
ఎప్పుడూ గుర్తులేదు అంటాము కాని అందరికీ ఎన్నో సంగతులు గుర్తుంటాయి. అవి సంతోషమైనా, బాధ కలిగించేదైనా సరే... ఏవైనా ఎప్పటికి మన మనసు పొరల్లో దాగి ఉంటాయి. అప్పుడప్పుడు మనల్ని పలకరిస్తుంటాయి. ఆ జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకుని ఆ సంఘటనల్లోకి వెళ్లిపోతాం. అలాంటి మరపురాని విషయాలెన్నో... ఎన్నెన్నో..
గుర్తొస్తున్నాయి అంటూ గతంలో ఎన్నో టపాలు రాసాను. వేసవి సెలవులకు సంబంధించినవైనా, చిన్నప్పటి ఆటలైనా, సైకిల్ నేర్చుకున్న విధం, అమ్మా నాన్నకు చేసిన పండగ ఐనా గుర్తుకు రాగానే బ్లాగులో నిక్షిప్తం చేసుకున్నాను. అలాగే పదో క్లాసు అనుభవాలు కూడా. దాని తర్వాత ఇంటర్ విషయాలు మరచిపోలేనివి..
పదవతరగతి వరకి అంతా జైలు జీవితమే. రోజూ స్కూలు డ్రెస్సు, నూనె రాసి బిగించి కట్టిన రెండు జడలు, హోం వర్క్, టెస్టులు, మార్కులు, పుస్తకాల మోతకోలు అన్నింటికి మించి పొద్దున్నే లెగడం తయారవడం, స్కూలుకు పరుగెత్తడం(అదేనండి రిక్షాలో). అందుకే ఇంటర్ కి రాగానే స్వేచ్చ దొరికినట్టుగా ఉండేది. ముఖ్యంగా రెండు జడలు, స్కూలు డ్రెస్, బరువైన పుస్తకల సంచీ అవసరం లేదనే సంతోషం. టెంత్ కాగానే కాలేజీలలో అప్లికేషన్ పెట్టడం చాలా కొత్తగా ఇంకా చెప్పాలంటే గొప్పగా ఉండేది. అంటే చదువులో మన లెవెల్ పెరిగిందన్న గర్వం అన్నమాట. ఇక ఏ గ్రూప్ తీసుకోవాలి అంటే నాకు లెక్కలు ఇష్టమే కాని ఆల్జీబ్రా అంటే హడల్. అందుకే B.P.C తీసుకున్నా. సికిందరాబాద్ St.Francis కాలేజీలో సీట్ దొరికింది. అది క్రిస్టియన్ అమ్మాయిల కాలేజీ ఐనా మా క్లాస్మేట్స్ కొందరు ఉన్నారు కాబట్టి బావుంటుంది అని చేరిపోయాను. ఈ విషయమై నాకు సలహాలు ఇచ్చేవారు ఎవరూ లేరు ఆ కాలంలో.. స్కూలులాగానే అక్కడా ఉదయం పది గంటలకు గేట్ బంద్. సాయంత్రం బెల్ కొట్టాకే గేట్ తెరిచేవారు. అంతవరకు జైలులో ఉన్నట్టే. చిన్నప్పటినుండి అలవాటైన జీవితం కాబట్టి మాకు తేడా తెలీలేదు.
ఒకటో రెండో పుస్తకలతో కాలేజీ ప్రస్థానం మొదలైంది. ఇంతకు ముందు సబ్జెక్టుకు ఒకే టీచర్ ఉంటే ఇపుడు ఇద్దరు ముగ్గురు. ప్రతి పీరియడ్ కాగానే క్లాసులు మారడం మాత్రం భలే ఉండేది. అప్పట్లో ఒక ప్రముఖ వ్యక్తి మాకు లెక్చరర్ గా ఉండేవారు అంటే ఇప్పటికీ సంతోషంగా ఉంటుంది. ఆవిడ చాలా అందంగా ఉండేవారు కూడా. అమ్మాయిలందరికీ ఆ లెక్చరర్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది. ఆవిడ అప్పటి క్రికెట్ ప్లేయర్ శివరామక్రిష్ణన్ వదిన అని తెలిసి ఓహో అనుకున్నాం. కాని ఆవిడ ఎం.ఎస్.సుబ్బలక్ష్మి దత్తపుత్రిక గౌరిగారని తర్వాత తెలిసింది. ఇక క్రికెట్ గురించి నాకు తెలిసింది కూడా అప్పుడే. కొత్తబిచ్చగాడు పొద్దెరగడన్నట్టు ఇంట్లో ఉన్న బుల్లి రేడియో బ్యాగులో వేసుకొచ్చేదాన్ని. లాస్ట్ బెంచిలో కూర్చుని లెక్చరర్ రాకముందు,వెళ్లిపోయాక స్కోర్ వినడం.. అప్పుడు గవాస్కర్, విశ్వనాద్, శ్రీకాంత్, కిర్మాని ఫామ్ లో ఉండేవారు. ఇక కపిల్ అప్పుడే వచ్చాడు. అప్పుడు కపిల్ అంటే అమ్మాయిలందరికీ సూపర్ హీరో. నాకు మాత్రం గవాస్కర్ నచ్చేవాడు. పొట్టివాడైనా గట్టివాడే అన్నట్టు క్యాప్టెన్ ఇంకా బ్యాట్ పట్టుకున్నాడంటే పరుగుల వర్షం కురిపించేవాడు మరి.
ఇంటర్లో చెప్పుకోవలసింది ఏంటంటే ప్రాక్టికల్స్. స్కూలులో సైన్స్ ప్రాక్టికల్స్ అంటే ఏడాదికి రెండు మూడుసార్లు చూపించి ఉండవచ్చు. కాని ఇక్కడ బాటనీ, జూవాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఫిజిక్స్ ప్రాక్టికల్స్ అంతగా నచ్చలేదు. మిగతావి మాత్రం బాగా ఎంజాయ్ చేసాను. కెమిస్ట్రీ ల్యాబ్లో మనకంటూ ఒక టేబిల్ , కెమికల్స్ అన్నీ ఉండేవి. ఇందులో నాకు చాలా ఇష్టమైంది ఈక్వేషన్ గుర్తులేదు కాని లెక్చరర్ లేనప్పుడు కూడా చేసేదాన్ని. అందులో బంగారు దారాల్లాగా వచ్చేవి . ఇంకోటి నైట్రిక్ యాసిడ్ అనుకుంటా. అది వేళ్లకు గోరింటాకులా పెట్టుకునేదాన్ని. అలా పెట్టుకుంటే ఎర్రబడేది. తర్వాత ఆ తోలు కూడా ఊడిపోయేదనుకోండి. :) బాటనీ ప్రాక్టికల్స్ కూడా ఆసక్తిగా ఉండేవి. మాకు కాలేజి ప్రిన్సిపల్ ఈ సబ్జెక్ట్ చెప్పేవారు. ఏవో చెట్లు, పూలు అని తెలుసు కాని వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం భలే ఉండేది. ఇక ఏముంది కనపడ్డ చెట్టు కొమ్మలు ఒక పువ్వుతో పాటు కోసి పుస్తకంలో భద్రంగా పెట్టి , ఆ సిస్టర్ కి చూపించడం వాటి పేరు, వివరాలు తెలుసుకోవడం. ఇక ఫైనల్ ప్రాక్టికల్స్ అప్పుడైతే రికార్డ్ బుక్ కోసం తప్పనిసరై , వెతికి వెతికి లాభం లేదని పబ్లిక్ గార్డెన్ కి వెళ్లా.. అక్కడి తోటమాలిని కాస్త బ్రతిమాలితే సరే అని వెంట వచ్చి అక్కడ అడిగిన చేట్లు ,పూల కొమ్మలు కట్ చేసి ఇచ్చాడు. బోలేడు పూలు, కొమ్మలతో కాలేజీకి వెళితే మా ఫ్రెండ్స్ చుట్టుముట్టారు. నాకు ఇవ్వవా అని. మిగిలితే ఇస్తా అని అన్ని తీసికెళ్లి మా లెక్చరర్ ముందు పెట్టా. ఆవిడ తెగ నవ్వారు ఇన్ని ఎక్కడివి అని. అందులో సగం మాత్రమే మాకు పనికొచ్చేవిగా ఉన్నాయి. నాకు కావలసినవి ఉంచుకొని ముఖ్యమైన ఫ్రెండ్స్ కి మిగతావి ఇచ్చా.. ఇక వాటికి తగ్గట్టు రికార్డ్ బుక్ తయారు చేయడం కూడ పెద్ద పనే.. కాని నాకు మొదటినుండి ద్రాయింగ్ అంటే ఇష్టమే కాబట్టి పదికి ఎనిమిదికి తక్కువ కాకుండా మార్కులు వచ్చేవి.
ఇక మిగిలింది జూవాలజీ ప్రాక్టికల్స్. ఇవైతే భలే సరదాగా ఉండేది. బొద్దింకలు, వానపాములు, కప్పలు కోయాలిగా. అసలు ఇన్ని రోజులు బొమ్మలలో చూసి చదివి ఓహో ఇలా ఉంటాయన్నమాట అని అనుకునేవాళ్లం. ఇప్పుడు ప్రత్యక్షంగా చూడొచ్చు అనే ఉత్సుకత .. మొదటి క్లాసులొనే బొద్దింకను కట్ చేయాలి అనేవాళ్లు. అసలు ఈ ప్రాక్టికల్స్ క్లాసుకోసం ఒక డిసెక్షన్ బాక్స్. దాన్లో కత్తులు , కటార్లు.. ఓహో! అదో గొప్ప ఫీలింగులెండి.. :).. ఒకమ్మాయైతే కప్పను కట్ చేసే క్లాసులో డామ్మని పడిపోయింది. అంత నాజూకన్నమాట. మనం అలా కాదుగా(ఇంట్లో అమ్మ పక్కన ఉండి చికెన్ కట్ చేసే అలవాటు ఉంది) బానే చేసేదాన్ని. ఈ జూవాలజీ ఫైనల్ పరీక్షలో మాత్రం కొంచం సతాయించేది. ఏదో ఒక ఎముక ఇచ్చి దాని గురించి రాయమంటారు. బొమ్మలేయమంటారు. చచ్చే చావొచ్చేది. ఎలారా? దేవుడా?అనుకుని ఒక ఐడియా వేసా. లాబ్ అటెండర్ కి రెండు రూపాయలు ఇచ్చి ఒక కప్ప తీసుకున్నా. దానికి మత్తుమందు ఇప్పించి కవర్లో పెట్టుకుని ఇంటికి తెచ్చా. బస్ లో ఇంటికి వచ్చినంత సేపు గుండె దడగానే ఉండేది. ఆ రష్ లో ఎక్కడ అది ఎగిరిపడుతుందో అని.. నయం అది బుద్ధిగా బజ్జుంది. ఇంటికొచ్చాక ఆ కవర్ అలాగే పెట్టేసి తిని నిద్రపోయా. సాయంత్రం లేచి ఆ కప్పను నీళ్లలో వేస్తే ఏముంది? అప్పటికే అది స్వర్గస్థురాలైపోయింది. ఏం చేద్దాం అని ఆలోచించి .. చించి.. ముక్కలు చేసి ఎండబెట్టా. వారం రోజులయ్యాక వాటి ఎముకలను బాగా స్టడీ చేసి ఫలానా ఎముక ఇలా ఉంటుంది. ఆ కప్ప పుర్రె ఇలా ఉంటుంది అని కొండగుర్తులు పెట్టేసుకున్నా. అసలైతే ఈ పరీక్షలప్పుడు అంతా ఎత్తిపోతల పధకాలు, కోడింగ్ ప్రాసెస్సులే . ఒకే క్లాసులో చదువుతున్నప్పుడు ఆ మాత్రం ఒకరికొకరు సాయం చేసుకోకుంటే ఎలా??
ఇక ఇంటర్లో ఎక్కువ ఆటలు లేవు కాని ఇంగ్లీషు పుస్తకాలు పరిచయం అయ్యాయి. మరీ ఎక్కువ ఊహించుకోకండి. కామిక్స్ అన్నమాట. అమర్ చిత్ర కథ ఇంకా టింటిన్. అప్పుడైతే అమర్ చిత్ర కథ పుస్తకాలు రెండు రూపాయలకు ఒకటి అమ్మేవారు. అమ్మ బస్ కోసం ఇచ్చిన డబ్బులు మిగిల్చి ఈ కామిక్స్ కొనేదాన్ని. ఇక టింటిన్ పుస్తకాలు అక్కడే ఒక స్టేషనరీ షాప్ లో అద్దెకు తీసుకునేదాన్ని. చాలా మంది Enid Blyton పుస్తకాలు కొనేవారు. నాకేమో అంత పెద్ద పుస్తకాలు అర్ధమయ్యేవి కావు అనేకంటే చదవాలంటె బద్ధకం. అదే తెలుగు నవల ఐతేనా గంటలొ అవగొట్టేసేదాన్ని.
అప్పట్లో ఎంసెట్ అని అంతగా క్రేజ్ లేదు. ఎవరో కొద్దిమంది మాత్రమే గుంటూర్ వెళ్లి కోచింగ్ తీసుకునేవాళ్లు. మనకంత సీన్ లేదు. ఈ సైన్సు మనకు పడదు అని డిసైడ్ ఐపోయాను. అప్పుడు చెన్నారెడ్డి హయాం. మా నాన్నగారికి తెలిసిన ఆరోగ్యమంత్రి లక్షరూపాయలకు డాక్టర్ సీట్ ఇప్పిస్తానన్నాడంట. చత్! లక్షరూపాయలు పెట్టి సీటు కొనుక్కోవడమేంటి?! (అప్పుడు బంగారం పన్నెండొందలు మరి) అదే డబ్బు పెడితే మంచి వ్యాపారం చేసుకోవచ్చు. లేదా బ్యాంకులో వేసుకుంటే నెల నెలా వడ్డీ వస్తుంది అని వద్దన్నా. ( అబ్బో! ఆ కాలంలో ఎన్ని తెలివితేటలో కదా).. మావారు ఇప్పటికి వెక్కిరిస్తుంటారు. నువ్వు కాని డాక్టర్ అయ్యుంటే ఎంత మందిని బలవంతంగా మందులు మింగించి చంపేదానివో అని.. ప్చ్.. మా అబ్బాయేమో. మమ్మీ! ఇంట్లో అందరం ఇంజనీర్లమయ్యాం. నువ్వు తాత చెప్పినట్టు డాక్టర్ చదివి ఉంటే ఎంత బాగుండేది కదా అంటుంటాడు. అందుకే అన్నారు పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అని. ఎవరూ మన టాలెంటును అర్ధం చేసుకోరూ?? (ఇక్కడ భానుప్రియను ఊహించుకోండి)
ఇప్పటికీ ఈ జ్ఞాపకాలు కళ్లముందు కదలాడుతూనే ఉంటాయి. మరపురాని అనుభూతులు కదా. సైన్శ్, లెక్కలు మనవల్ల కాదుగాని ఈజీగా ఉంటుందని బి.కాం లో చేరిపోయా వనితా కాలేజీలో.