Sunday 21 November 2010

శ్రీవారి చేతివంటా?మజాకా?? ఈనాడు - రుచి






కార్తీకపూర్ణిమ సందర్భంగా బ్లాగ్ వనభోజనాలకు స్వాగతం..

సమయం.. మధ్యాహ్నం 12 గంటలు.
" ఇవాళ ఎం వంట?"
" పాలకూర పప్పు, రసం, చిక్కుడుకాయ మెంతికూర వేసి చేసాను."
"అసలు నువ్వు వంట చేయడం మర్చిపోతున్నావ్. రుచి పచి లేకుండా ఉంటున్నాయి."
" అవునా! మరి మీరే చేయొచ్చుగా?.. పాతికేళ్ళుగా తింటున్నారు. పాతబడ్డాయి రుచులన్నీ. అందుకే అలా అనిపిస్తుందేమో? "
"నేను వంట చేయలేననుకున్నావా? అదేమన్నా బ్రహ్మవిద్యా? నీకు తెలుసా? స్కూలులో ఉన్నప్పుడే వంట చేసుకుని , గిన్నెలు కడిగేసుకుని చదువుకునేవాళ్ళం. ఇంకో విషయం..నేను గాని పప్పు చారు చేసానంటే ఆ వాసనకు చుట్టూ పక్కల ఉన్న లేడీస్ వచ్చి తీసుకెళ్ళేవారు. ఏమనుకున్నావ్? కావాలంటే వెళ్లి అడుగు.."
"ఓహో! మాటలొద్దు. ఎప్పుడో చేసాను అని చెప్పడం కాదు. ఇప్పుడు చేసి చూపిస్తే నమ్ముతాను. కనీసం టీ కూడా చేసుకోరు కాని వంట చేసారంట. నేను నమ్మాలి."
"సరే ఐతే .. నీకు వంట రాదుగాని. ఇవాళ నేనే చేస్తాను. టమాటాలు ఉన్నాయా.. "
"ఉన్నాయి"
"ఐతే . అన్నీ రెడీగా పెట్టు వచ్చి టమాటా పచ్చడి చేస్తాను."
"ఆహా! అన్నీ రెడీగా పెడితే నేనూ చేస్తా .. అది మాత్రం నేనెందుకు మీరే చేసుకోండి."
"సరే. పద "
" ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమిర, కరివేపాకు అన్నీ ఇవ్వు."
"కూరగాయలు అన్నీ చాలా కాస్ట్లీగా ఉన్నాయి చూసి వేయండి."
"ఇదిగో ఇలా చేయాలి . చూడు. మళ్ళీ అలాగే చేయి."
"మరే! ఇప్పటికి ఆరేడు రకాల టమాటా పచ్చళ్ళు (అందులో రెండు బయట కొనుక్కొచ్చి నేనే చేశా అని చెప్పాలెండి.) చేస్తే నచ్చలేదు కాని ఇంకా కొత్తది ఎందుకు నేర్చుకోవడం. మీరు చేస్తుండండి. నేను చూస్తుంటాను. "
"నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, వేయాలి. మెంతులు వేయనా?.. వద్దులే చేదవుతుందేమో. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి ఎర్రగా వేయించాలి. తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి వేసి కలిపి కొద్దిగా నువ్వులు,పల్లీలు కూడా వేసి వేయించాలి. తర్వాత కట్ చేసిన టమాటాలు వేసి పసుపు, కారం ( ఒక చెంచా చాలా?) , ఉప్పు (నువ్వే వేయి కరెక్ట్ గా) వేసి మగ్గనివ్వాలి.. అలాగే కొత్తిమిర కూడా వేయాలి." అని మూత పెట్టేసారు..
"అది అయ్యాక , చల్లారాక , గ్రైండ్ చేసి తీసుకురా. పోపు వద్దులే. నీకు కావాలంటే విడిగా పెట్టుకో..చూడు ఎంత మంచి వాసన వస్తుందో.. నువ్వు చేస్తే అలా వస్తుందా.ఈ మాట గుర్తుపెట్టుకో. వంట చేస్తూ ఉంటే ఆ ఘాటు చుట్టుపక్కలకు వెళ్ళాలి. ( మంట హైలో పెట్టి నూనె కాలుతుంటే అన్నీ ఒక్కోటి వేస్తే ఘాటు రాక ఏమవుతుంది.. మాడిపోతుంది కూడా)

**************************

సీను అర్ధమైనా?? ఈ మధ్య నా వంటలు బాలేవని కంప్లెయింట్లు. ఎంత బాగా చేసినా, ఎన్ని రకాలుగా చేసినా నచ్చడం లేదు. అందుకే వదిలేసా. అప్పుడప్పుడు నన్ను తిట్టుకుంటూ వంటింట్లో కొచ్చి గరిట తిరగేస్తున్నారు . పెళ్లైనప్పటినుండి అయ్యో అని అన్నీ టైమ్ ప్రకారం చేసి పెడుతున్నానా? ఎప్పుడూ చేయలేదనే అంటారు. చేసావు, బాగుంది అనే మాట రాదు. అందుకీ ఈ మధ్య ఒక రూల్ పెట్టేసా.ఆదివారం పొద్దున్న టిఫిన్ మాత్రం చేయను. బయటినుండి తెప్పించాల్సిందే. మధ్యాహ్నం ఎలాగు స్పెషల్ చేయాల్సి ఉంటుంది. అలాగే పండగ రోజు కూడా నో టిఫిన్. ఈ ఒక్కరోజన్నా తిండి టెన్షన్ లేకుండా చేయరా అని గోల పెట్టాలెండి. పాపం నా కొడుకు వెళ్ళి అందరికి టిఫిన్ తెస్తున్నాడు. మావారు కూడా కిమ్మనక తినేస్తున్నారు. :) సరే .. నిన్న మావారు చేసిన టమాటా పచ్చడి ఇది. అంత కష్టపడి చేసారు కదా .ఈ వనభోజనాలకు అదే పెట్టేస్తే పోలా అని మావారికి చెప్పా. ఈ పచ్చడి గురించి నా బ్లాగులో రాస్తున్నా అని. సరే పెట్టుకో అన్నారు. అదన్నమాట సంగతి . ఆయన చేసిన పచ్చడికి పోపెట్టేసి ఇక్కడ టపా కట్టేస్తున్నా.. ఇంతకుముందు అంటే చాన్నాళ్ల క్రితం నన్ను తిట్టుకుంటూనే వంట చేసారులెండి.


ఇదే సందర్బంగా ఈరోజు ఈనాడు లో వచ్చిన నా వంటలు. ఇది ఈనాడులో నా మొదటి అడుగు.. వంకాయ రుచులు..


22 వ్యాఖ్యలు:

ఇందు

జ్యోతిగారు బ్లాగ్లో వనభోజనాలకు నావంతుగా...కొబ్బరన్నం పంపిస్తున్నా అండీ...రైతా,ఆలూకూర కూడానండోయ్! కాస్త రుచి చూసి పెట్టండీ!

జయ

ఏంటో అందరూ 'ఇంటి పెద్దల 'తో వంటలు చేయించేస్తున్నరు. టమాటా పచ్చడి మాత్రం బాగుందండి. మీ ఈనాడు వంటకాలు కూడా చాలా బాగున్నాయి.

కృష్ణప్రియ

టమాటా పచ్చడి థిక్ గా ఉండటానికి కారణం నువ్వులూ, పల్లీలన్నమాట.

swapna@kalalaprapancham

bagundi post, pachhadi.
ma amma chese vantallo naku ee pachhadi ante chala ishtam.

nenu kuda ma amma ni vankalu peduthu untaa. nenu kuda mi vaari lage nenu vanta chesta ani cheppi ma amma ni avi kavali ivi ekkada unnayi ani okate aduguthuntaa ;)

miru costly vantalu, pappu charu ante gurthu vachhindi oka sangathi. ninna naku ee roju ki sambar cheyalane kuthi puttindi ma amma nannu kuragayalu thisukarammani pampindi. okka mulakkaya Rs. 10 cheppadu vedava. antha undadani gurthu endukante idavariki thechinnapudu 3 ichhadu Rs. 10 ki. ento rates ila perigipoyayaaa baboy

swapna@kalalaprapancham

Jyothi garu inthaki ivala kaarthika "purnima" or kaarthika "pournami" naa? enadukante nenu pournami anukuntunnanu.

ivala nenu velli 365 vatthulu veligincha gudi lo 1st time. chala bagundi gudi antha kala kalalaaduthundi.

Padmarpita

అబ్బో! ఇన్ని రుచికరమైన వంటలా? చూస్తేనే నోరూరుతున్నాయి:)
ఇంక వండుకుని తింటే....ఆహా! ఓహో:):)

నేస్తం

>>>>అందులో రెండు బయట కొనుక్కొచ్చి నేనే చేశా అని చెప్పాలెండి

ఈ లైను నాకు సూపర్ నచ్చేసింది :)

రాజ్యలక్ష్మి.N

మీ ఈనాడు వంటకాలు కూడా చాలా బాగున్నాయి.
జ్యోతిగారు..

వేణూశ్రీకాంత్

హ హ బాగుంది జ్యోతిగారు :-) మీ ఈనాడు వంటకాల గూగుల్ డాక్ లింక్ పని చేయడంలేదనుకుంటానండీ ఓ సారి చెక్ చేయండి.

జ్యోతి

ఇందు,
చూసాను. చాలా బావున్నాయి.. కొబ్బరన్నం ప్రెజంటేషన్ మాత్రం సూపర్..

జయగారు ధాంక్స్ అండి. మరి ఏడాదికోసారి వంట చేస్తుంటే ఆమాత్రం గుర్తింపు ఇవ్వకుంటే ఎలాగండి? పాపం కదా...

జ్యోతి

కృష్ణప్రియ.. ఇలా టమాట పచ్చడిలో నువ్వులు వేసి పచ్చడి చేస్తే దోశలకు చాలా బావుంటుంది..

స్వప్న... పౌర్ణమి అన్నా పూర్ణిమ అన్నా పున్నమి అన్నా ఒకటే..

జ్యోతి

పద్మ.. మొన్నేదో ప్రయోగం చేస్తున్నా అన్నారు మరి ఉత్త నీళ్లతో పని కానిచ్చేసారేంటి??? ధాంక్స్..

నేస్తం.. అదేమరి.. పక్కింటి పుల్లకూర చందాన... మావారికి బయటి ఫుడ్ పడదు. ఇలా తెచ్చా అంటే తినరు. అందుకే అలా కవరింగ్ అన్నమాట.. :))

జ్యోతి

రాజి, ధన్యవాదాలు..

వేణు.. సరిచేసాను చూడండి...

Hemalatha

చాలా బాగుంది టమాటో పచ్చడి.

మధురవాణి

:) :)
Congratulations for your first step in Eenadu! :)

వైదేహి

జ్యోతి గారు అడపా దడపా మీ వ్యాసాలూ దినపత్రికలాలో చూస్తూనే ఉన్నాను,
మీకు నా అభినందనలు.
www.vidyavydehi.blogspot.com

Unknown

Nice Jyothigaru.. Congratulations for your first steps with EEnadu.. Way to go..

Unknown

Congratulations Jyothigaru.. Way to go.. Pachchadi kooda chala bavundi

మాలా కుమార్

అంతేలెండి , అప్పుడప్పుడు అలా చేయించక పోతే మన వంటల రుచి తెలీదు . ఏమాటకామటే చెప్పుకోవాలి టమాట పచ్చడి సూపర్ :)

మాలా కుమార్

ఇందాకే ఈనాడు లో మీ వంకాయ కూరలు చూసాను . మీరు బ్లాగ్ లో పెట్టింది సరిగ్గాచూడక , పాతదేమో అనుకున్నాను . ఈనాడు లో చూసి మళ్ళీ వచ్చి చూస్తున్నాను :)
అభినందనలు .

శ్రీలలిత

టొమాటో పచ్చడి చూడ్డానికి చాలా బాగుంది. రుచి మాట చేసాక మీ వారికి చెపుతాను.
ఈనాడు లో మీ మొదటి అడుగు శుభంగా పడి, మరింత వడి వడిగా ముందుకెళ్ళాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.

సవ్వడి

:):)
Congrats..:)

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008