ఇదే నా మొదటి లేఖ బ్లాగు గుంపుకు....
ఒక్కటొక్కటిగా నేర్చుకుంటూ, ఇవాళ్టికి బ్లాగులలో రెండవ సంవత్సరం పూర్తి చేసాను. అంటే బ్లాగ్లోకంలో రెండవ పుట్టినరోజు అన్నమాట..
జనవరి 2006.
పనంతా పూర్తి చేసుకుని ఊరికే అలా కూర్చున్నాను. అది చూసి మా అబ్బాయి. ఏంటి మమ్మీ! బోర్ కొడుతుందా? అని యాహూ మెసెంజర్ లో ఎలా చాటింగ్ చేయాలో చూపించాడు. కాని నెట్‌లో ఎప్పుడు కూడ మన అసలు వివరాలు ఇవ్వొద్దు అని మొదటి పాఠం చెపాడు. ఏదో సినిమా హీరోయిన్ పేరు పెట్టుకుని మెల్లి మెల్లిగా చాటింగ్ చేయడం తెలుసుకున్నా. అది బోర్ కొట్టాకా అంతర్జాల విహారం మొదలుపెట్టాను. మావారు గూగుల్ సెర్చ్ ఎలా చేయాలో చెప్పారు. ఏదైనా పదం కొట్టు దానికి సంబంధించిన సైట్లు వందలు కనిపిస్తాయి. అవి ఒక్కొక్కటి చూడు అన్నారు. అలా నా శోధన మొదలయింది. మా పిల్లల ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అప్పుడు కంప్యూటర్‌లో రోజు సీట్ల వివరాలు చూసేదాన్ని. తర్వాత దాని జోలికి వెళ్ళేదాన్ని కాదు. అందుకే నెట్ ఎలా వాడాలో తెలీదు. ఎంత చాటింగ్ చేసినా, హైదరాబాదు, తెలుగు మీద ఉన్న అభిమానంతో జాలంలో తిరుగుతుంటే తెలుగు కి సంబంధించిన గుంపులు, హైదరాబాదు మస్తీ గుంపు దొరికాయి. అవి జిమెయిల్ లో ఉన్నాయి. అది ఎలా చేయాలో తెలుసుకుని మొదలెట్టి వాటిల్లో చేరిపోయా. హైదరాబాద్ మస్తీ, తెలుగు బ్లాగు గుంపులో సెటిల్ అయిపోయా. మొట్టమొదటిసారి తెలుగు బ్లాగు గుంపులో అడుగు పెట్టాక అక్కడ అందరూ తెలుగులో మాట్లాడుకుంటుంటే (రాస్తుంటే) తెగ ముచ్చటేసింది. అర్రే ! ఎంత సులువుగా తెలుగులో రాయొచ్చు అని అనుకునేదాన్ని. కాని అప్పుడు ఇంగ్లీష్, తెలుగు రెండింటిలో సంభాషణలు జరిగేవి.
స్వభావసిద్ధంగానే నేను బ్లాగు గుంపులో తెగ అల్లరి చేసేదాన్ని. ఎప్పుడూ ఆటలు, పాటలు,
సినిమాలు. కాని అందరూ సరదాగా పాల్గొనేవాళ్ళు . ఎంత మంది తిట్టుకున్నారో తెలీదు. అప్పటికే
లేఖిని మొదలైంది. అంత వరకు ఇంగ్లీషులో సంభాషణలు చేసిన నేను లేఖినితో
మొదటి మెయిల్ రాసాను. అప్పుడే తెలుగు నేర్చుకున్నట్టుగా ఉండింది. ఆ తర్వాత
కూడలి మొదలైంది. నేను ఎప్పుడు గుంపుకు మెయిల్ పంపినా, చావా కిరణ్ నా వెనకాలే ఉండేవాడు.
బ్లాగు మొదలెట్టండీ. ఇవన్నీ అందులో పెట్టుకోవచ్చు. కాని నేను వాదించేదాన్ని హాయిగా ఇక్కడ అందరం మాట్లాడుకుంటున్నాము కదా. ఇంకా విడిగా బ్లాగు ఎందుకు? అని. కాని ఎవరో గుర్తులేదు కాని ఇలా చెప్పారు - బ్లాగు గుంపు అనేది బజారులో ఉన్న కొట్టు లాంటిది. అక్కడ అందరూ కలిసి మాట్లాడుకుంటారు. మళ్ళీ తమ ఇళ్ళకు వెళ్ళిపోతారు. కాని బ్లాగు అనేది మన ఇల్లు లాంటిది. అక్కడికి మనం అందరిని పిలవొచ్చు అని. ఆ తర్వాత ఇక నాకు బ్లాగు మొదలెట్టకపోవడానికి సాకు దొరకలేదు. ధైర్యం చేసి గుంపులో చెప్పినట్టుగా బ్లాగు
మొదలెట్టేసాను ఒక
ధమాకా తో. కాని దానిని ఎలా అలంకరించాలో ఏమేం మార్పులు చేయాలో అస్సలు తెలీదు. కాని అడగ్గానే ఎవరో ఒకరు నా సందేహాలు తీర్చేవారు. అలా ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ వచ్చాను. తెలుగులో వంటల బ్లాగు లేదని తెలిసీంది , వెంటనే అదే నెలలో షడ్రుచులు మొదలెట్టాను. మొదట్లో నా బ్లాగులో ఏమి రాయాలో తెలీదు. అంతా అయోమయం. అందుకే ఎక్కువగా నాకు నచ్చిన విషయాలను రాసేదాన్ని. మెల్లి మెల్లిగా నా స్వంత రాతలు మొదలుపెట్టాను. అలా అలా నాకు ఇష్టమైన అభిరుచులన్నీ బ్లాగులుగా చేసుకున్నాను. ఈ ప్రయాణంలో మిగతా బ్లాగర్లు తమ కామెంట్లతో ఎంతో ప్రోత్సహించారు. సహాయం చేసారు.
ఇలా నేను ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాను.
500,
1000,
1500, ...
బ్లాగు మొదలెట్టిన సంవత్సరంలోగానే కంప్యూటర్ ఎరాలో ఒక సమగ్రమైన వ్యాసం రాయగలిగాను. అదే
తెలుగు వెలుగులు. అప్పుడే మొదటి బ్లాగు
పుట్టీనరోజు అందరిమధ్య సంతోషంగా , గర్వంగా జరుపుకున్నాను.
వర్డ్‌ప్రెస్‌లో నాకు నచ్చని సాంకేతిక సమస్యలతో
బ్లాగ్ వార్తలతో బ్లాగర్‌లోకి మారిపోయా. అలా మెళ్ళిగా నా సాగింది. మధ్య మధ్యలో పత్రికా ప్రచురణలు.
ఈ ప్రయాణంలో కొన్ని
దుర్ఘటనలు కూడా జరిగాయి.కాని ఎంతో మంది బ్లాగర్లు నాకు అండగా నిలిచి ధైర్యం చెప్పి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు.
ఈ రెండేళ్ళ ప్రయాణం ఎంతో సాఫీగా,మధ్య మధ్య
ఎత్తుపల్లాలను దాటుకుంటూ ఇక్కడికి చేరాను. ఈ క్రమంలో నాకు ఎప్పటికప్పుడు వచ్చే సాంకేతికపరమైన సందేహాలు ఓపికగా చెప్పేవాడు
వీవెన్. అతనే నా సాంకేతిక గురువు. రెండేళ్ళ క్రిందవరకు నెలసరుకుల లిస్ట్ తప్ప వేరే రాసే అలవాటు లేని నా రాతలను రచనలు చేయడంలో సహాయం చేసిన గురువుగారు
కొత్తపాళీగారు. తమ కామెంట్లతొ నన్ను ఎంతో ప్రోత్సహించిన వారందరికి శతకోటి నమస్సులు. అలాగే
పొద్దువారు కూడా నన్ను చాలా ప్రోత్సహించారు. నేను ఈ బ్లాగుప్రపంచంలోకి రాకుండా ఉంటే టీవీలో చచ్చు, పుచ్చు సీరియళ్ళు, బుర్ర పాడుచేసే సినిమాలు చూస్తు, ఇరుగమ్మ పొరుగమ్మలతో సొల్లుకబుర్లేసుకుంటూ ఉండేదాన్ని.
ఇప్పుడు నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను.నేను ఒక తెలుగు బ్లాగర్‌ని, చిన్నపాటి రచయిత్రిని అని. కాని నాకు ఏదో టాలెంట్ ఉందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఏదో ఎప్పుడు సరదాగా ఉండడం అంటే నాకు ఇష్టం. అలాగే ఉంటూ వచ్చాను. ఈ బ్లాగులవల్ల ఏదో ఆశించి కాదు. కాని ఈ బ్లాగుల వల్ల నాకే తెలియని రచనాశైలి బయటికొచ్చింది అని చెప్పగలను. అలాగే ఎంతో మంది ఆత్మీయులను పొందగలిగాను. ఇన్నేళ్ళు నాకు స్నేహితులు లేరు అని బాధపడేదాన్ని. కాని ఇప్పుడు నన్ను గౌరవించే, నాకంటే ఎక్కువగా నా గురించి శ్రద్ధ తీసుకునే , నన్ను ఓదార్చే స్నేహితులు ఉన్నారు అని చెప్పుకోగలను. రక్తసంబంధం కంటే మిన్న ఐన స్నేహబంధం నాకు లభించింది ఈ బ్లాగుల వల్ల. ఆత్మీయులైన బ్లాగర్లందరికీ నా మనఃపూర్వక ధన్యవాదాలు. ఏమిచ్చి వీరి ఋణం తీర్చుకోగలను.
నా బ్లాగులన్నింటిని సుందరంగా అలంకరించడంలో నాకు సహాయం చేసిన
తెలుగు’వాడి'ని గారికి,
ప్రతాప్ కి పేద్ద థాంక్స్.. నన్ను ఒక మామూలు గృహిణి అని అనుకోకుండా ఎన్నో సాంకేతిక విషయాలు నేర్పిన
శ్రీధర్‌కి కూడ థాంక్స్ . తమ్ముడికి థాంక్స్ చెప్పొద్దు కాని సభామర్యాద పాటించాలి కదా. ఇక ఇంట్లో మా గురువు ఎలాగూ ఉన్నాడు. మా అబ్బాయి. బోర్ కొడుతుందని నాకు కంప్యూటర్ నేర్పితే ఇప్పుడు వాడికే కంప్యూటర్ ఖాళీ్గా దొరకడంలేదు అని మొత్తుకుంటాడు.కాని మళ్ళీ నేర్పిస్తాడు. ఎప్పుడు చూసినా టక్కు టక్కు మంటూ కొట్టడమేనా. కంప్యూటర్ విప్పి కేబుల్స్ అన్నీ తెలుసుకుని మళ్ళీ పెట్టు అని అవి కూడా నేర్పించాడు ఈ మధ్య. మరి ఇంతమంది గురువులున్న విద్యార్థిని నేర్చుకోకుంటే ఎలా?? మీరే చెప్పండీ?
ఇక నా బ్లాగుల లెక్కలు చూద్దాము.
jyothi
టపాలు - 264
వీక్షకులు - 48,606
జ్యోతి
టపాలు - 217
వీక్షకులు - 24,143
షడ్రుచులు
టపాలు - 368
వీక్షకులు - 24,041
annapoorna
టపాలు - 301
వీక్షకులు - 7,369
గీతలహరి
టపాలు - 450
వీక్షకులు - 5,148
నైమిశారణ్యం
టపాలు -70
వీక్షకులు - 7,751
Health is Wealth
టపాలు - 75
.....................................
మొత్తం:
టపాలు - 1,745
వీక్షకులు - 1,17,058
ఈ మధ్య నా మీద జరిగిన దాడి కాని, బ్లాగులలో జరుగుతున్న వివాదాలు చూసి బాధ కలిగింది. బ్లాగులు రాయడం ఆపేద్దాం అనుకున్నాను కూడా. కాని ఇంతమంది మిత్రులను వదిలి వెళ్లగలనా?? నామీద ఎన్నో అపోహలు పెట్టుకున్న శ్రేయోభిలాషులకు ఒక సూచన. నేను ఏదో సాధిద్దామని, సంపాదిద్దామని బ్లాగులు రాయడంలేదు. అనవసరంగా మీ మనసులను, ఆలోచనలను పాడు చేసుకోకండి. నేను రాసినవి నచ్చితే చదవండి లేకుంటే మీకు నచ్చిన బ్లాగుకెళ్ళండీ. లేదా మీకు కావలసినట్టుగా బ్లాగు మొదలెట్టుకోండి. ఓకేనా..
ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నాకే నవ్వొస్తుంది. బ్లాగు మొదలెట్టడం కూడ తెలీదు, పిక్చర్స్ అప్‌లోడ్ చేయడం, ఎడిటింగ్ చేయడం, కనీసం గూగుల్ లో పిక్చర్స్ సేవ్ చేసుకోవడం కూడా తెలీదు, ఇప్పుడు ఇన్ని బ్లాగులు రాస్తూ, అందరికి సహాయం చేయగలుగుతున్నాను, అదీ టెక్నికల్‌గా అని.. నా నమ్మకం ఒక్కటే. తలచుకుంటే ఏదీ అసాధ్యం కాదు. పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉండాలి అని..
ఉంటాను మరి.
సెలవ్
సర్వేజనా సుఖినోభవంతు.