుకుపోయే స్ధితికి ఎదిగినా ఆమెకు భద్రత లేకుండా పోయింది. ప్రతీచోటా ప్రమాదమే.. ఎదిగిన ఆడపిల్ల విషయంలోనే కాదు మూడేళ్లు, ఐదేళ్ళ పసిపాపల మీద కూడా కామాంధుల పైశాచిక దాడులు జరుగుతున్నాయి. చదువుకునే సమయంలో, ఉద్యోగాలకు వెళ్లిన సమయంలో, ఉద్యోగం కాని ఏదైనా అవసరార్ధం మగవాళ్ల దగ్గరకు వెళ్లాలంటే దాదాపు అందరూ ఆడవాళ్లు ఎన్నో జాగ్రత్తలు తీసుకోక తప్పడంలేదు. చివరికి ఉద్యోగం నుండి ఇంటికి వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు వాహానాలలో కూడా భద్రత ఉండడం లేదని అందరికీ తెలిసిన విషయమే. ఆడవాళ్లు అనాలా? ఆడపిల్లలు అనాలా? చిన్నారులు అనాలా? అందరూ ఏదో విధమైన ఆకృత్యాలకు బలైపోతున్నారు. చివరికి తండ్రి, అన్నలు , కుటుంబ సభ్యుల చేతిలో కూడా అత్యాచారానికి లోనవుతున్న ఆడపిల్లల కథలు కూడా వినవస్తున్నాయి. 

ఇక వయసులో ఉన్న ఆడపిల్ల అత్యాచారానికి గురైతే ముందుగా సమాజం ఆమెను దోషిగా, చాలా పెద్ద తప్పు చేసినదానిలా చూస్తుంది. చెడగొట్టబడలేదు.. చెడిపోయింది కాబట్టి ఆ అమ్మాయిని ఎవ్వరూ పెళ్లి చేసుకోరు. అసలు ఆ అమ్మాయే తను చేయని నేరానికి శిక్ష పడి ఒక పనికిరాని వస్తువు అవుతుంది. ప్రతీవారు ఒక వింతలా చూస్తారు. మీడియావాళ్లైతే తమ లాభం కోసం దాన్నొక స్పెషల్ స్టోరీ చేసుకుంటారు. కాని తర్వాత ఆ అమ్మాయి సంగతేంటి?? ఎవ్వరూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు. అందుకనే ఆ అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టమున్నా లేకుండా బంధువులందరూ కలిసి ఒప్పించి మానభంగం చేసినవాడికే ఇచ్చి పెళ్లి చేయమంటారు. అసలే అత్యాచారానికి గురైన అమ్మయి. మళ్లీ ఆ దుర్మార్గుడికే జీవితాంతం బానిసగా పడుండాలి. ఒకరివల్ల అమ్మాయి జీవితం నాశనమైతే సమాజం ముందుకొచ్చి పూర్తిగా నాశనం చేసేస్తుంది... ఇది ఆ అమ్మాయి చేసిన దోషమా? కొవ్వెక్కి చేసిన ఘనకార్యమా? అత్యాచారానికి గురై వాడినే పెళ్లి చేసుకుని ప్రతిదినం అత్యాచారం చేయించుకోవాలి. అప్పుడు అది తప్పు కాదన్నమాట....

కాని అత్యాచారానికి గురైన ఆడపిల్లను తల్లిదండ్రులు ఆమెను చేరదీసి కాపాడుకుని జరిగినదొక పీడకలగా భావించి ముందుకు సాగాలి. కాని ఇప్పటికీ ఈ అత్యాధునిక, అభివృద్ధి చెందిన సమాజం మాత్రం రేప్ చేసిన దుర్మార్గుడికే ఇచ్చి పెళ్లి చేయడం ఉత్తమమైన పరిష్కారం అని చెప్తోంది .. నేనో కథ చదివా.. తన కూతురు అత్యాచారానికి గురై ఇంటికి వస్తే తల్లి అంటోంది.. "వెళ్లి తలారా స్నానం చేసిరా. ఏమీ జరగలేదు. ఒక యాక్సిడెంట్ అంతే. స్నానం చేసి, తినేసి పడుకో. ఎవరితో ఏమీ చెప్పాల్సిన పని లేదు."

నా ఈ మాటలకు, ఉద్వేగానికి కారణం Rajuగారి ఈ కార్టూన్. చాలామందికి ఇది చిన్న సూక్తి లేదా మంచి మాట చెప్పే బొమ్మలాగే అనిపించవచ్చు . కాని ఆ తండ్రి కళ్లలోని నిస్సహాయత, ఆ తల్లి మనసులోని ఆవేదన ఎంతమందికి కనిపిస్తోంది. ఎంతమందిని ఆలోచింపచేస్తుంది....

2 వ్యాఖ్యలు:

నీహారిక

ఎవరైనా సరే అత్యాచారం చేసినవాడికిచ్చి పెళ్ళి చేయమని సలహా ఇవ్వగలరు కానీ అత్యాచార బాధితురాలిని బలవంతపెట్టలేరు.మీకు ఒక కేసు గురించి చెపుతాను,ఒక వివాహిత మీద అత్యాచార ప్రయత్నం జరిగింది.ఆ సంఘటన తరువాత వైవాహిక జీవితం మీద విరక్తి కలిగింది.భర్త ఆమెను ఏమీ అనలేదు,వైవాహిక సంబంధాలు నెరవేరుస్తూనే భార్యకి అండగా నిలిచాడు,ఆ భార్య మాత్రం తనకు వైవాహిక జీవితం మీద విరక్తి కలిగింది అని భర్తని వివాహేతర సంబంధం ఏర్పరుచుకోమని సలహా కూడా ఇచ్చింది.ఆ భర్త ఏమి చెయ్యాలి ? ఆ భార్య చేసిన (చేస్తున్న) పని తప్పా ? ఒప్పా ?

ఒక అత్యాచారం నలుగురి జీవితాలను ప్రభావితం చేస్తున్నపుడు, అన్ని కేసులకీ ఒకే తీర్పు ఉండకూడదనేది మా వాదన !

Unknown

నీహారిక గారు, రేప్ చేసేవాడు ఎవడూ ఆ స్త్రీకి పెళ్ళైందా, లేదా అనేది చూడడు. ఇంకొకడి భార్య మీద చెయ్యి వెయ్యకూడదు అనే virtueని రేపిస్త్‌లు నమ్ముతారా? రేప్‌కి గురైన స్త్రీ భర్త వేరే ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఏమి జరుగుతుంది? ఆ అక్రమ సంబంధం పెట్టుకున్న స్త్రీని కూడా చెడిపోయిందనుకుంటారు.

"మా భూమి" అనే సినిమా చూసాను. అందులో దొరలు ఒక కొత్తగా పెళ్ళైన స్త్రీని చెరపడతారు. అది చూసిన రామయ్య తనకి కాబోయే భార్యని దొరల కంటపడొద్దని చెపుతాడు. కానీ ఆమె దొరగారి గడీలో పనికి వెళ్ళిందని రామయ్య ఆమెని వదిలి పట్టణానికి పోతాడు. మగవాడి భావజాలం ఎలా ఉన్నా, "పెళ్ళైన స్త్రీని రేప్ చెయ్యకూడదనీ, అలా చేస్తే ఇంకో మగవాడి ప్రైవసీ దెబ్బతింటుందనీ" రేపిస్త్‌లు ఎవరూ విచారించరు. పెళ్ళైన స్త్రీలపై కూడా రేప్‌లు జరుగుతోంటే, రేప్‌కి గురైన స్త్రీని రేపిస్త్‌కే ఇచ్చి పెళ్ళి చెయ్యాలనే sentiment ఒకటి ఏడ్చి చచ్చింది.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008