Friday 19 November 2010

బ్లాగ్ వనభోజనాలు

అస్తమానం తిని తొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఏముంది? అన్నాడా రావు గోపాలరావు. నిజమే కదా. ఊరికే ఎవరి బ్లాగులో వాళ్ళు రాసుకుంటుంటే ఏముంది.అప్పుడప్పుడు అందరూ ఒకే విషయం మీద రాస్తే ఎలా ఉంటుంది. సూపర్ గా ఉంటుంది. ఇది కార్తీకమాసం. అంతే దీపాలు, ఉపవాసాలు, పూజలు, వన భోజనాలు. తమ తమ ఉద్యోగ, వ్యాపార , సంసార విషయాలలో బిజీగా ఉండేవాళ్ళు ఈ వనభోజనాల పేరుతో ఒక్కచోట కలిసి తమ ఇంటినుండి తెచ్చుకున్న వంటకాలతో ఆటలతో పాటలతో కలిసి మెలిసి గడుపుతారు. ఆ ఒక్కరోజైనా కాస్త ప్రత్యేకంగా గడిపితే వచ్చే ఆనందమే వేరు. కాదంటారా??

ఐతే ఇప్పుడేంటి?అంటారా?

బ్లాగులు రాసేవాళ్ళందరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అందరూ బిజీనే. మనకంటూ ఒక లోకం సృష్టించుకున్నాం. అదే బ్లాగ్లోకం. మనం కూడా ఈ వనభోజనాలు ఏర్పాటు చేసుకుంటే పోలా?? ఎలా అంటారా?? దాందేముంది. చాలా వీజీ.. ఎల్లుండి కార్తీక పున్నమి. ఆరోజు బ్లాగ్వనంలో వనభోజనాలు ఏర్పాటు చేసుకుందాం. అందరూ తమ బ్లాగులోనే ఒక వంటకం గురించి రాసి దాని ఫుటో పెట్టండి. అందరూ వచ్చి అది చూసేసి, చదివేసి నచ్చితే కామెంటేసి వెళతారు. అర్ధం కాలేదా? ఐతే గత సంవత్సరపు వనభోజనాల విశేషాలు చూడండి..

మరి ఈ వంటలు ఆడవాళ్ళు మాత్రమే రాయాలని లేదు. అమ్మాయిలు, అమ్మలు, అబ్బాయిలు, అంకుల్సు అందరూ రాయొచ్చు. అది నిమ్మ రసమైనా , సేమ్యా పాయసమైన సరే. షడ్రుచులులో లాగా సీరియస్సుగా రాయాల్సిన పని లేదు. మీకు వచ్చిన వంటకాన్ని మీ స్టైల్ లో రాయండి. కెమెరా లేదు ఫోటో ఎలా అంటే జై గూగులమ్మ అనండి ఒక్కరోజు . పర్లేదు..

సరే మరి ఎల్లుండి కార్తీక పున్నమి రోజు కలుద్దాం...

13 వ్యాఖ్యలు:

Anonymous

ఏదో మా ఇంటావిడ రుచిగా చేసేది తినేసి, గుట్టుగా కాపురం చేసేసికుంటున్నాను. ఇప్పుడు, నా పాకప్రావీణ్యాన్ని అందరికీ తెలిపి వీధిన పడడం అంత అవసరమంటారా? అత్తెసరుకీ,ఎసరుకీ తేడా తెలియదు. ఏదో ఇలా వెళ్ళిపోనీయండి !

లత

జ్యోతి గారూ,

మీ బ్లాగ్స్ ని ఎప్పటినుండో ఫాలో అవుతున్నాను.చాలా బాగా రాస్తారు మీరు.
బ్లాగ్ క్రియేట్ చేసుకోవడం మా బాబు నేర్పితే,మీ బ్లాగ్ గురువు లో చాలా నేర్చుకున్నాను నేను.
ఈ కామెంట్ లో మీకు నా థాంక్స్ చెప్తున్నాను. థాంక్యూ వెరీ మచ్.
అన్నట్టు మీ వనభోజనాలలొ నేనూ రాయవచ్చా

జ్యోతి

ఫణిబాబుగారు, మీ ప్రావీణ్యాన్ని చూపమనలేదే. మీకు వచ్చిందే రాయండి. నిమ్మరసమైనా సరే.

లతగారు,

సంతోషం. తప్పకుండా రాయండి.. ఇది బ్లాగర్లందరికోసం..

వేణూశ్రీకాంత్

అది సరేగానీ ముందు పైన ఫోటోలోని తాలీ ఏ హోటల్లోదో చెప్పేయండి నోరూరించేస్తుంది :-)

కృష్ణప్రియ

జ్యోతి గారు,
మంచి ఐడియా..
క్రితం సంవత్సరం టపాలు చదివాను ఇందాక.
అయితే ఏదైనా రాస్తాను నేను కూడా..

Padmarpita

ఇప్పుడే కొత్త వంట ప్రయోగం చేస్తున్నానండి....బాగుంటే గప్ చుప్ గా తినేస్తాను....కుదరకపోతే బ్లాగ్ లో వ్రాస్తాను...:):):)

ఇందు

జ్యోతిగారు ఇదేదో భలే ఉంది.నేను ట్రై చేస్తా! ఒక కొత్త వంటకం చేసి బ్లాగ్లో పెట్టేస్తా!

జ్యోతి

పద్మ. వేరీగుడ్.. బావున్నా లేకున్నా ఫుటో తీసి పెట్టండి. దంతసిరి... మనమేం చేయగలం. :)

ఇందు.. కానివ్వండి మరి ఆదివారం కార్తీక పున్నమి..

శరత్ కాలమ్

బ్లాగ్వనభోజనాలంటే హాయిగా బ్లాగర్స్ అందరూ కలిసి వనభోజనాలకెళుతున్నారేమో అనుకున్నా. ఎవరింట్లో వారు చేసుకొనే భోజనాలేనా. ప్చ్.

చిన్నప్పుడు నేనూ, నా మేనకోడలు కలిసి డిచికీ అనే కొత్త వంటకాన్ని వండేవాళ్ళం. ఏదో ఒక కొత్త పేరు పెట్టలాని కిచిడీ లాగా డిచికీ అని పేరు పెట్టాము. ఇంతకీ ఆ వంట ఎలా చెయ్యాలో ఊహించండి? ఏంలేదండీ ఇంట్లో వున్న తినదగ్గ పదార్ధాలు అన్నీ కలిపివడెదే డిచికీ. మీరందరూ ప్రయత్నించి చూడండి. బావుంటుంది. బాగోలేకపొతే మీ ఆయనలకు/ఆవిడలకు పెట్టండి. అప్పుడింకా బావుంటుంది.

Continued ...

శరత్ కాలమ్

కొన్ని వారాల క్రితం మా అమ్మలు ఫుడ్డు ఛానలు సీరియస్సుగా రోజూ చూస్తుంటే కామిక్స్ గట్రా చూడకుండా ఎంత ఎదిగిపోయిందో అని సతోషించా. ఒక శుభముహూర్తాన ఇహ ఛానల్ చూసింది చాలు గానీ అని ప్రయోగాల్లోకి దిగింది. తన వంట అసిస్టెంటు నేనుట. తప్పుద్దా ఇహ. చివరికి అది వండినదేమంటే, నేను అన్నీ అందించినవి దేనికంటే ఓ డిచికీ కోసం. మా చిన్నప్పుడూ ఇలాంటి వంటకాలనే వండుకునేవారం రా అని చరిత్ర చెబితే చాలా సంతోషించింది.

వచ్చే వేసవిలో మా చికాగోకి చుట్టుపక్కల 6 గంటల దూరం లోపుగా వున్న బ్లాగర్లని పిలిచి క్యాంపింగ్ వేసి వనభోజనాలకి పిలవాలనే ఆలోచన మీ టపా చూసాకనే వచ్చింది. చూడలి మరి.

జ్యోతి

శరత్ గారు. ఇక్కడ వనభోజనాలకు వెళ్లే చాన్స్ లేదు కదండి. అందుకే ఇలా అన్నమాట. మీ డిచికి మీరే చేసి మీ బ్లాగులో పెట్టండి. మేము దానికి అవసరమైన మార్పులు చేర్పులు చేసుకుంటాము కదా..

శరత్ కాలమ్

వనభోజనాలకు వెళ్ళే ఛాన్స్ ఎందుకులేదండీ? కావాలంటే హైదరాబాదుకు కొంత దగ్గర్లో మా చిన్నక్కయ్య వాళ్ళకి ఫార్మ్ హవుజ్ వుంది (సింగూరు డ్యాముకి దగ్గర్లో? ఆ డ్యాము పేరు సరిగ్గా గుర్తుకులేదు). వెళతామంటే చెప్పండి - మా అక్కయ్య కూడా తోడుగా వస్తుంది. మా అక్కయ్యకూ బ్లాగుల్లోకి రావాలని వుంది - కొన్ని ఆర్టికల్స్ పేపర్ మీద వ్రాసింది కానీ ఇంకా కుదరలేదు. మా కుంటుంబ వేడుకలో మా చిన్నక్కని మీకు పరిచయం చెయ్యలేకపోయాను - పెద్దక్కను పరిచయం చేసాను.

డిచికీ చెయ్యడం చాలా సులభం. ఇంట్లో తినదగ్గ పదార్ధాలు ఏమున్నా సరే అన్నీ ఓ పాత్రలో పడేసి వండండంతే.

హనుమంత రావు

జ్యోతిగారు మీ బ్లాగుభోజనాల ఆలోచనే అద్భుతం..శ్రీవారి
వనభోజనం స్పెషల్ ...వ్రాయడం బావుంది. మీరైతే మీరే
చేసుకుంటారు కాబట్టి ముందుగా యెప్పుడు తింటారో
చెప్పగలరు...ఆ అదృష్టం మాకు మరి లేదుగా...ఇలా
సమన్వయ పరుస్తూ బ్లాగోనర్లను కలుపుతూ కొత్త
కార్యక్రమాలు బాగుంటాయి...ఆలోచించండి. శలవ్.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008